8, అక్టోబర్ 2021, శుక్రవారం

సాయి సర్వజ్ఞత

 ఈ మధ్య నా స్నేహితురాలు తన బ్లాగ్ లోమృత్యుంజయుడు - శ్రీ సాయిబాబా అనే చక్కటి టపా పెట్టారు. అయితే ఆ టపాకు సంబంధం లేని  ప్రశ్నలను ఓ అజ్ఞాత గారు  వ్యాఖ్యగా పెట్టారు. 

ఆ ప్రశ్నలు  ఏమిటంటే  - బాబా దేవుడా? గురువులకు గుడులేమిటి?

ఇటువంటి ప్రశ్నలు అప్పుడప్పుడు అక్కడక్కడ వినిపిస్తున్నాయి.
ఇలాంటి ప్రశ్నలు వింటున్నప్పుడంతా - శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ నండూరి శ్రీనివాసరావు గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, శ్రీ పరిపూర్ణానంద స్వామివారు లాంటి పూజ్యుల ప్రవచనాలు... అలాగే, నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాలు గుర్తుకొస్తాయి. పై ప్రశ్నలకు సమాధానం చిన్నగా స్ఫురిస్తుంది. ఆ స్ఫురణే ఈ టపా.
ఈ ప్రశ్నలకు సమాధానం నేను సరిగ్గా చెప్పలేకపొతే అది నా అవగాహన లోపంగా, తప్పిదంగా గుర్తించి మన్నించవల్సిందిగా మనవి.
ఇటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు దైవం, దైవత్వం, గురువు, గురుతత్వం, జీవుడు, శివుడు అంటే ఏమిటో కొంత అవగాహన చేసుకుందాం. 

భారతీయ వాంగ్మయాల ప్రకారం - ఈశావాస్యమిదం సర్వం...ఈ సర్వసృష్టీ ఈశ్వరమయం. సర్వత్రా నిండి నిబిడికృతమై వున్న పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వ వ్యాపకుడు, సర్వ శక్తిమంతుడు సర్వేశ్వరుడని దృఢంగా విశ్వసించే సంస్కృతి మనది. 

అంతటా, అన్నింటిలో పరమాత్మను దర్శించి, తరించమని తెలియజెప్పే విశిష్టమైన ధర్మమే హిందు ధర్మం.   

దేవుడు ఒక వ్యక్తి కాదు - ఒక తత్త్వం...మహాతత్త్వం. ఆ తత్త్వాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరింపజేసేదే హిందూధర్మం.

దేవుడు ఎక్కడో ఒక లోకంలోనో, ఒక ప్రాంతంలోనో,
ఒక మూలనో... ఉన్నాడని కాదు, అనంతమై, అఖండమై అంతటా నిండి, అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడనే తత్త్వాన్ని ప్రబోధిస్తుంది మన హిందూ ధర్మం. 
                    

ఈ చరాచర ప్రకృతి అంతా భగవత్స్వరూపమే. అందులో భాగమైన మానవుడు కూడా మాధవుడు కాగలడని నిరూపింపజేసేదే హిందూ ధర్మం. 

ఈ నిబద్ధతతో కూడినవే మన సంస్కృతి సంప్రదాయాలు.

సమస్త సృష్టిని సృజించే అద్భుతశక్తిని దైవంగా విశ్వసించి, నిరాకారుడును చంచలమైన మనస్సుతో పట్టుకోలేం కాబట్టి, ఆదిలో ఓ రూపాన్నో, నామాన్నో ఆశ్రయించి ఆరాధిస్తుంటాం, అర్చిస్తుంటాం, అభిషేకిస్తుంటాం. ఈ రీతిగా సాగే గమనంలో ఏదో ఒక తరుణంలో అనిపిస్తుంది దైవాన్ని దర్శించాలని. ఇక ఆ దిశగా సాధన మొదలెడతాం. అయితే, దైవాన్ని శోధించాలంటే ఓ ఆలంభన కావాలి. ఆ ఆలంభనే గురువు. 
                        

పలు రూపాల్లో, పలు నామాల్లో దైవత్వాన్ని కాంచి, పూజించి తృప్తి చెందుతున్న భక్తులను - కళ్ళు మూస్తే ధ్యానం లోనూ, తెరిస్తే ప్రకృతి లోనూ "దైవాన్ని" చూడగలిగే స్థాయికి తీసుకెళ్ళినవారే గురువులు. కోరుకున్నదే కాక, కోరుకోవల్సింది కోరుకోకపోయినా అపార కృపతో అనుగ్రహించేది గురువే. 
                        

జీవుల క్షేమం యోగక్షేమం వహించేవాడు గురువు. మనలో వున్న ఈశ్వరుడుని దర్శించే దారి చూపేవారే  సద్గురువులు. 
గురువులు - పరతత్త్వ స్పర్శను అందివ్వడానికే ఈశ్వరాంశతో అవతరిస్తుంటారు. పరతత్త్వం  గురుతత్త్వం ధర్మానుబద్ధుడై జీవించేటటువంటి వ్యక్తిని ఆశ్రయించి వుంటుంది. ఆ రూపం ద్వారా మనకి అందుతుంది. మొదట ఆ వ్యక్తిలో గురుతత్త్వం చూసి, ఆ గురువు పాదాలను ఆశ్రయించగా,  అప్పుడు ఆ వ్యక్తిలో పరతత్త్వంతో సంబంధం ఏర్పడుతుంది. కానీ; ఆ వ్యక్తిలో ప్రస్ఫుటమయ్యే గురుతత్త్వాన్ని, దైవత్త్వాన్ని గుర్తించక వాటిని వదిలి, మనం నిర్వచించుకొనే దేవుడి  కోసం వెతకడమే అసలైన సమస్య...ఫలితంగా అనేక సందేహాలు. 
                       

స్వీయ సాధనతో, స్వానుభవంతో తప్పా, వేరొక్కరి అభిప్రాయాలతోనో, అనుభవాలతోనో దైవాన్ని దర్శించలేం. అందుచే అంతర్యామిని తెలుసుకోవాలంటే సరైన సాధన చేయాలి. సద్గుణ శీలత్వమును తొలుత అలవర్చుకోవాలి. 
                       

సద్గుణ శీలత్వమే దైవత్వం. అందుకే సాధకులు దేవుడి కంటే దైవత్వం మీదకు దృష్టి మరల్చి, తమలో దైవత్వాన్ని పెంపొందించుకునే దిశగా సాధన చేయాలని ఋషులు చెప్తారు. అప్పుడే సాధన సరళంగా, మానవత్వం నుంచి దైవత్వం దిశగా సాగుతుంది. 

దాచిన ధనం...నిన్ను ధనవంతుడ్ని చేస్తుంది.
దానం చేసిన ధనం...ధర్మాత్ముడిగా నిలుపుతుంది. 
నీవు సంపాదించిన ధనం...కాటి వరకైన రాదు. 
నీవు  సంపాదించిన ధర్మం...దైవం దరికి చేరుస్తుంది.
                       

మానవత్వానికి మించిన దైవత్వం లేదని, అందుకే మానవత్వాన్ని, సేవా తత్పరతను ముందు అలవర్చుకోమని పెద్దలు చెప్తుంటారు. దైవత్వాన్ని పొందడానికి మానవత్వమే పునాదిరాయి.  మానవత్వం పరిపూర్ణంగా వెల్లివిరియడమే దైవత్వం.
ఏకత్వం, దైవత్వం, మానవత్వం లను ప్రతిబింబించేవే మన సంస్కృతి సంప్రదాయ ధర్మాలు.

ఇక బాబా గురించి - 

సనాతన ధర్మవిహితమైన సంప్రదాయం దత్తాత్రేయుల అవతారంతో మొదలవ్వగా, అప్పటినుండి 
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యాలుగా కాకుండా, విశిష్టమైన లక్షణాలతో, విలక్షణమైన చర్యలతో, చక్కటి బోధలతో, 
తగు శిక్షణలతో, మానవులలో ఉత్తమ గుణాలను పెంపొందించే విధానంతో కొనసాగింది దత్తావతార పరంపర.
 
జీవులలో పేరుకుపోయిన మనోమాలిన్యాలను, పూర్వ పాపాల ప్రారబ్ధ కర్మలను తమ స్మరణ చేత తొలగించి, లోభపూరిత సంచిత కర్మలను తమ సద్భోధల చేత సరిజేసి, ఆర్తులను ఉద్ధరించి సంస్కరించే అవతారాలే ఈ దత్తావతారులు.

దత్తావతార పరంపరలో దత్తావతారులుగా 
శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, మాణిక్యప్రభువు, అక్కల్ కోట మహారాజు, సాయిబాబా లను చెప్తుంటారు. 
                      

