29, ఫిబ్రవరి 2016, సోమవారం

'అమ్మమ్మ ఆకాంక్ష'.

సరస్వతీ సమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా... 

మాఘ పౌర్ణమి -
మాఘ పౌర్ణమిన నా మనుమరాలు చిట్టితల్లి శ్రీమాన్వికి బాసరలో "జ్ఞాన సరస్వతి అమ్మ" అనుగ్రహంతో, అందరి ఆశీస్సులతో అక్షరాభ్యాసం జరగడం ఆనందదాయకం.
మన జీవితంలోని వివిధ దశల్లో జరిపే షోడశ సంస్కారాలలో ముఖ్యమైన సంస్కారం "అక్షరాభ్యాసం".



యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా
సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!

అక్షరాభ్యాసం :-
అక్షర - అభ్యాసం ... అక్షరాలను సాధన చేయడం.
అక్షరం ... క్షరం కానిది... అంటే నాశనం కానిది. నాశనం కానటువంటి విద్యను అభ్యచించడానికి నాంది అక్షరాభ్యాసం.
ఈ అక్షరాభ్యాసం ... వ్యక్తిత్వం, సామర్ధ్యం, జీవన నైపుణ్యతలతో కూడిన విద్యకు నాంది.

విద్య ...

మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే
కాన్తేవ చాభిరమయత్యపనీయ ఖేదమ్ ।
కీర్తిం చ దిక్షు వితనోతి తనోతి లక్ష్మీం
కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా ॥
విద్య తల్లివలే రక్షించును, తండ్రివలే ధర్మమునుపదేశించును, భార్యవలే ఆపత్కాలమున శ్రమను శమింపచేయును, దశదిశలలో కీర్తిని కలుగజేయును, ఐశ్వర్యము సమకూర్చును, ఇన్ని మాటలెందుకు? కల్పవృక్షం వలే సమస్త కోరికలను ఇచ్చునది విద్య యొక్కటే.

విద్యా నామ నరస్య రూప మధికం ప్రచ్చన్నగుప్తం ధనం
విద్యా భోగకరీ యశఃసుఖకరీ విద్యా గురూణాం గురు: ।
విద్యా బందుజనో విదేశగమనే విద్యా పరా దేవతా
విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యావిహీనః పశు: ॥

మానవునికి విద్య అతి మనోహరమగు సౌందర్యం. విద్య దొంగలచే అపహరింపబడని ధనం, విద్య అన్ని భోగములను, యశస్సుఖములను నొసంగునది. విద్యయే సద్గురువు. విదేశ గమనమందు బంధువువలే సహకరిస్తుంది. విద్య పరాదేవత. రాజుపూజితం. విద్యను మించిన ధనం లోకమున వేరు లేదు, విద్యాధనమే ధనము. విద్య లేనివాడు పశువుతో సమానమని భర్తృహరి విద్య గురించి శ్లాఘిస్తాడు.

న చోరహార్యం న నృపేణ దండ్యం న బంధుభాజ్యం నకరోతి భారమ్ ।
వ్యయే కృతే వర్దత ఏవ నిత్యం విద్యాధనం సర్వధనప్రదానమ్ ॥
ఈ విద్యాధనం చోరులచే అపహరింపబడునది కాదు, రాజులకు పన్ను కట్టవలసిన ధనం కాదు, బంధువులకు భాగమివ్వవలసినది కాదు, మోయుటకు భారం లేనిది, వ్యయం చేస్తున్నకొలది వృద్ధియగునది. అంతేగాక ఈ విద్యాధనం  సర్వధనముల {యశస్సు, కీర్తి, భోగభాగ్యాలు, జ్ఞాన వైరాగ్యాలు ...} ప్రదాయిని.


విద్యావంతుల వలన  ఎంతోమందికి ఉపయోగముంటుంది, వారి బతుకు ఎంతో మందికి బతుకునిస్తుంది.
జన్మించాక .... బ్రతకడం కాదు చక్కగా జీవించగలగాలి. అందుకు చక్కటి విద్య అవసరం. విద్యను చక్కగా అభ్యసించినవారు తాము చక్కగా జీవించడమే కాదు, ఎందరినో ఉన్నతంగా జీవించేలా మార్గదర్శకులు కాగలరు.

విద్య ...
ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే -
దేనియందు అవిద్య లేదో ... అదే విద్య.
ఏది క్షరం గాక సత్తు అయి యుండునో దానియందు గల అభ్యాసమే అక్షరాభ్యాసమని ఆధ్యాత్మిక కోవిదుల వాక్కు.

శాస్త్రరీత్యా విద్య రెండు రకములు - 
ద్వే విద్యే వేదితవ్యే తు శబ్దబ్రహ్మ పరం చ యత్ /
శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్ఛతి //
మానవుడు రెండు విద్యలు నేర్చుకొనవలయును. 1. శబ్దబ్రహ్మము 2. పరబ్రహ్మము. 
శబ్దబ్రహ్మమనగా శాస్త్రము. పరబ్రహ్మమనగా ఆత్మజ్ఞానం. అయితే శబ్దబ్రహ్మమందు నిష్ఠ కలిగినవారు మాత్రమే పరబ్రహ్మమును పొందగల్గును అని శృతి బోధించుచున్నది. (అమృత బిందూపనిషత్తు).

ప్రాకృతవిద్య అలవడిన అప్రాకృతమైన  బ్రహ్మవిద్యను అభివృద్ధి చేసుకొనవచ్చును. మండుచుండు అగ్నికి వాయువెంత సహాయమో, అటులనే ఆధ్యాత్మిక జ్ఞానవిద్యకు ఈ ప్రాకృతమైన విద్య అత్యవసరం.
జన్మ సార్ధకతకు విద్యను అభ్యసించాలి. ఆ విద్యారంభంకు అక్షరాభ్యాసమనే సంస్కారం తప్పనిసరి.

విద్య గురించి కొందరు మహానుభావుల భావాలు ...
అత్యున్నత మేధాశక్తి పట్ల, సత్యం పట్ల ప్రగాఢమైన ప్రేమను రగిలించడానికి స్పూర్తినివ్వడమే విద్య లక్ష్యం.                                                                                                    - జాన్ స్టూవర్ట్ మిల్
విద్య అంటే మెదడులోకి బలవంతంగా ఎక్కించే సమాచారం కాదు. శీల నిర్మాణానికి తోడ్పడాలి. సమాచారాన్నే విద్యగా పరిగణిస్తే గ్రంధాలయాలే ప్రపంచంలో గొప్ప రుషులయివుండేవి. 
                                                                                                   - స్వామి వివేకానంద
విద్య అంటే ఓ వ్యక్తిని జీవితం కోసం తయారు చేయడం కాదు, వాస్తవానికి విద్యే జీవితం. 
                                                                                                                   - జాన్ డ్యూయీ
విద్య అంటే నిప్పును రగిలించడమేగానీ ఏదో ఒక మట్టికుండను నీటితో నింపడం కాదు. అదో ఆలోచనాజ్వాల.                                                                                                  - సోక్రటీస్
విద్య నేర్చుకోవడం సృజనాత్మకతకు దారి తీస్తుంది. సృజనాత్మకత స్వతంత్రంగా ఆలోచింపజేస్తుంది. ఆలోచన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానమే మనల్ని ఉన్నతుల్ని చేస్తుంది. 
                                                                                        - అబ్దుల్ కలామ్

                                              
                                                                          శ్రీమాన్వి

చిట్టితల్లి శ్రీమాన్వి!
ఉన్నత విద్యలను చక్కగా అభ్యసించి ఇహసుఖమును, పరసుఖమును, పరాత్పరసుఖమును జ్ఞాన సరస్వతి అమ్మ అనుగ్రహంతో, అందరి ఆశీస్సులతో పొందాలన్నదే 'అమ్మమ్మ ఆకాంక్ష'. 


10 కామెంట్‌లు:

  1. "అక్షరాభ్యాసం" ను చక్కగా వివరించావు భారతీ!శ్రీ మాన్వికి మా శుభాశీస్సులు. నాశనం లేనటువంటి దానిని అక్షరమని అంటారు; అటువంటి అక్షరానికి అధిదేవతగా, పలుకుల తల్లిగా, సర్వవిద్యలకు అధిదేవతగా పూజింపబడే ఈ దివ్యజనని జ్ఞాన సరస్వతీదేవి అనుగ్రహం సదా మాన్వికి ఉండాలని, 'అమ్మమ్మ ఆకాంక్ష ' నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....దీవెనలతో ...వేద.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమూల్యమైన మీ దీవెనలకు మనసార ధన్యవాదములు వేద జీ.

      తొలగించండి
  2. శ్రీరస్తు శ్రీమాన్వికి
    భారతి అమ్మమ్మ మరియు బాసర సతియున్
    కోరిన విద్యల నిచ్చుత
    హేరంబుడు వరములిచ్చు హేరాళముగా .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మాస్టారు గారు,
      ధన్యోస్మి ... మీ ఆశీస్సులు శ్రీరామరక్ష.
      మీకు మా హృదయపూర్వక నమస్సులు.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. శ్రీమాన్వి అక్షరాభ్యాస సమయంలో తన తల్లికి (అనూషాకి) ఒడిలో కూర్చోబెట్టుకొని నీవు అక్షరాభ్యాసం చేసిన దృశ్యమే కదలాడింది మదిలో. ధన్యవాదములన్నయ్య.



      తొలగించండి
  4. చిన్నారి "శ్రీమాన్వి" కి శుభాశ్సీస్సులు. అమ్మమ్మ ఆకాంక్షలో హృదయం ఉంది. అమ్మ దయ ఉంది. మీ పోస్ట్ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి

  5. మీ స్పందన బాగుంది. అందులో అంతర్లీనంగా మీ అభిమానముంది.
    మీకు హృదయపూర్వక ధన్యవాదములు వనజగారు.

    రిప్లయితొలగించండి
  6. రాజ్యలక్ష్మి16 ఫిబ్రవరి, 2022 7:41 AMకి

    ఈరోజు నా మనువడుకి అక్షరాభ్యాసం చేస్తున్నాం. మీ ఆశస్సులు అందజేయండి...
    నిన్ననే ఈ పోస్ట్ నాకంట పడింది ... అదృష్టవశాత్తు
    అల్లూరి రాజ్యలక్ష్మి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మ అనుగ్రహం ప్రాప్తిరస్తు.
      మీ మనవడుకు నా శుభాశీస్సులు రాజ్యలక్ష్మి గారు.

      తొలగించండి