31, జులై 2018, మంగళవారం

ఏమిటే ఈ మనస్సు ... భావకుసుమాలు

                                                            
                                                   

శుభోదయం భారతీ అంటూ, వాట్సాప్ లో పలకరించే నేను ఇలా లేఖలో ప్రత్యక్షమవ్వడం ఏమిటని అనుకుంటున్నావా? కారణం వుందోయి ... 
"శ్రీరామ జయరామ జయరామ ... 
యేన కేన ప్రకారణ యస్య కస్యాపి దేహినః 
సంతోషం జనయేత్ప్రాజ్ఞస్తదేవేశ్వర పూజనమ్ 
ఏ ప్రకారముగానైనను ఏ జీవికైనను ప్రాజ్ఞుడైనవాడు సంతోషం కలుగచేసేడు కార్యమునే చేయవలెను. అదియే సర్వేశ్వరునికి  గొప్ప పూజ. 
శుభోదయం రా బంగారం". 
అని నీవు పంపిన వాట్సాప్ మెసేజ్ నా ఈ లేఖకు కారణం. 
నీ ఈ మెసేజ్ తో కొద్దిరోజుల క్రితం నాలో జరిగిన సంఘర్షణను నీకు చెప్పాలనిపించి, అదంతా వాట్సాప్ లో తెలపలేక ఫోన్ బదులు పెన్ను పట్టుకున్నా.

రోజూ పావుతక్కువ ఐదుకు లేవడం, స్నానాదికాలు పూజ, ఆపై వంటావార్పు వగైరాలు..... మధ్యాన్నం ఓ అరగంట సేదతీరడం... తిరిగి పనులు ప్రారంభం... అన్ని ముగించుకొని పదకొండింటికి పడుకోవడం. ఇది సాధారణంగా నా క్రమం తప్పని నిత్య దినచర్య. అయితే గత కొద్దిరోజులుగా నేను లేచేసరికి పువ్వులన్నీ ఎవరో కోసేస్తున్నారు. నేను గమనించిందేమిటంటే - మార్నింగ్ వాక్ కు ఓ కవరుతో బయలుదేరడం, పూవులు కోసేయడం, ప్రహరీ లోపలున్న మందారమొక్కను కర్రతో వంచి కోసేయడం. విచారకరమేమిటంటే - ఆ హడావిడిలో చాలా పువ్వులు నేలమయం, కొమ్మలు విరిచేయడం... ప్చ్...
సరిగ్గా పువ్వులు లేక పూజలో ఏదో అసంతృప్తి. ఓ రోజైతే అస్సలు పువ్వులు లేవు. కాస్త తులసిదళాలతో పూజ ముంగించాను గానీ, మనసంతా వెలితి.
                                 

భారతీ, నా చిన్నప్పుడు, నాన్నమ్మ దేవునిపాటలు పాడుతూ... పెరట్లో పూవులను, తులసిదళాలను పూలసజ్జ నిండా కొస్తుంటే, ఆ పాటలు వింటూ, నేనూ కొన్ని పువ్వులు కోసి సజ్జలో వేయడం... నాన్నమ్మ నా ఈ చిన్నిపనికి మురిసిపోతూ... నా బంగారు తల్లీ, ఎంత సాయమో నాకూ... అని అంటూ, నా మొఖం చుట్టూ చేయి తిప్పి తన తలపై మెటికలు విరవడం... ఓ అందమైన జ్ఞాపకం. మదిలో మధురమైన సజీవ దృశ్యం.
నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, ఓసారి నాన్నమ్మను అడిగాను, పూజకు పూవులు, తులసిదళములు, దీపాలు, అగరబత్తి ధూపాలు, కర్పూర నీరాజనములు ఎందుకని?

మనల్ని శుద్ధి చేసుకోవడానికి. స్నానాదికాలు శరీరాన్ని, పూజాదికాలు మనస్సుని శుద్ధి చేస్తాయి. బాహ్య శుద్ధితో పాటు అంతరశుద్ధి కూడా ఉండాలి తల్లి. పరమాత్ముడు అన్ని చోట్ల వుంటాడు. అందరిలోనూ వుంటాడు. కానీ, మనం దర్శించుకోలేం. ఆయనను దర్శించడం సామాన్యులకు సాధ్యం కాదు. మనస్సు చంచలం చపలం. ఓ చోట స్థిరంగా ఉండదు. ఈ లౌకిక లంపటాల నడుమ భగవంతునిపై మనస్సు లగ్నం చేయలేము. అందుకే మన మహర్షులు వేదాల్ని ఆధారంగా చేసుకొని, నిరాకారునికి రూపం, దీపం, ధూపం, పుష్పం, తీర్ధం, నైవేద్య  నివేదన... ఇలా అనేక ప్రక్రియలను ఏర్పరిచారు. మానవజన్మ నిరర్ధకం కాకూడదని, మన మనస్సును రోజులో కొద్ది సమయమైన భగవంతునివైపు మరల్చడానికి, భగవంతుని చెంతన భక్తుని మనస్సు ఏకాగ్రమొనర్చడానికి, సామాన్యభక్తులను తరింపజేయడానికే ఇవన్నీ ఏర్పరిచారని నాన్నమ్మ చెప్పింది. కొంతకాలం పిదప నాన్నమ్మ చెప్పింది అర్ధమైంది. ఆప్పటినుండేరా, పూజ చేయడం అలవడింది. 

