"శ్రీదేవి అపరాధ స్తోత్రరత్నమ్"
అమ్మా! నాకు నీ మంత్రము తెలియదు, నీ యంత్రమూ తెలియదు, నిన్ను స్తుతించడమూ తెలియదు, నిన్ను ఆవాహన చేయడమూ తెలియదు, నిన్ను ధ్యానించడమూ తెలియదు, నీ గాధలు చెప్పడమూ తెలియదు, నీ ముద్రలూ తెలియవు, అయ్యో...ఇవేవి తెలియవని నీకోసం విలపించడమూ చేత కాదు. కానీ, అమ్మా! నిన్ను విధేయతతో స్మరిస్తే, నా సమస్యలన్నీ సమసిపోతాయని మాత్రం తెలుసు.
అమ్మా! విధివిధానాలు తెలియకపోవటంచేత, ధనం లేకపోవటంచేత, నా బద్ధకంచేత, ఆశక్తతచేత నీ పాదపద్మములు సేవించుటలో లోపం జరిగింది. అమ్మా! నన్ను క్షమించు, నన్ను క్షమించే క్షమత నీలో ఉంది. అందరినీ ఉద్ధరించే తల్లివి...నీకు తెలియనిది ఏముందీ? లోకంలో చెడ్డబిడ్డ వుండవచ్చేమో గానీ చెడ్డతల్లి ఉండదు కదా.
అమ్మా! ఈ భూమిపై సరళమార్గంలో, సత్యమార్గంలో నడయాడే సాధుజనులైన బిడ్డలు చాలామంది ఉన్నారు. కానీ; వారందరి నడుమ నిలకడలేని, మందమతినైనవాడను నేనొకడును ఉన్నాను. అయినను, అమ్మా! సర్వమంగళా! జగజ్జననీ! నేనూ నీ బిడ్డనే కాబట్టి, నన్ను నీవు వదిలివేయక ఆదరించి కాపాడు తల్లీ. ఎందుకంటే, లోకంలో చెడ్డబిడ్డ వుండవచ్చేమో గానీ చెడ్డతల్లి ఉండదు కదా.
అమ్మా! జగన్మాత! నేను నీ పాదపద్మములు ఎన్నడూ సేవించలేదు, ధనం లేక నీ సన్నిధిన సమర్పించిన నైవేద్యమూ ఏమీలేదు, కానీ; అమ్మా! నీవు మాత్రం నాపై నిరుపమానమైన మాతృవాత్సల్యం చూపించక తప్పదు. ఎందుకంటే, లోకంలో చెడ్డబిడ్డ వుండవచ్చేమో గానీ, చెడ్డతల్లి ఉండదు కదా.
ఏ దేవతా పూజావిధానాలు ఏమీ చేయని నాకు, 55సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు నేను చేయగల్గినది నీ శరణు కోరడమే. ఓ లంబోదరజననీ! ఇప్పుడు నీ కృప కలగకపోతే నాకు దిక్కెవరు? నిరాశ్రయుడైన నాకు, నీవుకాక వేరెవ్వరు ఇవ్వగలరు ఆశ్రయం?
అమ్మా! నీకై చేసే ప్రార్ధన చెవిన పడినంత మాత్రమునే - ఛండాలుడు(కుక్కమాంస భక్షకుడు)తేనెలూరు తియ్యని మాటలతో మాటకారి అవుతాడు. దరిద్రుడు కోటి కనకరాశితో చిరకాలం అడ్డులేకుండా విహరిస్తాడు. అమ్మా! అపర్ణా! ఇక నీకై భక్తిగా ప్రార్ధన చేసిన వారికి ప్రాప్తించే ఫలితాన్ని కొనియాడడం సాధ్యమా?
అమ్మా! చితాభస్మధారి, విషభోక్త, దిగంబరుడు, జటాధారి, కంఠంలో పాములను ధరించేవాడు, పశుపతి, కపాలమును భిక్షపాత్రగా కలవాడు, భూతాలకి అధిపతి అయిన శంకరుడు, ఈ జగత్తంతటిచే ఈశ్వరుడుగా ప్రార్ధింపబడుతున్నాడంటే... భవానీ! అది నీ పాణిగ్రహణ ఫలమేనమ్మా.
