2, డిసెంబర్ 2018, ఆదివారం

స్వీయ సంఘర్షణ

గత కొద్దిరోజులుగా కాస్త అస్వస్థత. ఆ కారణంగా నిద్రలేమి, నీరసం, అలసట. నిన్నటిరోజు వేకువన, కాస్త సహజ సిద్ధమైన గాలికై మేడ మీదకు వెళ్లాను. మా ఇంటికి కాస్త దూరంలో టైరులను కాల్చుతుండడంతో ... ఆ వాసనతో కలుషితమైన గాలి... ప్చ్!
కొంతసేపు అనంతరం - పనమ్మాయి రాక, ఆమె అంట్లు తోము చున్నంతసేపు పూర్తిగా కొళాయి ఇప్పేసి బకెట్ నిండి, నీరు వృధాగా పోతున్నా, పని పూర్తయ్యేవరకు కట్టదు ఎన్నిసార్లు చెప్పిన, చెప్పిన రెండుమూడురోజులు వరకు  మాత్రమే మాట వినడం. అటుపై యధాస్థితి... నీరు కరువై కొందరు, నీరు  వృధా చేస్తూ కొందరు ఇక్కడ జల దుర్వినియోగం, మరొక చోట వ్యర్ధ పదార్థాలతో జలకాలుష్యం ... ప్చ్.
సాయంత్రం ఓ పని నిమిత్తం బయటకు వెళ్తూ, శివాలయం దగ్గర ఆగాను. శివాలయం ప్రహరీ ముందు కొబ్బరిపెంకులు, వాడినపువ్వులు, ఖాళీ పాల కవర్లు, విరిగిన మట్టిప్రమిదలు, ప్లాస్టిక్ కవర్లు ..... కుప్పలా చెత్త. ఆ చెత్తలో ఏదో వెతుక్కొని తింటూ రెండు కుక్కలు,  పాలపాకెట్ పీకుతున్న ఆవు ...  పరిసరాల కాలుష్యం...  ప్చ్!
ఇలా వ్యర్ధాలతో గాలి, నీరు, భూమి ... కలుషితం కావడం ... ఏదో బాధ... దాని గురించే ఆలోచనలు. నాలో నాకే సంఘర్షణ. ఒంట్లో బాగుండదానివి బాగలేనట్లు వుండక, ఎందుకే ఇన్ని ఆలోచనలు అని నాలో నేననుకున్నా, విదిలించుకున్న వదలక మదిలో కదిలాడే అవే దృశ్యాలు, అవే ఆలోచనలు. .

బాగుందోయి, గుడికి వెళ్ళినవారు కొబ్బరికాయలు, పండ్లు, అభిషేకముకై పాలు తీసుకెళ్తారు కదా, కార్తీకమాసమాయే, అసలే శివయ్య అభిషేకప్రియుడాయే, ఇవన్నీ సహజమేనమ్మా, భక్తులు ఏదో తమ భక్తానుసారం భగవంతుణ్ణి ఇలా ఫల పుష్ప క్షీరాదులతో సేవిస్తుంటారు, నీవు కూడా అప్పుడప్పుడు పంచామృతాలతో, క్షీరాదులతో నమక చమకాల నడుమ అభిషేకాలు చేస్తుంటావు కదా, అయినా కృష్ణపరమాత్మే చెప్పాడు కదా, పత్రం పుష్పం ఫలం తోయం ... అని!
ఆ అన్నట్లు, గతంలో నీవొ పోస్ట్ లో- సత్కర్మలకు, సాధనలకు పవిత్రంగా ఉపయోగించే దేహ'పత్రం'ను, ఎలాంటి కలుషితాలు అంటని స్వచ్ఛమైన హృదయ'పుష్మము'ను, నిష్కామ కర్మ'ఫలా'న్ని, 'తోయమ'నే భక్తిరసంతో మేళవించి కృష్ణార్పణం చేయడమే ఆ శ్లోకంకు అర్ధమంటూ పెట్టావు కదా, అందరూ అలా అనుకొని ఉండలేరమ్మా ... అంటూ మరల మనసు గోల ... 
నిజమే,  నేను పోస్ట్ పెట్టాను. నేనే కాదు ఎందరెందరో వివిధరీతుల్లో ఈ శ్లోకంకు అర్ధం తెలిపారు. అయితే ఆ శ్లోకం చివరలో ఓ మాట జోడించి చెప్పారు కృష్ణపరమాత్మ, 'ప్రయతాత్మనః' అని!  ప్రయతాత్మనః అంటే పరిశుద్ధమైన మనస్సు కలవాడని అర్ధం. పరిశుద్ధమనస్సు కలవాడు తన భక్తికొలది సమర్పించిన పత్రపుష్పాదులను స్వీకరిస్తానని తెలిపాడు. ఆ పరిశుద్ధత మనస్సుకు ఎలా వస్తుంది? శుభ్రత లేని నడవడిక మనస్సును శుద్ధత పరుస్తుందా?
దుర్వాసన వస్తే భరించలేక ముక్కు మూసుకుంటూ అక్కడనుండి వెళ్ళిపోతాం,  కలుషితనీరు త్రాగం, అటువంటి నీరు ఉన్నచోటునుండి నిలబడలేం. కలుషిత పదార్ధాలు భుజించలేం, సరికదా, పరిసరాలు బాగుండని చోట మంచి ఆహరమును  కూడా స్వీకరించలేం, ఇటువంటి ప్రదేశాల్లో మన మనస్సు కూడా ఏకాగ్రతగా ప్రశాంతంగా స్థిరంగా ఉండలేదు కదా. అందుకే అంటున్నా -  మన చేతలు మన మనస్సుని పరిసరాలను శుభ్రపరిచేవిగా ఉండాలి.
ఇక, అభిషేకాలు చేయడం, ఫలపుష్పాదులు సమర్పించడం తప్పని అనడంలేదే, పరిసరాలు కలుషితం చేయడం తప్పంటున్నాను. పూజ అనంతరం అనవసర వ్యర్ధాలను అలా శివాలయ పరిసరమందే పారెయ్యక, వాటిని ఓ మూత  ఉన్న చెత్తడబ్బాలో పడేయడం చేయాలిగానీ, ప్చ్... మరల నిట్టూర్పా ... అసలు ఎందుకే నీకింత బాధా ... ఎవరో నాలో నన్నే నిలేస్తున్న భావన... అవునూ ... ఎందుకింత బాధా? నన్ను నేనే ప్రశ్నించుకున్నా ... అప్పుడు నాలో కదిలాడారు నా కుటుంబ పెద్దలు. 