నిజమే కదా,  బాహ్యక్రియలు అంతరశుద్ధికై సహకరిస్తాయి. ప్రాధమికంగా పరబ్రహ్మం నందు చిత్తం లగ్నం చేయవలెనన్న అందుకు అనుకూలమైన స్థానం సాధన ఉండాలి కదా.  
స్థూలం గా ఏర్పరిచే ఈ పూజాది ప్రక్రియలన్నీ భగవంతుని వైపు పూర్ణంగా మరలడానికే. సంపూర్ణ సమర్పణాభావం అలవడడానికే. ఎచ్చట దృగ్గోచారమగు స్థూలప్రకృతి యంతయూ పవిత్రంగా నుండునో, అచ్చట మన సూక్ష్మప్రకృతియగు మనోమయకోశం పరిశుద్ధస్థితి నొందును.
పంచేంద్రియాలతో పాటు మనసును ఏకాగ్రం చేయుటకే ఈ పూజ ఏర్పరిచారనిపిస్తుంది. దివ్యమంగళకరమగు భగవత్ రూపమునందును, దీప ధూప కర్పూరాది జ్యోతులయందు నేత్రేంద్రియం, సుగంధ ధూపవాసనలచే ఘ్రాణేంద్రియము ఏకాగ్రత నొందును. గంట శంఖధ్వనులలో కర్ణేన్ద్రియం లీనమగును. భగవన్నామోచ్చారణలచేత జిహ్వేంద్రియం లయించును. పరిమిళమిళిత శీతలదాయకమగు చందనాదులచే త్వగింద్రియం శాంతము నొందుతుంది. వీటన్నింటి మూలంగా మనస్సు  రమిస్తుంది కదా. 
భారతీ, ఇప్పుడు నేను చేసిన పూజ మహాఅయితే గంట లోపే. కానీ, ఆ ఒక్క గంట మిగిలిన 23 గంటల జీవనంకు శక్తిదాయకం. సరే, అసలు విషయంకు వస్తాను... ఆ రోజు పువ్వులు లేకుండా చేసిన పూజతో ఒకవిధమైన అసంతృప్తి. ఇంట్లో అందరికీ టిఫిన్స్, వంట తతిమ్మా పనులు పూర్తయ్యేసరికి 11 అయింది. 
దగ్గరలోనే గుడికి వెళదామనిపించి వెళ్లాను. దర్శనం అనంతరం బయటమెట్లుపై కూర్చొని ప్రసాదం తింటుండగా, ఆ ప్రక్కనే కూర్చున్న కొందరు, శ్రావణంలో తీసుకోవాల్సిన చీరల గురించి, ఏ షాపులో కొనాలో, కొనాలనుకుంటున్న బంగారం గురించి, ఆపై టీవీ సీరియల్స్ గురించి గట్టిగా మాట్లాడుకుంటేంటే... గుడికి వచ్చింది ఇందుకా... ఒకింత బాధతో గుడి లోపలకు మరల వెళ్లగా, ఓ 10 సం|| పాప తన పుట్టినరోజని అందరికీ ఓ పండుతో పాటు శివానంద లహరి పుస్తకమును ఇచ్చింది. అచ్చటే ఓ మూల కూర్చొని శివానందలహరి చదువుతుండగా ఈ శ్లోకములయందు మనస్సు నిలిచింది ... 
గభీరే కాసారే విశతి విజనే హోర విపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్ధం జడమతిః
సమార్పైక్యం చేత స్సరసిజ ముమానాధ భవతే
సుఖేనావ స్థాతుం జన ఇహ న జానాతి కిమహో 
ఓ ఉమాపతీ! ఏమీ ఆశ్చర్యం? మానవుడు తెలివి తక్కువవాడై, నీ ఆరాధనకై పువ్వులను సేకరించవలెనని లోతైన చెరువులలోకి దిగుతున్నాడు, నిర్జనారణ్యాలలో, ఎత్తైన పర్వతాలలో పరిభ్రమిస్తున్నాడు. కానీ మనస్సనే పద్మాన్ని నీకు సమర్పించి ఇచ్చట సుఖంగా స్థిరంగా వుండడం తెలుసుకోలేకున్నాడు కదా.
అలాగే కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ ... అన్న శ్లోకమందు 
గిరీశా! చేతిలో బంగారుకొండ, సమీపంలో కుబేరుడు, కామధేను, కల్పవృక్షం, చింతామణి మున్నగునవి గృహంలో రాజిల్లుతుండగా, శిరోపరి భాగంలో చంద్రుడు ప్రకాశిస్తుండగా, సమస్త మంగళాలూ నీ పాదపద్మలా సన్నిధిలో ఉండగా, నేను నీకేమి ఇవ్వగలను? నా మనోపుష్పమును నీకర్పిస్తున్నాను స్వీకరించు. 

నిజమే కదా, మనోపుష్పం సమర్పించవచ్చు కదా... ఆనందమనిపించింది, నా అసంతృప్తి పోగొట్టడానికే భగవంతుడు ఇలా అనుగ్రహించాడనుకుంటూ ఇంటికి బయల్దేరాను. మధ్యాన్నం అందరి భోజనాలు అయ్యాక, కాస్త సేద తీరుదామని మంచమెక్కాను. నిద్ర రాలేదు కానీ, ఓ సందేహం మనస్సును తొలవడం ప్రారంభించింది. క్రిందపడిన పువ్వులూ, వాసన చూసిన పువ్వులూ పూజకు పనికిరావంటారు, మరి బంధాల క్రింద పడి, ఎన్నో విషయం వాసనలను తగిలించుకున్న ఈ మనోపుష్పంను ఎలా సమర్పించగలను? 
ఏమైంది నాకు, ఎందుకిన్ని ఆలోచనలు... అసహనంగా అనుకుంటుండగా ఫోన్ రింగ్... మాట్లాడి, వాట్సాప్ చూడడం మొదలెట్టా. అందులో ఓ ఫ్రెండ్ పంపిన మెసేజ్ చూడగానే ఆనందం పునఃప్రవేశం. ఆ మెసేజ్ -
అహింసా ప్రధమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి పుష్పం తపః పుష్పం, ధ్యాన పుష్పం తథై వచ
సత్య మష్టవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం భవేత్
మొదటి పుష్పం అహింస.  అహింసా వాఙ్మనంకాయై: ప్రాణిమాత్ర ప్రపీడనం ... శరీర మనో వాక్కులతో బాధింపకుండుట అహింస. వయస్సు రీత్యో, శారీరక శక్తి తగ్గో, బాధ్యతలు పెరిగో ... కాస్త చిరుబురులు ...ఇలా అప్పుడప్పుడు వాక్కు హింస చేస్తున్నా. 
ఇక రెండవది ఇంద్రియ నిగ్రహం... ప్రారబ్ధ ప్రపంచానురక్తిని విడిచి, బహిర్ముఖమగు ఇంద్రియములు నిగ్రహించి అంతర్ముఖం చేస్తూ,తామరాకుపై నీటిబొట్టులా మనుగడ సాగించడం ... అనుకున్నంత సులువు కాదురా..... కారణజన్మురాలైన సీతమ్మవారి నేత్రేంద్రియమే మాయలేడి వెనుక పరుగులు తీయగా, సామాన్యురాలిని ఈ మాయాప్రపంచబంధాల వెనుక పరుగిడడంలో ఆశ్చర్యమేముంది? 
మూడవ పుష్పం సర్వభూత దయ. సర్వజీవుల యెడ దయగా ఉండడం. హు... వంట చేస్తుండగా వంటగది ప్రక్కనున్న ప్రహరీగోడపైకి కాకుల రాక... కాస్త టిఫినో, బిస్కట్సో ... ఏదుంటే అది పెడితే, అది చూసిన మామయ్యగారు అలా పెట్టడం వలనే రోజూ కాకులు వస్తున్నాయని, గోడ నిండా రెట్టలే అని చిరుబురులు. అంతవరకూ కనిపించని శ్రీవారు, ఎన్నిసార్లు చెప్పించుకుంటావ్, పెద్దవాళ్ళ మాటకి విలువివ్వవా, మానర్స్ లేదు, కామన్సెన్స్ లేదు... మెత్తమెత్తని చివాట్లు.  అదేమిటో కానీ, అత్తయ్యగారు, మామయ్యగారు దండకం ఎప్పుడు ఉన్నా, ఎక్కడుంటారో గాని, ఈయన ఆ టైంకి ప్రత్యక్షం... (నవ్వకు గాని,  మామయ్య, అత్తమ్మగార్ల  చిరుబురులు తగ్గించడానికి మావారి రంగప్రవేశం, చివాట్లు...) అయినా మనస్సు చివుక్కు మంటుంది. కామన్సెన్స్ ఉన్న ఆ తండ్రీకొడుకులు భోజనం చేసేటప్పుడు కంచం చుట్టూ అంట్లే. టేబుల్ మానర్స్ లేనిది వీరికి, వాల్ మానర్స్ లేనిది కాకులకి... మధ్యలో నాకు తిట్లు. మెల్లగా మనస్సు  సణిగిన గొణిగిన అన్నీ కాసేపటిలో మణిగినవే.  చిన్న భూతదయకే ఫలితమిది. ఇక మిగతా పుష్పాలు గురించి ఏం చెప్పను... నా హృదయపూదోటలో పూర్తిగా వికసించని విరులివి. విడవని విరులతో విష్ణువుని ఎలా పూజించను? ఆలోచనలు ఆపి, మరల శివానందలహరి చదవడం మొదలెట్టా... 
సదా మోహాటవ్యాంచరతి ... అనే శ్లోకంలో మనందరికోసం ఇలా ప్రార్థిస్తారు శంకరభగవత్పాదులవారు -

ఓ కపాలీ! ఆదిభిక్షు ! నా మనస్సు ఒక కోతివంటిది. అది ఎప్పుడూ సంసారవ్యామోహమనే  మహారణ్యంలో  సంచరిస్తూ, సుందరాంగనల చుట్టూ  తిరుగుతూ, ఆశారూప శాఖలపై దుముకుతూ, , క్షణం తీరిక లేకుండా అటుఇటు పరుగులు తీస్తుంటుంది. అందువల్ల నా మనస్సనే కోతిని నీకు అర్పిస్తున్నాను. దాన్ని భక్తి అనే  తాడుతో గట్టిగా కట్టి, నీ ఆధీనంలో ఉంచుకో స్వామీ! 
నిజమేకదా, మట్టి, బురదలలో ఆడుకొని ఇంటికొచ్చిన బిడ్డని తల్లి దరి చేర్చుకోదా? బిడ్డ ఎలా ఉన్నా, దరిచేర్చుకున్న తల్లిలానే, ఆ పరమాత్ముడు ఎలా నేనున్నా, నన్ను దరిచేర్చుకుంటాడని అనుకోగానే ఎంతో స్వాంతన. 
నా ఈ భావనలు అమ్మతో పంచుకుంటే,  సకల సృష్టికర్తకు ఈ ఫల పుష్పాదులు ఏపాటి?  మన ప్రతీ క్రియలోను భక్తి, నిష్టా శ్రద్ధ కలిగియుండుటయే పూజ. అయినా, తల్లీ! చివరలో  
మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం చమూపతే
యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే||
 

అంటూ క్షమాప్రార్ధన చేస్తాం కదమ్మా, మన పూజలో ఏ లోపాలున్నా క్షమిస్తాడమ్మా ఆ భగవంతుడు అని అమ్మ చెప్పాక చాలా హాయనిపించింది. 
అబ్బా... ఏమిటే ఈ మనస్సు? ఒక్క విషయంకై  ఇన్ని భావ పరంపరలా? ఈ మనస్సు ఎన్నో అనుభూతుల మోపరి కదా!   
భారతీ, నా ఈ లేఖ సుత్తిగా ఉండవచ్చు, కానీ, ఇంచుమించుగా ప్రతీ విషయం, నా భావాలు నీతో పంచుకోవడం నా అలవాటు కదా.  నాకు ముక్తి, ఆత్మసాక్షత్కారంల్లాంటి పెద్ద విషయాలు తెలియవు. కానీ, రోజూ వేకువనే చేసుకునే పూజ, సమయం ఉన్నప్పుడు కాస్త ఆ దైవపుస్తకాలు చదువుకోవడం, నామస్మరణం ..... దీని వలన ప్రతికూలతభావాలు ఎక్కువసేపు మనస్సులో నిలువక, ప్రశాంతంగా జీవనం సాగుతుంది. ఇదే నా చిరు సాధన. 
ఉండనా మరి,
నీ... శైలు. 

11, జులై 2018, బుధవారం

మ్యాజిక్ ట్రీ (కల్పవృక్షం) మ్యాజిక్ కౌ (కామధేనువు)

అమ్మమ్మా... అమ్మమ్మా...
నా చిట్టితల్లి శ్రీమాన్వి పిలుస్తూ పరుగు పరుగున వచ్చింది. కాస్త నెమ్మదిగా రావచ్చుకదా, పడిపోతావు ... అంటున్న, నా మాటలు వినిపించుకోకుండా,
నాకు మ్యాజిక్ లైట్ కావాలమ్మమ్మా ...
మ్యాజిక్ లైట్ ??? అదేమిటి? అదెక్కడ ఉంటుంది? నా ప్రశ్న వింటూనే...  

రా, చూపిస్తా... నా చేతిని లాగుతూ హాల్ లోనికి తీసుకు వచ్చి అల్లావుద్దీన్ అద్భుతదీపం ఫోటో చూపించి ఆ మ్యాజిక్ లైట్ కావాలని మారాం చేస్తుంటే, అసలు ఆ మ్యాజిక్ లైట్ ఎందుకమ్మా? అని అడుగుతుండగానే, తమ్మూస్ కు స్పైడర్ మాన్, సూపర్ మాన్, చోటాభీమ్,కారు బొమ్మలు, నాకేమో బుక్స్, క్రేయాన్స్, బార్బీ, సింద్రిల్లా బొమ్మలు బోలెడన్ని అడగాలమ్మమ్మా... అప్పుడు ఆ లైట్ లోని భూతం వచ్చి వెంటనే అన్నీ ఇస్తుంది కదా, తాతయ్య, నాన్న కొద్దిగానే కొంటారు కదా... ఆ మాటలు వింటూనే ప్రక్కనే వున్న నా సుపుత్రిక గట్టిగా నవ్వుతూ, మాన్వీ! భూతం లైట్ ఎందుకు, కల్పవృక్షమనే మ్యాజిక్ ట్రీ గాని, కామధేనువనే మ్యాజిక్ కౌ గాని అడుగు, భూతాలుండవందులో అని రెచ్చగొట్టింది. ఆపై మా అమ్మమ్మ మనుమరాల కబుర్లు ప్రక్కనపెడితే -

తన కోరికతో గుర్తుకొచ్చిన నా చిన్ననాటి ఓ జ్ఞాపకంకు వస్తాను -
నేను చదువుకునే రోజుల్లో - రమణి, ఇందిర, రాణి, మరికొందరు మిత్రులం తరుచుగా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మాలో రమణి కాస్త పెద్ద. తను బాగా మాట్లాడేది, మంచి మంచి కబుర్లు , కధలు చెప్పేది. ఒకసారి నిర్మల అనే అమ్మాయి 'అల్లావుద్దీన్ దగ్గరున్న అద్భుతదీపం నా దగ్గరుంటే ఎంత బాగుండునో' అని అంది. ఎందుకని అడగగా, మా అమ్మను రెండురోజులుగా అరిసెలు తినాలనిపిస్తుంది, చేయమ్మా అంటే, పెద్ద పండుగ వస్తుంది కదా, అమ్మమ్మ చేసి పంపుతుందిలే అంటుంది, అదే అద్భుతదీపముంటే ఎంచక్కగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అరిసెలు, జీళ్ళు, చక్కిలాలు తినవచ్చు కదా... తన మాటలకు అందరం నవ్వుకున్నాం. అప్పుడే రమణి ఏది కోరుకుంటే అది ఇచ్చే కల్పవృక్షం గురించి చెప్తూ, కల్పవృక్షం పూర్వం ఉండేదని, ఓసారి ఒకతను అడవి మార్గంలో పయనిస్తూ, ఓ చెట్టు నీడన కాసేపు సేద దీరుదామని ఓ చెట్టు చెంతన ఆగి, 'అబ్బా, ఇక్కడ ఎంత చల్లగా వుంది, తినడానికి ఏమైనా ఉంటే బాగుండును అని అనుకోగానే ఫలాదులు ప్రత్యక్షం ..... తిన్నాక కాస్త విశ్రమించాలనిలించిన వెంటనే చక్కటి పాన్పు ప్రత్యక్షం ..... ఆ పాన్పు పై కూర్చుంటూ, ఇదేదో మాయచెట్టులా వుంది, కొంపదీసి ఇప్పుడు భూతమేదో వచ్చి నన్ను మింగేస్తుందేమో .... అనుకునేంతలో భూతం ప్రత్యక్షమై మింగేసిందట. ఇదంతా తన యోగదృష్టితో చూసిన ఓ యోగి, ఆ చెట్టు చెంతకు వచ్చి , ఓ కల్పవృక్షమా! నీకు నమస్కారం, నీవు ఇక్కడ నుండి మాయమైపోవడం మంచిద'ని తలవగానే మాయమైపోయిందని చెప్పింది. 
ఆ తర్వాత కొంతకాలానికి మహర్షుల దగ్గర కల్ప వృక్షం, కామధేనవలుండేవని చదివాను. అటుపై మా తాతయ్యగారి వద్ద పుస్తక పఠనం, తాతయ్య చెప్పేకధలు, కబుర్లు ... (అప్పుడే లేశమాత్రంగా ఆధ్యాత్మిక అవగాహన అలవడింది) ఓసారి తాతయ్యగార్ని అడిగాను, కల్పవృక్షం, కామధేనువులు ఇప్పుడు ఎక్కడున్నాయని. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ... ఇత్యాదులు భూలోకంలో ఉండవు తల్లీ అన్నారు.  
మరి అవి ఉన్నట్లు మన పురాణ ఇతిహాసాలలో చదివాము కదా. మన పురాణాలలో ఉన్నటువాటికీ అంటే రామాయణాది ఘట్టాలకు చారిత్రాత్మిక ప్రదేశాలుకు ఆధారాలున్నాయి కదా. మరి అవి ఉన్నప్పుడు ఇవి ఎక్కడకు మాయమాయ్యాయి?   ప్రశ్నకు -
ఓ... అవి ఎవరి దగ్గర ఉన్నట్లు చదివావని అడిగారు.  వసిష్ఠుడు, జమదగ్ని, కపిల మహర్షి మొదలగు వారిదగ్గర ఉన్నట్లు చదివానని బదులిచ్చాను. ఆ...అలాగా, వారు ఎవరమ్మా? ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్ధం చేసుకో తల్లీ... నీవు పైన చెప్పిన వారంతా తమ తపస్సిద్ధి మహిమా విశేషమున మహా సిద్ధత్వం పొందిన మహర్షులు. వారంతా సిద్ధపురుషులు. వారి వారి సిద్ధత్వస్థితికి వారి వారి ఆశ్రమమునందు అవి సాకారమై నిలిచాయి. అవి వాళ్ళతోనో అంతరార్ధమాయ్యాయని గ్రహించాలి. 
తల్లీ!  ఈ మూడింటిని ఒక గోవు గానో, చెట్టుగానో, మణిగానో పరిగణించక, అవి దివ్యశక్తులని, అవి ఎలా ప్రాప్తిస్తాయో పరిశీలిస్తే బాగుంటుంది.
ముందో విషయం చెప్పు, ఇవి ఎక్కడ నుండి జనించాయి? 