మొదట శ్రీ సాయి, శిరిడి గ్రామ పొలిమేరలో ఒక వేపచెట్టు క్రింద సుమారు పదహారు సంవత్సరాల బాలుడుగా ప్రకటితమై, ఆ పిమ్మట కొంతకాలానికి, పెండ్లివారితో పాటు వచ్చి ఖండోబా ఆలయపూజారిచే "ఆవో బాబా" అని స్వాగతింపబడి, భక్తులు పెట్టిన "సాయిబాబా" అనే పేరుతో, అందరి కోరిక మీదట అక్కడే స్థిరపడ్డారు.

ఆ కాలంలో శ్రీ జనార్ధన స్వామి అనే మహనీయులు తన శిష్యుడైన ఏకనాధుడనే ప్రఖ్యాత భక్తునికి దుర్లభ్యమైన శ్రీ దత్తాత్రేయులవారి భౌతిక రూపాన్ని దర్శింపజేస్తానని చెప్పి, శ్రీ సాయినాధుడిని దర్శింపజేసి వీరే దత్తాత్రేయులని తెలిపిరి.
                     

ఆధ్యాత్మిక విద్యను మానవులకు ఆచరణ ద్వారా అందించిన శ్రీ దత్తాత్రేయులవారే శ్రీ సాయినాధునిగా అవతరించారని పూనా వాస్తవ్యులైన శ్రీ గుళవణీ మహారాజ్ వారు చెప్పారు.

శ్రీ సాయి పరమ గురువనీ, తమ కంటే ఎంతో అధికులని ఖేడ్గాం నివాసి శ్రీ నారాయణ మహరాజ్ అనే సిద్ధ పురుషుడు చెప్పారు. 

ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పరిపాలించడానికి విభిన్న సాంప్రదాయాలకు చెందిన సద్గురువులు, మహనీయులు ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తుంటారనీ, అందులో శ్రీ సాయినాధుడు మహిమాన్వితుడని, అవతార్ మెహర్ బాబా చెప్పారు.
ఇలా ఎందరో యోగులు, మహనీయులు చెప్పిన సత్యాన్ని, సామాన్యులమైన మనం సందేహించడం తగునా? 

ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, మానవత్వంతో తోటివారికి సహాయపడే వ్యక్తిని, కష్టాల్లో వున్న వారిని ఆదుకునే వ్యక్తిని, నీవు మనిషివి కాదు మా పాలిట దేవుడవయ్యా అని ఆనందంతో కృతజ్ఞతగా మనసార అంటాం. 

అలాంటిది ప్రేమగా మన కష్టాలను తాను స్వీకరించి, తనకి చేకూరిన శక్తుల్ని మనకై దారపోసే బాబాని దేవుడు అనడం  తప్పు కాదు కదా. 

పుట్టామా, బ్రతికామా, మరిణించామా అన్నట్లు బ్రతికేవారు కొందరు. ఇతరులను బాధపెట్టో, గాయపరిచో, అణిచో, పడగొట్టో, దోచుకునో బ్రతికేవారు కొందరు. తమ శక్తి కొలది సంపాదించి,  ఎవరెలా ఉంటే నాకేంటి ... ఉన్నంతలో నేను హాయిగా  సుఖంగా వుంటే చాలనుకొని బ్రతికే ఉదాసీనులు కొందరు. ఈ మూడు పరిధులను దాటి జనహితం కోసం, విశ్వశాంతి కోసం తన శక్తిని, యుక్తిని, సామర్ధ్యాన్ని అర్పించిన మానవుడు మాధవుడే అన్నది ధర్మవచనం. 
                      

మరి తన తపఃశక్తిని, యోగశక్తిని మన హితం కోసం, మన ఇహపర సౌఖ్యాల కోసం వినియోగించిన సాయిని దైవం అనడం ధర్మ సమ్మతమే కదా. 

జనన మరణ చక్రభ్రమణంలో పడిన జీవులందరికీ, అనన మలం(జీవుడికి స్వతఃసిద్ధంగా ఉండే అజ్ఞానం), కాయిక మలం(కర్మల ద్వారా వచ్చే మాలిన్యం), మాయిక మలం (మనస్సులో ఆలోచనలు, సంపర్కాలు వల్ల ఏర్పడే మాలిన్యాలు) అనే మాలిన్యాలు ఉంటాయి. ఈ మాలిన్యాలు ఉంటే జీవుడు. ఈ మాలిన్యాలు లేని శుద్ధమైనవాడు శివుడు అన్నది శాస్త్ర వచనం. 
మరి ఈ మాలిన్యాలు లేని (సాయి సచ్చరిత్ర చదివిన అందరికీ ఇది విదితమే) సాయిని దైవమనడం శాస్త్ర సమ్మతమే కదా.

దృష్టి దోషం, శ్రవణ దోషం, వాక్ దోషం, మనో దోషం, క్రియా దోషం... ఈ పంచ దోషాలు లేకపొతే అదే పరమాత్మ స్వరూపం అని ఋషులు తెలిపారు.
మరి ఈ దోషాలకి అతీతంగా ఉన్న సాయిని దైవమనడం సమంజసమే కదా. 

శ్రీరాముడే దైవమని కొందరు, శ్రీకృష్ణుడే దైవమని కొందరు, శివుడే దైవమని కొందరు, అమ్మ ఆదిపరాశక్తే దైవమని కొందరు...వివిధ భావనలు.
స్వర్ణాభరణాలు వివిధ రకాలు. వేర్వేరు రూపాలు...కానీ; అందులో నిబిడికృతమై ఉన్నది బంగారమే. అలానే దైవ స్వరూపాలు వేర్వేరు...నిబిడికృతమై ఉన్నది మాత్రం మూలతత్త్వమే. 
                    

బాహ్యదృష్టిలో చూసినప్పుడే అంతటా భేదం కనిపిస్తుంది. ఒక్కసారి గురువు ద్వారా సంస్కరింపబడిన సాధకుడు అంతర్ముఖత చెంది, తనలో అవగతమయ్యే తత్త్వాన్ని గుర్తిస్తే, అదే పరిపూర్ణ స్థితి. ఈ స్థితిని పొందిన సాధకునికి ఏ భేదమూ ఖేదమూ వుండవు. ఒక్కటైన తత్త్వమే భాసిస్తుంది. దీనినే దైవమనీ, మూలతత్త్వమనీ, అంతిమ సత్యమనీ పరతత్త్వమని చెబుతుంది శాస్త్రం.

అన్వేషిస్తే 'సత్యం' అవగతమవుతుంది. విచారణ చేస్తే 'సత్యం' చేరువవుతుంది. ధ్యానిస్తే 'సత్యం' స్థిరమై వుంటుంది. సందేహిస్తే 'సత్యం' అగోచరమవుతుంది.
అందుకే సుందర చైతన్యానందులు వారు అంటారు - "మనసును తగిలించుకుంటే మానవుడువి అవుతావు, మనస్సును విడిపించుకుంటే మాధవుడువి అవుతావు" అని!
                        

ఆంతర్యామి తత్త్వాన్ని అర్ధం చేసుకొని ఉన్నదంతా ఒకటే చైతన్యం...దైవం అని గ్రహించి, భాగవతం దశమ స్కంధంలో అత్యద్భుతంగా బమ్మెర పోతన చెప్పింది ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేను. 
తనువున నంటిన ధరణీ పరాగంబు, పూసిన నెఱిభూతి పూతగాక... అనే పద్యం నందు - 
తన శరీరమంతా దుమ్ముకొట్టుకుపోయేలా ఆటలాడుకుంటున్న కృష్ణయ్య దివ్యమంగళ స్వరూపం - ఒంటినిండా విభూతి ధరించి, ఆనందతాండవం చేస్తున్న పరమశివుడిలా తోచింది ఈ భాగవోత్తముడికి.
యశోదమ్మ -
కన్నయ్య ఉంగరాల జుట్టు పైకి మడిచి ముత్యాలపేరుతో ముడివేస్తే - అది శివయ్య జుటంపై చంద్రవంకలా కనిపించింది మన కవివర్యులకు.
నుదుటిపై తీర్చిదిద్దిన ఎర్రని తిలకంలో - మన్మధుడుని మసి చేసిన ముక్కంటి మూడవకన్ను గోచరించింది పోతనామాత్యులవారికి.
మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిలా నున్న పెద్ద నీలమణి శివుని కంఠంలో హలాహలపు మబ్బులా తోచింది మన బమ్మెర వారికి.
మెడలో హారాలయితే - చెప్పేదేముంది...శివుడు ధరించిన సర్పాలే అని కళ్ళకి కట్టినట్లు అబేధ తత్త్వాన్ని తెలిపారు ఈ అద్వైత జ్ఞాని. 

