22, ఆగస్టు 2017, మంగళవారం

శ్రీ గణపతిని సేవింపరారే .....

                                                                             
                                               
శ్రీ గణేశ ప్ర్రార్ధన 

తుండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్ 

మెండుగ  మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ 

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 

యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్!


భాద్రపదమాసం - 
చాంద్రమాసరీత్యా పౌర్ణమినాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండటంవలన ఇది భాద్రపద మాసం. 
భాద్రపద శుక్ల చతుర్థి -
ప్రణవస్వరూపుడు, ఆదిదేవుడు, ప్రథమపూజ్యుడు, సకల శుభప్రదుడు, కల్యాణ మంగళ స్వరూపుడు అయిన "గజాననుని" ఆవిర్భవం. 
(పార్వతీదేవి అభ్యంగన స్నానమాచరిస్తూ, నలుగుపిండితో బాలుని సృష్టించి, ప్రాణప్రతిష్ట చేసి, ద్వారంవద్ద కావలి ఉంచగా, తనను అడ్డగించినందుకు శివుడు రుద్రుడుగా మారి ఆ బాలుని శిరస్సు ఖండించి, పిదప పశ్చాత్తాపపడి, ఏనుగు శిరస్సుతో ఆ బాలున్ని పునరుజ్జీవుని జేయడంతో 'గజాననుడు'గా పేరువచ్చింది). 
భాద్రపద శుక్ల చతుర్థి -
గజాననునికి ఈశ్వరుడు గణాధిపత్యాన్ని ప్రసాదించిన రోజు. 
(దేవగణాలకు అధిపతిని నియమించాలని పార్వతీపరమేశ్వరులు వినాయకుడు, కుమారస్వామిలలో ఎవరు సమర్థులో పరీక్షించదలచి, ముల్లోకాలలోని పుణ్యతీర్ధాలను సందర్శించి ఎవరు ముందుగా వస్తారో వారిని గణాధిపతిగా నియమిస్తామని చెప్పగా, ఆ క్షణమే కుమారస్వామి నెమలివాహనంపై పయనమవ్వగా, మూషికవాహనుడు ముమ్మారు తల్లితండ్రులకు ప్రదక్షిణం చేసి, పుణ్యనదుల్లో స్నానంచేసిన పుణ్యఫలాన్ని సంపాదించి, గణాలకు అధిపతి కాగలిగాడు). 
ప్రణవ స్వరూపం గణపతిం -
సృష్ట్యాదిలో జగత్ సృష్టికి ఏర్పడిన విఘ్నాలను తొలగించడానికి బ్రహ్మ ధ్యానమగ్నుడు కాగా, ఆ పరబ్రహ్మ ఓంకారస్వరూపునిగా, వక్రతుండునిగా (వక్రతలను తొలగించేవాడు. సరిగ్గా కార్యములు సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. ఈ వక్రాలను తొలగించేవాడు వక్రతుండుడు) దర్శనమిచ్చి విఘ్నాలను తొలగించాడు. 
                                                        
సృష్టికి శ్రీకారం 'ఓం'కారరూపంలో ఉద్భవించినది. వేదమంత్రాలు గణాలైతే వాటికి మూలమైన ఓంకారమే గణపతి. సనాతనధర్మంలో సర్వదేవతా శక్తులకు మూలం ఓంకారం. సృష్టారంభంలో, మంత్రంలో, యంత్రంలో, సమస్తదృశ్య ప్రపంచంలో, త్రికాలాదుల్లో, ప్రత్యణువులో ప్రస్ఫుటమయ్యే విశ్వజనీనమైన, విశ్వవ్యాప్తమైన, సర్వ సమగ్రమైన 'ప్రణవ'స్వరూపమే గజాననుడు. అందుకే ఈ వక్రతుండున్ని ఓంకారస్వరూపుడుగా 'గణపత్యధర్వ శీర్షం' వర్ణించింది. ఏడుకోట్ల మంత్రరాశికి మూలమైనవాడు కాబట్టే 'సప్తకోటి మహామంత్ర మంత్రితావయవ ద్యుతిః' అని సహస్రనామార్చనలో కొలుస్తారు.  
ప్రథమపూజ్యుడు -
వ్యాసులవారు వేదములను విభాగం చేసి పురాణములను రచించాలని ప్రారంభించినప్పుడు ఆదిలోనే అనేక విఘ్నాలు ఏర్పడగా, బ్రహ్మ చెంతకు వెళ్ళి కారణమడుగగా 'స్మరణంవా గణేశస్య ప్రారంభే అన్యస్య వా'  ఏదైనా కార్యం ప్రారంభినప్పుడు ముందుగా గణపతిని ఆరాదించాలి. అది నీవు మరిచావు అనిచెప్పగా, ఎవరీ గణపతి అని వ్యాసులవారి ప్రశ్నకు బదులుగా బ్రహ్మ ఇలా చెప్తారు -
సప్తకోటి మహామంత్రా: గణేసస్యాగమే స్థితాః 
ఓంకార రూపీ భగవాన్ బీజంచ గణనాయకస్య 

