17, నవంబర్ 2013, ఆదివారం

హమ్మయ్య! కార్తీకపౌర్ణమి వచ్చింది, నా నేస్తమూ వచ్చింది, నా సందేహమూ తీరింది.

క్రిందటివారం తిరుపతి కంచి వెళ్లి, తిరుగు ప్రయాణం అయినప్పుడు ట్రైన్లో ఇద్దరు సాధకులు తాము అనుసరిస్తున్న 'సుషుమ్న నాడీ' ధ్యానవిధానమును తెలిపారు.
పతంజలి యోగసాధన, బుద్ధుని అనాపాన సతి, మాస్టర్ సి. వి. వి. ధ్యానయోగం, పరమహంస యోగానంద క్రియాయోగం, మహేష్ యోగి భావాతీత ధ్యానయోగం, శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీరమణుల నేనెవరిని అన్న విచారణయోగం, స్వామి శివానంద సగుణ నిర్గుణ ధ్యానపద్ధతి, బ్రహ్మకుమారీల రాజయోగం, మాతా అమృతానందమయి ఐ యామ్ టెక్నిక్, అరవిందుని ఇంటిగ్రల్ యోగం, ఋషి ప్రభాకర్ గారి యస్. యస్. వై ధ్యానపద్ధతి, శ్రీ భిక్షుమయ్య గారి యమ్. యమ్. వై ధ్యానపద్ధతి, పత్రీజీ పిరమిడ్ ధ్యానం ... ఇలా ... ఒక్కొక్కరు ఒక్కోలా ఈ ధ్యానయోగాన్ని అనుభూతిస్తూ, నిర్వచిస్తూ, సూచిస్తూ, తెలియజేస్తున్నను, ఈ ధ్యానప్రక్రియలన్నీ స్వస్వరూపస్థితిని తెలుసుకోవడానికే కదా, అని నాకన్పించింది.
ఇంతలో ఆ సాధకులు చెప్పినదంతా విన్న సహప్రయాణికుడు కొందరు ధ్యానయోగం గొప్పదని, మరికొందరు భక్తియోగమని, మరికొందరు జ్ఞానయోగమని, మరికొందరు కర్మయోగమని చెప్తుంటారు. నిజానికి ఏది గొప్పదని వారిని అడగగా, వారు ధ్యానయోగమే గొప్పదని బదులిచ్చారు.
ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ రావడంతో దిగిపోయాను. కానీ, ఏ యోగం గొప్పదన్న ఆలోచన నన్ను వీడలేదు. గీతలో భక్తియోగంలో అనేక మార్గాలను సూచిస్తూ కృష్ణపరమాత్మ ఇలా అంటారు -
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః||

నాలోనే మనస్సును, బుద్ధిని నిలుపుము. అటుపిమ్మట నీవు నిస్సందేహంగా నాలోనే వసింతువు. అంటే ఇది భక్తియోగం.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనుంజయ||

స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు. ఇది ధ్యానయోగం.

అభ్యాసేऽప్యసమర్థోऽసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి||

అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం చేసే పుణ్యకర్మలు వలన నన్ను పొందుతావు. ఇది కర్మయోగం.

అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్||

నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను శరణు పొంది నీవు చేసే
కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.
ఇలా సాధకులకు అనేక యోగామార్గాలు ఉన్నాయి కదా, మరి ఇందులో ఏది శ్రేష్టమైనది అన్న నా సందేహాన్ని తీర్చుకోవడానికై మూడురోజుల క్రితం నా మిత్రురాలు 'హరిప్రియ'కు ఫోన్ చేసి అడిగాను. తను నవ్వి, మంచి సందేహమే, ఈ ఆదివారం కార్తీకపౌర్ణమి కదా, ఆరోజు ఉపవాసముంటాం కదా, ఉపవాసమంటే దేవునికి దగ్గరగా ఉండడం అంటే దైవస్మరణ, దైవప్రార్ధన ... ఇత్యాదులతో గడపడం కదా, ఆరోజు వస్తాను, నీ సందేహాన్ని తీరుస్తాను, సరేనా ... అన్నప్పటినుండి ఈ కార్తీకపౌర్ణమి కై నిరీక్షణ .....
 
హమ్మయ్య! కార్తీకపౌర్ణమి వచ్చింది, నా నేస్తమూ వచ్చింది, నా సందేహమూ తీరింది.
నా సందేహం ఎలా తీరిందో, నా నేస్తం ఏం చెప్పిందో తదుపరి టపా లో -

6 కామెంట్‌లు:

  1. బాగుంది. తదుపరి టపాకోసం ఎదురుచూస్తుంటాం.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుందండి. అద్భుతంగా వివరించారు.

    మీరు వ్రాసిన ప్రకారం ఆలోచిస్తే......
    అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|
    సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్||
    నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను శరణు పొంది నీవు చేసే కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.
    ఇది నిష్కామ కర్మ యోగం లేక శరణాగతి యోగం అనుకోవచ్చేమో ? అనిపిస్తుందండి.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనురాధ గారు!
      మీ స్పందనకు ధన్యవాదములు. నా స్నేహితురాలు ఏం చెప్పిందో పోస్ట్ చేశాను. వీలైతే చూడగలరు.

      తొలగించండి
  3. ఆత్మ యెటనుండి వచ్చెనో యటకు మరల
    కలియుటకు పూని కసరత్తు తెలిసి చేయు
    దారు లెన్నేని గలవందు తనర నొక్క
    భక్తి మార్గమె సులభము ముక్తి ప్రదము .

    ----- సుజన-సృజన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టారు గారు!
      చాలా కాలానికి ...
      బాగున్నారా?
      నా నెచ్చలి అభిప్రాయమును పోస్ట్ చేశాను. చదివి మీ అభిప్రాయం తెలపగలరు.

      తొలగించండి