14, ఏప్రిల్ 2016, గురువారం

రాములోరు ...శ్రీరామనవమి అనగానే గుర్తుకువచ్చే ఒకప్పటి నా మధుర జ్ఞాపకం - 

శ్రీరామనవమి నాడు ... 
రామాలయం దగ్గర సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించేవారు. మధ్యాన్నం కల్యాణం చేసి, సాయంత్రం లక్ష్మణ, అంజనేయుల సమేతంగా సీతరాముల్ని పల్లకిపై ఊరేగించేవారు. 
ఎప్పటికంటే కాస్తా ముందుగానే పలహారాలో, భోజనమో... అమ్మమ్మ పెట్టేసి ... చక్కగా తినేయండమ్మా, రాములోరు మన ఇళ్ళకు వస్తారు, మరి చూడాలి కదా, త్వరగా తినేయాలి మరి ... అనేవారు. త్వరగా తినేసి వీధిలోనికి పరుగులు... రాములోరికే ఎదురుచూపులు ... 
రాములోరు వస్తారు కాసేపటిలో అన్న సూచనగా వీధి తొలి మలుపులో ... ముందుగా డప్పులు ... ఆ వెనుక తప్పెట గుళ్ళు... ఆ వెన్నంటే ఎడ్లబండిపై రామయ్య, సీతమ్మ, లక్ష్మణస్వామి, ఆంజనేయుడు వేషం వేసుకొన్న వారు, ఆ వెంబడే సన్నాయి మేళతాళాలతో రాములోరి పల్లకి ... ఎదురెళ్ళి స్వాగతించడం ... మా గుమ్మంలోనికి సీతారాములవారు రాగానే, సాయంత్రం నుండి అందంగా అల్లిన పూలమాలలును మేమూ, కానుకలు ప్రసాదాలు పెద్దవారు సమర్పించడం ... వీధి చివరింటివరకు పల్లకి వెంబడి వెళ్ళడం ... చిన్నా పెద్దా మదినిండా భక్తితో, ధన్యులయ్యామన్న తృప్తితో అర్ధరాత్రి వరకు రాముని గురించి పెద్దవారు చెప్తుంటే వినడం ... ఓహో ... అదో మధురానుభూతి. 
                                              

                                       
ఒక కొడుకు తల్లితండ్రులను ఎలా గౌరవించాలో, 

ఒక శిష్యుడు గురువుగారితో ఎలా మసలుకోవాలో, 
ఒక అన్నయ్య తన తమ్ముళ్ళతో ఎలా నడుచుకోవాలో, 
ఒక భర్త భార్య పట్ల ఎలా ప్రవర్తించాలో, 
ఒక మిత్రుడు మిత్రులను ఎలా ఆదరించాలో, 
ఒక రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ... 
అలా ఆచరించి ధర్మాన్ని చాటిచెప్పిన ధర్మమూర్తి నా "రాములోరు". 

మహర్షయిన వాల్మికి అయిన, 
పడవ నడిపిన కిరాతజాతికి చెందిన గుహుడైన, 
శబరకులానికి చెందిన శబరైనా, 
పక్షయిన జటాయువైన, 
వానరడైన సుగ్రీవుడైన, 
రాక్షసుడైన విభీషణుడు అయినా, 
చిరుజంతువయిన ఉడుత అయినా ... 
అందర్నీ ఒకేలా ఆదరించి గౌరవించిన మర్యాదరాముడు నా "రాములోరు".  

ధర్మం, సత్యం, కారుణ్యం, క్షమ, వినయం, విదేయత, ప్రేమ, సాత్వికం, సహనం, సమత్వం, త్యాగం, ధైర్యం, స్థితప్రజ్ఞ  ... ఇత్యాది సౌశీల్యాలు మూర్తిభవించిన సుగుణాభిరాముడు నా "రాములోరు". 

ఆదర్శపురుషుడుగా అగుపించి అందరి ఆరాధ్య దైవమయి, అంతరాల్లో అంతర్యామై ఆత్మారాముడుగా భాసిల్లుతున్నాడు నా "రాములోరు". 
ధర్మావలంబంవలన మానవుడు మాధవుడు ఎలా కాగలడో విషదపర్చేదే రామాయణం. 
మానవుడు మాధవుడు ఎలా కాగలాడో ... నిరూపించిన మార్గదర్శకుడు నా "రాములోరు".  
ఈ విషయమై వివరణ ఇచ్చేముందు ఒకప్పుడు నాలో కదిలాడే కొన్ని సందేహాలను ఇక్కడ  ప్రస్తావించడం సముచితం. 

కామి గానివాడు మోక్షకామి కాడు ... ఇది లోగడ విన్న మాటైనను, కొందరు దీనిని వక్రీకరించి అన్న మాటలు విన్నప్పుడు మన పెద్దలు ఇలా చెప్పారేమిటి అని బాధపడ్డాను.
స శాంతి మాప్నోతి న కామ కామి ... అన్నది గీతాచార్యుని వాక్కు. (సర్వేంద్రియ సంయమియైన సాధనపరుడైన సత్పుర్షునికే మోక్షస్థితి సాధ్యమవును గాని, కామం గలవానికి సాధ్యం కానే కాదు).
త్యజించవల్సిన కామాన్ని మోక్షంతో ఇలా కలిపి చెప్పడం ఏమిటని ఒకింత అయోమయంగా అనుకున్నా.
అలానే సాధకుడు వర్జించాల్సిన అరిషడ్వర్గములో ఒకటైన కామంతో మోక్షానికి ముడిపెట్టడమేమిటీ అని అనుకున్నాను. కాకపొతే పెద్దల మాటల్లో మర్మం అర్ధంకాకున్నా, అందులో పరమార్ధం ఏదో దాగి వుంటుందనే నమ్ముతానుకాబట్టి,  సరే, అర్ధమైనప్పుడే తెలుస్తుందనుకొని వదిలేశాను.

కాలగమనంలో మన వివాహ విశిష్టతలు, పద్ధతులు  తెలుసుకుంటున్నప్పుడు  తెలిసాయి కొన్ని విషయాలు -
ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్వమైషా నాతిచరితవ్యాః అని కన్యాదానం చేస్తూ   (ఈరోజు వరకు నా కూతురిగా వున్న ఈమె నేటినుండి నీ అర్ధాంగి అగుచున్నది. ఈరోజు నుండి ధర్మకార్యాలు ఆచరించటం లోను, ధన సంబంధిత విషయాలలోనూ, కోరికలు తీర్చుకొనుటలోను నా కూతుర్ని అతిక్రమించక మీరిరువురు అన్యోన్యంగా వుండాలని) కన్యాదాత అనగా,
ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతిచరామి (ధర్మమునందు గాని, సంపదల విషయంలందు గాని, శారీరక సుఖవిషయంలందు గాని నిను అతిక్రమించి చరించను) అని వరుడు ప్రమాణం చేసే ఓ అద్భుత ఘట్టముందని. అలాగే ధర్మార్థ కామమోక్షాలను నాలుగింటిని  చతుర్విధ పురుషార్ధములని పేర్కొంటారని అర్ధమైంది. ఈ నాలుగింటిని చక్కగా ఆచరిస్తే జీవన సాపల్యమౌతుందని అర్ధం చేసుకున్నాను.
జీవిత పరమార్ధమంతా ఇందులోనే యిమిడివుంది కాబట్టి, ఈ నాలుగింటిని ఓసారి పరిశీలిస్తే ...
ధర్మార్ధ కామమోక్షాలు - ఇవి పురుషార్ధాలు.

