13, మే 2018, ఆదివారం

అమ్మా! నీకు నా వందనం ...

శ్రీ మాత్రే నమః

                                   

సృష్టిలోనే అద్భుతమైనది, అమూల్యమైనది, అద్వితీయమైనది "అమ్మాబిడ్డల అనుబంధం". మా అమ్మను తలుచుకుంటూ ... గతంలో ప్రచురించిన 'శ్రీ మాత్రే నమః' అన్న టపాను పునఃప్రచురణ చేస్తున్నాను.                                       

మానవ సంబంధ బాంధవ్యలన్నింటిలోనూ మాతాబిడ్డల సంబంధం విశిష్టమైనది, విడదీయరానిది; త్యజింప వీలుకానిది, తరింపజేసింది.
ఆత్మీయతకు, అనుభూతికి, ఆర్ద్రతకు, అర్పణకు ఆనవాలు "అమ్మ". 
 ప్రేమ, త్యాగం, సేవ, సహనంలకు మరోపేరు "అమ్మ". 

పుట్టించడం, జీవితాన్నివ్వడం, మరల సమయింపజేయడం .....  
సృష్టి స్థితి లయలకు కారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. 
స్థితి లయలకు మూలకారణం సృష్టి. 
ఆ సృష్టించేది బ్రహ్మ. బ్రహ్మ ఉపకరణాలకు అన్నింటికీ కేంద్రబిందువు "అమ్మ". ఆమెలో బ్రహ్మ అంశే లేకపోతే సృష్టి జరిగే అవకాశం లేనేలేదు. అందుకే 'న మాతుః పరదైవతమ్'  అని శ్లాఘిస్తారు.

మన భారతావని విశ్వపూజ్యం కావడానికి కారణాలు వేదాలు, పురాణ ఇతిహాసాలు, ఆత్మసాక్షాత్కారం పొందిన ఋషివర్యుల మార్గనిర్ధేశాలు, సద్గురువుల సద్భోధనలు.....వీటిని ఓ సంప్రదాయంగా  మన పెద్దలు మనకు అందించబట్టి. {'సమ్యక్ స రహస్యం ప్రదీయత ఇతి సంప్రదాయః' అతి విలువైన విషయం గురువులచేత శిష్యులకు ఉపదేశింపబడునది. సనాతనంగా సద్గురువులచే ఆచరింపబడుతూ మానవజాతి శ్రేయస్సుకై, శిష్యపరంపరగా ఉపదేశింపబడుతూ వస్తూ వున్నదే 'సంప్రదాయం'}. 
                                            
జన్మనిచ్చిన తల్లి, పోషణ భారం వహించే తండ్రి, ప్రతీ శరీరధారికి తొలిదైవాలని, వారిని తొలుత సేవించడం మన సంప్రదాయం.
శిశువు ఆరోగ్యంగా పుట్టేందుకు నవమాసములు ఆహార నియమాలు పాటిస్తూ, చక్కటి బిడ్డకై భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ, వికారాల్ని ఇబ్బందుల్ని భరిస్తూ, ప్రసవ వేదననుభవిస్తూ జన్మనిస్తుంది. పిదప తన రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది. బిడ్డను చూసి మురిసిపోతుంది, ఆనందంతో తబ్బిబ్బు అవుతుంది. తల్లి ప్రేమ అనూహ్యం, అనిర్వచనీయం, అవర్ణ్యం, అచింత్యం, అద్భుతం, అపారం, అవాజ్యం.
                                             
