అక్కడక్కడ అప్పుడప్పుడు వినబడే ప్రశ్నలు -
దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనిపించడు?
ఇటువంటి ప్రశ్నలు భగవంతునిపై ఆర్తితో అడిగేవారు కొందరయితే, సంసార ఆవేదనతో అడిగేవారు కొందరు, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో అడిగేవారు మరికొందరు. నిజానికి ఈ ప్రశ్నలకు మనఋషులు, గురువులు, పెద్దలు...ఎందరో ఎన్నో విధాలుగా సమాధానం తెలిపారు. మన పురాణాలు, శాస్త్రాలు కూడా స్పష్టంగా సమాధానం తెలుపుతున్నాయి. భాగవతంలో గజేంద్రుడు ఆర్తిగా ప్రార్ధనతో ప్రారంభించి, ఆవేదనతో "కలడు కలండనెడువాడు కలడో లేడో"...అని సందేహంతో ప్రశ్నించి, చివరికి సమర్పణాభావంతో(శరణాగతి) ఒదిగిపోయి, ఏ రీతిలో నారాయణుడిని దర్శించుకున్నాడో అందరికీ విధితమే.
పుష్పే గంధం తిలే తైలం కాష్ఠేఽగ్నిం పయసి ఘృతం |
ఇక్షౌ గుడం తథా దేహే పశ్యా ఽ త్మానం వివేకతః ||
పుష్పములో సుగంధం, నువ్వులలో నూనె, కట్టెలలో అగ్ని, పాలలో నెయ్యి, చెరకులో బెల్లము ఉన్నట్లుగా... దేహములో ఆత్మలా ఉన్న పరమాత్మను వివేకంతో దర్శించాలి.
మనలో పవిత్రంగా ఉన్న పరమాత్మను క్రియల్లోనే వెతకాలి.
మనం చేసిన క్రియలచే ఎలాగున సుగంధం, నూనె, నిప్పు, నెయ్యి, బెల్లం ప్రత్యక్షముగా గోచరించునో, అలాగునే వివేకజ్ఞానంచే దేహంలో నుండు ఈశ్వరున్ని చూడగలం.
రాయి ఒక ఉపకరణం. రాయి తనకు తానుగా శిల్పంగా మారదు. రాయిని శిల్పంగా మలచాలన్న సంకల్పం శిల్పికి రావాలి. శిల్పాన్ని నైపుణ్యంగా చెక్కడానికి ఉలి లాంటి ఉపకరణాలు కావాలి. ఆ ఉలితో రాయిలో వ్యర్ధరాయిని తొలగిస్తూ, శిల్పాకృతికి ఉండాల్సిన రాతిని నేర్పుగా గుర్తిస్తూ, కృషితో శిల్పాన్ని వెలికి తీయాలి. అట్లే, దేహం కూడా ఓ ఉపకరణమే. దేవుణ్ణి చూడాలనే సంకల్పంతో, చిత్తశ్శుద్ధి అనే ఉపకరణంతో మనలో పేర్కొన్న అజ్ఞానం అనే వ్యర్ధాన్ని తొలగించి సాధనతో లోపలున్న దైవాన్ని గుర్తించి దర్శించాలి.
చిత్తశుద్ధి అంటే నీతి నియమాల జాబితా కాదు. చిత్తశుద్ధి అనేది మీరుండే తీరు. మీరు ఆలోచించే పద్దతి. ఇంకా మీరు ప్రవర్తించే విధానం.
- సద్గురు జగ్గీవాసుదేవ్
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల వంటివి జయించినప్పుడే, అంతఃశుద్ధి కలుగుతుంది. అంతఃశుద్ధి లేని సాధన సత్ఫలితం ఇవ్వదు. రావణుడు, హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు చేసిన సాధన ఎవరికీ సాధ్యం కాదు. కానీ; కామ క్రోధాలు జయించలేని కారణంగా, వారు పొందిన అద్భుతమైన వరాలు కూడా వారిని రక్షించలేకపోయాయి. అందుకే అంతఃశుద్ధి అనేది అత్యవసరం. మనస్సు నిర్మలంగా ఉంటే అజ్ఞానం తొలగి నిశ్చలమైన అంతరంగమున అంతర్యామి గోచరిస్తాడు. కలుషిత మనస్సుతో చైతన్యాత్మను చూడలేం.
శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్లు -
న తు మాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ | |
ప్రాకృతములైన ఈ నేత్రములచేత విశ్వరూపధరుడనగు నన్ను చూచుటకు నీవు శక్తుడవు గావు. కావున అప్రాకృతమైన (దివ్య) నేత్రములిచ్చుచున్నాను. ఆ నేత్రములచే ఈశ్వరశక్తి చూడుము.
చిత్తైకాగ్రత, చిత్తశుద్ధి అనే దివ్యనేత్రాలతో పరమాత్మను చూడగలం.
సూర్యుడు సర్వత్ర సమానముగా భూమియందు ప్రకాశించుచుండినను స్వచ్ఛముకాని గోడ మట్టి రాయి మొదలగు వాటిలో ప్రతిబింబించుటలేదు.అలాగునే ఆత్మయు పరమాత్మయు సమానముగా అందరిలో వెలుగుచున్నప్పటికిని రాగద్వేష విషయాది దోషరహితమైన శుద్ధబుద్ధియందు మాత్రమే ప్రతిబింబించును. కావున చిత్తశుద్ధికై ప్రయత్నించాలి.
సదా సర్వగతో ఽ ప్యాత్మా న సర్వత్రావభాసతే |
బుద్ధావేవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబిమ్బవత్ ||
- శ్రీ శంకర భగవద్పాదులు (ఆత్మబోధ)
ఆత్మ సర్వవ్యాపకమైనను, సర్వత్ర ప్రకాశించుట లేదు. పరిశుద్ధ దర్పణం నుండే బింబం గోచరమగులాగున, నిర్మలమైన బుద్ధి యందే ఆత్మ శోభించును.
మనఋషులు, గురువులు, పెద్దలు ఏమని బదులిచ్చారో గుర్తుచేసుకుందాం ఓసారి -
ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ, ప్రపంచ మంతా తిరిగాడుతుండగా, ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడగా... అప్పుడు ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది -
భక్తుడు: స్వామి! పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉంటాడు?
మహర్షి: చిరునవ్వు నవ్వుతూ, ఒక మహా వృక్షం చూపించి, అది ఏమిటి నాయనా?
భక్తుడు: అది వృక్షం.
మహర్షి: ఓహో వృక్షమా! ఎలా వచ్చింది?
భక్తుడు: విత్తనం ద్వారా వచ్చింది స్వామీ.
మహర్షి: సరే, అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు...
భక్తుడు: ఎందుకు స్వామి? మహావృక్షం కదా! త్రవ్వితే చచ్చిపోతుంది.
మహర్షి: చచ్చిపోతుంది కానీ, ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది.
భక్తుడు: అయ్యో స్వామీ! అదెలా సాధ్యం అవుతుంది?
మహర్షి: విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు... విత్తనం చూడలేమా?
భక్తుడు: విత్తనమే చెట్టుగా మారింది. చెట్టుకి విత్తనానికి తేడా లేదు. మొక్క మొలిచాక విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా స్వామీ...
మహర్షి: ఇదే నాయనా! నీ సందేహానికి సమాధానం.
విత్తనం అనేది పరమాత్మ. ఆ పరమాత్మే వృక్షం. అనగా వృక్షమనే సృష్టి. సృష్టి వేరు, పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము. కనిపించేదంతా పరమాత్మ మయమే.
దేవుడు ఉన్నాడా - లేడా? అన్న సందేహం వచ్చిన వ్యక్తి, ఓ సద్గురువును సమీపించి,దేవుడు ఉన్నాడా? దేవుడుంటే చూపించమని వినయంగా ప్రశ్నించగా -
ఆ గురువు తన శిష్యుని పిలిచి, చెవిలో పంచదార కలిపిన నీరు ఒక గ్లాసుతో తెమ్మని చెప్పగా, శిష్యుడు తెచ్చాడు. అప్పుడు గురువు తనను ప్రశ్నించిన వ్యక్తితో సంభాషించడం ప్రారంభించారు...
గురువు: నాయనా! ఈ గ్లాసులో ఏముంది?
వ్యక్తి: మంచి నీరు.
