17, అక్టోబర్ 2011, సోమవారం

ప్రేమవాహిని

"దాచుకో - నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి 
పూచి నీ కీరితి రూపు పుష్పము లివియయ్యా !
ఒక్క సంకీర్తనే చాలు - ఒద్దికై మము రక్షింపగ 
తక్కినవి భండారాన దాచి ఉంచనీ...."
                                           రక్షింపబడడానికి ఒక్క సంకీర్తన చాలు అని అన్నమయ్య అన్నట్లుగా  ఈశ్వరీయగుణములలో ఒక్కటి  అలవర్చుకున్నా చాలు - తరించడానికి !
ఈశ్వరీయగుణములలో ప్రధానమైంది - "ప్రేమ".
ప్రేమ ఓ అద్భుత భావన.
అది హృదయాంతరములో అనిర్వచనీయమైన స్పందన.
వాస్తవానికి ప్రేమనేది ఒక ఆధ్యాత్మిక భావన.
      సాధారణముగా ఈ ప్రపంచమున పరస్పర అవసరములకై ఏర్పడిన బంధములు, తనవారు అనుకున్న మమకారభావములు, వ్యామోహములు, ఇష్టాలు..... వీటినే ప్రేమగా పరిగణించరాదు. స్వ, పర భేదము లేకుండా; ప్రతికూల సంఘటనలయందు, ప్రతికూల మనుష్యులయందు, ఏది ఎలా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా,  సమస్త సృష్టిని సమదృష్టితో చూడగలిగే తత్వమే ప్రేమతత్వం. సమదృష్టి అను పదమునకు పర్యాయపదమే ప్రేమ. నిజమైన ప్రేమ అపరిమితం, అనంతం. అంతర్యపు లోతుల్లో ప్రేమ ఉదయించి నిరంతరం అంతరమున అంతర్వాహినిలా ప్రవహిస్తుంటుంది.
                   "ప్రేమ అనేది ఓ స్థితి. ప్రేమ ఒక స్వాతంత్ర్యం. ప్రేమ రెక్కలను ఇస్తుంది. ప్రేమ వినీలకాశాన్ని తెరిచి వుంచుతుంది. ప్రేమ ఆవరణలో బిడాయించేది కాదు. ప్రేమ బందీఖానా అవ్వలేదు. కానీ, అలాంటి ప్రేమస్వభావం జాగృతి (ఎరుక) కలిగివున్నప్పుడు మాత్రమే వస్తుంది. నిరంతరం ఎరుకలో వున్నవారికే ఆనందం అనుభవమౌతుంది. ప్రేమలో, ధ్యానములో, ప్రపంచ అందాలలో, ప్రకృతి పారవశ్యములో జీవితాన్ని ఆనందించండి. ప్రతీ విషయములోను ప్రేమతో మసలండి. లౌకికమైన మామూలు విషయాన్ని ప్రేమతో పవిత్రముగా మార్చండి" అని అంటారు 'ఓషో'.
భగవంతుడు పరిపూర్ణ ప్రేమస్పదుడు. భగవంతుని సృజనలో అద్భుతమైనది ఈ ప్రేమే. నిజమైన ప్రేమయందు ధర్మం, సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం ఇమిడివుంటాయి. ప్రేమ ఆత్మతత్వమునకు సంబంధించినది. ఆత్మను ఎరిగినవాడే నిజమైన ప్రేమికుడు. 
ప్రాపంచికముగా ప్రేమగా వ్యవహరింపబడుతున్న ఈ ప్రేమనే  పారమార్ధికముగా భక్తీ అని వ్యవహరింతురు. పరమ ప్రేమకే పరమాత్ముడు పలుకుతాడన్నది నిజం. అందుకు ఎన్నో ఉదాహరణలు........
చతుర్దశ భువనభాండాల్ని భరిస్తున్న భగవంతుడు, చిటికెన వ్రేలిపై గోవర్ధనగిరిని ఎత్తిన బలవంతుడు, కాళియమర్ధనం చేయగలిగే శక్తిమంతుడు, రుక్మిణీదేవి ప్రేమకై పరవశించి తులసిదళమంత ఎత్తు తూగాడు. ఆహా - పరమాత్మున్నే పరవశింపజేసిన ఈ ప్రేమ ఎంతటి అద్భుతమైనది !
యశోదమ్మ ప్రేమకి తలవంచి తాళ్లకే వశమయ్యాడు వంశీకృష్ణుడు. ఆ అనంతుడుని ఓ త్రాడుతో బంధించడమా...... ఎవ్వరికైనా ఇది సాధ్యమా? యశోదతల్లి ప్రేమకే అది చెల్లు. ఆహా - అచ్యుతుడునే మురిపంతో బందీ చేసిన ఈ ప్రేమ అనిర్వచనీయం.
కృష్ణుని రూపం తలచుకోగానే చేతిలో వేణువు, తలపై పించం గుర్తుకొస్తాయి. పిల్లనగ్రోవి లేని కృష్ణుడుని ఊహించలేము. కానీ రాధ మధురప్రేమకి పరవశం అయిన కృష్ణుడు, రాధ భౌతికముగా లేదన్న వార్త తెలియగానే మురళినే శాశ్వతముగా విడిచిపెట్టేశాడు. రాధ పరమప్రేమ పరమాత్మున్నే కదిలించింది, కలచివేసింది. ఆహా - ఎంతటి దివ్యమైనది ఈ ప్రేమ !
పండరీనాధుని యాత్ర చూడాలని తపిస్తున్న సక్కుభాయి, తన భర్తా, అత్తల మద్య  బంధీకాగా - తన ప్రేమైక తపనకు పొంగిపోయి తనని విడిపించి, సక్కుభాయి రూపధారై పిండివిసిరాడు పండరీనాధుడు. ఆహా - పరాత్పరుడు పలికేది ప్రేమకే. 
'వ్యాపక బ్రహ్మ నిరంజన నిర్గుణ బిగత బినోద
సో అజ ప్రేమ భగతి బస కౌసల్యా కేం గోదా'.
(సర్వవ్యాపకుడు, నిరంజనుడు, నిర్గుణుడు, వినోదరహితుడు, అజన్ముడునగు పరబ్రహ్మయే ప్రేమకు వశుడై కౌసల్యాదేవి ఒడిలో ఆడుకొనెను) ఆహా - ఎంతటి మధురమైనది ఈ ప్రేమ !  
శబరీ పరమప్రేమకి ముగ్ధుడై మురిపంగా శబరీ ఎంగిలిచేసి ఇచ్చిన పళ్ళనే ప్రీతిగా ఆరగించాడు సర్వేశ్వరుడు శ్రీరామచంద్రుడు. ఆహా - పావనరామున్నే మెప్పించగలిగిన ఈ ప్రేమ ఎంతటి అమోఘమైనది. 
నా జీవనోపాది ఈ పడవ మాత్రమే. రాయినే స్త్రీగా మార్చిన నీ పాదం నా పడవని ఎలా మారుస్తుందో .... అందుకే ముందుగా నీ పాదాలను తాకి, కడిగి పరిక్షించాకే, నా పడవనెక్కు అని గుహుడు చమత్కారముతో తన ప్రేమైక కోరికను తీర్చుకోగా, ఆ  గుహున్ని ఆలింగనం చేసుకున్నాడు లోకాభిరాముడు - శ్రీరాముడు. ఆహా - సర్వేశ్వరుని ఆలింగనమా..... ఎంతటి ఉన్నతమైనది ఈ ప్రేమ !
అలానే, అన్నమయ్య ప్రేమకి పల్లవించి పల్లకినే మోశాడు, తిరుమలేశుడు - వేంకటేశ్వరుడు.
నిష్కల్మషమైన నిస్వార్ధమైన ప్రేమకై పోతనై వచ్చి పద్యం పూర్తిచేసి పరమానుగ్రహించాడు పావనరాముడు. 
ప్రేమలో గొప్పతనం ఇదే - అంతర్యామిని, అంతరంగాన్ని అనంతమైన ఆనందస్థితిలో ఐక్యం చేస్తుంది. అందుకే -
ప్రేమ ఒక యాగం,
ప్రేమ ఒక యోగం,
ప్రేమ ఓ అంతరంగ ప్రవాహం,
ప్రేమ ఓ జీవధార,
ప్రేమ ఓ ఆనంద వాహిని,
ప్రేమ ఓ అమృత వాహిని,
ప్రేమ విశ్వజనీయమైంది,
ప్రేమ ఈశ్వరతత్వం !
 మనస్సుకు, బుద్ధికి కూడా అందని పరమపవిత్రమైన అనుభూతే ప్రేమ. ప్రేమ బందించదు, బాధించదు. అది స్వేచ్చాయుతభావం. స్పష్టత, సరళత, సౌమ్యత, స్వచ్ఛత, స్వేఛ్చ దాని స్వభావం. ప్రేమనేది ఓ స్థితి. ఆ స్థితిని అనుభవించాలి. మనస్సు నిర్మలమై, నిశ్చలముగా వుండి దేనినీ ఆశించకుండా, దేనినైన అంగీకరించగలిగే స్థితిలో వున్నప్పుడే ప్రేమస్థితి సంపూర్ణముగా అనుభూతికి వస్తుంది. ఆ స్థితిలో వుండగలిగితే ఏది చూసిన, ఏది ఎలా వున్నా, ఎవరితో వున్నా ప్రేమగానే స్పందిస్తాం, అనుక్షణం ప్రేమను ఆస్వాదిస్తాం, ఆనందముగా జీవిస్తాం.
ఎన్నో భిన్నత్వాలుతో కూడుకున్నది భగవంతుని సృష్టి. అయినా అన్నిటిని ఏకత్వముతో చూడగలిగే ప్రేమత్వమును పొందుపరిచాడు. ఆహా - ఎంతటి చమత్కారుడు.... ఈ సృష్టికర్త !
మనుష్య పశుపక్షాదుల్లో, ప్రకృతిలో, ఒకటని ఏముందీ....... భగవంతుని సృజనలో అంతా ప్రేమమయమే. అవలోకిస్తే ప్రతీదీ ప్రేమమయమే, ప్రేమనిచ్చేవే, అంతా అయినవారే, ఆత్మస్వరూపులే, అన్నీ అర్హనీయమే ప్రేమకు అని అర్ధమైన క్షణములో అన్నింటిని ప్రేమతో సృజించడం అలవడుతుంది. స్థితప్రజ్ఞత సాధకుని స్వభావమౌతుంది.
ప్రేమ ముప్పిరిగొన్నవేళ నామం తలచువారు..... ఎందఱో మహానుభావులు, అందరికి వందనములు........


 



 

15, అక్టోబర్ 2011, శనివారం

గోపికావస్త్రాపహరణం - రాసలీల - అంతరార్ధం

భగవంతుడు ప్రేమానంద స్వరూపుడు. సకల ప్రాణులను ఉద్ధరించి తనయందు లయం చేసుకోవడమే ఆ అనంతున్ని ఆంతర్యం. అందుకే కృష్ణావతారములో ఈ లీలలతో భక్తులను ఉద్ధరించి తనయందు లయం చేసుకున్నాడు. 

కృష్ణావతారమునకు ముందు నేపద్యం :- భూదేవి గోరూపమున బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, రాక్షసప్రవృత్తిగల రాజులవలన తనకు కలుగుచున్న ఉపద్రవమును విలపిస్తూ  విన్నవించగా -
బ్రహ్మ, విష్ణుమూర్తిని ప్రార్ధించి ఇలా ఆదేశించెను "దేవాదిదేవుడు తన సర్వోత్కృష్ట  శక్తులతో సహా త్వరలో భూలోకమున శ్రీకృష్ణ రూపమున అవతరింపనున్నాడు. ఆయన భూలోకమున దుష్టశిక్షణ, శిష్టరక్షణ అను కర్తవ్యములను నిర్వర్తించువరకు దేవతలు కూడా ఆయనకు తోడ్పడుటకు భూలోకమున ఉండవలెను. కావున దేవాదిదేవుడు అవతరించబోవు యదువంశమున దేవతలు వెంటనే జన్మించవలెను."
భగవంతుడు స్వయంసంపూర్ణుడు. ఆదీ, అంతమూ లేనివాడు. పుట్టుక, చావు లేనివాడు. అత్యున్నత లోకములో ఉన్నప్పటికీ, మనం అనుభవిస్తున్న దుఃఖం నుండి పారమార్ధిక ఆనందమువైపు దారిచూపడానికి అద్భుతమైన తన సంకల్పానుసారం గతములో అనేకమార్లు అనేకరూపాల్లో అవతరించినట్లే ఈసారి శ్రీకృష్ణుని రూపంలో అవతరించెను. కృష్ణ శబ్ధానికి అర్ధం "అందరిని ఆకర్షించేవాడు".

గోపికలు ఎవరు?
గోపికలందరూ వేదవిద్వాంసులు. వెనుకటిజన్మలో రామావతారకాలమున మునులకు, ఋషులకు శ్రీరామచంద్రునితో కల్సి ఆనందించాలని, ఆయనతో సంబంధమును కలిగివుండాలనే వాంఛ కలిగి రామున్ని కోరగా, నా కృష్ణావతారమున మీరు తిరిగి జన్మింతురనియు, అప్పుడు వారి వాంఛలను తీర్చుదుననియు శ్రీరాముడు వారికి అభయమిచ్చెను. ఆ వేదవిద్వాంసులే కృష్ణావతారకాలమున బృందావనములో గోపికలై జన్మించిరి. 

                                  గోపికావస్త్రాపహరణము 
                                                                                  
కృష్ణుడు తమ భర్తకావలెనని గోపికలు హేమంతఋతువు ప్రారంభమునుండి యమునానదీతీరమున ప్రతీరోజు తెల్లవారుజామున కాత్యయనిదేవినీ పూజించుచుండగా మాసాంతమున ఓరోజు గోపికల కోరికను గ్రహించిన కృష్ణుడు ఒడ్డునవున్న వస్త్రాలను అపహరించి ఓ చెట్టు మీదకు ఎక్కెను. వస్త్రాపహరణమన్నది బాహ్యానికి ఓ మిషమాత్రమే. గోపికల వస్త్ర్రాపహరణమంటే వారి చిత్తవృత్తులను తీసివేయడం అసలర్ధం. వారిని అలానే ఒడ్డుమీదకు రమ్మనమనెను. అంటే నగ్నదేహాలతో రమ్మనమననడం ఏమిటీ అన్న భౌతికార్ధముతో కాక అంతరార్ధం గ్రహిస్తే బాహ్యాలంకరణలుమీద, దేహంమీద, కామ మోహ మమకారములు అన్నీ వదులుకోవాలన్న  పరమాత్ముని భావన అవగాహనమౌతుంది. అలానే వచ్చిన గోపికలను రెండుచేతులూ ఎత్తి నుదుటనతాకించి నమష్కరించమంటాడు. అంటే నుదుటన వున్నది (భ్రూ మధ్యమున) ఆజ్ఞాచక్రము. ఆ స్థానము ఆత్మను పరమాత్మలో కలుపుతుంది. ఇక్కడే జ్ఞాననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది. ఈ చక్రమునే దివ్యనేత్రమని, జ్ఞానచక్షువని అంటారు. కృష్ణుడు దీనిని మేల్కొలపడానికే చేతులను జోడించమంటాడు. అంటే ఈ చేతులజోడింపువలన జరిగినది "జీవాత్మ, పరమాత్మల కలయిక" వస్త్రవైడూర్యాలు, కామమోహాలు, మమకారములు అడ్డు తొలగించుకోమని, అలా తొలగించుకొని వస్తేనే తనలో లయమౌతారని కృష్ణుని ఈ వస్రాపహరణ లీల అంతరార్ధం.
                                      రాసలీల 

చాలామందికి వచ్చే సందేహమునే పరీక్ష్మహరాజు శుకమహర్షిని అడిగెను - 
కృష్ణుడు ధర్మపరిపాలన స్థాపించుటకును, అధర్మ ప్రవృత్తిని అణిచివేయుటకును  భూమిపై అవతరించినాడు కదా. మరి ప్రపంచములో నీతిపరులను కలవరపరుచు విధముగా గోపికలతో రాసలీల లేల ప్రదర్శింపవలెను? అంతట శుకమహర్షి ఇలా చెప్పెను -
అట్టిలీలలు పతితులైన బద్ధజీవుల యెడల ఆయనకు గల ప్రత్యేక కృపను చూపుతున్నాయి. గోపికల శ్రేయస్సు కొరకే కృష్ణుడు అట్లా చేసెను. బద్ధజీవులను సిద్ధజీవులుగా చేసెను. గోపికలు పూర్వజన్మమున రుషులవర్గంవారు. వారిందరినీ ఒకేసారి భౌతిక బద్ధస్థితి నుండి విముక్తి చేయడానికే ఈ లీల ప్రదర్శించి అనుగ్రహించెను. 'బ్రహ్మసంహిత'లో చెప్పబడినట్ల్లుగా ఈ గోపికలందరూ శ్రీకృష్ణుని ఆహ్లాదశక్తి యొక్క విస్తరణములు. రాధారాణి భగవంతుని అంతరంగశక్తి. 
"రాసలీల భౌతిక ప్రపంచములో ఇంద్రియతృప్తికోసం ప్రజలు చేసే నాట్యంలాంటిది కాదు. భగవంతుడు మీద జీవుడు చూపే అత్యుత్తమ ప్రేమకు వ్రజగోపికలు చిహ్నమై ఉన్నారు. ఎందుచేతనంటే భగవంతున్ని ఆనందపరచడమే వారికున్న ఏకైక ఆశయం. భగవంతుని వేణుగానం వినగానే అన్నీ మరిచి, సర్వమూ వదులుకొని కృష్ణుడు రా రమ్మని పిలుస్తున్నాడు, అని ప్రేమతో పరుగులుతీసిన భక్తులు. వారి ఈ ప్రేమైకభక్తికే పరవశించి వారిని ముక్తులు చేయదలచి తనని తాను విస్తరింపజేసుకొని, ఒకేసారి అనేకరూపాలు ధరించి, ప్రతీగోపిక సిద్ధస్వరూప దేహముతో రాత్రంతా అంతులేని ఆనందముతో నాట్యం చేసెను. ఏ చిన్నస్వార్ధపూరిత కోరికకు తావులేక, ఆనందానికి పరాకాష్ఠ అయిన ఈ నృత్యం జీవునుకి భగవంతునికి మద్య పరిణితి చెందిన అనుబంధానికి ప్రాతినిధ్యం వహించిన దివ్యఘటన". 

అంతరార్ధమును గ్రహింపనీయక అనవసరమైనవాటిని అవసరమైనవిగా చూపించడం మనస్సు స్వభావం. బాహ్యమునందు మాత్రమే చరించుమనస్సు అజ్ఞానంవలన భగవంతుని లీలలను వక్రీకరిస్తుంటుంది. ఆధ్యాత్మిక పరిణితితోనే దేనినైన పరిశీలించాలి. ఆధ్యాత్మికత అన్నది హృదయానికి సంబంధించినది.అందుకే అంతరయానం చేయాలి, అంతర్ముఖులం కావాలి.

11, అక్టోబర్ 2011, మంగళవారం

సాధన - అష్టాంగయోగం (తృతీయ భాగం)

                           ఆసనము 
బాహ్యర్ధం :- "స్థిర సుఖమాసనమ్" స్థిరముగాను, సుఖముగాను అనువైన ఆసనం సాధకునికి వుండవలెను. ఏవిధమైన మానసికప్రయాస, శారీరక అసౌకర్యం లేని స్థిరఆసనం సాధకుని ధ్యానసాధనకి ఉపకరిస్తుంది. మేరుపర్వతం లాగా స్థిరముగా నిటారుగా ఛాతీ, మెడ, శిరస్సు ఒకే వరుసలో వుండాలి. మనస్సు చెదిరిపోకుండా నిగ్రహించడానికి ఆసనం మీద కూర్చునే విధానం నిర్ణయించుకోవాలి. ఆసనాల్లో రకాలున్నాయి - పద్మాసనం, అర్ధపద్మాసనం, వజ్రాసనం, సుఖాసనం.....మొదలగునవి. భూమ్యాకర్షణ శక్తినుంచి దేహాన్ని, మనస్సుని, ఇంద్రియాలను కాపాడాలి కాబట్టి ఆసనం కోసం మెత్తటైన వస్త్రాన్నో, పీటనో వినియోగించుకోవాలి. ధ్యానం మనస్సుకు సంబంధించినదైనప్పటికి ధ్యానసమయంలో శరీరబాధ కలిగి, ఆ బాధచే మనస్సు చెదిరిపోకుండ నిగ్రహించడానికి ఆసనం తప్పనిసరి.
అంతరార్ధం :- శరీరకష్టం, మానసిక చలనాదులు లేకుండ బ్రహ్మనిష్టయందు కుదురుకోవడమే ఆసనం.

                                                ప్రాణాయామం 
బాహ్యార్ధం :- ఉచ్చ్వాస, నిశ్వాసల క్రమబద్ధీకరణయే ప్రాణాయామం. ప్రాణాయామం అనేది మనిషి యొక్క మానసిక స్థాయిని సాదారణ స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళే ప్రక్రియ. మనస్సును నియంత్రించడానికి మన ఋషులు,మహర్షులు సూచించిన విధానమిది. సుఖాసన స్థిరత్వం కలిగిన తరువాత ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే శ్వాసక్రియను మన అధినంలోకి సరళంగా  తెచ్చుకోవడం. శ్వాసక్రియను క్రమబద్ధికరించి నియమించటంలో ప్రాణాయామం దోహదపడుతుంది. శ్వాసప్రక్రియ, మనోచర్యలకు సంబంధం ఉన్నది. క్రమబద్ధకమైన శ్వాస మనస్సుని ప్రశాంతపరుస్తుంది. మనవ జీవితం శ్వాసతో మొదలై శ్వాసతోనే అంతమౌతుంది .శ్వాసను ప్రాణాయామం ద్వారా క్రమబద్ధీకరిస్తే మనోప్రశాంతత, దీర్గాయువు కలుగుతాయి. ఇంద్రియములు మనస్సు శుద్దమౌతాయి. ప్రాణాయామం వల్ల చిత్తవృత్తులు క్లేశాలు నశించి జ్ఞానము ప్రకాశిస్తుంది. మానసిక నిరోధం ద్వారా అంటే మనస్సుని అన్య విషయాలనుంచి నిరోధించి ఏకాగ్రం చేయడం ద్వారా ప్రాణాయామం సహజంగా సిద్ధిస్తుంది. ప్రాణాయామం లోని  రేచక, పూరక, కుంభకము అనే దశలు ఉంటాయి. దీని వలన నాడులు ఉత్తేజమై శరీరమునకు, మనస్సునకు సమన్వయము ఏర్పడుతుంది.
అంతరార్ధం  :-తనకంటే అన్యముగా కానవచ్చు నామరూపలన్నింటిని ఆత్మ కాదని విడుచుట (నిశ్వాసం) 'రేచకం'. సర్వ పదార్ధములయందు ఆత్మను చూచుట, సర్వ ప్రపంచమునందు ఆత్మనే నింపుట (ఉశ్చ్వాస) 'పూరకం'. అంటే మనస్సునందే పరమేశ్వరుడే సర్వవ్యాపకుడు అని తలంచుచు ఏయే సంకల్పములు కలిగినను, ఏయే వస్తువులు గోచారమైనను వాని నంతయు ఆత్మగానే చూచుట పూరకం. మనస్సు నిశ్చలం చేసి సర్వకాలములందును పరబ్రహ్మమునందే నిలుపుట 'కుంభకం'.

                                                             ప్రత్యాహారం 
బాహ్యార్ధం :- విషయసుఖంలందు సంచరించుచుండు చక్షురాది ఇంద్రియములను నిరోదించుటయే ప్రత్యహారం. మనస్సు, ఇంద్రియములు తమ సహజ ఆహారాలైన చిత్తక్లేశములను వదిలించుకోడానికి చేసే యోగాభ్యాసమే ప్రత్యాహారం. అంటే ఇంద్రియ అవయవాలను మనస్సు సహాయంతో ఇంద్రియపదార్దముల నుండి వెనుకకు లాగి మరల్చటయే "ప్రత్యాహారం". మనస్సు అసత్యమైన వాటివైపుకే  వెళ్తుందని తెలుసుకోగానే విచక్షణ జ్ఞానాన్ని ప్రయోగించి మనస్సును స్వాదీన పరుచుకోవాలి. 
అంతరార్ధం :- సృష్టిలోని సమస్త వస్తు సముదాయములోవున్న ఆత్మయే తనలోవున్న ఆత్మన్న ఆత్మభావనతో మనస్సుని ఆ పరమపురుషునిలో లీనం చెయ్యడమే ప్రత్యాహారం.

                                                            ధారణ 
బాహ్యార్ధం :- చిత్తాన్ని సంపూర్ణముగా ఆత్మలో లీనం చేయడాన్నే ధారణ అంటారు. పవిత్రాంతరంగం కలవారై సంపూర్ణమైన సాక్షాత్ ఆత్మయందు ఆత్మను స్థిరంగా వుంచడమే ధారణ.
వస్తువుపై మనస్సును స్థిరముగా ఉంచటమే ధారణ. ఆ వస్తువు హృదయంలో ఊహించినదైన కావచ్చు, బాహ్యముగా భగవంతున్ని ప్రతిమైన కావచ్చు. చంచలమైన మనస్సుని సడలని దీక్షతో చేసే క్రమసాధనచేత, పట్టుదలచేత, దృఢభక్తి అలవర్చుకోవడంచేత నియంత్రించి ఏకాగ్రం చేయడమే ధారణ. 
ధారణ అంటే మనం దేనిగురించి యోగాభ్యాసం ఆరంభించుచున్నామో దాని మీదే మనస్సు నిలపడం.
అంతరార్ధం :- అచంచల భక్తితో బ్రహ్మనిష్ఠయందే స్థిరముగా నెలకొని నిరంతర ఆత్మానుసంధానం చేయగలగడమే ధారణ.

                                                   ధ్యానం 
బాహ్యార్ధం :- ఏకాగ్రం చేసిన వస్తువుపై అవిచ్ఛన్న ధారగా చేసే చైతన్య భావనా ప్రవాహమే ధ్యానం. అంటే ధారణాస్థితిని నిరంతర ప్రవాహరూపముగా కొనసాగించడమే ధ్యానం. ధ్యానం మానవుణ్ణి ఓ పరిపూర్ణవ్యక్తిగా మారుస్తుంది. శారీరకంగా ఆరోగ్యం, మానసికముగా ప్రశాంతత, భావసమతుల్యతలతో పాటు ఆధ్యాత్మిక పరిణితిని కలిగిస్తుంది. ధ్యానం అంటే చిట్టచివరి ఆలోచన.(జిడ్డు కృష్ణమూర్తి). మనలో నిక్షిప్తమైన ఆద్యాత్మిక జ్ఞానాన్ని వెలికితీసేదే ధ్యానం.
ధ్యానం గమ్యం కాదు, గమ్యాన్ని తెలిపే మార్గం.
జిల్లెలమూడి అమ్మ అన్నట్లు... ధ్యాసే ధ్యానం.
ధ్యానమంటే మనస్సుని శుద్ధిచేయడం.
మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ధ్యానం, జ్ఞానం.(రమణ మహర్షి)
ధ్యానం వలన నిత్యానిత్య వస్తువివేచన కల్గుతుంది.
ధ్యానం వలన మనోనిగ్రహం కలిగి రాగద్వేషములను నిగ్రహించగలం.
తధా మనస్సత్వ రాజస్తమోమలం, ధ్యానేన సంత్యజ్య సమేతి తత్త్వం... (మనస్సు ధ్యానం మూలంన సత్వ రజ తమోగుణముల రూపమున ఉన్న మాలిన్యమును బాసి ఆత్మతత్వంను పొందును)
చేదు ఆలోచనల నిర్మూలన, మనోపవిత్రత, రజోతమోగుణాలునుండి విముక్తత, శుద్ధ స్వభావం, మనోస్థేర్యం, ఏకాగ్రత, సమర్ధత ధ్యానం వలన కల్గును.
ధ్యానం మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది.(వివేకానంద)
గౌతముడిని బోధిచెట్టు క్రింద బుద్దున్ని చేసినదీ, వర్ధమాన మహావీరున్ని జ్ఞానిని చేసిందీ...ధ్యానమే!
ఆలోచలు మాయమయ్యేంతవరకు, చివరకు పూర్తిగా మనస్సు హృదయంలో లీనం అయ్యేంతవరకు, చిన్న ఆటంకమైన కలగనివ్వకుండా లోలోపలికి అంతరయానం చేయడమే ధ్యానమని ఏకనాద్ ఈశ్వరన్ అంటారు.
అంతరార్ధం :- మనస్సు, దేహం, ఇంద్రియములు మొదలగు దృశ్యపదార్ధములు భూతములు కావు, వీటన్నిటికి సాక్షిని అని సర్వకాలములందును తలంచుచుండుటయే ధ్యానం.

                                                          సమాధి 
బాహ్యార్ధం :- ధ్యానం తీవ్రమై ధ్యానివస్తువు, ధ్యాని, దృష్టిపధంలోనుంచి అదృశ్యమై, దాని అంతరార్ధం మాత్రమే గోచరించునప్పుడు యేర్పడుస్థితియే సమాధి. 
పై సాధనములవలన నిశ్చలమైన నిర్మలమైన భగవద్భావనతో మేళవించ బడిన మనస్సు బ్రహ్మమునందైక్యమై తానే బ్రహ్మమనెడి జ్ఞానంతో స్థిరముగా నిలిచిపోవుటనే సమాధిస్థితి అందురు. 
అంతరార్ధం :- బాహ్య, అంతరస్మృతి వుండని చైతన్య పరమానంద స్థితియే సమాధి. 'అహం బ్రహ్మస్మి'.

సాధన - అష్టాంగయోగం (ద్వితీయ భాగం)

                                                      నియమము 

వ్యక్తిగత ప్రవర్తనా నియమావళిని సూచించేది నియమం. నియమాలన్నీ కూడా ఎప్పుడూ ఎరుకతో, సమభావముతో, ఆత్మకేంద్రంగా ఉండాలనే సూచిస్తున్నాయి. ఈ నియమావళిని సూచించేది నియమం 
ఈ నియమాలన్నీ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి బాగా సహకరిస్తాయి 
శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానని నియమాః
ఇందులో కూడా ఇదు అంశాలు ఉనాయి  :
౧.శౌచము ౨. సంతోషము ౩.తపస్సు ౪.స్వాధ్యాయము ౫.ఈశ్వరప్రణిధానము
                                          
                                                           ౧.శౌచము
బాహ్యార్ధం :- బాహ్యంతర్గత శుభ్రతే శౌచం. బాహ్య భౌతిక పరిశుభ్రత, మానసిక పరిశుద్ధత(అంతఃకరణ శుద్ధి) యే శౌచం. శౌచమనగా పారిశుద్ధ్యం, పవిత్రత, నైర్మల్యం, యోగ్యత, మంచితనం. స్నాన సాత్వికాహారముల ద్వారా శరీరము శుభ్రపడి ఆరోగ్యం ద్రుఢపడును. యోగాభ్యాసం చేయదలచిన సాధకులు ఆరోగ్యవంతులై మానసిక బలవంతులై ఉండాలి. దేహము,మనస్సు పరిసరములు పరిశుభ్రమైనప్పుడు (సాధకుని ఆరోగ్యం, భావనలు కూడా శుద్దమై) వాటిని గురించి చింతన నశించి జ్ఞానమార్గ అన్వేషణలో ముందుకు వెళ్ళగలుగుతారు. బాహ్యశౌచం స్నానాదులవలన, అంతరశౌచం భగవన్నామ స్మరణాదులవలన కలుగుతుంది. దేహ శుభ్రత వలన ఆరోగ్యం, మానసికశుద్ధివలన ఉల్లాసం, ప్రశాంతత కలిగి సత్యబుద్ధి అలవడుతుంది. ఏకాగ్రత కుదురుతుంది. బ్రహ్మనిష్ఠ కుదురుతుంది. జ్ఞానేంద్రియాలు  స్వచ్ఛంగా ఉండాలి. చూసే చూపు, వినే మాటలు, రుచి, స్పర్శ, వాయువు స్వచ్ఛంగా ఉండాలి. పంచతన్మాత్రలు (భూమి,ఉదక,అగ్ని,వాయు,గగనతత్వాలు), పంచాకోశాలు (అన్నమయ, ప్రాణామయ,మానోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశాలు) శుద్ధంగా ఉండాలి.దేహమాలిన్యం జలమృత్తకలచే ఎలాగున శుద్దమగునో అలాగనే జ్ఞానరాగాదులచే ఆత్మశుద్ధి కలిగి ఉండుటయే శౌచమనబడును. జ్ఞానవైరాగ్యములనెడి మృత్తిక చేత క్షాళనము గావించి వాసనత్రయమును నశింపజేసుకొని చిత్తశుద్ధిని గావించుటయే శుద్ధశౌచం. (మైత్రేయోపనిషత్)
క్షమ ద్వారా విద్వాంసులు; దానం ద్వారా దుష్కర్మలు చేసినవారు; జపాదుల ద్వారా రహస్య పాపములు చేసినవారు; తప్పస్సు ద్వారా వేదవిదులు పరిశుద్దులౌతారు.
అంతరార్దం :- తాము నిత్యశుద్ధ స్వయంప్రకాశజ్ఞాన స్వరుపములమని స్పురించు శుద్దత్వమే శౌచం.

                                                     ౨.సంతోషము 
బాహ్యార్ధం :- ఏ సమయములో ఏది లభించినను హర్షశోకములు పొందక ఎల్లప్పుడు ఒకేవిధముగా ఉండు సంతుష్టియే సంతోషం. తమ శ్రమకు ఫలితముగా వచ్చినదానితోనే సంతృప్తి చెంది అంతకన్న ఎక్కువ ఆశించకుండ ఉండడం సంతోషం. "నిర్ధనోపి సదాతుష్టః (వివేకచూడామణి) ధనం లేకపోయినా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడమే సాధకుని లక్షణం. సాధకులు సంతోషం వలన సత్యబుద్ధి కలిగి దృఢలక్ష్యంతో పారమార్ధిక పయనంలో పరమానందస్థితిని పొందే అర్హతను పెంచుకుంటారు. ఆత్మనాత్మ విచక్షణ, అనిత్యవస్తువైరాగ్యం గలవానికి తానే బ్రహ్మమని తెలియడంవలన దుఃఖం వుండనేవుండదు.
అంతరార్ధం :- బ్రహ్మాదిలోకపర్యంతంగల సమస్త విషయాది భోగములలో విరక్తి కలిగి పరమాత్మ ధ్యానమందు కలిగేడు త్రుప్తానుభూతిని సంతోషమని అందురు.

                                                   ౩.తపస్సు 
తరింపజేసేదే తపస్సు.
తపస్సంటే సర్వం త్యజించి నిర్మానుష్య ప్రాంతానికి తరలి,మనస్సు, ఇంద్రియాలు నియంత్రించి అన్నింటిని నిరోధించి తీవ్ర కఠోరంగా సుదీర్ఘకాలం సాధన చేయడాన్ని తపస్సు అంటారు.కానీ ఇది కలియుగం. ఈ యుగ ధర్మానుసారం తపస్సంటే ___
తపించుట అని అర్ధం. భగవంతునికై నిరంతరం పరితపించుటే నిజమైన తపస్సు. దేహేంద్రియ మనోబుద్దులను ఆధ్యాత్మికకార్యంలలో ఉంచి, భగవదాలోచనలలో రమించుటయే తపస్సు. ఇటువంటి తపస్సు వలన అంతఃకరణశుద్ధి, మనోనిర్మలం వచ్చును. శాంతం, రజోగుణ జనిత ఆవేశం, తమోగుణ జనిత అలసత్వం నశించి, సత్వగుణ ప్రధానమైన ఆనందం కల్గును. ఆంతర్యంలో విషయలోలత్వం ఉండదు... అని శంకరాచార్యులవారి ఉద్భోధ.
నిరహంకారంగా ఉండడమే మహోగ్రమైన తపస్సని శ్రీరమణలు అన్నారు.
సత్యవ్రతం,సమదర్శిత్వం, కోపమే లేకుండ ఉండుటను అలవర్చుకోవడమే తపస్సు.(భర్తృహరి)
'మనసశ్చ ఇంద్రియాణాంచ ఇకాగ్ర్యం నిశ్చితం తపః' మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రం ఒనర్చుటయే తపస్సు.
"తపమనగ సకల విషయ
వ్యపేత మగునట్టి బుద్ధి వైభవం సుమీ
తపమున సుస్థిరుడగు యో
గపరునకుం గలవే యొండు కర్తవ్యంబున్"
(ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్పినట్లుగ భారతంలో ఉంటుంది)
భావం: అన్ని ఇంద్రియాలకు దూరమైన బుద్ధి వైభవమే తపస్సు, తపస్సులో స్థిరపడిన యోగికి కర్తవ్యాలుండవు,అంటవు) 
రాగకారణం వున్నా రాగం లేకుండా వుండడం, ద్వేష కారణం వున్నా ద్వేషం లేకుండా వుండడం తపస్సు. ఏ తలంపైతే, ఏ  వాసనైతే నిన్ను దేహంతో బంధిస్తుందో, నీ మనస్సును బయటికి తీసుకుపోతుందో దానిని కాల్చి బూడిద చేయడమే తపస్సు.(జిన్నూరు నాన్నగారు)
బ్రహ్మానుభవం పొందడానికి ఏ విషయాలైతే అడ్డు వస్తున్నాయో వాటిని తొలగించుకోవడానికి నీవు చేసే ప్రయత్నమే తపస్సు.
కొందరు విజ్ఞులు తపస్సు మూడురకాలని అంటారు--- 
వాచక తపస్సు--- నేర్పుగా, ఓర్పుగా, ప్రియముగా, హితకరంగా, మృదువుగా, సౌమ్యముగా, ఎదుటివార్ని నొప్పించక సంభాషించడం...
శారీరక తపస్సు--- పనిని శ్రద్ధగా, ప్రేమగా, నిష్కాముగా, నిండుమనస్సుతో, అంకితభావముతో,పరోపకారంతో చేయడం...
మానసిక తపస్సు--- ఏకాగ్రంగా, నిశ్చలంగా, నిర్మలంగా, దయగా,నిగ్రహంగా, శాంతిగా వుండడం...
సూక్ష్మంగా చెప్పాలంటే నిర్మలంగా ఆలోచించండీ, నిష్కామంగా పనిచేయండీ, హితవుగా మాట్లాడండి.
భక్తి, జ్ఞాన, కర్మ యోగముల ద్వారా బ్రహ్మానందానుభావాన్ని పొందడానికి చేసే సాధనే సాత్విక తపస్సని గీతలో వుంది. అలానే శారీరక సుఖాన్ని, ప్రాపంచిక భోగానందముల గురించిన చింత ఆవంతైనా లేకుండా భగవంతున్ని చేరాలనే సాధనే సాత్విక తపస్సని, అధికారం, ధనం, కీర్తీ, వాటికొరకు ప్రయత్నించడం రాజసికతపస్సని, ఇతరులను నాశనం చేయాలనుకోవడం, కీడు చేయడం, ఇంద్రియాలకు లోనై పనిచేయడం తామసికతపస్సని గీత చెప్తుంది.
తపస్సంటే నియమబద్ధమైన జీవితం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరములను స్వాధీనపర్చుకొని వాటి సహకారంలతో ఆత్మనిగ్రహములతో చేసే సాధనయే తపస్సు. ఎటువంటి ఆపదలకు, ఆటంకాలకు చలించకుండ సమభావనతో వుండగలగడమే తపస్సు. శత్రుత్వమైన, మిత్రుత్వమైన; పొగడ్త అయిన, నింద అయిన; సంతోషమైనా,దుఃఖమైన; వేడైన, చల్లనైన; ఇలా ద్వందాలన్నిటిని చలించక సమభావనతో అంగీకరించడమే తపస్సు.
మోక్షప్రాప్తి కొరకు సాధకుడు చేయు ఎట్టి సాధనయినను అది తపస్సే. తీవ్రవైరాగ్యవిచారతపమును కూడా తపస్సందురు. మనసేంద్రియములను ఏకాగ్రపరచి బ్రహ్మనిష్టయందు నిశ్చలముగా వుండుటయే తపస్సు.
అంతరార్ధం :- ఆత్మానాత్మ వివేకజ్ఞానం చేత అవిద్యాసంబంధమైన సమస్తదోషములను దహింపజేయుటయే తపస్సు.

                                            ౪.స్వాధ్యాయము 
బాహ్యార్ధం :- ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతిబింబించి ముక్తికి దారితీసే శాస్త్ర, గ్రంధ పఠనం స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే స్వానుభవమును చేకూర్చిపెట్టే సద్గ్రంధ పఠనం. (సద్గ్రంధ పఠనమంటే సత్యమును, భగవత్తత్త్వమును బోధించేది). సద్గ్రంధ పఠనంచేత సద్భావనలు వృద్ధి చేసుకొని వాటిని సదా మనస్సుచేత మననం చేయించడమే స్వాధ్యయనం. స్వాధ్యయనమంటే మంత్ర జపం, భగవన్నామ స్మరణ కూడా. స్వాధ్యయనం వలన చిత్తశుద్ధి కలుగును. సంచితమునందలి పాపములు నశించును. భక్తీ, ఏకాగ్రత పెరుగును. బాహ్యప్రపంచమునుండి మనస్సు విడువడుటకు అలవడును. గ్రంధ పఠనం, అభ్యచించడమే కాదు, భావనామయ ప్రజ్ఞతో (అనుభవజ్ఞానంతో) తనని తాను(స్వ స్వరూపం) తెలుసుకోవడం స్వాధ్యాయం.   
అంతరార్ధం :- తాను నిత్యశుద్ధ బ్రహ్మమనెడు చలింపని భావమందు నిలిచి ఆత్మజ్ఞానమాత్రంచేతనే సంసారంనుండి విముక్తి కలుగునే గానీ మరి యేయొక్క మార్గం చేతను కాదన్న దృఢమైన జ్ఞానమును గ్రహించుటయే స్వాధ్యాయం.

                                         ౫.ఈశ్వర ప్రణిధానము 
బాహ్యార్ధం :- తనని, తాను చేసే కర్మల ఫలాన్నీ సంపూర్ణంగా పరమాత్మునికి అర్పించుటయే ఈశ్వర ప్రణిధానం. భౌతిక శరీరం చేతగానీ, ధ్యానంచేతగానీ లబించే కర్మఫలాలను అంటే ఫలితాన్ని ఈశ్వరునికి అర్పించుటవలన యోగం సిద్ధిస్తుంది. మనం నిమిత్తమాత్రులం, జయాపజయాలుతో మనకెలాంటి సంబంధం లేదు, వుంచుకోకూడదు. అంటే కర్తవ్యమూ ఈశ్వరుడిదే అన్న భావంతో కార్యభావం వహించి, దాని ఫలితం ఏదైనా ఈశ్వరుడిదే అన్నట్లు నిమిత్తమాత్రులై ప్రతీపనిలో పూర్తిప్రయత్నమును పెట్టి ఫలితాన్ని పరమాత్మునికి ఒదిలిపెట్టి తాను ఉదాసీనముగా ఉండడం ఈశ్వర ప్రణిధానం. తనకి అనేదేది ఉంచుకోకుండా తనకి లబించిన దానంతటిని తనది కాదన్న సద్భావంతో తనకలాంటి శక్తి ప్రసాదించిన ఈశ్వరునికే అర్పించాలి. 
అంతరార్ధం :- సర్వదా, సర్వత్రా సర్వమూ భగవదనుసంధానం చేయడమే ఈశ్వర ప్రణిధానం.

సాధన -అష్టాంగ యోగం (మొదటి భాగం)

ఉన్నదీ, ఉన్నది.
ఉన్నది "నేను" అయి ఉన్నది.
ఉన్నది ఇప్పుడూ ఉంది.
ఉన్నది మరణం తర్వాత ఉంటుంది.
ఉన్నదిలో ఉన్నది ఉండడంకోసమే సాధన.
                                                       - రమణ మహర్షి.
వివరణ: ఉన్నదీ (చైతన్యం) ఉన్నది. ఉన్నది నేను (ఆత్మ) అయి ఉన్నది. ఆత్మ ఇప్పుడూ ఉంది. మరణం తర్వాత ఉంటుంది. కానీ జననమరణచక్రములో పరిభ్రమించకుండా ఉన్నదిలో (చైతన్యంలో) ఉన్నది (ఆత్మ) ఉండడంకోసమే (లయం అవడానికే) సాధన.

మన యధార్ధస్థితిని స్వరూపమును తెలుసుకోవడమే యోగం. జ్ఞానం తెలుసుకునే మార్గమే యోగం. "యోగః చిత్తవృత్తి నిరోధః" (పతంజలి) చిత్తవృత్తి నిరోధమే యోగం.
యోగమును నియమిత విధానంద్వారా ఆభ్యసించడాన్ని యోగానుష్టానం అంటారు. యోగానుష్టానంవలన చిత్తమును ఆవరించివున్న మాలిన్యం అంటే అజ్ఞానము తొలగి వివేకం కల్గును.
ఆధ్యాత్మిక సాధకులకు తమ లక్ష్యసిద్ధికై సరియైన ఆలోచన, ప్రయత్నం, వాక్కు, ఏకాగ్రత అవసరం. ఇవి అలవడడానికి మన మహర్షులు "అష్టాంగయోగము"ను ప్రభోదించిరి. మన శాస్త్రాలు దీనినే సూచిస్తున్నాయి.
అష్టాంగయోగమార్గమువలన సాధకుని శరీరం, మనస్సు మోక్షసాధనకు అనుకూలముగా తయారగును.
అష్టాంగయోగము :-
                        యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన సమాధ యోష్టావంగా:
యోగం అష్టాంగములతో (ఎనిమిది దశలతో) కూడుకొనియున్నది. అవి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధిదశలు.

                                                  యమము 
మనిషి ఎలా నడుచుకోవాలో సూచించేది యమము.
అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్యాపరిగ్రహా యమాః
ఇందు ఇదు అంశములు ఉన్నాయి. అవి అహింసా, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము.
వీటి బాహ్యార్ధములతో పాటు మహర్షులు తెలిపే అంతరార్ధములను గ్రహించగలగాలి. బాహ్యార్ధమును అనుష్టించినప్పుడు అంతరార్ధము దానికదే గోచరించునని స్పష్టమగును.

                                                            ౧.అహింస 
బాహ్యార్ధం :- మనోవాక్ కర్మేణ ఎవ్వరినీ బాధపెట్టకపోవడమే అహింస. ఏ జీవులకు హాని తలపెట్టకపోవడమే అహింస. హింస దానవస్వభావం, అహింస మానవస్వభావం. శాంతముగా, వివేకముగా వుండటం అహింస.దేహరూపములో భిన్నత్వం కన్పిస్తుందేగానీ అందరిలో వున్నది ఒకే ఆత్మస్వరూపం. అది పరమాత్మ స్వరూపమన్న భావన సాధకుల్లో బలపడిన ఎవ్వరియందు కోపద్వేషాలు కలగవు. ఇక ఏ విధమైన హనీ చేయలేరు, బాధించలేరు. సర్వజీవుల యెడల దయతో ప్రేమతో వుండగలుగుతారు. అహింసా పరమోధర్మః
అంతరార్ధం :- ఆత్మ సర్వవ్యాపకమనియు, చేదింపదగినది కాదనియు దృఢనిర్ణయంగల జ్ఞానమే అహింస అని తలచి, అట్టి ఆత్మను సంసారబందము నుండి ఉద్ధరించుకొనుటయే అహింస.

                                                      ౨.సత్యము 
బాహ్యార్ధం :-  వాక్కు, మనస్సు ఒకేరకంగా నిజమైన విషయాలను ప్రతిబింబించుటయే సత్యం. ఈ సృష్టిలో సత్యమొక్కటే స్థిరమైనది. నిజమైనది. యుగాలు మారిన మారనిది సత్యం. సత్యం ఎప్పుడూ సత్యంగా, నిత్యంగా భాసిస్తుంది గానీ ఏకాలంలోనూ, ఏయుగంలోనూ నశించదు. యోగి కాదలచినవారు తమ మనస్సులో, వాక్కులో సత్యమును ప్రతిష్టించుకున్నప్పుడు ఎలాంటి కర్మలు చేయనవసరం లేకుండానే సత్యం యొక్క ఫలితమును పొందగలరు. భావన, మాటలు సత్యమై వుండాలి. సాధకుల మాటలు సత్యంగా, ప్రియంగా, హితంగా, మితముగా వుండాలి. సత్యమంటే నిజం. ఈక్షణమే నిజం. ఏక్షణంకాక్షణం పరిపూర్ణంగా వుండడమే సత్యం.
అంతరార్ధం :- ఏది సత్యమై, నిత్యమై, శాశ్వతమై యుండునో అట్టి సత్యస్వరూప బ్రహ్మము నెరుంగుటయు, అట్టి బ్రహ్మమును యదార్ధంగా బోధించుటయు కూడ సత్యమనబడును.

                                                     ౩.అస్తేయము 
బాహ్యర్ధం :- ఇతరులకు చెందినా ఏ వస్తువులను, ధనమును దొంగలించుకుండుటయే అస్తేయం. తనది కానిదానిని, ఇతరుల సొంతమైనదానిని వారికి తెలియకుండ తీసుకోకపోవడమే అస్తేయం. ఇతరులది ఆశించకపోవడమే అస్తేయం. సంపాదనయందు, వృత్తియందు, చేసే కర్మలయందు ఏ ఒక్కరిని మోసగించక యుండుటయే అస్తేయం.
అంతరార్ధం :- ఆత్మయందు, ఆత్మధ్యానమందువుండుచు నిరతములైన లోకవ్యవహారములను ఆత్మయందు రానియ్యక చూచుటయే అస్తేయమనబడును.

                                                    ౪.బ్రహ్మచర్యము 
బాహ్యార్ధం :- ఇంద్రియనిగ్రహముతో కూడిన ఉపస్తేంద్రియనియమం బ్రహ్మచర్యం. వాక్కు, క్రియ, భావనలతో నిగ్రహం కలిగియుండుటయే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమును పాటించినవారు జితేంద్రియులై యోగమునందు అత్యంతప్రజ్ఞకలవారగుదురు. ఆశ్రమధర్మములలో బ్రహ్మచర్యం మొదటిది. గృహస్థులు గృహస్థ బ్రహ్మచర్యమును (మనోవాక్కాయ కర్మాదులచే పరస్త్రీలతో సంసారం లేకుండుటయే గృహస్థుబ్రహ్మచర్యం) పాటించవలెను.
అంతరార్ధం :- బ్రహ్మభావమందు మనస్సును సర్వదా చరింపచేయుట అనగా బ్రహ్మచింతన యందు సర్వదా యుండుటయే బ్రహ్మచర్యమనబడును. "బ్రహ్మణివేదే చరితుం శీలం యస్య సః బ్రహ్మచారీ" వేదాధ్యయనములో నిరంతరం నిమగ్నుడగుటయే బ్రహ్మచర్యం.

                                                    ౫.అపరిగ్రహము 
బాహ్యార్ధం :-  ఇతరుల వద్దనుండి ధనమునుగానీ, వస్తువులనుగానీ స్వీకరించకుండుట, ఇతరులనుంచి బహుమతులు స్వీకరించకుండుట, దానం పట్టకుండుట అపరిగ్రహమనబడుతుంది. స్వీకరించినను, దానం గ్రహించినను స్వీకరించే వ్యక్తిలో తపఃశక్తి దాతకి సంక్రమిస్తుంది. అలానే దాత సంపాదన సరైనరీతిలోనిది కానట్లయితే ఆ దాత దోషం స్వీకరించే సాధకునికి సంక్రమిస్తుంది. దానం స్వీకరిస్తే పరతంత్రుడై మనస్సుని నిర్మలంగా, నిశ్చలంగా వుంచుకోలేరు కాబట్టి ఎవ్వరినుండి దానం స్వీకరించకూడదు. పరిగ్రహం వలన అనురాగం, మమకారం కలిగి తద్వారా బందం ఏర్పడును. యోగి కాదల్చినవాడు దానమును బహుమతులను ఆశించక స్థిరచిత్తుడై స్వతంత్రుడై వుండాలి.
అంతరార్ధం :-  బ్రహ్మమార్గమునందు బ్రహ్మనిష్టలో బ్రహ్మజ్ఞానమును గ్రహిస్తూ బ్రహ్మమునందు మాత్రమే త్రికరణములచే త్రికాలములందు పరిశుద్ధుడై స్థిరముగా యుండుటయే అపరిగ్రహం.

                     
                     


                                                                                     

10, అక్టోబర్ 2011, సోమవారం

ఆధ్యాత్మిక సాధన

ఓం గం గణపతియే నమః                                      ఓం శ్రీరామ శ్రీహనుమతే నమః                                శ్రీ గురుభ్యో నమః 

ఆధ్యాత్మిక సాధన అంటే..... 

మోక్షమార్గాన్ని గ్రహించి ఆ మార్గం ద్వారా గమ్యస్థానం చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియే "సాధన".
బ్రహ్మమును  గురించి సదా చింతన చేయడం, బ్రహ్మమును గురించే సదా సంభాషించుట, బ్రహ్మమును గురించే సదా తోటిసాధకులుతో చర్చిస్తూ ప్రభోదించుకోవడం, నిరంతరం ఇదే ధ్యాసలో త్రికరణశుద్ధిగా వుండగలగడం సాధన.
ధ్యానం, భక్తి, జపం, నామస్మరణ మొదలుగువాటితో చిత్తవృత్తుల వైవిధ్యం తొలగించుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన.
ప్రకృతి ఒడిలోనుండి దైవఒడిలోనికి పయనించడమే సాధన.
ఏ కారణం వలన మనస్సు బాహ్యముఖమౌతుందో ఆ కారణంలను బయటికిలాగి మంట పెట్టు ... అదే సాధనకు మొదటిమెట్టు.


సాధన ఎందుకంటే .....


మనకోసం. మన సంస్కారాల శుద్ధికోసం. ఎన్నెన్నో జన్మలనుండి వస్తున్న వాసనలు, రాగద్వేషాలు, కామక్రోధాలు మొదలగునవి తొలగించుకోవడానికే సాధన. ఇవన్నీ తొలగితేనే మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు పరిశుద్దమౌతేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. అందుకే మనోశుద్ధికి సాధన అత్యంత అవసరం. మనస్సుని శుద్ధి చేసుకోవడానికి స్వవిచారణ, భక్తిభావం స్థిరపడుటకై జపతపాలు, ఏకాగ్రతమొనర్చడానికి నిరంతర నామస్మరణ, మనోమాలిన్యమును వదిలించుకోవడానికి ప్రార్ధన, నిజస్థితి తెలుసుకోవడానికి ధ్యానం, ప్రారబ్ధం తొలగించుకోవడానికి నిష్కామకర్మలు, అవగాహనకై శాస్త్ర అధ్యాయనం, అంతర్ముఖులం కావడానికి జ్ఞాన వైరాగ్యములు...మొదలగునవి అవసరం. ఇవన్నీ అలవర్చుకోవడానికి సాధన అవసరం. మన యోగ్యత పెంచుకోవడానికే సాధన. సాధనశీలురకే బ్రహ్మత్వబోధ లభించును. సాధన ఎందుకంటే మన యధార్ధస్థితిలో(చైతన్యంలో) లయం కావడానికి.



సాధన ఎలాచేయాలంటే .....

మన ఋషులు, శాస్త్రాలు సూచించినమార్గం - సాధన చతుష్టయం. యదార్ధవస్తు దర్శనమునకు నాలుగు సాధనములు అవసరము. సాధనాచతుష్ట సంపన్నులే జ్ఞానప్రకాశమును పొందగలరు.

"సాధన చతుష్టయ సంపన్నుడే బ్రహ్మవిద్యకదికారి"

సాధన చతుష్టయమనగా నాలుగు అంశములతో కూడిన సాధన. ౧.వివేకము (నిత్యానిత్య వస్తు వివేకం) ౨.వైరాగ్యము (ఇహముత్ర ఫలభోగ విరాగం) ౩.షట్ సంపత్తి) ౪.ముముక్షుత్వము.

౧. వివేకము (నిత్యానిత్య వస్తు వివేకం)

              ఏది నిత్యమైనదో, ఏది అనిత్యమైనదో; ఏది సత్యమో, ఏది అసత్యమో; గుర్తించే యోచనను పరిశీలన ద్వారా అలవర్చుకోవడమే వివేకం. ప్రకృతి, మనస్సు ఎప్పటికైనా నశిస్తాయని అవి అశాశ్వతమని గ్రహించి వాటికి ఆధారమైన భగవంతుడు ఎప్పటికి నశించడని అతడు నిత్యుడని శాశ్వతుడు అని గ్రహించడమే వివేకం. ఈ సృష్టిలో ఆత్మచైతన్యం తప్ప మిగిలినదంతయు అనాత్మాయే. అనాత్మ పదార్దములు అశాశ్వతమైనవి, మార్పుచెందునట్టివి, నశించునవి, జననమరణాలు కలవి. అందుకే ఆత్మకు, అనాత్మకు గల భేదమును వివేకముతో గుర్తించి, ఆత్మ మార్పుచెందని, నశించని, జననమరణాలు లేని శాశ్వతమైనదని గ్రహించి, తాను ఆత్మనని ఈ శరీరమునందు కార్యములతో తనకు ఎట్టి సంబంధము లేదని అన్నింటా సాక్షిగా వుండడమే వివేకం.




౨. వైరాగ్యము (ఇహముత్ర ఫలభోగ విరాగం) :-
                                                         అనగా ఇహలోక సుఖములపై వైరాగ్యం. అంటే భౌతిక ప్రపంచ సౌఖ్యాలపై వైరాగ్యభావన. వివేకమువలన సాధకునికి అనిత్యములు, అసత్యములు అగు వస్తువులయందు ఉదాసీనత, విముఖత కలిగి ప్రాపంచిక వైరాగ్యం కలుగును.



౩. షట్ సంపత్తి :-
                    సాధకునకు ఆధ్యాత్మికఅభివృద్ధికి ఉపకరించు ఆరు సుగుణములు. అవి -

  • శమము :- శమమనగా మనస్సుని నిగ్రహించి వశమందుచుకొనుట. ప్రాపంచిక విషయసుఖములందు, ప్రాపంచిక వస్తుసంపదలయందు బంధమూ,దుఃఖము ఉందని జ్ఞప్తి యందుంచుకొని, వానియందు విముఖత కలిగియుండి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అను నాల్గింటిని అనగా అంతఃకరణ చతుష్టయమును ఇంద్రియములతో కూడనీయక వానిని బ్రహ్మలక్ష్యము నందే నిలుపుట శమము. శమము అనగా మనోనిగ్రహము, అనగా అంతరింద్రియ నిగ్రహం. అంతరంగశుద్ధికై శమమని అందురు.
  • దమము :- దమమనగా పంచజ్ఞానేంద్రియములను, పంచ కర్మేంద్రియములను వాని యొక్క వృత్తులందు సంచరింపనీయక అనగా ఇంద్రియములు ప్రాపంచిక విషయములందు సంచరింపనీయక వానిని మనస్సుతోపాటు బ్రహ్మలక్ష్యంనందే నిలుపుట దమము. దమము అనగా ఇంద్రియ నిగ్రహం, అనగా బాహ్యేంద్రియ నిగ్రహం.
  • ఉపరతి :- చంచలమగు మనస్సును నిశ్చలముగా చేసి బాహ్యవిషయములనుండి మరలించి నిరంతరం బ్రహ్మధ్యానమునందే వుంచుట ఉపరతి. ఉపరతి అనగా మనస్సు బాహ్యములో ప్రవేశించక అంతర్యములో అణిగిపోవుట. ఈ స్థితిలో సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  • తితీక్ష  :- శీతోష్టములయందు, ఆకలిదప్పులయందు, మానావమానములయందు, ఇంకనూ ప్రపంచములో సంభవించు అనేక ద్వంద్వములయందు ఓర్పు కలిగియుండుటే  తితీక్ష. ఇతరులవలన కలుగు దుఃఖములకు శారీరక, మానసికదార్డ్యం కలిగియుండియు ప్రతీకారం చేయుతలంపు లేకుండుట, ప్రాపంచికవిషయములపట్ల ఎట్టి పరిస్థితులలోను చిత్త వ్యాకులత్వం లేకుండుట, ఏ పరిస్థితులలోను పరుష వాక్కులను ఉపయోగించక యుండునట్టి సహనంకలిగియుండుట తితీక్ష. భౌతిక ప్రాపంచికవిషయాలుపట్ల చలించని మనస్సుకలిగియుండుట తితీక్ష.
  • శ్రద్ధ :- శాస్త్ర వాక్యముపట్ల, గురువాక్యముపట్ల అచంచల విశ్వాసం కలిగియుండుటే శ్రద్ధ. గురువు, శాస్త్రములు తెలిపే వచనములపై అవి సత్యమేనన్న దృఢమైన నమ్మకమును కలిగియుండుటయే శ్రద్ధ. శ్రద్ధ అనగా తానే పనిని పూనుకొనెనో ఆ కార్యములో ఎన్ని ప్రతిబంధములు వచ్చినను ఆ పని పూర్తి అగువరకు దానినే మరల మరల ప్రయత్నించుచు దృఢబుద్ధితో సంపూర్ణం చేయాలన్న పట్టుదల కలిగియుండుట. అనగా ఏ స్థితియందుండి ఏ యొక్క బ్రహ్మనిష్ఠ మొదలగు శుద్ధవిచారము చేయుచున్నారో దానియందు ఎన్ని ప్రతిబంధములు వచ్చినను తన నిష్టను విడవకుండా వుండడమే శ్రద్ధ.
  • సమాధానము :- చిత్తలాలనము చేత అనేక రూపములందుగానీ, అనేక ప్రదేశములందుగానీ, శరీర అంతర్భాగములందుగానీ బాహ్యమునగానీ, మనస్సును కేంద్రీకరింపజేయక కేవలం లక్ష్యవస్తువు అయిన బ్రహ్మంనందే నిరంతరమును మనస్సును నిలుపుటను సమాధానం అంటారు. గురుశాస్త్ర భోధనలనుసరించి ఆత్మజ్ఞాన విచారమందు చిత్తమును ఏకాగ్రముగా నిలుపుటయే సమాధానం.

    ౪.ముముక్షుత్వము :-
                                 శాశ్వత ఆనందప్రధమైన మోక్షమును పొందవలెననెడి తీవ్రమైన కోరికయే ముముక్షుత్వం. దేహేంద్రియ మనోబుద్దుల సంఘాతంనుండి విడివడి, అజ్ఞానమును వీడి ముక్తిని పొంది తరించాలన్న తీవ్ర తపనయే ముముక్షుత్వం.

    క్షీరసాగరమధనం-అంతరార్ధం

    ఓం గం గణపతయే  నమః                   ఓం శ్రీరామ శ్రీ హనుమతే నమః                     శ్రీ గురుభ్యో నమః 




    పురాణేతిహాసములలో ఘటనులు, కధలు అవగాహనతో అవలోకిస్తే అందులో అంతరార్ధం అవగతమౌతుంది. వాటిని అర్ధంచేసుకుంటే ఆధ్యాత్మిక సాధకులకు అవరోధాలు, సందేహాలు తొలగి అంతఃకరణశుద్ధి కల్గి ఆనంద స్థితికి తద్వారా ఆత్మస్థితిని చేరుకుంటారు.
    క్షీరసాగరమధనం కధలోని అంతరార్ధమును పరిశీలిస్తే -
    క్షీరసాగరమధనం సాధకుని మనోసాగరమధనమునకు దర్పణం.
    అది ఎలాగంటే -
    ముందుగా సముద్రముకు మనస్సుకు వున్న సారూప్యములను  పరిశీలిస్తే  -
    సముద్రములో కల్లోలతరంగములున్నట్లే,  మనస్సులో సంకల్పములనెడి అలలున్నాయి.
    సముద్రములో  వ్యర్ధ,అవ్యర్ధ పదార్ధాలున్నట్లే,  మనస్సులో సగుణ దుర్గుణాలున్నాయి.
    సముద్రములో మకరతిమింగలాది భయంకర జంతువులున్నట్లే,  మనస్సులో  కామ క్రోధ మద మోహమాత్సర్యాలాది క్రూరగుణాలున్నాయి.
    సముద్రములో రత్నాదులున్నట్లే,  మనస్సులో శాంతశమదమాది దైవ గుణాలున్నాయి.
    సముద్రములో సుడులున్నట్లే, మనస్సులో ఆశలను సుడులున్నాయి.
    సముద్రం అగాధమైనట్లే మనస్సులోతు తెలుసుకోవడం కూడా అసాధ్యమే.
    అందుకే ప్రతీ మానవుని చలించే,చరించే, చెలరేగే మనస్సే మహాసాగరం.
    ఇక సాగరమధనంనకు క్షీరసాగరమే ఎందుకు కావాలంటే - 
    క్షీర వర్ణం తెలుపు; అంటే స్వచ్ఛమైన సాగరం మాత్రమే మధనంనకు అర్హతకల్గివుంటుంది. అలానే స్వచ్ఛమైన మనస్సు అంటే సత్వ గుణముగల మనస్సుకే అంతరమధనమునకు అర్హత ఏర్పడుతుంది. అనగా తత్వచింతనగల సాత్వికమనస్సే క్షీరసాగరం.
    ఇక దేవదానవులు -
    ప్రతిసాధకునిలో దేవాసురగుణాలే  దేవదానవులు. ఎలాగంటే ప్రతి ఒక్కరిలో శమ, దమ, సత్య, శాంత, శౌచ, దయాది సాత్విక గుణములు దేవతలుగా; ఆలస్యం, అలసత్వం, అనుమానాలు, అజాగ్రత్త, అశ్రద్ధ, అస్థిరం,ఆగ్రహం, బుద్దిహీనత మొదలగు తమో రజో గుణములు దానవులుగా భావించాలి.
    క్షీరసాగరమధనంకై 'మందర పర్వతం' కవ్వమైనట్లు మనోసాగరమధనంలో 'బుద్ధి' కవ్వం కావాలి.
    అక్కడ 'వాసుకి' త్రాడైతే ఇక్కడ 'ఆత్మానుసంధానము'ను పాశముగా చేసుకోవాలి.
    క్షీరసాగరమధనం జరుగుతుండగా మందర పర్వతం సముద్రంలో దిగబడిపోయినట్లే బ్రహ్మనిష్ఠలోగూడ  ఆత్మానుసంధానం నిరంతరం సాగక మనస్సులోనికి  బుద్ధి జారిపోయి ధ్యానమందు విఘ్నములు కల్గుచుండును. భక్తవత్సలుడగు భగవంతుడు కూర్మావతారమును ఎత్తి తనవీపుపై పర్వతమును ధరించి పైకి తీసినట్లు దైవకృపకు పాత్రులైన సాధకుల ధ్యానముకు కూడా చిన్నచిన్న ఆటంకములు కలిగిన క్రమముగా నిర్విఘ్నంగా జరుగును.  
    క్షీరసాగరమధనంలో ముందుగా హాలాహలం బయటపడగా దేవతల ప్రార్ధనచే శివుడు ఆ హాలాహలమును స్వీకరించెను. అలానే ధ్యానసాధన అధికమైనప్పుడు అంతఃకరణంలోగల జన్మజన్మాంతర విషసమాన విషయవాసనలు బయటపడును. శారీరక, మానసిక ఆర్ధిక మొదలగు అనేకబాధలు కల్గవచ్చు. అప్పుడే ఎంతో అచంచలమైన బుద్ధితో, అనన్యభక్తితో, పరిపూర్ణ శరణాగతితో  ఈశ్వరప్రార్ధనచేస్తే ఆ భగవంతుడే అన్నింటినీ హరింపజేస్తాడు. 
    ఈ విధముగా క్షీరసాగరమధనం జరుగుతుండగా తొమ్మిది అద్భుత శక్తులు ఉద్భవించినవి. వాటితో తృప్తిపడక ఇంకా మధనం చేసిరి. అప్పుడు అమృతం ఉద్భవించినది. అలానే సాధకులు తమ సాధనాయోగమందు ఎన్నెన్ని సిద్ధులు ప్రాప్తించినను వాటిని త్యజిస్తూ తమ లక్ష్యమైన ముక్తియనెడు అమృతత్వం లభ్యమైనంతవరకు లక్ష్యసాధన వీడకుండా ప్రయత్నించవలెను. అప్పుడే ఆత్మదర్శనం, ముక్తియనెడు అమృతత్వంను పొందుదురు.
    ఆధ్యాత్మికసాధకులు అంతరమధనముచే జ్ఞానామృతపానంచేసి కైవల్యం చెందుటయే క్షీరసాగరమధనంయొక్క అంతరార్ధం.


    ఆనందం


    ఓం గం గణపతయే నమః                                       ఓం శ్రీరామ శ్రీ హనుమతే నమః                                        శ్రీ గురుభ్యో నమః 


    ఆనందం మానవుని సహజస్థితి, వాస్తవస్థితి.
    కానీ, నేడు అనేకులది తమ సహజస్థితి తెలుసుకోలేక ప్రాపంచికసుఖసంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ.
    సుఖం, సంతోషం, ఆనందం........... ఒకేలా చెప్పేస్తున్నా, ఇవి మూడురకాల అనుభూతులు.
    పంచేంద్రియాలను సంతృప్తిపరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది.
    వినోదభరితమై మనస్సును ఉత్సాహపరిచే 'సంతోషానుభూతి' మానసికం.
    వీటికి అతీతమైంది "ఆనందానుభూతి" ఆత్మసంబంధితం. 
    ఆనందం ఆధ్యాత్మికం. బాహ్యప్రపంచముతో సంబంధంలేని అంతర్గతఅనుభూతి. 
    సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరుస్వేచ్చనిస్తుంది, ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం.
    శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాం.
    మొదటిది బంధం, రెండవది తాత్కాలితం, మూడవది శాశ్వతం.
    మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జననమరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు. కానీ పరమానందస్థితికి వచ్చినవాడు అమృతమయుడే అని అంటాడు బుద్ధుడు.
    ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు. ఆర్ధికస్థితిగతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులోనైన సమస్థితిలో వుండగలగడం, అన్నీ - అందరూ పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి.
    మనభావాలపట్ల, మనలో ఉన్న ఆంతర్యామిపట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటిపట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామిపట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి. ఇది అలవడిననాడు అనుక్షణం మనం ప్రార్ధనలో వున్నట్లే. ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే.
    ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు.(తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి)
    మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం. 
    మొదటికొస నుండి రెండవకొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం. 
    మొదటికొస నుండి రెండవకొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.
    వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత.
    మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత.
    ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం............. పేరు ఏదైతేనేం........... అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే.
    ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది.
    మనలోపలేవున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి. అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని.
    ఆ అన్వేషణలో తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'. సత్ అంటే సత్యం, చిత్ అంటే చైతన్యం ఆనందమంటే పరమానందం. ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి". ఇలా ఆనందమును తెలుసుకున్నవారు  (ఆనందం బ్రహ్మనో విద్వాన్) ఆత్మను స్పృశించగలరు (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే).
    ఆనందమునకు సోపానములు -
    ఫలాపేక్ష లేకుండా పనిచేయడం 
    అందరిలో అంతర్యామిని గుర్తించడం 
    ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం 
    భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం ...........


    ఓంకారం

    ఓం గం గణపతియే నమః                     ఓం శ్రీరామ శ్రీహనుమతే నమః                    శ్రీ గురుభ్యోనమః 

                                                             
    ఓ మిత్యేతదక్షర మిదం సర్వం తస్యోప వ్యాఖ్యానం భూతం 
    భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్త్రి కాలాతీతం తదప్యోంకార ఏవ //
                                                                  - మాండూక్యోపనిషత్తు 
    భావం: ఓంకారం బ్రహ్మస్వరూపం. వాక్కుచేత చెప్పదగిన ఈ చేతనా చేతనాత్మక సమస్త ప్రపంచమును ఆ ఓంకారరూప పరమాత్మ యొక్క సమగ్ర స్వరూపమును విస్ఫష్టముగా తెలియుజేయుచున్నది. భూత భవిష్య వర్తమాన కాలత్రయ పరిచ్చేద్యమగు సమస్త ప్రపంచమును ఓంకారమే. ఈ కాలత్రయమునకతీతమై కాలపరిచ్చేద్యం కానటువంటి ఆ ఆవ్యాకృతాదికము సర్వమును ఓంకారమాత్రముగానే ఉన్నది.


    ప్రణ వద్యాస్త్రమో వేదాః ప్రణవే పర్యవస్తితాః
    వాజ్మయం ప్రణవం సర్వం తస్మాత్ర్ప్రణవమభ్యసేత్ //
    భావం: వేదత్రయమును ప్రణవంనుండియే ఏర్పడినవి. (ఋక్ యజుస్సామములు మూడున్ను జ్ఞానంనకు సంబందించినవి. అధర్వణం ధనుర్విద్యకు, మంత్రశాస్త్రంనకున్ను సంబంధించినదగుటచే పై మూడింటిలో చేర్చబడలేదు) ఈ మూడు వేదములు ప్రణవంనందే లయించుచున్నవి. వాజ్మయమంతయు ప్రణవస్వరూపమే. అందుచే ప్రణవమును ధ్యానించవలయును.

    ప్రాణాస్వర్వా పరమాత్మని ప్రణామయతీతి ప్రణవః 
    చతుర్దావస్థిత ఇతి సర్వదేవవేదయోని: సర్వవాచ్యవస్తుప్రణవాత్మకం  //
    భావం: సకల ప్రాణములను పరమాత్మయందు చేర్పించుటంబట్టి ప్రణవమనబడును. నాలుగుపాదములలో (నాలుగుపాదములనగ నాలుగంతస్తులు. విశ్వతైజసప్రాజ్ఞులను ముగ్గురిని పూర్వపూర్వము లోపింపజేయుటచేత తురీయమగు పరబ్రహ్మను పొందుటయగును) కూడియుండుటవలన బ్రహ్మవిష్ణురుద్రాది సకల దేవతలకును, సకలవేదములకును ఇది కారణస్థానమై ఉన్నది. సకల వాచ్యవస్తువులును, సకల దేవతల నామములను ప్రణవాత్మకమగును.

    ప్రణవాదపరం జప్త్వా కదా ముక్తో భవిష్యతి 
    ఓంకారస్వర్వ మన్త్రాణా ముత్తమః పరికీర్తితః 
    ఓంకారేణ ప్లవేనైన సంసారాబ్దిం తరిష్యతి 
    ప్రణవమునకన్యమైన మంత్రమును జపించిన ఎప్పుడు ముక్తి కలుగును? కలుగదు.
    ఓంకారం సర్వమంత్రాలలో ఉత్తమమైనదని మహర్షులు కీర్తించుచున్నారు. వేదములు అలాగునే స్తోత్రం చేయుచున్నవి. సముద్రము దాటుటకు ఓడ ఎటువంటిదో అలాగున సంసారసాగరమునుండి తరింపచేయుటములో ఓంకారమనెడు నావకు సమానమైనది మరియొకటి లేదు.


    యావజ్జీవం జపేన్మంత్రం ప్రణవం బ్రహ్మణోవపు:
    హ్రస్వో దహతి పాపాని దీర్ఘో మోక్షప్రదాయకః 
    ప్లుతస్తు సర్వ సిద్ద్యే స్యాత్ప్రణవస్త్రి విధస్సమృత:
    పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవ మంత్రమును జీవితపర్యంతం జపించవలెను. 
    అది హ్రస్వమనియు, దీర్ఘమనియు, ప్లుతమనియు మూడు విధములుగా ఉచ్చారణములతో కూడుకొనియున్నది. హ్రస్వముచే సమస్త పాపములు భస్మమగును. దీర్ఘము మోక్షదాయకం. ప్లుతముచే సర్వసిద్ధులు సిద్ధించును.

    ౧. తస్య వాచకః ప్రణవః 
    ౨. తజ్జప స్తదర్ధ భావనం
    ౩.తతః ప్రత్యేక్చేత నాధిగమో స్యంతరాయా భావశ్చః 
                                                                             - పతంజలి మహర్షి
    ప్రణవమే భగవంతుడి నామధేయం. 
    మనలో అంతర్భాగముగా వున్న శబ్దకారణమైన వాయువు నాభి వద్దనుండి అకార రూపముగా బయలుదేరి స్వరపేటికను స్పర్శించి, ఉకారముగా చైతన్యముతో స్వరపేటికనుండి వెలువడి, చివరికి మూయబడిన పెదవుల ద్వారా మకారరూపమున వెలువడుతుంది. అ+ఉ+మ అనగా అకార ఉకార మకార పూర్తిస్వరూపమే 'ఓం'. అదే ఓంకారం.
    ఓం అనే శబ్దంతో అంటే నాదంతో స్వరూపముగా వెలువడింది కనుక అది ఓంకార నాదమైంది. ఆ నాదం వినువారలకు ప్రమోదాన్ని కల్గిస్తుంది కనుక అది ప్రణవనాదముగా భాసిల్లింది.
    ఈ ఓం స్మరణం ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో కలిగే ఆటంకాలన్నిటినీ తొలగించి ఆత్మచైతన్యానికి తోడ్పడుతుంది. 
    ఓంకార ధ్యానంవలన మనస్సు ఏకాగ్రత పొంది అంతర్ దృష్టి కలిగి ఆత్మావలోకానశక్తి క్రమక్రమముగా వృద్ధి పొందనారంభిస్తుంది. 



    ఓంకార ప్రభవం సర్వం త్రైలోక్యం సచారాచరం
    ఓమిత్యేవ పరం రూపం హృత్పద్మేచ వ్యవస్థితం //
                                                                         -ఉత్తరగీత

    చరాచరాత్మకమగు ఈ లోకత్రయం ఓంకారంవలననే పుట్టింది.హృదయ కమలమునందు 'ఓం' అను అక్షరస్వరూపం కలదు.

    • ఇక భగవద్గీత యందు -
    "గిరామస్మ్యేక మక్షరమ్"
    శబ్దములలో ఏకాక్షరమగు ఓంకారమును నేనే. 
    "ప్రణవః సర్వవేదేషు" సర్వ వేదములలో ప్రణవమును నేనే.
    "అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మ ముచ్యతే" 
    అంత్యకాలంలో ఓంకారమును స్మరించి     దేహమును విడుచువారు బ్రహ్మమును నొందగలడు.

    ఏకాక్షరం బ్రహ్మమేకాక్షరం విష్ణు 
    వేకాక్షరం శివుడు నెంచిచూడ 
    ఏకాక్షరికి మించి యెక్కడేమియులేదు
    విశ్వదాభిరామ వినురవేమ!
                                                -వేమన 
    "ఓం" అనే అక్షరమే బ్రహ్మ,విష్ణువు, శివుడు. ఈ శబ్దానికి మించి ఎక్కడ ఏమీలేదు. అందువలన ఓంకారశబ్ద ఉపాసన చాలు.

    •  మనస్సు శుద్ధమై ఏకాగ్రమైనప్పుడు విశ్వచైతన్యతరంగశబ్దమైన ఓంకారంవలన ప్రధాననాడి అయిన సుషుమ్న తెరవబడుతుంది.

    • బ్రహ్మతత్వాన్ని సూటిగా అద్భుతముగా వ్యక్తపరచగల ఒకేఒక పదం "ఓం". ఈ విశ్వాంతరాళములోవ్యక్తమయ్యే అన్నిటిలోనికి సూక్ష్మాతిసూక్ష్మమైన బ్రహ్మపదార్ధం, భగవంతునిని తెలియబరిచే ప్రపధమ వ్యక్తీకరణకాబట్టి ఈ "ఓం" భగవంతున్ని సూచించే ప్రతీకయే.

                                                                   - స్వామి వివేకానంద 





    ఓంకారం


    ఓం గం గణపతియే నమః                   ఓంశ్రీరామ శ్రీ హనుమతే నమః                                శ్రీగురుభ్యోనమః 


    "ఓం" బ్రహ్మ స్వరూపత్వం. "ఓం" పదం శబ్ద బ్రహ్మం. "ఓం"కారం అక్షర పరబ్రహ్మ స్వరూపం.
    ప్రణవోహి పరబ్రహ్మ పణవః పరమం పదం
    ప్రణవం సర్వవేదాధ్యం సర్వదేవమాయం విద్దు: //
    ప్రణవమే - పరబ్రహ్మం, ముక్తి, వేదాలకు మూలం, సకలదేవతలమయమైంది.

    • సృష్టాదిన బ్రహ్మదేవుని కంఠంనుండి వెలువడిన శబ్దములు రెండు. మొదటిది 'ఓం'కారం. రెండవది 'అధః'. కావున ఈ రెండును పరమ పవిత్రమైన మంగళశబ్దములు. విధాత ప్రప్రధమమున ఓంకారమునే ఉచ్చరించెను. ఏ యొక్క పరమాత్మ శక్తి చేత తాను సృష్టికి  శక్తిమంతుడయ్యనో, అట్టి పరబ్రహ్మం యొక్క స్వరూపం ఓంకారమనియు, అది దేవతలకు, సర్వజనులకు ధ్యేయమనియు తెలిపెను. 
    భగవన్ కిం తదాదౌ ప్రయుక్తం ధ్యానం ధ్యాయితవ్యం
    కిం తద్ధ్యానం కో వా ధ్యాతా కశ్చ ధ్యేయః //
                                                                           -అథర్వశిఖోపనిషత్తు 
    భావం: ఓ భగవంతుడా! ఆదికాలమునందు బ్రహ్మాది దేవతలు ఉపయోగించినది ఏది? ధ్యానము ఏది? ధ్యానింపదగినది ఏది? ధ్యానమునకు సాధనమయ్యేది ఏది? ధ్యాత ఎవడు? ధ్యేయం (మంత్రముచే తెలుసుకొనదగినది) ఏది? 


    స ఏభ్యో థర్వా ప్రత్యువాచ ఓ మిత్యక్షరమేతదాదౌ
    ప్రయుక్తం ధ్యానం ధ్యాయితవ్యం //
                                           -అథర్వశిఖోపనిషత్తు      
    భావం: ప్రణవాక్షరమే ఆదియందు ఉపదేశింపబడింది. అదియే ధ్యానం. దానినే ధ్యానింపవలయును.


    సకృదుచ్ఛరిత మాత్ర ఊర్ధ్వమున్నామయతీత్యోంకారః
                                                                           - అథర్వశిఖోపనిషత్తు
    ఒక్కమారు ప్రణవం (ఓం) ఉచ్చరించినమాత్రముననే శ్రేష్టగతిని (పరమపదంను) చేర్పించుటంబట్టి ఓంకారమనబడును.


    ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణానయితీ త్యేతస్మాత్ ప్రణవః
    ప్రణవం అంటే సర్వప్రాణములను పరమాత్మునియందు లగ్నం చేయునది అని అర్ధం.


    సర్వేవేదా యత్పదమామనన్తి తపాగ్మ్ సి సర్వాణి చ యద్వదంతి
    యదిచ్చంతో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదగ్మ్ సంగ్రహేణ బ్రవీమ్యో మిత్యేతత్ //
                                                                           -కఠోపనిషత్తు                                     
    భావం: వేదములన్నియు ఏ వస్తువును పొందదగినదానినిగా చెప్పుచున్నవో, తపస్సులన్నియు దేనిని ఆచరింపమని చెప్పుచున్నవో, దేనిని కోరుచున్నవారై బ్రహ్మప్రాప్త్యర్ధం అగు బ్రహ్మచర్యం ఆచరించుచున్నారో ఆ వస్తువును గూర్చి నీకు సంగ్రహముగా భోదించుచున్నాను  - అదే "ఓం".
    • "ఓం" అనే పదమే అవినాశి అయిన పరబ్రహ్మం. అదే ఈ బ్రహ్మాండం-విశ్వం. ఇప్పటివరకు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇకపై ఉండబోయేది అంతా ఓం అనే పదమే.
    • ఓంకార వివరణ:
     అకార, ఉకార, మకారములతో కూడినది ఓంకారం.
    అక్షరములలో అకారం మొదటిది. ఈ శబ్దం కంఠంనుండి పుట్టుచున్నది. ఇది ప్రణవం యొక్క ప్రధమమాత్రయు, బ్రహ్మయు,బ్రహ్మశక్తి సృష్టియు అగుచున్నది.
    ఉకారశబ్దం దవడల మధ్యనుండి ఉద్భవించుచున్నది. ఇది ఓంకారం యొక్క ద్వితీయమాత్రయు, విష్ణువై ఉన్నది. విష్ణుశక్తి స్థితియు అయివున్నది.
    మకారశబ్దం పెదవుల కొసనుండి జనించును. ఇది ప్రణవం యొక్క తృతీయమాత్రయు, మహేశ్వరుడును, శివశక్తి లయ మగుచున్నది.
    కంఠంనుండి అకారధ్వని ఆరంభించి ఓష్టాన్తమున అంతమగుటచే(లయమగుటచే) అన్ని అక్షరములు(శబ్దములు) ఈ మూడింటి ఆదిమధ్యాన్తములలో ఉద్భవించుట చేత వేదములన్నియు ఈ ఓంకారమునుండియే ఏర్పడినవని శ్రుతివాక్యం. కావున ఈ ఓంకారం ఒకదానిని పఠించినచో వేదములన్నింటిని చదివినవారగుదురని ఋషులు చెప్పెదరు.


    ప్రణవం హీశ్వరం విద్యాత్సర్వస్య  హృది సంస్థితం
    సర్వవ్యాపినమోంకారం మత్వా ధీరో న శోచతి //
    జనుడు స్మరణజ్ఞానమునకు స్థానమైన హృదయమునందున్నఈశ్వరుని ఓంకారముగా తెలుసుకోవలెను. ఇట్లు సర్వవ్యాపకమైన ఓంకారమును తెలుసుకొన్న జ్ఞాని శోకనిమిత్తమైన అజ్ఞానాది నాశమగుటవలన దుఃఖింపడు.
    'ఓంకార ఆత్మేవ'  ఓంకారం ఆత్మయేనని నిర్వచింపబడింది.
    'తస్య వాచకః ప్రణవః'  నిర్గుణ పరమాత్మ స్వరూపమును తెలుపునట్టి సమర్ధమైన శబ్దం ఒక్క ఓంకారం మాత్రమే.
    'అక్షరమంబరాన్త ధృతే: // (బ్ర.సూ).  పృధివి మొదలు ఆకాశం వరకు గల పంచభూతములను ధరించుటవలన అక్షరశబ్దముచే (ఓంకారముచే) చెప్పబడునది పరబ్రహ్మమే.


    ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం  శరం హ్యుపాసానిశితం సందదీత /
    ఆయమ్య తద్భావగతేనా చేతసా  లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి //
                                                                              -ముండకోపనిషత్తు 

    భావం: ఉపనిషత్తులలో ప్రసిద్ధమగు, గొప్పఅస్త్రంవంటింది అగు (ప్రణవమగు) ధనస్సును గ్రహించి ఉపాసనంచేత పదునుపెట్టబడిన (ఆత్మయను) బాణమును ఎక్కుపెట్టవలయును. ఆ అక్షరబ్రహ్మమునందు (ధ్యానంను పొందిన చిత్తంచేత లాగి ఆ పూర్వం చెప్పియుండెడి) లక్ష్యమును కొట్టవలయునని తెలుసుకొనుము.
    అంటే ఉపనిషత్ ప్రసిద్ధమైన ఓంకారమనెడి ధనస్సును గ్రహించి ఆ ధనస్సునందు ఉపాసనచేత వాడిగలదియగు జీవాత్మయను బాణమును ఎక్కుపెట్టి, ఆ ఎక్కుపెట్టిన బాణమును ఇంద్రియసముదాయముల యొక్క విషయములనుండి మరలించి లక్షమునందే ఉంచి బ్రహ్మధ్యానం పొందియుండెడి మనస్సుచేత పూర్వోక్తమగు అక్షరస్వరూపమునే లక్ష్యముగా కొట్టవలనని తెలుసుకొనుము.

    ప్రణవో ధనుశ్శరో హ్యాత్మా  బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే /
    అప్రమత్తేన వేద్ధవ్యం  శరవత్తన్మయో భవేత్ //  
    భావం: ఓంకారం ధనుస్సు, జీవాత్మయే బాణం,అక్షర పరబ్రహ్మమే ఆ బాణమునకు గురికావల్సిందిగా చెప్పబడెను. సావధానమగు (ఏకాగ్రత) మనస్సు కలవానిచేత కొట్టబడవలెను. ఆ బాణమువలనే జీవుడు లక్ష్యమగు బ్రహ్మముతో పరమసామ్యము పొందెను.
                                                               
                                             - మరిన్ని వివరణలు తదుపరి పోస్ట్ లో