క్షీరసాగర మధనం జరిగినప్పుడు అందులోనుండే ఉద్భవించాయి కదా... ముందు క్షీరసాగర మధనం అంతరార్ధం గ్రహిస్తే, ఇది సులభంగానే అర్ధమౌతుంది. క్షీరసాగరమధనం యొక్క అంతరార్ధం గురించి గతంలో ఓ టపా పెట్టాను కాబట్టి, దాని గురించి ఇక్కడ మరల ప్రస్తావించను. [ఆ టపా లింక్ ను ఇక్కడ చూడగలరు.] 
ఆధ్యాత్మిక సాధన యందు పురోగమించుతున్నప్పుడు ఎన్నో సిద్దులు ప్రాప్తమౌతాయి. అలా ప్రాప్తించినవే కల్పతరువు, కామధేనువులాంటివి. 

సాధకుడు ఆత్మవిచారణ చేయుచు, యోగధ్యానాదులచే ఆధ్యాత్మికోన్నతి చెందుతున్నప్పుడు, మొదట మనో మలినాది విషయవాసనలు నశించిన పిమ్మట సంకల్పసిద్ధి కలుగుట ప్రారంభమగును. ఈ సంకల్పసిద్ధిచే యోగనిష్ఠుని యొక్కక్క కోరిక ఫలవంతమగును. ఈ సంకల్పసిద్ధి పేరే కామధేనువు. అలానే, కొంతకాలమునకు యోగి జితేంద్రియుడగును. సంకల్పములు నశించును. నిస్సంకల్పస్థితి కల్గును. ఆ స్థితి పొందినవారి సమక్షమున ఏది చేయ సంకల్పించిన అది సిద్ది కల్గును. ఇదే కల్పవృక్ష సిద్ధత్వం. 
అంటే ఆధ్యాత్మిక తపమునందు -
ఎవరు జితకాములగుదురో అంటే కామ రహితులగుదురో అప్పుడు వారికి కామధేనుత్వ సిద్ధియును, 
ఎవరికి నిర్వికల్పస్థితి అనగా సంకల్పములు నశించునో (సర్వ ప్రకృతి సంకల్పములను జయించింతురో) అప్పుడు వారికి కల్పవృక్ష సిద్ధియును, 
ఎవరు పూర్ణంగా నిశ్చింతుడగునో అప్పుడు వారికి చింతామణిత్వ సిద్ధియును కలుగునని శ్రీ మలయాళ  సద్గురువు లాంటివారు తెలిపారు తల్లీ ... అని చెప్తూ, ఇలా అన్నారు -
సాగరమధనం జరుగుతుండగా కామధేనువు, కల్పవృక్షములు మొదలగునవి ఉద్భవించినను అమృతం దొరికేంతవరకు ఎలాగైతే క్షీరసాగర మధనం చేశారో, అలాగే ఆధ్యాత్మిక సాధకులు ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ, మధ్యలో ఎన్ని అద్భుత దివ్యసిద్ధులు సిద్ధించిన, వాటియందు ఆపేక్ష ఏర్పరచుకోకుండా, అమృతత్వమనే ముక్తిత్వం లభించేంతవరకు సాధన నుండి సడలిపోరాదు. ఇంతటి స్థితికి చేరిన మహర్షుల చెంతే ఈ కల్పతరువు, కామధేనువు, చింతామణులుంటాయని చెప్పగా, ఇదంతా వింటున్నవారిలో ఒకరు, ఏమిటో బాబయ్యా, అర్ధమయ్యి అర్ధంకానట్లు వుంది, ఇలాంటిసాధన సామాన్యులకు కష్టమే. మరి మాబోటి సామాన్యులకు గతేమిటని అడగగా, మనలాంటి సామాన్యులకు దృఢమైన భక్తి ఆ సర్వేశ్వరుని పట్ల ఉంటే చాలు, ఆయనే మనకు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి. ఇది నేను చెప్పడం కాదు, కృష్ణ పరమాత్మే గీత యందు ఇలా చెప్పారు - 
యో యో యాం యాం తనుం భక్తశ్రద్ధయార్చితుమిచ్ఛతి
తస్య తస్యాచలాం శ్రద్దాం తామేవ విదధామ్యహామ్
స తయా శ్రద్ధాయ యుక్తః తస్యారాధన మీహతే
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్హి తాన్

సకామభక్తుడు ఏయే దేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో, ఆ భక్తునకు ఆయా దేవతలయందే స్థిరభక్తి కుదురుకొనునట్లు , అలాగే ఆయా దేవతల ద్వారా నా అనుగ్రహముచే ఆయా భక్తుల అభీష్ట కామములను తీర్చగలను. 
ఆర్తో జిజ్ఞాసురర్ధార్ధీ జ్ఞానీ ... ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అను చతుర్విధ భక్తులకు ఆ పరమాత్ముడే కల్పవృక్షం.  

