25, డిసెంబర్ 2011, ఆదివారం

వివాహం విశిష్టత

భారతీయ సంస్కృతికి మన ఆచారవ్యవహారాలు దర్పణం పడతాయి. అందులో అత్యంత అద్భుతమైనది, ఆదర్శనీయమైనది, అనుసరణీయమైనది మన వివాహపద్దతి.  
మానవుడు సంఘజీవి. వంటరిగా జీవించలేడు. తన భావాలను అనుభూతులను ఇతరులతో కలసిమెలసి ఉంటూ పంచుకున్నప్పుడే తన జీవనాన్ని తృప్తిగా ఆనందంగా సాగించగలడు. ఈ రీతిలో తాను ఆనందంగా తృప్తిగా  శాంతిసౌఖ్యాలతో జీవిస్తూ, తన ఈ ఆనందానుభూతిని తన చుట్టూ ఉన్నవారితో పంచుకుంటూ జీవించగలిగినప్పుడే ఆ వ్యక్తి జీవితానికి ఓ అర్ధముంటుంది. సాధారణంగా ఓ వ్యక్తి జీవనం బాల్యంలో సహచరులతో, యవ్వనంలో  జీవితభాగస్వామి మరియు సంతానములతో, వార్ధక్యంలో భార్య పిల్లలు, మిత్రులు సాధకులతో గడుస్తుంది. అయితే గురుపరంగా శాస్త్రాలను తెలుసుకొని అందరితో ప్రేమతో సేవాభావంతో ఉంటూ ధర్మజీవనం గడిపే మానవుడే మాధవుడుకు దగ్గరవుతాడు.

భారతీయ సంస్కృతి ప్రకారం మానవజీవితంలో నాలుగు ఆశ్రమములు ఉన్నాయి. ౧. బ్రహ్మచర్యం, ౨. గార్హస్థ్యం(గృహస్థం), ౩. వానప్రస్థం, ౪. సన్యాసం. సంపూర్ణజీవనానికి ఈ నాలుగు ఆశ్రమములు నిర్దేశించబడ్డాయి. ఈ ఆశ్రమములందు మొదట శాస్త్రవిజ్ఞానం, తర్వాత ధర్మబద్ధమైన సుఖానుభవం, అటుపై ధార్మికత్వం, తాత్త్వికత్వం క్రమముగా అలవడి అసలైన ఆనందమును అనుభవంలోనికి వస్తుంది.



                                     గృహస్థాశ్రమం 

బ్రహ్మచర్యాశ్రమంలో చక్కని విద్యావివేకజ్ఞానములను సంపాదించి అటుపై గురువుకు గురుదక్షిణ సమర్పించి స్నాతకుడు అవుతాడు. 'అవిచ్చన్నంగా నీవరకు వచ్చిన ఈ మానవసంతతిని విచ్ఛేదం చేయక గృహస్తుడవై నీవూ కొనసాగించు, వంశప్రతిష్ట పోకుండా వంశాన్ని నిలబెడుతూ కుటుంబపోషణార్ధం ధర్మముగా సంపాదిస్తూ అందులో కొంత అతిధులకు, ఆర్తులకు, సాధువులకు, సత్కార్యములకు ధార్మికంగా వినియోగించు' అన్న గురోపదేశంతో గృహస్థజీవితం ఆరంభమౌతుంది. సామాజిక దృక్పధంతో గమనిస్తే అన్ని ఆశ్రమములందు విశిష్టమైనది గృహస్థాశ్రమమే. నదీనదాలు సముద్రాన్ని ఆశ్రయించినట్లు ఇతర ఆశ్రమములు గృహస్థునే ఆశ్రయిస్తాయి. బ్రహ్మచారులు, వనప్రస్థులు, సన్యాసులు గృహస్థులపైనే ఆధారపడివున్నారు. గృహస్థజీవితం వివాహంతో ప్రారంభమౌతుంది. పెళ్లన్నది నూరేళ్ళ పంట అని, ఏడేడు జన్మల బంధమని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఈ వివాహబంధం గురించి మనశాస్త్రాలు ఏం చెప్తునాయో వధూవరులు అవగాహన చేసుకొని ఆచరిస్తే వారి దాంపత్యజీవనం అత్యంత అన్యోన్యంగా ఆనందంగా ఆదర్శనీయంగా అద్భుతముగా అలరారుతుంది.
ద్విధాకృత్వాత్మనో దేహ మర్దేన పురుషోభవత్ / అర్ధేన తస్యాం సా నారీ విరాజమసృజత్ ప్రభు: // (మనుస్మృతి)
పరమేశ్వరుడు తన దేహాన్ని రెండు భాగాలుచేసి ఒక సగంలో పురుషాకృతినీ, రెండవ సగాన్ని స్త్రీ రూపంగా సృజించాడు. అదే దాంపత్య ఆవిర్భావానికి ఆదిసంకేతం. అదే అర్ధనారీశ్వర తత్త్వం. అదే వివాహబంధానికి అర్ధం. 
'వహ్' అనే ధాతువుకు ప్రాపణమని అర్ధం. (ప్రాపణమంటే పొందించడం) 'వి' ఉపసర్గ. కన్యాదానం విశిష్టమైన సమర్పణం కావున వివాహమనే నామం ఏర్పడింది. ఆడపిల్ల తండ్రి, తన తనయను వరునికి అర్పించడం లేదా దానం చేయడమే వివాహం.