బాబా కూడా ఎందరికో ఎన్నో రూపాల్లో దర్శనం ఇచ్చారు.  
                    

కొందరికి  పండరీనాధునిగా, జిన్నూరు నాన్నగారికి హనుమంతునిగా, నా స్నేహితురాలికి (వనితావని వేదిక బ్లాగర్) ఉగ్ర నరసింహస్వామి రూపంలో, ఓ  సత్సంగ మిత్రురాలికి శివునిలా....ఇలా ఎందరికో అబేధ తత్త్వాన్ని తెలిపే ఎన్నో అనుభూతులు. 

మన జీవితంలో ఏదో ఓ తరుణలో సృష్టిమూలాలను అన్వేషించాలనే కోరిక ప్రతీవారికి తప్పకుండా వచ్చి తీరుతుంది. దీనికై తపన పడే ప్రతీ మానవునకు ఈ అవకాశం అందివచ్చే విధంగా చేయకపోతే, వారికి యదార్ధమైన జ్ఞానాన్ని అందివ్వకపోతే, సత్యం తెలుసుకోలేరు కాబట్టి, మన శాస్త్రాలు ఆలయాల ఆవశ్యకతను బోధించాయి.  
ఒకోసారి కొందరికి ఈ సాధక భాదకలనుండి రక్షించేవారు ఎవరు అన్న భావన కల్గుతుంది. వారికై దైవం గురించి తెలియజెప్పడానికి గుడులు కొందరు కడతారు.
మన ముందు తరం వారికి మన మూలాలు ఔనత్యం తెలపాలని కొందరు గుడులు కడతారు. 
                   

ఇక గురువులకు గుడులేమిటి...
బహుశా గురువులకు మఠాలు ఉంటాయి కదా, గుడులెందుకు అని  ప్రశ్నించిన వారి భావన కావొచ్చు...
తమకి మాత్రమే పరిమితం చేసుకోకుండా సమాజంలో అందరికీ బాబా తెలియాలని, బాబా అనుగ్రహం అందరూ పొందాలని, ముందున్న తరాలకి బాబా గురించి తెలియాలని భక్తిప్రపత్తులతో గుడులు కట్టినవారు కొందరు. పారమార్ధిక చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన సాయి దేవుడే అని తమ స్వానుభవంతో ఎఱిగి, భక్తితో సాయికి గుడి కట్టినవారు మరికొందరు. నన్ను నమ్మినవారిని పతనం కానివ్వను. ఎవరైన సరే ఒక అడుగు నావైవు వేస్తే పది అడుగులు వారివైపు వేస్తాను...ఇది బాబా ఇచ్చినమాట. ఈ మాట భక్తుల జీవితంలో ఋజువు కావడం వల్లనే కోట్లాదిమంది బాబాకు భక్తులై ప్రేమతో బాబా మందిరాలు నిర్మిస్తున్నారు. భక్తుల మనోగతం వారి ప్రేమైక చేష్టలు విశ్లేషించడం ఎవరి తరం? గుడులు కట్టిన, పొర్లు  దండాలు పెట్టిన అంతా భక్తి పారవశ్యతోనే.

గుడులు వలన పవిత్రమైన వాతావరణం, ప్రతివారిలో పవిత్ర భావనలు, దైవం యందు నమ్మకం ఏర్పడతాయన్నది సత్యం.  భక్తులు నమ్మి ఆరాధించే దేవుళ్ళును  సందేహించక సమైక్య సామరస్యాలతో ఉండమని బోధిస్తుంది భారతీయ సంస్కృతి.

అజ్ఞాత కృష్ణుడు కోసం నిర్మించిన ఆలయం తన ఆవాసంగా  అడిగి బాబా చేసుకోలేదా...అని అడిగారు. 

సిద్ధపురుషులు, సద్గురువులకు తమ అంతిమ సమయం గురించి పూర్తి జ్ఞానం వుంటుంది. పరోపకారం కోసం అవతరించి, నిశ్చయించుకున్న కార్యం పూర్తయ్యాక, ఇక శరీరాన్ని త్యజించాలని అనుకున్నప్పుడు, ధరిత్రిపై ఒరిగిపోయాక శరీరాన్ని త్యాగం చేసిన చోటును కూడా భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగంలో పెట్టాలని, తమ సమాధిని ఎక్కడ నిర్మించాలో వారే నిర్ణయించేవారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారు, సొరకాయ స్వామివారు, మొగలిచర్ల స్వామివారు తదితరులు ఇలా చేయడం విధితమే కదా. 

బాబా కూడా అలానే నిర్ణయించుకుని, తన సమాధిని బాపూ సాహెబ్ బుట్టీ అనే శ్రీమంతుడిచే నిర్మింపదలచి, శిరిడిలో భవనం కట్టుకోవాలనే సంకల్పం బుట్టీకి కలిగేలా చేసి, పిమ్మట బుట్టీకీ, శ్యామకి ఒకేసారి "పూజాగదితో సహా ఒక వాడాని నిర్మించు" అనే స్వప్న సందేశమివ్వడం... బాబా అనుమతితో పని ప్రారంభించడం... అదే తరుణంలో హాల్ లో రెండు గోడలు కట్టి మురళీధరుణ్ణి ప్రతిష్టించాలని బుట్టీకి అనిపించడం... బాబా అనుమతితో ఆ కార్యక్రమమునూ మొదలుపెట్టడం జరిగింది. వాడా, మందిరం నిర్మాణం పూర్తయ్యే తరుణంలో బాబా అస్వస్థులవ్వడం... బాబా బంగారు పాద స్పర్శ వాడాలో ఉండదా... అని బుట్టీతో సహా అందరూ తల్లడిల్లడం... "నన్ను వాడాలో ఉంచండి" అన్న బాబా అంత్యకాలపు ఆజ్ఞతో, బాబా కృష్ణుడు వేరు వేరు కాదు అన్న అద్వైత తత్త్వసారాన్ని గ్రహించి, అమరకాంతులీనే బాబా పవిత్ర శరీరాన్ని శాశ్వతంగా వాడా మందిరంలో ఉంచడం జరిగింది.
బుట్టి, ఆనాటి శిరిడి వాసులు, భక్తులు అర్ధం చేసుకున్నట్లు మనమూ ఆ అద్వైతసారాన్ని గ్రహిస్తే ఏ సందేహాలకూ తావు వుండదు. 
బాబా అనుగ్రహం తోనే  మందిరం నిర్మించాలనే సంకల్పం నా స్నేహితురాలి శ్రీవారికి కలగడం... వారు బాబా అనుమతి మనసారా కోరుకోవడం... బాబా అనుమతి ఇచ్చిన అనుభూతి పొందడంలో అతిశయోక్తి లేదు... ఆశ్చర్యం లేదు.  బాబా జీవిత చరిత్ర చదివితే ఇలాంటి మహత్తర విషయాలు, అనుభూతులు అర్థమౌతాయి. మందిర నిర్మాణమనే పవిత్ర కార్యమునకు వీలైతే సహకరిద్దాం...లేకుంటే వారి సంకల్పం నెఱవేరాలని హృదయ పూర్వకంగా ప్రార్థిద్దాం. 

సమ్మతితో ఉండు - సద్గతి పొందు. 

10, జూన్ 2021, గురువారం

గంగానది - స్ధల మాహాత్మ్యం

గంగాది పుణ్యనదుల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్తుంటారు కదండీ.

ఇలా పాపం పోతే వెళ్ళి మునిగేస్తే సరిపోతుంది...పాపం పోతుంది. సులభంగా పాపాలను ప్రక్షాళన చేసుకొని తరించే సౌలభ్యముంటే ప్రత్యేక పరిహారాలు సాధనలు ఎందుకు? 

అలాగని పాపాలు పోతాయని పెద్దలు శాస్త్రాలు చెప్పే మాటలు అసత్యమని అనలేం కదా. ఇందులో ఏదో రహస్యం ఉంది.

అదేరీతిలో చేసే దుష్కర్మలవలన కలిగే పాపాలు, పుణ్యనదుల్లో స్నానాలతో పోతే, మరి కర్మఫలం అనుభవించక తప్పినట్లే కదండీ. కర్మఫలం అనుభవించక తప్పదంటారు. మరి ఈ స్నానాదుల వలన అది సాధ్యమా? కర్మఫలలు తప్పించుకోగలమా?

అందరూ తమ తమ పాపాలను పుణ్యనదుల్లో వదిలేస్తే, ఆ పాపభారాన్ని నదులు ఎలా భరిస్తున్నాయి? 

మరో సందేహం - స్థల మాహాత్మ్యం గురించి. కొన్ని చోట్ల ధ్యానం బాగా కుదురుతుందని, కొన్ని స్థలాల్లో కుదరదని అంటారు చాలామంది. నిజంగా స్థల బేధాలు,   ఉంటాయా? స్థల మహత్మ్యం ఉంటుందా?

ఇవి మిత్రురాలు పద్మగారి సందేహాలు. పూర్తిగా సమాధానాలు తెలియకున్న తెలిసినంతలో తెలిపే ప్రయత్నం - 

పుణ్యనదుల్లో స్నానం చేస్తే పాపం పోతుందన్న పెద్దల మాట అసత్యం కాదు గానీ, వారు అది మాత్రమే చెప్పలేదు. కొనసాగింపుగా చాలా చెప్పారు. 

ప్రధమమున ఇక త్రికరణశుద్ధిగా దుష్కర్మలను చేయనని సంకల్పం చెప్పుకొని, మౌనంగా దైవస్మరణతో, కేవలం ధ్యేయాకారంలో నుండి మూడుమార్లు మునకలు వేయమంటారు. మొదటిసారి మునుగుట వలన స్థూలదేహ సంబంధ మాలిన్యం, రెండవసారి మునుగుట వలన సూక్ష్మదేహా సంబంధ మాలిన్యం, మూడవసారి మునుగుట వలన కారణదేహా సంబంధ మాలిన్యాలు తొలగును. లేనిచో స్థూల శరీర మాలిన్యమే పోతుందని వారు చెప్పినది గ్రహించాలి.

తపసాకర్మాభిచైవ ప్రదానేన చ భారతా |
పునాతి పాపమ్ పురుషః పూతశ్చేన్న ప్రవర్తతే ||                                 - శాంతిపర్వం.
తపస్సు, యజ్ఞకర్మ, దానం ద్వారా మనిషి
తన పాపకర్మలని కడిగివేసుకోవచ్చుకాని అలాంటి కర్మలని మళ్ళీ చేయకూడదు.

అటులనే నదుల్లో స్నానమాచరించినప్పుడు సంకల్పం ద్వారా భావసిద్ధి పొంది, పిమ్మట శాస్త్రనిషిద్ధకర్మలు ఆచరించక, శాస్త్రవిహిత కర్మలననుష్టిస్తేనే పాపాలు తొలగుతాయి.
                      

మనోవాక్కాయ శుద్ధానాం రాజంస్తీర్ధం పదే పదే |
తధా మలినచిత్తానాం గంగాఽ పి కీకటాధికా ||

మనోవాక్కాయ శుద్ధి గలవారు గొప్ప తీర్ధస్వరూపులు. మనోవాక్కాయ కర్మలు శుద్ధంగా లేనివారు గంగలో స్నానమాచరించినను మాములు జలమున మునిగిన ఫలితమే పొందుదురు.

ఇకకర్మఫలంఎప్పుడుతప్పుతుందంటే -

"కర్మ కర్మణా నశ్యతి" కర్మ కర్మతోనే నశిస్తుంది.

పుణ్యక్షేత్రయాత్రలు, తీర్ధస్నానాలు, ఉపవాసాదివ్రతాలు, దానాలు... మొదలగు సుకర్మలు వలన కొంత పాపం తొలగుతుందన్నమాట వాస్తవమే. 
భగవత్  ధ్యానం వలన మానసిక
పాపం, భజన సంకీర్తనలతో వాచిక పాపం, ఉపాసన,  అర్చన యజ్ఞాదుల వలన శారీరకంగా చేసే పాపాలు, దానాల వలన ధనం కోసం చేసే పాపాలు పోతాయని పెద్దలు చెప్తుంటారు. సత్కర్మల వలన దుష్కర్మల ఫలితం అనుభవించకుండా కొంత తగ్గించుకోవచ్చు. అటులనే దుష్కర్మల వలన ప్రాప్తించే కష్టనష్టాలని దుఃఖాన్ని తట్టుకునేశక్తినో, ఇతరుల చేయూత ద్వారా అధిగమించే ప్రాప్తాన్నో పొందవచ్చు.

మహాత్ముల సద్గురువుల దర్శనం, వీక్షణం, అనుగ్రహం ఉన్నను, ప్రారబ్ధ పాపకర్మలు తొలగుతాయి. అందుకు ఉదాహరణలు ... శ్రీపాద శ్రీవల్లభులవారు, వెంకయ్య స్వామి, సొరకాయ స్వామి, షిర్డి సాయినాధులు, మాతా అమృతానందమయి చరితములో భక్తుల అనుభవాలే. శ్రీపాదులవారు ఓ భక్తునికైతే కలలోనే ప్రారబ్ధఫలం అనుభవించినట్లు చేసి కర్మక్షయం చేసారు. 

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః |
ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే ||

పరమశివుడు పార్వతీదేవికుపదేశించిన శ్లోకమిది. ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు. ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?
                   

ఆత్మానదీ సంయమతోయపూర్ణా సత్యహ్రదా శీలతటా దయోర్మిః |
తత్రావగాహం కురు పాండుపుత్ర న హ్యన్యధా శుద్ధ్యతి చాన్తరాత్మా ||
 
భీష్ముడు ధర్మరాజునకు చెప్పినది ఇది ... 

ఓ పాండుపుత్రా! సంయమమను జలముతో నిండినదియు, సత్యమను అగాధము కలదయు, సుశీలమను దరి కలదియు, దయయను అలలు గలదియగు ఆత్మయను నదియందు స్నానమాచరించుము. వేరు ఏ విధములగు తీర్ధములలో స్నానమాచరించినను, అంతరాత్మ శుద్ధి కాజాలదు.

అలాగని తీర్ధక్షేత్రాల దర్శనం వలన మహత్తు ఉండదని కాదు. అచ్చట అనేక మహత్ములుందురు. వారి దర్శనం వలన మనలో మార్పు రావొచ్చు. అలాంటి సత్పురుషులు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తారని సందేహం వద్దు. గతంలో పుణ్యనదుల ఒడ్డున అనేక మంది మహర్షులు తపస్సు చేసినట్లు పురాణాది గ్రంధాల ద్వారా తెలుసుకున్నాం కదా. ఆ మహర్షుల తపశ్శక్తి ఇప్పటికీ సూక్ష్మంలో ఉంటుంది. సుగంధం అద్దుకున్న వస్త్రం ఆ సుగంధాన్ని పరిసరాల్లో ఎలా వెదజల్లుతుందో మహాత్ముల తపోమహిమ శక్తి అలానే అచ్చట ప్రకాశిస్తుంది. భక్తి వైరాగ్యములతో అక్కడికి పోవు పరిశుద్ధ హృదయులు ఆ పావన ఫలమందుకోగలరు.   

ఇక నదులు పాపభారాన్ని ఎలా మోస్తున్నాయ్... 
నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు. మిత్రురాలు విశాలను అడిగాను.

నదీమతల్లులు పాప భారాన్ని మోయలేనప్పుడు, పుణ్యాత్ములు వారి వద్దకు రావాలని కోరుకుంటారట...మహాయోగులు, సాధువులు, సిద్ధపురుషులు వచ్చి ఆయా నదులలో స్నానమాచరించి నపుడు ఆ నదులు ప్రక్షాళన అవుతాయి అని విన్నాను... అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చదువుతూ, 'అవునా' అని యధాలాపంగా బయటకు అన్నాను. ఏమిటి 'అవును' అని ప్రక్కనే ఉన్న మావారు అడగడం...ఈ నదీస్నానాలు గురించి చెప్తూ, ఆ నదీమతల్లులు ఈ పాపభారం ఎలా మోస్తున్నయో... అని అనగానే - 
ఆ...నేను ఎక్కడ చదివానో గుర్తులేదు గానీ, నీలాగే గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఇదే సందేహం వచ్చి గంగానదినే అడిగాడట... అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లీ...అని. అందుకా తల్లి మందహాసంతో - 
'నాయనా! నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను' అని బదులిచ్చిందట. 
వెంటనే, అయ్యో...అన్ని పుణ్యనదులు ఇంతేకదా...పాపాలన్నీ సముద్రంలోనే 
కలిపేస్తే... ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని సముద్రాన్నే అడిగాడు...ఎలా మోస్తున్నావు... ఈ పాపభారాన్ని అని. దానికా సముద్రుడు - 
'నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంటవెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాలోనికి పంపిస్తేస్తున్నాను' అని బదులిచ్చాడట. అరే ... ఎంతో తేకగా కదిలాడే మేఘాలకు ఎంత విపత్తు వచ్చింది... అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు... ఈ పాపభారాన్ని అని అగగా, అవి పకపకా నవ్వి - 
'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'...అని బదులివ్వగా...ఓహో...ఆ పాపలన్నీ మన  మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట. కర్మఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట...అని చదివానని చెప్పారు. 'అవునా'... అని అనుకున్నాను మరల.
              

నిజానికి మన సంస్కృతీ సంప్రదాయాలు, ఋషుల వచనాలు, గంగాప్రవాహం లాంటివి. మనోమాలిన్యాలను ఎప్పటికప్పుడు కడిగివేసి అంతరంగాన్ని పరిశుద్ధ చేయగల సమర్ధత గలవి. కానీ, మనం అది గ్రహించక గంగనే కలుషితం చేస్తున్నాం.     

ధ్యానం ఎక్కడ కుదురుతుందని శాస్త్రం చెప్తుందంటే -   

ఏకాంతే విజనే రమ్యే గుహాయాం పుణ్యభూమిషు | 
రహితే మశకైర్దంశై ర్దేవాయతనకే  పివా || సిద్ధక్షేత్రే మహాతీర్ధే ధ్యానసిద్ధిః ప్రజాయతే |
తత్ర సిద్ధాసనం బద్ద్వా ఋజుకాయస్తు || 

ఏకాంతమందును, జనశబ్దంలేని ఇంటియందును, మనోహరమగు స్థలమందును, కొండగుహ యందును, పుణ్యభూమియందును, దోమలాది వాటిచే బాధలేని చోటునను, ​దేవపూజాదులు చేయు స్థలమందును, సిద్ధ క్షేత్రమందును, పుణ్యతీర్ధ తీరమందును ధ్యానం చేయువారికి, నిర్విఘ్నముగా ధ్యానం కుదురుతుంది. ధ్యానసిద్ధి సిద్ధించును.

స్థల భేదాలుంటాయా?

మీ ఈ ప్రశ్న చూడగానే... 
శ్రీ మళయాళ స్వామివారు గుర్తుకు వచ్చారు. ఆ స్వామివారు ఈ విషయంపై కొన్ని ఘటనలను వివరిస్తూ... చక్కటి వివరణ ఇచ్చారు. వారి వివరణే ఇక్కడ తెలియజేస్తాను. 
స్థలకాలభేదములు లేనిచో పుణ్యభూమి, పుణ్యకాలం అని శాస్త్రాలలో ఎట్లు నిర్ధారించారు?
కాలమంతా ఒకేలా ఉంటే, శుభముహుర్తం దుర్ముహుర్తం, అమృతకాలం, రాహుకాలం, యమగండం ...అని జ్యోతిష్య శాస్త్రం ఎందుకు నిశ్చయిస్తుంది?
భూమి అంతటా ఒకటియే యైనను ఒక స్థలంలో శుద్ధజలం, మరియొక స్థలంలో ఉప్పునీరు, మరో చోట నీరే లేకుండుట మనం చూడుటలేదా? ఒక్కొక్క భూసారము ననుసరించి ఒక్కొక్క సస్యం, పైరు ఫలించుట మనమెరిగిన విషయమే కదా. కొన్నిచోట్ల పండ్లు మధురంగా, మరికొన్నిచోట్ల అవే పండ్లు సామాన్యంగా ఉండుట తెలిసిందే కదా. కొన్ని స్థలములలో గల జలము, ఆహారము సరిగ్గా లేనందున అచ్చట వారు రోగగ్రస్తులై యుండుట చూస్తున్నాం కదా.

శ్రీ శంకరాచార్యులవారు తన పరివార శిష్యులతో కలసి ధర్మప్రచారం చేస్తూ... దేశాటన జరుపుతూ, ఓ ప్రాంతానికి చేరిరి. అక్కడ నదిలో స్నానం చేసి కూర్చుండగా, ఒక సర్పం, ఒక కప్పకు నీడ కల్పించే దృశ్యం వారి కంట పడింది. సహజసిద్ధంగా బద్ధ శత్రువులైన పాము, కప్ప మధ్య పరస్పర మైత్రిభావమునకు కారణం ఆ స్థల  మాహాత్మ్యమేనని గ్రహించి, అది శృంగఋషి(ఋష్యశృంగ మహర్షి) తపస్సు చేసిన చోటని తెలుసుకొని, అక్కడే మొదటి మఠం నిర్మింపదలచి, శృంగేరి పీఠాన్ని స్థాపించారు.

విద్యారణ్యస్వాములవారు పూర్వాశ్రమమున మాధవాచార్యులవారుగా ఉన్నకాలమున - హరిహరరాయలు, బుక్కరాయలు కొందరితో కలసి, తుంగభద్రానది దక్షిణప్రాంతారణ్యమున వేటకై వెళ్ళిరి. అక్కడ ఒక చోట కుందేళ్ళు వేటకుక్కలను తరమడం చూసి, ఆశ్చర్యపడి ఆ విషయమును మాధవాచార్యులవారికి తెలపగా, అది సిద్ధి క్షేత్రమని, ఆ స్థల
మాహాత్మ్యం వలనే, కుందేళ్ళకు అంత శక్తి కలిగెననియు, అందుచే అక్కడ రాజధానిని నిర్మింపజేయించారని చెప్తారు. 

ఒక గ్రామ సమీపమున గల అడవిలోనికి, గొల్లపిల్లవారు ఎప్పటిలా ఆవులను మేపుకై తీసుకెళ్తూ, ఎప్పటికంటే కాస్త దూరంగా వెళ్ళిరి. అక్కడ ఓ సరోవరంతో పాటు దట్టమైన నీడగల వృక్షములు బహుళంగా ఉన్నాయి. పశువులకు నీరు త్రాగించి, ఎండ అధికంగా ఉండుటచే గోవులను ఆ వృక్షనీడలో కట్టి ఉంచి, వారూ భోజనం చేసి విశ్రమిస్తున్న సమయమున... ఆ మార్గమున వెళ్తున్న తొండను వారిలో ఒకరు కొట్టి చంపెను. అప్పుడే కాస్త దూరంలో, ఓ చెట్టునీడలో విశ్రమిస్తున్న ఒక గోపబాలుడు, అది చూసి లేచి కూర్చొని, గంభీరంగా ఇద్దరు పిల్లలను పిలిచి - అదిగో అతను అన్యాయంగా తొండను కొట్టి చంపెను. అతనిని బంధించమని చెప్పి, మిగిలిన నలుగురు పిల్లలను పిలిచి, మీరంతా చెంతన కూర్చొని, న్యాయాన్యాయములను
విచారణ చేయవలసిందిగా ఆజ్ఞాపించగా... ఆ నలుగురు ఆశీనులై, తొండను చంపిన హింసా విషయంపై ధర్మశాస్త్రచర్చలు చేసి, ఓ ప్రాణిని హింసించి చంపినందుకు మరణశిక్షే శిక్షయని తెలపడం... ఆ మొదటిబాలుడు, ఆ చెట్టు కొమ్మకు కట్టి ఉరితీయమని చెప్పడం... బంధించిన ఇద్దరూ, తొండను చంపిన బాలుడిని ఉరితీయడం...ఒకదాని వెంబడి ఒకటిగా ఇవన్నీ జరిగాయి. ఆ పిమ్మట వారు చీకటి పడుతుందని అచ్చట నుండి లేచి ముందుకు రావడం తమ మిత్రునిని ఉరివేయగా చనిపోవడం గుర్తించి, భయంతో వణికిపోతూ, బోరున ఏడుస్తూ గోవులను తోలుకొని ఊరిలోనికి వచ్చి విలపిస్తూ, జరిగింది అందరికీ చెప్పడం... ఇది విన్న గ్రామస్థులు ఈ విషయమును న్యాయాధిపతికి చెప్పడం... వెంట వెంటనే జరిగాయి. ఆ న్యాయాధిపతి ధర్మశీలుడు, సత్యవంతుడు, సూక్ష్మగ్రాహి కావడంతో, ఆ గోపబాలురందరూ అమాయకులు అని గ్రహించి, దీనికైదైన అసాధరణమైన కారణం ఉండవచ్చని తలచి, మరురోజున - ఆ పిల్లలు, పెద్దలతో కలసి ముందురోజున జరిగిన ఆ సంఘటనాస్థలికి వెళ్ళి, ఏం జరిగిందో యధాతధంగా వివరించమని చెప్పమనగా - ఆ పిల్లవారంతా పూర్వదినమున ఎచటెచట ఎవరెవరు ఎలా కూర్చున్నారో, అలా కూర్చొవడం, వెన్వెంటనే అంతవరకు ఏడుస్తున్న ఆ పిల్లవాళ్ళు గంభీరంగా మారడం మొదటివాడు రాజుగా, నలుగురు మంత్రులుగా, ఇద్దరు సేనకులుగా వ్యవహరించడం... ధర్మశాస్త్రములు పఠిస్తూ, ప్రాణహింసకు హింసయే ధర్మశాస్త్ర నిర్ణయమని, అనేక ప్రమాణములు ప్రస్తావిస్తూ, మంత్రులు మాట్లాడడం చూసి అందరూ విస్మయులైరి. అక్కడనుండి వారంతా లేవగానే, మాములుగా భయంతో వణకడం గమనించి ఆ స్థలమున ఏదైన మహిమ ఉండవచ్చని న్యాయాధిపతికి అనిపించి, అక్కడ త్రవ్వించగా... భూమియందు కొన్ని శాసన ఫలకలు, విక్రమాదిత్సుని సింహాసనం ఉచితాసనములుతో కూడిన దర్బారు కనబడెనట.

దక్షిణదేశమున పురందరమను పురమునందు దేవశర్మ అను బ్రాహ్మణుడొకరు వేదశాస్త్రముల నభ్యసించి, పంచయజ్ఞములను, అతిధిలను, మహర్షులను పూజించి అందరి అనుగ్రహం పొందినా, ఎన్నో పుణ్యకర్మలాచరించినా, మనఃశాంతిలేక దుఃఖపడుచుండెను.
కొంతకాలం పిదప అతని యింటికి శాంతచిత్తుడగు ఓ సాధువురాగా, ఆహ్వానించి, ఆదరించి, వారికి సత్కారముల నొనరించి, వినమ్రుడై, తన అశాంతి, దుఃఖముల గురించి అడిగెను. అంతటా - ఆ సాధువు, సౌపురనగరమున మిత్రవతుడను గొల్లవానిని కలువు. నీ మనస్సుకు శాంతి, తృప్తి కలుగుతుందని చెప్పగా, ఆ మాట ప్రకారం దేవశర్మ అక్కడికి వెళ్ళెను.
సౌపురనగర నదీతీరమున ఉన్న వనమున శిలాతలముపై మిత్రవతుడు కూర్చొని ఉండెను. ఆ వనమున జంతువులు జన్మసిద్ధమగు వైరం మరచి, ప్రేమతో వ్యవహరించడాన్ని వింతగా చూస్తూ, మిత్రవతున్ని చేరి నమస్కరించి, తన వివరములు వినయంగా తెలిపి, తన అశాంతి దుఃఖముల గురించి చెప్పి, దుఃఖవిమోచనం చేయమని దేవశర్మ కోరెను. ఇంతలో అచటికి ఒక మేకను పెద్దపులి తరుముకుంటూ రావడం వనంలోనికి వచ్చేసరికి భయం వీడి మేక, కడు కోపంగా భక్షింపకోరి వచ్చిన వ్యాఘ్రం శాంతంగా యూరకుండడం చూసిన దేవశర్మ ఆశ్చర్యంగా, ఇచ్చోటకి వచ్చిన తోడనే వైరం వీడి ఇలా శాంతంగా సఖ్యంగా వుండడానికి కారణమేమని అడగగా - 
ఈ వనమున బ్రహ్మదేవునిచే ప్రతిష్టింపబడిన త్ర్యంబక లింగమున్న దేవాలయం ఉంది. పూర్వము ఈ లింగమును సుకర్మయని విద్వాంసుడు ఆరాధిస్తుండెను. ఓసారి ఒక మహాత్ముడు అతిధిగా రాగా, అతనికి అతిధి పూజ చేసాక, ఆ అతిధి కేవలం ఫలహారివై ఇలా ఎందుకు భగవత్సేవ చేయుచున్నావని ప్రశ్నించగా -
అయ్యా! నాకు జ్ఞానం లేక మిగుల దుఃఖమును చెందుతున్నాను. జ్ఞానం పొందాలని తపన పడుతూ, ఎప్పటికైన ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడని విశ్వసిస్తున్నాను. మీరు నన్ను అనుగ్రహించడానికే వచ్చారేమోననిపిస్తుంది. మీరు అనుగ్రహించితిరేని ధన్యుడౌతానని అనెను. అంతటా ఆ అతిధి గీతా ద్వితీయాధ్యాయమును ఒక రాతిపై చెక్కి ఓయీ సుకర్మా! నీవు దీనిని అభ్యసింపుము. నీయభీష్టం నెరవేరునని చెప్పి, ఆశ్వీరదించి వెడలిరి. 
సుకర్మ, ఆ అతిధి చెప్పే విధంగా చేసిన కొలదికాలమునకే, అతని విచారం తొలగి, మనస్సు నైర్మల్యమును పొంది, జ్ఞానవంతులైరి. ఆ జ్ఞానవంతుడు సంచరించిన ఈ స్థలం శాంతితపోవనముగా మారడంతో ఇచ్చట అందరూ ప్రేమగా శాంతంగా ఉందురని మిత్రవతుడు తెలిపెను.
 
దీనిబట్టి మీకు అర్ధమయే ఉంటుంది...
స్థల బేధాలు, స్థల మాహాత్మ్యం ఉంటుందని. 
                 

అటులనే - మన దివ్య క్షేత్రాల స్థలపురాణాలను, అరుణాచలం గురించి శ్రీ రమణులు చెప్పినది... చదవితే, ఈ విషయం మరింత సుస్పష్టమౌతుంది.   

  
 

31, మే 2021, సోమవారం

కలడు కలండనెడువాడు కలడో లేడో...

అక్కడక్కడ అప్పుడప్పుడు వినబడే ప్రశ్నలు -


దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనిపించడు?
ఇటువంటి ప్రశ్నలు భగవంతునిపై ఆర్తితో అడిగేవారు కొందరయితే, సంసార  ఆవేదనతో అడిగేవారు కొందరు, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో అడిగేవారు మరికొందరు. నిజానికి ఈ ప్రశ్నలకు మనఋషులు, గురువులు, పెద్దలు...ఎందరో ఎన్నో విధాలుగా సమాధానం తెలిపారు. మన పురాణాలు, శాస్త్రాలు కూడా స్పష్టంగా సమాధానం తెలుపుతున్నాయి.  భాగవతంలో గజేంద్రుడు ఆర్తిగా ప్రార్ధనతో ప్రారంభించి, ఆవేదనతో "కలడు కలండనెడువాడు కలడో లేడో"...అని సందేహంతో ప్రశ్నించి, చివరికి సమర్పణాభావంతో(శరణాగతి) ఒదిగిపోయి, ఏ రీతిలో నారాయణుడిని దర్శించుకున్నాడో అందరికీ విధితమే. 

పుష్పే గంధం తిలే తైలం కాష్ఠేఽగ్నిం పయసి ఘృతం |
ఇక్షౌ గుడం తథా దేహే పశ్యా  త్మానం వివేకతః ||

పుష్పములో సుగంధం, నువ్వులలో నూనె, కట్టెలలో అగ్ని, పాలలో నెయ్యి, చెరకులో బెల్లము ఉన్నట్లుగా... దేహములో ఆత్మలా ఉన్న పరమాత్మను వివేకంతో దర్శించాలి.

మనలో పవిత్రంగా ఉన్న పరమాత్మను క్రియల్లోనే వెతకాలి. 
మనం చేసిన క్రియలచే ఎలాగున సుగంధం, నూనె, నిప్పు, నెయ్యి, బెల్లం ప్రత్యక్షముగా గోచరించునో, అలాగునే వివేకజ్ఞానంచే దేహంలో నుండు ఈశ్వరున్ని చూడగలం.  

రాయి ఒక ఉపకరణం. రాయి తనకు తానుగా శిల్పంగా మారదు. రాయిని శిల్పంగా మలచాలన్న సంకల్పం శిల్పికి రావాలి. శిల్పాన్ని నైపుణ్యంగా  చెక్కడానికి ఉలి లాంటి ఉపకరణాలు కావాలి. ఆ ఉలితో రాయిలో వ్యర్ధరాయిని తొలగిస్తూ, శిల్పాకృతికి ఉండాల్సిన రాతిని నేర్పుగా గుర్తిస్తూ, కృషితో శిల్పాన్ని వెలికి తీయాలి. అట్లే, దేహం కూడా ఓ ఉపకరణమే. దేవుణ్ణి చూడాలనే సంకల్పంతో, చిత్తశ్శుద్ధి అనే ఉపకరణంతో మనలో పేర్కొన్న అజ్ఞానం అనే వ్యర్ధాన్ని తొలగించి సాధనతో లోపలున్న దైవాన్ని గుర్తించి దర్శించాలి.