నా చిన్నప్పుడు మాది కట్టెల పొయ్యే. ఉదయాన్నే మా మేనత్తగారు గానీ, అమ్మగానీ, చిక్కటి పేడనీటిలో ముంచిన చిన్న బట్టతో పొయ్యి అలికి, ముగ్గులేసి, కట్టెలు పెట్టి, వెలిగించి, నమస్కరించి వంట ప్రారంభించేవారు. నూతి దగ్గర, ముందు తోడిన చేదలో నీటిని గానీ, అలాగే మున్సిపాలిటీ కొళాయి నీరు బిందెలో పట్టేముందు గానీ, ముందు నీటిని తాకి, కళ్ళకు అద్దుకునేవారు. అసలు లేస్తూనే భగవత్ స్మరణతో భూమిని తాకి నమస్కరించేవారు. ఎందుకని అడగగా, అన్నింటా ఉన్నది ఆ భగవంతుడేనమ్మా, ఆయన స్వరూపములైన వీటిని నమస్కరిస్తే, ఆ నమస్కారం ఆ భగవంతునికే  చేరుతుందని తాతయ్య చెప్పడం బాగా జ్ఞాపకం. ఆనాడు వారు చెప్పింది అంతా చాదస్తమని భావించి తర్కానికి దిగాను. పెద్దయ్యాక అవగాహన కొచ్చింది. ఆచరణలో పెట్టాక సాత్వికత అలవడింది. అగ్నిదేవుడని, వాయుదేవుడని, జలదేవతయని, భూదేవియని ఇలా అన్నింటా దేవుడును, దేవతని చూసే సంస్కృతి మనది. పెద్దవారు వారి వారి పనుల ద్వారా ప్రకృతిని ఆరాధించడం తెలియజేశారు. కానీ, మనం ఏం చేస్తున్నాం? 

 ఆధ్యాత్మికత అంటే వాదన కాదు, విశ్వాసం. ఆధ్యాత్మికత తర్కంగా ప్రారంభమై, సత్యంగా నిలిచి, జగమంతా కనిపించి, సర్వమూ సర్వేశ్వరుడే అన్న సమ్మతితో ముగుస్తుంది.  
              
పరమేశ్వరునికి "అష్టతనువులు" అన్న పేరుంది. వేమనగారు కూడ తన పద్యాలలో చెప్పారు, 'అష్టతనువు లమర హరుడౌట నెఱుగరో' అని. 

మాయా ఉపాధిచే అంతటా వ్యాపించి వున్న సర్వేశ్వరునికి - వాయువు, భూమి, జలము, అగ్ని, ఆకాశం,  మహాతత్వం, అవ్యక్త తత్త్వం, అహంకార తత్త్వం అనే ఎనిమిది రకాల తత్త్వములను తనువులుగా చెప్తుంటారు మహర్షులు. అంటే వాయువు, భూమి, జలము, అగ్ని, ఆకాశమనే పంచభూతాలు పరమాత్ముని మొదట అయిదు తనువులు. భగవంతుణ్ణి అభిషేకించే మనం, శుద్ధంగా పూజించే మనం ఆయన తనువులైనట్టి గాలి, నీరు, భూమిలను శుద్ధంగా ఉంచుకోవద్దా? పరమాత్ముని పట్ల అపేక్ష, ఆయన తనువుల పట్ల ఉపేక్షా... తగునా ఇది? పరమాత్మను పవిత్రంగా భావించినట్లే పరమాత్మ సృజనను కూడా పవిత్రంగా తలచి, ఉంచాలన్నదే నా భావన. మన పరిసరాలు బాగుంటే మనం ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటాం, తద్వారా మన మనస్సు శుద్ధత పొందుతుంది. 
                                              


ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే.ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే. అందుకే పెద్దలు అంటుంటారు - "దేవుడిని తలంచని జీవులుంటారు కానీ, జీవుడిని స్పర్శించని దేవుడు లేడు" అని! 

భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా
నాయొక్క ఈ మాయ, భూమి, జలం , అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని ఎనిమిది విధములుగా విభజించబడిందని గీత యందు పరమాత్మ చెప్తారు కదా. 

పంచభూతములు బ్రహ్మాండంలోనూ, మనలోనూ ఉన్నవి. ఈ పంచభూతాలు మరియు మనస్సు, బుద్ధి, అహంకారం అనే తనువులు మనవి. ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే మన దేహం. ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం. ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.
స్థూల దేహంలో - పంచభూతాలకు ప్రతీకలుగా పంచేంద్రియాలు (చెవి, నాసిక, నేత్రం, నాలుక చర్మం) ఉంటే,  సూక్ష్మ దేహంలో పంచ కోశాలుగా అమరివున్నాయి. అంతేకాదు,భూతత్వంనకు చెందిన మూలాధారం, జలతత్వానికి చెందిన స్వాధిష్టానం,  అగ్నితత్త్వానికి ప్రతీకగా మణిపూరకచక్రం, వాయువుకు ప్రతీకగా అనాహతం, ఆకాశతత్త్వానికి ప్రతీకగా విశుద్ధిచక్రం అనే ఐదు శక్తి నాడీకేంద్రములున్నాయి మనలో. 

మన నడవడిక, అలవాట్లు, ఆలోచనలు, సంస్కారాలు, ప్రారబ్ధ వాసనలు బట్టి ప్రభావితమౌతూ పైవన్నీ పనిచేస్తుంటాయి. మన చేష్టలు సక్రమంగా లేకుంటే ఇవి క్రమ క్రమంగా శక్తిని కోల్పోతుంటాయి. అందుకే అనేక శారీరక మానసిక అనారోగ్యాలు. పంచేద్రియాలు, పంచకోశాలు, పంచ చక్రాలు జాగృతి పరచాలంటే బాహ్యమున, అంతరమున అష్టతనువులను శుద్ధతగా వుంచితే చాలు. 
ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతాలు మనలోనూ ఉండడమే కాదు, వాటి యొక్క ఆశ్రయంతోనే మనం జీవిస్తున్నాం. అది మరిచి, నిప్పు, నీరు, నేల, గాలి లను కలుషితం చేస్తే ముప్పు మనకే కదా, మరి అది తప్పు కాదా? 
ప్రకృతిని ప్రాపంచికంగా సద్వినియోగపరుచుకుంటూ, పారమార్థికంగా పరమాత్మస్వరూపమనే ఆపేక్షభావంతో  చూడగలగాలి. అప్పుడే సర్వత్రా సర్వేశ్వరుడున్నాడన్న భావన మనలో బలీయమౌతుంది. ఎప్పుడైతే మనం కాంచినదంతా  పరమాత్మమయంగా భావించి దానిని పవిత్రంగా చూస్తామో, అప్పుడే మన అంతరంగాలు ఆటోమేటిక్ గా పవిత్రమవుతాయి.


ఎన్ని పూజలు చేస్తేనేం? ఎన్ని సాధనలు చేస్తేనేం? 'భావశుద్ధివిహీనానాం సమస్తం కర్మ నిష్ఫలమ్'...  భావశుద్ధి సంపూర్ణముగా కలగనివారి సమస్త కర్మలును నిష్పలములు.  

సాధారణముగా సాధకుని సాధనాక్రమం - భగవంతుడు ఉన్నాడనే భక్తిభావంతో ప్రారంభమై, నామస్మరణతో కొంత ముందుకెళ్లి, నాలో ఈశ్వరుడు ఉన్నాడు అనే నమ్మికతో దృఢపడి, సర్వత్రా సర్వేశరుడున్నాడనే స్ఫురణతో పుంజుకొని, "నేను" గా ఈశ్వరుడు ఉన్నాడు అనే ఎఱుకతో మౌనమౌతాడు. ఆ స్థితికి రావాలంటే అందుకు సహకరించాల్సినవి ఈ అష్టతనువులే. 

భగవంతుని అష్టతనువులు ప్రకృతిగా భాసిల్లుతూ, చైతన్యంగా మనకు కావాల్సిన ప్రజ్ఞానాన్ని అందిస్తుంటుంది. మన అంతరంగాన్ని శుద్ధి చేయటం, మన చూపును పారదర్శకం చేయటం, పరమేశ్వరుని తత్త్వం ఎరుక పర్చటమే వాటి లక్ష్యం. ఆ లక్ష్యంతో మనం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాటి ధర్మాలను వీడక వర్తిస్తున్నాయి. కానీ, ఆ ప్రజ్ఞానం మనకు ఎందుకు అందడం లేదో, అందరం గ్రహిస్తే  బాగుంటుంది. 
దేనినీ పట్టించుకోకుండా, విమర్శించకుండా ముందుకు సాగిపోతున్నఅప్పుడప్పుడూ ఇలాంటి స్వీయ సంఘర్షణలు తప్పడంలేదు.  

7 కామెంట్‌లు:

  1. మీ సంఘర్షణ సందేశాత్మకం.

    ప్లాస్టిక్ కవర్స్ భూమిలో కలవవు, భూకలుషితం చేయవద్దని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్న అవే వాడుతున్నాను. బయట పడేస్తున్నాను. పంచభూతాల ప్రభావం మన ఆరోగ్య అంతరంగాల మీద ఇంతలా ఉంటుందని ఇప్పుడే అర్ధమైంది. ఇకపై క్లాత్ బాగ్స్ మాత్రమే వాడాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. 😊

    పత్రం పుష్పం, ఫలం తోయం అన్న గీతా శ్లోకంను ఎందరెందరో వివిధ రీతుల్లో విశ్లేషించారని అన్నారు, అవి కూడా తెలియజేయండి ప్లీజ్. మంచి పోస్ట్ 👌

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రమణి గారు, మీ స్పందనకు ధన్యవాదములు.

      ఆధ్యాత్మిక అభిలాషపరులు అనేక కోణాల్లో విశ్లేషణలు చేసుకుంటూ, తెలుసుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఒకొకరి భావవ్యక్తీకరణ ఒకోలా ఉంటుంది. ఎవరు ఎలా వ్యక్తీకరించిన అందులో అంతర్లీనంగా భక్తితత్త్వమే ఉంటుంది, ఆ పరమాత్మ జాడలే ఉంటాయి.

      వాట్స్ అప్ ద్వారా వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్స్ ఇవి. ఈ విశ్లేషణలు ఎవరివో తెలియదు గానీ, వారి విశ్లేషణ బాగుంది. వారికి నమస్సులు.

      మొదటి విశ్లేషణ -

      పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి

      తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః
      ‘ఎవరైతే నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను. జలమైనను
      భక్తితో సమర్పిస్తారో... వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను’ అనే ఈ శ్లోకం ద్వారా ఆయన ఏం చెపుతున్నారంటే -
      ఈ దేహమే ఓ ‘పత్రం’. పండుటాకులాగే ఈ దేహం కూడా ఏదో ఒక రోజు రాలిపోతుంది. ఈ సత్యాన్ని గుర్తించి, చేసే ప్రతి కర్మను ఫలాపేక్ష రహితంగా చేస్తూ, ఆ భగవంతుని పాదాలపైన ‘పత్రం’లా రాలిపోవాలి. ఈ జన్మను ఓ తులసిదళంలా చేసి ఆ స్వామి అర్చనకు వినియోగించాలి. అదే జన్మ ఎత్తినందుకు సార్థకత. ఈ ‘పత్రార్చనను’ ఆ పరమాత్ముడు ప్రేమగా స్వీకరిస్తాడు.
      ఈ విధమైన ‘పత్రార్చనకు’ అలవాటుపడ్డ మానవుని మనోక్షేత్రంలో మొగ్గలావున్న ‘భక్తి’ పుష్పంలా వికసిస్తుంది. ఆ ‘భక్తి పుష్పాన్ని’ ఆ పరమాత్ముని పుష్పార్చనకు వినియోగించాలి. భగవంతుడు కోరుకనేది ఈ ‘భక్తిపుష్పాన్ని’. ఈ ‘పుష్పార్చనను’ భగవంతుడు ప్రీతిగా స్వీకరిస్తాడు.
      పూవు... పండుగా మారడం ప్రకృతి సహజం కదా. ఎప్పుడైతే ‘భక్తిపుష్పం’ తన సుగంథాలతో ఆ భగవంతునికి ‘ధూపసేవ’ చేస్తూ అలసి, సొలసి, వాడిపోతుందో, ఆ ‘భక్తిపుష్పం’, ‘ఙ్ఞానఫలం’గా రూపాంతరం చెందుతుంది. ఆ ‘ఙ్ఞానఫలాన్ని’ భగవంతుడుకు నివేదన చేయాలి. మన దేహక్షేత్రంలో పండిన ఈ ‘ఙ్ఞానఫల’ నివేదను ఆ జగన్నాథుడు ప్రీతిగా భుజిస్తాడు.
      ఇవన్నీ చేస్తున్న భక్తుని కళ్లనుండి ‘ఆనందాశ్రువులు’ జలజల రాలతాయి. అదీ.. ఆ జలం..ఆ ఉదకం..ఆ తోయం.. భక్తిసేద్యంలో అలసి సొలసి ఉబికిన ఆ ‘ఆనందాశ్రువులు’ భగవంతుడుకు సమర్పించాలి. ఆ ‘ఆనందాశ్రువులతో’ ఆ దేవదేవుని అభిషేకించాలి. ఆయన సేవలో నీ ‘ఆనందాశ్రువులు’ ఆవిరై.. ఆ స్వామి శ్వాసగా మారాలి. అదే.. అదే.. ‘ఆత్మనివేదన’. ఇంతకు మించిన అర్చన మరేదీ లేదు.
      రెండవ విశ్లేషణ -
      "పత్రం పుష్పం ఫలం తోయం "అన్నశ్లోకంలో ఒక విచిత్రమైన అంతరార్థం వుంది.
      1. 'పత్రం' అంటే- పడిపోయేది పత్రం.
      మనిషిని పడేసేది--మనస్సు కాబట్టి --మనసే పత్రం!
      2. 'పుష్పతీతి పుష్పం'--అంటే "వికసించేది పుష్పం. మనిషిలో వికసించేది బుధ్ధి--బుధ్ధియే పుష్పం!
      3. ' ఫలతి '--విశీర్యతే ప్రహరైః అంటే వేటుల చేత,విశీర్యతే అంటే పగులునది--ఫలం.
      జ్ఞానబోధ అనే దెబ్బల చేత పగిలేది మనసులోని 'అహoకారం' కాబట్టి , అహంకారమే --ఫలం !
      4.త్రాయతేప్రాయతేతి--తోయం --రక్షించేది కనుక తోయం. సోహం భావం తో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తుంచుకుని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఈ చిత్తమే --తోయం. భగవంతునిలో ఐక్యభావన కలిగినపుడు పరవశంతో కలిగే ఆనందాశ్రువులే, ఈ తోయం.
      ఐక్యభావన చిత్త లక్షణo కాబట్టి 'చిత్తమే-తోయం'.
      మనం భగవంతునికి సమర్పించవలసినదీ - ఏ పూజలోనైనా చిట్టచివరిగా మామూలు మనస్సు గాక
      మంత్రపూతమైన మనస్సనే మంత్ర పుష్పాన్ని సమర్పించడం లోని అంతరార్థం ఇదే ! (పుష్పం అంటే ఐదురేకలు కలిగిన పువ్వు. అంటే పంచజ్ఞానేంద్రియాలతో కూడిన మనస్సే ఈ పుష్పం.)

      తొలగించండి
  2. sweeya sangharshana inka vunnatangaa aalochimpajestundi..
    udaaharana mee post..
    chala bagundi.

    రిప్లయితొలగించండి
  3. నమస్తే భారతిగారు! నా బ్లాగ్‌లో మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీరు చాలా మంచిమంచి విషయాలు చెప్తున్నారు. కృతజ్ఞతలు!

    రిప్లయితొలగించండి

  4. ల.సౌ భారతి. మీరు ముందుమాట రాసిన ఇ.బుక్ మొదటి పదిలో ఉన్నదని కినిగె వార్త

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదండీ ... ఆ ఘనత మీ రచనలకున్నది.

      తొలగించండి