మానవజీవితంలో వివాహసంస్కారం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నది. ఇది ఓ మహత్తరమైన వైదిక సంస్కారం. వివాహసంస్కారములో వివిధ కార్యక్రమాలుంటాయి. ప్రతీపని (పద్ధతి) వెనుక ఓ పరమార్ధం ఉంది. 
 వివాహప్రక్రియ వరునికి స్నాతకవ్రతంతో (నీవరకు వచ్చిన మానవసంతతిని ఆపక గృహస్థఆశ్రమంను స్వీకరించి యోగ్యమైనసంతానమును పొంది, ధర్మంగా సంపాదిస్తూ సక్రమముగా గృహనిర్వాహణ చేస్తూ, అందరిని సేవిస్తూ, జ్ఞానసముపార్జనయందు ఏమరపడక, సత్కార్యములుచేస్తూ, ధార్మికజీవనంగడపమన్న గురుమాటప్రకారం స్నాతకవ్రతమాచరిస్తాడు), వధువుకు గౌరీపూజతో (సర్వమంగళమయిన గౌరీదేవి పాతివ్రత్యానికి, పవిత్రతకు చిత్తదార్డ్యానికి సర్వశుభాలకు ఆశీస్సులు అందిస్తుంది కాబట్టి వధువు గౌరీపూజ ఆచరిస్తుంది) మొదలౌతుంది. 
        
                   వివాహప్రక్రియలో కొన్ని ప్రధానపద్ధతులు 

మంగళ స్నానములు:-  కొందరు ముత్తైదువులు  సిరిసంపదలతో సంతానసౌభాగ్యాలతో సంతోషంగా వుండమని ఆశ్వీరదిస్తూ, వధూవరులమంగళం కోరుకుంటూ వారిని పవిత్రీకరిస్తూ మంగళ స్నానములు ఆచరిస్తారు. 
మంగళాష్టకాలు:- నూతనవదువరులకు మంగళం కలగాలని లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, సీతారాములను, రుక్మిణీకృష్ణులు మొదలగువారిని ప్రార్ధిస్తూ, దంపతులు కాబోతున్న వీరికి ఆయురారోగ్య భోగభాగ్యాలను సత్సంతాన్ని ప్రసాదించి అనుగ్రహించమని ఎనిమిది మంగళ శ్లోకములను చదువుతారు.
బాసికం:- మానవుని శరీరంనందు ఇడ పింగళ సుషుమ్న అనే ప్రధాన నాడులుంటాయి. ఇవన్నీ కలిసేస్థానం భ్రూమద్యం. భౌతికమైన ఉపద్రవాలనుండి రక్షణకోసం, ఇతరత్రా దృష్టిదోషం పడకుండా వధూవరులకు ఈ స్థానంలో భాసికదారణ చేస్తారు. 
కాళ్ళు కడగడం:- కళ్యాణవేదికపై  వధువు, వధువుతల్లితండ్రులు తూర్పుముఖముగా, వరుడు పశ్చిమముఖముగా కూర్చోగా వీరి నడుమ అడ్డుగా తెల్లటి తెరను (ఆ తెరపై స్వస్తిక్ గుర్తువుంటే మరీమంచిది) వధువుతరుపువారు ముగ్గురు ఓప్రక్కన, వరుడుతరుపువారు ఇద్దరు మరోప్రక్కన పట్టుకుంటారు.కన్యాదాత, అతనిభార్య వరుడును శ్రీనారాయణస్వరూపముగా భావించి, అల్లుని కాలుకడిగి పూజించి కన్యాదానం చేస్తారు. కన్యాదాత పెండ్లికుమారుని కాళ్ళు కడిగినప్పుడు అంతా భగవన్మయంగా భావిస్తూ శ్రీనారాయణుని పాదాలను కడుగుతున్న భావనతో  ముందుగా కుడిపాదంను, తర్వాత ఎడమపాదంను ఆపై రెండు పాదములను కడగాలి.
కన్యాదానం:- అన్నిదానంలోనూ గొప్పదానం కన్యాదానం. కన్యాదానం చేయబోయేముందు కన్యాదాత ఇలా అంటారు -
'కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతామ్ / దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా //
భావం:- బ్రహ్మలోకప్రాప్తికోసం నేను సువర్ణసంపదగల స్వర్ణాభరణభూషితమైన ఈ కన్యను నారాయణస్వరూపుడవైన నీకు దానం చేయబోతున్నాను.
విశ్వంభర స్సర్వభూతా స్సాక్షిణ్యః సర్వదేవతాః / కన్యా మిమాం ప్రదాస్యామి పితృణాం తారణాయ వై //
భావం:- భగవంతుడు, పంచభూతాలు, సకలదేవతలు సాక్షులుగా నా పితృదేవతలు తరించడానికి ఈ కన్యను దానం చేయబోతున్నాను.
కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే / ప్రయత్కోహం ప్రయచ్చామి ధర్మకామార్ధసిద్ధయే //
భావం : సర్వాలంకారశోభిత, సాధ్వి, సుశీలయిన ఈ అమ్మాయిని ధర్మార్ధకామాలనే పురుషార్ధాలు సిద్ధించడానికి నియమపూర్వకంగా ఈ బుద్ధిమంతునికి దానం చేస్తున్నాను.
నాతిచరామి:- వదువుతండ్రి కన్యాదానం చేస్తూ, వరునిని ఇలా మాటివ్వమని అడుగుతాడు - "నాయనా! అల్లారుముద్దుగా పెంచిన నా కుమార్తెను నీ చేతిలో పెడుతున్నాను. నీవు ఈమెను (స్నేహేన పాలయ) స్నేహంతో చూసుకోవాలి. జీవితంలో మీరిద్దరూ కలిసిమెలిసి ఎన్నో మంచిపనులు చేయాలి. సిరిసంపదలను అనుభవించాలి. సత్సంతాన్ని కనాలి. ధర్మార్ధకామాలనే పురుషార్ధాలను సంపాదించడంలో నీకు అర్ధాంగి అయిన నా కూతురును అతిక్రమించి వెళ్ళకు. అలా అతిక్రమించి వెళ్లనని నాకు మాట ఇవ్వు అని అడగగా (ఈమెను అతిక్రమించనని మాట ఇస్తున్నాను) "నాతిచరామి" అని మూడుసార్లు అల్లుడు అంటాడు. 
సమీక్షణం:-  వధూవరుల చేతిలో జీలకర్రబెల్లమును మెత్తగా నలిపి ఉండచేసి సిద్ధంగా వుంచుతారు. మంగళవాద్యాలు మ్రోగుతుండగా వేదమంత్రాలు పురోహితులు పఠిస్తుండగా దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహుర్తాన వరుడు ఇష్టదైవమును ధ్యానిస్తూ వధువు నడినెత్తిన బ్రహ్మరంద్రంపైన, వధువుకూడా అదే సమయమున తన ఇష్టదైవంను ధ్యానిస్తూ వరుని నడినెత్తిన బ్రహ్మరంద్రంపై పెట్టగ నెమ్మదిగా  తెరతొలగిస్తున్న ఆ సుమూహర్త సమయమున వధూవరులు ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడమే సమీక్షణం. జీలకర్రబెల్లమును ఒకరితలపై ఒకరుపెట్టుకోవడంద్వారా ఒకరుమస్తాకాన్ని ఒకరు స్పృశిస్తారు. తద్వారా హస్తమస్తక సంయోగామన్న యోగక్రియ సిద్ధిస్తుంది.  జీలకర్రబెల్లం ఈ రెండింటి సంయోగంవలన ఒక ధనసంజ్ఞక విద్యుత్తుశక్తి జనిస్తుంది. హస్తమస్తకసంయోగం వలన ఒకరిలోని విద్యుత్తు ఒకరిలోనికి ప్రసరించి ఇరువురి మనస్సులను ఏకంచేస్తుంది. అందుకే ఆ శుభసమయమున ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడంవలన వధూవరులకిద్దరకు ఒకరిపై ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరిగి ఏకత్వభావన జీవితాంతం దృఢపడివుంటుందన్నది వేదప్రమాణం. శుభక్షణాల్లో కలిసిన అనురాగామయమైన ఆ దృష్టి వారిమధ్య మానసిక అనుబంధాన్ని క్షణక్షణమునకు పెంచి చక్కటి అన్యోన్య దాంపత్యానికి నాంది కాబట్టి ఆ సమయంలో ఒకరినొకరు చూసుకోవడంలో ఏమరిపాటు పనికిరాదు. ఈ ముఖ్యవిషయంను, దీనియొక్క అద్భుతఫలితంను పెద్దలు వధూవరులకు ముందుగానే తెలిపి వారిని సంసిద్ధులు చేయవలెను. 
  • ముఖ్యగమనిక:- ఫొటోస్ తీసుకోవడం, వీడియో చిత్రీకరణలు, బంధుమిత్రుల కబుర్లు నడుమ ఆ సుమూహుర్త సమీక్షణం చేజార్చుకోవద్దు. కావాలంటే ఆ భంగిమలతో తర్వాత ఫొటోస్ తీసుకోవచ్చు. సమీక్షణం విశిష్టతను వధూవరులకు ముందుగానే తెలిపి   జీవితాంత మధురానుబంధంనకు ప్రాధాన్యత ఇవ్వండి. 
మంగళసూత్రం:- సకల మంగళాలకు ఆలవాలమైన సూత్రం మంగళసూత్రం. పరిణయ బందానికి చిహ్నం ఈ సూత్రం. ఉభయకుటుంబాల వంశాచారానికి తగినట్లు తయారుచేసిన బంగారు మాంగళ్యాలను పసుపుత్రాటితో గ్రుచ్చి మంగళదేవత గౌరీదేవి, లక్ష్మీదేవిలను ఆవాహనం చేస్తూ పూజించిన తర్వాత పురోహితుడు, పెద్దలు, ముత్తైదువలు  శుభాన్ని కాంక్షిస్తూ మంచిహృదయంతో దానిని తాకుతారు. అటుపై వరుడు వధువు మెడలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలనడుమ పెద్దల ఆశీర్వాదముల సాక్షిగా ఈ మంత్రాన్ని చెప్తూ -
"మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా / కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతమ్ //  
భావం:- నా సుఖజీవనానికి హేతువులైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవూ నూరేళ్ళు వర్ధిల్లు. అని మూడు ముళ్ళు వేస్తాడు.
