25, జులై 2016, సోమవారం

సనత్సుజాతీయం (చివరి భాగం)



పొరపాటే మృత్యువనియు, మృత్యువుకు ఆకృతి లేదనియు, కోపమూ, మొహమూ, పొరపాట్లు కారణంగా మృత్యువు వుండుననియు, తన మృత్యువుకు తానే కారణుడనియు, ఇంద్రియములకు బద్ధులైనవారు జన్మ పరంపరలలో చిక్కుకుంటున్నారనియు, అంతర్యామి యొక్క అస్తిత్వమునే సర్వత్రా దర్శించువారు అమృతత్త్వం అనుభవించెదరనియు చెప్తూ...  సుకర్మ దుష్కర్మలను వివరిస్తూ, ఫలాపేక్షతో పుణ్యకర్మలు చేసినా దుఃఖభాజనులగుదురనియు, పాపపుణ్యాలకు అతీతంగా వుండి ఆత్మనిష్ఠలో ఉన్నవారు బద్ధులు కారనియు...  సనత్సుజాతులవారు వివరించినదంతా విన్న ద్రుతరాష్ట్రుడు ఇలా ప్రశ్నిస్తాడు -
మహామునీ! ధర్మాన్ని ఆచరించకపోవడం వలన ధర్మం దెబ్బతింటుందా? అధర్మం ఆచరిస్తే ఆ ఫలితం మనం అనుభవింప వలసి వస్తుందా? ధర్మం గొప్పదా? అధర్మం గొప్పదా? అని ప్రశ్నించగా,

ధర్మాధర్మాలు రెండూ మనలోనే ఉన్నాయి. ఆచరించటం ఏది ఆచరిస్తావో దానిబట్టి ఫలితముంటుంది. కర్మాచరణం వలన మానవుడు ఉద్ధరింపబడతాడు. సత్కర్మ ఆచరిస్తే సత్కర్మఫలమైనటువంటి స్వర్గం అనబడేటువంటి ఒక స్థితి వస్తుంది,  అంటే అమృతత్త్వం వస్తుంది. దుష్కర్మ ఆచరిస్తే దుష్కర్మ ఫలంగా నరకం అని చెప్పబడేటువంటి ఒకానొక పాపఫలం సంక్రమిస్తుంది, అంటే అహంతో జీవించడం. ఈ ధర్మ ధర్మాల కర్మాచరణం వలనే జ్ఞానం పొందటం, అజ్ఞానం పొందటం వుంటుంది. సత్కర్మాచరణ చేసినట్లయితే, క్రమేణా మనకి, మనస్సుకి వివేకమొస్తుంది, తద్వారా సత్ జ్ఞానం కల్గుతుంది, తద్వారా ఆత్మ సాక్షత్కార కాంక్ష కల్గుతుంది, అది కలిగినందువలన ఆత్మ యందు మనస్సు నిశ్చలత పొందడానికి కావల్సిన సాధనా తృష్ణ మనలో వస్తుంది, అది రావడం వలన కర్తృత్వభావన వీడి ప్రతిఫలాపేక్ష లేకుండగ భగవదర్పణ చేయడం వలన అమృతత్వం సిద్ధిస్తుంది. అమృతత్త్వమంటే ఆత్మ నిష్ఠతో అందర్నీ ఆత్మస్వరూపులుగా భావిస్తూ విశ్వజనీయమైన ప్రేమతో దివ్యజీవనం గడపడం.

ఏ మంచిపనయినాసరే ఆ పనులు మంచివని తెలుసుకున్నంత మాత్రమున ఉపయోగం లేదయ్యా,  ఆచరిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. అని సనత్సుజాతులవారు చెప్పగా,

దృతరాష్ట్రుడు మరల 'ఈ ప్రపంచంలో ధర్మమే ఎక్కువ బలము గలదై పాపాన్ని ఓడిస్తుందా? లేక పాపమే ధర్మాన్ని ఓడిస్తుందా?' అని ప్రశ్నించగా -

రాజా! నీ దృష్టిలో ధర్మా ధర్మములు రెండూ సమాన బలముగలవి కావచ్చును. కానీ నీకే తెలుస్తుంది ... ధర్మ మార్గమున అధర్మాన్ని జయించినవారు ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తారు. అలా కాక, అధర్మ మార్గమున ధర్మాన్ని జయించినప్పుడు అశాంతికి గురై లోలోన పరితాపంతో జీవిస్తాడు. కాబట్టి రెండింటికి ఫలం ఎలా ఉందో, దాన్నిబట్టి ఏది బలీయమో నీవే యోచించి తెలుసుకో. ఓ దృతరాష్ట్రా! పుణ్యపాపాలకు అతీతంగా, కర్మఫలాన్ని అపేక్షింపక, కర్మయోగిగా జీవిస్తూ బ్రహ్మానంద స్వరూపులైనవారు అమృతత్త్వాన్ని పొందుతారు, అంటే ధర్మాచరణం చేత, పుణ్యాన్ని లెక్కచేయకుండా, పాపాన్ని క్షాళనం చేసుకొని పరిశుద్ధులైనట్టివారు, నిత్యమూ, శాశ్వతమూ, సత్యమూ అయినటువంటి పరమాత్మ స్వరూపమయినట్టి ధ్యానంలో అమృతత్త్వంను పొందుతారు.
అని సనత్సుజాతులవారు చెప్తూ, ఇంకా ఇలా వివరిస్తున్నారు -
ఆత్మను దర్శనం చేయకుండా, వ్యక్తులను దర్శనంచేసి, పరోపకారం చేసినా ఒకటే, పరాపకారం చేసినా ఒకటే. పరోపకారం ఎప్పుడు చేసినా 'నిర్లింగమచలం శుద్ధం' ... ఎవరికైతే చేస్తున్నారో వాళ్లలో ఉన్న పరిశుద్ధమైన పరబ్రహ్మమును చూడాలే తప్ప, వారు ఏ కులం, గోత్రం, దుర్మార్గుడా, ఎలాంటివాడు అని చూడకూడదయ్యా దృతరాష్ట్రా!

యోన్యథానన్త మాత్మానం
అన్యథా ప్రతిపద్యతే
కింతేన నకృతం పాపం
చోరేణాత్మాపహారిణా

అనంతమయినట్టి పరమాత్మ ఒకే విధంగా అందరిలోనూ ఉన్నను, మరియొక విధంగా ప్రతిపాదనం చేసుకొని, వీరు మావాళ్లు, వీరు పరాయివాళ్ళు అన్న భావన చేసుకున్నవారు ఏ సత్కర్మాచరణం చేసిన అది పాపమే అవుతుందయ్యా ...

జ్ఞాని మానుషమైన సంపద అంటే మనిషిచేత సృజింపబడ్డ సంపదలను నమ్మక, దైవీ సంపదల మీద నమ్మకముంచి లోకహిత కాముకుడై, నిశ్చలుడై ఉంటాడయ్యా. ఎవరు పొగిడినా తెగడినా, అది అలా మాట్లాడినవారి స్వభావలక్షణంగా ఉన్నట్టిమాటగా భావించి 'లోక స్వభావవృత్తిర్హి' లోకస్వభావ ప్రవృత్తి ఇంతేనని తెలుసుకొని ఊరుకుంటాడేగాని పట్టించుకోడయ్యా. తనకి అన్వయించుకొని బాధపడడు, బదులియ్యడు.

మోక్షమనే మార్గంలో వెళుతున్నవానికి బహు దారులున్నాయి నాయనా... 'సత్యార్జవే హ్రీర్దమ శౌచవిద్యాహః' అంటే సత్యవాక్కు, ఋజు ప్రవర్తనం, లజ్జించటం, దమం, శౌచం, విద్యా... అనే దారులున్నాయి.
సత్యవాజ్మియమం మొదటి దారి అంటే మొదటి గుణం. సత్ప్రవర్తనం రెండో గుణం, చేయకూడని పనులు చేయడానికి లజ్జిపడటం మూడో గుణం, ఇంద్రియములను మనస్సును నిగ్రహించుకునే నాల్గవ గుణం, బహి (శారీరక) శౌచం, అంతశ్శౌచం ఐదవ గుణం, హితమైన పనులుచేస్తూ, అందరిలో అంతర్యామిని చూసే విద్య ఆరవ గుణం. 'షణ్మానమోహ ప్రతిబన్ధకాని' ఈ అరున్నూ మానాభిమానములు మోహంను తొలగించేసి,మోక్షానికి వెళ్లేదారిని ఇస్తాయి రాజా, వీటిని ఆచరణలో పెట్టి ఎంతో ఆర్తితో మోక్షంకై యత్నించాలి నాయనా.

అటుపై  మౌనమంటే ఏమిటో చెప్పమని దృతరాష్ట్రుడు అడగగా -

యతో నవేదా మనసా సహైనమ్
అనుప్రవిశన్తి తతోథ మౌనమ్
యత్రోత్ధితో వేదశబ్దస్తధా యం
స తన్మయత్వేన విభాతిరాజన్

మౌనం మనస్సుకు సంబంధించినది.  మౌనమంటే  తెలుసుకోవటం, చూడటం, అది తాను అవటం. వేదశబ్ధం ఎక్కడెక్కడయితే అమలుపరచటానికి వీలవుతుందో అక్కడక్కడల్లా వున్నది మౌనమే. ఆ స్థితే తన్మయత్వ స్థితి. తానే అది అయ్యే స్థితి.

                       *  లోకాస్సమస్తా సుఖినోభవంతు  *

22, జులై 2016, శుక్రవారం

సనత్సుజాతీయం (తృతీయ భాగం)

శ్రీ సనత్సుజాతులవారు దృతరాష్ట్రునికి పొరపాటే మృత్యువనియు, మృత్యువుకు ఆకృతి లేదనియు చెప్తూ, ఇంకా ఇలా వివరిస్తున్నారు - 

మృత్యువంటూ వేరేగా ఏమీ లేదయ్యా. నీవేం చేస్తున్నావో దాన్నిబట్టి ఉంటుందయ్యా...
మృత్యువు ఎక్కడనుండి వస్తుందంటే ...
రాజా!
"క్రోదః ప్రమాదో మోహ రూపస్య మృత్యు:"  క్రోధం వలన, పొరపాట్లు చేయడం వలన, మోహం వలన మృత్యువు వస్తుంది. ప్రమాదమంటే పొరపాటు. తాను చేయవలసింది చేయకుండా, తనకు చేద్దామనిపించింది చేసేస్తే అదే పొరపాటు. ఏది చేయాలో, ఏది చేయకూడదో మనోబుద్ధులకు తెలుస్తుంది. దానిని గ్రహించి నడుచుకోకపోతేకనుక అదే మృత్యువు. ఇటువంటివారు "ఇతః ప్రేతాః" ఇక్కడనుండి వెళ్ళిపోయినవారై (శరీరం వదిలిన వారై) "తత్ర పునః పతంతి" మరల ఇక్కడే పడుతుంటారు. అంటే జననమరణ చక్రంలో తిరుగుతుంటారు.

అటుపై సత్కర్మ దుష్కర్మల గురించి ఇలా వివరిస్తున్నారు శ్రీ సనత్సుజాతులవారు ...


ఓ దృతరాష్ట్రా! మృత్యువు ఉండడం, లేకపోవడం మన కర్మల బట్టే వుంటుంది. "కర్మోదయే కర్మఫలానురాగా" కర్మ ఉదయించినప్పుడెల్లా అంటే కర్మ చేయాలనే తలపు రాగానే, ఆ కర్మఫలం అనురాగం కలిగిన వారౌతున్నారు.  నీవు ఏ దృష్టితో కర్మ చేస్తావో, దాన్నిబట్టి ఫలితముంటుంది. పూజలు హోమాదులు లోకక్షేమం కొరకు చేస్తే పుణ్యకర్మలు అవుతాయి, స్వార్ధంతోగాని, ఇతరులకు అపకారం కలిగించడానికి గాని చేస్తే సత్కర్మలు కూడా దుష్కర్మలే అవుతాయి. ఇచ్చా అరిషడ్వర్గాలతో కలిగినట్టి కర్మలు చేస్తే ప్రారబ్ధాలు తప్పవు, జననమరణాలు తప్పవు, మృత్యువు తప్పదు. కర్తవ్యం నుండి విముఖులు కానటువంటివారై తాము ఏది ఆచరించాలో అది ఆచరిస్తూ, చేయదలచినదంతా చేయకుండా, చేయవలసినవి చేస్తే కర్మ నాశం అవుతుంది, నిష్కామ కర్మ నైష్కర్మ్యసిద్ధి వస్తుంది, మోక్షమొస్తుంది. ఆచరణ యందు బుద్ధి విడిచి వుండి, భగవత్ సమర్పణ బుద్ధితో కర్మాచరణ చేసేవారికి కర్మ అంటదు. 



మన కర్తవ్యాన్ని మనం ఫలాపేక్ష లేకుండా, భగవంతునార్పణ బుద్ధితో నిర్వహిస్తే ఆగామి సంచిత ప్రారబ్ధములనేవి ఉండవు. 

ఇటువంటివారికి మృత్యువు లేనట్లే.

"నేను" అంటే శరీరం కాదయ్యా, నేను అనగా "ఆత్మ". శరీరం వున్నప్పుడు "నేను" అనే ఒకానొక ప్రజ్ఞగా ఉన్నాం. శరీరం వదిలిన తర్వాత కూడా "నేను" అనే ప్రజ్ఞ మాత్రమే ఉంటుంది. దేహ భ్రాంతి ఉన్నవారికే మృత్యువుంటుంది.

ఏది సత్యమో, నిత్యమో, ఏది మిధ్యో గ్రహించి, ఇంద్రియార్ధముల యందు మోహపడకుండా, ఇంద్రియాలతో కూడి మనస్సును వెళ్లనీయకుండా, స్వస్వరూప స్థితిని ఎఱిగి, అందరూ ఆత్మ స్వరూపములే అన్న సత్యాన్ని గ్రహించి తదానుగుణంగా జీవించువారికి మృత్యువుండదు రాజా.

సృష్టిలో ఉన్నటువంటి జీవుడు, సృష్టికి అతీతమైన దేవుడు... వీరు ఇద్దరు ఉన్నట్లు అన్పిస్తుందిగాని, దేవుడి అస్తిత్వంను అంగీకరించి శమదమాది గుణాలు కలిగి, ధ్యానాది సాధనలు చేస్తే, జీవుడే(ఆత్మ) దేవుడనే(పరమాత్మ) అన్న జ్ఞానం కలిగిననాడు తానే అది అవుతాడు. అటువంటివారికి మృత్యువుండదు. అన్నింటికి మన సంకల్పాలే కారణం. అంటే మనస్సే కారణం. మనస్సు ఏది సంకల్పించిందో దాని బట్టి ఉంటుంది. మనస్సు మృత్యువును కల్పించుకుంటే మృత్యువౌతుంది, పరబ్రహ్మమును కల్పించుకుంటే మనస్సు కూడా ఉండదు, పరబ్రహ్మమే ఉంటుంది. రాజా! కామ, క్రోధలోభాది అరిషడ్వర్గములున్నపుడు అవే మదిలో స్థిరపడతాయి కానీ, తానుండడు. ఆ తాను లేకపోవడమే మృత్యువు. మనస్సును ధర్మమార్గమున సత్కర్మాచరణం చేసి, ధ్యానాదులు ఉపాసన చేసి ఆత్మసాక్షాత్కారం పొందితే, శరీరం వున్నను ఆ జీవుడు మోక్షమందున్నట్లే. ముక్తి అనేది శరీరం పోయాక కాదు, ఉన్నప్పుడే పొందాల్సిన స్థితయ్యా. మృత్యువు కర్మ చేత, అజ్ఞానం చేత కల్పించుకున్నదే.

ఆత్మయందు ధ్యానం కలిగియుండి శాశ్వతమూ, నిత్యమూ అయినటువంటి వస్తువునందు మనస్సు నిలిపి, ఈ మిగిలినటువంటివన్నీ మనమెట్లా చేసుకుంటే అట్లా జరుగుతాయనేటువంటి సంగతి గుర్తుండి, మనమెలా సత్కర్మలు ఫలాపేక్షలేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించుకోవాలో అలా ఆచరించుకుంటూ ఉంటే మృత్యువు లేదయ్యా.
అని చెప్తూ, ధర్మాధర్మాల గురించి ఇలా వివరిస్తున్నారు ... ఈ వివరణ తదుపరి టపాలో ... 








