వేసవికాలం.... ఉదయమంతా ఎప్పటిలా నేనూ, లావణ్య మా
ఈడువారందరితో కల్సి ఒకటే అల్లరి. ఆటలూ, పాటలు, కబుర్లుతో గడిపేశాం.
సాయంత్రమున పొలాల గట్లుపై పరుగులు. తోటలో మామిడికాయలు రైతుతో కోయించుకొని,
ఇంట్లో పొట్లం కట్టుకొని తీసుకెళ్ళిన ఉప్పూ, కారముపోడిలో అద్దుకొని తినడం,
కొబ్బరిబొండాలు దింపించుకొని త్రాగడం, లేత తాటిముంజులు పోటీలు పెట్టుకొని
తినడం, బాగా ప్రొద్దు పోయేంతవరకు తిరిగి తిరిగి ఇంటికి చేరడం..... రాత్రికి
ఆరుబయట నవ్వారు మంచాలుపై బొంతలేసుకొని మా తెలుగుమాస్టారు చెప్పిన కబుర్లు,
ఆ అత్తయ్య (మాస్టారుగారి భార్య) తన మనవడుకు చెప్పే కధలు వింటూ పడుకోవడం ఓ
అలవాటు. ఎప్పటిలా ఆ
రోజు కూడా ఆరుబయట పడుకొని అత్తమ్మ చెప్పే కధని వింటున్నాం. అది ఏడుచేపల
కధ. ఎన్నోసార్లు విన్న కధ, అయినా అత్తమ్మ చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాం.
కధ కంచికి, మనమింటికీ....అంటూ కధ పూర్తిచేసిన అత్తమ్మ -
'అవునూ..... మన పురాణాల్లో
ఉన్న కధలలోనే కాదు, మన పెద్దలు చెప్పిన కధల్లో, సామెతల్లో కూడా ఎంతో
లోగుట్టు ఉంటుందని అంటారు కదా! మరి ఈ ఏడుచేపల కధలో కూడా ఏదైనా మర్మముందా?
అని మాష్టారుగార్ని ఆవిడ అడిగారు. ఓ అందులో కూడా చక్కటి అంతరార్ధం ఉందని
మాష్టారుగారు అనగానే అందరం గబాలున లేచి మాష్టారుగారి చుట్టూ చేరిపోయాం.
అందరికీ తెలిసిన కధే అయినా ఓసారి ఆ కధను మననం చేసుకుందాం. అటుపై మాస్టారుగారు ఏం చెప్పారో తెలుసుకుందాం.
అనగనగా
ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు. ఏడు
చేపలు తెచ్చారు. ఎండలో పెట్టారు. అందులో ఓ చేప ఎండలేదు. ఇక ప్రశ్నలు
మొదలయ్యాయి...
చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డువచ్చింది.
గడ్డిమోపా గడ్డిమోపా ఎందుకు అడ్డువచ్చావు? ఆవు మేయలేదు.
ఆవా ఆవా ఎందుకు గడ్డిని మేయలేదు? పాలేరు తాడు విప్పలేదు.
పాలేరా పాలేరా తాడు ఎందుకు విప్పలేదు? అవ్వ బువ్వ పెట్టలేదు.
అవ్వా అవ్వా బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు.
పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు? చీమ కుట్టింది.
చీమా చీమా ఎందుకు కుట్టావు? నా బంగారుపుట్టలో చేయిపెడితే కుట్టనా?
ఇది అత్తమ్మ చెప్పిన కధ. దీనికి మాస్టారుగారు ఇచ్చిన వివరణ -
ఈ కధలో రాజు అనగా ఓ
సాధకుడు. ఆ సాధకుని దేహంలో వున్న ఏడు చక్రాలు (మూలాధార, స్వాధిష్టాన,
మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం) ఏడుగురు కొడుకులు.
ఆ ఏడుగురు కొడుకులు వేటకి
అంటే ధ్యానస్థితికి వెళ్ళిరి. ఏడు చేపలు తెచ్చారనగా తన ధ్యానంకు అవరోధమైన
మనస్సు, అరిషడ్వర్గములు అని తెలుసుకున్నారు. సాధన అనే ఎండలో ఈ ఏడింటిని
ఎండబెట్టారు. అందులో మనస్సనే చేప ఎండలేదు. ఎందుకెండలేదన్న విచారణ
ప్రారంభమైంది.
మనసా, మనసా ఎందుకు ఎండలేదు? అవివేకం అడ్డు వచ్చింది.
అవివేకమా, అవివేకమా ఎందుకు అడ్డువచ్చావు? వివేకం మేయలేదు.
వివేకమా, వివేకమా ఎందుకు మేయలేదు?బుద్ధీ అనబడే పాలేరు మా యనే తాడుని విప్పలేదు.
బుద్ధీ, బుద్ధీ ఎందుకు విప్పలేదు? భక్తీ అనబడే అవ్వ జ్ఞానమనబడే బువ్వని పెట్టలేదు.
భక్తీ, భక్తీ ఎందుకు బువ్వ పెట్టలేదు? ప్రాపంచిక బంధాలు ఏడిపిస్తున్నాయి.
ప్రాపంచిక బంధాలూ, ప్రాపంచిక బందాలు ఎందుకు ఏడిపిస్తున్నారు? వైరాగ్యం కుట్టింది.
వైరాగ్యమా, వైరాగ్యమా ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో చేయి పెడితే కుట్టనా?
ఇప్పుడు ఈ కధను చివరనుండి మొదటకి జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటూ మాస్టారుగారు ఇలా వివరించారు -
పుట్ట
అంటే వ్యక్తి దేహమని అర్ధం. నేలమీద కూర్చున్నప్పుడు దేహం ఎలా క్రింద
విశాలంగా ఉంటుందో, పైకి పోనూ పోనూ ఎలా దేహం సన్నగా ఉంటుందో పుట్ట కూడా అదే
మాదిరిగా క్రింద విశాలంగా, పైకి వెళ్తున్నకొలదీ సన్నగా ఉంటుంది. మానవదేహంలో
నవరంద్రాలు ఎలా ఉంటాయో పుట్టకు కూడా ఎన్నో రంద్రాలు ఉంటాయి. ప్రతీ మనిషికీ
ఎప్పుడో ఒకప్పుడు ఏమిటీ జన్మ అని అన్పిస్తుంది. అలా అన్పించినప్పుడు
కొందరిలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కల్గి అంతర్ముఖం అవుతారు. పుట్టలో చేయి
పెట్టడమంటే ఆధ్యాత్మిక జిజ్ఞాసతో అంతర్ముఖం కావడం. అలా అంతర్ముఖం కావడం
వైరాగ్యమనే చీమ కుట్టినప్పుడు కల్గుతుంది. వైరాగ్యం కల్గినప్పుడు ప్రాపంచిక
బందాలు ఎంత దుఃఖపూరితమో గ్రహిస్తాడు. భక్తి జ్ఞానమనే బువ్వని పెడుతుందని
గ్రహించి బుద్ధితో మాయ అనే తాడుని విప్పుకుంటాడు. అప్పుడు వివేకం కల్గి
అవివేకమనే అడ్డుని తప్పిస్తుంది. అప్పుడు అరిషడ్వర్గాలుతో పాటు మనస్సు కూడా
ఎండి అంటే నశించి ధ్యానం బాగా కుదిరి కుండలినీశక్తితో సప్తచక్రాలు
అధిరోహించిన సాధకుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. మానవుడే
మాధవుడవుతాడు.
కధ కంచికి, మనం జ్ఞానమింటికి.
excellent narration.
రిప్లయితొలగించండిరమేష్ గారు,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
చక్కగా ఉన్నది. తెలిసింది మరో కోణంలో. మరిన్ని ఆశిస్తున్నాను. అభినందన.
రిప్లయితొలగించండిమీ ఈ స్పందన ఎంతో స్పూర్తినిస్తుంది. మీకు నా ధన్యవాదములు.
తొలగించండిహే! ఎన్నాల్టికి నాకు తెలిసిన కథ పెట్టారో! నిజానికి దీనికి సంబంధించి ఒక టపా వేద్దామని నేను అనుకుంటున్నా ఈ లోపు మీరు పెట్టేసారు!
రిప్లయితొలగించండిఅవునా! ఇప్పుడైనా మీ కోణంలో మీ అద్భతమైన భావనలను అవిష్కరించండి రసజ్ఞ. ఎదురుచూస్తుంటాను మీ పోస్ట్ కై.
తొలగించండిభారతిగారు,
రిప్లయితొలగించండిఈ కధను ఇలా కూడా విశ్లేషించవచ్చు అని అన్పిస్తుంది.
నిరంతరం జలమునందు ఈదులాడే స్వభావముగల చేపలను, సంసార సాగరంలో ఈదులాడే మనిషిలో ఉన్న చంచలత్వమునకు (చంచలస్వభావమునకు) కారకములైన సప్తవ్యసనాలతో కూడా పోల్చవచ్చు.
సప్తవ్యసనాలు- వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనంబు, దండ పరుషం, ధనం వృధాగా ఖర్చు చేయడం.
ఏడు చేపలను ఎండబెట్టారు. ఓ చేప ఎండలేదు. పై ఏడు వ్యసనాలలో ఒకటి ఎండలేదు. ఎండలేదంటే మీకు అర్ధం తెలుసుకాబట్టి వివరించడం లేదు.
ఇక ప్రశ్నల పరంపరలను పరిశీలిస్తే -
చేపా చేపా ఎందుకు ఎండలేదు అంటే గడ్డిమోపు అడ్డువచ్చింది. గడ్డిమోపు అంటే అజ్ఞానం. అంటే ఇక్కడ అజ్ఞానం అడ్డువచ్చింది. ఎందుకడ్డువచ్చిందంటే ఆవు మేయలేదు. జ్ఞానత్వానికి ప్రతీక ఆవు. జ్ఞానం అజ్ఞానంను మేయలేదు. ఎందుకు మేయలేదంటే పాలేరు విప్పలేదు. ఆవుకు రక్షకుడు పాలేరైతే, జ్ఞానంకు సంరక్షకుడు గురువు. గురువు విప్పలేదంటే గురువు అజ్ఞానాన్ని పోగెట్టే జ్ఞానాన్ని అందివ్వలేదు. గురువు ఎందుకందివ్వలేదంటే అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ అంటే జగన్మాత. బువ్వ అంటే అనుజ్ఞ. జ్ఞానస్వరూపిణి అయిన ఆ జగన్మాత ఆజ్ఞ ఇవ్వలేదు, అందుకే నేను పెట్టలేదు అని గురువంటాడు. తల్లీ! జ్ఞానబోధను ప్రసాదించమని గురువుకు ఎందుకు ఆజ్ఞ ఇవ్వలేదంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అందట. జ్ఞానాన్ని అందుకునే పరిపక్వత లేకపోవడంచే ఇంకా భోగభాగ్యాలు కావాలని పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అర్ధం. పిల్లవాడిని ఎందుకేడుస్తున్నావంటే చీమ కుట్టింది అని అన్నాడట. చీమంటే కోరిక. కోరిక ఎందుకు కల్గిందంటే నా బంగారుపుట్టలో వేలెడితే కుట్టనా అందట. బంగారుపుట్ట అంటే ఆశలపుట్ట. వేలు అంటే మనస్సు. ఆశలన్నవి వాటంతట అవి దరిచేరవు. మనస్సు పెడితేనే పట్టుకుంటాయి.
సత్యవాణిగారు! మీ విశ్లేషణ బాగుంది. మరోకోణంలో ఈ కధని తెలియజెప్పారు. మరింతగా ఆధ్యాత్మిక అవగాహనకు మీ వివరణ దోహదపడుతుంది. మీకు నా ధన్యవాదములు.
రిప్లయితొలగించండితేది గుర్తు లేదు కాని ఈమద్యనే భక్తి టివీ చానెల్ లో మహా సహస్రావదహని శ్రీ గరికిపాటి నరసిం హా రావుగారు "మహాభారతానికి సామజిక వాఖ్య" అనే ధారావాహిక లో భగవద్గీతలోని ఒక "సంకల్పాన్ని జ్ఞానాగ్ని లో దహనం చెసినవాడు నిజమైన పండితుడనబడతాడు" అన్న శ్లోకార్ధానికి ఈ ఏడు చేపల కధని అన్వయిస్తూ ఈ విధంగా చెప్పారు. "ఏడు చేపలంటే మనలోని అరిష్డ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మధ, మోహ, మరియు మాత్సర్యములు. ఈ ఆరు ఆరు చేపలకు ప్రతీకలు మరి యెడవ చేప సంకల్పానికి ప్రతీక. నిజానికి ఈ అరిషడ్వర్గాలు విడి విడిగా కనిపిస్తున్న కామం పెరిగితే అది మోహం గాను, క్రోధం పెరిగితే మదమంగాను, లోభం పెరిగెతే మాత్సర్యం(అసూయా) గా మారుతాయి. అలాగే కామ, క్రోధ, లోభాలు అంకురించడానికి కారణం మనస్సులో కలిగే "సంకల్పం" ఇదే యెండని ఏడవ చేప, ఇది ఎందుకు ఎండలేదంటే అజ్ఞానమనే గడ్డి అడ్డుపడింది, గడ్డి ఎందుకడ్డుపడిందటే ఆవు(జ్ఞానం) మేయలేదు అంటే గొల్లవాడు(గురువు/శ్రీ కృష్ణుడు) మేపలేదు(బోధించలేదు) గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అవ్వ (జగన్మాత) బువ్వ) పెట్టలేదు (ఆజ్ఞాపించలేదు). అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదంటే వేరొక చిన్నపిల్లవాడు యేడుస్తున్నడందట (ప్రాపంచిక విషాయలమేద విరక్తి కలిగి(పుట్టలో వేలుపెట్టి చీమ కుట్టటం వల్ల) జ్ఞానాన్నీపొంది ముక్తి కై తప్పస్సు చేస్తున్న వేరొక సాధకుడు ఆర్తితో(ఏఎడవటం) మోక్షం కోరుతున్నాడు. పిలుస్తున్నాడు. మనస్సులో సంకల్పాలు నశించనతకాలం ఎంత కోరిన ముక్తి లభించదు"
రిప్లయితొలగించండి--- ఇది గరికిపాటి వారి అద్భుత వ్యఖ్యనానికి నా అక్షర రోపం దీనిలో ధొషాలెమైన వుంటే అది నా అవగాహనాలోపమే గాని వారికి చెందదవు.
kuchimanchiprasad.wordpress.com
ప్రసాద్ గారు!
రిప్లయితొలగించండిచక్కటి వివరణ. ఆధ్యాత్మిక అవగాహనను పెంపొందించే విశ్లేషణ. చాలా బాగుందండి.
చక్కటి వివరణ తెలిపినందుకు మీకు నా ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండి*ఏడు చేపల కథకు మరో ఆధ్యాత్మిక వివరణ .*
*రాజుగారు అంటే మనిషి.*
*ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.*
*కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.*
*జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.*
*రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే.*
* మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు (అనగా 6)*
*1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు.*
*వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.*
*అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు.*
*రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.*
*ఏమిటా చేప. అది మనస్సు.*
*దీన్ని జయించడం చాలా కష్టం.*
*ఎంత ప్రయత్నించినా అది ఎండదు.*
*మనస్సు అంటే ఏమిటి*❓
*మనస్సు అంటే సంకల్ప వికల్పాలు*
*ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.*
*మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.*
*కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.*
*మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.*
*ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.*
*ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓గడ్డిమేటు.*
*గడ్డిమేటు అంటే ఏమిటి?*
*కుప్పపోసిన అజ్ఞానం.*
*గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా?*
*మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.*
*కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️*
*ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.*
*దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.*
*మరి అది పోవాలంటే ఏం చేయాలి❓*
*ఆవు వచ్చి మేయాలి.*
*ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓*
*ఆవు అంటే జ్ఞానం.*
*జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.*
*లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.*
*అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)*
*జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.*
*ఈ గోవును ఎవ్వరు మేపాలి.*
*గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓*
*సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.*
*జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️*
*అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.*
*ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.*
*ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.*
*ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓*
*అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.*
*ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.*
*ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.*
*ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.*
*ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓*
*వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.*
*సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.*
*ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది. మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా.లేదు.అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.*
*చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,*
*మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.*
*చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓*
*మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.*
*ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.
సేకరణ : వాట్సాప్