గురువు: సరిగా చూసి చెప్పు, కేవలం మంచి నీరేనా?
వ్యక్తి: అవునండీ... కేవలం మంచి నీరే.
గురువు: అయితే, ఒకసారి త్రాగి చెప్పు.
ఆ వ్యక్తి నీటిని త్రాగాక..
గురువు: ఇప్పుడు చెప్పు, కేవలం నీరేనా?
వ్యక్తి: గురువు గారూ, ఇది పంచదార కలిపిన నీరు.
గురువు: మరి ఇందాక కేవలం మంచినీరే అని చెప్పావు. ఇప్పుడు పంచదార కలిపిన నీరని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావ్?
వ్యక్తి: ఎలా అంటే, అప్పుడు కేవలం నీటిని మాత్రమే చూసి, అందులొే కరిగి ఉన్న పంచదార కానరాక, అది కేవలం మంచినీరని పొరపడి చెప్పాను. కానీ, ఇపుడు నీటిని త్రాగాను. నీటియందలి పంచదార రుచి అనుభవించిన మూలంగా ఇది పంచదార నీరని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.
గురువు: అంటే, అనుభవ పూర్వకంగా తప్పితే అది పంచదార నీరు అని నీవు తెలుసుకొేలేకపోయావ్ అంతేనా?
వ్యక్తి: అవునండీ.
గురువు: సరే, ఇపుడు నువ్వు త్రాగినది పంచదార నీరని ఒప్పుకున్నావు. అయితే అ నీటీలో పంచదార చూపించు.
వ్యక్తి: అది అసాద్యం కదండీ.
గురువు: ఏం ఎందుకని?
వ్యక్తి: పంచదార పూర్తిగా నీటితో కలసిపోయి ఉంది. దానిని వేరు చేసి చూపించలేం.
అపుడు ఆ గురువు "చూడునాయనా! నీవు నీటిని చూసి రుచి చూడకయే, ఏవిదంగానైతే కేవలం మంచినీరే అని పొరపాటు పడ్డవో, అదేవిదంగా మనుష్యులు కేవలం బాహ్య ప్రపంచాన్ని చూస్తూ, వాటి సుఖాల్లో పడి దేవుడు లేనిదానిగా సృష్టిని చూస్తున్నారు. కానీ నీవు నీటిని త్రాగి, అందులోని తీపి రుచిని అనుభవ పూర్వకంగా తెలుసుకొని, అందులో పంచదార కలిసి ఉందని ఎలా గ్రహించావో, అలాగే ఎవరైతే తమ ప్రయత్నం ద్వారా దేవుని ఉనికిని తమ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారో... వారికి దైవం ఉన్నదనే సత్యం తెలుస్తుంది. పంచదార నీరు త్రాగేవారికి తప్ప, మిగతా వారందరికీ అది మంచినీరే. దానిని త్రాగిన వాడికే దాని రుచి తెలుస్తుంది. అటులనే అనుభవించిన వారికే దేవుడున్న సత్యం తెలుస్తుంది. మిగతా వారికి అనుభవం లేక దేవుడు లేడని పలు సందేహాలుకు లోనౌతరు.
ఇంకా నీవు దేవుడుంటే చూపించమని అడిగావు కదా... ఏ విదంగానైతే నీవు, నీటితో కలసి పోయి ఉన్న పంచదారను నీటి నుండి వేరు చేసి చూపించలేవో, అదే విధముగా ఈ సృష్టంతా నిండి పోయి, సూక్ష్మాతి సుక్ష్మరూపంలో అణువణువూ వ్యాపించియున్న భగవంతుని ప్రత్యేకంగా వేరుచేసి చూపంచలేం.
సృష్టిలో ఉండే ప్రతీదీ భగవత్సరూపమే. జీవుని రూపంలో ఉండేది ఆ భగవంతుడే. రూప నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే. వాడొక్కడే ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించుచున్నాడు. నీవూ, నేనూ, ఈ చెట్టూ పుట్టా వాగూ వంకా అన్నీ భగవంతుని రూపాలే. కనుక దేవుని సర్వంతర్యామిగా తెలుసుకుని, ప్రపంచ సుఖాల పట్ల వ్యామెహం విడిచి దైవంపై ప్రేమ, విశ్వాసాలు కలిగి ఉండు. అర్హత పొందాక ఆ అనంతుడు అగుపిస్తాడు" అని చెప్పగా, ప్రశ్నించిన వ్యక్తి సందేహ నివృత్తి అయి ఆనందభరితుడై, గురువుగారికి ప్రణమిల్లాడు.
ఇదే రీతిలో ఓ విజ్ఞుడుకి పృచ్ఛకునికీ సంభాషణ సాగిందిలా -
పృచ్ఛకుడు: మీరు దేవుణ్ణి నమ్ముతారా?
విజ్ఞుడు: నమ్ముతాను.
పృ: అయితే మీకు దేవుడు కనిపిస్తాడా?
వి: నిస్సందేహంగా కనిపిస్తాడు.
పృ: సందేహస్పదంగా చూస్తూ... ఆహా! ఎప్పుడు... ఎక్కడ... ఎలా... మీకు కనిపించాడు?
స్వచ్ఛత తప్ప ఏ మాలిన్యమూ లేని పసిపాపాల చిరునవ్వుల్లో...
తనువు చిక్కి శల్యమైపోతున్నా,
నేల దున్ని పదిమంది ఆకలి తీర్చే అన్నదాతల స్వేదంలో...
జన్మభూమి ఋణం తీర్చుకొనుటకు
ప్రాణాలను సగర్వంగా అర్పించగలిగే వీర జవానుల దేశభక్తిలో...
శ్రమైక జీవన సౌందర్యానికి ఏకైక చిరునామా అయినా కార్మికుని శ్రమ ఆరాటంలో...
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హైందవ ధర్మాన్ని విడువక ఆచరణాత్మకంగా చూపే గురువుల కర్మాచరణలో...
వేళకాని వేళ జనారణ్యంలో చిక్కుకున్న
ఆడబిడ్డను మృగాళ్ల బారిన పడకుండా, క్షేమంగా తన గూటికి చేరేందుకు సాయమందించే పుణ్యాత్ముల్లో...
తాను మరణపుటంచుల్లో ఉన్నప్పుడు,
అవయవదానం చేసి సాటి మనిషికి ప్రాణంపోసి, అమరత్వం పొందే త్యాగధనుల్లో...
ఇవ్వడమొక్కటి తప్ప, ఆశించడం తెలియని
ఈ ప్రకృతి రమణీయతలో...
ప్రకృతిలో పరోపకార్ధమై మెలిగే జీవరాశిలో...
ఈ పంచభూతాల్లో...
నాకెప్పుడూ దేవుడు కనిపిస్తూనే ఉంటాడు...
చూడాలే గానీ, మీకు కనిపిస్తాడు...అని నిర్మలంగా నవ్వుతూ విజ్ఞుడు చెప్పగా -
పృచ్ఛకుడు నమస్కరిస్తూ, "మిత్రమా! నాకిప్పుడు నీలోనూ, నిర్మలమైన నీ చిరునవ్వులోనూ, దేవుడు కనిపిస్తున్నాడు"... అని బదులిచ్చాడు.
చూసే దృష్టిబట్టే ఆ అనంతుని దర్శనం.
🕉 🕉 🕉
తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమా|
నశ్యతి క్రియయా పుత్ర పురుషస్య తథా మలః ||
జీవస్య తండులస్యేవ మలం సహజ మప్యలమ్ |
నశ్యత్యే వానసందేహః తస్మాదుద్యమవాన్భవ ||
- శ్రీ వసిష్ఠ మహర్షి (శ్రీయోగవాసిష్టము)
బియ్యం పుట్టునప్పుడు పొట్టు తౌడులతో కూడియుండును. రాగి చిలుముతో కూడి యుండును. దంచుటచే పొట్టు తౌడు పోయినట్లు, స్ఫుటముచే చిలుము తొలగినట్లు అనుష్టానంచే జీవుడను శుద్ధుడగును.
పరిపూర్ణత అనేది ఆచరణ నుండి మాత్రమే వస్తుంది.
🕉 🕉 🕉
దేవుడు ఉంటే కష్టాలనుండి కాపాడడా?
ఒక పండితుడు, జుట్టు బాగా పెరిగిందని క్షౌరశాలకి వెళ్ళగా, ఆ క్షురకుడు జుట్టు కత్తిరిస్తూ, పండితునితో ముచ్చటిస్తూ...
పంతులుగారు, నాకు ఎప్పటి నుండో ఒక సందేహం...
దేవుడు ఉన్నాడా? దేవుడే ఉంటే, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు? నాతో పాటు లోకంలో, చాలామంది ఎన్నో బాధలు పడుతున్నారు. దేవుడు ఉంటే...ఇంత మంది బాధలుపడుతూ ఉంటే, చూస్తూ ఊరుకుంటాడా? వచ్చి కాపాడాలి కదా… అన్నాడు. అప్పుడు ఆ పండితుడు సరేగానీ, ఇప్పుడు నాతోపాటు మా ఇంటి వరకు వస్తావా...అని అడిగాడు. సమాధానం తెలుసుకోవాలన్న పట్టుదలతో ఉన్న క్షురకుడు సరేనని బయలుదేరాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక , ఓ బజారులో గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని చూపిస్తూ, చూడు...ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు. వీరి జుట్టు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పొడుగ్గా, పొట్టిగా, చింపిరిగా ఉంది. వారందరి జుట్టు ఇలా అడ్డదిడ్డంగా ఉంటే, కత్తిరించక చూస్తూ నిల్చున్నావేమిటి... అని మందలించాడు. ఆ మాటలకు ఒకింత కోపంగా క్షురకుడు, ఏమిటండీ పంతులుగారు, జనానికి జుట్టు పెరిగితే, నేను ఊరంతా తిరిగి వీళ్ళందరి జుట్టు కత్తిరించాలా? వాళ్ళు నా దగ్గరికి వచ్చి మా జుట్టు పెరిగింది, కత్తిరించండి అని అడిగినప్పుడు కదా కత్తిరించగలను. దారిన పోయేవారిని ఆపి కత్తిరిస్తే, వాళ్ళు ఊరుకుంటారా? నన్ను తిడతారు, కొడతారు అని అన్నాడు.
అంతటా ఆ పండితుడు, ఏమయ్యా! ఈ జనాలు జుట్టు కత్తిరించుకోవాలనుకొని నీ దగ్గరికి వస్తే కదా, నీవు కత్తిరిస్తావు. అలాంటిది దేవుడు మాత్రం నీ దగ్గరికి వచ్చి నీ కష్టాలు తొలగించాలా? ఇదెక్కడి న్యాయం అని క్షురకుడుని అడిగాడు. నువ్వెలాగైతే నీ దగ్గరికి వచ్చినవారికి మాత్రమే జుట్టు కత్తిరిస్తావో, అలాగే దేవుడు కూడా అతని వద్దకెళ్లి మొర పెట్టుకుంటే, వాళ్ళ మొర ఆలకించి కాపాడుతాడు అని చెప్పాడు. అప్పుడు ఆ క్షరకుడు అయ్యా, నా సందేహం ఇప్పుడు నివృత్తి అయిందని ధన్యవాదాలు తెలిపాడు.
🕉 🕉 🕉
చివరగా మన వివేకనందుని అనుభవాన్నీ మననం చేసుకుందాం. ఒకనాడు నరేంద్రుడు రామకృష్ణపరమహంసతో, నాకు దేవుణ్ణి చూపించండి... అంటాడు. ప్రశ్నలో స్పష్టత, ప్రశ్నించేవారి దృఢత గుర్తించిన రామకృష్ణపరమహంసవారు తన పాదమును మెల్లగా నరేంద్రుని ఒడిలో ఉంచగా, సమాధి స్థితికి వెళ్ళి, కొంత సమయం తర్వాత బాహ్యస్మృతికి వచ్చెను. ఆ పిమ్మట సందేహాలు లేనిస్థితికి చేరెను. అనుభవజ్ఞానము కల్గేంతవరకే సందేహాలు.
సర్వేషు రమంతే ఇతిరామః
అందరిలో రమించు దివ్య చైతన్యమే శ్రీరామచంద్రుడు.
విషయానురక్తిని విడిచి, ఆత్మానందంలో మునిగి, ఆత్మారాములై తరించమన్నదే ఋషుల వాక్కు. ఇదే జన్మ సాఫల్యత రహస్యం.