ప్రతీ ప్రసవమూ స్త్రీకి పునర్జన్మే అయినా తల్లి కాకుండా ఉండటాన్ని ఇష్టపడదు కనుకనే, తల్లికి అంత అత్యంతోత్కృష్టమయిన స్థానమివ్వబడింది. 'మాతృదేవోభవ' అని కీర్తింపబడుతుంది. 
యం మాతా పితరౌ క్లేశం సహేతే సంభవే నృణామ్ |
న తస్య నిష్కృతిః శక్యా, కర్తుమ్ వర్ష శతైరపి ||
శిశువు జన్మించినప్పుడు తల్లితండ్రులు వహించే శ్రమకు ప్రతిఫలం ఏమి ఇచ్చిన తీరదు. నూరేళ్లు తల్లిదండ్రులుకు సేవ చేసినా ఆ ఋణం తీరదని మనుస్మృతి పేర్కొంటుంది.
ఇదే రీతిలో, లోకానికి దుఃఖ నివృత్తిమార్గం చెప్పిన అద్వైతసిద్ధాంత ప్రతిష్టాత, పరమేశ్వరాంశ,  జగద్గురువు అయిన శ్రీ శంకరులు, తన తల్లి అవసానదశలో ఉండి తనని స్మరించగానే ఆమె దగ్గరకు చేరి ఆమెకు సద్గతిని కలిగించిన సందర్భంలో చెప్పిన ఐదు శ్లోకములు (మాతృ పంచకం) ద్వారా మహత్తరమైన మాతృభక్తిని మహాద్భుతంగా ప్రకటించారు. అందులో ఓ శ్లోకం -
ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా 
నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ 
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.
అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను అనుభవించావో కదా. 
కళను కోల్పోయి, శరీరం శుష్కించి, శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా. ఎవరూ అలాంటి బాధను సహించ లేరు.
ఎంత ఉన్నతుడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు నమస్కారం చేస్తున్నాను.
అవతారపురుషుడైన ఓ అమ్మకు కొడుకే. అవతారపురుషులతో సహా ఈ సత్యాన్ని ఆచరణాత్మకంగా లోకానికి చాటారు.
సన్యాసం పుచ్చుకున్న వ్యక్తికి అందరు నమస్కరించడం సంప్రదాయం. పూర్వాశ్రమంలో తండ్రియైన వారు కూడా సన్యాసాశ్రమం స్వీకరించిన కుమారునికి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. లోకంలో అన్ని బంధాలు త్యజించి సన్యాసం స్వీకరించిన వ్యక్తి అయినను తల్లికి మాత్రం తనే నమస్కరించాలి. తల్లి స్థానం అంతటి ఘనిష్టమైనది.
సనాతనధర్మం సన్న్యాసయినా, గృహస్థుడైనా కన్నవారిని సాక్షాత్తు దైవాలుగా భావించి వారికి సముచిత స్థానాన్నిచ్చి గౌవరవించడంను అత్యున్నత ధర్మంగా అభివర్ణించింది.

                                
ఉపాధ్యాయాన్ దశాచార్యా: ఆచార్యాణాం శతమ్ పితాః |
సహస్రం తు పితౄన్ మాతా గౌరవే నాతి రిత్యతే ||  (మనుస్మృతి)
గౌరవించదగిన వారిలో ఉపాధ్యాయుల కన్నా ఆచార్యులు పదిరెట్లు ఎక్కువ . ఆచార్యుల కన్నా తండ్రి వందరెట్లు ఎక్కువ కాగా, తల్లి ఆ తండ్రి కన్నా వేయిరెట్లు ఎక్కువ.
 స్వ: సుఖం గమయతి ఇతి స్వర్గ:!
మహాభారతంలో యక్షుడు యుధిష్టరుని భూమికంటే గొప్పదేదని ప్రశ్నించాడు దానికి సమాధానంగా
'మాతా గురుతరా భూమే'! 
మాతృమూర్తి పృదివి కంటే గొప్పదని ,విలువైనదని, ఉన్నతమైనదని సమాధానమిచ్చాడు. ఎందుకంటే 
 'నాస్తి మాతృ నమో గురు:'! 
                                                            

                                       

"భూప్రదిక్షణ షట్క్ న కాశీయాత్రా యుతేనచ, 
సేతుశ్నాన శోతైర్యశ్చ తత్పలం మాతృవందనే "

ఆరుమార్లు భూప్రదక్షణ చేసిన, పదివేలసార్లు కాశీయాత్ర చేసినా, అనేక వందమార్లు సముద్రస్నానం చేసిన వచ్చే పలితం కంటే తల్లిని ఓ మారు నమస్కరిస్తే ఎక్కువ ఫలమొస్తుంది.

పుత్ర ప్రభావంతో అమ్మల ధన్యత
పుత్రుల ప్రభావంతో ముక్తిత్వం పొందిన అమ్మలు కొందరు -

శ్రీరామచంద్రుడు తన తల్లి కౌసల్యకు, కపిలమునివర్యులు తనతల్లి దేవహూతికిను ఇచ్చటనే బ్రహ్మతత్త్వం ఉపదేశించి తరింపజేశారు. ఇది ఉత్తమోత్తమ పద్దతి. 
శ్రీ శంకరాచార్యులవారు తనతల్లి యగు ఆర్యాంబకు  ఈశ్వరభక్తిని ఉపదేశించి కైవల్యప్రాప్తిని కలిగించెను. (శ్రీ శంకరులు అద్వైత ముక్తిరావాలని బ్రహ్మతత్త్వంను మాతృదేవికి ఉపదేశించినను తల్లి దానిని గ్రహింపజాలక పోవడంవల్ల  స్తోత్రాలను పఠిస్తూ ఉపాసనామార్గం వల్ల కైవల్యప్రాప్తిని కలుగజేయుటకు కారణమైనది). ఇది ఉత్తమ పద్దతి. 
శ్రీ రమణులు తన తల్లి అలగమ్మ అంత్యకాలంలో చెంతనే వుండి ఆమె హృదయంపై తన కుడిచేతిని, శిరస్సుపై ఎడమచేతిని ఉంచి, హస్త దీక్ష (శక్తిపాతం) ద్వారా ముక్తినొసగిరి. (ఈమె కూడా బ్రహ్మజ్ఞానమును గ్రహింపజాలకపోవడంతో ఈ రీతిలో మోక్షప్రాప్తిని కలిగించిరి) ఇది మధ్యమ పద్దతి. 
సత్కర్మలు, పుణ్యతీర్ద సందర్శనములు, పురాణశ్రవణంలు, యజ్ఞములు, పవిత్రమగు వ్రతములు మాతాపితరులచే చేయించి వారికి సర్గలోకప్రాప్తికి అర్హులుగా జేయుట  కనిష్ట పద్దతి. 
జీవించి ఉండగా తల్లితండ్రులకు ఉత్తమోత్తమ పద్దతియగు బ్రహ్మజ్ఞానమును, ఉత్తమపద్ధతి యగు దివ్యమంత్రోపదేశ దైవోపాసనలును, కనిష్ట పద్దతియగు కర్మానుష్టాన వ్రతాదులును జేయనీయక మరణానంతరం శాస్త్ర విధానుసారం పితృకర్మలను, దానములను నిండుభక్తి శ్రద్ధలతో చేయడం సామాన్య ధర్మం. 
జనని ప్రభావంతో తనయుల ఉన్నతి
తల్లుల ప్రభావంతో ఉన్నతస్థితిని పొందిన తనయులు కొందరు - 
నేను ఇలా ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మే. హరిశ్చంద్రుని సత్యదీక్ష, శ్రీరామచంద్రుని పితృవాక్య పరిపాలన, ధ్రువుని దృఢదీక్ష, శిబి చక్రవర్తి దాన శీలత్వం, ధర్మరాజు ధర్మనిరతి ..... వీరపురుషుల గాధలు, యోధుల విజయాలు, ఉన్నత విలువలను తెలుపుతూ నన్ను ధీరోదాత్తుడిగా మలచిన వీరమాత నా తల్లి జిజియాబాయి అని తల్లిని కీర్తించింది - 'ఛత్రపతి శివాజీ'.  
నేను ఈ ప్రపంచంలో అమితంగా ప్రేమించే వ్యక్తి  ఎవరంటే అది మా అమ్మే.  అందరూ కొడుకుల్ని తమ కోసం కంటే, మా అమ్మ ఈ లోకం కోసం నన్ను కన్నదనిపిస్తుంది. నేను ఈ ఉన్నతమైన జీవితాన్ని స్వీకరించడానికి స్ఫూర్తి మా అమ్మే. ఎన్నెన్నో బాధలు, కష్టాలు, త్యాగాలుతో జీవనం సాగిస్తూ, ఎన్నో ప్రార్ధనలు, ఉపవాసాలు, మొక్కులతో తనో యోగినిగా మారింది. ఆ పూజల ఫలమే నేను. నా జీవితానికి, కార్యాలకు, నడవడికకు ఆమె వ్యక్తిత్త్వమే నిరంతర ప్రేరణ. నా ఈ జీవితం మా అమ్మ భువనేశ్వరీదేవి భిక్ష... అని తల్లిని శ్లాఘించింది - 'స్వామి వివేకానంద'. 
                                                
ఉపాధ్యాయురాలైన ఓ తల్లి తన తనయునికి వేదాధ్యయనం చేసి,  సన్యాసం స్వీకరించమని కోరగా, తల్లి ప్రేరణతో ఆయన తమ చెవి ప్రోగులు అమ్మి ఋషీకేస్ వెళ్లి అచట ఒక ఆశ్రమములో చేరారు. ఆ తదుపరి దయానంద సరస్వతిగారి వద్దకు చేరి, వేదాధ్యయనం చేసి మనందరికీ జ్ఞానామృతాన్ని పంచుతున్న తనయుడు 'స్వామి పరిపూర్ణానంద సరస్వతి'గారు. కళ్లులేని ఆ మహిమాన్వితురాలు లోకానికి జ్ఞాననేత్రం తెరిపింపజేసే పుత్రునికి స్ఫూర్తిమయి.  

                                  
సాగరతరంగాలు, సువర్ణ సైకతాలు, భక్తి విశ్వాసాలు,
రామేశ్వరం మసీదు వీధి అన్నీ కలిసి ఒక్కటైతే
అది మా అమ్మ!
అమ్మా! నీకు నా వందనాలు
సర్వేశ్వరుని కృపావీక్షణాలతో జీవితాన్ని పవిత్రంగా బలపర్చావు
ఆ పవిత్రతే నీ పిల్లలకు శ్రీరామ రక్ష.
ఆ పరమాత్మ ప్రేమదృక్కులు నీ రూపంలో ప్రసరించాయని విశ్వసిస్తాను
ఆరోజు నిండు పున్నమిరాత్రి ...
నేనెందుకో కన్నీటితో ఉలిక్కిపడి లేచాను
నీకు నీ బిడ్డ బాధ తెలుసు
నీ లాలించే చేతులతో మృదువుగా నా కన్నీళ్లను తుడిచావు
నీ ఆలన, నీ పాలన, నీ నమ్మకం నాకు బలాన్నిచ్చాయి
ప్రపంచాన్ని నిర్భయంగా ఎదుర్కోవడం నేర్పాయి
సర్వేశ్వరుని శక్తిని నాలో నిలిపాయి
నీ ఋణాన్ని ఎలా తీర్చుకోను
అమ్మా! అంతిమతీర్పు రోజున ఆ  పై లోకంలో
నిన్ను తప్పక కలుస్తాను...  ఇది తన తల్లి అశియమ్మకు స్మృతాంజలి ఘటిస్తూ చెప్పినవారు 'అబ్దుల్ కలాం'. 
వీరంతా జగద్వితితులు. వీరేకాదు, ఇలా తల్లుల ప్రభావంతో ఉన్నతస్థితిలో ఉన్నవారు ఎందరో కలరు. 

                                       
పరమాత్ముని సృష్టికి మరల ప్రతిసృష్టిని చేసే దివ్యమైన శక్తులను భగవంతుడు తల్లికి ప్రసాదించాడు. ఆ తల్లిని శ్రద్ధతో పోషించడం దేవతలను సేవించడంతో సమానమని ఉపనిషత్కారులు అంటున్నారు. తల్లి శ్రద్ధామూర్తి. ఆమె చల్లని నీడలో శాంతి లభిస్తుంది. తల్లిని సేవించేవారు మాతృదేశాన్ని ప్రేమిస్తారు. మాతృదేశానికి మాన్యతనిస్తారు. "మాన్యతే పూజ్యతే యా సా మాతా!"..పూజ్యార్హురాలు తల్లి.

అన్ని శాస్త్రాలు, మతాలు తల్లికే తొలిపీఠం వేసినా, నేటి కొందరు మనుజుల మనోపీఠంలో ఆ మాతృస్థానం పదిలంగా లేక ఇంటిలో ఓ గదికో, వృద్ధాశ్రమంలకో  పరిమితం చేస్తున్నారు. ఎంతమంది తల్లితండ్రుల మాటలకు విలువనిస్తున్నారు? మాటలకు విలువివ్వడం అటుంచి, మాటలు వినడానికే సమయమివ్వడం లేదు. వారి చెంతన కాసేపు కూర్చొని ఆత్మీయంగా మాట్లాడే తీరికే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతీఒక్కరి తల్లితండ్రులు తమ బిడ్డల వలన ధన్యత పొందాలని, వారి ప్రేమ వాత్సల్యములతో ఆనందంగా జీవనం సాగించాలని కోరుకుంటారు. తల్లితండ్రుల మనస్సులకు సంతోషం కలిగేటట్లు తాము జీవించడం, వారిని సేవించడం, గౌరవించడం, వృద్ధాప్యంలో పోషించడం, ఆదరించడం, మన సంప్రదాయంలో ప్రధానమైనది.
జీవించియున్నప్పుడు తల్లితండ్రులను ఆదరింపకయు, మరణానంతరం పితృకర్మలను సరిగ్గా చేయకయు నుండు పుత్రులు మృతప్రాయులని శాస్త్రములు పేర్కొనగా, తలితండ్రులయందు దయలేని పుత్రుండు పుట్టనేమి, వాడు గిట్టనేమి అని కఠినంగా అంటారు ఒక శతకారుడు. 

ల్లిని మించిన గురువు ఈ లోకంలో మరొకరు లేరు.
మాతృత్వం అంటే భౌతికంగా ఓ బిడ్డకు జన్మనివ్వడం కాదు, మాతృభావన అనేది భౌతికస్థాయికి మించింది. సాక్షాత్తు ఆ జగన్మాతయే వాత్సల్యం, దయ, శాంతి, శ్రద్ధ, ప్రేమ, త్యాగం, ఓరిమి ..... మొదలగు సమస్త సద్గుణముల రూపంలో స్త్రీల హృదయంలో దాగి ఉందని, లోకంలోని స్త్రీలందరిలోను ఆమె అంశ ఉందని దేవి మహత్యంలో వర్ణింపబడింది. అందుచే పై సద్గుణములతో శోభిల్లే స్త్రీలందరూ మాతృస్వరూపులే.       
                  అమ్మకు అమ్మై పుడితే తప్ప అమ్మఋణం తీర్చుకోలేం.

                                      మాతృహృదయులందరికీ 🙏 

1 కామెంట్‌:

  1. దైవ మన్ని చోట్ల దర్శనమివ్వక
    అమ్మరూపమెత్తి అవని జేరె
    స్వార్థ రహిత ప్రేమ సాకార మాయెరా
    మంచిమాట వినుడు మాన్యులార!
    ---విద్వాన్ మారేడురాముడు.

    రిప్లయితొలగించండి