మన పురాణయితిహసాల్లో, వివరింపబడే
ప్రతీ సంఘటనలో, ఓ ఆధ్యాత్మిక అంతరార్ధం ఉంటుంది. ప్రతీ ఘటనా పరమాత్మ
పధనిర్దేశంనే సూచిస్తుంది. అన్ని అంశములయందు ఆ అనంతున్ని తెలుసుకునే
మార్గముంటుంది. అనేక కధనాలు ద్వారా ఆధ్యాత్మిక మార్గాలు ఎన్ని
తెలియజేయబడుతున్నను గమ్యం మాత్రం ఒక్కటే. ఎవరికి వీలైన, నప్పిన మార్గం
ద్వారా వారు పయనించవచ్చు. అలానే మానవుడు ప్రార్ధన, భక్తి, విశ్వాసం లను
అధిగమిస్తూ సంపూర్ణ శరణాగతి స్థితిలో మోక్షం ఎలా పొందవచ్చో, చెప్పే కధనమే
శ్రీమద్భాగవతం యందు తెలపబడిన "గజేంద్ర మోక్షం".
ముందుగా గజేంద్రుడు ఎలా మోక్షత్వం పొందాడో తెలుసుకొని అటు పిమ్మట ఆ కధనంలోని అంతరార్ధం తెలుసుకుందాం.
గజేంద్రుడు తన్ననుసరించి వచ్చిన ఆడ ఏనుగులతో కూడి, వనవిహారం
చేస్తూ మోహవేశమున పరిసరములు కానక, దారితప్పి, తప్పుదారి పట్టి అలసిసొలసి ఓ
కొలనుయందు ప్రవేశించి తన ప్రియకాంతలతో కల్సి తన్మయత్వ పారవశ్యముతో
జలక్రీడలాడుతూ యుండగా... ఓ మకరేంద్రుడు ఒడుపుగా గజేంద్రుని కాలుని పట్టుకొని
లోపలికి లాగడం, స్థానబలిమితో మొసలి, దేహబలంతో గజరాజు మధ్య పోరు వెయ్యి
సంవత్సరములు జరిగెను. గజరాజు మిక్కిలి బలంతో, సామర్ధ్యంతో, స్థైర్యంతో
అన్ని సంవత్సరములు యుద్ధంచేసి అలసిపోయి, స్థానబలంతో ఉన్న మొసలిని జయించడం
తనవల్లకాదని గ్రహించి, ఇది పూర్వజన్మ ప్రారబ్ధమని తలచి, వివేకంతో ఇలా
అనుకొనెను -
శా. ఏ రూపంబున దీని గెల్తు నిటమీ దే వేల్పు జింతింతు నె
వ్వారిన్ జీరుదు నెవ్వ రడ్డమిక ని వ్వారి ప్రచారోత్తమున్
వారింపందగువార లెవ్వ రఖిల వ్యాపార పారాయణుల్
లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరా లింపన్ బ్రపుణ్యాత్మకుల్
ఏ రూపమున దీనిని గెలవగలను? ఎవరిని
వేడుకొనగలను? నన్ను రక్షించు వారెవ్వరు? నా మొర విని నన్ను కాపాడగల్గిన
వేల్పులెవరు? అట్టి పరోపకార పుణ్యాత్ములను కాపాడమని వేడుకోవడంకంటే గత్యంతరం
లేదు.
ఉ. ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వం దాన యైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడేదన్
ఈ విశ్వమంతయూ ఎవ్వనిచే
జనింపబడినదో, ఎవ్వనియందింతయు పుట్టి పెరిగి నశించుచుండునో, ఎవ్వనియందు ఈ
జగమంతయు అణిగియుండునో, ఈ సకల చరాచర జీవరాశికంతకూ ప్రభువెవ్వడో, దీని
మూలకారకుడెవ్వడో, దీనికంతటికిని మొదలు మధ్య చివరలు లేనివాడెవ్వడో, ఈ విశాల
విశ్వమంతటికి సమస్తమైన వాడెవ్వడో, సర్వాత్మ స్వరూపుడైనవాడెవ్వడో, అట్టి
ఈశ్వరుణ్ణి నా ఆపదను తొలగింపుమని వేడుచున్నాను.