చిత్తశుద్ధి అంటే నీతి నియమాల జాబితా కాదు. చిత్తశుద్ధి అనేది మీరుండే తీరు. మీరు ఆలోచించే పద్దతి. ఇంకా మీరు ప్రవర్తించే విధానం.
                 - సద్గురు జగ్గీవాసుదేవ్
                

కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల వంటివి జయించినప్పుడే, అంతఃశుద్ధి కలుగుతుంది. అంతఃశుద్ధి లేని సాధన సత్ఫలితం ఇవ్వదు. రావణుడు, హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు చేసిన సాధన ఎవరికీ సాధ్యం కాదు. కానీ; కామ క్రోధాలు జయించలేని కారణంగా, వారు పొందిన అద్భుతమైన వరాలు కూడా వారిని రక్షించలేకపోయాయి. అందుకే అంతఃశుద్ధి అనేది అత్యవసరం.  మనస్సు నిర్మలంగా ఉంటే అజ్ఞానం తొలగి నిశ్చలమైన అంతరంగమున అంతర్యామి గోచరిస్తాడు. కలుషిత మనస్సుతో చైతన్యాత్మను చూడలేం. 

శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్లు -

న తు మాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా | 
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ | |
     
ప్రాకృతములైన ఈ నేత్రములచేత విశ్వరూపధరుడనగు నన్ను చూచుటకు నీవు శక్తుడవు గావు. కావున అప్రాకృతమైన (దివ్య) నేత్రములిచ్చుచున్నాను. ఆ నేత్రములచే ఈశ్వరశక్తి చూడుము.

చిత్తైకాగ్రత, చిత్తశుద్ధి అనే దివ్యనేత్రాలతో పరమాత్మను చూడగలం.
సూర్యుడు సర్వత్ర సమానముగా భూమియందు ప్రకాశించుచుండినను స్వచ్ఛముకాని గోడ మట్టి రాయి మొదలగు వాటిలో ప్రతిబింబించుటలేదు.అలాగునే ఆత్మయు పరమాత్మయు సమానముగా అందరిలో వెలుగుచున్నప్పటికిని రాగద్వేష విషయాది దోషరహితమైన శుద్ధబుద్ధియందు మాత్రమే ప్రతిబింబించును. కావున చిత్తశుద్ధికై ప్రయత్నించాలి.
                   

సదా సర్వగతో ఽ ప్యాత్మా న సర్వత్రావభాసతే |
బుద్ధావేవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబిమ్బవత్ ||
                                 - శ్రీ శంకర భగవద్పాదులు (ఆత్మబోధ)

ఆత్మ సర్వవ్యాపకమైనను, సర్వత్ర ప్రకాశించుట లేదు. పరిశుద్ధ దర్పణం నుండే బింబం గోచరమగులాగున, నిర్మలమైన బుద్ధి యందే ఆత్మ శోభించును.
                     

మనఋషులు, గురువులు, పెద్దలు ఏమని బదులిచ్చారో గుర్తుచేసుకుందాం ఓసారి -
ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ, ప్రపంచ మంతా తిరిగాడుతుండగా, ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడగా... అప్పుడు ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది -

భక్తుడు: స్వామి! పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉంటాడు? 
మహర్షి: చిరునవ్వు నవ్వుతూ, ఒక మహా వృక్షం చూపించి, అది ఏమిటి నాయనా?
భక్తుడు: అది వృక్షం.
మహర్షి: ఓహో వృక్షమా! ఎలా వచ్చింది?
భక్తుడు: విత్తనం ద్వారా వచ్చింది స్వామీ.
మహర్షి: సరే, అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు...
భక్తుడు: ఎందుకు స్వామి? మహావృక్షం కదా! త్రవ్వితే చచ్చిపోతుంది.
మహర్షి: చచ్చిపోతుంది కానీ, ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది.
భక్తుడు: అయ్యో స్వామీ! అదెలా సాధ్యం అవుతుంది? 
మహర్షి: విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు... విత్తనం చూడలేమా?
భక్తుడు: విత్తనమే చెట్టుగా మారింది.  చెట్టుకి విత్తనానికి తేడా లేదు. మొక్క మొలిచాక విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా స్వామీ...

మహర్షి: ఇదే నాయనా! నీ సందేహానికి సమాధానం.

విత్తనం అనేది పరమాత్మ. ఆ పరమాత్మే వృక్షం. అనగా వృక్షమనే  సృష్టి. సృష్టి వేరు, పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము. కనిపించేదంతా పరమాత్మ మయమే.
                     


దేవుడు ఉన్నాడా - లేడా? అన్న సందేహం వచ్చిన వ్యక్తి, ఓ సద్గురువును సమీపించి,దేవుడు ఉన్నాడా? దేవుడుంటే చూపించమని వినయంగా ప్రశ్నించగా -

 
ఆ గురువు తన శిష్యుని పిలిచి, చెవిలో పంచదార కలిపిన నీరు ఒక గ్లాసుతో తెమ్మని చెప్పగా, శిష్యుడు తెచ్చాడు. అప్పుడు గురువు తనను ప్రశ్నించిన  వ్యక్తితో సంభాషించడం ప్రారంభించారు...  

గురువు: నాయనా! ఈ గ్లాసులో ఏముంది?
వ్యక్తి: మంచి నీరు.
గురువు: సరిగా చూసి చెప్పు, కేవలం మంచి నీరేనా?
వ్యక్తి: అవునండీ... కేవలం మంచి నీరే.
గురువు: అయితే, ఒకసారి త్రాగి చెప్పు.
ఆ వ్యక్తి నీటిని త్రాగాక..
గురువు: ఇప్పుడు చెప్పు, కేవలం నీరేనా?
వ్యక్తి: గురువు గారూ, ఇది పంచదార కలిపిన నీరు.
గురువు: మరి ఇందాక కేవలం మంచినీరే అని చెప్పావు. ఇప్పుడు పంచదార కలిపిన నీరని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావ్?
వ్యక్తి: ఎలా అంటే, అప్పుడు కేవలం నీటిని మాత్రమే చూసి, అందులొే కరిగి ఉన్న పంచదార కానరాక, అది కేవలం మంచినీరని పొరపడి చెప్పాను. కానీ, ఇపుడు నీటిని త్రాగాను. నీటియందలి పంచదార రుచి  అనుభవించిన మూలంగా ఇది పంచదార నీరని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.
గురువు: అంటే, అనుభవ పూర్వకంగా తప్పితే అది పంచదార నీరు అని నీవు తెలుసుకొేలేకపోయావ్ అంతేనా?
వ్యక్తి: అవునండీ.
గురువు: సరే, ఇపుడు నువ్వు త్రాగినది పంచదార నీరని ఒప్పుకున్నావు. అయితే అ నీటీలో పంచదార చూపించు.
వ్యక్తి: అది అసాద్యం కదండీ.
గురువు: ఏం ఎందుకని?
వ్యక్తి: పంచదార పూర్తిగా నీటితో కలసిపోయి ఉంది. దానిని వేరు చేసి చూపించలేం.

అపుడు ఆ గురువు "చూడునాయనా! నీవు నీటిని చూసి రుచి చూడకయే,  ఏవిదంగానైతే కేవలం మంచినీరే అని పొరపాటు పడ్డవో, అదేవిదంగా మనుష్యులు కేవలం బాహ్య ప్రపంచాన్ని చూస్తూ, వాటి సుఖాల్లో పడి దేవుడు లేనిదానిగా సృష్టిని చూస్తున్నారు. కానీ నీవు నీటిని త్రాగి, అందులోని తీపి రుచిని అనుభవ పూర్వకంగా తెలుసుకొని, అందులో పంచదార కలిసి ఉందని ఎలా గ్రహించావో, అలాగే ఎవరైతే తమ ప్రయత్నం ద్వారా దేవుని ఉనికిని తమ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారో... వారికి దైవం ఉన్నదనే సత్యం తెలుస్తుంది. పంచదార నీరు త్రాగేవారికి తప్ప, మిగతా వారందరికీ అది మంచినీరే. దానిని త్రాగిన వాడికే దాని రుచి తెలుస్తుంది. అటులనే అనుభవించిన వారికే దేవుడున్న సత్యం తెలుస్తుంది. మిగతా వారికి అనుభవం లేక దేవుడు లేడని పలు సందేహాలుకు లోనౌతరు.

ఇంకా నీవు దేవుడుంటే చూపించమని అడిగావు కదా... ఏ విదంగానైతే నీవు, నీటితో కలసి పోయి ఉన్న పంచదారను నీటి నుండి వేరు చేసి చూపించలేవో, అదే విధముగా ఈ సృష్టంతా నిండి పోయి, సూక్ష్మాతి సుక్ష్మరూపంలో అణువణువూ వ్యాపించియున్న భగవంతుని ప్రత్యేకంగా వేరుచేసి చూపంచలేం.

సృష్టిలో ఉండే ప్రతీదీ భగవత్సరూపమే. జీవుని రూపంలో ఉండేది ఆ భగవంతుడే. రూప నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే. వాడొక్కడే ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించుచున్నాడు. నీవూ, నేనూ, ఈ చెట్టూ పుట్టా వాగూ వంకా అన్నీ భగవంతుని రూపాలే. కనుక దేవుని సర్వంతర్యామిగా తెలుసుకుని, ప్రపంచ సుఖాల పట్ల వ్యామెహం విడిచి దైవంపై ప్రేమ, విశ్వాసాలు కలిగి ఉండు. అర్హత పొందాక ఆ అనంతుడు అగుపిస్తాడు" అని చెప్పగా, ప్రశ్నించిన వ్యక్తి సందేహ నివృత్తి అయి ఆనందభరితుడై,  గురువుగారికి ప్రణమిల్లాడు.
                     
                    



ఇదే రీతిలో ఓ విజ్ఞుడుకి పృచ్ఛకునికీ సంభాషణ సాగిందిలా -

పృచ్ఛకుడు: మీరు దేవుణ్ణి నమ్ముతారా?
విజ్ఞుడు: నమ్ముతాను.
పృ: అయితే మీకు దేవుడు కనిపిస్తాడా?
వి: నిస్సందేహంగా కనిపిస్తాడు.
పృ: సందేహస్పదంగా చూస్తూ... ఆహా! ఎప్పుడు... ఎక్కడ... ఎలా... మీకు కనిపించాడు?

స్వచ్ఛత తప్ప ఏ మాలిన్యమూ లేని పసిపాపాల చిరునవ్వుల్లో...

తనువు చిక్కి శల్యమైపోతున్నా,
నేల దున్ని పదిమంది ఆకలి తీర్చే అన్నదాతల స్వేదంలో...

జన్మభూమి ఋణం తీర్చుకొనుటకు
ప్రాణాలను సగర్వంగా అర్పించగలిగే వీర జవానుల దేశభక్తిలో...

శ్రమైక జీవన సౌందర్యానికి ఏకైక చిరునామా అయినా కార్మికుని శ్రమ ఆరాటంలో...

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హైందవ ధర్మాన్ని విడువక ఆచరణాత్మకంగా చూపే  గురువుల కర్మాచరణలో...

వేళకాని వేళ జనారణ్యంలో చిక్కుకున్న
ఆడబిడ్డను మృగాళ్ల బారిన పడకుండా, క్షేమంగా తన గూటికి చేరేందుకు సాయమందించే పుణ్యాత్ముల్లో...

తాను మరణపుటంచుల్లో ఉన్నప్పుడు,
అవయవదానం చేసి సాటి మనిషికి ప్రాణంపోసి, అమరత్వం పొందే త్యాగధనుల్లో...

ఇవ్వడమొక్కటి తప్ప, ఆశించడం తెలియని
ఈ ప్రకృతి రమణీయతలో...

ప్రకృతిలో పరోపకార్ధమై మెలిగే జీవరాశిలో...

ఈ పంచభూతాల్లో...

నాకెప్పుడూ దేవుడు కనిపిస్తూనే ఉంటాడు...
చూడాలే గానీ, మీకు కనిపిస్తాడు...అని నిర్మలంగా నవ్వుతూ విజ్ఞుడు చెప్పగా - 
పృచ్ఛకుడు నమస్కరిస్తూ, "మిత్రమా! నాకిప్పుడు నీలోనూ, నిర్మలమైన నీ చిరునవ్వులోనూ,  దేవుడు కనిపిస్తున్నాడు"... అని బదులిచ్చాడు.

చూసే దృష్టిబట్టే ఆ అనంతుని దర్శనం.

                           🕉 🕉 🕉  

తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమా|
నశ్యతి క్రియయా పుత్ర పురుషస్య తథా మలః ||
జీవస్య తండులస్యేవ మలం సహజ మప్యలమ్ |
నశ్యత్యే వానసందేహః తస్మాదుద్యమవాన్భవ ||
                               - శ్రీ వసిష్ఠ మహర్షి (శ్రీయోగవాసిష్టము)        
                       
బియ్యం పుట్టునప్పుడు పొట్టు తౌడులతో కూడియుండును. రాగి చిలుముతో కూడి యుండును. దంచుటచే పొట్టు తౌడు పోయినట్లు, స్ఫుటముచే చిలుము తొలగినట్లు అనుష్టానంచే జీవుడను  శుద్ధుడగును. 
                  

పరిపూర్ణత అనేది ఆచరణ నుండి మాత్రమే వస్తుంది.
                       🕉  🕉  🕉

దేవుడు ఉంటే కష్టాలనుండి కాపాడడా? 

ఒక పండితుడు, జుట్టు బాగా పెరిగిందని క్షౌరశాలకి వెళ్ళగా, ఆ క్షురకుడు జుట్టు కత్తిరిస్తూ, పండితునితో ముచ్చటిస్తూ... 
పంతులుగారు, నాకు ఎప్పటి నుండో ఒక సందేహం...
దేవుడు ఉన్నాడా? దేవుడే ఉంటే, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు? నాతో పాటు లోకంలో, చాలామంది ఎన్నో బాధలు పడుతున్నారు. దేవుడు ఉంటే...ఇంత మంది బాధలుపడుతూ ఉంటే, చూస్తూ ఊరుకుంటాడా? వచ్చి కాపాడాలి కదా… అన్నాడు. అప్పుడు ఆ పండితుడు సరేగానీ, ఇప్పుడు నాతోపాటు మా ఇంటి వరకు వస్తావా...అని అడిగాడు. సమాధానం తెలుసుకోవాలన్న పట్టుదలతో ఉన్న క్షురకుడు సరేనని బయలుదేరాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక , ఓ బజారులో గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని చూపిస్తూ, చూడు...ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు. వీరి జుట్టు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పొడుగ్గా, పొట్టిగా, చింపిరిగా ఉంది. వారందరి జుట్టు ఇలా అడ్డదిడ్డంగా ఉంటే, కత్తిరించక చూస్తూ నిల్చున్నావేమిటి... అని మందలించాడు. ఆ మాటలకు ఒకింత కోపంగా క్షురకుడు, ఏమిటండీ పంతులుగారు, జనానికి జుట్టు పెరిగితే, నేను ఊరంతా తిరిగి వీళ్ళందరి జుట్టు కత్తిరించాలా? వాళ్ళు నా దగ్గరికి వచ్చి మా జుట్టు పెరిగింది, కత్తిరించండి అని అడిగినప్పుడు కదా కత్తిరించగలను. దారిన పోయేవారిని ఆపి కత్తిరిస్తే, వాళ్ళు ఊరుకుంటారా? నన్ను తిడతారు, కొడతారు అని అన్నాడు.
అంతటా ఆ పండితుడు, ఏమయ్యా! ఈ జనాలు జుట్టు కత్తిరించుకోవాలనుకొని నీ దగ్గరికి వస్తే కదా, నీవు కత్తిరిస్తావు. అలాంటిది దేవుడు మాత్రం నీ దగ్గరికి వచ్చి నీ కష్టాలు తొలగించాలా? ఇదెక్కడి న్యాయం అని క్షురకుడుని అడిగాడు. నువ్వెలాగైతే నీ దగ్గరికి వచ్చినవారికి మాత్రమే జుట్టు కత్తిరిస్తావో, అలాగే దేవుడు కూడా అతని వద్దకెళ్లి మొర పెట్టుకుంటే, వాళ్ళ మొర ఆలకించి కాపాడుతాడు అని చెప్పాడు. అప్పుడు ఆ క్షరకుడు అయ్యా, నా సందేహం ఇప్పుడు నివృత్తి అయిందని ధన్యవాదాలు తెలిపాడు. 
                  🕉  🕉  🕉

చివరగా మన వివేకనందుని అనుభవాన్నీ మననం చేసుకుందాం. ఒకనాడు నరేంద్రుడు రామకృష్ణపరమహంసతో, నాకు దేవుణ్ణి చూపించండి... అంటాడు. ప్రశ్నలో స్పష్టత, ప్రశ్నించేవారి దృఢత గుర్తించిన రామకృష్ణపరమహంసవారు తన పాదమును మెల్లగా నరేంద్రుని ఒడిలో ఉంచగా, సమాధి స్థితికి వెళ్ళి, కొంత సమయం తర్వాత బాహ్యస్మృతికి వచ్చెను. ఆ పిమ్మట సందేహాలు లేనిస్థితికి చేరెను. అనుభవజ్ఞానము కల్గేంతవరకే సందేహాలు. 
     
         సర్వేషు రమంతే ఇతిరామః    
          
అందరిలో రమించు దివ్య చైతన్యమే శ్రీరామచంద్రుడు.

విషయానురక్తిని విడిచి, ఆత్మానందంలో మునిగి, ఆత్మారాములై తరించమన్నదే ఋషుల వాక్కు. ఇదే జన్మ సాఫల్యత రహస్యం.