అత్రి అనసూయల చరితం
శ్రీ దత్తాత్రేయుని జననం
అనసూయాసుతం దేవం అత్రివంశకులోద్భవం
దిగంబరం మహాతేజం దత్తమానందమాశ్రయే
అత్రి అనసూయల అఖండ తపఃశక్తిని, పాతివ్రత్యశక్తిని త్రిమూర్తులు మెచ్చి,
"ఆత్మానా స్వయం దత్తః ఇతి దత్తాత్రేయః"
త్రిమూర్తులు ఏక స్వరూపంలో శ్రీ దత్తుడిగా దత్తమయ్యారు.
అత్రి అనసూయల పుత్రుడు కావున ఆత్రేయుడై, దత్తాత్రేయుడుగా కొనియాడబడుతున్నాడు.
సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులు ఒక్కటైతే, అది పరబ్రహ్మ స్వరూపమౌతుంది. దత్తునిది షోడశ కళాపరిపూర్ణుడయిన పరబ్రహ్మతత్వం.
పై విషయాలు క్రిందటి టపాలో స్మరించుకోవడమైంది.
గురుదేవ దత్త
శ్రీమద్భాగవతం పేర్కొన్న ఏకవింశతి (21) అవతారములలో దత్తావతారం ఆరవది.
అన్ని అవతారములు తమకు నిర్దేశించిన కార్యమును పూర్తి చేసుకొని నిష్క్రమిస్తే, ఒక్క దత్తావతారం మాత్రం నేటికీ విరాజిల్లుతున్నది.
అవతారములన్నింటిలో గురుదేవ అని దత్తాత్రేయుని మాత్రమే పిలుస్తాం. శ్రీ దత్తుడు గురువు దైవము కూడా. అందుకే ఆయనను గురుదేవ దత్త అని వ్యవహరిస్తారు.
ఈ శ్లోకము పరిపూర్ణముగా దత్తునికే వర్తిస్తుంది.
బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగవిద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు దత్తాత్రేయుడు.
బ్రహ్మకు ఆవరించిన మాయను తొలగించి, వేదాలను స్ఫురణకు తెచ్చిన పరబ్రహ్మం "దత్తాత్రేయుడు".
వశిష్టులవార్కి యోగవిద్యను ప్రబోధించిన గురుదేవులు "దత్తాత్రేయుడు".
పరశురాముడికి శ్రీవిద్యను ప్రసాదించిన పరమాత్ముడు "దత్తాత్రేయుడు".
కార్తవీర్యర్జునుని అనుగ్రహించి ఆత్మవిద్యను తెలిపిన భక్తవత్సలుడు "దత్తాత్రేయుడు".
యదువుకు జ్ఞానబోధను, ప్రహ్లాదునికి ఆత్మానంద బోధను, అలర్కునకు ఆత్మజ్ఞానాన్ని, పింగళనాగునకు జ్ఞానయోగసిధ్ధిని.....ఇలా ఎందరినో అనుగ్రహించి తరింపజేసిన మహిమాన్వితుడు "దత్తాత్రేయుడు".
స్మర్తుగామి
"స్మరణమాత్ర సంతుష్టాయ దత్తాత్రేయాయ నమః"
దత్తస్తుస్మరణ ప్రియః అని పురాణ వచనం. స్మరణ మాత్రం చేతనే ప్రీతుడౌతాడు.
దలాదనుడు అనే మహర్షి, స్మరించినంత మాత్రముననే ప్రత్యక్షమగునందురే, ఒకపరి దత్తుని పరీక్షించాలని, 'దత్త దత్త' అని పిలిచాడట. వెంటనే దత్తుడు ప్రత్యక్షమై ఏం కావలెను అని అడుగగా, పరీక్షించదలచి పిలిచితిని, మన్నింపమని మనవి చేయగా,
"మమ ప్రకృతిరీదృశీ, స్మర్తుగామీ న సందేహూ, ద్విసప్త భువనేష్వహం " అని దలాదన మహర్షికి చెబుతూ, ఇది నా ప్రకృతి. భక్తి ఉన్నా, లేకున్నా నన్ను ఒక్కసారి పిలిస్తే, ఈ పదునాల్గు భువనములలో ఎక్కడ ఉన్నా వారి ముందు ప్రత్యక్షమై వారి కష్టాలు తీరుస్తాను అని, మహర్షికి దత్తాత్రేయస్వామి వజ్ర కవచం తెలిపెను.
