13, ఏప్రిల్ 2013, శనివారం

నా రామయ్య జననం ... కళ్యాణం!

                                  శ్రీరామ జయరామ జయజయ రామ 
రామజననం

మధుమాసే సితే పక్షే నవమ్యాం కర్కటే శుభే /
పునర్వస్వ్రక్షసహితే  క్షసహితే ఉచ్ఛస్థే గ్రహపంచకే //

చైత్రమాసం శుక్లపక్షమున నవమినాడు, శుభకరమగు కర్కాటక లగ్నమందు, పునర్వసు నక్షత్రమున ఐదుగ్రహములు ఉచ్ఛస్థానములో యుండగా, సూర్యుడు మేషరాశి యందుండగా మధ్యానకాలమందు సనాతనుడగు పరమాత్మ కౌసల్యకు ఆవిర్భవించెను.


యస్మిన్ రమంతే మునయో విద్యయా జ్ఞానవిప్లవే /
తం గురు: ప్రాహ రామేతి రమణాద్రామ ఇత్యపి //
                                                                                   
జ్ఞానం ద్వారా అజ్ఞానం నశించిపోయిన తరువాత, మునులు ఎవరియందు రమింతురో, ఎవరు తన సౌందర్యంచే భక్తజనుల చిత్తములను ఆనందింపచేయునో అతనికి "రాముడ"ని గురువు వశిష్టుడు పేరు పెట్టెను.

భరణాద్భరతో నామ లక్ష్మణం లక్షణాన్వితమ్ /

శత్రుఘ్నం శత్రుహన్తారమేవం గురురభాషత //


జగత్తును భరించినవాడు కావున రెండవ పుత్రునకు (కైకయి కి పుట్టినవానికి) "భరతుడ"ని, (ఇక సుమిత్రకు పుట్టిన ఇద్దరికి) సమస్త శుభలక్షణ సంపన్నుడు కావున మూడవ వానికి "లక్ష్మణుడ"ని, శత్రుహంత యగుటచే నాల్గవ వానికి "శత్రుఘ్ననుడ"ని వశిష్టులవారు పేర్లు పెట్టిరి. 




 రామకళ్యాణం
తమ రాజ్యమునకు వచ్చిన విశ్వామిత్రుడును, రామలక్ష్మణులును జనకుడు సాదరముగా స్వాగతించగా -
జనక మహారాజా! నీ వద్దనున్న శివధనస్సును చూడాలని రామలక్ష్మణులు అభిలాషించుచున్నారు. ఓసారి ఆ ధనస్సును వారికి చూపమని విశ్వామిత్రుడు అనగా -
అంతట జనక మహారాజు, జనక వంశీయులకు దేవతలు ప్రసాదించిన శివధనస్సును ఎవరు ఎక్కిపెడితే వారికే సీతనిచ్చి వివాహం చేయాలన్న తన సంకల్పమును విశ్వామిత్రునికి తెలిపి,  ధనస్సును తీసుకురమ్మని ఆజ్ఞాపించగా -
జనకుని ఆదేశంతో బలిష్టులైన ఐదువేలమంది పురుషులు ధనుస్సు ఉంచిన పెట్టెను లాక్కొని రాగా -
గురువాజ్ఞ తీసుకొని, అందరూ ఉత్కంఠతో చూస్తుండగా, ధనస్సును శ్రీరాముడు ఎక్కుపెట్టగా, విరిగిపోయిన ధనస్సును సర్వులూ ఆశ్చర్యానందాలతో వీక్షించగా -



 
తన ప్రతిజ్ఞ మేరకు తన ప్రాణతుల్యమైన పుత్రికను రామునికి ఇచ్చి వివాహం చేస్తానని జనకుడు అనగా-
విశ్వామిత్రుని సూచన మేరకు జరిగిన విషయలాను వివరిస్తూ ఆహ్వానపత్రికను దూత ద్వారా అయోధ్యరాజు దశరధునికి పంపగా -
అంతట దశరధుడు ఎంతో సంతోషంతో వసిష్ఠ వామదేవాదులతో, మంత్రులతో, చతురంగబలసైన్యంతో విదేహరాజ్యమును చేరగా -
దశరధుని కులగురువు వశిష్టుడు దశరధుని వంశవృక్షమును జనకునికి తెలపగా, జనకుడు తన వంశవృక్షమును దశరధునికి వివరించగా -
అనంతరం సీతారాముల కళ్యాణమునకు అంతా సన్నద్ధమవ్వగా -
అంగరంగవైభవముగా సీతారాముల వివాహం జరిగినది.




సీతారాముల వివాహం జరిగినరోజు సౌమ్యనామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, కర్కాటక లగ్నం అని పౌరాణిక కధనం. అయితే భగవంతుడు ఏ అవతారం ఏరోజున దాల్చితే, ఆ రోజునే ఆయన కళ్యాణం జరిపించాలన్న ఆగమశాస్త్రవచనం ప్రకారం; శ్రీరామనవమి నాడే రాముని జన్మదిన వేడుకలతోపాటు సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా, భక్తి పారవశ్యాలతో జరుపుకుంటున్నాం.

ఈ నెల 19 న "శ్రీరామ నవమి". 

 

5 కామెంట్‌లు:

  1. శ్రీరామ జననం...కల్యాణం, చక్కగా వివరించారండి.రెండింటిలోనూ కర్కాటక లగ్నం ఉంది కదూ.నాకు కొంచెం సంబంధం ఉంది లెండి. అందుకే కొంచెం సంతోషం:)

    రిప్లయితొలగించండి
  2. ఓహో ... కర్కాటక లగ్నంతో మీకు సంబంధం ఉందన్నమాట. మీ సంతోషం నాకు ఆనందమును కల్గిస్తుంది.
    ధన్యవాదములు జయగారు.

    రిప్లయితొలగించండి
  3. ఇంత వివరంగా మీరు మాత్రమే రాయగలరు భారతి గారూ,

    రిప్లయితొలగించండి
  4. మెరాజ్ గారు!
    బహుకాల దర్శనం ... బాగున్నారా?
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. బ్రహ్మ కొడుకు మరీచి

    మరీచి కొడుకు కాశ్యపుడు.

    కాశ్యపుడు కొడుకు సూర్యుడు.

    సూర్యుడు కొడుకు మనువు.

    మనువు కొడుకు ఇక్ష్వాకువు.

    ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.

    కుక్షి కొడుకు వికుక్షి.

    వికుక్షి కొడుకు బాణుడు.

    బాణుడు కొడుకు అనరణ్యుడు.

    అనరణ్యుడు కొడుకు పృధువు.

    పృధువు కొడుకు త్రిశంఖుడు.

    త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)

    దుంధుమారుడు కొడుకు మాంధాత.

    మాంధాత కొడుకు సుసంధి.

    సుసంధి కొడుకు ధృవసంధి.

    ధృవసంధి కొడుకు భరతుడు.

    భరతుడు కొడుకు అశితుడు.

    అశితుడు కొడుకు సగరుడు.

    సగరుడు కొడుకు అసమంజసుడు.

    అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.

    అంశుమంతుడు కొడుకు దిలీపుడు.

    దిలీపుడు కొడుకు భగీరధుడు.

    భగీరధుడు కొడుకు కకుత్సుడు.

    కకుత్సుడు కొడుకు రఘువు.

    రఘువు కొడుకు ప్రవుర్ధుడు.

    ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.

    శంఖనుడు కొడుకు సుదర్శనుడు.

    సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.

    అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.

    శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.

    మరువు కొడుకు ప్రశిష్యకుడు.

    ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.

    అంబరీశుడు కొడుకు నహుషుడు.

    నహుషుడు కొడుకు యయాతి.

    యయాతి కొడుకు నాభాగుడు.

    నాభాగుడు కొడుకు అజుడు.

    అజుడు కొడుకు ధశరథుడు.

    ధశరథుడు కొడుకు రాముడు.

    ఇది రాముడి వంశ వృక్షమట ...
    ======================

    శ్రీరామనవమి శుభాకాంక్షలు. .

    రిప్లయితొలగించండి