29, జనవరి 2014, బుధవారం

నా నెచ్చలితో నా కబుర్లు ... "పంచేంద్రియాలు - పంచోపచారాలు"

నిన్న ఎప్పటిలా మా ఇంటికి వచ్చిన నెచ్చలి 'హరిప్రియ' ఓ సందేహం వెలిబుచ్చింది. భారతీ! నేను చేసే పూజావిధానం సరైనదేనా? షోడశోపచారాలు చేయడం లేదు కదా అని అడిగింది. 
షోడశోపచారాలు చేయకున్నను భక్తిపూర్వకంగా పంచోపచారాలు చేస్తున్నావు కదా, అని నేననగా, అంతేనంటావా అన్న తనకి ఇలా చెప్పాను -

ఈ సృష్టిలో పంచభూతలున్నాయి.
పంచభూతములు :-
                          పృథ్వి, అగ్ని జలము, వాయువు ఆకాశం. 

ఈ పంచభూతాలే మనలో ఉన్నాయి. 
మనలో పంచభూతముల అమరిక -

అగ్ని :- 
శరీరంలో జఠరాగ్ని రూపంలో వున్నది. చర్మం, ముక్కు, కన్నులు, చెవులు, నాలుక అనబడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంచే ఏర్పడినవి. దీని గుణం రూపం. 
పృథ్వి :- 
వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియాలు పృథ్విభూతంచే ఏర్పడెను. దీని గుణం గంధం. 
వాయువు :- 
శరీరంలో ప్రాణ రూపంలో ఉన్నది. ఈ పంచప్రాణములు (ప్రాణం, ఆపానం, వ్యానం,                       ఉదానం, సమానం) వాయుభూతంచే ఏర్పడెను. దీని గుణం స్పర్శ. 
ఆకాశం :- 
అంతఃకరణమై యున్నది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారములతో కూడిన ఈ అంతరింద్రియం ఆకాశభూతంచే ఏర్పడెను. దీని గుణం శబ్ధం. 
జలం :- 
రక్తరూపంలో యున్నది. శబ్ధం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచతన్మాత్రలు జలభూతంచే ఏర్పడెను. దీని గుణం రసం.  

మన ఈ దేహం పంచభౌతికమైనది. వివిధ విషయాలను అనుభవించడానికి పంచేంద్రియాలు ఉన్నాయి. ఇవి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే విషయసుఖాలను అనుభవిస్తూ ఇష్టానుసారంగా భోగిస్తున్నాయి. అందుకే మనిషిని అధోగతి పాలుచేసే ఈ పంచేంద్రియాలను పూజలో పంచోపచారాలు ద్వారనైనను పరమాత్మునివైపు త్రిప్పగలిగితే జీవన పరమార్ధం సార్ధకమౌతుందని పెద్దలంటారు. మన సదాచరణలు, సాంప్రదాయకలు, సంస్కృతి పరమాత్ముణ్ణి తెలియజెప్పడానికే. 

పూజా పద్ధతిలో షోడశోపచారాలున్నప్పటికిని గంధంతో అర్చించుట, నామోచ్చరణతో పువ్వులను అర్పించుట, ధూప దీపారాధనలతో ఆరాదించుట, నైవేద్యం సమర్పించుట అనే పంచోపచారాలు ప్రధానమైనవి. ఈ ఐదు ఉపచారములలో పంచభూతములు ప్రతిబింబిస్తున్నాయి. పసుపు కుంకుమాది గంధాలు భూమికి, నామమంత్రోచ్చరణలతో పుష్పాలు ఆకాశానికి, ధూపం వాయువుకు, దీపం అగ్నికి, తీర్ధ నైవేద్యాలు నీటికి సంకేతకాలు. ఇట్లా పంచభూతాలు పంచోపచారాలలో నిబిడికృతమై ఉన్నాయి కాబట్టే; "పంచేంద్రియాలు - పంచోపచారాలు" అని పెద్దలన్నారు. అయితే, ఈ పూజను ఓ క్రియలా కాకుండా భావయుక్తంగా సంపూర్ణ సమర్పణాభావంతో చేయాలి. అప్పుడే ఆరాధన అంతర్లీనంగా అంతరంగంలో దృఢపడి అనుక్షణం అంతర్యామిని పూజిస్తుంది. చిత్తశుద్ధికి, జ్ఞానప్రాప్తికి ఈ పవిత్రభక్తిపూర్వక కర్మలే ఆధారం. సర్వభూతాలలో తనను, తనలో సర్వభూతాలను తెలుసుకుంటూ, పంచేంద్రియాలను తన స్వాధీనం చేసుకొని, పరమాత్మ పరంచేస్తూ వాటిని వినియోగించుకున్నవాడే నిజమైన భక్తుడు.
అని నాకు తెలిసింది చెప్పగా -
బాగుంది బాగుంది, సంక్రాంతికి ఊరెళ్ళానా, అక్కడ శ్రీ పాండురంగ శతకం లో కొన్ని పద్యాలు ఓ పుస్తకంలో చదివాను. అందులో ఓ పద్యం గుర్తుకొస్తుంది అంటూ నెచ్చలి హరిప్రియ చెప్పిన చక్కటి పద్యమిదే ... 
  
చిత్తమా! శ్రీకృష్ణు చింతించు మెప్పుడు 
     నాలుకా! చవిజూడు నామ సుధల 
కరములారా! మీరు హరిని పూజింపుడు 
     వీనులార! వినుడు విష్ణు కధలు 
కనులార! రాధికా కాంతుని గాంచుడీ 
     గుడిలోని కరుగుడో యడుగులార!
ఘ్రాణమా! తులసీ సుగంధ మాఘ్రాణించు 
     మస్తకమా! మ్రొక్కు మాధవునకు 


                           అనుచు లోలోన సకలేంద్రియముల నిన్ను 
                                  గొలవగా వేడు కొందును గోపబాల
                                  సేవ గొనుమయ్య నిరతము శ్రీ ముకుంద!
                                  పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 

ఓ ... మంచిపద్యం. పూజ ఎన్ని ఉపచారాలతో చేసినను అందులో మనసా, వాచా, కర్మణా దృఢమైన భక్తి శ్రద్ధలను కలిగియుండడం అత్యంత కీలకం. నిత్య వ్యవహారమంతయూ భగవత్పూజయే అన్న భావన మనలో దృఢపడాలి ... అని నేను చెప్తుండగా నెచ్చలి వినిపించిన మరో ఆణిముత్యం లాంటి పద్యమిదే -
                                  
ఆత్మాత్వం గిరిజా మతి: చరాచరాః ప్రాణాః శరీరం గృహం 
పూజతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి:
సంచారః పదయో: ప్రదక్షిణ విధి: స్తోత్రాణి సర్వాగిరో 
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ 
                                         - శ్రీ శంకరాచార్యకృత శివమానసపూజ 
ఓ శంభుదేవా! నా ఆత్మయే నీ స్వరూపము. నా బుద్ధియే పార్వతీదేవి. నా ప్రాణములే నీ సహచరులు, లీలా పరికరములు. నా దేహమే నీ దేవళం. విషయభోగములను అనుభవించుటయే నీ పూజ. నా నిద్రయే ధ్యాననిష్ఠ, సమాధిస్థితి. నా రెండు చరణములు సంచరించునదంతయూ నీ ప్రదక్షిణయే. నా నోటి ద్వారా మాట్లాడు మాటలన్నియూ నీ స్తోత్రములే. ఒకటని ఏముందీ, ఎల్లప్పుడూ నేను ఏమేమి కర్మలు చేసెదనో, అవన్నియూ నా ఆరాధనయే అవుతుంది. 



ఇలా సాగిన మా సంభాషణ తనివి తీరనిది. తనతో నాకబుర్లు మరిన్ని మరో టపా లో ...