21, జులై 2016, గురువారం

సనత్సుజాతీయం (ద్వితీయ భాగం)





దృతరాష్ట్రుడు పాండవుల పట్ల తన కర్తవ్యాన్ని ఆచరింపకపోతే అతని కుమారులకు మృత్యువు తప్పదని విదురుడు చేసిన హెచ్చరికతో అధర్మాన్ని అన్యాయాన్ని సరిచేయాలని అనుకోకుండా, మృత్యువు గురించి, అమృతత్వం గురించి ఎఱుకపరిచే బ్రహ్మవిద్యను తెలుసుకొని తన కుమారులు మృత్యువాత పడకుండా చేద్దామని తలచి దానిని తెలుపమని సనత్సుజాతులవారిని ఇలా ప్రశ్నిస్తాడు -

దృతరాష్ట్ర ఉవాచ -

సనత్సుజాత యదిదం శృణోమి
నమృత్యుర స్తీతి తవోపదేశమ్
దేవాసురా ఆచరన్ బ్రహ్మచర్య
మ మృత్యవే తత్కతరంను సత్యమ్

మృత్యువు లేదని మీరు చెప్పిన ఉపదేశాలు గురించి విదురుని ద్వారా విన్నాను. దేవతలు, అసురులు కూడా మృత్యువు జయించుటకోసం బ్రహ్మచర్యం ఆచరించారని విన్నాను. వారేమో మృత్యువు జయించడానికి ప్రయత్నం చేశారంటున్నారు. మీరోమో మృత్యువే లేదంటున్నారు. పరస్పర విరుద్ధంగా వున్న  ఈ మాటల్లో ఏది సత్యం? ఏది నమ్మాలి?
అని దృతరాష్ట్రుడు సనత్సుజాతులవారిని ప్రశ్నించగా -

శ్రీ సనత్సుజాత ఉవాచ -

ఉభేసత్యేక్షత్రియాద్య ప్రవృత్తే
మోహోమృత్యు: సంమతో య:కవీనాం
ప్రమాదంవై మృత్యుమహం బ్రవీమి
సదా ప్రమాదమమృతత్వం బ్రవీమి

ఓ క్షత్రీయుడా! మృత్యువు లేకపోవడం, మృత్యువును తరించడం ... ఈ రెండూ నిజమే. ఈ రెండూ సత్యేమేనని తెలుసుకో.
దేవతాసురులు మృత్యువును ప్రయత్నపూర్వకంగా జయించడమంటే ......
మృత్యువు అంటే మోహం. "నేను" అన్న అహం. హృదయగ్రంధి నందు అహం ఉంటే మృత్యువున్నట్లే దానిని జయించడానికి ప్రయత్నించాలి. హృదయాంతరమున ఆంతర్యామే ఉంటే మృత్యువు లేనట్లే. ప్రమాదం (పొరపాటు) మృత్యువు. అంటే పొరపాటు ఉన్నచోట మృత్యువుంటుంది. పొరపాట్లు చేయకుండా జీవించడమే అమృతత్వం. పొరపాట్లు లేని చోట మృత్యువుండదు. 
మానవుడు తన ఇంద్రియాలను పరమాత్మునిలో ఐక్యం చేసుకుంటే మృత్యువనేది ఉండదు. మట్టితో చేయబడిన కుండకు పగిలిపోవడముంటుందిగాని మట్టికి వినాశనం ఉండదు. అలాగే ఆత్మతో నిండియున్న శరీరాదులకు మార్పు ఉంటుంది గాని ఆత్మకు మార్పు ఉండదు. ఆంతర్యామితో జీవించేవారికి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు స్థానంలో ఆత్మే నిలుస్తుంది. ఇలా ఆత్మనిష్ఠులైన వారికి మృత్యువుండదు.

సృష్టాది నుండి శాశ్వతమూ, నిత్యమూ, సత్యమూ అయినటువంటిది, వేదశబ్ద వాచ్యమయినటువంటి ధర్మమున్నది. అది సనాతనమైనది. ఈ సనాతన ధర్మమును తెలుచుకొని తదనుగుణంగా జీవిస్తే మృత్యువు లేనట్లే. ఆ ధర్మమును తప్పితే పొరపాటు చేసినట్లే, మృత్యువు ఉన్నట్లే.

అని చెప్తూ ఇంకా ఇలా వివరిస్తున్నారు సనత్సుజాతులవారు - 

ప్రమాదాద్వా అసురాః పరాభవన్ 
అప్రమాదాద్ బ్రహ్మభూతాః సురాశ్చ 
సవైమృత్యుర్వ్యాఘ్ర ఇవాత్తి జస్తూన్ 
సహ్యస్వరూప ముపలభ్య తేహి

ప్రమాదం అంటే పొరపాట్లు వలన అసురులు పరాభవం పొందారు. పొరపాటు పడకుండా ఉండడం వలన సురులు బ్రహ్మభూతులైనారు. 
(అమృతత్వం కోసం దేవాసురులు ప్రయత్నించారు కానీ, మోహినిపై మోహంతో అసురులు అంతవరకు తాము దేనికై ప్రయత్నం చేస్తున్నారోనన్న విషయం మరిచి పరాభవం పొందారు.పొరపాటు పడకుండా, తాము దేనికై  ప్రయత్నం చేస్తున్నారో గుర్తుంచుకోవడం వలన సురులు బ్రహ్మభూతులైనారు). ఏది యుక్తమో, ఏది అయుక్తమో గ్రహించి, ఏమరుపాటు లేకుండా బ్రహ్మచర్యం (పరబ్రహ్మ యందు చరించుట) పాటించువారికి మృత్యువుండదు. 

దేహాత్మ బుద్ది గలవారు అసురులు. ఇంద్రియ సుఖాలు కోసం జీవించేవారు అసురులు. అసురులు అంటే దుర్బుద్ధులు. దుర్బుద్ధి ఎక్కడుంది? మన బుద్ధిలోనే ఉంటుంది.  ఆత్మనిగ్రహం ఇంద్రియనిగ్రహం కలవారు సురులు. సురులంటే సద్బుద్ధి. ఇదీ మన బుద్ధిలోనే ఉంటుంది.

మృత్యువనేది మృగంలా రాదు. పులిలా వచ్చి కబళించదు. మన దినచర్యలో మనం ఆచరించుకొంటున్నటి పనులేవైతే ఉన్నాయో, వాటివలన మృత్యువు ఉండటమో, లేకపోవడమో ఉంటుంది. అజ్ఞానంతో దేహమే నేననుకుంటే ఆ దేహం విడుస్తున్నప్పుడు మృత్యువు వచ్చిందంటారు. దేహాత్మభావన లేనప్పుడు దేహం విడుస్తున్నాననుకుంటారు. వీరికి మృత్యువు లేదు. అంతేకాని దీనికి రూపముండదు.

అని ఇంకా మరింత వివరణ ఇస్తున్నారు శ్రీ సనత్సుజాతులవారు -

ఆ వివరణ తదుపరి టపాలో ...









20, జులై 2016, బుధవారం

"సనత్సుజాతీయం"

భగవంతుడే చైతన్యస్వరూపుడు, పూర్ణుడు, శాశ్వతుడు, సర్వస్వడు,. ఆ పరమాత్ముడే సత్యం ... సనాతనం. అతని ప్రేమైక సృజనయే సృష్టి.

దివ్యమై, అనంతమై, అమృతమై, ఆనందమై, శివమై, దైవమై, సత్యమై, నిత్యమై, సనాతనమై భాసిల్లే పరతత్త్వం గురించి తెలియజెప్పేదే వేదం. దీనికి శబ్ధరూపములుగానైన ప్రతులే ఋగ్వేదాది నాలుగు వేదములు. వీటి సారమే విజ్ఞానదాయకమైన ముక్తిప్రదాయినులగు పురాణములు, రామాయణము, మహాభారతం, భాగవతములు. ఇందు రామాయణం వాల్మీకి ప్రోక్తం కాగా, మిగిలినవి వ్యాసప్రోక్తములు.  ఇందులో మహాభారతం పంచమవేదంగా ప్రశస్తి పొందడానికి కారణం - అందు అశ్వనీదేవతల స్తుతి, సనత్సుజాతీయం, భగవద్గీత, ఉత్తరగీత, భీష్ములవారి ఉపదేశములు, విష్ణు సహస్రనామములు మొదలగు ఎన్నో ముక్తిత్వంలను ఒసగు ధర్మ ధార్మిక ఘట్టములు అనేకములు వుండడంచే పంచమవేదంగా కీర్తింపబడుతుంది.

శ్రీమన్నారాయణునిచే వేదములు గ్రహించిన సృష్టికర్తయగు బ్రహ్మ తేజోమయ చతుర్ముఖములకు నేపధ్యములు సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు. ఈ ముఖములందలి తేజస్సులే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వీరు పరమ ఋషీంద్రులు. బ్రహ్మవిద్యా ప్రవర్తుకులు.

శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణకై ద్వాపరయుగమందు శ్రీకృష్ణుడుగా అవతరించక ముందే దైవప్రణాళికకు సహకరించడానికి సనత్కుమార, సనత్సుజాతులవారు గోపాలురుగా దిగివచ్చిరి. ఇందులో సనత్సుజాతులవారు శతగోపనామధేయంతో గోకులంకు వచ్చిరి. ఈయనే రాధదేవిని పెంచిన తండ్రి. ఇటు నరదేహంన శతగోపుడుగా వర్తించుచున్నను, అటు సనత్సుజాత ఋషీంద్రులుగా కూడా వర్తించగలిగేవారు. కృష్ణ భక్తుడును, సద్గుణవంతుడయిన విదురుడు వీరి శిష్యుడై బ్రహ్మజ్ఞానం పొందిరి.

సంజయుడు పాండవ వాసుదేవుల వద్దనుండి తిరిగివచ్చిన తర్వాత...
దృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం పాండవులకు ఇచ్చేయమని, లేదంటే యుద్ధం తప్పదని, యుద్ధమే సంభవిస్తే నీ కుమారులెల్లరు మృత్యువాత పడేదరని విదురుడు ఉపదేశించినను, దురాశతో విదురుని మాటలకు దృతరాష్ట్రుడు విలువివ్వలేదు. కానీ, తన కుమారులు యుద్ధమందు మరణిస్తారేమో నన్న భయంతో నిద్రపట్టక విదురునిని రప్పించుకొనగా ...
రాజా!   ఏ విధమైన అనారోగ్యాలు లేనప్పుడు నిద్ర పట్టనిది నలుగురికే. 1. బలవంతుడయిన శత్రువు తనపై దాడి చేస్తాడేమో నన్న భయంతో వుండే బలహీనునకు, 2. సరుకు (సంపద)కోల్పోయినవారికి 3. దొంగకు 4. కామాతుర చిత్తుడునకు. రాజా! ఇప్పుడు చెప్పు ... ఎందుకు నీకు నిద్రపట్టడం లేదు అని విదురుడు అడగగా -
ప్రతీవారు మృత్యువే అంటారు, ఆ మృత్యువును దాటడానికి ఏ మార్గమూ లేదా ? అన్న దృతరాష్ట్రుని ప్రశ్నకు విదురుడు ఇలా ప్రబోధిస్తాడు -
ఆధ్యాత్మిక జ్ఞానం ... ఆత్మవిద్య ఉన్నది. సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మాన్ని తెలుసుకొని, దాని మీద మనస్సు నిలిపి, మనస్సులో కూడా అదే అంతర్యామిత్వం చెంది, ఇంద్రియములను నిలిపి, ఇంద్రియములలో కూడా అదే అంతర్యామిత్వం చెంది, దేహము, మనస్సు ఇంద్రియములు అనేటువంటివి లేకుండా, వాటి స్థానంలో కూడా సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మమునే నిలుపునటువంటి ... ధారణ, ధ్యాన సమాధి నిష్టులయిన మహాత్ములకు మృత్యువు లేదు అని చెప్పగా ...

"మృత్యువు" యొక్క స్వరూపంను, మృత్యువును దాటే ఉపాయాన్ని తెలపమని విదురునిని దృతరాష్ట్రుడు కోరగా,  ఇది బ్రహ్మవిద్యా రహస్యం. దీనినుపదేశింప తానర్హుడ గానని, మా గురువుగారే అర్హులని, దానిని ద్రుతరాష్ట్రునికి ఉపదేశించుటకు  తన గురువగు సనత్సుజాతులవారిని విదురుడు సంస్మరించెను. స్మరణ మాత్రంచేత అనుగ్రహిస్తానని విదురునికి మాట ఇచ్చిన సనత్సుజాతుల వారు ప్రత్యక్షమై ద్రుతరాష్టునికి ఉపదేశించిన దివ్యజ్ఞానామృతమే "సనత్సుజాతీయం". 


తదుపరి వివరణ తదుపరి టపాలో ...