మనిషి ధర్మంగా జీవించాలి. ఆ ధర్మంతో అర్ధం సంపాదించాలి. ఆ ధర్మం ద్వారానే సముచితమైన కామనలు (కోరికలు) తీర్చుకోవాలి. ఇక కోరికలలో పడి కొట్టుకుపోకుండా సత్కర్మలు ఆచరించాలి. మోక్షం కోసం ప్రయత్నించాలి. ఇదే మానవ జీవిత పరమార్ధమని భారతీయ సంస్కృతి ప్రబోధం.

ఈ పురుషార్ధాలను ఇదే క్రమంలో చెప్పడంలో కూడా విజ్ఞత, విశేషత వుంది. అత్యంత ప్రాధాన్యతమైన అముష్మికంలను మొదట చివర పెట్టి, ఐహికమైన రెండింటిని మధ్యలో పెట్టారు. ఈ నాలుగింటిలో అర్ధ, కామములు ఐహికం - ఈ రెండూ స్థూలదేహంతో నశిస్తాయి. ధర్మం, మోక్షం అముష్మికం - ఈ రెండింటిలో మరణాంతరం అనుభవం లోనికి వచ్చేది మొదటిదైతే, మరణమే లేదని అనుభవస్థితికి చేర్చేది రెండవది. 
అంతేకాక, ఈ నాలుగింటిని చెప్పేవిధంలో కూడా ఓ ప్రత్యేకత వుంది. ధర్మార్ధంను ఓ జంటగా, కామమోక్షాలను ఓ జంటగా చెప్పడంలో అంతరార్ధం ఏమిటంటే -
ధర్మంతో అర్ధాన్ని సంపాదించాలని ... ఈ సంపాదన యోగిస్తుంది. అంతేకాని, కామార్ధం అంటే కామంతో అర్ధాన్ని సంపాదిస్తే అది పతనమే అవుతుంది. 

అటుపిమ్మట కొద్ది రోజుల తర్వాత రామాయణం మరోసారి చదివాను. గతంలో కొన్నిసార్లు చదివిన అవగాహనకాని కొన్ని విషయాలు అవగతమయ్యాయి. అప్పుడప్పుడు చదివిన, విన్న రామకధ, ఈ చతుర్విధ పురుషార్ధాలు గురించి తెలుసుకున్నాక చదివినప్పుడు మార్మికత, దార్మికత, దార్శినికత అర్ధమయ్యాయి. ధర్మాచరణతో కూడిన ఆదర్శ జీవనం సాగించిన రాముడు దేముడు ఎందుకయ్యాడో అర్ధమైంది. 
'కామార్ధగుణ సంయుక్తం ధర్మార్ధగుణ విస్తారం ...' అని బాలకాండ యందు వాల్మికిమహర్షి అంటారు. కామం, అర్ధం గురించి మితంగాను, ధర్మార్ధగుణం గురించి విస్తారంగా తెలుపుతుంది రామాయణం.
ధర్మగుణంకు ప్రతీక అయిన రాముడు దేముడైతే, భక్తిపరాయణుడు అయినను కామార్ధ ప్రలోభుడయిన రావణుడు ధర్మంచే సంహరింపబడ్డాడు.

శ్రీరాముడు అవతార పురుషుడు అన్న మాటను ప్రక్కన పెట్టి, తన జీవన విధానం గమనిస్తే ఓ సామాన్య మానవునిగా ఎన్నెన్నో కష్టనష్టాలు, అపవాదులు, సుఖసంతోషాలను అనుభవించాడు. సత్కర్మాచరణలతో ధర్మం ఆచరిస్తూ, తద్వారా సక్రమార్జనతో (అర్ధంతో) సత్ కామనలతో (కోరికలతో) మనుగడ సాగిస్తూ ... నిత్య సత్య శాశ్వత ఆనంద మోక్షసిద్ధితో జీవన సాపల్యం ఎలా చేసుకోవాలో తెలియజెప్పేదే రామకధ. మానవుడు మాధవుడు ఎలా కాగలడో తెలిపేదే రామాయణం. అందుకే కదా ... ఊరు ఊరున, వాడవాడలో ... ఒక చోటని ఏముందీ? గూడు గూడులో ప్రతీ గుండెలో కొలువై, అందరి ఆరాధ్యదైవమయ్యారు నా "రాములోరు".

