25, మార్చి 2020, బుధవారం

శార్వరి సంవత్సరాది - "శ్రీకారం చుడదాం ఓ చక్కటి ప్రార్ధనకు"🛐🛐🛐

చైత్ర శుద్ధ పాడ్యమి...
శార్వరి నామ సంవత్సర యుగాది...
తెలుగు సంవత్సరాది...

ఈరోజు ఆనందంగా గడిపితే సంవత్సరం అంతా ఆనందంగా గడుస్తుంది - ఓ నమ్మకం.
ఈరోజు షడ్రుచుల పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం - ఓ నిజం.

నాకు తెలిసి, పచ్చడి లేకుండా 'ఉగాది'ని మేం స్వాగతించడం ఇదే మొదటిసారి. 
కారణం కరోనా.....ఇల్లు విడిచి బయటకు వెళ్ళాలనిపించక...మామిడికాయలు తెచ్చుకోక!

యావత్తు ప్రపంచావళి చర్చించుకుంటున్న ఈ కరోనా వైరస్ గురించి ప్రస్తావించదలచుకోలేదు కానీ, అందరం అవగాహనతో, అప్రమత్తతో, స్వీయ సంరక్షణ, స్వీయ నియంత్రణ, స్వీయ నిర్భందనలతో ఐక్యతగా ఉండడం తప్పనిసరి అని చెప్తాను. 

అందరికీ ఓ అభ్యర్ధన 🙏
                     

ఈ  వైరస్ అంతమవ్వాలని, అందరికీ ఆయురారోగ్యలు ప్రాప్తించాలని, భగవంతున్ని ఈ వసంత నవరాత్రులు ప్రార్ధిద్దాం.
                             
             

మనకోసం చేసుకునే నిత్యపూజలో " సర్వేజనాః సుఖినో భవంతు" అనే ప్రార్ధనను జోడిద్దాం. 
                      
                

గమనించండి మనకై కంటే, అందరికై చేసే పూజలో ఎంత తృప్తని. 
                              

అలానే ఈ ఉగాదిన మరిన్ని తృప్తినిచ్చే మంచి సంకల్పాలకు శ్రీకారం చుడదాం

⛧ స్వార్ధం తగ్గించుకొని, ప్రక్కవారికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేయడంలో ఎంత హాయి.

⛧ అత్యాశతో ప్రాకులాడడం, మితికి మించి ఆరాటపడడం మాని, ఏదీ శాశ్వతం కాదని ఎఱిగి, బుద్ధిలో స్థిరపడితే ఎంత హాయి.

⛧ అవి కావాలి, ఇవి కావాలి, అవి తినాలని, ఇవి తినాలని పరితపించేకంటే, కాళ్ళూచేతులు శుభ్రంగా ఉన్నాయి, ఆరోగ్యం వుంది, కూటికి వుంది, గూడు ఉంది... అని ఉన్నంతలో తృప్తి పడడంలో ఎంత హాయి. 

⛧ ఉపకారం చేసే శక్తి లేకున్నా అపకారం చేయకుండా ఉండడంలో ఎంత హాయి. 

⛧ కాళ్ళకు ఖరీదైన బూట్లు లేవని బాధపడకుండా, నడవడానికి కాళ్ళు ఉన్నాయి కదా అని... ఇలా అన్నింటా ఆశావహదృక్పధంతో వుంటే ఎంత హాయి.

⛧ ధనం, విద్య, అధికారంల గర్వంతో, నాకేంటి అని అనుకోకుండా పదిమందికి మేలు చేసే చిన్నపనైన చేయడంలో ఎంత హాయి. 

⛧ ఇతరులు ఏది చేస్తే మనకు బాధ కల్గుతుందో అది ఇతరులకు చేయకుండా ఉండడంలో ఎంత హాయి. 

⛧ అసూయ, అహం లను ప్రక్కకు నెట్టేసి, ప్రేమను పంచడంలో ఎంత హాయి. 
                         

సద్బుద్ధితో మనస్సు వంగినప్పుడే సర్వేశ్వరుని అనుగ్రహ పాత్రులౌతాం. 
తపనతో ఆర్తిగా ప్రార్ధిస్తే పరమేశ్వడే రక్షిస్తాడు
                   
              

ఇలా సద్భావనలతో, సహృదయంతో, సరళంగా, సామరస్యంగా, సమిష్టిభావంతో జీవనయానం సాగిస్తూ, మానవత్వాన్ని పరిమళింపజేసుకుంటే అది మాధవత్వం కాదా? మానవుడు మాధవుడు కాడా?
                         

శార్వరి నామ సంవత్సరం - శ్రీకారం చుడదాం ఓ చక్కటి ప్రార్ధనకు 🛐🛐 🛐

స్వాగతిద్దాం సత్ కాంక్షలను... సంకల్పించుకుందాం సత్ కార్యలకై!