అటులనే, శివానందలహరి లో శ్రీ శంకరులవారు చెప్పారిలా -
ఆమ్నాయాంబుధి మాదరేణ సుమనస్సంఘా స్సముధ్యన్మనో 
మంథానం దృఢభక్తి రజ్జుసహితం కృత్వా మథిత్వా తత: 
సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం 
నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్య మాతన్వతే 

దేవతలు మందరగిరిని కవ్వంగా చేసి క్షీరసాగరాన్ని మధించి కల్పవృక్ష, చింతామణి, అమృతములను సంపాదించినట్లుగా విజ్ఞులు తమ మంచి మనస్సులను కవ్వంగా చేసి, దృఢభక్తి యనే త్రాడుకట్టి, వేదాలనే మహాసాగరాన్ని మధించి దానినుండి భక్తులకు కల్పవృక్ష కామధేను చింతామణి వంటి వాడును, నిత్యానందామృత మూర్తియు, మోహాలక్ష్మీ స్వరూపుడును యైన ఉమా సమేతుడగు సదాశివదేవుని పొందుచున్నారు.
మనం కూడా అలా దృఢభక్తిని ఏర్పరచుకొని ఆ పరమాత్ముని పాదములను పట్టుకుంటే ఆయనే మనకన్నీనూ... అని చెప్పారు మా తాతయ్యగారు. 
తన మ్యాజిక్ లైట్ కావాలనే కోరికతో, ఆనాటి ఈ నా మధుర జ్ఞాపకంను మననం చేసుకునేటట్లు చేసిన శ్రీమాన్వికి శుభాశిస్సులు. ఈ వివరణ అర్ధం చేసుకునే వయస్సు కాదు నా మనుమరాలిది. నా చిట్టితల్లి శ్రీమాన్వి పెద్దయ్యాక చెపుదామంటే ... అప్పుడు చెప్పేశక్తి నాకుంటుందో.... ఉండదో.... ఏమో... అందుకే ఇలా స్మరణ లో పదిలపరుస్తున్నాను. పెద్దయ్యాక చదివి తెలుసుకుంటుందన్న ఆశ.  

2, జులై 2018, సోమవారం

సీతమ్మకై, విధికై ..... చింతన, చింతలేలా?

వైదికకాలంలోని అన్ని పురాణేతిహాసగాధలు ధార్మికంగా ఉంటాయి. సందేశాత్మకంగా ఉంటాయి. ఇది గ్రహించడం తరతమ ఆలోచనాబేధాలను బట్టి, యోగ్యతను బట్టి అర్ధమౌతుంటాయి. కొన్ని కొన్ని తమ తమ విజ్ఞతతో అందుకోవాల్సియుంటుంది. సత్యం తెలుసుకోవాలంటే, అవగాహనను పెంచుకుంటూ, ప్రతీ ఘటనను పారమార్థికంగా పరిశీలించండం అలవర్చుకోవాలి. 

ఈ మధ్య ఒకరు రెండు ప్రశ్నలడిగారు - 

1. గర్భవతి అయిన సీతమ్మను అడవిలో విడిచిపెట్టేశారే ... ఇది శ్రీరామునికి ధర్మమా? ఆమె ఏమైనా చేసుకుంటే? 
2. తలరాతను తప్పిచుకోలేమా?
ముందుగా తల్లి సీతమ్మ గురించి అర్ధం చేసుకుందామంటూ ... పెద్దలు చెప్పగా... విన్నదీ, చదివినదీ ... నా చిరు అవగాహన మేరకు, ఇలా బదులిచ్చా - 
                          

                  
భగవంతుడైనా మానవునిగా జన్మించినప్పుడు మానవునిగానే జీవించాలి. ప్రకృతిలోనికి దిగివచ్చిన పరాత్పరుడు ప్రకృతి విధి విధానాన్ని అనుసరిస్తూనే, అనుభవిస్తూనే, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ మానవుడు మాధవుడుగా ఎలా మారాలో తెలియజేయాలి. లోకాన్ని రక్షించాలనుకున్నప్పుడు ఈ లోకంలో ఒకరిగా బ్రతకాలి కాబట్టే, ఎంతో సహనంతో సాదాసీదాగా ఓ చక్కటి భార్యగా తన భర్తను అనువర్తిస్తూ జీవించిన  మహా సాధ్వి సీతమ్మతల్లి. ఎంతో విజ్ఞత గల సీతమ్మతల్లి, తన ప్రాతివత్యంతో రావణుడు తనని ఎత్తుకెళ్లినప్పుడే సంహరించగల ధీశాలి అయినను, తన భర్తచే రాక్షస సంహారం జరిపించి, ధర్మనిరతి, సత్య ఔన్నత్యం, రాజనీతి,  మానవుడు మాధవుడుగా ఎలా మారాలో రాములవారి ద్వారా లోకానికి తెలియజెప్పాలని భావించిన దొడ్డ యిల్లాలు. అటువంటి సీతమ్మ, శ్రీరాముని వంశాకురం తన గర్భంలో జీవం పోసుకుంటున్నప్పుడు, ఆ వంశమును నిలబెట్టాలనే తపిస్తుంది తప్ప, తాను ఏమీ చేసుకోదు. సీతమ్మతల్లి భర్త మనసెరిగిన ధర్మానువర్తురాలు.   ఇప్పటికాలంలా సరైన ఉత్తీర్ణత లేదనో, అనుకున్న కళాశాలల్లో సీటు రాలేదనో... చిన్ని చిన్ని ఇబ్బందులకు అవివేకపు ఆలోచనలతో ఆత్మహత్యలు చేసుకునే మానసిక దుర్బలత ఆనాడు లేదు. ఈ కలియుగపు దృష్టితో ఆ యుగాన్ని వీక్షించడం తగదు. 
ఇక నా రామయ్యతండ్రి ధర్మ నిరతి - 
సత్యం ని అసత్యం కప్పగలదు గానీ, సత్యంను కాల్చలేదు. కానీ, సత్యం వెలుగుచూస్తే అసత్యం బూడిదవుతుంది. సత్యమైన సీతను అగ్ని కాల్చలేదు.  ఈ సత్యంను అందరూ గ్రహించాలనే పరాయివాని చరలో కొంతకాలం వుండివచ్చిన సీతను రాముడెలా స్వీకరించాడన్న లోకాపవాదు రాకూడదనే సీతమ్మచే అగ్నిప్రవేశం చేయించాడు. అయినను  జనాపవాదు తప్పలేదు. 
                        
ఇప్పుడు శ్రీముని ముందు రెండు ధర్మ ప్రశ్నలున్నాయి - 
1. రాజ్యాధికారం వంశపారంపర్య సంక్రమణం. రాజ్యంలో అందరూ నన్ను అంగీకరించి రాజుని చేశాకా, రాజధర్మంను పాటిస్తూ సీతమ్మను విడిచిపెట్టడం.  
2. వివాహధర్మానుసారాం భర్తగా భార్యను జీవితాంతం పోషించాలి కాబట్టి సీతకోసం రాజ్యాన్ని విడిచిపెట్టడం. 
విడిచిపెట్టడం - అందరికోసం ఒకరినా ... ఒకరికోసం అందరినా...    

అయితే ధర్మసూక్ష్మం నెఱిగినవాడు శ్రీరామచంద్రుడు. రాజ్యపాలనను విడిచిపెట్టడం స్వధర్మానికి విరుద్ధం. ఆ కాలంలో రాజధర్మాన్ని అనుసరించి ఒక రాజు తన ప్రజలకు సుస్థిరమైన పాలన, రక్షణ అందివ్వడానికి అవసరమైతే స్వసుఖాన్ని, ప్రాణాన్ని త్యజించాలి. రాజ ధర్మం సర్వ సమ్మతం. భర్తధర్మం వ్యక్తిగతం. అందుచే సీతా పరిత్యాగం తప్పనిసరైంది. అలా కాకుండా, సీతకై సింహాసనాన్ని విడిస్తే - వ్యక్తిగత సౌఖ్యంకై వంశపరువుని, రాజధర్మాన్ని తప్పినట్లవుతుంది. స్వధర్మాన్ని వీడినట్లవుతుంది. ఈ రీతిలో చేసినట్లయితే, తన పూర్విజులు స్వాయంభువ మనువు నుండి తన తండ్రి దశరధుని వరకు కళంకాన్ని, తన తదుపరి వంశీకులకు అధోగతిని తెస్తుంది. ఇది వంశ ప్రతిష్ఠాభంగం. అందుచే గర్భవతి అయిన సీతమ్మను విడిచిపెట్టాడు. అదీ ఎక్కడ... నట్టడవిలో కాదు, నయవంచకుల నడుమ కాదు, కీకారణ్యంలో కాదు, కీచకుల నడుమ కాదు, మహర్షులు ఋషులు నడయాడే సురక్షిత పవిత్ర ప్రాంతమునకు దగ్గర్లో. ఇది అందరూ గుర్తిస్తే బాగుంటుంది. 


మనకు అర్ధమైన, కాకున్నా మన పురాణ ఇతిహాసాలలో ప్రతీ ఘటన వెనుక చక్కటి పరమార్ధముంటుంది. ఇది సత్యం. అందుకే - త్రికరణశుద్ధిగా శ్రమించి శోధించి, ఛేదించి సాదించు ... లే, మేల్కో అని అంటారు స్వామి వివేకానందులవారు. 

త్రేతా, ద్వాపర యుగములందు పంటలు పండకపోయిన, అకాల మరణములు చెందిన, ఏ కష్టం ఏర్పడినా... రాజునే ప్రశ్నించేవారు. రాజా! నీ పాలనలో ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, అందుకే ఇలా జరుగుతుందని నిందించేవారు. రాజు మహర్షులతో, మంత్రులతో ఆ తప్పిదం ఎక్కడ జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి, సరిదిద్ది ధర్మానుసారం పరిపాలన సాగేది. అటువంటి రాజపాలనలో అందరూ ఎంతో సుభిక్షంగా సురక్షితంగా ఉండేవారు. 

ఆ యుగంలో ధర్మం - సత్యం అనే పాదం కుంటుపడి మిగిలిన మూడు పాదాలపై నడిచింది. సత్యం మసకబారితేనే సీతారాములకు జనాపవాదు తప్పలేదు. ఈ యుగంలో ధర్మం - మూడుపాదాలు కొరవడి, దానం అనే  పాదంపై నడుస్తుంది. అందుకే ఇన్ని వాదనలు.కుతర్కాలు. తర్కానికి అందదు సత్యం. 





                                                               కర్మ - ఖర్మ 

తలరాతని తప్పించుకోలేమా? 
అసలు తలరాత అంటే ఏమిటీ?

ఆయుష్షు తీరో, జవసత్వాలుడిగో నశించిపోయిన భౌతిక శరీరాలు వారసత్వం భరించలేక మరోశరీరానికి కర్మల్ని బదిలీచేస్తాయి. శరీరాలు నశించిన కర్మశేషాలు నశించవు.  వెన్నంటే వస్తాయి, వెంటాడుతునే ఉంటాయి. ఆ కర్మశేషాలనుభవించడానికి మరల మరల జన్మించడం. 
మనకి ఆ కర్మశేషాలు గుర్తుండక పోవచ్చు కానీ, మరిచిపోయినంత మాత్రాన మనవి కాకుండా పోవు. ఇదే విధి లేదా తలరాత లేదా లలాటలిఖితం. 

కర్మలకు మరణం లేదు. మనిషి మరణించినా కర్మలు మరోజన్మకు పయనిస్తాయి. గతజన్మ కర్మలు కంటికి కనిపించవు. కానీ, ఈ జన్మలో అనుభూతమౌతాయి. పూర్వజన్మల కర్మబీజ ఫలాలే విధిరాతలు. గతజన్మల కర్మలశేషఫలంకు అంటే విధికి , నేటి కర్మల ఫలితంకు అనుసంధానింపబడి సాగుతుంది ఈజన్మ జీవనయానం.
సాధారణంగా కష్టకాలంలో లేదా దుఃఖ సమయంలో గాని, అనుకునేరీతిలో జీవనం సాగనప్పుడు, అనుకోని అవాంతరాలప్పుడు అనిపిస్తుంటుంది - ఇదంతా మన తలరాత అని. మనచేతిలో ఏదీలేదు, తలరాత ఎలా వుందో అలా జరుగుతుంది, తప్పించుకోలేమని భావిస్తాం. ఇదో నిరాశావాదం.  ప్రారబ్ధమే మనిషిని నడిపిస్తే, అంతా విధిరాత ప్రకారమే జరిగితే ఇక మనిషి చేయాల్సింది ఏమీ లేదా? విధి చేతిలో మనం కీలుబొమ్మలమైతే ఇక మనం చేయగలిగింది ఏముందీ?  ఇది నా తలరాత అని అనుకున్నంతకాలం ఆవేదన తప్పదు, నిరాశ వీడదు.







జన్మించిన ప్రతీజీవి విధికి తలవొగ్గక తప్పదు. కానీ, ప్రతిఒక్కరికి విధిని ఎదిరించేశక్తి వుంది.  విధి బలీయమైనదే కావొచ్చు... కానీ, దానిని మార్చుకోవచ్చు... వజ్ర సంకల్పంతో, నిరంతర సాధనతో, అకుంఠిత భక్తితో.  ఇందుకు ఉదాహరణంగా కొన్ని గాధలు గుర్తుచేసుకుందాం -


విధిరీత్యా అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహమాడి, తన ఆత్మ విశ్వాసంతో,  వజ్ర సంకల్పంతో యముణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి - సత్యవంతుల కధ మనందరికీ విధితమే. 
పదహారు ఏళ్ళు మాత్రమే ఆయుష్షు ఉన్న మార్కండేయుడు తన అకుంఠితభక్తితో యముణ్ణి జయించి, శివుని ఆశిస్సులతో చిరంజీవత్వాన్ని పొందలేదా?
చదువునందు రాణించలేక, తను చెప్పింది అవగాహన చేసుకోలేకపోతున్న శిష్యుని హస్త సాముద్రికాన్ని పరిశీలించి, నాయనా! నీకు విద్యారేఖ లేదు, చదువుకునే యోగం లేదు, కాబట్టి నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లి, తగిన వృత్తిని స్వీకరించడం మంచిదని చెప్పిన గురువుగారి మాటలకు మనస్సు భారమై, ఇంటికి బయలుదేరి, మార్గమధ్యంలో దప్పికై, ఓ రాతిగిలక బావి దగ్గర ఆగి, దాహం తీర్చుకుంటూ, తాడు ఒరిపిడికి అరిగిన ఆ రాతిగిలకను చూసి, బలహీనమైన తాడువల్ల రాయే అరగగా, నేను సాధనతో విద్యను ఆర్జించలేనా అన్న దృఢ నిశ్చయంకు వచ్చి, పదునైన రాతిముక్కతో చేతిపై విద్యారేఖను గీరుకోని, తిరిగి గురువు చెంతకు వెళ్ళి, నిరంతర సాధనతో అనతికాలంలోనే విద్యను అభ్యసించి, సంస్కృత వ్యాకరణం వ్రాసిన పాణిని దృఢ సంకల్పం తన రాతను మార్చలేదా?

చిన్నప్పుడు మా అమ్మమ్మగారింటికి వెళ్ళినప్పుడు, అమ్మ, మా మేనమామగారు కష్టసుఖాలు చెప్పుకునేవారు. ఒకోసారి అమ్మ - మన తలరాతలిలా ఏడ్చయిరా అన్నప్పుడు, చేసుకునేవారికి చేసుకున్నంత అక్కాయ్ ... అయినా కష్టాలు మంచికే, అన్నీ తెలుసుకోవచ్చు, అయినవారు ఎవరో, కానివారు ఎవరో తెలుసుకోగలుగుతాం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనుభవించక తప్పదని తెలిసి మంచిగా బ్రతకాలని చూస్తాం. ఎప్పుడు కంటే దేవుణ్ణి ఎక్కువ తలుస్తాం, కష్టం గట్టెక్కాక దేవునిదయవలన బయటపడ్డామని తెలుసుకొని, ఎల్లవేళలా దేవుణ్ణి నమ్మండని పిల్లలకు మంచి చెడు చెపుతాం. అన్నీ మన మంచికేనే ... అనేవారు.  


అందరం ఒకటి గుర్తుంచుకోవాలి -  మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయం. విధిరాతలు స్వయంకృతం.  స్వీయకర్మలే మన విధిరాతలు. అంటే మన విధిరాత విధాతలం మనమే. గతజన్మల  కర్మశేషాలే నేటి విధిరాతలయినట్లు, నేటి కర్మలే మరుజన్మ విధిరాతలు. కర్మలు చేయడం అనివార్యం. ఆ కర్మలలో కొన్ని ప్రారబ్దాలుగా మూటకట్టుకోవడం నిజం. అవి అనుభవించడానికి జన్మించడం తప్పదు. ఇలా పుట్టడం ... గిట్టడం ... తప్పదా ఈ చక్రపరిభ్రమణం ... రాదా ముక్తి?
వస్తుంది ... ఎప్పుడు? గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు... 'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః' 
ఈశ్వరార్పణ బుద్ధితో, భగవత్ కైంకర్యబుద్ధితో కర్మలు చేస్తే జ్ఞాన మోక్ష సిద్ధులు ప్రాప్తమౌతాయి. 


బ్రహ్మణ్యాధాయ కర్మాణి  సంగం త్యక్త్వా కరోతి యః 
లిప్యతే న స పాపేన పద్మపత్ర మివామ్బసా 
ఎవరు కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి, ఆసక్తి లేకుండా తన కర్మలు  ఆచరిస్తారో, అటువంటి వారు నీటిచే అంటబడని  తామరాకు వలె పాప ఫలితంచే ప్రభావితులు కారు. 

ప్రతీ ఒకరు చింత చింతన వీడి సానుకూల దృక్పధం ఏర్పరుచుకోవాలి.



ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం కలిగి ఉండాలి. 
సానుకూల భావం సాధనా సోపానం. 
సంకల్పం దృఢమైతే సాఫల్యం సమక్షంలోనే.