క. ఒకపరి జగముల వెలినిడి
యొకపరి లోపలికి గొనుచు, నుభయం గనుచున్
సకలార్ధసాక్షి యగున
య్యకలంకుని నాత్మమయుని నర్ధింతు మదిన్
ఇచ్చాపూర్వకంగా ఎవ్వనియందీ
విశ్వమంతయు బయటను, లోపలను ప్రకాశించియుండునో, ఈ విశ్వం యొక్క సృష్టి
సంహారములను సక్రమంగా నడిపించువాడెవ్వడో అట్టి సకలసాక్షి స్వరూపుడు,
కళంకంలేని ఆత్మమయుని ఆ సర్వేశ్వరున్ని మనస్సులో ధ్యానించుచున్నాను.
క. లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన దుది న లోకంబగు, పెం
జీకటి కవ్వల నెవ్వడు
నేకాకృతివెలుగు నతని, నే సేవింతున్
లోకములను,
దిక్పాలురును, లోకవాసులను నశించిన పిమ్మట ఈ అంధకార బంధురమైన ప్రదేశంనందు
ఏకాత్మ స్వరూపుడై వెలిగి ప్రకాశించునట్టి భగవంతున్ని సేవించెదను.
క. నర్తకుని భంగి బెక్కగు
మూర్తులతో నెవ్వడాడు, మునులున్ దివిజుల్
గీర్తింప నేర రెవ్వని
వర్తన మొరు లెరుగ, రట్టి వాని నుతింతున్
పలువేషములు ధరించి, పెక్కు
రూపములతో ఎవడు ఈ చరాచర సృష్టితో మసలుచున్నాడో, మునీశ్వరులు, దేవతలు
కీర్తింపలేని కీర్తిని పొందియున్నవాడెవ్వడో, ఎవనినెవ్వరూ తెలుసుకొలేరో
అట్టి పరమేశ్వరుణ్ణి స్మరింతును.
ఆ. ముక్తసంగులైన మునులు దిదృక్షులు
సర్వభూతహితులు సాధుచిత్తు
ల సదృశవ్రతాడ్యు లై కొల్తు రెవ్వని
దివ్యపదం వాడు దిక్కు నాకు
బ్రహ్మసాక్షాత్కారకామితులై, సమస్త
ప్రాణులను సమదృష్టితో చూచు సత్పురుషులు, అత్యంత నియమనిష్టలు గలవారైననూ
ఎవరిని ఎరుంగలేరో అట్టి పరమేశ్వరుని ప్రార్ధింతును. నా కతడే రక్షయగుగాక!
సీ. భవం దోషంబు రూ పంబు కర్మంబు నా
హ్వయమును గుణం లె వ్వనికి లేక
జగముల గలిగించు సమయించుకొఱకునై
నిజమాయ నెవ్వడి న్నియును దాల్చు
నా పరమేశు న నంతశక్తికి బ్రహ్మ
కిద్ధరూపికి రూప హీనునకున్
జిత్రచారునికి సా క్షికి నాత్మరుచికిని
బరమాత్మునకు బర బ్రహ్మమునకు
ఆ. మాటల నెరుకల మనముల జేరంగ
రానిశుచికి సత్త్వ గమ్యు డగుచు
నిపుణడైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు
జన్మ, పాప, నామ, గుణ, రూప
రహితుడెవ్వడో సృష్టి, స్థితి, లయాదినామ రూపములు గలవాడును, మాయను
జయించినవాడునూ, తేజోరూపుండునూ, పరాత్పరుడును, మిక్కిలి శక్తిపరుడైనవాడును,
రూపరహితుడునూ, చిత్రాతిచిత్రమైన విచిత్ర చరిత్రలు కలవాడును,
సాక్షియైనవాడును, స్వయంప్రకాశం కలవాడును, పరమాత్మ, పరబ్రహ్మం కలవాడును,
మనోవాక్కాయకర్మలకు అగోచరుడును, సత్వగుణ సంభూతుడును, సంసారత్యాగికి
సాక్షాత్కరించువాడును అయిన ఆ విశ్వేశ్వరున్ని మ్రొక్కెదను.
సీ. శాంతున కపవర్గ సౌఖ్యసంవేదికి
నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు ఘోరునకు గూడు నకు గుణధర్మికి
సౌమ్యున కదిక వి జ్ఞానమయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు
క్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కుజితేంద్రి
యజ్ఞాపకునకు దుః ఖాంతకృతికి
ఆ. నెరి నసత్య మనెడి నీడతో వెలుగుచు
నుండు నెక్కటికి మ హోత్తమునకు
నిఖిల కారణునకు నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచుకొఱకు
శాంతస్వభావునికి,
మోక్షసంతోష మాధుర్యమును గ్రోలినవార్కి, మోక్షతీతుడు, పామరులకు
భయంగొల్పువాడు, ఎవ్వరికిని అంతుచిక్కనివాడును, సత్వరజ స్తమోగుణ సంయుతుడును,
సౌమ్యుడును, అధిక విజ్ఞానవంతుడును, సర్వులకు అధిపతియై కాపాడువానికిని,
సర్వాంతర్యామియనువాడును,మూలాధారుడైన వానికిని, సర్వదుఃఖవినాశునికి, జగత్కారకునకు, ఉత్తమోత్తముడు అయిన ఆ భగవంతునిని రక్షించమని వేడుకుంటున్నాను.
క. యోగాగ్ని దగ్ధకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొండెరుగక స
ద్యోగవిభాసితమనముల
బాగుగా నీక్షింతు రట్టి పరము భజింతున్
మాయమోహవర్జితులై,
యోగీశ్వరులు తపోనిష్టగరిష్టులై సర్వమును త్యజించి ఏ భగవంతుని సాన్నిధ్యం
ఆశించెదరో, అట్టి భగవంతున్ని ఈ ఆపదనుండి నన్ను కాపాడమని వేడుకుంటున్నాను.
సీ. సర్వాగమామ్నాయ జలధికి నపవర్గ
మయునికి నుత్తమ మందిరునకు
సకలగుణారణి చ్చన్నభోదాగ్ని కి
దంత రాజిల్లు ధన్యమతికి
గుణలయోద్దీపిత గురుమానసునకు సం
వర్తిత కర్మని ర్వర్తితునకు
దిశలేని నాబోటి పశువుల పాపంబు
లణచు వానికి సమ స్తాంతరాత్ము
ఆ. డై వెలుంగువాని కచ్చిన్నునకు భగ
వంతునకు దనూజ పశునివేళ
దార సక్తులయిన వారి కందగరాని
వాని కాచరింతు వందనములు
సర్వదేవతా
పూజావిధానం తెలుపు వేదములకు నిధియైనవాడును, మోక్షమార్గ స్వరూపుడును,
సర్వశ్రేష్టులకు ఆటపట్టయినవానికి, జ్ఞానగుణ సంపన్నునకు, స్వయంప్రకాశ
నిర్మలబుద్ధి గలవానికి దీనజనోద్ధారకుడు, సర్వాంతర్యామియై వెలుగొందువాడును
అయిన ఆ జగత్ప్రభువును మనసార రక్షించమని వినయపూర్వకంగా వేడుకొనుచున్నాను.
సీ. వర ధర్మ కామార్ధ వర్జిత కాము లై
విబుధు లెవ్వాని సే వింతు రిష్ట
గతి బొందుదురు చేరి కాంక్షించువారి క
వ్యయ దేహ మునిచ్చు నె వ్వాడుకరుణ
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు
రానందవార్ది మ గ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియు గోరక
భద్రచరిత్రంబు బాడుచుండు
ఆ. రా, మహేశు, నాద్యు నవ్యక్తు, నధ్యాత్మ
యోగ గమ్యు బూర్ణు నున్నతాత్ము
బ్రహ్మమైనవాని బరుని నతీంద్రియు
నీశు, స్థూక్ష్ము నే భజింతు
మహోన్నతమైన ధర్మార్ధకామములను
త్యజించినవారై, పండితులెవ్వని గని తమ కోరికలను తీర్చుకుందురో, మనస్పూర్తిగా
ప్రార్ధించువారి కోరికలను ఎవ్వరు కరుణతో తీర్చునో, శరీరాభిమాన రహితులై
నిష్టతో నెవనిని ధ్యానించి ఆనందింతురో, అట్టి పరమేశ్వరుణ్ణి పూజించెదను.
త్రికరణములకగోచరుడును, నిష్టాగరిష్టులైన పరమభక్తులను పొందినవాడును,
బ్రహ్మస్వరూపుడును, సర్వాంతర్యామియై స్థూల సూక్ష్మ రూపంబుల నొందు వాడును,
అగు పరమేశ్వరుణ్ణి సర్వదా రక్షింపుమని ప్రార్ధిస్తున్నాను.
సీ. పాపకుండర్చుల భానుండు దీప్తుల
నెబ్భంగి నిగిడింతు రెట్లడంతు
రా క్రియ నాత్మ క రావళిచేత బ్ర
హ్మాదుల వేల్పుల నఖిలజంతు
గణముల జగముల ఘననామరూప భే
దములతో మెఱయించి తగ నడుంచు
నెవ్వండు మనము బు ద్ధీంద్రియంబులు దాన
యై గుణసంప్రవా హంబు బఱపు
తే. స్త్రీ నపుంసక పురషమూ ర్తియును గాక
తిర్యగమరనరాది మూ ర్తియును గాక
కర్మగుణభేద సద సత్ర్స కాశి గాక
వెనుక నన్నియు దా నగు విభుని దలంతు
సూర్యాగ్నులు
తమతమ కాంతులను ప్రజ్వలించి కాంతింపజేయునట్లు ఏ విశ్వేశ్వరుడు ఈ
విశ్వమంతటినీ, సమస్త భూమ్యాది లోకంబులను, బ్రహ్మాది దేవతలను, చరాచర
జీవసముదాయమును, సృష్టించి స్థితించి లయమును పొందించి తనలోనికి
చేర్చుకొనునో, మనోబుద్ధులను జ్ఞాన కర్మేంద్రియములకు ఎవడు కర్తగా ఉండి
త్రిగుణముల కార్యములను పరిపూర్తిచేసిన పిమ్మట శూన్యరూపుండై, రూపరహితుడై,
మానవ పశు పక్షాదుల దేవతారూపంబుల నొందక, సత్త్వ అసత్త్వ రూపుడును గాక,
చివరికన్నియు తానైన వాడగు ఆ పరమాత్ముని సేవించెదను.
క. కలడందురు దీనులయెడ
గలడందురు పరమయోగి గణముల పాలన్
గలడందు రన్నిదిశలను
కలడు కలండనెడువాడు కలడో లేడో
ఆ పరాత్పరుడు ఆపన్నులు, యోగుల
సమూహముల యెడను, సకల దిక్కులయందును కలడని ప్రస్తుతింతురు. అసలట్టి
మహాత్ప్రభువు ఈ యిలను గలడో, లేడో అని సంశయం కల్గుచున్నది. ఎన్ని విధముల
ప్రార్దించినను నన్ను కరుణించడేమి? ఆపన్నులను ఆదుకోడేమి?
సీ. కలుగడే నాపాలి కలిమి సందేహింప
గలిమి లేములు లేక గలుగువాడు
నాకడ్డపడరాడే నలిన సాధువులచే
బడినసాధుల కడ్డ పడెడువాడు
చూడడే నా పాటు జూపుల జూడక
జూచువారల గృప జూచువాడు
లీలతో నా మొరా లింపడే మొఱగుల
మొర లెరుగుచు దన్ను మొఱగువాడు
తే. నఖిలరూపులు దన రూప మైనవాడు
నాదిమధ్యాంతములు లేక యలరువాడు
భక్తజనముల దీనుల పాలివాడు
వినడె చూడడే తలపడె వేగరాడె
పుట్టుటయు, గిట్టుటయు లేని ఆ
పరాత్పరుడు నాయందు ఉన్నాడో, లేడో? అన్న సంశయం కల్గుచున్నది. లేకున్న నాపై
దయ చూపడేమి? తన జ్ఞాన చక్షువులతో నన్నేల వీక్షింపకున్నాడు? కపటభక్తులకు
కానరాని కమలనాధుడు, నన్ను, నా నిష్కళంక మొరను ఆలకింపకున్నాడేమీ?
జగత్స్వరూపుడైన, ఆదిమధ్యాంతరహితుడై ప్రకాశించు, దీనజనభక్త భాందవుడు అగు ఆ
పరంధాముడు నా ప్రార్ధనల నాలకించి, నను కని, నాపై దయతలచి నను రక్షింప వేగమే
రాడా?
వి. వను దట జీవులమాటలు
జను దట చనరాని చోట్ల శరణార్ధులకో
యను దట పిలచినసర్వము
గను దట సందేహ మయ్యే గరుణా వార్దీ
ఓ
కరుణామూర్తీ! జగద్రక్షకా! నీవు ఆపన్నులను ఆదుకొందువని, జొరరాని
స్థలమునకేగగలవని, నిన్ను శరణన్నవారికి నేనున్నానని అభయమిచ్చెదవని
వినియున్నాను. కానీ ఎంతసేపటినుండి వేడికొన్ననూ రాకపోవుటచే సందేహం
కలుగుతున్నది స్వామీ!
క. విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిన్ బరమపురుషు నే సేవింతున్
ప్రపంచానికంతకూ
తానే సృష్టికర్తయైయుండి తాను వెలుపలనుండవాడును, విశ్వాత్మరూపుడును,
విశ్వమునకు దెలిసిన వాడునూ, బ్రహ్మకంటే గొప్పవాడైన ఈశ్వరుని
పరమపురుషోత్తముని రక్షింపమని మనసారా సేవించెదను.
శా. లావొక్కింతయులేదు దైర్యము విలో లంబయ్యేబ్రాణంబులున్
ఠావుల్దప్పెను మూర్చవచ్చే దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవేతప్ప నితః పరంబెరుగా మన్నింపన్ దగున్ దీనునిన్
రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
ప్రభూ!
పరమేశ్వరా! ఇంక పోరాడలేకపోవుచున్నాను. తండ్రీ! శక్తి సన్నగిల్లుతుంది.
ఇంతవరకు నేనీ మకరంబును జయించగలనని తలచితిని. ఆ ధైర్యం పోయినది. ప్రాణములు
పై కెగిరిపోతున్నాయి. మైకం వస్తుంది ప్రభూ! ఈ దేహం అలసిసొలసి అణగారిపోయింది
తండ్రీ! ఈశ్వరా! నీవుతప్ప వేరెవ్వరు తెలియదు. నీవు తప్ప ఇతరులు నన్ను
కాపాడలేరు. ఈ మొసలితో పోరాడలేకున్నాను స్వామీ! ఈ దీనుని తప్పులు మన్నించి
నన్ను కాపాడ వేగమే రావా పరమేశ్వరా! ఓ దివ్యశరీర! దయతో నన్ను రక్షించు
స్వామీ!
ఉ. ఓ కమలాక్ష యో వరద యో ప్రతిపక్షవిపక్ష యీశ్వరా
యో కవియోగివంద్య సుగుణోత్తమ యో శరణాగతామరా
నోకహ యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావ
రావే కరుణింపవే తలపవే శరణార్ధిని నన్ను గానవే
ఓ
కమలాక్షుడా! భక్తుల కోరికలు సత్వరమే తీర్చువాడా! శత్రువులను కూడా
ప్రేమించువాడా! ఈశ్వరా! మునుల చేతను, పండితుల చేతను పొగడబడినవాడా!
సుగుణోత్తమా! శరణాగతరక్షకా! మునీశ్వరులకు మనోహరమైనవాడా! ఓ నిర్మలచరితా!
త్వరగా వచ్చి నన్ను కాపాడుము తండ్రీ! నీ నామస్మరణే నా ధ్యేయంగా నుంటిని
స్వామీ! ప్రభువా! దయతో రక్షింపుము.
అంతట
వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీదేవితో కూడి యున్న శ్రీమన్నారాయణుడు తనని
శరణుకోరుతున్న గజరాజుని కాపాడడానికి దేనినీ గమనించక తటాలున ఉన్నపళంగా
బయలుదేరడం, సుదర్శన చక్రాయుధంను ప్రయోగించి మకరంను సంహరించి గజేంద్రుని
రక్షించడం అందరికీ తెలిసిన కధనమే.
గజేంద్ర మోక్షం లో అంతరార్ధం -
పూర్వజన్మలవల్ల,
కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో, ఇంద్రియ
భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే
పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.
జనన మరణ
చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్న మానవుడు ముక్తి పొందాలంటే అందుకు
తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ
అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి
కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని
పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన
ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!
తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద
కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక
పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు
మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు
ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని, దుఃఖితుడవుతున్నాడు.
గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే, మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి.
జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను
అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే, తన
సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి
త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి.
గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట
గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని, అందుకు
పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి, పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి,
అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో, వివేక
విశ్వాసాలతో, నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు
సుదర్శనచక్రంను ప్రయోగించి, మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు. ఆలానే మానవుడు
కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం
కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి, ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనే జ్ఞానముతో, అజ్ఞాన అహంభావనను సంహరించిన పిదప ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి.
'తస్మాత్
భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా
చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం.
ఈ ముక్తి
మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని
తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో
గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం.