18, నవంబర్ 2011, శుక్రవారం

వేదమాత - గాయత్రి

త్రికాలజ్ఞులై నిష్కాములైన భౌతికసుఖములనుకోరని ఋషీశ్వరులు యోగదృష్టితో లోకకళ్యాణమునకు ఉత్కృష్టమైన మంత్రములు ప్రసాదించిరి. 
మకారం మననం ప్రాహు స్తకారస్త్రాణ ఉచ్యతే/మనన త్రాణసంయుక్తో మంత్ర ఇత్యభి ధీయతే // 
'మ' మననం చేయువానికి 'త్ర' రక్షించును. అనగా మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును.
మంత్రములలో శైవ మంత్రములు ఒక కోటి, సౌరములు రెండు కోట్లు, గణేశ మంత్రములు ఏబది లక్షలు, వైష్ణములు ఏబది లక్షలు, శక్తి మంత్రములు మూడు కోట్లు గలవు. ఈ సప్తకోటి మహామంత్రములలో ఆది మంత్రం "గాయత్రి".
యోగులకంటే మంత్రజపం చేయువారు మిగుల ఉత్తములని భారతమున చెప్పబడెను. యజ్ఞములన్నింటిలో జపయజ్నం శ్రేష్టమైనది. యజ్ఞానం జపయజ్ఞోస్మి (భగవద్గీత) . 'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' సర్వమంత్రములలో గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది.
 'గయాన్  త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ - ప్రాణమును రక్షిస్తుందో - అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). ప్రాణములను ఉద్ధరించే  సామర్ద్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి అనుబడినది. 'గాయత్రీ వేద మాతా చ' గాయత్రి వేదములయొక్క తల్లి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తియు గాయత్రీ శక్తిజనితములు. శంకరాచార్య భాష్యములో గాయత్రీశక్తిని స్పష్టం చేస్తూ ఇలా చెప్పబడినది - 'గీయతే తత్వమనాయ గాయత్రీతి ' అనగా ఏ వివేకబుద్ధి ఋతంభరా ప్రజ్ఞ ద్వారా వాస్తవికత యొక్కజ్ఞానము లభింపజేస్తుందో అది గాయత్రి. 
గాయత్రీ తు స్వయం పూర్ణో యోగ ఇత్యుచ్చతే బుధై: / కించిత్తత్వం హి యోగస్య బహిరస్మాన్న విద్యతే //
భావం : గాయత్రి స్వయముగా పూర్ణయోగం అని పండితులు తెలియజేశారు. యోగం యొక్క ఏ తత్వాలు దీనికి బాహ్యముగా లేవు. యోగమనగా కలయిక. ఆత్మను పరమాత్మలో కలిపేదే యోగం. ఐతే యోగసాధన మార్గాలు అనేకం. ఒకొకరి సాధన ఓకోలా వుంటుంది. సాధకుని స్థితిబట్టి, అవగాహనబట్టి, అనుకూలతబట్టి, శక్తిబట్టి, యోగ్యతబట్టి తమకు నచ్చిన సాధనమార్గాన్ని అనుసరిస్తారు. ఏ సాధనైన దాని పరమార్ధం పరమాత్మలో సంలీనమే. ఈ సాధనామార్గాలలో గాయత్రీ సాధన ఒకమార్గం.
గాయత్రీమాతకు ఐదు ముఖములుండును. అందు మొదటిది ముత్యపురంగు, రెండవది పగడపురంగు, మూడవది బంగారపు వన్నెయు, నాల్గవది ఇంద్రనీలపువర్ణమును, ఐదవది వజ్రపువర్ణమును కలిగియుండును. ఈమె త్రినేత్రదారిణి. నవరత్నకిరీటమును ధరించి ప్రకాశమానమై యుండును. దశబాహువులు కలిగి అందు వరదాభయముద్రలను, అంకుశం, కొరడా, కపాలం, శంఖ చక్ర గదా పద్మద్వయమును ధరించి ఎల్లప్పుడూ భక్తులను రక్షించుచుండును. 
                      * ఆదిశక్తి - వేదమాత - దేవమాత - విశ్వమాత *
గాయత్రి పరమాత్మ యొక్క ఇచ్చ్చాశక్తి. దాని కారణముగా సృష్టి మొత్తం నడుచుచున్నది. చిన్న పరమాణువు మొదలుకొని పూర్తి విశ్వబ్రహ్మాండం వరకు ఆమె యొక్క శక్తిప్రభావం వలననే చరిస్తున్నాయి. పరమాత్మ స్వయముగా మౌలికరూపంలో నిరాకారుడు, అన్నిటినీ తటస్థ భావముతో చూస్తూ శాంతియుత అవస్థలో ఉంటారు.సృష్టి ప్రారంభంలో ఆయనకు ఒకటి నుండి అనేకము అయే కోరిక కలిగినప్పుడు, ఆయన ఈకోరిక శక్తిగా తయారైనది.ఈ శక్తి సహాయంతోనే మొత్తం సృష్టి తయారై నిలబడినది. సృష్టిని తయారుచేసే ప్రారంభికశక్తి అయిన కారణముగా గాయత్రీనీ "ఆదిశక్తి " అనిఅన్నారు. బ్రహ్మకు సృష్టినిర్మాణ, విస్తరణల కొరకు అవసరమైన జ్ఞానము, క్రియాకౌశలము ఆదిశక్తి గాయత్రి యొక్క తపోసాధన ద్వారానే లభించినది. ఇదే జ్ఞాన -విజ్ఞానము, వేదము అనబడినది. ఈ రూపంలో ఆదిశక్తి పేరు "వేదమాత" అయినది. వేదముల సారము గాయత్రీ మంత్రములో బీజ రూపంలో నిండి ఉన్నది. సృష్టి యొక్క వ్యవస్థను రక్షించే, నడిపించే విభిన్న దైవశక్తులు ఆదిశక్తి యొక్క ధారలే. ఆదిశక్తి నిర్మాణం, పర్యవేక్షణ, పరివర్తనము మొదలైన క్రియలకు అనుగుణముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి దైవశక్తులరూపంలో విడివిడిగా ప్రకటితమౌతుంది. ఇదేవిధముగా ఇతర దైవశక్తులు దీనియొక్క వివిధ ధారలు ఈశక్తి నుంచే పోషణ పొందుతాయి . ఈ రూపములో శక్తిని  " దేవమాత " అనే పేరుతో పిలుస్తారు. విశ్వఉత్పతి మొత్తం ఆదిశక్తి గర్బములో జరిగినది . కనుక "విశ్వమాత" అనే పేరుతో కూడా పిలుస్తారు. 
                                      గాయత్రీ పరాశక్తి. మహాకాశ, చిత్తాకాశ, చిదాకాశ స్వరూపమే గాయత్రీస్వరూపం. గాయత్రిమంత్రం సర్వతత్త్వసంపూర్ణం. పరబ్రహ్మ మౌలికం. గాయత్రీ పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరత్వమే భగత్వం. భగం కలిగినవాడే భగవంతుడు. భగమనగా బలం, తేజం, శక్తి, ఆరోగ్యం, ఐశ్వర్యములని అర్ధం. ఈ దైవీశక్తులే గాయత్రీశక్తులు. శక్తిమంతుడే పరమేశ్వరుడు, శక్తి ఉత్పాదనమే గాయత్రీయోగం.
                                     గాయత్రి మూడు గుణములతో కూడిన శక్తి . హ్రీం - సద్బుద్ధి, శ్రీం - సమృద్ధి, క్లీం - శక్తి ప్రధానములు. దీనికి మూడు విశేష ధారలు కలవు. వీటిని గంగ, యమునా, సరస్వతిల త్రివేణీ సంగమం అని కుడా అనవచ్చును. దైవశక్తులతో జోడించినపుడు వీటిని సరస్వతి ,లక్ష్మి ,కాళి మరియు బ్రహ్మ ,విష్ణు, మహేశ్వర రూపంలో తెలుసుకొనగలము. గాయత్రి సాధనతో సాధకుని మనస్సు, బుద్ధి మరియు భావనలు ఈ త్రివేణిలో స్నానం చేసే అవకాశం లభించినపుడు, స్థితి కాయకల్పం వలె తయారవుతుంది. సద్గుణములు వృద్ధి, అంతర్గత శాంతి , సంతోషంతో పాటు సార్వజనిక సమృద్ధి సఫలతలను ఇచ్చేది గాయత్రి. 
                                     ప్రాపంచిక కష్టాల నదిని దాటుటకు ధైర్యము, సాహసము, ప్రతిభ, ప్రయత్నం అనే నాలుగు కోణములుగల నావ అవసరము. గాయత్రీ సాధన ఈ నాలుగు ప్రత్యేకతలను మనిషిలో బాగా పెంపొందిస్తుంది.
                                     జీవాత్మ ,పరమాత్మ మధ్య సూక్ష్మ ప్రకృతి యొక్క మాయా పరద ఉన్నది . ఈ పరదాను దాటుటకు ప్రకృతిసాదనములతోనే ప్రయత్నించాలి. చింతన - మననం, ధ్యానం - ప్రార్ధన, వ్రతము - అనుష్టానము, సాధన వంటి అన్ని ఆద్యాత్మిక ఉపచారములు ఇందు నిమితమై ఉన్నాయి. వీటన్నిటిని వదిలి పరమాత్మను పొందుట ఏ విధముగాను వీలుకాదు. సత్యగుణం, చిత్ శక్తి ద్వారా మాత్రమే జీవాత్మ ,పరమాత్మల యొక్క కలయిక జరుగగలుగుతుంది. ఈ ఆత్మ పరమాత్మల కలయికను జరుపగలిగే శక్తియే గాయత్రి.
                                    గాయత్రి బ్రహ్మప్రతిపాదకమగు మంత్రము. కుండలినీ శక్తి 24 తత్వంలతో జగత్తును సృజించును కావున గాయత్రి  24 అక్షరములు కలిగి యున్నదని శంకరులు ప్రపంచసారమున వ్రాసిరి. 
ఈ శరీరం పంచభూతాత్మకం. ఇందలి జీవాత్మ చిదానందస్వరూపముగా పంచప్రాణస్వరూపముగా విహరించుచున్నది. తన్మాత్ర స్వభావంవలన ప్రలోభితమైన గుణసంపత్తును దైవీసంపత్తుగా మలచుకొని ఆధ్యాత్మికధారణ చేయవలెను. యోగసిద్ధివలన ఇది సాధ్యం. యోగసిద్ధి మంత్రసిద్ధివలన వచ్చును. 
                                * గాయత్రీ మంత్రం *
గాయత్రీమంత్రములో తొమ్మిది నామములు కలవు. ౧. ఓం ౨. భూ ౩. భువః ౪.సువః ౫.తత్ ౬. సవితు: ౭. వరేణ్యం ౮. భర్గః ౯.దేవస్య ఈ తొమ్మిదినామములద్వార భగవంతుడు కీర్తింపబడుతున్నాడు. ధీమహీ అంటే ఉపాసన అని అర్ధం. ధియోయోనః ప్రచోదయాత్ అంటే భగవంతున్ని ప్రార్ధించుట.
ఈ మంత్రమును ఐదుచోట్ల ఆపి జపించవలెను. ౧. ఓం ౨. భూర్భువ స్సువః ౩. తత్స వితుర్వరేణ్యం ౪. భర్గోదేవస్య ధీమహీ ౫. ధియోయోనః ప్రచోదయాత్.
"ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
అర్ధం : 'ఓం' కారంను ప్రణవమని అందురు. ప్రణవమునుండియే సమస్త శబ్దములు, మంత్రములు ఏర్పడుటచేత ఓంకారం సర్వమంత్రములకు హేతువు. ఓంకారముచే వ్యాహృతులు, వ్యాహృతులచే వేదములు ఆవిర్భవించినవి. (ఓంకారం వివరణ ఈ బ్లాగ్ మొదటి పోస్ట్ యందు కలదు)   ఓం = ప్రణవాత్మకమైన పరమాత్మ(పరమేశ్వరుడు), భూ = ప్రాణము నకు ప్రాణము(సత్ స్వరూపుడు), భువః = సర్వదుఃఖములను పోగొట్టి(చిత్ స్వరూపుడు), సువః = సమస్తసుఖములను యిచ్చునట్టి(ఆనందస్వరూపుడు)పరమాత్మ, నః = మా యొక్క, ధియ = బుద్ధులను, ప్రచోదయాత్ = ప్రేరణ చేయునో,  తత్ = ఆ, సవితు: = సర్వజగత్తులను సృష్టిచేయు, దేవస్య = దివ్యమహిమగల ఆ పరమాత్మయొక్క, వరేణ్యం =మిక్కిలి శ్రేష్టమై కోరదగిన, భర్గః = సర్వదుఃఖనాశకరమగు శుద్ధస్వరూపమును, ధీమహి = ధారణచేయుదునుగాక.                               
                              * గాయత్రీ గుణముల విశిష్టత *
ఈ మంత్రము యొక్క ఇరువదినాలుగు అక్షరములు ఇరువదినాలుగు గుణములను కలిగియున్నది.
'త' - అజ్ఞానాంధకారమును పోగొట్టును, 'త్స' - ఉపపాతకములను పోగొట్టును, 'వి' - మహాపాతకములను, 'తు' - దుష్టగ్రహ దోషములను,   'ర్వ' - భ్రూణహత్యాదోషములను, 'రే' - అగమ్యాగమనదోషములను, 'ణి' - అభక్ష్యాభక్షణ దోషములను, 
'యం' - బ్రహ్మహత్యాపాతకములను, 'భ' పురుషహత్యాపాతకములను, 'ర్గో' గోహత్యదోషములను, 'దే' స్త్రీహత్యాదోషములను, 
'వ' - గురుహత్యాదోషములను, 'స్య' - మానసికపాపములను, 'ధీ' - పితృ మాతృవధ పాపములను, 'మ' - పూర్వజన్మార్జిత పాపములను, 'హి' - అశేష పాపసమూహములను, 'ధీ' - ప్రాణివధపాపములను, 'యో' - ప్రతిగ్రహపాపములను, 'యో' - సర్వపాపములను పోగొట్టగా,
'నః' - ఈశ్వరప్రాప్తియు, 'ప్ర' - విష్ణులోకప్రాప్తియు, 'చో' - రుద్రపదప్రాప్తియు, 'ద' - బ్రహ్మపదప్రాప్తియు, 'యాత్' - త్రిమూర్తుల ప్రసాదసిద్ధిని కలగజేయును.
భూ:, భువః, సువః, అనే మూడు వ్యాహృతులు బ్రహ్మతత్వ స్వరూపలక్షణమైన సత్, చిత్, ఆనందాలు. భూ: అంటే సత్తు, భువః అంటే చిత్తు, సువః అంటే ఆనందము. ఈ మూడు కలిసిందే ఓం. ఇదే పరబ్రహ్మ. తత్ సవితు: అదే సవిత. సూయతే అనే నేతిసవితా - ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు కారణమైంది సవిత (గాయత్రి). 
                     * గాయత్రీ మంత్రోచ్చారణ ప్రభావం * 
ఈ మంత్రోచ్చారణ సమయమందు శరీరములోని సర్వ నాడీస్థానములలో స్పందనాశక్తి చేకూరును. షట్ చక్రములలో స్పందన ఏర్పడి తద్వారా చక్రములు జాగృతమౌను. ఈ బీజాక్షర స్పందనాశక్తివలన శరీరావయములలో ఉన్న గ్రంధులలో శక్తులను మేల్కొలిపి మహత్వపూర్ణమగు సఫలతను, సంపన్నతను, సిద్ధులను చేకూర్చును. గాయత్రి మంత్రంలోని బీజాక్షరములు శరీరములోని ఈ దిగువ వివరించినస్థానములయందు స్పందనను చేకూర్చి పూర్ణయోగత్వమును సిద్ధింపజేస్తుంది.
సూర్యున్ని ఆరాధించిన ఆరోగ్యం, కుశలం, పుత్రులు పుణ్యం; మహాదేవున్ని ఆరాధించుట వలన యోగం, జ్ఞానం, కీర్తి; విష్ణువును ఆరాధించిన ధర్మార్ధ కామమోక్షములు; దుర్గోపాసనచే సర్వ మోక్షాది సకలకోరికలు; గణేశున్ని ఉపాసించిన కర్మసిద్ధి, విఘ్ననివారణ ప్రాప్తించును. అయితే గాయత్రీ మంత్రానుష్టానమువలన పంచాయతన దేవతలు చేకూర్చు సర్వఫలములు సమిష్టిగా చేకూరును. ఈ మంత్రం పఠనం చేయువారికి చతుర్విధపురుషార్ధములు, ధర్మార్ధకామమోక్షములను ప్రాప్తించును. సమస్తకోరికలను తీర్చు కామ్యఫలప్రదాత్రి 'గాయత్రీ'. గాయత్రి కామధేనువు. ఆత్మశక్తిని, మానసికశక్తిని, సంసారికశక్తిని లభింపజేయును. ప్రణవం (ఓం), భూ:, భువః, సువః, గాయత్రిమంత్రం అనునవి పంచమహాయజ్ఞములు (దేవయజ్ఞం, ఋషియజ్ఞం లేక బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞములు). ప్రణవ వ్యాహృతిత్రయ గాయత్రీమంత్రమును నిత్యమును జపించినయెడల పంచపాపములనుండి పావనమై పంచయజ్ఞముల ఫలితంను పొందుదురు.

2 కామెంట్‌లు: