గత మూడు టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రముల గురించి
తెలుసుకున్నాం. ఇప్పుడు నాల్గవ చక్రమైన అనాహతచక్రం గురించి తెలుసుకుందాం -
ఐం హ్రీం శ్రీం శం హం సశ్శివస్శోహం అనాహతాదిష్టాన దేవతాయై రాకినీ సహిత సదాశివ స్వరూపిణ్యాంబాయైనమః
ఈ కమలం 12 దళాలు కలది. వాయుతత్త్వం. అధిదేవత రాకిని. ఈమె క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమె 'స్నిగ్ధోదన ప్రియా' అంటే స్నిగ్ధాన్నమందు ప్రీతి గలది. జింక వాహనం.
హృదయం
వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 19,440 నాడులతో అనుసంధానింపబడి
వుంటుంది. అనాహతమంటే జీవశక్తిని నిరంతరం నిలిపి వుంచే స్థానం. ఆగని
శబ్దబ్రహ్మం ఈ ప్రదేశంలో నినదిస్తూ వుంటుంది. ఈ శబ్దం రెండు వస్తువుల వల్ల
ఉత్పన్నమైనది కాదు. అది అనాది శబ్దం. ఓంకార శబ్దం. ఈ చక్రాన్ని జయిస్తే
సకలజీవరాసుల యెడల నిస్వార్ధమైన ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమ ఓ
దివ్యమైనశక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమౌతుంది. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ
అనేవి ఈ చక్రానికి సంబంధించిన అంశాలు. దిగువనున్న మూలాధారాది మూడుచక్రాలకు,
ఎగువనున్న విశుద్ధాది మూడుచక్రాలకు ఈ అనాహతచక్రం ఇరుసుగా ఉండి రెండింటిని
అనుసంధానిస్తూ పరిపూర్ణత్త్వంను కల్గించడానికి సూత్రదారిలా దోహదం
చేస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో మనోమయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని
శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం చర్మం.
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
చర్మవ్యాధులు,
రక్తంనకు సంబంధిన వ్యాధులు, శ్వాసకోశవ్యాధులు, రక్తహీనత, గుండెజబ్బులు,
న్యూమోనియా మొదలగు రుగ్మతలు కల్గుతాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది.
ఈ చక్ర మానసిక స్వభావం :-
మూసుకుపోవడం వలన ప్రేమరాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ ప్రలాపనలు, మానసిక ఒత్తిళ్ళు.
తెరుచుకుంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ నిస్వార్ధప్రేమ, ఇంద్రియవిజయం, నిర్మాణాత్మక ఆలోచనలు , విశ్వజనీనత వికసించటం.
మనోమయకోశంతో
సంబంధం ఉన్న ఈ చక్రమందే ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, స్వప్నాలు
ఏర్పడుతుంటాయి. ఆలోచనలు సమగ్రముగా, సక్రమముగా వుంటే ఇచ్చాశక్తి (విల్ ఫవర్)
పెరుగుతుంది. సంకల్పబలం చేకూరుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది.
మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ
చక్రంనకు రాకినిఅధిష్టానదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం నందు ప్రీతి.
స్నిగ్ధాన్నం అనగా నేతితో కలిపిన అన్నం. ఈ చక్రం బలహీనంగా వున్నప్పుడు ఈ
స్నిగ్ధాన్నం స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను
వినియోగిస్తూ, బీజాక్షరం "యం" ధ్యానించువారికి ఈ నాడీమండలం వలన వచ్చేబాధలు
నివారణ కాగలవు.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
ఇతరులకు
హాని చేయకుండా వుండటం మాత్రమే కాదు, ఇతరులకు క్షేమం కల్గించటం అంటే
ఇతరులకు మంచి చేయడం, అలాగే ఇతరులపట్ల ప్రేమానురాగాలు, ఆత్మీయత చూపాలి.
అతిగా స్పందించడం ఈ చక్ర లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి.
హాయి గొలిపే సంగీతం వినాలి. సేవాతత్పరత, క్షమాగుణం అలవర్చుకోవాలి.
ఇక
ఈ చక్రంనకు అధిపతి బుధుడు. ప్రతి ఆలోచననకు, ప్రతీ సంఘటనకు, ప్రతీ మాటకు
అతిగా చలించడం, రకరకాల ప్రకంపనాలకు గురికావడంనకు కారణం ఈ బుధుడే. అతిగా
చలించే స్వభావం బుధునిది. తీవ్ర ప్రతిస్పందన ఈ గ్రహ లక్షణమే. అందుచే అతి
ఆలోచనలును, అతి తెలివిని తగ్గించుకొని, క్రమం తప్పని ధ్యానాబ్యాసం
చేస్తూ, స్థిరంగా ఉండగలిగితే ఈ గ్రహం మనకు సానుకూలంగా పనిచేస్తుంది.
తద్వారా ఈ చక్రం సక్రమముగా పనిచేస్తుంది.
తదుపరి చక్రం 'విశుద్ధచక్రం' గురించి తదుపరి టపాలో ...