16, డిసెంబర్ 2012, ఆదివారం

గుప్పెడంత గుండెలో ...

ఈ రోజు శ్రీమద్భగవద్గీత చదవాలనిపించింది. పనులన్నీ అయ్యాక గీత తీసాను. పద్దెనిమిది అధ్యాయములలో ఏది చదవాలి? కళ్ళు మూసుకొని కృష్ణుడును తలచుకుంటూ ఓ పేజీ తెరిచాను. తెరిచిన పుటలో కళ్ళకు ఎదురుగా ఉన్న శ్లోకమును చదివాను. 

అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్ /
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః //

అంత్యకాలమందు ఎవడు నన్నే స్మరించుచూ దేహమును విడిచిపెట్టునో, వాడు నా స్వరూపమును పొందుచున్నాడు. ఇందులో సందేహం లేదు.

హమ్మయ్య....... మరణించేముందు కృష్ణున్ని తలుచుకుంటే చాలు. కష్టపడకుండా, ఇతరత్రా సాధనలు చేయకున్న ముక్తిని పొందేయవచ్చు.... అని మనస్సు మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంతలోనే కన్నయ్య నా బుద్ధిని మేల్కొపి, మదిని మాయను తెలిపి, 'ముకుందమాల'లో ఓ శ్లోకాన్ని గుర్తుచేశాడు.

కృష్ణ త్వదీయపదపంకజపంజరాన్తమ్ 
      అద్యైవ మే విశతు మానసరాజహంసః 
ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తై:
       కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే 

ఓ కృష్ణా! ఈ క్షణమే నా మానసరాజహంస నీ పాదపద్మతూళ్ళ వల యందు ప్రవేశించుగాక. మరణసమయమున గొంతు కఫవాతపిత్తములతో పూడుకుపోయినప్పుడు నిన్ను స్మరించుట నా కెట్లు సాధ్యపాడగలదు?

నిజమే కదా - 
అసలు మరణం ఎప్పుడొస్తుందో తెలియదు. తెలిసిన మరణసమయమున ఏ అనారోగ్యం చేతనయినను కృష్ణుడిని తలచుకోలేకపోవచ్చు, తలుచుకోవాలన్న జ్ఞాపకం కూడా రాకపోవచ్చు. అంతవరకు జీవించినకాలంలో స్మరణలో లేనిది ఆ క్షణంలో స్పురణకు ఎలా వస్తుంది? ఊహు.... రాదుగాక రాదు. అందుకే అంతా సవ్యంగా ఉన్నప్పుడే భగవంతుని పాదారవిందాలను పట్టుకోవాలి.

అరవిందం అంటే ఒకానొకప్పుడు గురువల్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలు లీలగా గుర్తుకొస్తున్నాయి -
ఓసారి గురువుగారు తన ప్రవచనంలో...
ముఖారవిందం, హస్తారవిందం, పాదారవిందం అని ఎందుకంటారో తెలిపారు. 
అరవిందం అంటే పద్మం. ఈశ్వరుని పాదాలను, చేతులను ముఖమును ఈ అరవిందాలతో (పద్మాలతో) ఎందుకు పోల్చుతారంటే -
షట్పది అంటే తుమ్మెదని అర్ధం. ఆరుపాదములు గల తుమ్మెద పద్మం కనిపించగానే మకరందంకై వెళ్లి పట్టుకుంటుంది. అలానే పంచేద్రియములు + మనస్సు అనే ఆరింటితో పద్మాల్లాంటి ఈశ్వరుని పాదాలను ఆశ్రయించాలని కవులు వర్ణిస్తారని చెప్పారు.


అయ్యబాబోయ్......... నా గుప్పెడంత గుండెలో కరుణారసామృతుడైన నా చిట్టి కిట్టయ్య లేకపోతే ఇవేవీ నాకు జ్ఞాపకం రాక, నేనీ మనోమాయలో పడిపోదును కదా.

ఓ కృష్ణా! ఈ మనోమాయలో పడకుండా నీవే సదా మము రక్షించుగాక!


                                         శరీరం దైవదత్తం - మనస్సు మానవ కల్పితం 
                                           బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్షసిద్ధి తధ్యం 

10 కామెంట్‌లు:

  1. భారతి గారు.. చాలా బావుంది. చంచలమైన మనసు మాయలో పడకుండా ఈశ్వరుని పాదారవిండం ని ఆశ్రయించడం గురించి చక్కగా చెప్పారు. ధన్యవాదములు.

    అన్నట్టు ఒక మాట.బైబిల్ చదివే వారు కూడా కనులు మూసుకుని బైబిల్ తెరచి వచ్చిన పేజీలో ఉన్నదానికి ఆ రోజు అన్వయించుకోవడం ని గమనించాను. ఇవన్నీ మనుషుల నమ్మకాలేమో!

    రిప్లయితొలగించండి
  2. వనజ గారు! మీకు నచ్చి మీ స్పందనను తెలియజేసినందుకు సంతోషంగా ఉంది. మీకు నా ధన్యవాదాలు.
    బైబిల్ చదివేవారి సంగతి నాకు తెలియదు గానీ, అప్పుడప్పుడూ ఇలా చదివే అలవాటు నాకుందండి.

    రిప్లయితొలగించండి
  3. భారతి గారు.. చాలా బావుంది... ధన్యవాదములు....

    రిప్లయితొలగించండి
  4. బాగుందండి....గుప్పెడంత గుండెలో చిన్ని కిష్టయ్య....పిచ్ చాలా నచ్చింది

    రిప్లయితొలగించండి
  5. చాలా చక్కటి విషయాలను తెలియజేసారండి.
    చిత్రాలు కూడా ఎంతో బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  6. చాలా మంచి విషయం చెప్పారు భారతి గారు.. నాకూ ఆ అలవాటు వుంది .. ఒకోసారి పుస్తకం మన ముందు వున్నప్పుడు మనలో ఆ సమయంలో వున్న ఆలోచనలకు తగ్గట్లుగా సరియైన సమాధానం దొరుకుతుంది. అది ఆ భగవంతుని లీలయే కదా....

    రిప్లయితొలగించండి
  7. ప్రిన్స్ గారు!
    మీ స్పందన తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  8. పద్మగారు!
    మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి. అంతరాన మెదిలే భావానికి తగ్గ చిన్ని కిష్టయ్య చిత్రం గూగుల్ సెర్చ్ లో చూడగానే నన్ను ఆకట్టుకుంది. కృష్ణ అంటే ఆకర్షించువాడని అర్ధముంది. మరోసారి మీకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. అనురాధ గారు!
    అంతరాన కదిలాడే విషయాల్నే తెలిపాను. మీకు ఈ పోస్ట్ మరియు చిత్రాలు కూడా నచ్చి, తెలిపిన మీ స్పందనకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  10. రుక్మిణీదేవి గారు!
    మీ ఈ స్పందనకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి