6, నవంబర్ 2019, బుధవారం

కిరాతార్జునీయం - అంతరార్ధం

ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే కిరాతార్జునీయం ఓ యోగసాధన. అది పరిశీలన చేసేముందు ఓసారి ఆ కధను తెలుసుకుందాం -
అరణ్యవాసం చేస్తున్న పాండవులను చూడడానికి వచ్చిన కృష్ణభగవానున్ని, ఈ కష్టకాలమునుండి ఎలా బయటపడతామని ధర్మరాజు ప్రశ్నించగా -
                                 
                           
కృష్ణభగవానుడు,
"ఎవరు మంగళం లన్నింటికీ కూడ అలవాలమో, ఎవరి అనుగ్రహం శుభాల్ని యిస్తుందో, ఎవరు ఆశీర్వాదిస్తే శ్రేయస్సు కల్గుతుందో, ఆ దయాళువయిన శివుడు గురించి తపస్సు చేయ"మని చెప్పెను.   

అటుపిమ్మట ఓసారి, 'వైరిబలం కంటే అధికబలం సంపాదించాలంటే శివకటాక్షం వుండాలనీ, అర్జునుడిని తపస్సు చేసి శివానుగ్రహంతో పాటు పాశుపతాస్త్రం పొందమనే వేదవ్యాసమునీంద్రులవారి సూచనతో, అర్జునుడు న అన్న అనుజ్ఞతో ఇంద్రకీలాద్రికేగి, తపస్సు ప్రారంభించెను.
                              

కొన్ని సంవత్సరాల తపస్సు పిమ్మట వృద్దబ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు వచ్చి, 'దేనికి తపస్సు చేస్తున్నావయ్యా' అని అడుగగా, శివునికై చేస్తున్నాను, నాకు పాశుపతాస్త్రం కావాలి అని అర్జునుడు చెప్పగా, మహాజ్ఞాని కృపాళువు అయిన శంకరుని అనుగ్రహం కల్గితే మోక్షమడగాలి గానీ, యుద్ధాలు, గెలుపోటములు,  గొడవలు లేని పరమపదం కోరకుండా, యుద్ధంలో వాడుకోవడానికి అస్త్రం అడుగుతావా ... అమాయకుడా అని ఇంద్రుడు అనగా, మా అన్నగారు శివానుగ్రహం పొంది పాశుపతాస్త్రం తెమ్మని చెప్పిరి. వారి మాట నాకు ఆచరణీయం. మధ్యలో వచ్చి సలహాలు ఇవ్వక, ఇక్కడనుండి వెళ్ళండి అని అర్జునుడు అనగా, అంతట నిజరూపంలో ఇంద్రుడు సాక్షాత్కరించి అర్జునుని క్షాత్రధర్మమును మెచ్చి, 
ఇకనుంచి పంచాక్షరి మంత్రంతో పార్ధివలింగమును పూజిస్తూ తపస్సు చేయమని చెప్పగా, ఆ ప్రకారంగా అర్జునుడు కఠోర తపానికై పూనుకున్నాడు. 
                     
                         
తపోదీక్ష పూనడంలో పాండవమధ్యముడి పట్టుదల అసామాన్యం, అప్రతిమానం. 
దినములు మాసములై, మాసములు సంవత్సరములై, తపోనిష్ఠలో సవ్యసాచి సడలక సాగిపోతుండగా, మెచ్చిన శివుడు కాస్త అర్జునుని శక్తిని పరీక్షించదలచి,  ముకాసురుడు అనే రాక్షసుడిని పిలిచి "నీవు అడవిపందిగా మారి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న చోటుకి వెళ్ళి పెద్దగా రొద చేయమ"ని చెప్పగా, 
                         
                         
ఆ రాక్షసుడు పంది రూపమున వెళ్ళి పెద్దగా రొద చేస్తుంటే, ఆ చప్పుడుకి కళ్ళు తెరిచిన అర్జునుడు, వీడెవడో రాక్షసుడు అయి వుంటాడని తలచి, రాక్షసుడుని సంహరించ దలచి, ధనస్సు అందుకొని బాణం సంధించగా, 
తత్ క్షణమునే కిరాతక రూపధారి అయిన శివుడు సంధించిన బాణం పంది పృష్టభాగం నుండి శరీరం లోనికి వెళ్ళి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలపడగా, మరుక్షణంలో అర్జునుని బాణం పంది నోట్లోంచి శరీరంలోనికి వెళ్ళి పృష్టభాగం నుంచి వెలుపలికి వచ్చి నేలపై పడింది. అప్పుడు కిరాతకులుగా వచ్చిన ప్రమధగణములు మా నాయకుడు వేసిన బాణమిది, మా నాయకుడే పందిని చంపెను అని అనగా, 
లేదు లేదు, నేనే చంపానని అర్జునుడు... కాసేపు వాగ్వివాదం జరిగాక,  అంతటి మొనగాడు మీ నాయకుడు అయితే నాతో యుద్ధానికి రమ్మనిమని కిరీటి సవాలు చేయగా, 
                                 
                          
కిరాతకరూపంలో శివుడు, ఎరుకతగా శక్తిస్వరూపిణి పార్వతీమాత రాగా, ఏదీ యుద్ధం చేయు, చూద్దామని పలికిన అర్జునునితో యుద్ధానికి దిగెను. టంకార హుంకారలతో బాణాలు సంధించుకుంటూ పరస్పర ద్వంద్వయుద్ధం చేసుకుంటూ శివుడు అర్జునుని త్రోసి అవతల పడేయగా, కోపావేశంతో అర్జునుడు తిరిగిలేచి తన ధనస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేసాడు. అప్పుడు శంకరుడు ఇక యుద్ధం చాలించదలచి నిజరూప దర్శనమివ్వగా,  స్థానువైన అర్జునుడు తెప్పరిల్లి, 
ఈశ్వరా! పరమేశ్వరా! నేనే చంపానన్న అహంతో నిను గుర్తించక అజ్ఞానంతో నీతో యుద్ధానికి దిగాను. ఎంతటి కృప నాపై...నాచేత దెబ్బలు తింటూ మల్లయుద్ధం చేసావా...అని విలపిస్తూ పలువిధాల స్తోత్రం చేస్తూ పాదములమీద పడగా, ఇదీ నీ పూజగానే స్వీకరించాను. నీకు ఏం కావాలో కోరుకోమని శివుడు అనగా, పరత్పరా, అజ్ఞానినై అహంతో నీపై బాణములు వేస్తే అది నీకు పూజంటవా...నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయిందని మరల పరమేశ్వరుని పాదములమీద పడిన అర్జునుడుని హత్తుకొని,
                                 

నీకు పాశుపతాస్త్రమును ఇస్తున్నాను,విజయీభవ అని శివుడు ఆశీర్వదించిను.

{అష్టదిక్పాలక దేవతలు (ఈశాన్యం-ఇసాన/ఈశ్వరుడు, తూర్పు-ఇంద్రుడు, ఆగ్నేయం-అగ్నిదేవుడు, దక్షిణం-యముడు, నైఋతి-నిరుతి, పశ్చిమం-వరుణుడు, వాయువ్యం-వాయుదేవుడు, ఉత్తరం-కుబేరుడు)}.
అర్జునుడు, దిక్పాధిపతి అయిన ఈశ్వరుని అనుగ్రహంతో పాశుపతాస్త్రం పొందడం వలన మిగిలిన దిక్కుల దేవతలు ప్రసన్నులై వరుసగా ఐందాగ్ని, ఆగ్నేయము, యామ్యాగ్ని రాక్షసము, వారుణము, వాయువ్యము, కుబేరము అను శక్తాస్త్రములను ప్రసాదించిరి.  
అటుపై ఇంద్రాది దేవతలు తమ లోకమునకు అర్జునుని తీసుకెళ్ళి సకల సౌఖ్యములు కలిగింతురు. జీవునికింకను సుఖములయందు ఇంకా వ్యామోహమున్నదా అను పరీక్ష జరుగును. ఊర్వశి వరించి వచ్చిన చలించక శాపం కూడా పొందిన తొణకక అది అజ్ఞాతవాసమున వర్తించునట్లు వరముగా మార్చుకొనెను. సకల సౌఖ్యములను త్యజించి తిరిగి తన సోదరులతో కలిసి అరణ్యవాసం చేయుటకు వచ్చెను.

                    🔱ఓం నమః శివాయ🔱 


ఇక ఈకధలో అంతరార్ధం తదుపరి టపాలో -




2 కామెంట్‌లు:

  1. శ్రీకృష్ణార్జున యుద్ధం గురించి తెలుసు గాని, శివునికి అర్జునుడుకి యుద్ధం గురించి నాకు తెలియదండి. చక్కటి కధను తెలియజేశారు. థాంక్సండీ. అంతరార్ధం కోసం ఎదురుచూపులు...

    రిప్లయితొలగించండి
  2. ఈ కధ టూకీగా నాకు తెలుసండి. వివరణగా ఇప్పుడు తెలుసుకున్నాను.అంతరార్ధం ఏమైయుంటుందా అని ఎంత ఆలోచిస్తున్న తట్టడం లేదు. ఎక్కువ నిరీక్షణలో పెట్టకుండా ఆ పరమార్ధం పోస్ట్ పెట్టేయండి.

    రిప్లయితొలగించండి