అమ్మా! చంద్రవదనా! నాకు మోక్షం పొందాలనే కోరిక లేదు, అనంత ఐశ్వర్యం కావాలనీ లేదు, ప్రాపంచిక విజ్ఞానమూ వద్దు, సుఖాలు మళ్ళీ అనుభవించాలనీ లేదు, కాబట్టి అమ్మా! నా శేషజీవితం మృడానీ, రుద్రాణీ, శివశివ భవానీ అంటూ నీ నామస్మరణతో గడిపేసేలా అనుగ్రహించమని వేడుకుంటున్నాను తల్లీ.
అమ్మా! శ్యామా! నిన్ను వేదోక్తంగా షాడోపచారాలతో పూజింపలేదు. సరికదా, పరుషమైన పదాలతో దూషించాను. చేయని చెడు తలపు, మాట్లాడని చెడు మాట లేదు. కానీ, ఓ శ్యామా! నీవు ఈ అనాధ యందు కృప చూపు. అమ్మా! నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ అభాగ్యునిపై నీవు దయ చూపుతున్నావంటే, అది కేవలం కరుణామయమైన నీ తత్త్వానికి ఉచితమైన నడవడి కావడంవల్లనే తల్లీ.
అమ్మా! కరుణాసముద్రా! ఆపదల యందు నిన్ను స్మరిస్తున్నానని తప్పుగా భావించకమ్మా. దయాసాగరీ! ఇది సహజమే కదమ్మా ... ఆకలిదప్పులున్నప్పుడే, బిడ్డలు తల్లిని స్మరిస్తారు.
అమ్మా! జగన్మాత! నాపై నీవింత దయ కలిగి వుండండంలో ఆశ్చర్యపడాల్సినదేమీ లేదు. సహస్రాధికమైన తప్పులు చేసినా సరే, ఏ తల్లీ తన బిడ్డను ఉపేక్షించదు కదమ్మా.
అమ్మా! నాతో సమానమైన పతితుడు వేరొకరు లేరు. అలాగే మహాపాపాలను సైతం ధ్వంసం చేయటంలో నీకు సరిజోడు లేరు. ఓ మహాకాళీ! ఇది దృష్టిలో వుంచుకొని నన్ను బ్రోచుటకు ఏది యోగ్యమో అది చేయు.
"ఆమె - అమ్మ"
న మాతుః పరదైవతమ్ ... కన్నతల్లిని మించిన దైవం లేదు... అంటుంది శాస్త్రం. కన్నతల్లే దైవమంటే, అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ... ఆ జగన్మాత గురించి చెప్పేదేముంది? ఆమె విశ్వానికి "అమ్మ".
"ఆమె - శ్రీమాత"
లోకంలో జన్మనిచ్చిన మాత - జన్మనిచ్చి, లాలించి, పోషించి, పెంచి, పెద్దజేసి, వృద్ధాప్యంలో బిడ్డలపై ఆధారపడడం సహజం. కానీ, సృష్టి స్థితి లయకర్తయైన ఆ జగన్మాతది శ్రీమంతమైన మాతృత్వం. అందుకే ఆమె "శ్రీమాత".
శ్రీ = "శ"కారం +"ర"కారం + "ఈ"కారం.
"శ"కారం ➡ ఆనందవాచకం.
"ర"కారం ➡ తేజోవాచకం.
"ఈ"కారం ➡ శక్తివాచకం.
తేజోమయానందశక్తి స్వరూపిణి "అమ్మ". అందుకే ఆమె "శ్రీమాత".
శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, బుద్ధి, ధర్మం, సంపత్తి, విభూతి, విద్య, శోభ... ఇవన్నీ అమ్మ అనుగ్రహం. వీటన్నిటికి అధిష్టాన దేవత అమ్మే. అందుకే ఆమె "శ్రీమాత".
"ఆమె - లలితాపరాభట్టారిక"
సృష్టికి మూలం శక్తి. వైదిక శాస్త్రల వచన ప్రకారం విశ్వరచనకు మూలం 'ఈక్షణశక్తి'. కనుచూపులతోనే ఈ జగద్రచనను కొనసాగించినది పరమేశ్వర శక్తి. ఈ చరాచర జగత్తుని నడిపించేది ఆ శక్తే. సర్వశక్తులకు మూలం ఈ చైతన్యమే. కంటికి కనబడకుండా సూక్ష్మరూపంలో అంతటా అందరిలో వున్న శక్తుల సముదాయానికే 'పరాశక్తి, మహాశక్తి' అని పేర్లు. ఆ కటాక్ష రూప చైతన్యాన్ని 'విశ్వపోషణ చేసే మాతృరూపం'గా ఆరాధించడం మన సంప్రదాయం (శాక్తేయం).
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ... రెప్పలు మూయడంతో విలయాన్నీ, తెరవడంతో సృష్టినీ, చూపుల ప్రసరణతో స్థితినీ కొనసాగించే చైతన్యశక్తి శ్రీలలిత. శక్తికి అధిష్టాన దేవత పరాశక్తి. నరాయణం నుంచి నారాయణం వరకు సమస్త సృష్టిని నిలిపి కాపాడేది ఆ పరాశక్తే. అందుకే ఆమె "లలితాపరాభట్టారిక".
"ఆమె"
సృష్టి స్థితి లయకారిణి. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సుస్వరూపిణి. శ్రీవిద్యా స్వరూపిణి, ఆది పరాశక్తి, పరబ్రహ్మతత్త్వమయి, అఖిలాండకోటి బ్రహ్మండ భాండోదరి, సర్వవేద వేదాంతసారిణి, శాస్త్ర సాహిత్య సమభూషిత, విశ్వమాత, విజ్ఞానమును ఒసగే జ్ఞాన ప్రదాత్రి, ప్రకృతికి ప్రాణదాత్రి, ప్రేమను పంచే హృదయనేత్రి, అవ్యాజ కరుణామూర్తి, సౌభాగ్యాలను ప్రసాదించే శుభకరి, అనేక రూపాల్లో కరుణించే అనంతరూపిణి.
శక్తి ఏ రూపంలో ఉన్నా, అది ఆ ఆది పరాశక్తి స్వరూపమే. ప్రపంచమంతా ఆదిశక్తి సంభరితం. శక్తి కానిది, లేనిది ఈ సృష్టిలో లేదు. జగమంతా ఆ జగన్మాత విశేష విన్యాసమే. 'నిర్గుణము, సూక్ష్మము, శుద్ధచైతన్యం' శ్రీ జగన్మాత మూలతత్త్వం.
'శక్తి యొక్క అంతర్ముఖం - ఆత్మ.
శక్తి యొక్క బహిర్ముఖం - ప్రకృతి'.
సర్వదేవతల సమన్విత శక్తి రూపం అమ్మ. వీక్షణ శక్తి గల పరమాత్మను ఉపాసన సంప్రదాయంలో అనేక నామాలతో ఆరాధిస్తుంటారు. అమ్మకు అసేతు హిమాచలంలో ఎన్ని నామాలో, ఎన్ని విభూతులో! అష్టాదశ శక్తిపీఠాలలోనే కాదు, గ్రామగ్రామమున, వాడవాడన ఎన్ని దేవతల రూపాలో. గ్రామదేవతలు కూడా జగన్మాత అంశలే. కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కలకత్తా కాళీ, ముత్యాలమ్మ, తలుపులమ్మ, పోలేరమ్మ, కుంచుమాంబ ..... ఒకటని ఏముంది? ఊరు ఏదైనా, పేరు ఏమైనా, అన్నీ... ఆ ఆదిశక్తి ప్రతిరూపాలే. అనేక నామాలతో అమ్మ ఆరాధించబడుతున్నా వాస్తవానికి నిరాకారబ్రహ్మ యొక్క శక్తియే వ్యక్తరూపంలో ఇలా పిలవబడుతుంది.
అమ్మా!నా బలహీనతలన్నీ నీకు తెలుసమ్మా. లోపల మనోశుద్ధత కావడడంలేదు. శాస్త్ర విధులను ఎరుగను. నిన్ను ఏ స్తోత్రాలతో స్తుతించలేను. తల్లీ! నా అనంత అపరాధాలను క్షమించి దయతో నన్ను ఉద్ధరించు. అమ్మలగన్నయమ్మవు, నా అవసరాలు నీకు తెలియనివా? అడగకపోయినా నాకు కావాల్సింది ఎలాగూ నీవు ఇస్తావు. ఎందుకంటే నీవు అమ్మవు కాబట్టి! అయినను అల్పురాలిని... అడగకుండా ఉండలేను... గాఢభక్తిని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించు. ఈ అజ్ఞానురాల్ని అత్యంత ఆర్ధతతో అక్కున చేర్చుకోమ్మా... నీవు నా అమ్మవు...నేను నీ బిడ్డను...కనుక నీవు నన్ను చూసుకుంటావ్... అదే నా విశ్వాసం... అందుకే నాకు ఈ ప్రశాంతత!