5, జూన్ 2014, గురువారం

ఇది నా అంతరంగమధనం - భగవంతుడు ఉన్నాడా?

సాధారణంగా కొందరు కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు లేనే లేడు, దేవుడే ఉంటే నాకిలా ఎందుకు జరుగుతుంది... అని అనుకోవడం జరుగుతుంది. ఇలా అనుకునేవారిలో నేనూ వున్నాను. కొద్దినెలల ముందు కొన్ని విపత్కర పరిస్థితులలో భగవంతుడు ఉన్నాడా అని అనుకున్నాను. 
జీవితంలో సుఖదుఃఖాలు, లాభనష్టాలు, గౌరవవమానాలు ... ఇటువంటివి సహజం. నా జీవితంలో కూడా ఇవన్నీ వున్నాయి. కానీ, దేనికీ పొంగని కృంగని సరళమైన జీవనగమనం నాది. మా నాన్నగారి నుండి ఇది నాకు అలవడింది. ఏ స్థితిలో ఉన్నను, ఏనాడు 'రామ'నామం మరువలేదు. భగవంతునిపై విశ్వాసం వీడలేదు. కానీ; గత కొద్దిమాసాలుగా కొనసాగుతున్న సమస్యల పరంపర, ఊహించని సంఘటనలు, నమ్మకద్రోహాలు మనస్సుని కల్లోలపరుస్తుంటే - భగవంతుడే లేడని, దేవుడన్నది ఒక ఊహేనని కొంతసమయం ఆవేదనతో అనుకున్నాను. 

అయితే అదే సమయంలో మా మాస్టారుగారి మాటలు జ్ఞాపకం వచ్చాయి. అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యుడు, మందులు ఎలా అవసరమో అలానే కష్టస్థితిలో భగవంతుని స్మరణ అంతే అవసరం. అలాగని ఆరోగ్యంగా ఉన్నప్పుడు మందులు అవసరం లేదని, సుఖాల్లో భగవంతున్ని విస్మరించడం కూడా తప్పే. కష్టాలు వచ్చేసరికి భగవంతుని కృప లేదనుకోవడం చాలా పొరపాటు. భగవంతుని కృప నిరంతరం వుంటుంది. అనుకూలతలో వుందని, ప్రతికూలతలో లేదని అనుకోవడం మనోదుర్భలత్వము. మన నమ్మకాలే మన వాస్తవాన్ని సృష్టించుతాయి. లౌకిక ప్రపంచం ఆపదలతో కూడుకున్నదే. ఆ ఆపదలకు ఆవేదన పడేకంటే ఓర్చుకొని పారమార్ధిక జ్ఞానం వైపు పురోగమించడమే మన పని. 
మాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది అని అంటుంటారు. ఏమీ రాకపోతే ఈ శరీరం భూమి మీదకు ఎందుకు వస్తుంది? ఆ అనుభవాలు పొందింప జేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతుల్ని చేస్తాడు. చెరకుగెడ గెడలాగే వుంటే రసం రాదు, దానిని యంత్రంలో పెట్టి పిప్పి చేస్తేనే రసం వస్తుంది. అనేక కష్టనష్టాలకు గురి అయితే గాని దానిలో నుండి అమృతత్వం రాదు అన్న బాబా మాటలు మరువకండి. 
శ్రీమద్భాగవతము లో చెప్పినట్లుగా -
యస్యాహమనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనైః అన్నది శ్రీభగవానువాచ. (నేను ఎవరిని అనుగ్రహించదలచుకున్నానోవారి సంపదలను, గౌరవాదులను మెల మెల్లగా హరిస్తాను). 

లౌకికమునందు మునిగిపోయినప్పుడు భగవానుడు మనయందు తన అనుగ్రహంను ప్రసరింపజేయ తలచి మనకు మోహం కల్గించే వాటిని, అహం పెంచేవాటిని హరించి మనల్ని తనవైపుకి త్రిప్పుకుంటాడు. 
నిజానికి ఈ ఆపదలు మనకు ఎంతగానో మేలు చేస్తున్నాయి, భగవంతున్ని స్మరించుటకు వీలు కల్పిస్తున్నాయి. 
మోక్షమును ప్రసాదించే నీ దర్శనం కలుగునట్లుగా ఈ విపత్తులన్నియూ మరల మరల కలుగవలెనని (విపదః సన్తు తాః శశ్వత్తత్ర తత్ర జగద్గురో. భవతో దర్శనం యత్స్యాదపునర్భవదర్శనమ్కోరుకున్న అనన్యభక్తి కుంతీ మాతది. 
బాల్యం నుండియే అనేక ఆపదలను ఎదురైనను ఆవేదన చెందక అచంచల భక్తితో హరినామ స్మరణం ద్వారా ప్రహ్లాదుడు ఏం పొందాడో గమనించండి. 

తత్తేऽనుకమ్పాం సుసమీక్షమాణో భుఞ్జాన ఏవాత్మకృతం విపాకమ్
హృద్వాగ్వపుర్భిర్విదధన్నమస్తే జీవేత యో ముక్తిపదే స దాయభాక్ //
(కర్మ పరిపాకాన్ని అనుభవిస్తూ, నీ దయ ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తూ, శరీర మనో వాక్కులతో నీకు నమస్కారం చేస్తూ ఎవరు బతుకుతారో అటువంటి వారు నీ దయను పొంది ముక్తిని పొందుతారు) భక్తుని యొక్క దృక్పదం ఈరీతిలో ఉండాలని చెప్తూ చివరగా ఓ మాట చెప్పారు - "పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సాధన చేసుకోండి, ప్రతికూలంగా వున్నప్పుడు వైరాగ్యం పెంచుకోండి". 
పై మాటలు గుర్తుకురావడంతోనే నా అవివేకంకు ఆవేదన కల్గింది. 

అలానే భగవంతుడు ఉన్నాడా అన్న సందేహం కల్గగానే నా ఆత్మీయురాలికి ఈ సందేహాన్ని తెలిపాను.  
దానికి తను ఏమందంటే - తప్పు, తప్పు ఎప్పటికీ ఈ భావన నీలో రానీయకు... పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా వున్నా భగవంతుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టకు. ఆ సంఘటనలతో మనోస్థైర్యంను పెంచుకోవాలని చెప్తూ, ఇలా అంది - మనం ఈ జన్మలో ఏ పాపాలు చేయకు పోవచ్చు, గతజన్మల ప్రారబ్ధం కావొచ్చు కదా, తప్పదు ... జీవితంలో కష్టసుఖాలాను సరళంగా సహజంగా స్వీకరిస్తూ గమ్యం వైపు సాగిపోవడమే...  తన ఈ మాటలతో నా భావన ఎంత హేయమైనదో గ్రహించాను. 
పై ఇరువురి మాటలు నా తప్పిదాన్ని తెలుసుకునేటట్లు చేశాయి. పూజ్యులు మాస్టారు గారికి, నేను ఎంతగానో అభిమానించే నా ఆత్మీయురాలికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 


అటుపై భగవంతుడు లేడని అనుకున్నందుకు నేను పొందిన ఆవేదన నేను ఎదుర్కుంటున్న విపత్కర పరిస్థితుల కంటే అధికమైనది. ఆ సమయంలో నాలో జరిగిన ఆ అంతర్మధనమే ఈ టపా - 
ఆ సమయంలోనే నాలో స్వీయపరిశీలన జరిగింది. 
నిజమే నా మనస్సు విషయత్వం నందు చిక్కుకుంది. ఈ విషయత్వం విషం కంటే దారుణమైనదని శాస్త్రమంటుంది. (ఉపభుజ్య విషం హంతి విషయా స్స్మరణాదపి) విషం తినినచో చంపును. కాని విషయం తన్ను స్మరించిన మాత్రమునే హననం చేయును.  
ఇక ప్రారబ్ధంను తప్పించుకోవడం ఎలా? ప్రారబ్ధం భోగతో నశ్యే అన్నారు పెద్దలు. వీటిని సహనంగా అనుభవించి అధిగమించాల్సిందే. ఇటువంటి స్థితిలో ఆవేదన కలగకూడదంటే ఆపదలను ఆపదలుగా కాకుండా భగవంతున్ని అనుగ్రహంగా భావించాలి. ఈ సమస్యలు నాలో తగినంత వివేకం, వైరాగ్యం, అభ్యాసం లేవని తెలియజెప్పడానికే కల్గి వుండవచ్చు.
మంచి చెడుల సమ్మేళనములతో, ఆశానిరాశల సమాహారములతో, ఆనందవిషాదభాష్పాల సంగమములతో, ఎన్నెన్నో సంక్లిష్టతలతో కూడిన ఈ లౌకిక ప్రపంచంలో చలించని భక్తివిశ్వాసాలతోనే పారమార్ధిక పధంలో పయనించగలగాలి. జీవితము పట్ల ఓ చక్కటి అవగాహన కల్గి వుండాలి. గీతలో చెప్పినట్లుగా అందుకు తగ్గ అభ్యాస వైరాగ్యంలను సాధన చేయాలి. (మనస్సుని లౌకిక విషయాలనుండి మళ్ళించడం వైరాగ్యం. మనస్సుని ఆత్మయందు నిలపడం అభ్యాసం). 

ఇప్పటికీ సమస్యల నడుమే వున్నను నాలో ఇప్పుడు దుఃఖం లేదు. కాలగమనంలో ఈ సమస్యలు వీడవచ్చు, వీడకపోవచ్చు. కానీ; ఇక నాలో ఎప్పటికీ భగవంతునిపై విశ్వాసం వీడదు. 

త్వయి మేऽనన్యవిషయా మతిర్మధుపతేऽసకృత్
రతిముద్వహతాదద్ధా గఙ్గేవౌఘముదన్వతి //


ఓ మధుపతీ! నా బుధ్ధి అంతా నీ మీదే ఉంచు. గంగ ఎంత వేగంగా తిరిగినా చివరకి సముద్రం వైపునకు ప్రవహించురీతిన, నా బుధ్ధి ఎంత చంచలంగా ఉన్నా ఇతరముల వైపునకు మరలక,
నిన్నే కలిసేటట్లు నీయందే ఉండాలి.
 



 

6 కామెంట్‌లు:

  1. ఆధ్యాత్మికతపై ఎంతో సాధికారికంగా అనేక విషయాలు మీ టపాలద్వారా తెలియజేసిన మీరే అలా అయ్యారంటే ఆశ్చర్యకరంగా ఉంది. అంటే మీకొచ్చిన సమస్యలు అంత క్లిష్టమైనవో అయిఉంటాయి. ఏమైనా మళ్ళీ మీ మనస్సులో మబ్బులు తొలగిపోయినందుకు అభినందనలు. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆశిస్తున్నాను.

    తేజస్వి

    రిప్లయితొలగించండి

  2. కలడు కలండనెడి వాడు కలడో లేదో !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. భారతిగారూ.. నేను గుర్తున్నానా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు అత్యంత ఆత్మీయులైన మిమ్మల్ని మర్చిపోవడం సాధ్యమా?

      కాస్తంత బిజీగా ఉండడంచే మీ వ్యాఖ్యలను చూడడం ఆలస్యం అయింది ... మన్నిస్తారు కదూ.

      తొలగించండి
  4. మీ...ఆద్యాత్మకత స్థాయి చాలా గొప్పది.

    రిప్లయితొలగించండి
  5. ఈ సమయానికి మీ ఈ పోస్ట్ చదవడం నాకు చాలా మేలు చేసింది . చాలా చక్కని పోస్ట్ భారతి గారు . ధన్యవాదములు మేరాజ్ మిత్రురాలు అన్నట్టు మీ ఆద్యాత్మిక స్థాయి గొప్పది . మళ్ళీ బ్లాగ్ ల వైపు దృష్టి సారించవలసిందే ! ఎన్ని మిస్ అవుతున్నానో! :)

    రిప్లయితొలగించండి