31, అక్టోబర్ 2024, గురువారం

కాదేదీ కబుర్లకనర్హం - 2




అనే టపాలో చెప్పినట్లుగా కర్మల బట్టే జన్మ ఉంటుందని, కర్మల ఫలితం అనుభవించక తప్పదని, ఎవరి కర్మలకు వారే బాధ్యులని...ఇత్యాది విషయాలు గురించి మాట్లాడుకుంటుండగా...

రాముడు ఎక్కువ కష్టాలు పడ్డాడా? కృష్ణుడు ఎక్కువ కష్టాలు పడ్డాడా...అకస్మాత్తుగా అడిగిన పద్మగారి ప్రశ్నతో, అంతా ఒక్కసారిగా మౌనమవ్వగా, అదే దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయా అనే పాటలో "నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా" అని విన్నప్పుడంతా, నాకీ సందేహం వస్తుంది. మరల మనమంతా ఎప్పుడు కలుస్తామోనని అష్టావధానంలో అప్రస్తుత పృచ్చకునిలా అడిగేసాను... ఏమనుకోకండి అని అన్నారు పద్మగారు కాస్త తడబాటుతో.

శ్రీరాముని గురించి చెప్పాలంటే - 
శ్రీరాముని జననం, తన తల్లితండ్రులతో సహా అందరూ ఆనందకరంగా ఎదురుచూస్తున్న సమయంలో అంతఃపురంలో జరిగింది. అందరి ఆలనాపాలనలో అల్లారుముద్దుగా పెరిగిన బాల్యం. చక్కటి విద్యాభ్యాసం. సుమారుగా పదహారవ యేట మొదటిసారి రాక్షస సంహారం చేసి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని పూర్తి చేయించడం, ఆపై మిథిలానగరానికి వెళ్ళి శివధనస్సు విరిచి, అందరి ఆమోదయోగ్యంతో సీతాదేవిని వివాహమాడడం... ఇప్పటివరకు అంతా ఆనందకరమే. అటుపై పట్టాభిషేకం అనుకున్న సమయంలో పినతల్లి స్వార్థానికి ఆ ముహూర్తానికే అడవుల బాటపట్టాడు. తోడుగా భార్య, తమ్ముడు లక్ష్మణుడు. తండ్రిని పోగొట్టుకున్నాడు. అరణ్యవాసం తన తండ్రికి ఇచ్చిన గౌరవంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. మొదట పదమూడేళ్ళు ఋషి నియమాలను పాటిస్తూ, ప్రకృతిలో మమేకమై చెట్లను పుట్లను చూస్తూ, వన్య ప్రాణులతో చెలిమి చేస్తూ, సెలయేర్లు సవ్వళ్లును ఆస్వాదిస్తూ, ఎంతో ఆనందంగా హాయిగా గడిపారు. చివరి ఏడాది తోడుగా ఊరటగా నిలిచిన భార్యకు దూరమయ్యాడు. కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు. అంతులేని దుఃఖాన్ని గుండెలో మోస్తూనే రాక్షసవధ చేశాడు. తిరిగి అయోధ్య వచ్చి ఎన్నో వేల సంవత్సరాలు ఆనందంగా అద్భుతంగా పరిపాలన చేశాడు. రాముని జీవితకాలం 11000 సంవత్సరాలు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ...దశవర్ష శతానిచ అని విడిగా చెప్పడానికి కారణం సీతమ్మ భూమి వదిలి వెళ్ళిపోయిన తర్వాత అని పెద్దవారు చెప్పగా విన్నాను. అంటే వివాహ అనంతరం ఒక్క యేడాది మినహా ఇద్దరు కల్సి ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నారు. 1001 సంవత్సరాలు సీతమ్మతో ఎడబాటు...దుఃఖ భారం. ఇక  లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా, తాను మాత్రం అహం దశరథాత్మజః... దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమేనని ప్రకటించాడు. మాయలు మంత్రాలు చూపించలేదు. విశ్వరూపం ప్రకటించలేదు. అందరిలాగే ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. సాధారణ మనిషి ఎన్ని ఇబ్బందులు పడతాడో అన్ని యిబ్బందులు పడ్డాడు కానీ, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. నరుడు నారాయణుడు ఎలా కాగలడో జీవించి చూపాడు.

ఇక కృష్ణుడు విషయానికి వస్తే - 
తల్లితండ్రుల ఆవేదన నడుమ జననం. పుట్టక ముందే సంహరించాలనే మేనమామ పథక రచన. కారాగారమే జన్మస్థలం. ఆదినుండి అడుగడుగునా గండాలే. ఏ పసివాడూ అనుభవించనన్ని కష్టాలు. పుట్టిన క్షణాల్లోనే తల్లితండ్రులకు దూరం. పెరిగింది ప్రమాదకర పరిస్థితులలో. అనుక్షణం గడిపింది ప్రాణాపాయకర విపత్తులలో. హతమార్చాలని నలుదిక్కుల నుండి అసుర గణాలచే దాడి చేయిస్తున్న మేనమామ. పాలుత్రాగే ప్రాయంలోనే  పూతన, ఆపై శకటాసురుడు, తృణావర్తుడు... ఒకరని ఏముంది... ముప్పైకి పైగా అసురదాడులు... బాల్యమంతా జీవన్మరణ పోరాటమే. ఆపై మధురకు వెళ్ళడం, కంసున్ని సంహరించడం. ప్రతీ వివాహం అనేక యుద్ధ సంఘర్షణల నడుమే జరగడం. కష్టాలతో కూడిన ఎన్నో ఘట్టాలు, ఎన్నో గండాలు, ఎన్నో నిందలు, ఎన్నో కుట్రలను ఎదుర్కోవడం, తప్పు లేకున్నా గాంధారి శాపం స్వీకరించడం, జీవితం మొత్తం విషాదమయం. చరమఘట్టంలో తనవారంతా ఒక్కొక్కరుగా కొట్టుకొని దుర్మరణం పాలవుతుంటే, కళ్ళారా చూస్తూ, నిర్వికారంగా కదిలివెళ్ళి సాధారణ వేటగాని బాణం దెబ్బకు అవతార పరిసమాప్తం చేయడం. జీవితంలో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని, దేనికీ ఎవరికీ అంకితమవ్వక సాగించిన జీవితం.  ఒక్కమాటలో చెప్పాలంటే, కుదురుగా ఉండనివ్వని పరుగు పందెంలా సాగే జీవనం కృష్ణుడిది. అయినా ఏ క్షణంలోనూ సమ్మోహనకరమైన చిరునవ్వు వీడని చిద్విలాసుడు. లీలామానుష విగ్రహుడు. దార్శనికుడుగా యుద్ధవీరుడిగా, తాత్వికుడిగా, రాజనీతిజ్ఞుడిగా  వ్యూహకర్తగా కనబడతాడు. 
ఈ రెండు అవతారాలను పరిశీలిస్తే, శ్రీరాముడు కంటే శ్రీకృష్ణుడే ఎక్కువ కష్టాలు పడినట్లు నాకు అనిపిస్తుందని అన్నాను.

అయితే రాముని కంటే కృష్ణుడే గొప్ప అన్నమాట... ఇది పద్మగారి ఉవాచ. 
వెంటనే అలా ఎలా చెప్పగలరు పద్మగారు? శ్రీకృష్ణుని కంటే శ్రీరాముడే గొప్పయని కొందరు... లేదు లేదు శ్రీకృష్ణుడే గొప్పయని మరి కొందరు. అక్కడున్న వారంతా రెండు వర్గాలుగా విడిపోయి చమత్కారంగా వాగ్వివాదంకు దిగారు.

కృష్ణ వర్గం : నేటికీ భగవద్గీత అంతటా అందరిచే ఆదరింపబడుతుందంటే, ఆదర్శవంతంగా నిలబడిందంటే అది మా కృష్ణుని గొప్పతనం.

రామ వర్గం : ఆహా...ఇప్పటికీ రామరాజ్యం కావాలని, వస్తుందా...మనం చూడగలమా... అని కోరుకుంటున్నామంటే, అదీ మా రాముని గొప్పతనం. 

కృష్ణ వర్గం : ఓహో... మా కిట్టయ్య పసిప్రాయం నుండే పూతనాది రాక్షసులను సంహరించాడు. మరి మీ రాముడో, యుక్తప్రాయం అంటే పదహారు ఏళ్ళు వచ్చేక తాటకిని సంహరించాడు. పుట్టినప్పటి నుండే దుష్టశిక్షణ చేయనారభించిన మా కిట్టయ్య మీ రాముని కంటే గొప్పవాడమ్మా.

రామ వర్గం : అబ్బో... బాల్యం నుండే వెన్న దొంగలించడం, అత్తా కోడళ్ళు మధ్య తగాదాలు పెట్టడం, మాయలు చేయడం...అన్నీ తుంటరి చేష్టలే. ఇత్యాదివి మీ మాయావికి చేతనయినట్లు మా మర్యాద పురుషోత్తమునికి రావు లేమ్మా.  అయినా దరిజేరిన పూతనను స్త్రీ అని ఆలోచనైన లేకుండా వెన్వెంటనే సంహరించాడు. అదే మా రామయ్యో ... తాటకిని చూడగానే ఒక్కక్షణం తటపటాయిస్తూ ఆగేడు. గురువుగారు చెప్తే తప్ప, తాటకి మీద బాణాలు వేయలేదు. స్త్రీ అని జాలి చూపాడమ్మా... ఇదీ మా రాముడంటే. 

కృష్ణ వర్గం : మీ చోద్యం బంగారం కానూ... మీ రామునిలా తటపటాయింపులు తగ్గడాలు మాకృష్ణునికి తెలియవమ్మా...అంతా స్ట్రెయిట్ ఫార్వర్డ్... అవతరించిందే దుష్టశిక్షణ కోసం. అందుకే ఏ అవకాశం ఇవ్వకుండా చిన్ననాటి నుంచే రాక్షసవధ కావిస్తూ, భూభారాన్ని తగ్గించాడు. ఇప్పుడు చెప్పండి, మా కిట్టయ్యా గొప్పా? మీ రామయ్య గొప్పా? 

రామ వర్గం : చాలమ్మా సంబడం... కొన్ని క్షణాల్లోనే ఖర దూషణాది పద్నాలుగు వేల రాక్షసులను చంపిన పరాక్రమవంతుడు మా రాముడు. అయినా
మా రాముని ఔదార్యం మీ కృష్ణునికి ఎక్కడ? ఒకరోజు యుద్ధంలో రావణాసురుని అస్త్రాలను నిర్వీర్యం చేసి, రథాన్ని కూల్చి, నేల మీద నిలబెట్టాడు గానీ, సంహరించలేదు. "రావణా!  వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకొని, బలాన్ని సమకూర్చుకుని, ఆయుధాల్ని సిద్ధం చేసుకొని రేపు రా" అని, అవకాశం ఇచ్చిన ధర్మ ప్రభువు మా రాముడు. నిస్సహాయ స్థితిలో వున్న శత్రువు పట్ల దయ జాలి చూపించడం, అవకాశం వచ్చినా, శత్రువు అధర్మంగా ప్రవర్తించినా తను నిగ్రహం కొల్పోక, ధర్మానికే విలువనిచ్చి, సంయమనంతో వ్యవహరించడం రామునికే చెల్లింది. ధర్మమే పాటించని మీ కృష్ణునికంటే మా రాముడే గొప్పవాడు. 

కృష్ణ వర్గం : అవునవును...అందుకే కదా...రావణాసురుడిని చంపకుండా అవకాశమిచ్చి పంపడం వలన మరిన్ని ఉపద్రవాల్ని తెచ్చుకున్నది. రావణుడు సంధించిన ఓ అస్త్రానికి లక్ష్మణుడు  మూర్చల్లగా, హనుమంతుడు ఔషది పర్వతాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అవకాశం ఇవ్వకుండా ఉంటే అప్పుడే అంతా అయిపోయేది. అదే మా కృష్ణుడైతే అవకాశం ఇవ్వకుండా దుర్మార్గులను సంహరించడమే.  శిష్టరక్షణ చేయడమే మా కన్నయ్య ధ్యేయం. ఇక ధర్మ ప్రభువు అయిన మీ రామయ్య సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించడం, గర్భవతిగా ఉన్న తనని అడవిలో విడిచిపెట్టడం తగునా? 
రామ వర్గం : చాలు చాలు... చాలించండి మీ మాటలు. వాల్మీకి రామాయణంలో ఏముందో ముందు తెలుసుకోండి. రావణ వధ అనంతరం దగ్గరకు వచ్చిన సీతమ్మను చూసి, అనేకం మాట్లాడుతూ, చివరగా నీవు ఇప్పుడు స్వతంత్రురాలివి. నీవు నీకు నచ్చిన చోట ఉండవచ్చు. నీవు ఇక్కడ ఉన్న  విభీషణుడు దగ్గరగానీ, సుగ్రీవుడు దగ్గరకు గానీ, లక్ష్మణుడు, భరతుడు శత్రుఘ్నుడు దగ్గరకు గాని...నీకు నచ్చిన చోటకు వెళ్ళి ఉండమని అనగా, కోపంతో సీతమ్మ, ఒక పామరుడు ఒక పామర స్త్రీతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని.....అని అనేక మాటలు పలుకగా, ఊ...నేత్రరోగికి దీపంలా నాకంటికి ఇబ్బంది కల్గిస్తున్నావు ..... అని అనెను మా రామయ్యతండ్రి. 
రాముని మాటల్లో ఎంత ఔన్నత్యం ఉందో సూక్ష్మ రహస్యముందో గ్రహించండి. అక్కడ రామ లక్ష్మణులు తప్ప ఉన్నవారంతా వానరులు, రాక్షసులు. వాలి సుగ్రీవుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు, రాక్షసుల పద్ధతి అంతే... రాక్షసుల వానరుల నీతి అలా ఉండేది. వారు గానీ, లేదా మున్ముందు మానవజాతి గానీ సీతమ్మపై ఎటువంటి అపవాదం చేయకూడదని, సీతమ్మ పాతివ్రత్యం అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత తనపై ఉండడంతో అలా నర్మగర్భంగా మాట్లాడెను. పైగా ఏ కారణం చేతనైనా భర్త దగ్గర లేనప్పుడు ఆ స్త్రీ తన బిడ్డల చెంత గానీ, పుట్టింట గానీ, అత్తింట గానీ ఏదైనా తనకి సురక్షిత ప్రాంతంలో ఉండడం మంచిది. అందుకే పరమ భక్తులైన తండ్రి సమానులైన సుగ్రీవ విభీషణుల దగ్గర గానీ, పుత్ర సమానులైన లక్ష్మణ భరత శతృఘ్నల దగ్గరగాని సురక్షితంగా ఉండమని సూచన చేసేను. ఆపై మాట్లాడుతూ నీవు దీపం లాంటిదానివి, స్వచ్చమైనదానివి కానీ, లోకాపవాదం అనే నేత్రరోగం నాకు వచ్చింది. అందుకే నేను నిన్ను చూడలేకపోతున్నాను అనెను. అంతట సీతమ్మ భర్త మనసెరిగి, పరాయివాని చెరలో కొంతకాలం ఉండి వచ్చిన నన్ను రాముడెలా స్వీకరించాడన్న లోకాపవాదు రాకూడదని, రాక్షస చెరలో పది మాసాలు ఉన్నప్పటికీ, కొందరికి మాత్రమే తెలిసిన (సుందరకాండలో హనుమంతుని తోకకు నిప్పు పెడితే, అది తెలిసిన సీతమ్మ, “ఓ అగ్నిహోత్రుడా! నేను పతిసేవ చేసి ఉన్నట్లయితే, నేను తపస్సు చేసి నిరంతరం రామ ధ్యానం చేసింది నిజమైతే, నేను పతివ్రతను అయివున్నట్లయితే, నేను భాగ్యవంతురాలను అయి ఉన్నట్లయితే రాముడు నన్ను కలుసుకోవలెను అనుకుంటున్నట్టయితే  హనుమంతుడి తోకను దహించక చల్లగా చూడు" అని ప్రార్ధించగా... తోకపై మంచు రాసినట్లు మంట చల్లబడిన ఘటనలో ఆమె ఎంత పవిత్రురాలో హనుమకు, హనుమ ద్వారా రామ లక్ష్మణ సుగ్రీవ తదితర కొద్ది మందికి తెలుసు) తన పవిత్రతను అందరికీ నిరూపించాల్సిన బాధ్యత తనదేనని గ్రహించి, 'లక్ష్మణా! చితిపేర్చు అని అగ్నిప్రవేశానికి తనకి తాను సిద్ధమయ్యేను. అంతేగానీ, రాముడు అగ్నిప్రవేశం చేయమనలేదు. అయితే రాముడు ఆపకుండా, ఆమె చెప్పినట్లు చేయమని లక్ష్మణుడికి సంకేతమివ్వడమేమిటి అని మీరు అనవచ్చు. కానీ, సీతారాముల ఇరువురికీ తెలుసు... సత్యవంతురాలు పవిత్రమయి అయిన సీతను అగ్ని కాల్చలేదని. లోక అపవాదు లేకుండా నిరూపించుకోవడానికి ఇదే సరైనదని.

అయినా చాలా ఏళ్ళ తర్వాత అయోధ్య ప్రజలు అపవాదు తప్పలేదు. సీతమ్మ గర్భవతి అయ్యాక ఆమె ఋష్యాశ్రమంకు వెళ్ళాలని ఉందని కోరుకోవడం, అదే సమయంలో ప్రజల అపవాదు... తత్ఫలితంగా ప్రజా రక్షణ, ప్రజాభిప్రాయం గౌరవించడం, వ్యక్తి ధర్మం కంటే రాజ ధర్మం ముఖ్యం అనే ధర్మానుసారం సీతమ్మను వాల్మీకి ఆశ్రమం దగ్గరలో విడిచిపెట్టమని ఆజ్ఞాపించెను. ఇక్కడ ఓ విషయం గుర్తించండి. ప్రజలు ధర్మమార్గంలో ప్రవర్తించడం గురించి ఎంత ఆలోచించాడో, సీతమ్మ కోరిక మేరకు ఆమెకు ఋష్యాశ్రమం ప్రాప్తమయ్యేటట్లు చూసాడు. అంటే మా రాములోరు అటు రాజా రామునిగా, ఇటు సీతారామునిగా ధర్మమార్గంలో నడిచారు. 

లోతైన ధర్మగతిని లౌకిక దృష్టి గ్రహించలేదు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ; ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తియని లోకమంతా ఇన్ని యుగాలు తర్వాత కూడా గొప్పగా చెప్పుకుంటుంది.
ఇక మీ కృష్ణులవారో...ధర్మాన్ని తప్పి ద్రోణాచార్యుడుని, కర్ణుడిని సంహరించేలా చేయలేదా? ఇప్పుడు చెప్పండి సఖులారా! ఎవరు గొప్పో? 

కృష్ణ వర్గం : ఓహో.....ధర్మ సూక్ష్మాలు మీకూ, మీ రాములోరికేనా... మాకూ ఎఱుకే. మీ ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి. నగలు సొమ్ము మూట కట్టుకుని పారిపోతున్నారు. వారిని పట్టుకోవడానికి మీరు  తరుముకుని వెళ్తున్నారు. దొంగలు సందుల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వారిని పట్టుకోవాలని వెంబడిస్తున్న మీరు కారు వేసుకుని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగలను పట్టుకోవాలంటే వారిని అనుసరిస్తూ, వారు వెళ్ళిన మార్గంలోనే మీరూ వెళ్ళాలి కదా.
సరిగ్గా ద్వాపరయుగంలో ఇదే జరిగింది. ధర్మవిరుద్ధంగా వెళ్ళేవారిని అదే మార్గంలో వెళ్ళి శిక్షించడం జరిగింది.
ద్రోణాచార్యుడు గురువు అయి వున్నందున యుద్ధం
చేయరాదు. రెండు వైపులా న్యాయం చెప్పాలి. మంచి చెడులను వివరించాలి. అంతే గానీ ఆయుధాలు పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం. అలానే బ్రాహ్మణుడు అయివుండి సాత్త్విక గుణం కంటే మెండుగా రజోగుణం కలిగి ఉండడం, స్నేహితుడు ద్రుపదుడుపై ప్రతీకారం, దృతరాష్ట్రుడు మాదిరిగా కాస్త పుత్రప్రేమతో అధర్మవర్తనం, ద్రౌపది వస్త్రాపహరణ సమయమందు అధర్మాన్ని నిలువరించకపోవడం... ఇవి ద్రోణాచార్యునికి తగునా? ఇది అధర్మం కాదా? అందుకే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు "అశ్వత్థామ హతః" అని పెద్దగా చెప్పి, "కుంజరహః" అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతోనే జయించాలి, తప్పదు. ఏ కార్యమైనా లోక కళ్యాణానికే చేయించాడు.
ఇక కర్ణుడు - 
కర్ణుడి రథచక్రం భూమిలో దిగిపోవడంతో, రథం దిగి దాన్ని సరిచేస్తున్న సమయంలో, శ్రీకృష్ణుడు వెంటనే కర్ణున్ని చంపమన్న ఆదేశం ఇవ్వడంతో అర్జునుడు కర్ణునిపై బాణాలు సంధిస్తుండగా, నిరాయుధుడుపై బాణాలు సంధించడం ధర్మమేనా... ఇత్యాది ప్రశ్నలతో కృష్ణా! నీవే ఆజ్ఞాపిస్తున్నావా..... ధర్మం నన్నెందుకు రక్షించడం లేదని ప్రశ్నించగా - 

 

కర్ణా! ధర్మాన్ని నీవు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మం వదిలిపెట్టడం వలనే నేడు ఈ పరిస్థితి వచ్చింది. నిన్ను అంగరాజు చేశాడన్న ఒకే ఒక కారణంతో ధర్మహీనుడైన దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి ఏదైనా చేస్తాను, మాట్లాడతాను అన్నట్లు ప్రవర్తించావు. ఎన్ని తప్పు పనులు చేశావో, తప్పు పనులు చేయడానికి ప్రోత్సహించావో గుర్తుతెచ్చుకో. దురాభిమానంతో గర్వంతో ఉండేవాడివి. లక్క ఇంటిని కాల్చేస్తున్నప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా? కపట జూదంతో నీ మిత్రుడు దుర్యోధనుడు ధర్మరాజును ఓడిస్తున్నప్పుడు ధర్మం జ్ఞాపకం రాలేదా? మిత్రుడు అధర్మ మార్గంలో నడిస్తే  మిత్రుడుగా మంచిమార్గంలో పెట్టడం నీ ధర్మం కాదా? నిండుసభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తున్నప్పుడు నీవు అన్న మాటలు ధర్మబద్ధమైనవా? చక్రవ్యూహంలో బాలుడైన అభిమన్యుడు వీపుపై బాణాలు సంధించి, నిరాయుధుడైన సమయంలో, అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు, ధర్మం తెలియరాలేదా? ఇది నీ కర్మ ప్రతిఫలం. ఇదే న్యాయమని ఆనాడే కృష్ణుడు చెప్పింది మీరు మరిచారా? అధర్మ ఆశయం ధర్మం నిలబెట్టడమే అయితే, ఆ అధర్మం కూడా ధర్మమే అవుతుంది. ఇప్పటికైనా మా కృష్ణ తత్త్వం గ్రహించి ఒప్పుకొండి కన్నయ్యే గొప్పవాడని. మీకో కథ చెప్పమా...విని మీరే చెప్తారు మా కిట్టయ్యే గొప్పయని. 
ఒకానొక రోజు గోకులంలో ఒక మహిళ బావి దగ్గర నీళ్ళు తోడుతోంది. కుండ నిండగానే ఎవరైనా ఆ కుండ తల మీద ఎత్తి పెడతారేమో అని ఇటూ అటూ చూసింది. అటుగా వెళుతున్న శ్రీకృష్ణుడు కనిపించాడు. "కృష్ణా కృష్ణా" అని పిలిచింది. కృష్ణుడు వినిపించనట్టు వెళ్ళిపోయాడు. కృష్ణకు ఏమైంది ఈరోజు అని అనుకుంటూ, ఎలాగోలా కుండ ఎత్తుకొని ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె ఇంటికి ఆమె కన్నా ముందు కృష్ణుడు చేరుకొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. "రా! కుండ దించి పెడతాను," అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో అడిగింది. "అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అంటున్నావు. ఇలా ఎందుకు చేస్తున్నావో... నాకేం అర్ధం కావడం లేదు, కృష్ణా!" అంది. కృష్ణుడు నవ్వి, "నేను భారం దించేవాడిని, భారం ఎక్కించడం నా పని కాదు" అని వెళ్ళిపోయాడు. ఇదీ మా కృష్ణుని గొప్పతనం. కృష్ణా కృష్ణా అని పిలిస్తే చాలూ, మన భారాల్ని ఆయనే దించుతాడు. ఇప్పుడు చెప్పండి మా కన్నయ్యే గ్రేట్ అని.
ఓసోసి... మేమూ ఇలాంటి బోలెడు కథలు విన్నాం, చదివాం. మేమూ కథలు చెప్పగలం. 
ఒకానొకరోజు ఒకచోట రామనామ భజన జరుగుతుండడం చూసి, ఒకతను అపహాస్యం చేస్తూ మాట్లాడం గమనించిన ఒక జ్ఞాని, అతనని వారించి, నీకు తెలుసివస్తుందిలే త్వరలో రామ నామ మహిమ అని చెప్పి, అతనికి రామనామాన్ని ఉపదేశించి, 'దీన్నెప్పుడూ ప్రతిఫలం కోసం ఇచ్చుకోకు, నీకు వీలున్నప్పుడల్లా చెప్పుకో' అన్నాడు. కాలక్రమంలో అతను చనిపోయాడు. యమదూతలు అతని ఆత్మను తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు. యమధర్మరాజు అతని పాపపుణ్యాల లెక్కలను పరిశీలించి, 'ఓమారు రామ నామాన్ని ఉచ్ఛరించావు. అందుకు నీకు ఏం కావాలో అడుగు?' అన్నాడు. అయితే అతనికి జ్ఞాని చెప్పిన 'ప్రతిఫలం కోసం ఇచ్చుకోకు' అన్నమాట గుర్తుకు వచ్చింది. కనుక అతను యమధర్మరాజుతో 'మీరు ఏమి ఇవ్వదలచుకున్నారో అది మీరే ఇవ్వండి. నేనుగా ఏదీ అడగను' అన్నాడు. అతని మాటలకు యమధర్మరాజు విస్తుపోయాడు. రామనామానికి తాను ఎలా వెల కట్టగలనని అనుకున్నాడు. ఎందుకైనా మంచిది ఈ విషయమై ఇంద్రుడిని కలిసి ఆయననే ఓ నిర్ణయం తీసుకోమంటే సరిపోతుందనుకున్నాడు. అతనితోపాటు యమధర్మరాజు ఇంద్రుడి వద్దకు బయలుదేరబోయాడు. అయితే అతను ఓ షరతు విధించాడు. 'నేను మీతో రావాలంటే నన్ను పల్లకీలో తీసుకుపోవాలి. పైగా ఆ పల్లకీని మోసేవారిలో మీరొకరై ఉండాలి' అన్నాడు. ఇందుకు సమ్మతమైతే వస్తానన్నాడు. ఇతను నన్నూ ఓ బోయిగా చూడాలనుకుంటున్నాడంటే రామనామ మహిమ ఘనంగానే ఉందన్న మాట అని అనుకున్నాడు యమధర్మరాజు. అందుకే అతను ఇలా షరతు విధిస్తున్నాడని భావించాడు. అందుకు సమ్మతించాడు. పల్లకీ మోసే బోయీలలో యమధర్మరాజు ఒకడయ్యాడు. ఇంద్రుడి వద్దకు చేరుకున్నారు. యమధర్మరాజుకు తన రాక కారణం చెప్పాడు. అయితే ఇంద్రుడు రామనామ మహిమకు నేను వెలకట్టలేనన్నాడు. మనమందరం కలిసి బ్రహ్మ దగ్గరకు పోదామన్నాడు. యమధర్మరాజుతోపాటు ఇంద్రుడు కూడా పల్లకీ మోస్తేనే తాను బ్రహ్మ వద్దకు వస్తానన్నాడతను. చేసేది లేక ఇంద్రుడు కూడా అందుకు సమ్మతించాడు. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళారు. అయితే బ్రహ్మ కూడా తాను రామనామ మహిమకు వెలకట్టలేననీ, వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదామనీ అన్నాడు. యమధర్మరాజు, ఇంద్రుడితోపాటు బ్రహ్మ కూడా పల్లకీ మోసే బోయీలలో ఒకడయ్యారు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళారు. విష్ణువుతో తామెందుకు వచ్చామో చెప్పారు. 'ఇతను ఒక్కసారి రామనామాన్ని ఉచ్ఛరించాడు, అందువల్ల అతనికి ఏ పుణ్యం దక్కుతుందో మీరే చెప్పా'లన్నారు యమధర్మరాజాదులు. 'ఈ జీవిని మీరందరూ కలిసి పల్లకీలో కూర్చోపెట్టి మోసుకువచ్చారు కదా, దీని బట్టి ఇంకా మీకు రామనామ మహిమ అర్థం కాలేదా?' అని ప్రశ్నిస్తూ ఆ ఆత్మను తనలో కలుపుకొన్నాడు విష్ణుమూర్తి. ఇప్పుడు చెప్పండి కృష్ణ భక్తమహాశయులారా! మీ అభిప్రాయాన్ని...

బాబోయ్...ఇక ఆపండీ...మనందరికీ తెలుసు. ఇద్దరూ శ్రీమన్నారాయణుని అవతారములే. 


రాముడు పూర్ణ మానవవతారం. కృష్ణుడిది పరమాత్మ అవతారం. ఒకరు మాయామానుష విగ్రహులు, మరొకరు లీలామానుష విగ్రహులు.

ఒకరిది త్రేతాయుగం, మరొకరిది ద్వాపరయుగం. రామునిలా ధర్మంగా ఉంటానంటే ద్వాపరయుగంలో కుదరదు. ఇక్కడ ధర్మానికి ధర్మమే సమాధానం, అలాగే మోసానికి మోసమే సమాధానం. ధర్మ రక్షణ యుగయుగానికి భిన్నం. యుగధర్మాలు, అవతార బేధాలు గమనిస్తే ఈ ధర్మ సూక్ష్మాలు అవగతమౌతాయి. 
త్రేతాయుగంలో అప్పటి ధర్మశాసనాలు, ఆనాటి కాలానుగుణంగా రాముడు గొప్పవాడు. ద్వాపరయుగంలో అప్పటి కాలపరిస్థితులను బట్టి కృష్ణుడు గొప్పవాడు. త్రేతాయుగంలో రాముడు చేసిన పనిని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పి చేయించాడు. 
రాముడు చేసి చూపించినది ఆచరణీయ ధర్మమార్గం.
కృష్ణుడు చెప్పి చేయించింది ఉపదేశ ధర్మమార్గం. అందుకే పెద్దలు అంటుంటారు 'రాముడు చేసింది చేయరా, కృష్ణుడు చెప్పింది వినురా' అని.
రాముడుని అనుసరించాలి, రాముని పనులను అనుకరించాలి. 
కృష్ణుడిని ఆశ్రయించాలి, కృష్ణుడు చెప్పినదానిని ఆచరించాలి. 

ధర్మాన్ని అనుసరించిన దేవుడు శ్రీరాముడు కాగా, ధర్మాన్ని నడిపించిన దేవుడు శ్రీకృష్ణుడు.
కాబట్టి ఇద్దరూ ఇద్దరే. ఇక ఈ చర్చ ఇంతటితో ఆపి ఇళ్ళకు వెళ్ళకపోతే భగవంతుని అనుగ్రహం ఉన్నా లేకున్నా, భర్త ఆగ్రహం తప్పక చవి చూడాల్సి వుంటుంది. ఇక  నడవండి అంటూ ముగించింది ప్రియంవద.