ఆధ్మాత్మికతత్వాన్ని గ్రహించాలనుకునే జ్ఞానసాధకులకైనా, భక్తియోగాన్ని అనుసరించే భక్త జనావళికైనా, సంసారంలో ఉంటూనే కర్మయోగంతో మోక్షాన్ని సాధించాలనుకునే కర్మయోగులకైనా, అంతర్యామి దర్శనముకై అంతర్యానం చేస్తున్న ధ్యానులకైన.....
ఇహపర తృప్తిని అందించగల దైవం దత్తాత్రేయుడు.
శ్రీ దత్తాత్రేయ అనుగ్రహ లీలలు
కృతయుగములో బ్రహ్మ సృష్టి చేసెను. వారెల్లరు తపస్సులు జ్ఞాన విశారదులైరి. అందరూ పరమాత్మ ధ్యానంలో యుండుట వలన సృష్టి జరుగుట లేదు. ప్రజలలో అనురాగ విద్వేషాలు లేవు. ప్రాణిజాలమునకు సంసార సుముఖత కలిగించుటకు అవిద్య లేక మాయను సృష్టించుటకు బ్రహ్మ తీవ్రంగా ఆలోచిస్తూ, ఆ క్రమంలో తీవ్ర ఒత్తిడి నొంది, తాను సృష్టించిన అవిద్య వలన స్మృతిని కోల్పోయి, వేదములను మరచిపోవుట వలన రేణుకాదేవిని ఆరాధించగా, ఆమె ప్రత్యక్షమై, దత్తాత్రేయుని ఆశీస్సులు పొందమని చెప్పి, సహ్యాద్రిపై ఉన్న దత్తాత్రేయుని చూపించగా,
బ్రహ్మ అనఘాదేవి సమేత దత్తాత్రేయుని దర్శించి, అన్నింటినీ మరిచానని, పూర్వ స్మృతిని ప్రసాదించమని కోరగా, రేణుకాదేవియే వేదమాత, ఆహ్లాదిని, జ్ఞానయోగి, గాయత్రి... అని తెలిపి, నీవు విస్మరించినదంతయు స్ఫురణకు వచ్చునని దత్త ప్రభువు చెప్పెను. అంతట అనఘాదేవి నుండి వేదములు రేణుకాదేవిని చేరినవి. పిమ్మట రేణుకాదేవిని, అనఘాదేవిని బ్రహ్మ ప్రార్థించగా, మరిచిన వేదములు, గాయత్రీ మంత్రం స్ఫురణకు వచ్చెను. ఈ విధంగా బ్రహ్మకు దత్త ప్రభువు గురువై భాసిల్లెను.
దత్తాత్రేయ స్వామి తనని దర్శించగోరువారిని అనేక విధాలుగా పరీక్షించేవారు. భయబ్రాంతులు గొలిపెడివారు. బాలోన్మత్త పిశాచ రూపములలో సంచరించేవారు. అంగనతో కూడి యుండి మద్యం సేవిస్తున్నట్లు కన్పించి, తన దరి చేరేవారిని పరీక్షించేవారు.
ఒకపరి దత్తాత్రేయ స్వామి ఏకాంత నిష్టలో తపస్సు చేయుటకై వెళ్ళుచుండగా, ముని కుమారులు వారి వెంటపడగా, దత్త ప్రభువు ఒక మడుగులో దిగి అదృశ్యుడయ్యెను. ముని కుమారులు చాలాకాలం ఆ మడుగు వద్దే వేచియుండిరి. దత్తుడు వందేళ్లు తర్వాత వారిని పరీక్షించుటకై, ఒక అంగనతో కలసి నీటి నుండి బయటకు వచ్చి, ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకొనగా, అది చూసి కూడా ముని కుమారులు కదలలేదు. అప్పుడు దత్తుడు మద్యం సేవిస్తూ, ఆమెతో సరసములాడుచు కొంత అసభ్యంగా ప్రవర్తించడంతో, కొందరు మునికుమారులు ఇతను దురాచారపరుడు, స్త్రీలోలుడు అని భావించి, దత్తుని విడిచి వెడలిరి. ఇది దత్తలీల అని గ్రహించి నిలిచిన వారికి తన నిజ స్వరూపం చూపించి అనుగ్రహించారు.శ్రీ దత్తుని రూపం -
మాలా కమండలు ధరః కర పద్మ యుగ్మే
మధ్యస్థ పాణి యుగళే ఢమరు త్రిశూ లే
యన్యస్త ఊర్ధ్వకరయో శుభ శంఖ చక్రే
వందే తమత్రి వరదం భుజషట్కయుక్తం
బ్రహ్మ సంకేతం -
క్రింద చేతులలో అక్షరమాల, కమండలం. తపో జ్ఞాన మార్గాలకు గుర్తు.
విష్ణు సంకేతం -
పై చేతులలో శంఖం, చక్రం.
శివ సంకేతం -
మధ్య చేతులలో త్రిశూలం, ఢమరుకం
శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం -
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరు భుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది.
మూడు శిరస్సులు :
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ ల త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
నాలుగు కుక్కలు :
నాలుగు వేదములకు సంకేతం.
ఆవు :
సమస్త భూమండలానికి సంకేతం. వేద స్వరూపం. జ్ఞానానికి గుర్తు.
మాల :
అక్షరమాల, సర్వమంత్రమయము, సర్వ వ్యవహారములకు మూలము.
త్రిశూలము :
ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల త్రిపుటి.
శంఖం :
నాదం.
చక్రము :
అవిద్యా నాశకము, ఆత్మావలోకన సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.
ఢమరుకం :
సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
కమండలము :
కర్మఫలదాయకం. కష్టాలను తప్పించునది. శుభములను నొసగునది.
ఒకానొకసారి నైమిశారణ్యములో యతులు నారాయణుని ధ్యానించుచుండగా, త్రిమూర్త్యాత్మకముగా శంఖము చక్రము గద పద్మము ఢమరుకం జపమాల మొదలగు ఆయుధములు ధరించి సర్వము తనలో చూపు దత్త భగవానుని విశ్వరూపమును దర్శించి, మహానుభావా! త్రిమూర్తి స్వరూపా! దేవాధిదేవా! దత్తా! దత్తా! అని జపించుచుండగా, దత్త ప్రభువు అదృశ్యమైరి. అంతవరకు ముండ్ల పొదలు, క్రూరమృగాల మయమై యున్న ఆ అరణ్యమంతా పూలు పండ్లతోటలతో ఫలభరితమై పక్షుల కిల కిలా రావములతో మార్పు చెందడంతో, ఇదంతా దత్త భగవానుని అనుగ్రహం అని గ్రహించి అందరూ, దత్తా! గురుదత్తా! అని కీర్తించిరి.
త్రేతాయుగ ప్రారంభమున - మహిష్మతీపురమును హైహయ వంశస్తుడైన కృతవీర్యుడను రాజు పరిపాలిస్తుండెను. అతని భార్య శీలధారాదేవి. వారికి కలిగిన సంతానం పుట్టిన వెంటనే చనిపోవుచుండిరి. వంశోద్దరణ పుత్రులకై ఎన్నో నోములు, యాగములు చేస్తుండిరి. ఒకసారి శీలధారాదేవి యాజ్ఞవల్కుని ఆశ్రమము మీదుగా వెళ్ళుచు, మహర్షి సతీమణియగు మైత్రేయిని దర్శించి, తన బాధ చెప్పుకొనగా, ఆమె సూచన మేరకు భర్తతో కలిసి అనంతవ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. బృహస్పతి ఆదేశానుసారం కృతవీర్యుడు సూర్యోపాసన కూడా చేసెను. వారికి చొట్ట చేతుల పుత్ర సంతతి కలిగెను. ఆ బాలునికి అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుని కుమారుడు అగుట వలన కార్తవీరార్జునుడని పిలవసాగిరి. కొంతకాలమునకు మహారాజు మరణించడం, బుద్ధి కుశలత కలవాడైన, హస్తవైకల్యం వలన రాజ్యపాలన చేయలేనని, రాజుకు భుజబలం ఉండవలెనని, తాను తపస్సు చేసి శక్తులను సంపాదించిన తర్వాత వచ్చి, రాజ్యపాలన చేస్తానని కార్తవీరార్జునుడు అనగా, అయితే నీవు దత్తాత్రేయుని ఆశ్రయించు, వారు అనేక రీతుల్లో పరీక్షించెదరు కాబట్టి, జాగ్రత్తగా మెలగమని గర్గమహర్షి చెప్తూ, జంభాసుర వధ తెలిపెను.
జంభాసుర వధ -
పూర్వం జంభాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి, అనేక వరములు పొంది, స్వర్గంపై దాడి చేయగా, దేవేంద్రుడు ఎదుర్కోలేక, దేవగురువైన బృహస్పతిని వేడుకోగా, ఈ రాక్షసుడు అజేయమైన బలం కలవాడగుట వలన సహ్యాద్రి పర్వతం పైనున్న దత్తాత్రేయుని ఆశ్రయించమని, ఆయన అనేక పరీక్షలు పెట్టుదురని, వారి అనుగ్రహం పొందమని దేవ గురువు చెప్పెను.
గందర్వాంగనలు చుట్టూ నృత్య మొనర్చుచుచుండగా, మధుపానమును సేవిస్తూ మత్తుడై ఉన్న దత్తుని, దేవేంద్రుడు దర్శించి ప్రార్థించి, జంభాసురుడు తమపై దండెత్తి తమను జయించిన విషయమంతయూ చెప్పి, స్వర్గంపై ఆధిపత్యం తనకు తిరిగి వచ్చునట్లు చేయమని కోరగా, మగువ మధ్యములతో మునిగియున్న వానిని, నన్ను వదిలి వేరెవరినైనా చూసుకొనమని దత్తుడనగా, దత్తుని పాదములు పట్టుకొని, మీరు అభయమియ్యనిదే ఈ పాదములు విడవనని మొరపెట్టుకుంటున్న దేవేంద్రుని పరిపూర్ణ విశ్వాసమును గమనించి అనుగ్రహించి, జంభాసురుని అతని పరివారమును ఇక్కడకు వచ్చునట్లు చేయుమని చెప్పెను. దేవేంద్రుడు ఆ రాక్షసునితో తిరిగి యుద్ధం చేయుచూ, సహ్యాద్రి వరకు తీసుకురాగా, జంభాసురుడు దత్త ప్రభువు అంకమందున్న అనఘాదేవి అందచందాలకు మైమరచి, ఆమెను పొందగోరి ఆమెను బలవంతంగా పల్లకిపై కూర్చుండబెట్టి బోయిలై మోయగా, దత్తాత్రేయుడు చిరునవ్వుతో ఇంద్రా! లక్ష్మి వీరి నెత్తిపైకెక్కినది, ఇక ఆమె వారిని విడుచును, వారి బలం క్షీణించి ఐశ్వర్యం తొలగను. ఇదే సమయం...రాక్షసులను చంపుము అని చెప్పగా, జంభాసురునితో సహా రాక్షసులందరూ దేవతుల చేతుల్లో మృతులైరి. లక్ష్మి పల్లకి నుండి అదృశ్యమై, దత్తస్వామిని చేరెను. అనఘాదేవియే లక్ష్మీదేవియనియు, లక్ష్మీ - పాదముల యందుండిన విలువగల భవనములు ఏర్పడుననియు, మోకాళ్ళ యందుండిన ఐశ్వర్యం కలుగుననియు, వక్షస్థలము నందుండిన సర్వ విధములైన కోరికలు తీరుననియు, శిరముపై యుండిన వానిని ఒంటరివానినిగా విగత జీవునిగా చేసి విడిచివెళ్ళునని, అందువలనే జంభాసురుని శిరముపై ఎక్కి అతనిని నాశనం చేసినదని, మద్యం మగువను చూపుట తన లీలయని దేవేంద్రునికి దత్తాత్రేయులు చెప్పిరి.
దేవేంద్రుడు తిరిగి స్వర్గాదిపత్యమును పొందిన ఈ కధనమును విన్న కార్తవీరార్జునుడు, దత్తాత్రేయుని ఆశ్రమముకు వెళ్ళి, అపార భక్తి శ్రద్ధలతో దత్తుని సేవించెను. కఠోర పరీక్షలకు నిలబడి స్వామి అనుగ్రహంకు పాత్రుడయ్యను. ఒక సమయమున దత్తుని నుండి వెలువడిన అగ్నిచే కార్తవీరార్జునుని చేతులు భస్మమయ్యను. 'రాకుమారా! ఉన్న చేతులు కూడా ఊడిపోయినవి. మదిరను త్రాగుచూ, మగువలతో ఆటలాడు నేను నీకు సహాయం చేయజాలను. నీవు పొమ్ము' అని దత్తప్రభువు అన్నను, గర్గముని చెప్పింది గుర్తుంచుకొని, దత్తాత్రేయుని వదలక సేవించడంతో, దత్తుడు ప్రసన్నమై, 'ఏమి నీ కోరిక' అని అడిగెను. అంతట కార్తవీరార్జునుడు ప్రభూ! నాకు వేయి చేతులు కావలెను. భూమి నీరు గాలి యందు సంచరించగలవాడనై, ఎచ్చటికైనను నేను తలచినంతనే పోగలగాలి. సర్వదా నా దగ్గర ధనరాసులుండాలి. యుద్ధములయందు అజేయుడనై యుండాలి. నా రాజ్యంలో సుఖశాంతులుండాలి. ఎంతటి శక్తి కలవాడైనా నేను శిక్షించే శక్తి నాకుండవలెను. సదా నీ భక్తుడనై యుండవలెను. ఎన్నడైనను నేను సన్మార్గం తప్పినచో సత్పురుషులు నాకు దారి చూపవలెను. నాకంటే గొప్పవాడైన నరుడే నన్ను వధింపవలెనని కోరెను. కార్తవీరార్జునుడు కోరిన వరములన్నియు అనుగ్రహిస్తూ, భూమి ఆకాశములయందు సంచరించుటకు ఒక విమానం కూడా దత్తప్రభువు ప్రసాదించగా, కార్తవీరార్జునుడు స్వామికి నమస్కరించి, మహిష్మతీపురం తిరిగి వచ్చి, రాజ్యాన్ని చేపట్టి, మంచి కీర్తి ప్రతిష్ఠలను సంపాదించెను.
అహం ఎటువంటి స్థితిని కల్పిస్తోందో
కార్తవీరార్జునుడు జన్మ వృత్తాంతము పరిశీలిస్తే అర్థమవుతుంది - సుదర్శన చక్రముకు, తాను విష్ణు భగవానుని ఆయుధమునని, ఎందరో రాక్షసుల సంహారం తానే చేశాననే గర్వం, తాను అధికుడనని అహం ఉండడం గమనించిన విష్ణు భగవాన్ సుదర్శన చక్రమును అంగవైకల్యం కలవాడవై భూలోకమున జన్మించమని శపించెను. అలా శాపముచే జన్మించిన కార్తవీరార్జునుడు దత్తత్రేయస్వామి అనుగ్రహంతో సహస్ర బాహువులు పొంది రాజ్యాధిపత్యం వహించెను. దత్తాత్రేయుడు ప్రసాదించిన విమానంపై లోకములన్నియు సంచరిస్తూ, పదునాలుగు భువనములలో సాటిలేని మేటి చక్రవర్తిననే అహంకారముతో ఋషులను దేవతలను తృణీకరించగా, వాయుదేవుడు మందలించగా, తన తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తాపం పొందెను. అలా కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసాక, ఈ భోగభాగ్యాలకు విసుగుచెంది, తిరిగి దత్తాత్రేయుని ఆశ్రయించెను.
భక్తి జ్ఞాన వైరాగ్య విజ్ఞాన సహితమగు ఆత్మజ్ఞానమును ఉపదేశింపమని ప్రార్థించి, దత్త స్వామి చెప్పిన కొన్ని కథల ద్వారా జ్ఞానం పొంది, ముముక్షత్వమును గురించి తెలుసుకొనెను. అలా తెలుసుకున్న విషయములు స్థిరంగా మనస్సునందు నిలిచేటట్లు, ధ్యానం చక్కగా కుదిరేటట్లు అనుగ్రహించమని వేడుకోగా, దత్తుడు కార్తవీర్యునితో "మాయ దాటుటకు నీవు చేయు కర్మలు నాకు అర్పణ చేయు, అట్లు చేసినచో నీ చిత్తము ఏకాగ్రత పొందును" అని చెప్పి, ఆత్మ సాక్షాత్కారం, సమాధి స్థితి కలిగింపతలచి, ఒక గుహలోనికి తీసుకొని వెళ్ళి, నిటారుగా స్థిరంగా కూర్చుండబెట్టి, "నీ గురువుకు నమస్కరించి, నీకు తెలిపిన ఆత్మతత్త్వమును మననం చేయు" అని చెప్పి, కార్తవీర్యుని శిరంపై తన చేయి వుంచి ఆశీర్వదించెను.
దత్తుని కృపచే సమాధిస్థితి త్వరగా కలిగి, ఏడాది పాటు ఆ స్థితిలోనే ఉండి, క్రమేణా బాహ్యస్మృతి పొంది, కొంతకాలం పాటు ఆ ఆశ్రమము యందుండి, మరల మరోసారి సమాధి స్థితి అనుభవమును పొందిన పిమ్మట గురుదేవుని అనుమతితో, తిరిగి రాజ్యానికి వచ్చెను.
ఇలా కొన్నేళ్ల కాలం కార్తవీరార్జునుడు పాలన సాగేక, ఒకరోజు మధ్యాహ్నపూట అతిథి పూజకై ఎదురు చూస్తున్న తరుణంలో అగ్నిదేవుడు చిత్రభానుడను పేరుతో వచ్చి, రాజా! ఆకలిబాధతో ఉన్నాను. నాకు భిక్ష పెట్టి క్షుద్బాధ తీర్చమని కోరగా, మీకు కావల్సినంత ఏదైనా తీసుకొనమని అనుజ్ఞ ఇవ్వగా, చిత్రభానుడు తన నిజరూపమైన అగ్నిరూపుడై పల్లెలు పట్టణాలు అడవులు దహింపసాగెను. ప్రజలు ప్రాణ భయంతో హాహాకారములు చేస్తున్నా, చూసీ చూడనట్లు మిన్నకుండెను. సరయూ నదీతీరంలో ధ్యాననిష్టలో యున్న వశిష్ట మహర్షికి ప్రజల ఆక్రందనలు వినిపించి, ప్రజాక్షేమం మరిచిన కార్తవీరార్జునుడును పరశురాముడు చేతిలోని గండ్రగొడ్డలిచే మరణించుగాక అని శాపమివ్వగా, మహర్షికి నమస్కారము చేసి, ఒకప్పుడు దత్తుని
నాకన్నా పరాక్రమవంతుని చేతిలో మరణం కలుగునట్లు కోరితిని. ఇప్పుడు తమ శాపం దానికి తగియున్నది అని, దత్తుని స్మరించుకొనెను.
ఆ పిమ్మట ఒకానొక రోజు కార్తవీరార్జునుడు సామంతరాజును జయించి విజయవంతంగా వచ్చుచూ, దారిలో జమదగ్నిముని ఆశ్రమము చూసి, ఆశీర్వాదము పొందుటకు ఆశ్రమము లోనికి వెళ్ళి, మునికి ప్రణమిల్లగా, ముని ఆతిథ్యం స్వీకరించమని కోరెను. కామధేనువు సురభి, రాజుకు వారి పరివారమునకు తృటిలో సమస్త ఆహార పదార్థములతో విందు సమకూర్చగా, ఆ ఆవును తనకిమ్మని మునిని కోరెను. ముని అంగీకరించకపోవడంతో సైనికులచే బంధించి బలవంతంగా కామధేనువును తన నగరానికి తోడ్కొని వెళ్ళెను. ముని చిన్న కుమారుడు పరశురాముడు ఆశ్రమముకు వచ్చి, జరిగింది తెలుసుకొని, రాజును, సైన్యాన్ని సంహరించెను. ఈ విధంగా కార్తవీరార్జునుడు పరశురాముడి చేతిలో కైవల్యం పొందెను.
కార్తవీర్యార్జునుని పుత్రులు తమ తండ్రి మరణమునకు జమదగ్ని మునియే కారణమని జమదగ్ని ఆశ్రమానికి వచ్చి, ఆశ్రమమును ధ్వంసం చేసి జమదగ్ని శిరమును ఖండించిరి. జమదగ్ని భార్య రేణుకాదేవి దుఃఖితురాలై రామా, రామా... అంటూ పరశురాముడిని పిలుస్తూ మూర్చిల్లింది. తల్లి పిలుపు విన్న పరశురాముడు పరుగున వచ్చి, క్రోధావేశమున మహిష్మతీపురం వెళ్ళి, కనిపించిన క్షత్రియులనెల్లా సంహరించి, తిరిగి ఆశ్రమముకు వచ్చెను. అతనిని తల్లి రేణుకాదేవి శాంతపరచి, తండ్రి అంత్యక్రియలకు ఏర్పాటు చేయమని చెప్పి, ఒక కావడిని తెచ్చి అందు ఒక వైపు తండ్రి శవమును, రెండవ వైపు తనను ఉంచి తీసుకొని వెళ్ళమని, అట్లు వెళ్ళుచుండగా ఎచట ఆకాశవాణి 'తిష్ఠ తిష్ఠ' అని పలుకునో, అచట దహన సంస్కారాలు చేయమని కోరింది. తల్లి చెప్పిన ప్రకారం పరశురాముడు వారిని కావడిలో ఉంచుకొని పల్లెలు పట్టణాలు దాటుతూ సహ్యాద్రి వద్ద అమలకి అను గ్రామమున దత్తాత్రేయ ఆశ్రమము దగ్గరకు రాగా, తిష్ఠ తిష్ఠ అని ఆకాశవాణి పలుకుట విని అక్కడ కావడిని దించెను. పరశురామా! దత్తాత్రేయుని దర్శించి, దహన క్రియలకు సహాయపడవలసినదిగా ప్రార్థించమని రేణుకాదేవి చెప్పగా -
దిగంబరుడై మద్యం సేవిస్తూ, అంగనలతో నాట్యమాడుచుండు దత్తుని దర్శించి నమస్కరించి, మా అమ్మ రేణుకాదేవి మీకై వేచి యున్నదని చెప్పగా, దత్త ప్రభువు నిజరూపధారై రేణుకాదేవి వద్దకు వచ్చి, ఆమెను స్తుతించి, జమదగ్ని నిర్జీవ దేహమునకు వందనం చేసెను. దత్తుని ఆదేశముతో పుణ్యనదీ తీర్థములను పరశురాముడు సహ్యాద్రి యందే ఉండి తెప్పించి, స్నానం చేసి తండ్రి శవమునకు దహన సంస్కారాలు చేసి చితిని వెలిగించెను. రేణుకాదేవి భర్త చితిలో తాను సహగమనం చేసెను. దత్త ప్రభువు పరశురామునిచే అతని మాతాపితరులకు అన్ని కర్మలు శాస్త్ర ప్రకారము నిర్వహింపజేసి, ఆకాశమున దివ్యకాంతులతో విహరించుచున్న పితృదేవతలను పరశురామునకు చూపెను.
పరశురాముడు ఇరువది ఒక్కమారు భూ ప్రదక్షణ చేసి క్షత్రియులందరిని సంహరించాక, ఆవేశం తగ్గి ఆశ్రమముకు వచ్చి దత్తాత్రేయుని దర్శించి నమస్కరించెను. పరశురాముని తల్లితండ్రులు దర్శనమిచ్చి, ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు అభినందించి, పాప పరిహారమునకు యజ్ఞం చేయమని చెప్పి, పుత్రుని ఆశీర్వదించి అంతర్ధానమైరి. పరశురాముడు దత్తస్వామి దగ్గరే ఉండిపోగా, సంతోషించిన గురుదేవ దత్తుడు వినిన మాత్రముననే మోక్షమొసంగడి "త్రిపుర రహస్య జ్ఞాన ఖండసారము"ను బోధించెను.
నహుషుడి పుత్రుడు యయాతి మహారాజుకు శుక్రచార్యుని శాపము వలన వార్ధక్యం రాగా, ఆ వార్ధక్యాన్ని కనిష్ఠపుత్రుడు పూరుని సమ్మతంతో తనకి ఇచ్చి, పూరుని యవ్వనం తాను స్వీకరించి, రాజ్యపాలన చాలాకాలం చేసిన పిదప, ఒకనాడు తన వార్థక్యం తాను తీసుకొని రాజ్యాధికారం పెద్దకుమారుడు యదువుకు కాక, చిన్నకుమారుడు పూరునకు ఇవ్వడంతో యదువు అవమానితుడై, రాజ్యం వదిలి అరణ్యముకు పోయెను. ఆ నిర్జనారణ్యములో నేలపై దుమ్మూధూళిలో పరుండి బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్న దత్తుని దర్శించి, వినయంగా ఇలా ప్రశ్నిస్తారు - మహాత్మా! మీముఖంలో కోటి సూర్యుల వెలుగు కనబడుతుంది, ఇంద్రియ అలజడి కనబడడం లేదు, తృప్తిగా వున్నారు, ఆహార సముపార్జన కోరిక లేదు, మానవులు సాధారణముగా సుఖభోగాలు, అధికారం, ధనం, కీర్తి... ఇలాంటి ఎన్నోవాటికై ఆసక్తులై ఉంటారు. కానీ; మీరు అనాసక్తులై ఒంటరిగా ఈ కారడవిలో మహదానందమును ఎలా సొంతం చేసుకోగలిగారు? ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ గురువు ఎవరు? అని ప్రశ్నించగా -
దానికి దత్తాత్రేయులవారు "నా ఆత్మయే నా గురువు. ఆపై నేను ఈ పరమానందస్థితిలో జీవించడమెలాగో ఇరవై నలుగురు గురువుల నుండి నేర్చుకున్నా"నని బదులివ్వగా, వారెవరో తెలియజేయమని యదురాజు కోరగా, దత్తాత్రేయులవారు వివరిస్తున్నారిలా -
ఇరవై నలుగురు గురువుల గురించి తదుపరి టపాలో -