19, అక్టోబర్ 2012, శుక్రవారం

ప్రయత్నిస్తేనే ప్రగతిపధం.

ఉదయం పద్మ (చాకలామె) బట్టలు ఉతుకుతూ- అమ్మా! దగ్గర సంబంధమని, నేనేదో సుఖపడిపోతానని పెళ్లి చేశారమ్మ మా అమ్మా నాన్నలు. కానీ, పొద్దు కుంకితే చాలమ్మా, తాగేసి వచ్చి నానా రగడ చేస్తాడమ్మ. తాగనంతసేపు మంచోడే, తాగితేనే రాక్షసుడు, ఉట్టి అధముడమ్మ............అని బాధగా చెప్పగా -
నీవే మంచిగా, నెమ్మదిగా, ప్రేమగా చెప్తుండు, త్రాగుడు మానేయమని. మారేంతవరకు సహనంగా ప్రయత్నించు....... తప్పకుండా మారతాడు అని కాస్తంత దైర్యం చెప్తూ అన్నాను.

నిజమే! మనిషి యొక్క స్వాభావిక గుణకర్మల బట్టి పెద్దలు మానవులును మూడు విధములుగా పేర్కొన్నారు -
ఉత్తములు, మధ్యమములు, అధమములుగా!

ఉత్తములు:-  లోకహితార్ధమే నిష్కామభావంతో వేదవిహిత స్వధర్మ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ, నిశ్చయాత్మక బుద్ధితో స్థితప్రజ్ఞులై, విషయాసక్తి లేనివారై, అహంకార మమకార రహితులై, సకలభూతములయందు సర్వేశ్వరున్నే కాంచుచూ, నిత్య ఆనందమయులై ఉంటారు.
మధ్యములు:- సంసార బద్ధులై, స్వభావము బట్టి కర్మలను ఆచరిస్తూ, ప్రాపంచిక వ్యవహారంలతో బంధనములు ఏర్పరచుకొని కొంతకాలం గడిపినను క్రమేపి సంస్కార ఫలితంగా దైవమునందు భక్తి కలిగి, సకల భూతములయెడ స్నేహం, ప్రేమ, దయను కలిగియుండి అహంకార రహితులై, క్షమాశీలురై, సుఖదుఃఖముల ప్రాప్తియందు సమత్వం కలవారై, రాగద్వేషాలకు లోనుకాకుండా మోహరహితులై,
పరమాత్మయందు భక్తిప్రపత్తులతో దాన యజ్ఞయాగాది వంటి శుభకర్మలను ఆచరిస్తూ, సజ్జనులతో సద్గోష్టి జరుపుతూ సంతుష్టులై ఉంటారు.
 అధమములు:- అహంకారం, మూర్ఖం, గర్వం, దర్పం కలిగి కామ క్రోధ లోభ పరాయణులై, దయారహితులై, అన్యాయధనార్జనాపరులై, మోహజాలమందు చిక్కుకొని అపవిత్రులై ఉందురు. డాంభికమైన ఆడంబరాలు కొరకై  దానయజ్ఞాది కర్మలు ఆచరిస్తూ, స్వార్ధపరులై ఉంటారు.
ఎవరైనా సరే, త్రికరణశు
ద్ధితో ప్రయత్నిస్తే ప్రగతిపధంవైపు పయనించగలరు.
 

ఇక పారమార్ధిక కోణంలో వీరిని నిత్యులు, ముక్తులు, బద్ధులని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు. నిత్యులు:- జన్మతః మహాత్ములుగా పుట్టి, బాల్యంలో కూడా యే అపరాధములు నెరుగక, స్వాచార్యుని వలె సత్యము నెరిగి, ఎల్లప్పుడూ ఆత్మభావమున ఉండువారు నిత్యులు. వీరు పరమానందమయులు. నిత్య భక్తమయులు. ఇందుకు ఉదాహరణము ప్రహ్లాదుడు.
ముక్తులు:- పుట్టుకతో సామాన్యుడిగా యుండి, సంస్కారఫలితంగా తన స్వంత ఆలోచన వలననో, లేక ఇతరుల ప్రభావం వలననో, ఆచార్యుని వాత్సల్యముననో, భక్తి ప్రపత్తులవలననో సంసార వ్యసన బంధములనుండి మానసికంగా బయటపడి, అరిషడ్వర్గముల నుండి విముక్తుడై, అన్నింటా సంస్కరింపబడినవాడై దేహాత్మభావనను వీడి సత్పురుషుడిగా మారి, ఆత్మభావమునకు వచ్చువారు ముక్తులు. ఇందుకు వాల్మీకి ఉదాహరణ.
బద్ధులు:- సంసారమున చిక్కుకొని, వ్యసనాలు, అరిషడ్వర్గములకు లొంగిపోయి, వానినుండి బయటపడలేక, పరమాత్మ విషయం పూర్తిగా నెరుగక, పాపులుగానే కడపటివరకు జీవించువారు బద్ధులు. మహిరావణుడు ఉదాహరణ.
ఎవరైనా సరే, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పరమాత్మను కాంచగలరు.

16, అక్టోబర్ 2012, మంగళవారం

లేవండి! మేల్కోండి! గమ్యాన్ని చేరుకోండి! (స్వామి వివేకానందుని ప్రబోధాలు)

సమస్త విశ్వంలోను ఉత్తమోత్తమైన శరీరం ఈ మానవదేహమే. మానవుడే సర్వోత్తమ జీవి. సర్వోత్తమ జీవితం విజయవంతంగా గడపగలిగే శక్తి మానవునికే ఉంది. అందుకే మనం ఎలా జీవించాలో మనమే నిర్ధేసించుకోవాలి. 
ముందుగా ఒక ఆదర్శవంతమైన లక్ష్యాన్ని తీసుకోండి.ఆ లక్ష్యాన్నే జీవితంగా గడపండి. ఆ లక్ష్యాన్నే సదా భావించండి, ధ్యానించండి, జీవనాడిగా చేసుకోండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతిభాగాన్ని ఆ లక్ష్యంతో మమేకం అయ్యేటట్లు చేయండి. ఇదే విజయరహస్యం. దేనినైన మనం సాదించగలం. ముందుగా ఆత్మవిశ్వాసం కలిగియుండాలి. ఇదే పరిపూర్ణ వికాస మంత్రం. ఆత్మవిశ్వాసమే వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికితీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో. శక్తి అంతా నీలోనే ఉంది. అది తెలుసుకొని ఆ శక్తిని బయటికి తీసుకురా. ప్రతీపనినీ, ఏ కార్యానైన నేను సాదించగలనన్న సంకల్పబలాన్ని పెంచుకో. నీ సంకల్పం గట్టిదైతే పాము విషం కూడా నిన్నేమి చేయలేదు.
ఒకటి ముందుగా గుర్తించండి - 

మనమున్న ప్రస్తుతస్థితికి మనమే బాధ్యులం. ఏం కావాలని మనం అభిలాషిస్తామో ఆ ప్రకారంగా మనల్ని మనం రూపుదిద్దుకోగలం. ఆ సామర్ధ్యం మనకుంది. ఇప్పుడు మనమున్న వర్తమానస్థితికి మన పూర్వ కర్మలు కారణమైతే, అదే కారణాన్ని బట్టి, మనం కోరిన విధంగా మన భవిష్యత్తును ప్రస్తుత కర్మల ఫలితంగా మనం రూపొందిన్చుకోవచ్చును. అందుచేత మనం ఏ తీరుగా నడుచుకోవాలో మనమే నిర్ణయించుకొని ప్రవర్తించాలి. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చుదిద్దుకుంటారో, ఆ విధంగా ఎదుగుతారు. బలహీనులుగా భావించుకుంటే బలహీనులుగానే మిగిలిపోతారు. బలవంతులని భావించుకుంటే బలవంతులే అవుతారు. బలహీనతకు పరిష్కారం బలహీనతను చింతించటం కాదు; బలాన్ని గురించి ఆలోచించటమే! మీలో నిబిడీకృతమై ఉన్న బలాన్ని గుర్తించండి.బలమే ప్రాణం. బలహీనతే మరణం. బలమే ఆనందం, శాశ్వతం, అమృత జీవనం. బలహీనతే ఎడతెగని ప్రయాస, దుఃఖం, నరక సదృశ్యం.
అపజయాలకు వెనకంజు వేయకండి. లక్ష్యసాదనను అంటిపెట్టుకొనే ఉండండి. ప్రయత్నంలో వెయ్యిసార్లు అపజయం ఎదురైనా పట్టువదలక మరోమారు ప్రయత్నించండి. విజయాన్ని సాధించలంటే అద్భతమైన పట్టుదల, సంకల్పశక్తిని కల్గియుండి పనిచేయాలి.అప్పుడే మీ గమ్యాన్ని మీరు తప్పకుండ చేరుతారు. పవిత్రత సహనం పట్టుదల వీటన్నిటికి మించిన ప్రేమ విజయసాధనకు అత్యంతావసరం. సంపూర్ణ ప్రేమభావం కలిగియుండాలి. ప్రతిజీవిలోను భగవంతుడు ఉన్నాడనే పరమసత్యాన్ని అవగాహన చేసుకోవాలి. ఎవరు జీవారాధకులో వారే నిజమైన దైవారాధకులు. పవిత్రంగా, ప్రేమగా ఉండటం, పరులకు మంచి చేయడం - ఇదే పూజలన్నింటి సారాంశం.
ధనార్జనలోగాని, దైవార్చనలోగానీ లేక ఏ ఇతర కార్యాచరణలోగాని ఏకాగ్రతాశక్తి  ఎంత బలవత్తరంగా వుంటుందో కార్యసిద్ధి అంత బాగా సమకూరుతుంది. ఈ ఏకాగ్రత ద్వారానే సత్త్వరజస్తమో గుణాత్మకమైన మనస్సు జయింపబడి, అవలయున్న జ్ఞానకాంతి వెల్లువలా ప్రసరిస్తుంది. మంచి చెడు ఆలోచనల సముదాయమే మనస్సు. మనం పవిత్రులమై మంచి ఆలోచనలకు తగిన ఉపకరణాలుగా మారితే అవి మనలో ప్రవేశించి ఘనకార్యాలను సాధిస్తాయి. ఒక్క క్షణమైనా లేదా ఏ ఒక్క విషయంపైనైనా మనస్సును నిగ్రహించలేని మనం స్వతంత్రులమా??? స్వేచ్ఛాజీవులమా........ఆలోచిం
చండి. 
నిగ్రహం లేని మనస్సు పతనదిశగా పయనింపజేసి వినాశనానికి దారి తీస్తుంది. నిగ్రహించబడ్డ మనస్సు మనల్ని సంరక్షిస్తుంది. సర్వస్వతంత్రులను చేస్తుంది. మనిషి మనస్సు యొక్క శక్తి అపారం. అది ఎంత ఏకాగ్రత నొందితే, అంత శక్తివంతమౌతుంది. ఇదే మనస్సు మర్మం. సంకల్పశక్తితో మనస్సుని తుచ్చమైన ప్రాపంచిక సుఖాలకోసం కాకుండా, అంతరంగిక వికాశానికి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వినియోగించాలి. ఈ ప్రపంచం మనకు కనబడేతీరు మన మానసిక పరిస్థితి మీద ఆధారపడియుంటుంది. ఈ ప్రపంచం మనపట్ల ఎలా వుందని భావిస్తామో, ఆ భావాన్ని రూపొందించేది మన స్వకీయ మానసిక దృక్పధం మాత్రమే. పచ్చకామెర్లు వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. వస్తువులను అందంగా, అందవికారంగా కనిపింపజేసేవి మనభావనలే. ఈ ప్రపంచమంతా మన మనస్సులోనే ఇమిడివుంది. అందువల్ల సమ్యక్ దృష్టిని అలవర్చుకోవాలి. స్వప్రయత్నంతో మన ఔనత్యం కోసం మనమే సచ్చీరులుగా మారాలి. అటులనే లక్ష్యంపై ఉండే శ్రద్ధ సాధనపైన ఉండాలి. గమ్యంపై మనకు ఎంత శ్రద్ధ వుంటుందో, దాని గమనం పై అంతే శ్రద్ధ ఉండాలి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్'.
నీవు గతంలో పొరపాట్లు చేయవచ్చు. నీలో దోషాలు ఉండవచ్చు. ఐతే ఏం? ఇకపై ఆ పొరపాట్లు మరల చేయకుండా నీ దోషాల్ని నీవు సంపూర్ణంగా సరిదిద్దుకోగల్గితే భవిష్యత్తులో నీవే భగవత్సరూపంగా పరిణమించవచ్చు. మానవులు సాధారణంగా తమ దోషాలను సాటివారి మీద మోపుతారు. అలా ఇతరుల మీద నెట్టడానికి వీలుకాకపోతే ఆ నెపాన్ని దైవం మీద కానీ, తాము సృష్టించిన విధివ్రాత అనే భూతం మీద కానీ నెట్టేస్తారు. విధి అనేది ఎక్కడ ఉంది? విధి అంటే ఎవరు? ఎవరు చేసుకునే కర్మ వారు అనుభవించక తప్పదు. మన విధిని మనమే రూపొందించుకుంటున్నాం. పిరికివారు, పనికిమాలిన మూర్ఖులు మాత్రమే 'ఇది విధి వ్రాత' అంటారు. "నా కర్మకు నేనే కర్తను" అనేవాడే ధీశాలి, విజయశీలి! ఈ దుఃఖమంతా నా కర్మఫలితమే. అందుచే దీన్ని తొలగించటం కూడా నా చేత మాత్రమే జరగాలని(సాధ్యమని) గ్రహించిన వారే బలవంతులు. మనకు కావాల్సిన బలం, సహాయం, సమస్తమూ మనలోనే ఉన్నాయి.
నీవు మోక్షం పొందకపోయినంతన మాత్రాన మునిగిపోయినదేమిటి? పవిత్రతాపూర్ణులై, మనసా వాచా కర్మేణా త్రికరణశుద్ధిగా తమ పరోపకార్యాలద్వారా పరులను సంతోషపరచడం, ఇతరులలోని సౌశీల్యాన్ని పరమాణువంతటి దాన్నైనా పర్వతమంతగా పెంచి శ్లాఘించడం....... ఇత్యాది మంచి లక్షణాలు ద్వారా తమ హృదయాలను వికసింపజేసుకునే వారే మహాత్ములు. భగవంతుడుపై నమ్మకం లేనివాడు నాస్తికుడు కాడు; తనపై తనకి నమ్మకం లేనివాడే నాస్తికుడు.
నా ప్రియమైన సోదరీ సోదరులారా!
లేవండి!
మేల్కోండి!
గమ్యాన్ని చేరుకోండి!
  

12, అక్టోబర్ 2012, శుక్రవారం

చిత్తుకాగితమే అనుకున్నా........ కానీ, చిరు కధనే తెలిపింది

ఉదయం ప్రక్కింటి ఆమె ఓ కాగితంలో కొన్ని పువ్వులు పంపారు. ఆ కాగితంను డస్ట్బిన్లో పడేయబోతు చూశాను. చిత్తుకాగితమే అనుకున్నా........ కానీ, చిరు కధనే తెలిపింది.
ఆ కధ ఏమిటంటే -

పూర్వం ఓ మహారాజుగారికి ఓ సందేహం వచ్చింది. అది ఏమిటంటే - మహత్వపూర్ణమైన సమయమేదీ? మహత్వపూర్ణమైన పని ఏమిటీ? మహత్వపూర్ణమైన వ్యక్తి ఎవరు? రాజుగారికి సందేహం రావడంతోనే వెంటనే సభని ఏర్పర్చమని ఆదేశించించడం జరిగింది. మంత్రులు, పండితులు, ఆస్థాన విద్వాంసులు....... తదితరులతో సభ కొలువై వుండగా, రాజుగారు పై మూడు ప్రశ్నలడిగారు. ఎవ్వరు ఎన్నివిధాలుగా సమాధానలిచ్చిన రాజుగారు వాటితో ఏకీభవించక అసంతృప్తి వ్యక్తం చేయగా, అప్పుడు మహామంత్రివర్యులు లేచి, రాజా! మన రాజ్యం బయట ఓ యోగిపుంగవుడు ఉన్నాడు. అతను మీ సందేహాలను తీర్చగలని నా నమ్మకం అని చెప్పగా -
మరునాటి ఉదయమునే ఆ యోగి ఉన్న ఆశ్రమానికి కొంతమంది అంగరక్షకులతో కల్సి బయలుదేరాడు. ఆశ్రమం కొంతదూరంలో ఉండగానే, తను మాత్రమే వెళ్తానని, మీరంతా ఇక్కడే ఉండండీ అని అంగరక్షకులను ఆదేశించి ఆశ్రమమును చేరతాడు. ఆశ్రమమునందు ఆ యోగి రాజుగారు వెళ్ళే సమయానికి పలుగుపారలతో చెట్ల మొదలు తవ్వుతూ చదును చేస్తున్నాడు. రాజు ఆ యోగికి నమస్కరించి తన సందేహాలను తెలిపి సమాధానం చెప్పమని కోరుతాడు. కానీ, ఆ యోగి మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుంటున్నాడు. అంతట రాజు యోగి చేతిలోని పలుగు తీసుకొని చదును చేయనారంభిస్తూ మరల పై ప్రశ్నలు అడుగుతుండగా... శరీరం నిండా గాయాలతో, రక్తం కారుతుండగా, భయంతో ఓ వ్యక్తి ఆశ్రమంలో ప్రవేశించి సృహతప్పి పడిపోతాడు. వెంటనే ఆ యోగితో పాటు ఈ రాజు కూడా ఆ పడిపోయినవ్యక్తికి సపర్యలు చేయడం ప్రారంభిస్తారు. రాజు నీటిని తెచ్చి, తన తలపాగా చించి రక్తం కారకుండా గాయాలను శుభ్రపరుస్తూ కట్లు కడుతుండగా ఆ పడిపోయిన వ్యక్తికి సృహ రాగా, తనకి సేవలు చేస్తున్న రాజుని గుర్తించి, తనని క్షమించవలసిందిగా కోరాతాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియని రాజు నీవెవరవు అని ప్రశ్నిస్తాడు. అప్పుడా వ్యక్తి మీరెప్పుడూ నన్ను చూడలేదు. కొంతకాలం క్రితం జరిగిన యుద్ధంలో నా సోదరుడు మీ చేతిలో చంపబడ్డాడు. అందుకు నేను ప్రతీకారం తీర్చుకోవడానికై మిమ్మల్ని వెంబడించాను. మీ అంగరక్షకులు నన్ను పసిగట్టి చుట్టుముట్టి గాయపరచగా తప్పించుకొని ఈ ప్రదేశమునకు చేరుకున్నాను. నాకు మీరిప్పుడు సపర్యలు చేస్తున్నారు. మీరు ఎంత ఉత్తములో, ఎంత దయగలవారో అర్ధమైంది. నా అపరాధాన్ని క్షమించండి అని అనగా, అతనిని క్షమించి విడిచిపెట్టేస్తాడు. కాసేపటికి మరల ఆ రాజు తన సందేహాలను తీర్చమని ఆ యోగిని కోరగా -
రాజా! ఈ సంఘటనల ద్వారా నీకు సమాధానం దొరికింది, గ్రహించు. నీవు మొదట ఈ ప్రశ్నలు అడిగినప్పుడు నేను మౌనంగా ఉన్నానని నీవు వెళ్ళిపోకుండా పాదులు తీశావు. అలా కాకుండా వెళ్ళిపోయినట్లయితే ఆ వ్యక్తి నిను వధించడానికి ప్రయత్నించేవాడు. కాబట్టి ఇది నీకు మహత్వపూర్ణమైన సమయం. ఇక ఆ వ్యక్తికి నీవు సేవ చేయడమే మహత్వపూర్ణమైన పని. ఎందుచేతనంటే సేవ చేసి ఇతనిని బ్రతికించక పోయినట్లయితే నీ మీద శత్రుత్వంతో మరణిస్తాడు. మీ మధ్య అప్పుడు జన్మజన్మల శత్రుత్వం సాగుతుంది. ఇప్పుడు నీ సేవలవలన అతను పశ్చాత్తాపపడి, తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఇక మహత్వపూర్ణ వ్యక్తిని నేనే. ఎందువల్లనంటే నావలన నీ ప్రశ్నలకు జవాబు లభించి నీవు శాంతచిత్తంతో తిరిగి వెళ్తావు. మహారాజా! ఇప్పుడు దీనిని సరిగ్గా అర్ధం చేసుకో. మహత్వపూర్ణ సమయమంటే వర్తమాన సమయం. దాన్ని చక్కగా ఉపయోగించడం నేర్చుకోవాలి. మహత్వపూర్ణమైన పని అంటే వర్తమానంలో నీవు చేయవలసిన సత్కర్మ. ఆ పనిని ఏకాగ్రతతో, సావధానంగా చేయాలి. మహత్వపూర్ణమైన వ్యక్తి అంటే వర్తమానంలో నిను సన్మార్గంలో నడిపించేవాడు. అతనితో సముచితంగా వ్యవహరించాలి. దీనినే ఆధ్యాత్మికపరంగా అవగాహన చేసుకో. 
'అధాతో బ్రహ్మ జిజ్ఞాస' అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదే మహత్వపూర్ణమైన సమయం. అంటే మనల్ని మనం తెలుసుకోవాలనే సంకల్పం చేసిన సమయమే మహత్వపూర్ణమైన సమయం.
నీలోనికి నీవు పయనించు యోగమే మహత్వపూర్ణమైన పని.
అది ఉపదేశించే సద్గురువే మహత్వపూర్ణమైన వ్యక్తి.