అలాగే, దేవతలు అమృతంకై క్షీరసాగర మధనం చేస్తుండగా మధ్యలో పుట్టిన హాలాహలం ధాటికి తట్టుకోలేక దేవతలంతా శివుణ్ణి ఆశ్రయించగా, శివుడు ఇలా చెప్తారు - 
కార్యారంభేతు విఘ్నేశం యేనార్చంతి గణాధిపం 
కార్యసిద్ధిం నతేషాంవై భవేతు భవతాం యధా 

అందుకే - పారమార్ధిక కార్యమైనా, ప్ర్రాపంచిక కార్యమైనా ప్రధమంగా వినాయకుణ్ణి పూజించడం ఆచారం. 
                           
గణేశుడు -
జ్ఞానర్ధ వాచకో గశ్చణశ్చ నిర్వాణ వాచకం 
తయోరీశం పరం బ్రహ్మ గణేశం  (బ్రహ్మవైవర్త మహాపురాణం)
 'గ' జ్ఞానార్ధవాచకం, 'ణ' నిర్వాణ వాచకం. ఈ రెండింటికీ ఈశుడైన పరబ్రహ్మయే 'గణేశుడ'ని మహావిష్ణువు చెబుతాడు. 
గజాననుడు -
ముఖం గజవదనం. పైభాగం గజం. 'గ' గమ్యమైనది 
శరీరం నరాకారం. క్రిందభాగం జగం. 'జ' కారణమైనది. 
క్రింద భాగమైన నరాకారం త్రిగుణాత్మక ప్రకృతికి సంకేతం. గజాకారం పురుష (పూర్ణ) తత్త్వానికి ప్రతీక. ప్రకృతికి చైతన్యం - పురుషుడు, పురుషునికి ఉపాధి - ప్రకృతి. ఈ రెండింటి ఏకత్వమే ఈ విశ్వచలనం. చిన్మయమైన ఈశ్వరతత్త్వం గజవదనం. మాయమయమైన ప్రకృతి నరాకారం. పార్వతీపరమేశ్వరుల సమన్వయతత్త్వమే గణపతి ఆకృతి. శరీరం శక్తిమయం, శిరస్సు శివమయం. 
గ' అనే అక్షరం గతిని ,సూచిస్తుంది. 'జ' అనే అక్షరం జన్మను సూచిస్తుంది. ఈ 'గజ' అన్న పదం "ఈ జగత్తు ఎవరినుండి వెలువడిందో వారి వైపే సాగిపోతూ చివరికి వారిలోనే లయమవ్వడాన్ని సూచిస్తుంది. 
గణాధిపతి  - 
గణపతిని జేష్ఠరాజుగా, బృహస్పతిగా, బ్రహ్మణస్పతిగా, వేదాలు అభివర్ణించాయి. 'బృహతీనాం వేదవాచాం పతిః' బృహతి అనగా వాక్కులు. దీనికి అధిపతి బృహస్పతిగా, వేదవిజ్ఞానాలు,ఉత్తమ కర్మలే బ్రహ్మణాలు. వీటికీ అధిపతి బ్రహ్మణస్పతిగా స్తుతించాయి.  
మంత్ర గణాలకీ, జీవగణాలకి అధిపతి. ఛందో గణాలకు అధిపతి. అందుకే గణాధిపతి అనే పేరు వచ్చింది. 
గణ అంటే పుర్యష్టకము (ఎనిమిదింటితో కూడుకున్న పురం). 1. పంచకర్మేంద్రియాలు, 2. పంచజ్ఞానేంద్రియాలు 3. పంచభూతాలు 4. పంచప్రాణాలు 5. కామ 6. కర్మ 7. అవిద్య 8. మనస్సు - వీటితో కూడుకున్నదే సూక్ష్మదేహం. వీటి ఆధీశ్వరత్వమే గణేశ్వరత్వం.
సంకేతాలమయ స్వరూపం - 
తత్త్వపరంగా గణపతి నామాలకు ఎన్ని పరమార్ధాలున్నాయో, ఆయన ఆకృతిలో అన్ని అంతరార్ధాలు, అద్భుత సంకేతాలున్నాయి. 