దశరధరాముడుగా జనించి, తొలుత అయోద్యరాముడై, పిదప సీతారాముడై, అపై కొదందరాముడై, ఆటుపై పట్టాభిరాముడై, ఆ తర్వాత ఆదర్శరాముడై, అనంతరం అందరిరాముడై, ఆఖరికి ఆత్మారాముడై విరాజిల్లుతున్నారు "నా రాములోరు".

సర్వేషు రమంతే ఇతి రామః ... అందరిలో రమించే దివ్య చైతన్యమే రాముడు.
రామ అంటే రమణీయుడు. రామనామం రమణీయం, రాముని రూపం రమణీయం, రాముని గుణం రమణీయం, రాముని తత్త్వం రమణీయం, రామచరితం రమణీయం, రామ మహిమ రమణీయం... ఇన్ని రమణీయాల సమాహార స్వరూపుడయిన నా రాములోరిని నిత్యం తలచేవారి మనస్సు రమణీయం, కొలిచేవారి హృదయం అత్యంత రమణీయం... ధన్యణీయం.

మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళు
ర్నాన్యం జానే నైవ జానే న జానే//

                                     
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
                                  పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్//


రామనామ మహిమను తెలిపే పరమపావనం - రామనామం

రామాయణ అంతరార్ధం తెలిపే మోక్షపధం - రామ దర్శనం7, ఏప్రిల్ 2016, గురువారం

ఉగాది పండుగ - పరమార్ధంభారతీయ సంస్కృతికి దర్పణం పండుగలు. భారతీయ జీవనగమనం నుండి ఈ పండుగలు విడదీయలేనివి. ఆరోగ్యవంతమైన ఆచారాలతో, ఆధ్యాత్మిక సందేశాలతో, ఓ చక్కటి ఉన్నత జీవనశైలిని అలవడేలా చేస్తాయి మన ఈ పండుగలు.  
మానవాళికి ప్రాపంచిక విజ్ఞానాన్ని, పారమార్ధిక జ్ఞానాన్ని అందించి, శారీరక మానసిక శక్తులను యినుమడింపజేస్తూ, మనలో చైతన్యంను సంఘటితం చేసి, విశ్వశాంతి కోసం, మానవజన్మ సార్ధకత కోసం, ఇహ పర శ్రేయస్సుల కోసం, ఎన్నెన్నో అత్యంత ఉన్నత ఆచారముల పేరిట ఆచరణకు శ్రీకారం చుట్టేవే మన పండుగలు.
ఈ పండుగలు ఆహ్లాదభరితంగా వుంటూ, 
ఇటు ... యాంత్రిక ప్రాపంచిక జీవనం నుండి సేద తీర్చే విధంగా, శారీరకంగా ఆరోగ్యంను ప్రసాదించే ఆచారాలతో...  
అదే సమయంలో అటు ... అంతర్గత జీవితసత్యాలను ప్రబోధిస్తూ, ఆధ్యాత్మిక తత్త్వాన్ని తెలుపుతూ, మనస్సును పారమార్ధికం వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ఈ పండుగలన్నీ మానవజన్మ పరమార్ధాన్ని చాటిచెప్పేవే.

యుగస్య ఆది: ఉగాది అని శాస్త్రం తెలుపుతుంది. యుగం ఆరంభమైన మొదటిరోజు యుగాది లేదా ఉగాది. 
చిత్త చిత్ర అనే పేర్లు కలిగిన నక్షత్రమున పూర్ణిమ వచ్చే మాసం చైత్రమాసం. 
చైత్రశుద్ధ పాడ్యమినాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించడంచే ఆ రోజునే ఉగాదిగా పెద్దలు పేర్కొన్నారు.
ఉగాది వసంత ఋతువులో వస్తుంది. వసంతాగమనం శుభకరమైన నూతన ఆశయాలకు, సంకల్పాలకు స్పూర్తిదాయకంగా చెప్తారు.
'వసంతి సుఖం యధా తధా అస్మిన్నితి'... వసంతంలో ప్రజలు సుఖంగా వుంటారని భావం.
కోయిలలు కుహు కుహురావాలతో, అత్యంత రమణీయ శోభాయమానమైన ప్రకృతితో రంజింపజేసే కాలమిది. ఈ వసంతంలో ప్రకృతి నూతనత్వాన్ని సంతరించుకుంటూ పచ్చదనంతో చిగురిస్తూ, ఆహ్లాదభరితంగా శోభాయమానంగా వుంటుంది.
అదేరీతిలో అంతరంగికంగా మన మానసిక జగత్తును పారమార్ధిక జ్ఞానంతో చిగురింపజేస్తే ... మన జీవనం ఆనందమయంగా, ఆధ్యాత్మికభరితముగా ఇహ పర తృప్తినిస్తుంది. 
ప్రకృతిలో భాగమైన మానవుడు నిర్మలమైన అంతఃకరణంతో, మానవత్వంతో కూడి వున్నప్పుడే నిజమైన మనిషి అవుతాడనే శుభాసందేశాన్ని తెలుపుతుంది ఉగాది.
నిశితంగా పరిశీలిస్తే ... పండుగ దినాల్లో పాటించాల్సిన నియమధర్మాలు, ఆచార వ్యవహారాల్లో ప్రాపంచిక పారమార్ధిక ప్రగతే వుంటుంది.


ఈ ఉగాదినాడు ఆచరించవలసిన ముఖ్య విధులు... 

అభ్యంగే నూత్న వ స్త్రే పంచాంగ శ్రవణే ద్విజాత్ / షడృచే నింబపుష్పేచ యుగాదౌ నివసామ్యహమ్ //

అభ్యంగనం :-
పర్వదినాల్లో మహాలక్ష్మి నూనెలోనూ, గంగాదేవి జలములోను ఉంటారని ప్రతీతి. సూర్యోదయంనకు ముందే అభ్యంగస్నానం చేయాలి.
శారీరక ఆరోగ్యం దృష్ట్యా తైలాభ్యంగనం. 
నువ్వులనూనె మర్దనం ఉష్ణాన్ని వెలికితీసి, వాతాన్నీ, చర్మదోషాల్ని హరిస్తుంది. దేహపుష్టినిస్తుంది, దేహంపై వున్న సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. అలానే ఈరోజున మఱ్ఱి, మామిడి, నేరేడు, మేడి, జువ్వి ఆకుల్ని నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళతో తలస్నానం చేయడం వలన దేహవర్చస్సుతో పాటు కళ్ళకు మంచిదని ఆయుర్వేద శాస్త్రం తెలుపుతుంది. 
అలానే,  మానసిక ఆరోగ్యం దృష్ట్యా హృదయాభ్యంగనం చేస్తే -
తైలమర్దనం ద్వారా శరీర జడత్వమును తొలగించుకున్నట్లే ...
 ప్రేమ, దయ, కరుణ శాంతి, సహనం క్షమత్వం, అవగాహన, విశ్వాసం పరోపకారం.....ఇత్యాది సద్గుణంలతో అభ్యంగనం... మానసిక వర్చస్సుని పెంచడమే కాకుండా యిది పారమార్ధిక ప్రగతికి సోపానమని ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలుపుతున్నాయి. 

నూతన వస్త్రధారణ :-
పాతదుస్తులనువిడిచి నూతనవస్త్రధారణచేయడం శుభప్రదం. ఈ ప్రక్రియ ఉత్సాహాన్ని, సంతోషాన్నిస్తుంది. 
పాత దుస్తులను విడిచిపెట్టినట్లు ... చెడును అహాన్ని వర్జించి సద్భావన ధారణ చేయడం మానవజన్మకు సార్ధకతను చేకూర్చుతుంది. 

'సంకల్పాదీ నూతన సంవత్సర నామ కీర్తనం'. 
చైత్రశుద్ధ పాడ్యమినాడు తైలాభ్యంగనము చేసి ఆ తర్వాత నూతన సంవత్సరము పేరు చెప్తూ, సంకల్పం మార్పుచేసి చెప్పాలి. అటుపై కాలస్వరూపుడైన పరమాత్మ అనుగ్రహంను కోరుతూ దైవపూజ చేయడం... ధూప దీప నైవేద్యాలు పూర్తిచేసుకొని నైవేద్యంగా పెట్టిన వేపపూత ఉగాది పచ్చడిని సేవించాలి.

నింబకుసుమ భక్షణం / ఉగాది పచ్చడి సేవనం :-
ఈ రోజున షడ్రుచులతో అలరారే ఉగాది పచ్చడిని సేవించడం ప్రధానమైనది. ఆరు ఋతువుల తత్త్వాన్ని ఆరు రుచుల పదార్ధంగా మలచి, కాలస్వరూపుడైన పరమాత్మునికి నివేదించి, ఆరగించడం ఆచారం.
                                 


ఆరుఋతువులకు ఆరు ధర్మాలున్నాయి. వాటిలో కొన్ని సుఖానికి, కొన్ని దుఃఖానికీ కారణమౌతున్నాయి. ఆయా ఋతువుల్లో అనుభవించబోయే సుఖదుఃఖాలని ఉగాది పచ్చడి రుచులలో నేడే చవిచూసి సుఖాలకు పొంగక, దుఃఖాలకు క్రుంగక ధైర్యంగా వుండడం అలవర్చుకోవాలనే ఈ పచ్చడి సంకేతం. ఆరోగ్య ప్రదాయిని అయిన ఉగాది పచ్చడిని సుఖదుఃఖ సమ్మిళతమైన మానవజీవితానికి సంకేతంగా పరిగణిస్తారు.
శతాయుర్వజ్రదేహృయు: సర్వసంపత్కచ రాయచ / సర్వారిష్ట వినాశాయ, నింబ కుసుమ భక్షణం //
ఈ వేప పూత పచ్చడి సేవనం...  
సర్వమైన అనగా చెడుగ్రహాలు, విపత్తులు, అనారోగ్యదాదులును నివారించి, సర్వ సంపదలను కల్గించే అదృష్టాన్ని వృద్ధిచేసి, దీర్ఘాయువును, వజ్రము వంటి దేహదారుడ్యము ప్రసాదిస్తుంది.
'మధురామ్ల లవణ తిక్తకటు కషాయాః' అని అంటుంటారు. మధురం(బెల్లం), ఆమ్లం(మామిడికాయ, చింతపండు), లవణం(ఉప్పు), తిక్తం(వేపపూవు), కటు(మిర్చి), కషాయం(మిరియం). 
కొన్ని ప్రాంతాలలో ఈ పచ్చడి తయారి కొంత భిన్నంగా వున్నప్పటికీ, వేపపూవు తప్పనిసరిగా వుంటుంది. అలానే ధర్మసింధు లాంటి శాస్త్రాలలో అశోక పల్లవాన్ని కూడా ఈ క్రింది శ్లోకం చదువుతూ సేవించమని తెలుపుతుంది. అశోక పల్లవం దుఃఖ నివారకం.
త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ/ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు //
ఓ అశోక కలికమా! జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను నిన్ను సేవించుచున్నాను. మధుమాసంలో చిగిర్చిన అశోకమా నీవు నన్ను శోకములు లేకుండా చేయుదువుగాక.
వేప క్రిమిసంహారిణి, ఆరోగ్య వర్ధిని. వేపపువ్వు రక్తశుద్ధిని చేసి, రోగానిరోధకశక్తిని పెంచుతుంది. మామిడి, చింతపండు ఆలోచనాశక్తిని, బుద్ధి సూక్ష్మతను పెంపొందిస్తుంది. మిగిలినవి శరీరపుష్టిని, మంచి ఆరోగ్యాన్ని, ఉష్ణ ఉపశమనాన్ని కల్గిస్తాయి. అంతే కాకుండా తీపి (బెల్లం) గురుగ్రహ అనుగ్రహాన్నిస్తుంది. రాహు కేతు కుజాది గ్రహాల పీడలకు ఔషదం మిరియాలు. కాబట్టి వీటిని సేవించడం ద్వారా గ్రహానుకూలతలు కూడా లభిస్తాయని పెద్దల వాక్కు. 

పంచాంగ శ్రవణం :-
అనంతమైన కాలాన్ని భగవంతుడిగా భావించి, ఆరాదించడం ఉగాది పండుగలో ఓ విశేషాంశం. కాలగణనకు ఓ నిర్దిష్ట రూపం పంచాంగం.
అనంతమైన కాలాన్ని మన వ్యవహార నిమిత్తం నామరూపాత్మకంగా విభాగించారు మన పూర్విజులు.
ఈ కాలాన్ని సూర్యసంచారాన్ని బట్టి - క్షణాలు, నిముషాలు, గంటలు, పగలు, రాత్రి, దినాలు, పక్షాలు, నెలలు,ఋతువులు, ఆయనాలు, సంవత్సరాలుగా విభజించారు. దీనిని తెలియజేస్తూ  పంచాంగమును రూపొందించారు. ఈ విధంగా కాలగణనను చేసి మొదటి ఋతువు అయిన వసంతంలో మొదటిమాసమైన చైత్రంలో మొదటి పక్షంలో మొదటిరోజైన పాడ్యమిని ఉగాదిగా జరుపుకోవడం ఆనవాయితి.   సృష్టి ఆరంభం, రాబోయే మార్పులు, భవిష్యత్ కాలగమనం, మంచిరోజులు, చెడుకాలం, కష్టాలు నష్టాలు, లాభాలు, నక్షత్ర గమనాలు, సూర్యోదయ అస్తమయ సమయాలు, నవగ్రహ సంచారాలు ... ఇత్యాది విషయాలు తెలియజేసేది పంచాంగం.
కాలగణనం మూడువిధాలుగా శాస్త్రం తెలుపుతుంది. అవి - 1సౌరమానం (సూర్యుని ఉదయాస్తమయాలను ఆధారంగా చేసుకొని నిర్ణయించేది)
2. చాంద్రమానం(చంద్రుని ఉదయాస్తమయాలు, వృద్ధి క్షయాల ఆధారంగా చేసే కాలనిర్ణయం)
3. బార్హస్పత్య మానం (గురుగ్రహంఅంటే బృహస్పతి గ్రహం యొక్క చలనమాధారంగా చేసే కాలగణన) మనం పాటించేది చాంద్రమానం.

పంచాంగం - ఐదు అంగములు. అవి ... తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం. 
కాలస్వరూపుడైన 'దైవం' నివసించి ఉండేది 'తిధి'లో. నవగ్రహాలు ఆ దైవాన్ని సేవిస్తూ ప్రదక్షిణం చేసేదినం వారం. క్షతం కాకుండా కాపాడేది నక్షత్రం. చంద్రుడు నక్షత్రంతో కలిసివుండే కాలం యోగం. కరణ మంటే సాధనలో కార్యసాఫల్యత. అందువలన కాలస్వరూపుడైన పరమాత్ముణ్ణి పంచాంగ రూపంలో  పూజించడం, పెద్దల చెంత శ్రవణం చేయడం ఓ సంప్రదాయం.
తిధేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్య వర్ధనమ్
నక్షత్రార్ధరతే పాపం, యోగాద్రోగ నివారణమ్
కరణాత్కార్య సిద్ధిస్తు, పంచాంగ ఫల ముత్తమమ్
కాల విత్కర్మా కృద్దీయాన్ దేవతానుగ్రహం లభతే
పంచాంగ శ్రవణంచే తిధివల్ల సంపదయును, వారము వలన ఆయుష్షును, నక్షత్రం వలన పాపపరిహారమును, యోగము వలన వ్యాధినివృత్తియును, కరణము వలన కార్యానుకూలతయును కలుగును. కావున కాలము దెలిపి కర్మము చేయువారు భగవదనుగ్రమును పొందుదురు. ఈ ఐదును కాలదేవత అంగాలుగా చెప్తారు.
పంచాంగ శ్రవణం ఉగాది నాటి విశేష ఆచారం. ఈ రోజున పంచాంగ శ్రవణం గంగాస్నానంతో సమానమైన ఫలాన్నిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
తిధిర్యారం చ నక్షత్రం యోగః కరణఏవచ / పంచాంగస్య ఫలం శ్వణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్://
పెద్దల ద్వారా పంచాంగ శ్రవణం చేయడం, వారి ఆశిస్సులు పొందడం, కష్టసుఖాలను, ఏది మంచో చెడో తెలుసుకుంటూ... వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం... ఇదో శుభపరిణామంనకు నాంది. 
ప్రపాదానం :-
సేవాభావం, సాటి ప్రాణుల యందు దయ లాంటి సద్గుణాలు అలవడాలని బాటసారులకై, సర్వప్రాణులకై ... ఉష్ణశాంతిని, దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మన శాస్త్రాలు ఉద్భోదిస్తున్నాయి. దీనినే ప్రపాదానమని అంటారు.
సమాజసేవకై చలివేంద్రాల ఏర్పాటు ... 
ఇక్కడ ఓ విషయం జ్ఞాపకం వస్తుంది. ఈ మధ్యనే నా ప్రియనెచ్చలి 'విశాల' వాట్సఅప్ లో ఓ సందేశం పంపింది - 
                                        
ఓ చిన్ని గిన్నిలో నీరు పోసి పక్షుల దాహార్తిని తీర్చడమ్... ఇదికూడా ప్రపాదానమే
ఈ ప్రపాదానము వలన పితృదేవతలు సంతృప్తులై సుఖశాంతులను ప్రసాదిస్తారని, మనోరధములన్నీ సిద్ధిస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఈ ప్రక్రియ సేవాభావాన్ని, మానవత్వాన్ని మేల్కొలుపుతుంది. 

 గురు రాజ మిత్ర బంధు సందర్శనం :- 
గురువులను, పెద్దలను, బంధుమిత్రులను కలుసుకొని అత్మీయాతానుబంధాలను పెంచుకోవడం ... నేను, నా కుటుంబం అని అనుకోకుండా వ్యక్తులమధ్య సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకోవడం ... మంచి భావనతో, మంచి సంకల్పంతో, మంచి ఆకాంక్షతో శుభాకాంక్షలు తెలుపుకోవడమనే అద్భుత ప్రక్రియలను పెద్దలు పెట్టడానికి కారణం... ఈ విధమైన విధివిధానములు బాహ్యంగా దేహాన్ని, అంతరంగికంగా హృదయాన్నిశుద్ధి చేస్తాయి. 'నా' సంకుచితభావం నుండి 'మన' అని అనుకునే సద్భావన సహృదయత అలవడుతుంది. 
ఒక్క మాటలో చెప్పాలంటే - "మనలో వున్న స్వభావదోషాలను వదులుకొని సరిక్రొత్తగా సరైనరీతిలో మనల్ని తీర్చుదిద్దుకోవడమే ఉగాది అంతరార్ధం". 
                                     

ఈ ఉగాది అందరిలో...  
సత్సంకల్పానికి నాంది పలుకుతూ,  వినూత్న జీవనానికి క్రాంతులను వెదజల్లుతూ ఆయురారోగ్య ఆనందాలను నింపుతుందని కాంక్షిస్తూ ... 

అందరికీ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు.