19, నవంబర్ 2013, మంగళవారం

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానం ఏమిటంటే ...

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానమిదే -
భారతీ! నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేముందు ఓ పుస్తకంలో చదివిన కబీరుగారి ప్రబోధకీర్తన గురించి చెప్తాను. " సద్గురుకీ భిక్షా మాంగాయిరే బాల" అన్న కీర్తన పూర్తిగా నాకు గుర్తులేదు, కానీ, అందులో వివరించిన అర్ధం, అంతరార్ధం గుర్తుంది. సద్గురుకీ ప్రేమభిక్ష వేడుకోమని, చెప్తూ ఆ భిక్షకు అంగభూతములుగా నాలుగు భిక్షలను కబీరు నిర్వచించెను. మొదటిది గోధుమపిండి. ఇది అంగడికి గాని, పిండిమరకు గాని పోకుండా జోలెనిండ తేవలెను. రెండవది జలము. బావికి గాని, నదీతటాలములకు గాని పోకుండానే ఆనపబుర్ర నిండా తేవయును. మూడవది కట్టెలు. అంగడికి గాని, అడవికి గాని పోకుండా మోపెడు కట్టెలు తేవలయును. నాల్గవది దర్శనభిక్ష. మసీదు, దేవళములకు గాని, సాధు ఫకీర్ల వద్దకు గాని పోకుండా, ఉన్నచోటనే దర్శనం పొందవలెనని, అందుకై సద్గురుకి ప్రేమభిక్ష వేడమనే ప్రబోధం ఆ కీర్తనలో ఉంది. ఇప్పుడు ఈ కీర్తనలో అంతరార్ధం తెలుసుకుందాం. మొదట మూడు అంటే, పిండి, జలము, కట్టెలు రొట్టెను తయారుచేయుటను సూచించును. ఆ రొట్టెను తినినచో దర్శనం, దాని ఫలితంగా ప్రేమ లబింపవలయును. రొట్టెను తయారుచేయుటకు పిండి ముఖ్యపదార్ధం. కాని పొడిపిండిని తినలేం. అందుకే నీరు కావలయును, ఆ నీటితో పిండిని తడిపి, ముద్ద చేసి రొట్టెగా ఒత్తవలెను. అలా పచ్చిరొట్టెను తినలేం, దానిని కాల్చాలి. కాల్చడానికి కట్టెలు కావాలి. ఇలా సక్రమముగా తయారైన రొట్టెను తింటే ఆకలి తీరుతుంది. ఇక్కడ పిండి జ్ఞానం. దానిని భక్తి రసముచే (జలముచే) తడిపి మృదువుగా నొనర్చిన పిమ్మట నిష్కామ కర్మలను కట్టెలతో పక్వమొనర్చి  సక్రమముగా తయారైన ధ్యానమను రొట్టె ఆరగిస్తే ఆధ్యాత్మికక్షున్నివారణమగును. అప్పుడు ఉన్నచోటనే తత్క్షణమునే పరమాత్మ దర్శనమగును. అటుపిమ్మట అంతా పరమాత్మ ప్రేమతత్త్వమే. దానిని సద్గురువునివ్వమని వేడుకో... ఈ కీర్తనబట్టి ఆత్మసాక్షాత్కారానికి భక్తి, ధ్యాన, కర్మ, జ్ఞానమనే నాలుగూ అవసరమేనని అర్ధమౌతుంది. కాకపోతే ఈ నాలుగు యోగాలు అనుష్టించగలిగే శక్తి కారణజన్ములయిన మహాత్ములకే ఉంటుంది. మనలాంటివారికి ఇది అసాధ్యము కావున, ఏ యోగమార్గం ద్వారైన నను పొందవచ్చని గీతలో సూచించాడు. 

జీవకోట్ల సంస్కారములు అనేకవిధములు. జీవుల యొక్క పరిపక్వతా భేదములున్ను అనేక రకములు. వారి వారి భావనలబట్టి ఒక్కొకరికిని ఒక్కొక్కదానిలో ప్రవేశం కల్గుచుండును. కావున నిష్కామ కర్మయోగం, భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం మొదలగు మార్గములు ఏర్పడినవి. దేహాంతరాలయములోనికి ప్రవేశించి ఆత్మసాక్షాత్కారం చేసుకోవడానికి ఈ నాలుగుమార్గాలు గోపురద్వారాలుగా ఉన్నాయి. ఈ మార్గాలలో ఏ మార్గం ద్వారైనను నిర్మలబుద్ధితో, నిష్కపట ప్రయత్నముతో ప్రవేశించి గమ్యస్థానమును చేరవచ్చును. అయితే, ఏ యోగమార్గములో ప్రవేశించినను, మిగిలిన మూడు మార్గాలు అందు అంతర్భూతమయ్యే యుండును. ఆంటే అంగభూతములుగా యుండును. ఈ నాలుగున్ను ఒకదానికి ఒకటి అన్యోన్య సంబంధం కల్గియే యుండును. జ్ఞానికి భక్తి, కర్మ, ధ్యానములు అంగభూతములుగా నుండును. అట్లే భక్తునికి కర్మ, ధ్యాన, జ్ఞానములూ; ధ్యానికి భక్తి, కర్మ, జ్ఞానములూ; కర్మయోగికి భక్తి, ధ్యాన, జ్ఞానములూ అంతరభాగములై యుండును. ఎలాగంటే, చీకటి నశించి ప్రకాశము కలుగుటకు దీపమే ప్రధానమైనను, దానికి ప్రమిద, తైలము, వత్తి ఎలాగున అవసరమో, అదేరీతిగా జ్ఞానజ్యోతి అయిన ఆత్మను దర్శించడానికి తక్కిన సాధనములు అవసరమే.
దైవోపాసనచే విక్షేపశాంతియు, శుద్ధమగు కర్మానుష్టానంచే అంతఃకరణశుద్ధియు, ధారణాధ్యానబలంచే సంయమనమును, జ్ఞాననిష్టచే ఆవరణరాహిత్యమును కలుగును. కనుక ఏ యోగమార్గమందైనను ఒకదానికి ఒకటి అనుసంధానింపబడే ఉంటాయి. 
భోజనం చేస్తున్నామంటే, దాని తయారికి బియ్యము మొదలగు పదార్దములు, అగ్ని, జలము, పాత్ర, కట్టెలు మొదలునవి ఎలా ఉన్నాయో, ఏ యోగం అనుసరించినను ఆ యోగంలో తక్కినవి అంగభూతములై ఉంటాయి. ఈ సూక్ష్మం అర్ధమైతే ఏది శ్రేష్టమన్న సందేహం ఉండదు ... అని నా నేస్తం 'హరిప్రియ' చెప్పింది.

17, నవంబర్ 2013, ఆదివారం

హమ్మయ్య! కార్తీకపౌర్ణమి వచ్చింది, నా నేస్తమూ వచ్చింది, నా సందేహమూ తీరింది.

క్రిందటివారం తిరుపతి కంచి వెళ్లి, తిరుగు ప్రయాణం అయినప్పుడు ట్రైన్లో ఇద్దరు సాధకులు తాము అనుసరిస్తున్న 'సుషుమ్న నాడీ' ధ్యానవిధానమును తెలిపారు.
పతంజలి యోగసాధన, బుద్ధుని అనాపాన సతి, మాస్టర్ సి. వి. వి. ధ్యానయోగం, పరమహంస యోగానంద క్రియాయోగం, మహేష్ యోగి భావాతీత ధ్యానయోగం, శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీరమణుల నేనెవరిని అన్న విచారణయోగం, స్వామి శివానంద సగుణ నిర్గుణ ధ్యానపద్ధతి, బ్రహ్మకుమారీల రాజయోగం, మాతా అమృతానందమయి ఐ యామ్ టెక్నిక్, అరవిందుని ఇంటిగ్రల్ యోగం, ఋషి ప్రభాకర్ గారి యస్. యస్. వై ధ్యానపద్ధతి, శ్రీ భిక్షుమయ్య గారి యమ్. యమ్. వై ధ్యానపద్ధతి, పత్రీజీ పిరమిడ్ ధ్యానం ... ఇలా ... ఒక్కొక్కరు ఒక్కోలా ఈ ధ్యానయోగాన్ని అనుభూతిస్తూ, నిర్వచిస్తూ, సూచిస్తూ, తెలియజేస్తున్నను, ఈ ధ్యానప్రక్రియలన్నీ స్వస్వరూపస్థితిని తెలుసుకోవడానికే కదా, అని నాకన్పించింది.
ఇంతలో ఆ సాధకులు చెప్పినదంతా విన్న సహప్రయాణికుడు కొందరు ధ్యానయోగం గొప్పదని, మరికొందరు భక్తియోగమని, మరికొందరు జ్ఞానయోగమని, మరికొందరు కర్మయోగమని చెప్తుంటారు. నిజానికి ఏది గొప్పదని వారిని అడగగా, వారు ధ్యానయోగమే గొప్పదని బదులిచ్చారు.
ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ రావడంతో దిగిపోయాను. కానీ, ఏ యోగం గొప్పదన్న ఆలోచన నన్ను వీడలేదు. గీతలో భక్తియోగంలో అనేక మార్గాలను సూచిస్తూ కృష్ణపరమాత్మ ఇలా అంటారు -
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః||

నాలోనే మనస్సును, బుద్ధిని నిలుపుము. అటుపిమ్మట నీవు నిస్సందేహంగా నాలోనే వసింతువు. అంటే ఇది భక్తియోగం.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనుంజయ||

స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు. ఇది ధ్యానయోగం.

అభ్యాసేऽప్యసమర్థోऽసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి||

అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం చేసే పుణ్యకర్మలు వలన నన్ను పొందుతావు. ఇది కర్మయోగం.

అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్||

నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను శరణు పొంది నీవు చేసే
కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.
ఇలా సాధకులకు అనేక యోగామార్గాలు ఉన్నాయి కదా, మరి ఇందులో ఏది శ్రేష్టమైనది అన్న నా సందేహాన్ని తీర్చుకోవడానికై మూడురోజుల క్రితం నా మిత్రురాలు 'హరిప్రియ'కు ఫోన్ చేసి అడిగాను. తను నవ్వి, మంచి సందేహమే, ఈ ఆదివారం కార్తీకపౌర్ణమి కదా, ఆరోజు ఉపవాసముంటాం కదా, ఉపవాసమంటే దేవునికి దగ్గరగా ఉండడం అంటే దైవస్మరణ, దైవప్రార్ధన ... ఇత్యాదులతో గడపడం కదా, ఆరోజు వస్తాను, నీ సందేహాన్ని తీరుస్తాను, సరేనా ... అన్నప్పటినుండి ఈ కార్తీకపౌర్ణమి కై నిరీక్షణ .....
 
హమ్మయ్య! కార్తీకపౌర్ణమి వచ్చింది, నా నేస్తమూ వచ్చింది, నా సందేహమూ తీరింది.
నా సందేహం ఎలా తీరిందో, నా నేస్తం ఏం చెప్పిందో తదుపరి టపా లో -