ఏనుగుతల నుంచి ఎలుకవాహనం దాకా ... అంగాంగామూ అమూల్యమైన సంకేతమే. గుమ్మడికాయంత తల గొప్పగా ఆలోచించమని చెప్తుంది. చాటెడు చెవులు శ్రద్ధగా వినమంటాయి. బుల్లినోరు వీలైనంత తక్కువగా మాట్లాడమంటుంది. చిన్నికళ్ళు సూటిగా లక్ష్యానికే గురిపెట్టమంటాయి. బానపొట్ట బ్రహ్మాండాన్ని, స్థిరత్త్వాన్ని తలపిస్తుంది. తొండం ఎటైనా తిరుగుతుంది. ఎంతదూరమైనా చొచ్చుకొని వెళ్తుంది. ఎంత సూక్ష్మమైనదైనా సునాయాసంగా అందుకోగల్గుతుంది. ఎంత పెద్ద బరువైన అవలీలగా అందుకుంటుంది. జ్ఞానసముపార్జనలో ఈ రీతిలో ప్రయత్నం ఉండాల్సిందేనన్న సంకేతమిస్తోంది. మనిషిలోని చంచల స్వభావమే చిట్టెలుక. అహాల్నీ అత్యాశల్నీ ఎప్పుడూ నెత్తిన ఎక్కించుకోకూడదు. నిగ్రహశక్తితో వాటిని ఓడించాలి. మెడలువంచి సవారీ చేయాలి. 
మరింత నిశితంగా పరిశీలిస్తే - 
వినాయకుడి తల ఏనుగుది. ఏనుగు జంతువులన్నింటిలో సూక్ష్మగ్రాహి. కళ్ళు చిన్నవే కానీ, చూడగానే దేనినైనా ఆకళింపుచేసుకుంటాయి. చేటల్లాంటి పెద్దచెవులు. చేటను సంస్కృతంలో 'శూర్పం' అని అంటారు. కనుకనే గణపతికి 'శూర్పకర్ణుడు' అని మరియొక నామం. పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదిలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించమనే సంకేతమిస్తున్నాడీ శూర్పకర్ణుడు. 
మనిషికూడా మాటల్లో చెడుని వదిలిపెట్టి, మంచిని మాత్రమే తనచెవులద్వారా గ్రహించాలన్న సంకేతముంది. పెద్దతల జ్ఞానానికి గుర్తు. ఒకే ఒకదంతం శక్తికి చిహ్నం. పెద్దబొజ్జ బ్రహ్మాండాన్ని తనలో ఇముడ్చుకున్నానని సూచిస్తుంది. వక్రతుండం బుద్ధి కుశలతకు ప్రతీక. గణపతి వక్రతుండం ఓంకార ప్రతీక. చేతిలోని పాశ అంకుశాలు రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. మోదకం ఆనందానికి ప్రతీక. పరమానందాన్ని ప్రసాదిస్తాడు గణపతి. లంబోదరానికి బిగించిన సర్పం కుండలినీ శక్తికి సంకేతం.
గణపతి వాహనం ఎలుక. (మూషికుడనే రాక్షసుడు విఘ్నేశ్వరునితో యుద్ధంలో ఒడి, శరణుజొచ్చగా అతన్ని వాహనంగా చేసుకున్నట్లు పురాణకధనం). ఎలుక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములకు ప్రతీక. అంతేకాదు, తమో రజోగుణాలు విధ్వంసకారక శక్తికి సంకేతం. 
{ఇదియే కాక, సింహం నెమలి కూడా వాహనాలైనట్లు ముద్గలపురాణం చెబుతుంది. మత్సరాసురుడనే రాక్షసుని సంహారనిమిత్తం వక్రతుండావతారం దాల్చినప్పుడు సింహం వాహనమైనది. కామాసుర సంహారనిమిత్తం వికటావతారమెత్తినప్పుడు నెమలి వాహనమైంది}.
                                                 
                                       
ప్రకృతి ప్రియుడికి పత్రార్చన - ఏకవింశతి పత్రపూజ - 
గణపతి పూజకు 21 రకాల పత్రాలను వినియోగిస్తారు. ఈ పత్రాలన్నీ అత్యంత ఔషధగుణాలున్నవి. ఈ ఔషధ రకాలకు చెందిన మొక్కలను తాకడం, వాటిని తుంచి సేకరించడం, వినియోగించడం ద్వారా వాటిలో ఉండే ఔషధీ విలువలను మనం పొందగలం. గణపతి ఏకవింశతి (21) సంఖ్యాప్రియుడు. 21 దూర్వాలతో (గరికలతో) పూజించమని పెద్దలు పేర్కొంటారు. ఈ 21 అనే సంఖ్యకు అంతరార్దంగా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, మనస్సు అని భావన చేసి శరణాగతితో సమర్పణ చేసిన, జన్మసాఫల్యానికి మార్గం సుగమం అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు అర్ధం చెప్తుంటారు. 
గరికపోచలు ఇరవైఒకటిగా కూర్చి, వాటితో చేసే పూజ గణపతికి ఎంతో ప్రీతికరం. (పూర్వం అనలాసురుడనే రాక్షసుడు అగ్నిజ్వాలలు వెదజల్లుతూ భయభ్రాంతులను చేస్తూ ఉంటే, ఆ రాక్షసున్ని పట్టి, అగ్నిని చల్లార్చి నశింపజేసిన గణపతిలో తాపం జనించగా, ఎన్ని ఉపచారాలు చేసిన ఆ తాపం తగ్గకపోవడంతో, ఎనభైఎనిమిది వేలమంది ఋషులందరు కలిసి ఒక్కొక్కరూ ఇరవైఒకటి చొప్పున గరికెలు తెచ్చి స్వామికి వీచగా, తాపం ఉపశమించడంతో గరికపూజ ప్రీతికరమని కధనం). 
'ఓం ఓషధీవతంతు నమః' అనేది విఘ్నేశ్వరుని సహస్రనామాల్లో ఒకటి. ‘సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశినీ’ అంటూ శ్రుతి గరికను దేవి అని ప్రస్తావించింది. ఇది దుస్వప్నాలను నివారిస్తుంది. స్వప్నతుల్యమైన జగత్తులో అజ్ఞాన ప్రేరిత స్వప్నస్థితి నుండి మెళుకువను (జాగృతి) అభిలషిస్తూ కేవలం నిరాకార నిర్గుణ సద్గుణ తత్త్వబోధకై గణపతి పూజలో ఋషులు గరికను విధించారని శాస్త్ర వచనం.
జ్యోతిష్య శాస్త్ర సంకేతాలు -
హస్తా నక్షత్ర సంజాతం విఘ్నేశ్వరం గజాననం 
పార్వతీ హదయాంబోధి సోమాంసదా స్మరామ్యహమ్ 
జనన నక్షత్రం హస్త. కన్యారాశి. మేషరాశి నుండి ఇది ఆరవరాశి. కాలభావచక్రంలో షష్టమభావం శత్రు, ఋణ, రోగాలను తెలియజేస్తుంది. ఈ మూడూ మానవుని పారమార్ధిక ప్రగతికి, ప్రాపంచిక ప్రగతికి విఘ్నాలు కలిగిస్తుంటాయి. అందుకే ఈ రాశిలో చంద్రుడు ఉండగా, పుట్టిన విఘ్నేశ్వరుడు ఈ మూడు రకాలైన విఘ్నాలను తన భక్తులకు తొలగిస్తాడు. అంతేకాదు, కన్యారాశినుండి చంద్రుడు సమసప్తక దృష్టితో సూటిగా వీక్షించే రాశి మీనరాశి. ఇది కాలరాశి చక్రంలో పన్నెండవ రాశి. కాలభావచక్రంలో ఈ పన్నెండవ భావం వ్యయాన్ని, బంధనాన్ని, అజ్ఞాతశత్రువుల్నీ తెలుపుతుంది. ఇవన్నీ మన ప్రగతికి విఘ్నాలే. అయినాసరే, కన్యలో కూర్చొని ఈ విఘ్నాలపైనా కూడా దృష్టి సారించి, సవరిస్తాడీ హస్తిముఖుడు. 
చతుర్థి పూజ పరమార్ధం - 
జగత్తు త్రిగుణాలతో కూడింది. దీనికి మూలమైన పరమాత్ముడు ఏకం. రెండూ కలిపితే నాలుగు. ఈ సంఖ్య గణపతిని తెలియజేస్తుంది. అ, ఉ, మ - మూడు. (ఓం). నాల్గవది తురీయం. ఈ నాలుగింటి సమైక్యరూపమైన ఓంకారమే గణపతి సాకారం. ఏకమైన పరమాత్మనీ, మూడైన ప్రపంచాన్ని కలిపి ఒకే భగవత్స్వరూపంగా చూడడమే గణపతి ఆరాధనలో అంతరార్ధం. 
శుక్ల  పక్ష చవితిచంద్రుడు అంటే దినదిన ప్రవర్ధమానమయ్యే చంద్రుడు. ఈరోజు వినాయకుణ్ణి త్రికరణశుద్ధిగా ఆరాధిస్తే మనమూ దినదిన ప్రవర్ధమానమౌతామని తెలుపుతుంది శాస్త్రం.
అవతారాలు - అసురసంహారాలు - అంతరార్ధాలు -
వక్రతుండావతారంతో మత్సరాసురున్నీ, ఏకదంతావతారంతో మదాసురునీ, మహొదరావతారంతో మోహాసురున్నీ, గజాననావతారంతో లోభాసురున్నీ, లంబోదరావతారంతో క్రోధాసురున్నీ, వికటావతారంతో కామాసురున్నీ, విఙ్ఞరాజావతారంతో మమాసురున్నీ, ధూమ్రకర్ణావతారంతో అహంకారాసురున్నీ సంహరించినట్లుగా ముద్గలపురాణంలో గణేషలీలలయందు వివరింపబడింది. ఈ ఎనిమిది అవతార లీలల్లో అసురనామాలను పరిశీలిస్తే అవి స్పష్టంగా మానవులోని అసురశక్తులకు సంకేతాలని అవగతమౌతుంది. ఈ ఎనిమిది అసురీప్రవృత్తులను అణచేవాడు గణపతి. 
సాధారణంగా మనం విఘ్నాలకు కారణం బాహ్య పరిస్థితులు, మన చుట్టూ ఉన్న మనుష్యులు అని భావిస్తాం. కానీ, అసలు విఘ్నాలకు కారణం మన మనస్సే. అందువల్ల బాహ్యమైన విఘ్నాలు తొలగాలని, చేపట్టిన కార్యాలు సిద్ధించాలని, శుభాలు చేకూరాలని పూజించేకంటే మనలోనున్న విఘ్నాసురులను నశింపజేయమని ప్రార్ధించడం ఉత్తమం. 
విఘ్నకారకాలైన అంతరంగ అసురులు నశించినప్పుడే శాంతి వెల్లివిరుస్తుంది, సమతాభావం నెలకొంటుంది, మమతాభావం పెరుగుతుంది, ధర్మనిరతి పెంపొందుతుంది, ప్రాపంచిక ఆనందం సాధ్యమౌతుంది, పారమార్ధిక ప్రగతి సాకారమౌతుంది, జన్మ ధన్యమౌతుంది. 
గణేష్ నవరాత్రుల్లో రోజుకో సంకేతంను అకళింపు చేసుకొని అన్వయించుకుంటే చాలు, తొమ్మిదోరోజు మనలోని చెడునంతా నిమజ్జనం చేయవచ్చు. 
తత్త్వరహస్యాలు -
యోగశాస్త్రం ప్రకారం గణపతి మూలాధార స్థితుడు. మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది. ఈ శక్తిని మేల్కొల్పడానికి గణపతి బీజాక్షరమే సాధనం. పృథ్వితత్త్వంలో ఉన్న పరమేశ్వర చైతన్యమే గణపతిగా పంచాయతనంలో ఆరాధిస్తారు. ఈ భావానికి సంకేతంగా మట్టితో మూర్తిని మలచి, పత్రాలతో ఫలాలతో అర్చించి, తిరిగి జలతత్త్వంలో మిళితం చేస్తారు. అందుచే ప్రకృతీ ప్రేమికుడైన గణేశుడి ప్రతిమను మట్టితో తయారుచేసి, పూజలనంతరం భక్తిశ్రద్ధలతో ప్రవహించేజలాల్లో నిమజ్జనం చేయడం సర్వవిధాలా శ్రేయస్కరం. 
                                                     
                                   శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం 


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః 
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే 
పై శ్లోకం గణపతిని ఈ పదహారు నామాలతో పూజిస్తే ... విద్యారంభంలో, వివాహంలో , క్రొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, యుద్ధంలో ఇలా సకల కార్యాములయందు ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యాలు సిద్ధిస్తాయని ఫలశ్రుతి. ఎంతటి అద్భుతమైన ఫలశృతి యిది. 
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా 
సంగ్రామే సర్వకార్యేషు విఘ్న: తస్య న జాయతే 
'విద్యారంభే'- విద్యారంభం నందూ, అంటే విద్యను నేర్చుకునేటప్పుడు, అనగా బ్రహ్మచర్యాశ్రమంలోనూ,
'వివాహేచ'- వివాహామందు, అనగా గృహస్థాశ్రమంలోనూ, 
'ప్రవేశే' -  ఒక చోటు లేదా ప్రదేశమందు ప్రవేశించించుట యందునూ, అనగా, క్రియలోనికి ప్రవేశించినప్పుడునూ,  
'నిర్గమం' - తిరిగి వచ్చుట లేదా తిరిగి వెళ్ళుట. అనగా ఓ క్రియ నుండి తిరిగి మరో క్రియలోనికి తిరిగి వచ్చుట యందునూ, అంటే మొదట ప్రవేశించిన కార్యమునుండి మరలి, వేరే కార్యంలోనికి వెళ్ళినప్పుడూ,  
'సంగ్రామే' - జీవితమంటే మంచి చెడుల, సుఖ దుఃఖాల, వివిధ అనుభవాల అనుభూతుల సమాహారం. ద్వంద్వాలతో కూడుకున్నది. అందుకే జీవితమొక సంఘర్షణ లేదా పోరాటమని  విజ్ఞులంటారు. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోక చిలుకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. అజ్ఞానంతో పోరాడితేనే జ్ఞానం వికసిస్తుంది. పోరాటంనుండే జీవనమారంభమౌతుందని పెద్దలు పేర్కొంటారు. అంటువంటి సంఘర్షణ లేదా పోరాటం  ఓ యుద్ధమే. అట్టి సంఘర్షణమయ సంగ్రామంలో విఘ్నాలుండక విజయమే సిద్దిస్తుందనీ,
'సర్వకార్యేషు విఘ్న: తస్య న జాయితే' - పై యే కార్యమలందూ విఘ్నాలుండవని, శాస్త్ర వచనం. 
ఇంతటి ఫలశ్రుతినిచ్చే ఈ పదహారునామాలను త్రికరణశుద్ధిగా భక్తిశ్రద్దలతో మన నిత్యప్రార్ధనలో భాగం చేసుకుంటే సదా సర్వత్రా శ్రేయోదాయకం. 

[పండుగ అంటే క్రొత్తబట్టలు, పిండివంటలు, బంధుమిత్రుల కలయిక ... మాత్రమే కాదు, ప్రతీ పండుగలో అంతరార్ధముంటుంది. మనిషి మనీషి కాగలిగే పరమార్ధాలుంటాయి. ఎన్నో సందేశాలుంటాయి. వాటిని అవగాహన చేసుకొని, ఆచరణలోనికి తేగలిగితేనే జన్మ చరితార్ధమౌతుందని మా తాతయ్యగారు చెప్పిన మాటలు, అప్పుడప్పుడు అక్కడక్కడా విన్నవీ, చదివినవి మననం చేసుకుంటూ, మరో మూడురోజుల్లో రాబోతున్న 'వినాయక చవితి' సందర్భంగా గణపతయ్య పాదపద్మములకు సమర్పించుకుంటున్న చిరు పుష్పమీ టపా]