తలంబ్రాలు:- వధూవరులు ఒకరితలపై మరొకరు పసుపుతో తడిపిన అక్షితలను దోసిళ్ళతో పోసుకోవడంను తలంబ్రాలు అంటారు. ఇక్కడ చెప్పే మంత్రాలలో కూడా ఓ పరమార్ధముంది. వరుడు వధువు దోసిట్లో ఎండుకొబ్బరిచిప్పతో అక్షతలను పోసి నేతితో ప్రోక్షిస్తాడు. తర్వాత పురోహితుడు వరుని దోసిట్లో అదే మాదిరిగా అక్షితలను పోసి నేతితో ప్రోక్షించి వధువుదోసిలిపై వరునిదోసిలి పెట్టి ఈ మంత్రాలను చదువుతాడు -
కపిలాగ్o  స్మారయన్తు, బహుదేయం చాస్తు, పుణ్యం వర్ధతామ్, శాన్తిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మసమృద్ధిరస్తు, దంపత్యో: సగ్రహే సనక్షత్రే సహా సోమేన క్రియేతాం, శాంతి రస్తు.
భావం:- కర్రి ఆవులను స్మరించండి, అనేక దానాలను చేయండి, పుణ్యం వృద్ధిపొందాలి, శాంతి పుష్టి తుష్టి వృద్ధి కలగాలి, విఘ్నాలు తొలగిపోవాలి, ఆయుస్సు ఆరోగ్యం కలగాలి, క్షేమం మంగళం కలగాలి, సత్కర్మలు వృద్ధి పొందాలి, గ్రహాలవలన నక్షత్రాలు వలన సోమునివలన దాంపత్యం సరిగా జరగాలి. శాంతి కలగాలి. 
ఆపై వరుడు 'ప్రజామే కామ స్సమృధ్యతామ్' (నేను కోరే సంతానం సమృద్ధిగా ఉండాలి) అని అంటూ   వధువుతలపై తలంబ్రాలు పోస్తాడు. అటుపై వధువు 'పశవో మే కామ స్సమృధ్యతామ్' (వారి పోషణకై నేను కోరిన పశు సమృద్ధి ఉండాలి) అని అంటూ వరునితలపై తలంబ్రాలు పోస్తుంది. 'యజ్ఞో మే కామ స్సమృధ్యతామ్' ( నేను కోరిన త్యాగం సమృద్ధిగా ఉండాలి) అని మరల వరుడు తలంబ్రాలు  వేస్తాడు. ఇలా వధూవరులు బాసలు చేసుకుంటూ ఆనందంతో ముచ్చటగా మూడుసార్లు పోసుకున్నతర్వాత ఇద్దరు కలిసి 
'శ్రియో మే కామ స్సమృధ్యతామ్' (మాకు కావాల్సిన సిరిసంపదలు సమృద్ధిగా ఉండాలి) 'యశో మే కామ స్సమృధ్యతామ్' (మేము కోరిన కీర్తిప్రతిష్టలు సమృద్ధిగా ఉండాలి) అని అంటూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. 
బ్రహ్మముడి:- వధువు చీరఅంచును వరుని ఉత్తరీయంఅంచును కలిపి ముడివేయడంను బ్రహ్మముడి అంటారు. పురోహితుడు ఇద్దరి కొంగులు ముడివేస్తూ ఈ మంత్రాన్ని చెప్తాడు -
'ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి: / ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్ //
భావం:- దాంపత్యసామ్రాజ్యాన్నిఅనుభవించే మీకు, రాజైన వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వాన్ని కలగజేయాలి. 
పాణిగ్రహణం:- వివాహమందు ఇదీ ఓ ప్రధానఘట్టమే. వధూవరులు పరస్పరం ఒకరిచేతిని ఒకరు పట్టుకుంటారు. 'నా పెద్దల లాగానే నేను కూడా మంచి సంతానం కోసం నిన్ను పాణిగ్రహణం చేస్తున్నాను. భగుడు, అర్యముడు సవిత అనే దేవతలు నా గృహస్థాశ్రమం కోసం నిన్ను గృహిణిగా చేస్తున్నారు అని అంటూ వధువుకు తన కుడిచేతిని అందిస్తాడు. వధువు వరునిచేతిని పట్టుకోవడంలో కూడా ఓ విశేషత ఉందని పెద్దలు చెప్తుంటారు. మొదట మగపిల్లవాడు కావాలంటే వరుడి బొటనవేలు మాత్రమే వధువు పట్టుకోవాలి. చిటికినవేలు పట్టుకుంటే ప్రధమ సంతానం ఆడపిల్ల అవుతుందని అంటారు. అందుకే ఆడమగ సంతానం అభిలాషిస్తూ అన్నివేళ్ళు కలిపి పట్టుకోమని అంటుంటారు.
సప్తపది:- పాణిగ్రహణం చేసిన తర్వాత వరుడు వధువుతో కల్సి తూర్పుకుగాని, ఉత్తరందిశగా గాని ఏడడుగులు వేయడాన్నే సప్తపది అంటారు. దీనివలన ఇద్దరిమద్య స్నేహబంధం ఏర్పడుతుంది. ఇక్కడ వరుని వెంట వధువు వేస్తున్న ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క ప్రయోజనం వుందని వరుడు వధువుకి ఇలా వివరిస్తాడు - నీవు నా వెంట నడు. విష్ణుమూర్తి, నీవు నాతో వేసిన మొదటి అడుగు వలన అన్నాన్ని, రెండవఅడుగువలన బలాన్ని, మూడవఅడుగువలన మంచికార్యాలను, నాల్గోఅడుగువలన సౌఖ్యాన్ని, ఐదోఅడుగువలన పశుసమృద్ధిని, ఆరోఅడుగువలన రుతుసంపదలను, ఏడోఅడుగువలన ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించుగాక! 
ఏడడుగులు వేసిన తర్వాత వరుడు వధువుతో మరల ఇలా అంటాడు...
సఖా సప్తపదా భవ. సఖాయౌ సప్తపదా బభూవ. సఖ్యంతే గమేయం. సఖ్యాంతే మా యోషం. సఖ్యాన్మే మా యోష్టాః సమయావ. సంకల్పావహై. సంప్రియౌ రోచిష్నూ సుమనస్యమానౌ ఇష మూర్జ మభి సంవసానౌ సం నౌ మనాంసి సంవ్రతా సముచిత్తాన్యకరమ్.
భావం:- నాతో ఏడడుగులు నడిచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరం కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులమౌతాం. అప్పుడు నేను నీ స్నేహాన్ని ప్రేమను పొందుతాను. నీ స్నేహన్నుంచి ఎన్నటికి వియోగం పొందను. నా స్నేహంనుంచి నీవెన్నడూ వియోగం పొందకు. పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలిసి వుందాం. కలిసి ఆలోచించుకుందాం. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాం. అలాగే అన్ని నియమాల్లోను కలిసి ఉంటూ నడుచుకుందాం.
అరుంధతీ నక్షత్రం:- వివాహం జరిగిన తర్వాత వధూవరులకు ధ్రువనక్షత్రమును, తర్వాత అరుంధతీ నక్షత్రమును పురోహితుడు చూపించి నమస్కారం చేయమని చెప్తాడు. ఎందుకంటే వారు ధ్రువనక్షత్రంలాగా నిశ్చలమైన మనస్థత్వాలతో స్థిరంగా వుండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత కావాలనే ఉద్దేశ్యం ఇందులో వుంది.
వధూవరులబాసలు:- మొత్తం వివాహ ఘట్టంలో వధూవరులమద్య హైందవ జీవనానికి ప్రయోజనం కలిగించే బాసలు ఎన్నో వుంటాయి. అందులో కొన్ని ...
వరుడు ఇలా కోరుకుంటాడు - 
లోకోపకార స్వభావంగల అగ్నిదేవుడు ఈ వధువుకు వివాహం అయిన తర్వాత పుట్టింట మీద మమకారం తగ్గించి అత్తింటి మీద అభిమానం కలదానిగా చేయాలి. బ్రహ్మదేవుడు మా ఇద్దరికీ సకలసంపదలను ఇచ్చి దీర్ఘాయుష్యాన్ని అనుగ్రహించాలి. సుమంగళిగా, సౌభాగ్యవతిగా, దీర్ఘాయుష్యంతో ఉండే ఈ వధువును ఇంకా ఇంకా సుమంగళి, సౌభాగ్యవతి, దీర్ఘాష్మంతురాలు కావాలని పెద్దలైన మీరందరూ ఆశ్వీరదించి మీ మీ ఇండ్లకు వెళ్ళండి అని కోరుతాడు.
వధువు ఇలా కోరుకుంటుంది - 
నిన్ను నా అభిప్రాయంలను ఎరిగినవాణ్నిగాను, మంచి సంస్కారంతో పుట్టినవాడిగాను, మంచినియమాలతో నిజాయితితో పెంచుకున్న తేజస్సుగలవానిగా నేను గ్రహించాను. సంతానాభిలాషగల నీవు నాతో సంతానాన్ని కని, ధర్మంగా సిరిసంపదలను సంపాదించి సుఖంగా జీవితాన్ని గడపాలి అని కోరుకుంటుంది.
అటుపై వధూవరులిద్దరు ఇలా కోరుకుంటారు - 
సమంజంతు విశ్వే దేవా స్సమాపో హృదయాని నౌ / సం మాతరిశ్వా సం ధాతా సముదేష్ట్రీ దిదేష్టు నౌ //
భావం:- విశ్వదేవులు, పవిత్రజలాలు, వాయువు, బ్రహ్మ మన మనస్సులను ఎన్నటికీ స్నేహంతో కలిసిపోయేటట్లు చేయాలి. వాగాధిదేవత సరస్వతి మనమెప్పుడు ప్రేమతో అభిమానంతో అనుకూలంగా మాట్లాడుకొనేటట్లు అనుగ్రహించాలి అని కోరుకోగా ...
పెద్దలు ఇలా ఆశ్వీరదిస్తారు -
అభివర్ధతాం పయసాభిరాష్ట్రేణ వర్ధతామ్ / రయ్యా సహస్రపోషసే మౌస్తా మనపేక్షితౌ //
భావం:- ఈ వధువు పాడిపంటలతోను, ఇండ్లతోను, భూములతోను, సంపదతోనూ, సకలసౌఖ్యలతో తులతూగుతూ మాకందరికీ అభివృద్ధిని కలిగించాలి. ఈ దంపతులు సకల సంపదలతో, సర్వ సమృద్ధి లతో దేనికీ ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి.
పుత్రిణేమా కుమారిణా విశ్వమాయుర్వ్యశ్నుతమ్ / ఉభా హిరణ్యపేశసా వీతిహోత్రా కృతద్వసూ //
భావం:- పదహారువన్నెల బంగారంలాగా పచ్చగా ప్రకాశిస్తున్న ఈ కొత్తదంపతులు కొడుకులు, కూతుళ్ళతో ఈ సమాజంలో మంచిపనులు చేస్తూ, సిరిసంపదలనుభవిస్తూ దీర్ఘాయుష్యాన్ని పొందాలి.
వధూవరులకు కొన్ని సూచనలు -
పెళ్లన్నది నూరేళ్ళ పంట అని, ఏడేడు జన్మలబందమని పెద్దలంటారు. ఇటువంటి బందాన్ని ఆనందంగా అన్యోన్యతగా ఉండాలనుకుంటే దంపతులమద్య చక్కటి అవగాహన, పరస్పర నమ్మకం, సానుకూలదృక్పదం తప్పనిసరిగా ఉండాలి. 
అనుకోనిసందర్భాలయందు ఏ పరిస్థితులకారణంగానైనా ఇద్దరిమద్య కోపతాపాలు, పట్టింపులు చోటుచేసుకున్నప్పుడు మనది జీవితకాల శాశ్వతబందమన్న సత్యాన్ని మరువక కాస్త సర్దుకుపోవడం ఇద్దరికీ తప్పనిసరి.
జీవితరధానికి ఇద్దరు రెండుచక్రాలు. కనుక దంపతులు వారివారి సమస్యలను, మాటపట్టింపులను అనురాగంతో అవగాహనతో వారే పరిష్కరించుకోవడం ఉత్తమం.
భిన్నకుటుంబంలో పుట్టి విభిన్న వాతావరణంలో పెరిగిన వధువు, వరుడు వివాహం ద్వారా దగ్గరౌతారు. తమని ఒకటిచేసిన వివాహబంద విలువను గ్రహించి వారివారి భావనలను అలవాట్లును అర్ధవంతంగా ఆరోగ్యవంతంగా ఒకటిగా చేసుకొని నడుచుకోవాలి.
భర్తకు సంబందించిన అన్ని బాధ్యతలందు భార్య పాలుపంచుకోవాలి. భర్తను అనుసరిస్తూ, అతనిని అర్ధంచేసుకుంటూ మనస్సులో మనసై, తనువులో తనువై ఆనందంగా ప్రవర్తించాలి. మృదుమధురంగా మనుగడ సాగిస్తూ మగని మన్నన పొందగలగాలి. కుటుంబగౌరవప్రతిష్టలు ఇల్లాలిపైనే ఆధారపడివుంటుంది కాబట్టి భర్త కుటుంబంను భార్యగా, కోడలుగా, వదినగా, తల్లిగా చక్కగా నేర్పుగా ఇంటిలో పెద్దల సలహాలతో నిర్వహించగలగాలి. అత్తవారింట్లో అత్తమామయ్యలను, ఆడబిడ్డలను, తోడికోడళ్ళను, బావామరుదులను, ప్రేమగా చక్కగా చూసుకుంటూ ఇంటికి దీపంలా వెలుగొందాలి.
కుటుంబఅభివృద్ధిని, అందరిహితంను కోరే భర్త ఎప్పుడూ తన భార్యను తనతో సమానంగానే భావించాలి. అందరినీ వదిలి తనచేయి పట్టుకొని ఎంతో నమ్మకంతో సహధర్మచారిణిగా తన ఇంటికి వచ్చిందన్న భావనతో భార్యను ప్రేమగా అర్ధంచేసుకుంటూ ఆమెను చక్కగా చూసుకోవాల్సిన భాద్యత భర్తదే. 
శ్రీరస్తు                                                                శుభమస్తు                                                                                  


                                                    

12 కామెంట్‌లు:

  1. ఎంతో విలువయిన సమాచారం! ఈ కాలం యువత కాస్త నేర్చుకుని అన్నీ పాటించినా పాటించకపోయినా కనీసం తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది! అద్భుతం!

    రిప్లయితొలగించండి
  2. @ ఎందుకో? ఏమో! శివగారూ,
    థాంక్స్!

    రిప్లయితొలగించండి
  3. ఎంతో విలువయిన సమాచారం! ఈ కాలం యువత కాస్త నేర్చుకుని అన్నీ పాటించినా పాటించకపోయినా కనీసం తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది! అద్భుతం!

    రిప్లయితొలగించండి
  4. శ్రావణి గారు!
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. Excellent భారతిగారు .. దాంపత్యజీవన ప్రయాణం ఒక అద్భుతం .. ఆ జీవన మాధుర్యాన్ని వివరింపఁఎవరి తరం కాదు... వివాహానికి ముందుగా వధూ వరులకు ఈ విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వగలిగితే బాగుండును ... చాలా చక్కని వివరణ ... GOD BLESS YOU ...TRAIN LO MOBILE LO CHADIVINA VENTANE VIVARAMGAA COMMENT POST CHEYALEKA POYAANU BHARATIGARU ..

    రిప్లయితొలగించండి
  6. భారతిగారు ఈరోజు వాట్సప్లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్ చూడగానే కొద్దిరోజుల క్రితం మీ బ్లాగ్లో చదివిన ఈ పోస్ట్ గుర్తుకువచ్చింది. మనకు వచ్చిన ఆ మెసేజ్ను ఇక్కడ వ్యాఖ్యగా పెడుతున్నాను.


    *పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు*

    *మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం*

    ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,చిత్తచాంచల్యం,అన్యోన్యత లేకపోవటం భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం

    *జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం*

    ఫలితం: దీనివల్ల (వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం) (పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం‌ ఆచరించాకే మిగతావి)
    కలిగే నష్టం వారిమధ్య ప్రేమ లోపించటం

    *ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం*

    ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం

    *తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం*

    ఫలితం: దీనివలన బంధు ద్వేషం ఆర్థిక ఇబ్బదులు

    *బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం*

    ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం

    బఫే భోజనాలు

    ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం*

    *వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటిస్థానంలో సినిమా పాటలు వినటం*
    ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం
    ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....
    అందరికి చెప్పండి, చెప్పక పోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు. వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచన తో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి. అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరే టట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇది శాస్త్ర ప్రమాణాలు ను అనుసరిస్తూ observe చేసినది. Stright గా శాస్త్రం లో ఎక్కడా లేదు🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  7. వివాహం గురించి చక్కని విషయాలు తెలియ జేసారు.ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి