2, జులై 2023, ఆదివారం

శ్రీ దత్తుని వైభవం - ఇరవై నలుగురు గురువులు



మూడుస్థితులు దాటి దోషాలు వెదకని తత్వం లోకి వెళ్ళినవారికి పరమాత్మ సాకారం అవుతాడని, గురువు దైవమూ దత్తుడే అని, తనను స్మరించిన వారికి వెంటనే అనుగ్రహించే సిద్ధుడు దత్తుడు అని...క్రిందటి టపాలో స్మరించుకున్నాం.


దత్త వైభవం

యోగమే దత్తుని మార్గం.
నిస్సంగత్వమే దత్తుని ఉపదేశం.
జ్ఞానమే దత్తుని ఉపాసన.

దత్త ప్రపంచం లోని వారు ఎల్లప్పుడూ దత్తోహం అని ధ్యానిస్తూ ఉంటే, దత్త స్వరూపులుగా అవదూతలుగా మారిపోతారని ప్రతీతి. 

దత్తాత్రేయుడు ప్రతిరోజు స్నానం కాశిలో, ధ్యానం మాహురీపురములో, భిక్ష కొల్హాపురిలో, నిద్ర సహ్య పర్వతం దగ్గర చేయుదురని గురుచరిత్రలో తెలుపబడింది.

దత్తుని ఇరవై నలుగురు గురువులు

సృష్టిలో ప్రతీ అంశం నుండి మానవుడు జ్ఞాన సముపార్జన చేయవచ్చును. అలా ప్రకృతిలోని పంచభూతాలు, పశు పక్ష్యాదులు తనకి గురువులని దత్తాత్రేయుల వారు తెలిపిన ఇరవై నలుగురు గురువుల వివరణ -

1) పృథ్వి (భూమి):
జీవులు కాళ్ళతో తొక్కుతున్నా,  తనపై మలమూత్రాదులను విసర్జిస్తున్నా, త్రవ్విన, దున్నిన అన్నిటినీ భరించి ద్వేషభావం లేకుండా సస్యాలు ఆశ్రయము ఇచ్చి, పోషిస్తున్న భూమి నుండి సహనాన్ని నేర్చుకున్నాను.

2) వాయువు: 
వాయువు వివిధ వస్తువుల బట్టి శీతల ఉష్ణ, సుగంధ దుర్గంధాలపై సంచరించిన, తాత్కాలికంగా వాటిచేత ప్రభావితుడైనట్లు అనిపించినా, దేనితోనూ సంగత్వమేర్పరచుకోక, తన సహజ నైర్మల్యంతో ఎల్లెడలా వుండే వాయువును చూసి, వేటి నడుమ వుండాల్సివచ్చిన వాటికి చిక్కకుండా నిర్మలంగా నిస్సంగుడనై ఉండడం నేర్చుకున్నాను.

3) ఆకాశం: 
గాలి, మేఘం, సూర్యచంద్ర నక్షత్రాదులతో నిండివున్నట్లు కనిపించిన, దేనితోనూ ఎలాంటి సంబంధం లేకుండా సర్వత్రా వ్యాపించి ఉండే ఆకాశాన్ని చూసి, ఆత్మ కూడా ఆకాశం వలె సర్వవ్యాపి అని, శరీరాదులతో ఈ నశ్వర జగత్తు ఆత్మ యందే ఉన్ననూ దేనితో సంగత్వం లేకుండా ఉందనే సత్యాన్ని గ్రహించాను. అలానే త్రిగుణాల వికారరూపమైన దేహానికి దానివలన కలిగిన మనోవికారాలకు అంటనివాడై ఆకాశం మాదిరిగా స్వచ్ఛంగా వుండాలని గ్రహించాను.

4) జలం: 
ప్రాణికోటికి దాహం తీర్చి, అందరికీ ఆరోగ్యం చల్లదనం కల్గించి, వృక్షములను సస్యములను పోషించి, తనను తాకిన అన్నిటినీ శుద్ది చేసి, శుభ్రతను, పవిత్రతను ఇస్తుంది జలం. పరిశుద్ధ జలం మురికిని పోగొట్టే విధంగా మహాత్ములు పరిశుద్ద అంతఃకరణ కలిగియుండి ప్రాపంచిక మానవుల మనోమాలిన్యం శుభ్రపరచాలని గ్రహించాను.

5) అగ్ని: 
ఒకసారి నివురుగప్పిన నిప్పులా, ఒకప్పుడు విశేషాగ్నిలా ప్రజ్వరిల్లుతూ వెల్లడవుతుంది. రాపిడివల్ల ప్రకటతమయ్యే అగ్నితత్వం వస్తువులలో సూక్ష్మంగా దాగియుండును. మథనం చేత విశేషాగ్నిగా ప్రకటతమై యజ్ఞం చేసేవారి పూర్వపాపాలను హరించి, రానున్న కర్మదోషాలను నివారించడం కోసం ఎవరినుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు కానీ, తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడుగాకనే, వారి పాపాల్ని దహిస్తాడు. అలాగే జ్ఞాని కూడా తన తపశ్శక్తిని గుప్తంగా వుంచుకుంటూ, మానవులను పావన మొనర్చడానికే సర్వులనుండి బిక్షనుగొని వారిని అనుగ్రహించాలని, దీనివలన తాను అపవిత్రుడు కాడని తెలుసుకున్నాను.
తనకి ఆహుతి ఇచ్చిన దేనినైనా దోషమెంచక స్వీకరించి నిర్మలముగా ప్రకాశించే అగ్నిలా, పదార్థములను యెంచక ఆహారంగా ఎవరేం సమర్పించినా స్వీకరించి, నిర్మలముగా తపో జ్ఞానాలతో యతి ప్రకాశించాలని గ్రహించాను. అగ్ని వివిధ వస్తువుల గుణ బేధాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారి యున్నట్లు, తత్వజ్ఞానమనే అగ్నితో వివిధమైన వస్తువుల గుణాలను నిరసించి, సర్వగతమైన సర్వేశ్వరుని తత్వాన్ని గ్రహించి, తనలో తాను అణిగియుండాలని తెలుసుకున్నాను. అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కట్టెను చేరినప్పుడు ఆ రూపంలో భాసిస్తుంది. అలాగే ఆత్మగూడ వివిధ దేహాలయందు తాదాత్మ్యం చెంది ఆయా రూపాల్లో గోచరిస్తుందని తెలుసుకున్నాను.

6) చంద్రుడు:
చంద్రుడు సదా పూర్ణుడే యున్నను, భూమితో పరిభ్రమించుట వలన వృద్ధి క్షయములు పొందినట్లు కనిపించేలాగున, జనన మరణములు శరీరంనకే గాని, ఆత్మకు లేవని గ్రహించాను. అలానే ఆత్మ అనంతం, సంపూర్ణం అయినను శరీర మనో బుద్ధుల ఛాయా ప్రసరణచే ఆత్మ పరిమితమనే భ్రాంతి కలుగుచుందని తెలుసుకున్నాను.

7) సూర్యుడు: 
సూర్యుడు ఒకడే అయినను అనేక నీళ్ళ కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కనబడినట్లు, ఆత్మ ఒకటే అయినను దేహాది ఉపాధి భేదముచే వివిధమూ భిన్నమూ అయినట్లు కనబడుతుందని గ్రహించాను. సూర్యుడేవిధంగా నీటిని తన కిరణాలతో స్వీకరించి మరలా ఎలా విసర్జించునో అట్లే జ్ఞాని కూడా తాను సేకరించిన జ్ఞానాన్ని బోధ రూపంలో జీవులకు ప్రసాదించాలని గ్రహించాను. ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి. కలువలు ముకుళించుకుంటాయి. అలానే జీవులు వారి వారి పరిపాకాన్ననుసరించి ఆ బోధను గ్రహించగలుగుతారు కానీ,
సూర్యుడు మాత్రం అన్ని జీవులకు వెలుగును ఉష్ణశక్తిని అంతటా సమానంగా ప్రసాదించడంలో జీవుల గుణ దోషాలను యెంచనట్లే, యతులు తమ అనుగ్రహమును గుణ దోషాలు యెంచక అందరికీ ప్రసాదించాలని గ్రహించాను. సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్యరూపాలను సర్వులకూ గోచరింపజేసినట్లే, జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసువులకు తెలియజేయాలని గ్రహించాను.

8) కపోతం (పావురం):
ఒకచెట్టుపై పావురముల జంట తమ పిల్లలతో వున్నవి. ఒకరోజు ఒక వేటగాడు పన్నిన వలలో పిల్ల పావురాలు చిక్కుకున్నవి. బయటకు వెళ్ళి వీటికి ఆహారం తెచ్చిన తల్లిపావురం పిల్లలు వలలో చిక్కుకోవడం చూసి, ప్రేమపాశంతో వాటి వద్దకు వెళ్ళి అదీ చిక్కుకుంది. అప్పుడే వచ్చిన మగపావురం వచ్చి తన భార్య పిల్లలు వలలో పడుట చూసి, వాటిమీదున్న మమకారంతో ఆ వల వద్దకు వెళ్ళి, అందులో చిక్కుకుపోవడం చూసి వ్యామోహ మమకారాలే బంధాలకు కారణమని గ్రహించాను.

9) అజగరం (కొండచిలువ):
కొండచిలువ తన ఆహారం కోసం అలమటించి తిరుగాడక, యాదృచ్చికంగా లభించిన ఆహారంను రుచికరమైన కాకపోయినా స్వీకరించినట్లు, ఇహపర సుఖాలకోసం ప్రాకులాడక, దైవికంగా లభించిన దానితో సంతుష్టి చెందవలెనని, కొండచిలువ జన సంచారమునకు దూరంగా నివసిస్తున్నట్లే మునియైన వాడు అందరకు దూరంగా యుండి నిరంతర ఆత్మనిష్ఠతో యుండవలెనని తెలుసుకున్నాను.

10) సముద్రం:
వర్షాకాలంలో నిండుగా పొంగి ఎన్ని నదుల నీరు తనలో కలిసిన పొంగుటగానీ, వేసవిలో నీరు తగ్గిన కృంగుటగాని చేయదు. చెలియలి కట్టను దాటదు. తనలో ఉన్న ముత్యాలు బయటకు నెట్టుటగానీ, బయటనుండి వచ్చు అపరిశుద్ధ వస్తువులను తనయందు ఉంచుకొనుటగాని చేయదు. అట్లే జ్ఞాని పరిపూర్ణుడై సుఖాలకు పొంగక, దుఃఖాలకు కృంగక, ధర్మమనే చెలియలి కట్టను అతిక్రమించకుండా ఉండాలని, అలానే తనలోని సద్గుణాలను వదలక, దుర్గుణాలను తనలోనికి రానీయక మెలగవలెనని గ్రహించాను.

11) మిడుత:
దీపకాంతిని చూసి భ్రాంతితో దానికి ఆకర్షింపబడి మిడుత నశించును. ఆ విధంగనే మానవులు దుఃఖ నిలయాలైన విషయాలును సుఖాలని భ్రమించి, రూపలావణ్య మోహముచే భ్రాంతిలో పడి ప్రశస్తమైన జీవితాన్ని వృథా చేసుకుంటూ దుఃఖమయ విషయాలలో చిక్కి నశిస్తున్నారు. అందుకే మనస్సును విషయమోహములకు గురికానివ్వకూడదని గ్రహించాను.

12) భ్రమరము:
భ్రమరము ఒక కీటకమును తెచ్చి ఒక గూడునందుంచి ఆ గూడు చుట్టు తిరుగాడుతూ ఎక్కువ ఝాంకారం చేయును. ఆ కీటకం భయంతో ఎల్లప్పుడు ఆ ఝాంకారం చేయుచున్న భ్రమరము పైననే దృష్టిని నిలిపి, దానినే చింతించుట వలన కొంతకాలమునకు ఈ కీటకం తానే భ్రమరమగును. అటులనే శిష్యుడు నిరంతరం తన గురువుపై దృష్టిని నిలిపి ధ్యానించినచో తానే గురువైనట్లు, ఆత్మనే ద్యానించినచో ఆత్మ స్వరూపమై భాసిల్లుతారని తెలుసుకున్నాను.

13) ఏనుగు:
మగ ఏనుగు తన ఎదుట ఉంచబడిన బొమ్మ ఏనుగును చూసి కామోద్రకానికి లోనై, గడ్డి ఆకులు కొమ్మలతో కప్పిన గోతిలో పడి బంధింపబడుతుంది. ఆ రీతిలో స్త్రీ సంబంధ వ్యామోహ ప్రలోభాలకు బంధింపబడి పతనం కారాదని మోహాన్ని జయించాలని తెలుసుకున్నాను.

14) లేడి:
మధుర సంగీతమునకు లేడీ పరవశమగును. వేటగాడు పొదలో దాక్కొని, శ్రావ్యంగా వాద్య సంగీతాన్ని వినిపించి దగ్గరకు వచ్చిన లేడిని వలపన్ని పట్టుకొనెను. అలాగే ప్రాపంచిక విషయముల చేత ఆకర్షింపబడి లౌకికమైన వాటికి హరిణమువలె చిక్కి విషయవలయంలో పట్టుబడకూడదని గ్రహించాను.

15) చేప:
జిహ్వేంద్రియానికి బానిసయైన చేప గాలానికి ఉన్న ఎరని మ్రింగాలని ప్రయత్నించి, తానే బలి అయిపోతుంది. దేహరక్షణ నిమిత్తం తగు ఆహారాన్ని స్వీకరించాలి తప్ప, జిహ్వ చాపల్యంతో చేపవలె రుచికరమైన ఆహారములకు ఆకర్షితులై అనర్ధాన్ని తెచ్చుకోక,  రుచులపట్ల అనాసక్తి వహించవలెనని తెలుసుకున్నాను.

16) తేనెటీగ:
(కొందరు తేనె సేకరించిన వ్యక్తి అని చెప్తారు)
తేనెటీగలు ఎంతో శ్రమించి తేనెను సేకరించి, ఆ తేనెను అనుభవించక ఒకచోట నిల్వచేస్తాయి. ఆ తేనెను తేనె సేకరించువాడు అపహరించి అనుభవిస్తాడు. అధికంగా ధనమును సంపాదించి అనుభవించక దాచుకొని పరులుపాలు చేయడం మంచిది కాదని గ్రహించాను. అలాగే తామరపువ్వుల పరిమళం చేత ఆకర్షింపబడిన తేనెటీగ రాత్రంతా ముడుచుకున్న కమలంలో బంధింపబడి మరణిస్తుంది. అలాగే యతి కూడా సుగంధ పదార్థాల పట్ల ఆసక్తుడై వాటిని సమర్పించే గృహస్థుని యింట చిక్కి పతితుడు కారాదని తెలుసుకున్నాను.

17) పింగళ అనే వేశ్య: 
పింగళ అనే వేశ్య ధనవంతులగు విటులకై గుమ్మం వద్ద అర్ధరాత్రి వరకు వేచియుండి,  ఎవరూ రాకపోవడంతో మోహం వీడి ఇంటిలోనికి పోయి స్వీయ పరిశీలన చేసుకొని, ఆనందమయుడైన ఆత్మారాముని వదిలి బుద్ధిహీనురాలినై మోహముకు లోనై తప్పు చేస్తున్నానని గ్రహించి, ఇక నుండి భగవంతుని ధ్యానములో తరించాలని తలచి, సర్వం త్యజించి పరమాత్మ పైన మనస్సు లగ్నం చేసి ముక్తురాలైంది . క్షణికమైన ఇంద్రియ సుఖంలకై దాసులై పరితపించుటకంటే  అంతర్యానం చేసి ఆత్మానందం పొందుట అసలైన సుఖమని గ్రహించాను.

18) లకుముకి పిట్ట :
(కొందరు గ్రద్ద అంటారు)
ఒక చేప/ మాంసపు ముక్కను నోటకరచుకొని పోవుచుండగా, ఇతర పక్షులు కొన్ని ఆ మాంసపు ముక్క కొరకు వెంబడించి పొడుస్తుంటే, ఆ బాధ భరించలేక ఆ మాంసపు ముక్కను జారవిడిచి ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చున్నది. అంతవరకు వెంబడించిన పక్షులు ఆ మాంసపు ముక్క పడినవైపు పోయినవి. త్యాగం పరమ సుఖం నిచ్చును. పామరు లాశించు లౌకిక సుఖాలు ఆశించుట దుఃఖహేతువని, వాటిని త్యజించుటయే శాంతికి మార్గమని తెలుసుకున్నాను.

19) బాలుడు -
చిన్న పిల్లలకు మానాభిమానములు ఉండవు. నిందాస్తుతులు వారికి సమానమే. చింతలుండవు. ఆడుతూ పాడుతూ ఆనందంగా నుందురు. అదే విధంగా యోగి చింతలు, మానాభిమానములు విడిచి, అన్నిటికీ అతీతుడై ఆత్మానందంలో నుండవలెనని తెలుసుకున్నాను.

20) కన్య -
ఒక యుక్త వయస్సు వచ్చిన కన్య యింటికి ఆమె  తల్లితండ్రులు ఇంటలేని సమయమున వివాహ నిమిత్తమై బంధువులు వచ్చిరి. వారి భోజనమునకు ఇంట బియ్యం లేనందున, ఆ కన్య వడ్లు దంచుట ప్రారంభించింది. ఆమె చేతిగాజుల సవ్వడి విని, ఈ ఇంట్లో వడ్లు దంచుటకు కూలీలను వినియోగించే శక్తి కూడా లేదని తెలుసుకొని, తమ పేదరికాన్ని గ్రహించి ఏం భావిస్తారోనని భయపడి ఒక్కొక్క గాజు మాత్రమే ఉంచుకొని మెల్లగా వడ్లు దంచింది. పలువురు ఒకచోట చేరితే ముచ్చట్లు కబుర్లు తప్పవని,  కావున ఆధ్యాత్మిక చింతనాపరులు ఒంటరిగా కూర్చుండి సాధన చేయవలెనని, జన సంసర్గం మంచిది కాదని తెలుసుకున్నాను.

21) శరాకారుడు -
బాణములను తయారుచేయు శరాకారుడు ప్రక్కన ఎవరున్నారు, ఏమి జరుగుతున్నది గమనించక ఏకాగ్రచిత్తముతో బాణం మొనలను పదును పెట్టడం చూసి, అలానే యోగి ఆత్మచింతన యందు ఏకాగ్రచిత్తుడై ఉండవలెనని తెలుసుకున్నాను.

22) పాము -
పాము తనకై ఇల్లు నిర్మించుకొనక, చీమలు/చెదలు నిర్మించుకున్న పుట్టలలోనే నివాసముంటుంది. యోగి కూడా తనకై గృహాదులు ఏర్పరుచుకొనక, ఇతరులు నిర్మించిన మఠాల యందు శిధిలాలయాలలోను జీవించాలని, అంతేగాక పాము తన జీవకృత్యాలను యే యితర జీవులకు తెలియనివ్వనట్లే, యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలని, సదా ఒకేచోట వుండక పాము తిరుగుతున్నట్లే, యోగి కూడా ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండక ఏకాంతంగా గడుపుచూ, పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు అంత్యకాలంలో తన దేహాన్ని నిశ్చింతగా విడువవలెనని తెలుసుకున్నాను.

23) సాలెపురుగు -
సాలెపురుగు తాను నిర్మించుకున్న సాలెగూటిలో తాను చిక్కి గతించిపోతుంది. అలానే మనిషి తన మనోభావాలనే విష వలయంలో చిక్కి నశించిపోతున్నాడు. యోగి ప్రాపంచిక విషయ వాసనలతో కూడిన మనస్సుకు చిక్కి పతనం కారాదని తెలుసుకున్నాను. అలాగే, సాలెపురుగు తన నోటి నుండి వెలువడే పదార్థమును దారములా మలిచి గూడును అల్లును. కొంత కాలానికి ఆ సాలెపురుగే ఆ గూడును పాడుచేసి మ్రింగివేయును. సాలీడు వలె పరబ్రహ్మ తన నుండియే జగత్తును సృష్టించును, తానే అంతయు లయింపజేయును. కనుక ఈ జగత్తంతా బ్రహ్మమయమని గుర్తించుకొనవలెనని తెలుసుకున్నాను.

24) తుమ్మెద:
తుమ్మెద ఒక పుష్పము నుండిగాక అనేక పుష్పాల నుండి మకరందమును గ్రహించు విధముగా యతి ఒకే ఇంటి నుండిగాక కొన్ని ఇళ్ళకు భిక్షకు వెళ్ళి గ్రహించినదానితో తృప్తి జెంది జీవించాలని గ్రహించాను. అలాగే తుమ్మెద వివిధ రంగులుగల పువ్వుల నుండి తేనె గ్రహించినట్లు సాధకుడు సకల శాస్త్రాల నుండి సారం గ్రహించాలని తెలుసుకున్నాను.

ఈ విధంగా దత్తులవారు తన గురువుల గురించి చెప్పి, మానవుడు తన దేహమే అత్యంత ప్రియమని భావిస్తూ, ధనమును ఆర్జిస్తూ, చివరికి తనువు చాలించును. ఎవరి కొరకైతే తాపత్రయ పడుతూ సంపాదిస్తాడో, వారే ఆ మృత దేహాన్ని కాల్చి బూడిద చేయుదురు. తిరిగి తాను ఆర్జించిన కర్మఫలముననుసరించి మరలా జన్మించును. కనుక శ్రేష్టుడైన వాడు సంసార మోహమందు పడక, ఈ మానవ దేహం పతనం కాకముందే సద్గతి పొందుటకు ప్రయత్నం చేయుటే ధ్యేయంగా యుండవలెనని తెలిపెను. 

దత్తుని రూపం - నామం 




ఈయన రూపం లోకంలో కనిపించే నాలుగు ఆశ్రమాలకూ అతీతమైనది.
తనది ఐదవ ఆశ్రమమని దత్తాత్రేయుడు పింగళనాగుడనే మునికి చెప్పెను. లోకంలో తన కన్నా వేరైనది ఇంకేది లేదనే సత్యాన్ని తెలిసిన వైరాగ్యవంతుడికి సంబంధించిన ఆశ్రమము ఈ ఐదవ ఆశ్రమము.
దత్తోపనిషత్తులో ఆయన ఈ ఆశ్రమంలోని వారు చరాచర జగత్తును తమ ఆత్మపరంగా సందర్శించి, త్రిగుణాతీతులుగా నిస్సంగులుగా ఉంటారనీ, వారికి ఎటువంటి కర్మ కలాపాలతో పనిలేదని తెలిపెను.

సకల ప్రాణులను తరింపచేయు మంత్రమేదైనా ఉన్నదా ప్రభూ అని శుకమహర్షి పరమేశ్వరుని అడిగినపుడు ఆ మహాదేవుడు చెప్పిన మాట "దత్త దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం".





తెలిసో తెలియకో మన పూర్వీకులు (ముందు తరాల వారు) సరిగ్గా సంప్రదాయకంగా పితృ కర్మలు చేయక పోవడం వలన, మరణించినవారి కర్మకాండలు సరిగ్గా నిర్వర్తించక పోవడం వలన పితృ దోషాలు సంక్రమిస్తాయి. పితృ శాప ఫలితంగా ఇంట్లో కలహాలు, వివాహ ఆటంకాలు, అనారోగ్యాలు, మనస్థాపం, కుటుంబ అభివృద్ధి లేకపోవడం, సంతానం లేకపోవడం... ఇత్యాది అనేక బాధాకర సమస్యలు ఉత్పన్నమౌతాయి. 
ఈ పితృ దోషం చిన్నగా ఉంటే - బిడ్డల వివాహం ఆలస్యం, గర్భస్రావం, కుటుంబ సభ్యులకు ఇ ఎన్ టి సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయని,
మధ్యమముగా ఉంటే - బుద్ధి మాంద్యం, విడాకులు, తీవ్ర కలహాలు, మనశ్శాంతి లేకపోవడం లాంటి సమస్యలు ఉంటాయని,
తీవ్రంగా ఉంటే - అగమ్యగోచర జీవితం, అకాల మరణాలు తదితరం ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. దీనికి ఏకైక సులభ పరిష్కార మార్గం దత్తుని పాదాలు పట్టుకోవడం. వీలైనంతవరకు దత్తుని నామస్మరణ చేస్తే, ఎంతటి పితృ దోషమైన తొలగిపోతుంది. 

దత్తుని అనుగ్రహం చేత ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. గ్రహబాధలు తొలగుతాయి. పితృ శాపం నుండి విముక్తి కలుగుతుంది. అన్నింటికి మించి జ్ఞానం లభిస్తుంది. ఇహ పరానికి దత్తోపసన ప్రధానం. దత్త నామ స్మరణ ఇంతటి దివ్యమైనది. 

అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః
స్మర్తృగామి స్వభక్తాన ముద్ధార్ధ భవసంకటాత్

ఆస్తికుడైనా, నాస్తికుడైనా దత్తా అని తలచినంత మాత్రముననే వారిని అనుగ్రహించుదురు అన్న మాట కొందరికి అసత్యంగా ఉండవచ్చు. ఎన్నిసార్లు పిలిచినా పలకడేం... అన్న పరిహాసం కొందరిది.
దత్తుని దర్శనమో, అనుగ్రహమో గుర్తించడానికి మహర్షులం కాకున్నా, నిర్మలమైన భక్తులమై యుండాలి. కానీ, సంశాయాత్ములైన తమలో భక్తి, నిర్మలత్వం, విశ్వాసం కొరవడినదన్న సత్యాన్ని గ్రహించరు. బహుశా కలి ప్రభావవేమో!
ఎవరు గ్రహించిన, గ్రహించకపోయినా మానవులను ఉద్ధరించుటకు తాను తన ధర్మరక్షణ కార్యమును నేటికీ కొనసాగించుచూ ఉన్నారన్నది యదార్థం. గుర్తించినా, గుర్తించకపోయినా తనని తలచిన వారికి ఏదో రూపేణా అనుగ్రహ ఫలితం అందుతుంది.
ఇక్కడ ఓ కథ చెప్పాలనిపిస్తుంది -
ఒకానొకప్పుడు ఓ రాజుగారికి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఉంటే కనిపించడేం? అన్న సందేహం వచ్చి, సమాధానం చెప్పమని సభాసదులను ప్రశ్నించగా, భక్తుడగు ఒక సేవకుడు నేను సమాధానం చెప్పెదనని, ఒక కడవ నిండా పాలు తెప్పించి, అదే పనిగా కలియబెడుతుండగా, కొంత సమయం వేచి చూసి అసహనంతో ఆ రాజు ఏం చేస్తున్నావు, భగవంతుడు ఎక్కడ అని అగ్రహించగా, కోపం వద్దు ప్రభూ, ఈ పాలులో నెయ్యి ఎక్కడ ఉందో వెతుకుతున్నాను అని సేవకుడు చెప్పెను. దానికి రాజు నవ్వి, ఓయీ! అజ్ఞాని! పాలు కాచాలి, తోడుపెట్టి పెరుగు అయ్యాక, చిలికి చిలికి వెన్న తీసి కాస్తే, అప్పుడు నెయ్యి కనిపిస్తుంది అని అనగా, ప్రభూ! ఇదే మీ సందేహానికి సమాధానం. నెయ్యి పాలంతటను వ్యాపించియున్నను, జలాంశముచే క్షీరం గలసి యున్నందువలన కనిపింపక యున్నట్లే, భగవంతుడు చరాచరమంతా నిండియున్నా మాయ అను ఆవరణమువలన కనిపించడం లేదని, చిలికి చిలికి నెయ్యిని కాంచినట్లే, హృదయమందు ఆత్మానాత్మమధనము చేయువారికి భగవానుడు కనిపించునని చెప్పెను. 
ఇది అర్థమైన వారికి అర్థమైనంత🙏

ఏ చోట చదివానో, ఏ నోట విన్నానో గానీ...మనస్సు పట్టిన నాలుగు మాటలు -

ఎక్కడ దత్త దత్త దత్త అని స్మరించబడుతోందో,
ఎక్కడ దత్త నామసంకీర్తన జరుగుతోందో, 
ఎక్కడ దత్త నామము భజింపబడుతోందో
అటువంటి ఇల్లు, సిధ్ధుల ఆశ్రమం.
అక్కడ సకల దేవీదేవతలు  కొలువై ఉంటారు.

ఎవరి హృదయం నిరంతరం దత్త దత్త దత్త అని స్పందిస్తుందో, అట్టి హృదయమే మాలాపురం. (మాలాపురం దత్తుని ఆవిర్భవ స్థానం)

ఎవరి మనసు "అనసూయ"
ఎవరి బుధ్ధి "అత్రి" అవుతుందో,
వారి హృదయంలోకి దత్తమై వచ్చేవాడే దత్తుడు.

దత్తుని వైభవం అనంతం. నాకు తెలిసింది అణుమాత్రం.

              🙏శ్రీ దత్త శరణం మమ🙏




28, జూన్ 2023, బుధవారం

శ్రీ దత్తాత్రేయ వైభవం - అనుగ్రహ లీలలు

 



 అత్రి అనసూయల చరితం 
 శ్రీ దత్తాత్రేయుని జననం 

అనసూయాసుతం దేవం అత్రివంశకులోద్భవం
దిగంబరం మహాతేజం దత్తమానందమాశ్రయే

అత్రి అనసూయల అఖండ తపఃశక్తిని, పాతివ్రత్యశక్తిని త్రిమూర్తులు మెచ్చి, 

"ఆత్మానా స్వయం దత్తః ఇతి దత్తాత్రేయః"

త్రిమూర్తులు ఏక స్వరూపంలో శ్రీ దత్తుడిగా దత్తమయ్యారు. 

అత్రి అనసూయల పుత్రుడు కావున ఆత్రేయుడై, దత్తాత్రేయుడుగా కొనియాడబడుతున్నాడు.

సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులు ఒక్కటైతే, అది పరబ్రహ్మ స్వరూపమౌతుంది. దత్తునిది షోడశ కళాపరిపూర్ణుడయిన పరబ్రహ్మతత్వం.

పై విషయాలు క్రిందటి టపాలో స్మరించుకోవడమైంది.

గురుదేవ దత్త

శ్రీమద్భాగవతం పేర్కొన్న ఏకవింశతి (21) అవతారములలో దత్తావతారం ఆరవది.

అన్ని అవతారములు తమకు నిర్దేశించిన కార్యమును పూర్తి చేసుకొని నిష్క్రమిస్తే, ఒక్క దత్తావతారం మాత్రం నేటికీ విరాజిల్లుతున్నది.

అవతారములన్నింటిలో గురుదేవ అని దత్తాత్రేయుని మాత్రమే పిలుస్తాం. శ్రీ దత్తుడు గురువు దైవము కూడా. అందుకే ఆయనను గురుదేవ దత్త అని వ్యవహరిస్తారు.




ఈ శ్లోకము పరిపూర్ణముగా దత్తునికే వర్తిస్తుంది.

బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగవిద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు దత్తాత్రేయుడు. 

బ్రహ్మకు ఆవరించిన మాయను తొలగించి, వేదాలను స్ఫురణకు తెచ్చిన పరబ్రహ్మం "దత్తాత్రేయుడు".
వశిష్టులవార్కి  యోగవిద్యను ప్రబోధించిన గురుదేవులు "దత్తాత్రేయుడు".
పరశురాముడికి  శ్రీవిద్యను ప్రసాదించిన పరమాత్ముడు "దత్తాత్రేయుడు".
కార్తవీర్యర్జునుని అనుగ్రహించి ఆత్మవిద్యను తెలిపిన భక్తవత్సలుడు "దత్తాత్రేయుడు".
యదువుకు  జ్ఞానబోధను,  ప్రహ్లాదునికి ఆత్మానంద బోధను, అలర్కునకు ఆత్మజ్ఞానాన్ని, పింగళనాగునకు జ్ఞానయోగసిధ్ధిని.....ఇలా ఎందరినో అనుగ్రహించి తరింపజేసిన మహిమాన్వితుడు "దత్తాత్రేయుడు".

స్మర్తుగామి

"స్మరణమాత్ర సంతుష్టాయ దత్తాత్రేయాయ నమః"

దత్తస్తుస్మరణ ప్రియః అని పురాణ వచనం. స్మరణ మాత్రం చేతనే ప్రీతుడౌతాడు. 

దలాదనుడు అనే మహర్షి, స్మరించినంత మాత్రముననే ప్రత్యక్షమగునందురే, ఒకపరి దత్తుని పరీక్షించాలని, 'దత్త దత్త' అని పిలిచాడట. వెంటనే దత్తుడు ప్రత్యక్షమై ఏం కావలెను అని అడుగగా, పరీక్షించదలచి పిలిచితిని, మన్నింపమని మనవి చేయగా, 
"మమ ప్రకృతిరీదృశీ, స్మర్తుగామీ  సందేహూ, ద్విసప్త భువనేష్వహం" అని దలాదన మహర్షికి చెబుతూ, ఇది నా ప్రకృతి. భక్తి ఉన్నా, లేకున్నా నన్ను ఒక్కసారి పిలిస్తే, ఈ పదునాల్గు భువనములలో ఎక్కడ ఉన్నా వారి ముందు ప్రత్యక్షమై వారి కష్టాలు తీరుస్తాను అని, మహర్షికి దత్తాత్రేయస్వామి వజ్ర కవచం తెలిపెను.

ఆధ్మాత్మికతత్వాన్ని గ్రహించాలనుకునే జ్ఞానసాధకులకైనా, భక్తియోగాన్ని అనుసరించే భక్త జనావళికైనా, సంసారంలో ఉంటూనే కర్మయోగంతో మోక్షాన్ని సాధించాలనుకునే కర్మయోగులకైనా, అంతర్యామి దర్శనముకై అంతర్యానం చేస్తున్న ధ్యానులకైన.....
ఇహపర తృప్తిని అందించగల దైవం దత్తాత్రేయుడు. 

శ్రీ దత్తాత్రేయ అనుగ్రహ లీలలు

కృతయుగములో బ్రహ్మ సృష్టి చేసెను. వారెల్లరు తపస్సులు జ్ఞాన విశారదులైరి. అందరూ పరమాత్మ ధ్యానంలో యుండుట వలన సృష్టి జరుగుట లేదు. ప్రజలలో అనురాగ విద్వేషాలు లేవు. ప్రాణిజాలమునకు సంసార సుముఖత కలిగించుటకు అవిద్య లేక మాయను సృష్టించుటకు బ్రహ్మ తీవ్రంగా ఆలోచిస్తూ, ఆ క్రమంలో తీవ్ర ఒత్తిడి నొంది, తాను సృష్టించిన అవిద్య వలన స్మృతిని కోల్పోయి, వేదములను మరచిపోవుట వలన రేణుకాదేవిని ఆరాధించగా, ఆమె ప్రత్యక్షమై, దత్తాత్రేయుని ఆశీస్సులు పొందమని చెప్పి, సహ్యాద్రిపై ఉన్న దత్తాత్రేయుని చూపించగా, 




బ్రహ్మ అనఘాదేవి సమేత దత్తాత్రేయుని  దర్శించి, అన్నింటినీ మరిచానని, పూర్వ స్మృతిని ప్రసాదించమని కోరగా, రేణుకాదేవియే వేదమాత, ఆహ్లాదిని, జ్ఞానయోగి, గాయత్రి... అని తెలిపి, నీవు విస్మరించినదంతయు స్ఫురణకు వచ్చునని దత్త ప్రభువు చెప్పెను. అంతట అనఘాదేవి నుండి వేదములు రేణుకాదేవిని చేరినవి. పిమ్మట రేణుకాదేవిని, అనఘాదేవిని బ్రహ్మ ప్రార్థించగా, మరిచిన వేదములు, గాయత్రీ మంత్రం స్ఫురణకు వచ్చెను. ఈ విధంగా బ్రహ్మకు దత్త ప్రభువు గురువై భాసిల్లెను.

దత్తాత్రేయ స్వామి తనని దర్శించగోరువారిని అనేక విధాలుగా పరీక్షించేవారు. భయబ్రాంతులు గొలిపెడివారు. బాలోన్మత్త పిశాచ రూపములలో సంచరించేవారు. అంగనతో కూడి యుండి మద్యం సేవిస్తున్నట్లు కన్పించి, తన దరి చేరేవారిని పరీక్షించేవారు.
ఒకపరి దత్తాత్రేయ స్వామి ఏకాంత నిష్టలో తపస్సు చేయుటకై వెళ్ళుచుండగా, ముని కుమారులు వారి వెంటపడగా, దత్త ప్రభువు ఒక మడుగులో దిగి అదృశ్యుడయ్యెను. ముని కుమారులు చాలాకాలం ఆ మడుగు వద్దే వేచియుండిరి. దత్తుడు వందేళ్లు తర్వాత వారిని పరీక్షించుటకై, ఒక అంగనతో కలసి నీటి నుండి బయటకు వచ్చి, ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకొనగా, అది చూసి కూడా ముని కుమారులు కదలలేదు. అప్పుడు దత్తుడు మద్యం సేవిస్తూ, ఆమెతో సరసములాడుచు కొంత అసభ్యంగా ప్రవర్తించడంతో, కొందరు మునికుమారులు ఇతను దురాచారపరుడు, స్త్రీలోలుడు అని భావించి, దత్తుని విడిచి వెడలిరి. ఇది దత్తలీల అని గ్రహించి నిలిచిన వారికి తన నిజ స్వరూపం చూపించి అనుగ్రహించారు.

శ్రీ దత్తుని రూపం -




మాలా కమండలు ధరః కర పద్మ యుగ్మే 
మధ్యస్థ పాణి యుగళే ఢమరు త్రిశూలే
యన్యస్త ఊర్ధ్వకరయో శుభ శంఖ చక్రే 
వందే తమత్రి వరదం భుజషట్కయుక్తం

బ్రహ్మ సంకేతం -
క్రింద చేతులలో అక్షరమాల, కమండలం. తపో జ్ఞాన మార్గాలకు గుర్తు. 
విష్ణు సంకేతం -
పై చేతులలో శంఖం, చక్రం. 
శివ సంకేతం -
మధ్య చేతులలో త్రిశూలం, ఢమరుకం 

శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం -

శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరు భుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. 

మూడు శిరస్సులు :
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ ల త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.

నాలుగు కుక్కలు :
నాలుగు వేదములకు సంకేతం.

ఆవు :
సమస్త భూమండలానికి సంకేతం. వేద స్వరూపం. జ్ఞానానికి గుర్తు.

మాల :
అక్షరమాల, సర్వమంత్రమయము, సర్వ వ్యవహారములకు మూలము.

త్రిశూలము :
ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల త్రిపుటి.

శంఖం :
నాదం. 

చక్రము :
అవిద్యా నాశకము, ఆత్మావలోకన సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.

ఢమరుకం :
సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.

కమండలము :
కర్మఫలదాయకం. కష్టాలను తప్పించునది. శుభములను నొసగునది.




ఒకానొకసారి నైమిశారణ్యములో యతులు నారాయణుని ధ్యానించుచుండగా, త్రిమూర్త్యాత్మకముగా శంఖము చక్రము గద పద్మము ఢమరుకం జపమాల మొదలగు ఆయుధములు ధరించి సర్వము తనలో చూపు దత్త భగవానుని విశ్వరూపమును దర్శించి, మహానుభావా! త్రిమూర్తి స్వరూపా! దేవాధిదేవా! దత్తా! దత్తా! అని జపించుచుండగా, దత్త ప్రభువు అదృశ్యమైరి. అంతవరకు ముండ్ల పొదలు, క్రూరమృగాల మయమై యున్న ఆ అరణ్యమంతా పూలు పండ్లతోటలతో ఫలభరితమై పక్షుల కిల కిలా రావములతో మార్పు చెందడంతో, ఇదంతా దత్త భగవానుని అనుగ్రహం అని గ్రహించి అందరూ, దత్తా! గురుదత్తా! అని కీర్తించిరి.

త్రేతాయుగ ప్రారంభమున - మహిష్మతీపురమును హైహయ వంశస్తుడైన కృతవీర్యుడను రాజు పరిపాలిస్తుండెను. అతని భార్య శీలధారాదేవి. వారికి కలిగిన సంతానం పుట్టిన వెంటనే చనిపోవుచుండిరి. వంశోద్దరణ పుత్రులకై ఎన్నో నోములు, యాగములు చేస్తుండిరి. ఒకసారి శీలధారాదేవి యాజ్ఞవల్కుని ఆశ్రమము మీదుగా వెళ్ళుచు, మహర్షి సతీమణియగు మైత్రేయిని దర్శించి, తన బాధ చెప్పుకొనగా, ఆమె సూచన మేరకు భర్తతో కలిసి అనంతవ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. బృహస్పతి ఆదేశానుసారం కృతవీర్యుడు సూర్యోపాసన కూడా చేసెను. వారికి చొట్ట చేతుల పుత్ర సంతతి కలిగెను. ఆ బాలునికి అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుని కుమారుడు అగుట వలన కార్తవీరార్జునుడని పిలవసాగిరి. కొంతకాలమునకు మహారాజు మరణించడం, బుద్ధి కుశలత కలవాడైన, హస్తవైకల్యం వలన రాజ్యపాలన చేయలేనని, రాజుకు భుజబలం ఉండవలెనని, తాను తపస్సు చేసి శక్తులను సంపాదించిన తర్వాత వచ్చి, రాజ్యపాలన చేస్తానని కార్తవీరార్జునుడు అనగా, అయితే నీవు దత్తాత్రేయుని ఆశ్రయించు, వారు అనేక రీతుల్లో పరీక్షించెదరు కాబట్టి, జాగ్రత్తగా మెలగమని గర్గమహర్షి చెప్తూ, జంభాసుర వధ తెలిపెను.
జంభాసుర వధ - 
పూర్వం జంభాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి, అనేక వరములు పొంది, స్వర్గంపై దాడి చేయగా, దేవేంద్రుడు ఎదుర్కోలేక, దేవగురువైన బృహస్పతిని వేడుకోగా, ఈ రాక్షసుడు అజేయమైన బలం కలవాడగుట వలన సహ్యాద్రి పర్వతం పైనున్న దత్తాత్రేయుని ఆశ్రయించమని, ఆయన అనేక పరీక్షలు పెట్టుదురని, వారి అనుగ్రహం పొందమని దేవ గురువు చెప్పెను.

గందర్వాంగనలు చుట్టూ నృత్య మొనర్చుచుచుండగా, మధుపానమును సేవిస్తూ మత్తుడై ఉన్న దత్తుని, దేవేంద్రుడు దర్శించి ప్రార్థించి, జంభాసురుడు తమపై దండెత్తి తమను జయించిన విషయమంతయూ చెప్పి, స్వర్గంపై ఆధిపత్యం తనకు తిరిగి వచ్చునట్లు చేయమని కోరగా, మగువ మధ్యములతో మునిగియున్న వానిని, నన్ను వదిలి వేరెవరినైనా చూసుకొనమని దత్తుడనగా, దత్తుని పాదములు పట్టుకొని, మీరు అభయమియ్యనిదే ఈ పాదములు విడవనని మొరపెట్టుకుంటున్న దేవేంద్రుని పరిపూర్ణ విశ్వాసమును గమనించి అనుగ్రహించి, జంభాసురుని అతని పరివారమును ఇక్కడకు వచ్చునట్లు చేయుమని చెప్పెను. దేవేంద్రుడు ఆ రాక్షసునితో తిరిగి యుద్ధం చేయుచూ, సహ్యాద్రి వరకు తీసుకురాగా, జంభాసురుడు దత్త ప్రభువు అంకమందున్న అనఘాదేవి అందచందాలకు మైమరచి, ఆమెను పొందగోరి ఆమెను బలవంతంగా పల్లకిపై కూర్చుండబెట్టి బోయిలై మోయగా, దత్తాత్రేయుడు చిరునవ్వుతో ఇంద్రా! లక్ష్మి వీరి నెత్తిపైకెక్కినది, ఇక ఆమె వారిని విడుచును, వారి బలం క్షీణించి ఐశ్వర్యం తొలగను. ఇదే సమయం...రాక్షసులను చంపుము అని చెప్పగా, జంభాసురునితో సహా రాక్షసులందరూ దేవతుల చేతుల్లో మృతులైరి. లక్ష్మి పల్లకి నుండి అదృశ్యమై, దత్తస్వామిని చేరెను. అనఘాదేవియే లక్ష్మీదేవియనియు, లక్ష్మీ - పాదముల యందుండిన విలువగల భవనములు ఏర్పడుననియు, మోకాళ్ళ యందుండిన ఐశ్వర్యం కలుగుననియు, వక్షస్థలము నందుండిన సర్వ విధములైన కోరికలు తీరుననియు, శిరముపై యుండిన వానిని ఒంటరివానినిగా విగత జీవునిగా చేసి విడిచివెళ్ళునని, అందువలనే జంభాసురుని శిరముపై ఎక్కి అతనిని నాశనం చేసినదని, మద్యం మగువను చూపుట తన లీలయని దేవేంద్రునికి దత్తాత్రేయులు చెప్పిరి. 
దేవేంద్రుడు తిరిగి స్వర్గాదిపత్యమును పొందిన ఈ కధనమును విన్న కార్తవీరార్జునుడు, దత్తాత్రేయుని ఆశ్రమముకు వెళ్ళి, అపార భక్తి శ్రద్ధలతో దత్తుని సేవించెను. కఠోర పరీక్షలకు నిలబడి స్వామి అనుగ్రహంకు పాత్రుడయ్యను. ఒక సమయమున దత్తుని నుండి వెలువడిన అగ్నిచే కార్తవీరార్జునుని చేతులు భస్మమయ్యను. 'రాకుమారా! ఉన్న చేతులు కూడా ఊడిపోయినవి. మదిరను త్రాగుచూ, మగువలతో ఆటలాడు నేను నీకు సహాయం చేయజాలను. నీవు పొమ్ము' అని దత్తప్రభువు అన్నను, గర్గముని చెప్పింది గుర్తుంచుకొని, దత్తాత్రేయుని వదలక సేవించడంతో, దత్తుడు ప్రసన్నమై, 'ఏమి నీ కోరిక' అని అడిగెను. అంతట కార్తవీరార్జునుడు ప్రభూ! నాకు వేయి చేతులు కావలెను. భూమి నీరు గాలి యందు సంచరించగలవాడనై, ఎచ్చటికైనను నేను తలచినంతనే పోగలగాలి. సర్వదా నా దగ్గర ధనరాసులుండాలి. యుద్ధములయందు అజేయుడనై యుండాలి. నా రాజ్యంలో సుఖశాంతులుండాలి. ఎంతటి శక్తి కలవాడైనా నేను శిక్షించే శక్తి నాకుండవలెను. సదా నీ భక్తుడనై యుండవలెను. ఎన్నడైనను నేను సన్మార్గం తప్పినచో సత్పురుషులు నాకు దారి చూపవలెను. నాకంటే గొప్పవాడైన నరుడే నన్ను వధింపవలెనని కోరెను. కార్తవీరార్జునుడు కోరిన వరములన్నియు అనుగ్రహిస్తూ, భూమి ఆకాశములయందు సంచరించుటకు ఒక విమానం కూడా దత్తప్రభువు ప్రసాదించగా, కార్తవీరార్జునుడు స్వామికి నమస్కరించి, మహిష్మతీపురం తిరిగి వచ్చి, రాజ్యాన్ని చేపట్టి, మంచి కీర్తి ప్రతిష్ఠలను సంపాదించెను.

అహం ఎటువంటి స్థితిని కల్పిస్తోందో 
కార్తవీరార్జునుడు జన్మ వృత్తాంతము పరిశీలిస్తే అర్థమవుతుంది  - 
సుదర్శన చక్రముకు, తాను విష్ణు భగవానుని ఆయుధమునని, ఎందరో రాక్షసుల సంహారం తానే చేశాననే గర్వం, తాను అధికుడనని అహం ఉండడం గమనించిన విష్ణు భగవాన్ సుదర్శన చక్రమును అంగవైకల్యం కలవాడవై భూలోకమున జన్మించమని శపించెను. అలా శాపముచే జన్మించిన కార్తవీరార్జునుడు దత్తత్రేయస్వామి అనుగ్రహంతో సహస్ర బాహువులు పొంది రాజ్యాధిపత్యం వహించెను. దత్తాత్రేయుడు ప్రసాదించిన విమానంపై లోకములన్నియు సంచరిస్తూ, పదునాలుగు భువనములలో సాటిలేని మేటి చక్రవర్తిననే అహంకారముతో ఋషులను దేవతలను తృణీకరించగా, వాయుదేవుడు మందలించగా, తన తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తాపం పొందెను. అలా కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసాక, ఈ భోగభాగ్యాలకు విసుగుచెంది, తిరిగి దత్తాత్రేయుని ఆశ్రయించెను. 

భక్తి జ్ఞాన వైరాగ్య విజ్ఞాన సహితమగు ఆత్మజ్ఞానమును ఉపదేశింపమని ప్రార్థించి,  దత్త స్వామి చెప్పిన కొన్ని కథల ద్వారా జ్ఞానం పొంది, ముముక్షత్వమును గురించి తెలుసుకొనెను. అలా తెలుసుకున్న విషయములు స్థిరంగా మనస్సునందు నిలిచేటట్లు, ధ్యానం చక్కగా కుదిరేటట్లు అనుగ్రహించమని వేడుకోగా, దత్తుడు కార్తవీర్యునితో "మాయ దాటుటకు నీవు చేయు కర్మలు నాకు అర్పణ చేయు, అట్లు చేసినచో నీ చిత్తము ఏకాగ్రత పొందును" అని చెప్పి, ఆత్మ సాక్షాత్కారం, సమాధి స్థితి కలిగింపతలచి, ఒక గుహలోనికి తీసుకొని వెళ్ళి, నిటారుగా స్థిరంగా కూర్చుండబెట్టి, "నీ గురువుకు నమస్కరించి, నీకు తెలిపిన ఆత్మతత్త్వమును మననం చేయు" అని చెప్పి, కార్తవీర్యుని శిరంపై తన చేయి వుంచి ఆశీర్వదించెను. 




దత్తుని కృపచే సమాధిస్థితి త్వరగా కలిగి, ఏడాది పాటు ఆ స్థితిలోనే ఉండి, క్రమేణా బాహ్యస్మృతి పొంది, కొంతకాలం పాటు ఆ ఆశ్రమము యందుండి, మరల మరోసారి సమాధి స్థితి అనుభవమును పొందిన పిమ్మట గురుదేవుని అనుమతితో, తిరిగి రాజ్యానికి వచ్చెను. 

ఇలా కొన్నేళ్ల కాలం కార్తవీరార్జునుడు పాలన సాగేక, ఒకరోజు మధ్యాహ్నపూట అతిథి పూజకై ఎదురు చూస్తున్న తరుణంలో అగ్నిదేవుడు చిత్రభానుడను పేరుతో వచ్చి, రాజా! ఆకలిబాధతో ఉన్నాను. నాకు భిక్ష పెట్టి క్షుద్బాధ తీర్చమని కోరగా, మీకు కావల్సినంత ఏదైనా తీసుకొనమని అనుజ్ఞ ఇవ్వగా, చిత్రభానుడు తన నిజరూపమైన అగ్నిరూపుడై పల్లెలు పట్టణాలు అడవులు దహింపసాగెను. ప్రజలు ప్రాణ భయంతో హాహాకారములు చేస్తున్నా, చూసీ చూడనట్లు మిన్నకుండెను. సరయూ నదీతీరంలో ధ్యాననిష్టలో యున్న వశిష్ట మహర్షికి ప్రజల ఆక్రందనలు వినిపించి, ప్రజాక్షేమం మరిచిన కార్తవీరార్జునుడును పరశురాముడు చేతిలోని గండ్రగొడ్డలిచే మరణించుగాక అని శాపమివ్వగా, మహర్షికి నమస్కారము చేసి, ఒకప్పుడు దత్తుని 
నాకన్నా పరాక్రమవంతుని చేతిలో మరణం కలుగునట్లు కోరితిని. ఇప్పుడు తమ శాపం దానికి తగియున్నది అని, దత్తుని స్మరించుకొనెను. 

ఆ పిమ్మట ఒకానొక రోజు కార్తవీరార్జునుడు  సామంతరాజును జయించి విజయవంతంగా వచ్చుచూ, దారిలో జమదగ్నిముని ఆశ్రమము చూసి, ఆశీర్వాదము పొందుటకు ఆశ్రమము లోనికి వెళ్ళి, మునికి ప్రణమిల్లగా, ముని ఆతిథ్యం స్వీకరించమని కోరెను. కామధేనువు సురభి, రాజుకు వారి పరివారమునకు తృటిలో సమస్త ఆహార పదార్థములతో విందు సమకూర్చగా, ఆ ఆవును తనకిమ్మని మునిని కోరెను. ముని అంగీకరించకపోవడంతో సైనికులచే బంధించి బలవంతంగా కామధేనువును తన నగరానికి తోడ్కొని వెళ్ళెను. ముని చిన్న కుమారుడు పరశురాముడు ఆశ్రమముకు వచ్చి, జరిగింది తెలుసుకొని, రాజును, సైన్యాన్ని సంహరించెను. ఈ విధంగా కార్తవీరార్జునుడు పరశురాముడి చేతిలో కైవల్యం పొందెను.

కార్తవీర్యార్జునుని పుత్రులు తమ తండ్రి మరణమునకు జమదగ్ని మునియే కారణమని జమదగ్ని ఆశ్రమానికి వచ్చి, ఆశ్రమమును ధ్వంసం చేసి జమదగ్ని శిరమును ఖండించిరి. జమదగ్ని భార్య రేణుకాదేవి దుఃఖితురాలై రామా, రామా... అంటూ పరశురాముడిని పిలుస్తూ మూర్చిల్లింది. తల్లి పిలుపు విన్న పరశురాముడు పరుగున వచ్చి, క్రోధావేశమున మహిష్మతీపురం వెళ్ళి, కనిపించిన క్షత్రియులనెల్లా సంహరించి, తిరిగి ఆశ్రమముకు వచ్చెను. అతనిని తల్లి రేణుకాదేవి శాంతపరచి, తండ్రి అంత్యక్రియలకు ఏర్పాటు చేయమని చెప్పి, ఒక కావడిని తెచ్చి అందు ఒక వైపు తండ్రి శవమును, రెండవ వైపు తనను ఉంచి తీసుకొని వెళ్ళమని, అట్లు వెళ్ళుచుండగా ఎచట ఆకాశవాణి 'తిష్ఠ తిష్ఠ' అని పలుకునో, అచట దహన సంస్కారాలు చేయమని కోరింది. తల్లి చెప్పిన ప్రకారం పరశురాముడు వారిని కావడిలో ఉంచుకొని పల్లెలు పట్టణాలు దాటుతూ సహ్యాద్రి వద్ద అమలకి అను గ్రామమున దత్తాత్రేయ ఆశ్రమము దగ్గరకు రాగా, తిష్ఠ తిష్ఠ అని ఆకాశవాణి పలుకుట విని అక్కడ కావడిని దించెను. పరశురామా! దత్తాత్రేయుని దర్శించి, దహన క్రియలకు సహాయపడవలసినదిగా ప్రార్థించమని రేణుకాదేవి చెప్పగా - 
దిగంబరుడై మద్యం సేవిస్తూ, అంగనలతో నాట్యమాడుచుండు దత్తుని దర్శించి నమస్కరించి, మా అమ్మ రేణుకాదేవి మీకై వేచి యున్నదని చెప్పగా, దత్త ప్రభువు నిజరూపధారై రేణుకాదేవి వద్దకు వచ్చి, ఆమెను స్తుతించి, జమదగ్ని నిర్జీవ దేహమునకు వందనం చేసెను. దత్తుని ఆదేశముతో పుణ్యనదీ తీర్థములను పరశురాముడు సహ్యాద్రి యందే ఉండి తెప్పించి, స్నానం చేసి తండ్రి శవమునకు దహన సంస్కారాలు చేసి చితిని వెలిగించెను. రేణుకాదేవి భర్త చితిలో తాను సహగమనం చేసెను. దత్త ప్రభువు పరశురామునిచే అతని మాతాపితరులకు అన్ని కర్మలు శాస్త్ర ప్రకారము నిర్వహింపజేసి, ఆకాశమున దివ్యకాంతులతో విహరించుచున్న పితృదేవతలను పరశురామునకు  చూపెను. 




పరశురాముడు ఇరువది ఒక్కమారు భూ ప్రదక్షణ చేసి క్షత్రియులందరిని సంహరించాక, ఆవేశం తగ్గి ఆశ్రమముకు వచ్చి దత్తాత్రేయుని దర్శించి నమస్కరించెను. పరశురాముని తల్లితండ్రులు దర్శనమిచ్చి, ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు అభినందించి, పాప పరిహారమునకు యజ్ఞం చేయమని చెప్పి, పుత్రుని ఆశీర్వదించి అంతర్ధానమైరి. పరశురాముడు దత్తస్వామి దగ్గరే ఉండిపోగా, సంతోషించిన గురుదేవ దత్తుడు వినిన మాత్రముననే మోక్షమొసంగడి "త్రిపుర రహస్య జ్ఞాన ఖండసారము"ను బోధించెను.

నహుషుడి పుత్రుడు యయాతి మహారాజుకు శుక్రచార్యుని శాపము వలన వార్ధక్యం రాగా, ఆ వార్ధక్యాన్ని కనిష్ఠపుత్రుడు పూరుని సమ్మతంతో తనకి ఇచ్చి, పూరుని యవ్వనం తాను స్వీకరించి, రాజ్యపాలన చాలాకాలం చేసిన పిదప, ఒకనాడు తన వార్థక్యం తాను తీసుకొని రాజ్యాధికారం పెద్దకుమారుడు యదువుకు కాక, చిన్నకుమారుడు పూరునకు ఇవ్వడంతో యదువు అవమానితుడై, రాజ్యం వదిలి అరణ్యముకు పోయెను. ఆ నిర్జనారణ్యములో నేలపై దుమ్మూధూళిలో పరుండి బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్న దత్తుని దర్శించి, వినయంగా ఇలా ప్రశ్నిస్తారు - మహాత్మా! మీముఖంలో కోటి సూర్యుల వెలుగు కనబడుతుంది, ఇంద్రియ అలజడి కనబడడం లేదు, తృప్తిగా వున్నారు, ఆహార సముపార్జన కోరిక లేదు, మానవులు సాధారణముగా సుఖభోగాలు, అధికారం, ధనం, కీర్తి... ఇలాంటి ఎన్నోవాటికై ఆసక్తులై ఉంటారు. కానీ; మీరు అనాసక్తులై ఒంటరిగా ఈ కారడవిలో మహదానందమును ఎలా సొంతం చేసుకోగలిగారు? ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ గురువు ఎవరు? అని ప్రశ్నించగా -
దానికి దత్తాత్రేయులవారు "నా ఆత్మయే నా గురువు. ఆపై నేను ఈ పరమానందస్థితిలో జీవించడమెలాగో ఇరవై నలుగురు గురువుల నుండి నేర్చుకున్నా"నని బదులివ్వగా, వారెవరో తెలియజేయమని యదురాజు కోరగా, దత్తాత్రేయులవారు వివరిస్తున్నారిలా -

ఇరవై నలుగురు గురువుల గురించి తదుపరి టపాలో - 



21, జూన్ 2023, బుధవారం

మహా తపస్వి మహర్షి అత్రి - మహోన్నత తపస్విని మహాసాధ్వి అనసూయ - మహిమాన్విత మహాగురుదేవుడు దత్తాత్రేయుడు

భారతీయ సనాతనధర్మంలో మహర్షులది మహోన్నత స్థానం. వేదసారాలను శ్రుతి స్మృతి పురాణ ఇతిహాసాల రూపేణా అందించిన జ్ఞానమార్గ ప్రబోధుకులు. మహర్షుల మనుగడ, వారి తపస్సు లోక శ్రేయస్సు కోసమే. లోకాల్ని ఉద్ధరించి, లోక శ్రేయస్సే వ్యక్తిగత శ్రేయస్సుగా భావించి, తమ తపస్సంపదను సమాజ రక్షణ కోసం ధారపోసిన మహర్షులను స్మరించుకోవడం మన కనీస ధర్మం. 


మనకోసం పుట్టిన అటువంటి మహా తపసంపన్నులలో ఒకరైన అత్రి మహర్షిని నేడు స్మరణ బ్లాగ్ ద్వారా, భక్తి పూర్వకంగా స్మరించుకుంటూ ప్రణమిల్లుతున్నాను.

కృతయుగం ప్రారంభంలో -




సృష్టిని విస్తరింపచేయటం కోసం బ్రహ్మ సంకల్పంతో ఉద్భవించిన బ్రహ్మ మానస పుత్రుడు అత్రి మహర్షి. సప్తర్షులలో ఒకరు. గోత్ర (ఆత్రేయ గోత్రం) ప్రవర్తకులు. 

తపోధనుడు లోకోత్తరుడు అత్రి మహర్షి 

త్రిగుణాలకు అతీతుడు కనుక ఈ మహర్షికి అత్రి అనే పేరొచ్చింది.  
ఆధ్యాత్మికాది తాపత్రయ రహితత్వేన అత్రిశబ్దవాచ్యో జీవన్ముక్తో కశ్చిన్మహర్షిః 
త్రివిధ తాపత్రయములు, త్రిగుణములు గ్రంథిత్రయదోషాలు అనే త్రయములు లేనివాడు అత్రి.
లోకసృష్టి విస్తరింపజేసే లక్ష్యంగా, సద్గుణాలతో మనుజులు విల్లసిల్లాలంటే లోకాన్ని ఉద్ధరించే ఉత్తమ సంతానికే తపస్సు చేయమన్న తండ్రి బ్రహ్మగారి ఆదేశానుసారంగా తపస్సు ప్రారంభించెను. ఆ తీవ్ర తపస్సుతో జ్ఞానసంపన్నులై, ప్రాణుల శరీరవ్యవస్థ పంచ భూతాత్మకమైనదని, అది అస్థిరమైనదని, నిత్యమైనది ఆత్మ మాత్రమేనని గ్రహించి, ఆత్మ సాక్షాత్కారం పొందిన పిదప కూడా ఉగ్రతపస్సును  సాగించడంతో, ఆ తపశ్శక్తి ప్రభావంతో అత్రిమహర్షి నేత్రాల నుంచి ఓ దివ్య తేజస్సు వెలువడి, ఆ కాంతి దశదిశలా వ్యాపించగా, ఆ తేజస్సును ఆ దిశలు తట్టుకోలేక సముద్రంలోకి విడిచిపెట్టబోతుండగా, బ్రహ్మదేవుడు క్షణాల్లో ఆ దివ్యతేజస్సును తనలోకి లాక్కున్నాడు. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ, తనని స్తుతిస్తున్న దేవతలతో, ఓ దేవతలారా! ఇలా జరిగిందంతా లోక సంక్షేమం కోసమే. అత్రికి భవిష్యత్తులో అనసూయ అనే కన్యతో వివాహమౌతుంది. అప్పుడు ఆ దంపతులకు కుమారుడుగా నాలో ప్రవేశించిన ఈ తేజస్సులో కొంతభాగం చంద్రుడుగా పుడతాడు. అలాగే, మిగిలిన తేజస్సే మరోసారి క్షీర సాగరమధనవేళ చంద్రుడుగా ఉద్భవించి లోకాలన్నిటికీ మేలు చేస్తాడని బ్రహ్మదేవుడు తెలిపాడు. 
అత్రి మహర్షి కంటి చూపు ఎంత శక్తివంతమైనదంటే - తన కంటి నుండి వెలువడిన తేజస్సు చంద్రుడు కావడం ఒక విశేషమైతే, దేవతలను బాధిస్తున్న జంభుడు అనే రాక్షసుడిని, సూర్యచంద్రులను వేధిస్తున్న రాహువును కూడా నశింపజేసింది ఆ కంటి చూపే.  దివ్య తపో తేజోమూర్తి.
ఈ మహర్షి మానవాళికి శ్రుతులు, స్మృతులు అందించారు. లఘు అత్రి స్మృతి, వృద్ధ ఆత్రేయ స్మృతి, అత్రి సంహిత, అత్రి ధర్మ సంహిత అనేటి మార్గదర్శక సూత్రాలను అందించారు. పరమ ధర్మాలను, అర్చనా విధానాలను, దేవాలయాలాది నిర్మాణా విధానాలను, యజ్ఞాది కర్మల విధానాలను 'అత్రి సంహిత' పేరిట లోకానికి అందించిన మహాత్ముడు అత్రి మహర్షి. అన్నింటికీ మించి అంటరానితనం తగదని, ప్రతీజీవి దైవ సృష్టి అయినప్పుడు అంటరానితనం ఎందుకని ప్రశ్నిస్తూ, అభేదాన్ని ప్రతిపాదించారు. 

తపస్విని లోకహితైషిణి అనసూయ

మన ఈ ఆర్యభూమి ఎందరో పవిత్రత పాతివ్రత్య సాధ్వీమతల్లులకు నిలయం. అందులో అగ్రగణ్యురాలు అనసూయ.

స్వాయంభవు మనువు, శతరూప దంపతుల కుమార్తె దేవహూతి.  
మహా తపస్సంపన్నుడు అయిన కర్దమ ప్రజాపతి, దేవహూతి దంపతుల కుమార్తె అనసూయ.  యస్యాం నవిద్యతే అసూయ సా అనసూయ అనసూయ అంటే అసూయ లేనిది. అసూయను వీడిన తత్త్వం. జీవుడు మాయను వదిలిన స్థితి అని దత్తపురాణం నిర్వచించింది. 




అనసూయను తపో శ్రేష్ఠుడయిన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహాధర్మాన్ని చక్కగా పాటిస్తూ, భర్తనే దైవంగా సేవిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ, పతి ప్రేమను పూర్ణంగా పొంది, ఆయన నుండి జ్ఞానోపదేశం పొందింది. ఈ ఆహార నిద్రాది సంసార వ్యామోహం తుచ్ఛమని గ్రహించి, ఆత్మానాత్మ వివేకం సంపాదించినది. తన పాతివ్రత్య మహిమతో ముల్లోకాలను అబ్బురపరస్తూ, పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అణకువగా వుండేలా చేసుకున్న మహాసాధ్వి.

ఈ దంపతుల తపః ఫలితంతో వారు ఉన్న ప్రాంతం పరమ పవిత్రమూ, శక్తివంతమూ అయింది.

ఒకరోజు ఆకాశంలో త్రిమూర్తులు వారివారి వాహనాల మీద మేరుగిరికి వెడలుచుండగా, ఒకచోట వీరి వాహనములు తటాలున ఆగిపోయి ముందుకు కదలలేకపోయాయి. అట్లు ఆగుటకు కారణం ఏమని అనుకుంటుండగా, 
అప్పుడు గరుత్మంతుడు స్వామీ! ఈ క్రింద భూమి మీద అత్రిమహర్షి ఆశ్రమం ఉంది. ఆ మహర్షి భార్య అనసూయ మహా పతివ్రత. ఈ దంపతుల పవిత్రత దాట శక్యం కాదు. అందుకని దీని మీదుగా ముందుకు వెళ్లలేమ'ని ప్రక్క త్రోవలో ప్రయాణం సాగించారు. ఏమీ! ఇంత శక్తి వుందా? అనుకొని, మానవాళికి ధర్మం యందు అనురక్తి కలగాలంటే, వీరి శక్తి ప్రకటితం కావాలని, అత్రి అనసూయల ఖ్యాతిని మరింత ప్రకాశింపజేయాలని, మహా పతివ్రత అనసూయ ధర్మవైభవం లోకానికి తెలియాలని, ముగ్గురు మూర్తులు సంకల్పించుకొని అనసూయను పరీక్షించాలని భావించారు.
భగవంతుడు వరాలిచ్చేమందు పరీక్ష పెడతాడు. ముందుగా పరీక్ష పెట్టేవాడు ఇంద్రుడు. అత్రి దంపతులకు పరీక్ష పెట్టే శక్తి తనకి లేదని త్రిమూర్తులతో ఇంద్రుడు చెప్పగా, ఆ మువ్వురు నారదుని పిలిచి, అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించమని అనగా, ఆయన మారువేషంలో వెళ్ళి, అనసూయతో శనగలు తినాలని ఉందని, ఇనుప గుగ్గిళ్ళు ఇచ్చి, వండమని కోరగా, వచ్చింది నారదుడు అని తెలిసిన, బయటపడక ఆ ఇనుప గుగ్గిళ్ళును తీసుకొని వాటిని చక్కగా వండి పెట్టింది. 

ఈ సంఘటన మొదటిసారి మా తాతయ్య చెప్తున్నప్పుడు - నిజంగానా... ఇనుప గుగ్గిళ్ళును అలా ఎలా వండేసింది అని నేను అంటే, నిజమే తల్లీ, ఆవిడ అంత తపశ్శాలి. దీనికే నోరు వెళ్ళబెట్టిస్తే ఎలా? ముందు ముందు ఘనమైన అద్భుతాలు ఎన్ని చేసిందో...విను, అన్నారు. 

ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి ప్రశస్త పద్యాలు ప్రస్తావించకుండా ఉండలేను.
అల కలహభోజనుని ఫలహారమునకు 
నినుప గుగ్గిళ్ళు వండి వడ్డించినావు
అమ్మ! నీ చేతి తాలింపు కమ్మదనము
భరత దేశాన ఘుమఘుమ పరిమళించె 




అంతట ఆశ్చర్యానందాలతో పాతివ్రత్యం అంటే అనసూయ దేనని, అనసూయ పాతివ్రత్యాన్ని లోక కల్యాణార్థం నారదుడు త్రిమూర్తుల ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించెను.

అత్యపూర్వ మమౌఘ మనంత మైన
తావక పతివ్రతా మహత్త్వమ్ములోన
ఆది సాధ్వీమణుల హృదయములతోడ
నుక్కు శనగలు తుక తుక ఉడికిపోయే

మువ్వురు పత్నులు కించెత్ అసూయకు లోనై (లోకోద్ధరణకై  వీరి మానసిక స్పందనలుంటాయి. అనసూయ గొప్పతనాన్ని మరింత విశదంగా లోకానికి తెలిపారు) ఆమె పాతివ్రత్యం పరీక్షించమని తమ తమ భర్తలను కోరారు. 

అంతట త్రిమూర్తులు బ్రాహ్మణ వేషదారులై అత్రి ఆశ్రమమున కేతించగా, ఆ మువ్వురిని ఆ పుణ్య దంపతులు సాదరంగా ఆహ్వనించి ఉచితాసనాలు అర్పించి స్వాగత సత్కారాలు చేసిన తర్వాత, 'మీ మువ్వురి రాకతో మా ఆశ్రమం పావనమైనది, భోజనాలు సిద్ధం చేశాను రండీ' అంటూ అనసూయ పలికింది. వారు ఆశీనులయ్యాక, వడ్డన చేయుటకు ఆమె సమాయత్తమవ్వగా, 'ఆగమ్మా, మేము ఆతిథ్యం స్వీకరించాలంటే నీవు నగ్నంగా వడ్డించా'లని కోరారు. పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమగును. అతిథి ఆకలితో తిరిగివెళ్ళిపోతే గృహస్థు పుణ్యాన్ని, తపస్సును అతిథి తీసుకొని పోతాడని శాస్త్రవచనం. కానీ, ఆ మాటలు విన్న ఆమె తన ప్రత్యక్షదైవం అయిన తన భర్తను మనసారా తలుచుకొని, వచ్చింది ఎవరో, వారి రాక ఆంతర్యమేమిటో గ్రహించి, తన పాతివ్రత్యమునకు, అతిథిసేవలకు భంగం కలగకుండా, చిరునవ్వుతో ఏమీ నాయీ భాగ్యము...ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు ఇలా వచ్చినారా...అనుకుంటూ - 




పతిని ప్రార్థించి, కమండలోదకమును వారి శిరస్సున చల్లి, వారిని పసిబాలురను చేసి, వారు కోరిన రీతిలో స్తన్యమిచ్చి, ఆహారం పెట్టింది.

గర్భము లేదు, కష్టపడి కన్నదిలేదిక, బారసాల సం
దర్భము లేదహో! పురిటి స్నానములున్ నడికట్లు లేవు, ఏ
స్వర్భువనాలనుండి దిగివచ్చిరి నీ ప్రణయాంక పీఠికీ
యర్భకు లంతులేని జననాంతర పుణ్య తపః ఫలమ్ములై 

గర్భంలేదు, ప్రసవవేదన లేదు, పురిటిస్నానం లేదు, పేరు పెట్టింది లేదు, నడికట్టు లేదు... ఏ లోకాలునుండి వచ్చారమ్మా, ఈ అర్భకులు నీ ఒడిలోకి? సాక్షాత్ త్రిమూర్తులే అర్భకులై  ఒడిలోకి రావడం... ఎంతటి అద్భుత ఘటన.
పిమ్మట వస్త్రధారియై పూలపాన్పుతో ఊయల సిద్ధం చేసి జోలపాడింది. 



ఇయ్యఖిల ప్రపంచములనే తమ బొజ్జల మాటుకొన్న బా
బయ్యలు మువ్వురున్ శిశువులై శయనించిరి నీ గృహాన, నీ
తియ్యని జోలపాటల కిదే పులకించెను సృష్టి యెల్ల, నీ
యుయ్యల తూగులో నిదుర నొందునులే పదునాల్గు లోకముల్!
ఔరా! బ్రహ్మాండ నాయక త్రయం శిశుత్రయ మయిందే ...



వేద వేదాంత సౌవర్ణ వీధులందు
తిరుగుచుండెడి దివ్యమూర్తిత్రయమ్ము 
నేడు నీ వంటయింట దోగాడుచుండె
గోరుముద్దలు గుజ్జనగూళ్ళు తినుచు

కాలు కదపక బిడ్డ లుయ్యేలలందు
నూగులాడె ముల్లోకము లూగుచుండె
కాలు వచ్చి గంతులు వేయుకాలమునకు
ఇంత కెంతౌనొ? వింతబాలెంతరాల!
అబ్బో! ముందు ముందు ఇంకేం జరుగునో...

ఆదియు నంతమే యెరుగునట్టి మహామహిమాడ్యు లైన బ్ర
హ్మాదుల కుగ్గు వెట్టి ఒడియం దిడి జోలలబాడు పెద్ద ము
త్తైదువ! దన్యురాలవు గదమ్మ! త్వదుజ్జ్వల కీర్తి గీతికా
నాదము మ్రోగె స్వర్గ భువనమ్మున దైవతమౌని వీణపై

ఓహో! బ్రహ్మాదులకే ఉగ్గుపోసి జోలపాట పాడే పెద్ద ముత్తైదువ.  స్వర్గ భువనమ్మున నారదుడు తన వీణ మీద పలికిస్తున్నాడు ఈ అపూర్వ సంఘటనను. ఏమీ ఘనత అనసూయమ్మది.

అగ్గిని గల్పి మట్టు మరియాదలు, పుణ్య పురాణ పూరుషుల్
ముగ్గురు చేయివచ్చిన యమోఘపు టగ్నిపరీక్ష లోపలన్ 
నెగ్గితి వీవ పూర్వములు నీ చరితమ్ముల్ చెవిసోకి మేనులన్
గగ్గురుపాటు పుట్టినదిగా ముగ్గురమ్మల కొక్కపెట్టునన్

ఆహా! ఎంతటి సాధ్వీమతల్లి... మువ్వురు దేవేరులు ఉలిక్కిపడ్డారు కదా.




ఇలా వుండగా, లక్ష్మీ, సరస్వతీ, పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టగా, అంతలో అక్కడకు వచ్చిన దేవార్షి నారదుని వలన అత్రి మహర్షి ఆశ్రమము నందు జరిగిన వింత తెలుసుకొని, హుటాహటీన ఆశ్రమముకు చేరుకొని, పసిబిడ్డలుగా ఉన్న వారి భర్తలను చూసి, కన్నీళ్ళతో "తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను పరీక్షించమని చెప్పి పంపి, తప్పు చేశామని, తాము చేసిన తప్పిదాన్ని మన్నించి, మా భర్తలను స్వస్వరూపాలతో ప్రసాదించమని వేడుకొన్నారు. 

కొంగులు బట్టి 'మా పసుపు కుంకుమతో పతిభిక్ష పెట్టి మా
మంగళ సూత్రముల్ నిలుపు' మంచు సరస్వతి సర్వమంగళా 
మంగళ దేవతల్ ప్రణతమస్తకలై పడియున్నవారు నీ
ముంగిట యందు నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్!

అంత అనసూయ పతిని తలుచుకొని కమండలోదకం ప్రోక్షించగా, త్రిమూర్తులు స్వస్వరూపం పొందారు.  

అమ్మవైనావు చతురాస్య హరి హరులకు
అత్తవైతివి వాణీ రమాంబికలకు 
ఘనతమై అత్తగారి పెత్తనము చూపి
క్రొత్త కోడండ్ర నిక దిద్దుకోగదమ్మ!

జగదీశ్వరులకే అమ్మవై, వాళ్ళను ఆలించి లాలించి, సరస్వతీ, లక్ష్మీ పార్వతి దేవేరులకు అత్తవైనావు. ఎంతటి ఘనత! ఇక అత్తగారి పెత్తనంతో క్రొత్త కోడళ్లను దిద్దుకోమనడంలో కరుణశ్రీ  మురిపపు కవితాదృష్టి ఎంత ఘనం!

మాతృప్రేమ పునీతమౌ సఫల దాంపత్యమ్ము నీ సొమ్ము, నీ
పాతివ్రత్యములోన అత్రితపముల్ పండెన్, వియద్గంగకే 
యేతామెత్తెను నీ యశస్సులు గుమాయించెన్ జగమ్మెల్ల నీ
యాతిథ్యమ్ము, నమస్సులమ్మ! అనసూయా! అత్రి సీమంతినీ!

ఈ తపశ్శాలి పాతివ్రత్యం, మాతృప్రేమ అమోఘం, అద్భుతం, అపూర్వం. ఈ మహాతల్లికి శిరస్సు వంచి నమస్కరించక ఎవరుండగలరు?




ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుంది? త్రిమూర్తులను సంతానంగా పొందిన ఏకైక మహతపస్విని.




త్రిమూర్తులు స్వస్వరూపం పొందిన అనంతరం,
అనసూయ అత్రిదంపతులను వరం కోరుకోమనగా - దేవాధిదేవులైన మీరు నాకు పుత్రులుగా జన్మించాలని కోరుకోవడం... తథాస్తు అనడం జరిగింది.

పిమ్మట అత్రిమహర్షి భార్యతో ఋక్షపర్వతంపై నూరుసంవత్సరాలు ఘోరతపస్సు చేయగా త్రిమూర్తులు ప్రత్యక్షమైనారు. నేను ఏ పరమాత్మను గురించి తపస్సు చేస్తున్నానో,  ఆ పరమాత్మ స్వరూపం మీ ముగ్గురులో ఎవరు అని అత్రి అడగగా, నీవు ధ్యానిస్తున్న పరమాత్మ మేమే. మేము మూడు రూపాలలో ఉన్నా, నిజానికి ఒక్కరమే. మాకు బేధం లేదు. అనన్యసాధ్యమైన మీ తపస్సుకు మాకు మేమే మీకు దత్తమౌతాం. మీకు త్వరలో మా మువ్వురు అంశలతో పుత్రులు పుడతారని వరమిచ్చి వెడలిరి.




ఒకసారి మహాపతివ్రత అయిన సుమతి, కుష్టువ్యాధిగ్రస్తుడైన తన భర్త కౌశికుని ఒక బుట్టలో కూర్చుండబెట్టి, ఆ బుట్టను నెత్తిపై పెట్టుకొని వెళ్తుండగా, మార్గమధ్యంలో కౌశికుని కాలు మాండవ్యమహర్షికి తగిలింది. అతడు కోపావేశంతో రేపు సూర్యోదయానికి నీ భర్త మరణించుగాక అని శపించెను. అంతట సుమతి తెలియక జరిగిన పొరపాటును మన్నించమని పలువిధాల మాండవ్యమహర్షిని వేడుకొన్నా, ఆయన కనికరించకపోవడంతో, రేపటిదినం సూర్యోదయమే లేకపోవలెనని సూర్యుణ్ణి ఆదేశించింది. ఆమె పాతివ్రత్యమహిమ తెలిసిన సూర్యభగవానుడు తన సంచారాన్ని నిలిపివేశాడు. ప్రపంచమంతా చీకటిమయమై సృష్టిగతి స్థంభించింది . దీనిని నివారించడం దేవతలకు అసాధ్యం కావడంతో, దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళగా, ఒక పతివ్రత శాపమును మరో పతివ్రత మాత్రమే నిలువరించగలదని,  లోకబాంధవి అనసూయను ప్రార్ధించమని చెప్పగా, వారంతా అనసూయ దగ్గరకు వచ్చి వేడుకోగా, అనసూయ సుమతి వద్దకు వెళ్ళి, పతివ్రత ధర్మములు చెప్పి, సూర్యుణ్ణి ఉదయించమని చెప్పు, నీ భర్త మృతి చెందినా, నా తపః ప్రభావంతో బ్రతికిస్తాను అని చెప్పి కౌశికుని పునర్జీవింపజేస్తుంది. అంతటి తపస్సంపన్నురాలు అనసూయ. ఈ అద్భుత కార్యానికి సంతసించిన త్రిమూర్తులు ప్రత్యక్షమై, ఆమెను వరం కోరుకోమనగా, లోగడ తనకు ఇచ్చిన వరాన్నే అనుగ్రహించమని కోరింది.

తరువాత కొద్దికాలానికి బ్రహ్మాంశతో చంద్రుడు, బ్రహ్మరుద్రాంశాలతో కూడిన విష్ణంశతో దత్తాత్రేయ స్వామి, రుద్రాంశతో దుర్వాసముని ఈ పుణ్య దంపతులకు పుత్రులై జన్మించిరి. ఈ ముగ్గురు అత్రి సంతానం కనుక ఆత్రేయులని, దత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు.

అనురాగభరితమైన ఆదర్శ దాంపత్యజీవనం




త్రిగుణాలకు అతీతుడు అయిన అత్రికి అసూయ రహితురాలైన అనసూయ జోడీ అయి ప్రపంచానికి చేసిన మేలు అంతా ఇంతా కాదు. వీరి దాంపత్యజీవితం సర్వుల సంక్షేమం కోసమే సాగింది.
ఇద్దరూ ఎంతటి తపశ్శాలులు అయినా ఒకరినొకరు అర్థం చేసుకొని అరమరికలు లేని దాంపత్య జీవితాన్ని గడిపారు. ఎన్ని పరీక్షలెదురైనా తమ పవిత్రతతో ఎదుర్కొని నిలబడ్డారు. సంసార జీవితాన్ని ఎంతో ఆదర్శంగా గడిపారు. 
సంప్రదాయాన్ని అనుసరించి గృహస్థజీవితం ముగిశాక, వానప్రస్థ ఆశ్రమం తీసుకోవాలి. అంటే భార్యాభర్తలిద్దరూ శేష జీవితాన్ని తపస్సు చేస్తూ అడవుల్లో గడపాలి. పుత్రులు కలిగాక, అత్రి మహర్షి వానప్రస్థానికి  సంకల్పించి, ఈ విషయాన్ని అనసూయకు చెప్పి, 'నీవు వస్తావా' అని అడగగా, 
ఆమె "స్వామీ! సంతాన పోషణకు, వారి సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేసిన పిదప తపస్సుకు వెళ్ళడం సముచితంగా ఉంటుంద"ని ఓ మాతృమూర్తిగా, బాధ్యతాయుతమైన ఇల్లాలిగా కుటుంబ బాధ్యత నిర్వహించడం ఎంత అవసరమో చెప్పింది. ఆమె చెప్పిన ధర్మబద్ధమైన  మాటలను అంగీకరించిన అత్రి మహర్షి, ధనం కొరకు పృధు చక్రవర్తిని ఆశ్రయించగా, ఆ చక్రవర్తి ఆ సమయంలో చేయ సంకల్పించిన అశ్వమేధయాగం గురించి చెప్పి, యాగాశ్వ రక్షణకై తన కుమారునితో వెళ్ళమని కోరడంతో, సరేనని పృధువు కుమారునితో బయలుదేరెను. యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించగా, అత్రి మహర్షి తన దివ్యదృష్టితో ఇంద్రుణ్ణి కనిపెట్టి, శిక్షించమని చెప్పి, నిర్విఘ్నంగా యాగాన్ని పూర్తి చేయించడంతో, కృతజ్ఞతాపూర్వకంగా భూరి దక్షిణలతో మహర్షిని చక్రవర్తి సత్కరించెను. చక్రవర్తి ఇచ్చిన సంపదను తెచ్చి సంతానానికి ఇచ్చి, గృహస్థ జీవిత బాధ్యతలను నెరవేర్చి, ఇరువురు వానప్రస్థ ఆశ్రమముకు వెడలిరి.

వీరి అన్యోన్య ఆదర్శ దాంపత్యంకు దర్పణం పట్టే ఓ చక్కటి ఘట్టం, మువ్వురికే కాదు, సర్వులకు అనసూయమ్మ అమ్మే అని తెలియజెప్పే ఘట్టం వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో ఉంది. ఆ ముచ్చటైన ఘట్టం చదువుతున్నప్పుడంతా, ఒక ఆదర్శమూర్తి అయిన భర్తగా అత్రి మహర్షి గోచరిస్తారు.
సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తూ, చిత్రకూటం నుంచి నడుస్తూ, దండ కారణ్యంలోని అత్రి ఆశ్రమానికి వచ్చినప్పుడు -




అత్రి మహర్షి పండుముసలిగా ఉన్న తన భార్యను పరిచయం చేస్తూ - 
ఈమె నా ఇల్లాలు. అనసూయ. మహాభాగ్యవతి, ధర్మచారిణి, గొప్ప తపస్విని... అని, అలానే ఆమె ఔన్నత్యాన్ని తెలియజెప్తూ -
రామా! పూర్వం ఒకప్పుడు పది సంవత్సరాలు వానలు కురవక, మహాక్షామము వచ్చింది. అప్పుడు నా ఇల్లాలు ఋషులకు, అందరికీ ఆహారాన్ని సృష్టించి పెట్టింది. అంతేకాదు, తన తపః ప్రభావంతో గంగాజలాలు సమృద్ధముగా ప్రవహించునట్లు చేసింది. ఒకప్పుడు దేవకార్యం కోసం ఈమె పది రాత్రులను ఏకరాత్రిగా చేసింది. ఈ మహాయశస్విని కోపం అనేది ఎరుగదు... ఇలా అత్రి మహర్షి తన భార్య పట్ల తనకున్న అనురక్తి తొణికిసలాడేలా మాట్లాడుతూ, అనురాగపూరిత భర్తగా భాసిల్లుతారు. 




సీతకు అనేక ధర్మ విషయాలను, పాతివ్రత్యం గూర్చి విశేషంగా చెప్పి, సీతా రాముల కళ్యాణ ఘట్టం చెప్పించుకొని, ఆ రాత్రి వారికి ఆతిథ్యమిచ్చి, ఎప్పుడూ వాడిపోని పుష్ప మాలలు, వస్త్రములు, పరిమళ ద్రవ్యాలు కానుకగా ఇచ్చి సీతమ్మను ఆశీర్వదించిన పెద్ద ముత్తైదువ అనసూయ.

తపశ్చర్య అనంతరం లభించిన సంతానం వలన లోకశ్రేయస్సు కలుగుతుందని అత్రి అనసూయ దంపతుల వృత్తాంతం వలన తెలుస్తుంది.
భగవాన్ దత్తాత్రేయుని ఆవిర్భవం 




మార్గశిర శుక్ల పౌర్ణమి -
శ్రీ దత్తాత్రేయుని జననం.

{దత్తాత్రేయుడు సృష్టి ప్రారంభంలో స్వాయంభువ మన్వంతరం లోని కృతయుగంలో అవతరించినట్లు చెప్తారు. శ్రీ గురుసంహిత పీఠికలో కృతయుగే మాధవమాసే కృష్ణ పక్షే  దశమ్యాం, ధిషణస్యవాసరే  పౌష్ణేచ ఋక్షే జపే జుపాంశే దత్త మూర్తి స్వయమావిరాసీత్
అని ఉండటం చేత కృతయుగంలో వైశాఖ బహుళ దశమి, గురువారం, రేవతి నక్షత్ర, మీనలగ్నంలో మీనాంశలో అవతరించినట్లున్నది. అయితే షోడశ దత్తావతారములలో,  చాలా చోట్ల మార్గశిర పౌర్ణమినాడు అవతరించినట్లు ఉండడంతో ఈ రోజే దత్తజయంతిగా ప్రసిద్ధి}.

భగవానుడి అవతారములు అనేకం. అందులో ముఖ్యంగా ఈ అవతారములు రెండు రకాలు. ఒకటి ధర్మ అవతారం. రెండవది జ్ఞాన అవతారం. 
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నరసింహుడు తదితర అవతారములు ధర్మ అవతారములు. రాక్షస సంహారానికి దుష్ట శిక్షణకూ ఏర్పడిన  అవతారములు. ధర్మ అవతారంలో భగవానుడు ఆయుధములు ధరించి దుష్టసంహారం చేసి ధర్మమును రక్షించగా, జ్ఞాన అవతారములలో ఆయుధాన్ని పట్టక, జ్ఞానం ద్వారా అజ్ఞానమనే అసురులను సంహరించడం స్పష్టమవుతుంది. దుష్టభావాన్ని రూపుమాపి జనులందరిని జ్ఞానప్రబోధంతో సన్మార్గులుగా చేయటానికి దత్తావతారం వచ్చిందని చెప్పవచ్చు. మానవులలోని రాక్షస ప్రవృత్తులనూ దుష్ట గుణాలను తొలగించి యోగసిద్దులుగా చేసే మహా యోగాన్ని బోధించే మహాజ్ఞాన గురుతత్వం దత్తునిది. 

త్రిమూర్తిస్వరూపుడైన శ్రీదత్తుడిది అత్యంత ప్రత్యేకమైన విశిష్టావతారం.
యుగయుగాల నుండి నేటి కలియుగం వరకు ఈ అవతారం నిలిచేయుంది. నిత్య సత్యావతారము. 16 కళలతో విరాజిల్లుచుండు పూర్ణావతారం. 

శ్రీ దత్తుని వైభవం... తదుపరి టపాలో -