19, ఏప్రిల్ 2021, సోమవారం

సదా స్మరణీయులు | సద్గురువులు (చివరిభాగం)

శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధులవారు తమ సంచారంలో భాగంగా - 

బీజాపూర్ రాజ్యంలోని ఒక గ్రామానికి చేరి అక్కడ విడిది చేయగా, బీజాపూర్ నవాబు శ్రీ రాఘవేంద్రులవారి గురించి విన్న కారణాన, అనేక కానుకలను తన తరుపున గురుతీర్ధుల వారికి అర్పించి, వారి ఆశీస్సులు సదా ఆపేక్షిస్తున్నానని తెలిపి, అర్చించి రమ్మని తన వజీరులను ఆదేశించగా... ఆ వజీరులు శ్రీ రాఘవేంద్రులవారికి నవాబుగారి తరుపున కానుకలర్పించి, వారి మాటలను విన్నవించగా, శ్రీ స్వామివారు తమ ఆశీఃపూర్వకంగా మంత్రాక్షతల నిచ్చి, "మీ ప్రభువులు మాకు పంపిన కానుకలలో అమూల్య రత్నాభరణమును మా సీతమ్మతల్లికి అర్పించామ"ని చెప్పండి అంటూ, "అగ్నిదేవా! దీనిని నీవు మా తల్లి జగన్మాత సీతామాతకు మా బదులు సమర్పించమ"ని ప్రార్ధించి, 
ఆ రత్నాభరణమును అగ్నిలో వేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నవాబుగారు, అవమానంగా భావించి కోపోద్రిక్తుడై, మరొక వజీరును పిలిచి, 'శ్రీ స్వామివారిని దర్శించి, తాము శ్రీ స్వామివారికి సమర్పించిన అమూల్య రత్నాభరణం లాంటిది మరొకటి చేయించదలచామని చెప్పి, హారం తయారయిన తదుపరి ఆ హారమును తిరిగి పంపెదమని తెలియబరచి హారమును తీసుకురమ్మ'ని పంపించెను. నవాబుగారు మనస్సును గ్రహించిన గురువర్యులు చిరునవ్వుతో, "అలాగే"నని మూలరాముని పూజించి, "అగ్నిదేవా! మేము మాతల్లి సీతమ్మ కందించమని చెప్పి మీకిచ్చిన కంఠాభరణం నవాబు గారికి కావాలట. వారు అటువంటిదే మరొకటి చేయించుకునేందుకు ఇది నమూనగా కావాలట. దయచేసి దానిని తిరిగి ఇవ్వండి, మరల వారు హారమును తిరిగి ఇస్తే సీతమ్మ తల్లికి సమర్పించుకుంటాం" అని అంటుండగా -
                     

అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఆ కంఠాభరణాన్ని ఇవ్వడం...అందరూ నిశ్చేష్టులవ్వడం... స్వామివారు "ఈ హారాన్ని మీ ప్రభువులకు అందించండి" అని, ఆ హారమును వజీరు కివ్వడం... 
జరిగింది తెలుసుకున్న నవాబుగారు తన తప్పిదాన్ని గ్రహించి, వెంటనే బయలుదేరి శ్రీ గురుదేవుల దగ్గరికి వచ్చి, 'మాలాంటి అజ్ఞానుల కళ్ళు తెరిపించడం కోసం ఈ భూమిపై పుట్టారని, తన దురహంకారాన్ని క్షమించి, కరుణించండి ఈ దాసుడిని' అని శ్రీ చరణాలకు దాసుడై, కరుణామూర్తుల కరుణకు పాత్రుడై, ధన్యులైరి ఆ నవాబుగారు.

శ్రీ రాఘవేంద్ర తీర్ధులవారు చాతుర్మాసదీక్షలో ఉండగా - ఒకనాడు శ్రీవారు క్షేత్రదేవత, కులదేవత, జగజ్జననియైన దుర్గామాతను స్తుతించ... 
                        

ఆ తల్లి ప్రత్యక్షమై, "చిరంజీవివయ్యా నువ్వు! నాటి నరశింహావతార ప్రాదుర్భవానికి కారణభూతుడవైన మహావిష్ణు భక్త శిఖామణి ప్రహ్లాద భక్తవరదా! ఏం కోరి ఈనాడు ఇంతలా మమ్ము స్మరిస్తున్నావు? నీ సర్వవాంచితములు అప్రయత్నంగా నెరవేరుతున్న తరుణంలో, నన్ను పిలిచిన కారణమేమిటయ్యా? చెప్పు నాయనా"... 
లోకమాత, వేదరూపిణి, సకలలోకపావని, సర్వసృష్టి స్థితి లయకారిణి పలుకులకు పరవశించి భక్త్యాతిశయముతో, "ఓం నమో లోకపానీ విశ్వజననీ..." అంటూ అశువుగా స్తుతించి, అమ్మా! నువ్వు లోకమాతవు, భయనివారిణి దుర్గవు... నీ దర్శనం వలన ధన్యుడనైనాను. తల్లీ! నీ కృపాదృష్టి నర్ధించనివారు ఎవరూ వుండరమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వాన్ని సవ్యంగా నడిపిస్తున్నారంటే, అది నీ చలువే కదా. అనుక్షణం అందరూ మాతృదేవోభవ అని చెప్పే శృతివాక్యం నీవే కదమ్మా. సర్వ జగత్తుకు శక్తిప్రదాతమైన నీ కరుణా కటాక్షముల నర్ధించడానికేనమ్మా పిలిచాను. "తల్లీ! నేనిక్కడ బృందావన మొందాలని తలంచాను. నన్నూ, నా భక్తులను, సర్వులను, నీ బిడ్డలుగా తలచి వరదాయినివై, మమ్ము అనుగ్రహించాలి. బృందావన మందుండి నేను సల్పు భగవల్లీలా కార్యక్రమములకు నేను భాగమైనా, నా భాగ్యమై నువ్వు నన్నీ జగత్కళ్యాణ కార్యక్రమము నిర్వహించే సర్వశక్తిగా నిలవాలి.  బిడ్డగా నేను కోరింది ఇదేనమ్మా".....అని ప్రార్ధించగా, ఆ తల్లి, నాయనా! నిస్వార్ధముగా లోకసంరక్షణా దీక్షమూర్తివై, శ్రీహరి ఆదేశంతో సాగించే నీ భక్తజన పరిరక్షణా కార్యక్రమమునకు నా ఆశీస్సులు తప్పక లభిస్తాయి. నా అభయముద్రకు చిహ్నంగా, నీ బృందావన మహాద్వారమున మేషమస్తకమును ప్రతిష్టింప చేయుము. నీ అభీష్టన్ననుగ్రహించినట్లు నేనక్కడ నిలచి సర్వభక్తులను కాపాడతాను. ఇకమీదట ఈ మంచాల సకల మంత్రసిద్ధ క్షేత్రమై మంత్రాలయమై ప్రసిద్ధి గాంచుతుంది"... అని ఆనందంగా ఆ తల్లి ఆశీర్వదించెను.


పావన తుంగభద్రానదికి అవతల ఒడ్డున శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశారు. ప్రతీరోజూ గురువర్యులవారు తుంగభద్రపై నడిచి శ్రీ ఆంజనేయస్వామి దర్శించి, అర్చించి వచ్చేవారు. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా శ్రీ రాఘవేంద్రుల వారు తమ దివ్యశక్తితో నేలపై నడిచినట్లే నీటిపై నడిచేవారు. 
                         

తపస్సంపన్నులైన గురుతీర్ధులవారికి ఒకనాడు ఆంజనేయుడు పంచముఖుడై దర్శనమిచ్చి వరం కోరుకోమంటే, "భవిష్యత్తులో తాము బృందావన ప్రవేశం గావిస్తున్నాం గనుక, మాయందు ప్రసన్నులైన మీరు, మా బృందావనాన్ని సందర్శించే సర్వభక్తజనులకు రక్షణగా వుంటూ, కృపాసిద్ధి ప్రసాదించమ"ని ప్రార్ధించగా, శ్రీ ఆంజనేయులు... "మీ బృందావనానికి ఎదురుగా స్వయంభుడనై అవతరించి, మీ అభీష్టం ప్రకారం మీ సర్వభక్తజనులను కాచి రక్షిస్తాన"ని అభయమిచ్చారు. 

ఒకసారి ఆశ్రమంలో రాఘవేంద్రయతీంద్రులు తత్వబోధ గావిస్తున్నారు. ఉన్నట్టుండి స్వామివారు తమ ఉపనిషద్వాణిని ఆపారు. అకస్మాతుగా ఎందుకాపారో తెలియని భక్తులు కారణం తెలియక ఆతృతగా చూస్తున్నారు. స్వామివారు తలపైకెత్తి ఆకాశాన్ని చూస్తూ, లేచి నిల్చున్నారు. ఏమీ అర్ధంకాక అయోమయంగా భక్తులూ నిల్చున్నారు. కొంతసేపు పిమ్మట శిష్యుల మనోభావములు గమనించి, "నాయనలారా! ఇవన్నీ దేవరహస్యాలు. కుశుమవర్తి శ్రీకృష్ణద్వైపాయన స్వామి మహాభక్తులు, సిద్ధపురుషులు. సర్వకర్మలను నిర్వర్తించుకొని మహత్తర జీవనం గడిపిన పుణ్యపురుషులు వారు. ఆ మహాపురుషులు నేడు తమ పాంచభౌతిక దేహాన్ని విసర్జించి, దివ్యదేహంతో విమానరూఢులై, ఆ శ్రీహరి సదనానికి పయన మవుతున్నాడు. ఇది గమనించిన మేము, ఆ మహాభక్త శిఖామణులకు అభివాదం చేసి నిల్చున్నాం. అపుడే మహాత్మా! మీరు శ్రీహరిపధాన్ని చేరుకుంటున్నారు, మరి మా మాటేమిటని అడిగాం. అందుకా ఆ భక్తశిఖామణులు తమ చేతి రెండు వ్రేళ్ళను ముమ్మారు చూపారు. విషయం అర్ధం చేసుకున్న మేము కాలానికి, ఆ మహాభక్త శిఖామణులకు తలవంచి మా సజీవ బృందావన సమాధికోసం ఎదురు చూస్తున్నామన్నారు.
ఇది విన్న శిష్యవర్గం, భక్తజనం కళవళ పడ్డారు. అమ్మో, శ్రీ గురుతీర్ధుల వారు మనల్ని విడిచిపెట్టే మాట... ప్రళయ ఝుంఝూ మారుతమై ప్రతిధ్వనించిందక్కడ. శ్రీ గురుసార్వభౌములు అతిత్వరలో బృందావనాంతర్గతులవుతున్నారన్న వార్త చూస్తుండగా, దావానంలా వ్యాపించింది. ఈ వార్త విన్న దివాన్జీ వెంకన్న పంతులు క్షణాల్లో బయలుదేరి వచ్చి, స్వామి అని బావురుమన్నాడు. "దీనికెందుకింత ఆందోళన? మీ కోసమే కదా, ఈ జీవసమాధి తీసుకునేదీ, ఇలా దేహదారినై ఉంటే ఏ కొంతమందినో రక్షించే మేము బృందావన స్థితులమైతే, ఎక్కడెక్కడ వారిని... తలచిన క్షణాన తక్షణం ఆదుకోగలము అని చెప్తున్న, గురువర్యుల మాటలను అడ్డం వస్తూ... 'మీరేం చేసినా, అది మాకోసమేనంటారు. ఇది భరించదగ్గ విషయమేనా మాకోసమైనా మీరీ పని చేయడానికి వీల్లేదు'...ఆపుకోలేని దుఃఖంతో, ప్రార్ధిస్తున్న వెంకన్నను వారిస్తూ... "చూడు నాయనా! ఇహలోక దృష్టిని కనుక విడిచిపెట్టగల్గితే, ఆ ఈశ్వరశక్తి...లోకసృష్టి సర్వము అర్ధం చేసుకోగలుగుతావు. ఇది దైవ నిర్ణయం. దైవ శాసనం. డబ్బై సంవత్సరాలు మా శరీరంతో భూలోకంలో వుండాలని, ఆ తదుపరి ఏడువందల సంవత్సరాలు బృందావన స్థితులమై వుండాలని నిర్దేశించిన పరమేశ్వరాజ్ఞను మనం ధిక్కరించగలమంటావా? కనుక దైవ ఆదేశం సర్వదా శిరోధార్యం. అందుకని, ఇతర చింతనలను విడిచి, మాకు అతిత్వరలో బృందావనం ఏర్పాటు చెయ్యమని శ్రీ గురుదేవులు ఆదేశించారు. 
                       

శ్రీ  రాఘవేంద్ర గురుతీర్ధులు వెంకన్నకు ఓ శిల చూపించి, ఈ శిల శ్రీరామ లక్ష్మణులు ఏడు ఘడియలకాలం విశ్రమించిన పవిత్ర శిల కాబట్టి, ఈశిలతో మాకు బృందావనాన్ని రూపొందించమని చెప్పిరి. మనస్సును చిక్కబెట్టుకుని శ్రీ గురుతీర్ధుల ఆజ్ఞకు బద్దుడై, శ్రీ గురు అఖండనామ స్మరణం చేస్తూ, అనుకున్న విధంగా బృందావన నిర్మాణం పూర్తిచేసాడు దివాన్ వెంకన్న. శ్రీ గురుతీర్ధులు బృందావన స్థితులయ్యే సమయం దగ్గర పడుతుంది. కాలమెంత కఠినమైనది, దైవమెంత నిర్దయుడని బృందావన ప్రవేశ వార్త విన్న ప్రతి ఒకరు గుండెలవిసేలా రోదిస్తూ, కుమిలిపోతున్నారు. శ్రీరాఘవేంద్ర తీర్ధులవారు తమ ఇహలోక బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని బృందావన స్థితులు కావాలి కనుక, తమ ఉత్తర పీఠాధిపతి నియమాకానికి నిశ్చయించి, తమ పూర్వాశ్రమ సోదరులైన శ్రీగురురాజాచార్యుల వారి పౌత్రులు శ్రీ వెంకన్నాచార్యుల వార్ని ఉత్తరపీఠాధిపతిగా నిర్ణయించి, సర్వభక్తజన, వైదిక, పండిత సమక్షంలో శాస్త్రవిధిన మంత్ర, ముద్రాధారణ మూర్తులను గావించి, పీఠాధిపతిగా ప్రకటించి, 'యోగీంద్రతీర్ధులు' గా నామమొసగి, మహాపీఠ సింహాసనాన్ని అలకరింపచేసారు. 

1671వ సంవత్సరం - 
మంత్రాలయ మహిమాన్వితులు, మహాసిద్ధులు, గురుసార్వభౌములు, సకల భక్తజన హృదయాంతర్వర్తులు, జగత్కళ్యాణ కారకులు, సద్ధర్మ మూర్తులు, ధర్మ రక్షాపరులు... శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధుల బృందావన ప్రవేశం -

"ప్రియభక్తులారా! శ్రీహరి ఆదేశాన్ని శిరసావహించడం మన ధర్మం. సర్వభక్తజన ప్రియంకరుడైన శ్రీహరి మాకు సజీవ బృందావన ప్రవేశాన్ని ప్రసాదించారు. ఈ బృందావనంలో మేము ఏడువందల సంవత్సరాలు నిలిచే వుంటాం. క్షీణ శరీరంతో సర్వభక్తజనులను సేవింపలేమనే ఉద్దేశంతో శ్రీహరి మాకీ దివ్యావకాశాన్ని అనుగ్రహించారు. ధర్మబద్ధంగా దీక్షాయుతంగా మీరు సలిపే సర్వ కార్యక్రమములకు మా తోడ్పాటు ఆశీస్సులు ఉంటాయి. మన జ్ఞానచక్షువులను సక్రమమార్గంలో పయనింపచేసి మనం, మనతోపాటు మన తోటివారు పావనమయ్యేటట్లు చేసుకుందాం. గురు పరంపరగా సద్గురువులు ప్రవచించిన వాటిని, ఆచరించి తరించమన్న నా అభ్యర్ధనను ప్రతిఒక్కరూ స్వీకరించి, ధన్యచరిత్రులయి తరించండి, తరింపజెయ్యండి. ఓం తత్ సత్ !!!
ఇలా సద్బోధ నొసగి శ్రీ గురు సార్వభౌములు, సర్వులను కృపాదృష్టితో చూస్తూ, బృందవన ప్రవేశం గావించారు. 
                      

జీవ సమాధిగతులైరి.
  
ఓం శ్రీ గురురాఘవేంద్రాయ నమః 

పూజ్యాయ రాఘవేంద్రాయ, సత్యధర్మరతాయచ |
భజతాం కల్పవృక్షాయ, నమతాం కామదేనవే ||

సదా స్మరణీయులు | సద్గురువులు (చతుర్ధభాగం)

జన్మతః సంస్కారవంతమైన శ్రీమంతుల ఇంట్లో పుట్టినా, సద్భ్రాహ్మణుడు అయిన, దురదృష్టం కొద్ది చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, అనాధగా మేనమామ దగ్గరకు చేరిన వెంకన్నను, ఆస్తి మీద తప్ప మేనల్లుని మీద ప్రేమలేక నిరక్షరకుక్షిని చేసి, తన పశువుల కాపరిగా చేసుకొన్నాడు, ఆ మేనమామ. ప్రతీరోజు అకారణంగా మేనమామ అగ్రహానికి గురౌతూ, అమాయకత్వం చదువురానితనంతో తోటివారి పరిహాసానికి లోనవుతూ, వెంకన్న భారంగా రోజులు గడుపుతుండగా-  


తమ దిగ్విజయయాత్ర సాగిస్తూ శ్రీ రాఘవేంద్ర స్వామివారు అదోని సమీపంలో కందనాతి అనే గ్రామంలో ప్రవేశించడం...వారి దృష్టిలో ఈ వెంకన్న పడటం...గురువుగారి అనుగ్రహానికి పాత్రులై చదువుకోవాలనే తన కోరికను తెలపటం "నువ్వు ధన్యుడవయ్యా! మాకు, ఆ సర్వేశ్వరుడు శ్రీహరికి ఆప్తుడవయ్యావు, నీకు శ్రేష్ట జీవితం లభిస్తుంది, భవిష్యత్తులో ప్రియమైన దివ్యసేవలొనరించి తరిస్తావు" అని మనసారా దీవించి, స్వామివారు తమ సంచారాన్ని కొనసాగించారు.


కొద్ది రోజుల అనంతరం -  పన్ను వసూళ్ళ నిమిత్తం సైన్యసమేతంగా బయలుదేరిన అదోని నవాబు, ప్రయాణంలో భాగంగా కందనాతి గ్రామ మార్గంలో ప్రవేశిస్తుండగా, ఓ వార్తాహారుడు కలుసుకొని రెండులేఖలు యివ్వటం, చదువురాని కారణాన్న... ఎవరైన బ్రాహ్మణుడుని చూసి తీసుకురమ్మని భటుడుని ఆదేశించటం -
అదే సమయంలో వెంకన్న పశువులను మేపుతూ, ఈ భటునికి కనబడటం...'ఏయ్! బొమ్మాన్! మా హుజార్ రమ్మంటున్నారు రా' అని, ఎందుకు రమ్మంటున్నారో ఏం తప్పు చేసానో అని భయపడుతున్న వెంకన్నను, దగ్గరుండి ఆ భటుడు తీసుకువెళ్ళడం, వెంకన్నను చూసిన నవాబు 'నీవు బ్రాహ్మణుడివే కదా' అని అడగడం, 'అవున'ని వెంకన్న బదులివ్వగా, 'అయితే వెంటనే ఈ రెండు లేఖలు చదువు, ఈనాము ఇస్తామ'ని అనడం, భయపడుతూ 'తనకి చదువు రాద'ని వెంకన్న చెప్పడం, 'అరే దూత్! మా దగ్గర అబద్దాలు చెప్తావ్, నీవు బొమ్మన్ వై వుండి నీకు చదువు రాదంటావ్, మా దగ్గర వేషాలా, మర్యాదగా చదువ్, జల్దీగా చదువ్ లేదంటే ఏనుగుల పాదాల కింద తొక్కి పడేస్తామనగా...
విపరీతంగా భయపడిపోతున్న వెంకన్నకు, శ్రీ రాఘవేంద్రుల వారు ఆశీర్వదిస్తూ "ఆపద సమయంలో మమ్ము, మా మూలరామున్ని తలచుకో" అన్న మాటలు గుర్తుకు వచ్చి, గట్టిగా శ్రీ రాఘవేంద్ర సార్వభౌమా అని, ఆ రెండు లేఖలను గడగడ చదవడం... నవాబుగారికి ఇది ఆశ్చర్యం కల్గించింది. విషయం ఏమిటని అడిగి తెలుసుకొని, అచ్ఛా... అంత మంచి స్వామా, మంచిది... అదోని రా, ఈనాము తీసుకో, లేదో అని గద్దించేసరికి... వస్తానని చెప్పి, స్వామివారిని తలచుకుంటూ ఇంటికి తిరిగివచ్చి, ఎవరికి ఈ విషయం చెప్పినా, నమ్మక పరిహాసం చేస్తూ, వెళ్ళు వెళ్ళు అదోని అని అనడంతో... అదోని వెళ్ళడం, గురువర్యుల కృపను పొందిన వెంకన్న... నవాబుగారి ఆదరాభిమానాలను పొందడం, అనతికాలంలోనే నవాబు సిద్ధీ మాసూద్ ఖాన్ కు ప్రేమపాత్రుడై, అంచలంచెలుగా పదోన్నతి పొందుతూ అతి తక్కువ వ్యవధిలో దివాన్ అయ్యాడు. 

కాలచక్రం తిరుగుతుంది. కొంతకాల మనంతరం - 
శ్రీ రాఘవేంద్ర స్వామివారు అదోనిలో బస చేస్తారని తెలిసి, వెంకన్న తగు కానుకలతో, ఫల పుష్పాదులతో స్వామి వారిని దర్శించి, తన సర్వోన్నతికి కారణమైన గురువుగారికి సాష్టాంగ దండప్రణామములు చేసి, ఒకనాటి వెర్రి వెంకన్న నేడు దివాన్జీ వెంకన్న పంతులుగా ఎలా అయ్యాడో వివరంగా తెలపగా, పరమానందభరితులైన స్వామివారు "అంతా మూలరాముని దయ" అని, మంత్రాక్షతలను నొసగి ఆశీర్వదించారు.  

ఆ తర్వాత మరో సందర్భంలో - 
వెంకన్న, స్వామివారిని దర్శించి, 'మా నవాబు మీ దర్శనాన్ని ఆపేక్షిస్తిన్నారని, మీరు కరుణించి మీ దర్శనాన్ని ప్రసాదించండి' అని విన్నవించుకోగా, శ్రీ గురుతీర్ధులు "నిజముగా మీ నవాబు మమ్మల్ని దర్శించాలని తలిస్తే, తప్పక దర్శించవచ్చు" నన్నారు. ఆ వర్తమానం అందుకున్న నవాబు సిద్ధీ మాసూద్ ఖాన్, తగు కానుకలతో అరుదెంచి, స్వామివారికి నమస్కరించి, 'శ్రీ గురువులకు సలాం. మేము కొన్ని కానుకలు తెచ్చాం. నైవేద్యం తెచ్చాం, మేము తెచ్చిన నైవేద్యం మీరు మీ రాములవారికి నివేదిస్తారా'? ఆసక్తిగా అడిగాడు నవాబు. "తప్పక నివేదిస్తామంటూ, రాముడైన, రహీమైన అంతా ఒక్కటే. మనకే గానీ దేవుళ్ళకు ఆ తేడా లేదు" అని శ్రీ మూలరాముని పూజ అయ్యాక, సంస్థాన నైవేద్యములతో పాటు నవాబు తెచ్చిన నైవేద్యములు కూడా అర్పించబడ్డాయి. సంస్థాన నైవేద్యములపై కప్పిన శాటిని తొలగించి శ్రీ మూలరామునికి నివేదన చేస్తూ శ్రీ గురువర్యులు, "నవాబుగారు, మీరు తెచ్చిన నైవేద్యం పైన ఆ వస్త్రాన్ని తీయించండి" అని చెప్పగా, నవాబు తొట్రుపడుతూ 'మీరే తీయండి' అనగా, చేతిలోని పుష్ప మంత్రాక్షతలను చల్లి, ఎవరైనా వస్త్రాన్ని తొలగించండి అని గురువర్యులు మరల చెప్పగా, పళ్ళెరాలపై నున్న వస్త్రాన్ని తొలగించారు. 
                      
ఆ క్షణం వరకు మాంసపు ముక్కలతో నున్న నవాబు తెచ్చిన నైవేద్యం క్షణాల్లో పూలు పండ్లుగా మారిపోవడంతో... ఖంగుతిన్న నవాబు నన్ను కరుణించండి అని పదే పదే అర్ధించగా, "మానవునిని మాధవుడివి కమ్మన్న దేవుడిని మనం మరీ మూర్ఖులమై, అనునిత్యం పరీక్షిస్తూ, ఆత్మవంచన చేసుకుంటున్నామే తప్ప ఆ దివ్యశక్తిని ధర్మనిరతిని గుర్తించలేకపోతున్నాం" అన్న గురుదేవుల ప్రబోధం ముందు తలవంచి, తన అజ్ఞానముకు సిగ్గుపడ్డాడు. తనకి తెలియకుండా నవాబు చేసిన ఈ పనికి వెంకన్న బాధ పడుతుంటే, ఇందులో నీ తప్పు లేదని... అందరికీ తీర్ధ ప్రసాదములు ఇచ్చి సాగనంపారు శ్రీ గురుతీర్ధులు.

ఈ నవాబుగారే ఏదైన గ్రామాన్ని శ్రీ గురుతీర్ధుల వారికి సమర్పిందామనుకోవడం... దివాన్ వెంకన్న ద్వారా ఈ విషయం గురువర్యులవారికి తెలపడం..... తుంగభద్రానది తీరంలోని మంచాల గ్రామాన్ని సమర్పించుకోమని శ్రీ రాఘవేంద్ర తీర్ధులవారు చెప్పడంతో, తగు విధాన దానశాసనం చేయించి శ్రీ మూలరాముని సేవలకుగాను మంచాల గ్రామమును సమర్పించిరి.  శ్రీ గురుతీర్ధుల వారు ఆ గ్రామంలో ముందుగా తమ కులదైవమైన శ్రీవేంకటేశుని ప్రతిష్టించుకొని దాని చెంతనే తాము నివసించటానికి వీలుగా ఒక ఆశ్రమమును నిర్మించుకున్నారు. మంచాల గ్రామం పరమ పవిత్ర పుణ్య దివ్యక్షేత్రం. కృతయుగంలో ప్రహ్లాదుడు అనేక యజ్ఞాలు చేసిన స్థలమిది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మను వెదుకుచూ సోదరుడు లక్ష్మణునితో కలసి వచ్చి కొన్ని ఘడియలు పాటు విశ్రాంతి తీసుకోగా, వారి పవిత్ర పాదధూళితో పరమ పవిత్రమైన స్థలమిది. ద్వాపరయుగంలో అనుసాల్వుని రాజధాని ఇది. అశ్వమేధ యాగమప్పుడు శ్రీకృష్ణార్జునులు నడయాడిన స్థలమిది. కలియుగంలో పరమ పూజ్య పరమాచార్యులు శ్రీ విభుదేంద్రతీర్ధులవారు విజయనగరాధీశుల నుండి ఈ గ్రామాన్ని పొంది, తమ దీర్ఘ తపస్సును గావించిన స్థలమిది. వెంకన్నా!  ప్రహ్లాద యజ్ఞదీక్షలతో, రామలక్ష్మణుల కృష్ణార్జునుల పాదధూళితో, శ్రీ విభుదేంద్రతీర్ధుల పుణ్య తపస్సుతో, పునీతమైన ఈ స్థలం భవిష్యత్తులో మాకు బృందావనమై అలరారబోతుంది అని ఈ గ్రామ విశిష్టతను తెలిపారు శ్రీ రాఘవేంద్రుల వారు.

నవలగుంద పర్యటనలో - అపౌరుషములైన వేదములను, సనాతన హిందు ధర్మ శాస్త్రాలను నిరశించే పరమ మూర్ఖుడైన శిరంగి దేశాయి గురించి తెలుసుకొని, అతనిని ఉద్ధరించదలచి పిలిపించి, "నాయనా! శ్రేష్టమైన మానవజన్మ నొందిన నీకు, వేద శాస్త్ర దూషణ, ధర్మ సమ్మతం కాద"ని హితవు చెప్తుండగానే... 'ఈ ధర్మపన్నాలు, కల్లబొల్లి కబుర్లు, శుష్కవేదాంతం, దైవ ప్రలాపములు వద్దని హేళనగా మాట్లాడుతూ...సరే, మీ వేదాలకు, మంత్రాలకు అంతటి మహిమా సంపత్తే కనుక వుంటే, మా యింటి ముందు నిలబెట్టిన రోకలిని చిగిరింప చేయమని, అప్పుడు అస్తికత్వాన్ని, మంత్రశక్తిని నమ్ముతా'నని అనడంతో - "తప్పక నీ మాట ఫలవంత మొనర్చెదము, నిన్ను అనుగ్రహించెదము, మా నిత్యార్చన శ్రీమూలరాముని సాక్షిగా, ఈ రోకలి చిగురిస్తుంద"ని చెప్పి, తమ కమండలోదకమును దానిపై ప్రోక్షించి, నీకీ సత్యం నిత్యమై వరకు మేము ఇక్కడే వుందుము, అంతవరకు అవహేళన చేయడం ఆపమని చెప్పిరి. 
                         
మూడు రోజుల అనంతరం లేత చిగుళ్ళతో రోకలి కళకళలాడటం, శ్రీ రాఘవేంద్రుల తీర్ధులవారి దివ్యశక్తికి, మంత్ర మహిమకు దాసానుదాసుడై, తన అజ్ఞానపూరిత ప్రవర్తనకు క్షమించమని; చరణదాసుడై శరణాగతుడైనాడు శిరంగిదేశాయి.

శ్రీ విజయరాఘవ నాయకుల వారి కాలంలో - తంజావూరు సామ్రాజ్యంలో తీరని క్షామం ఏర్పడి, ధాన్యాగారం ఖాళీ అయ్యి, రాజ్యం అలకల్లోలమయ్యే స్థితిలో, విజయరాఘవ నాయకులు శ్రీ గురుతీర్ధులను దర్శించి రక్షించమని ప్రార్ధించగా, గురువర్యుల వారు కుంభకోణం నుండి తంజావూరు వచ్చి, ధాన్యలక్ష్మి నివాసమైన ధాన్యాగారం సందర్శించి, 
                          
శ్రీ చక్రముంచి "తల్లీ! నీ బిడ్డల ఆకలి బాపు, అక్షయమూర్తివై కరుణించు, ఈ రాజ్యాన్ని సుసంపన్నం చేయు" అని ప్రార్ధించి, పిమ్మట శ్రీ మూలరామున్ని పూజిస్తుండగా, వరుణదేవుడు అనుగ్రహించి వర్షం కురిపింపజేయడం, ఆపై గురుదేవుల సూచన మేరకు సుదర్శన హోమం చేసి అంతా ఆనందభరితులైరి.

ఒకనాడు తుంగభద్రలో స్నానమాచరించి వస్తున్న శ్రీ గురువర్యుల చెంతకు ఓ వ్యక్తి వచ్చి, 'మీ కరుణ ప్రసరిస్తే సర్వం సమకూరుతాయని మీ భక్తులు చెప్తుంటారు, నన్ను కరుణించండి. నాకు డబ్బులివ్వండి, నేను పెళ్ళి చేసుకోవాలి, డబ్బు కావాలి, డబ్బులు లేకుంటే పిల్లనెవరిస్తారు అని అమాయకంగా అడుగుతుంటే... "చూడు నాయనా! మావద్ద మృత్తిక తప్ప డబ్బెందుకుంటుంది" అని స్వామివారు అనడంతో, ఆ మట్టే ఇవ్వండి, మీరు ఏది అనుగ్రహించిన, దాంతో చిత్రాలు జరుగుతాయట. అది మీచేతి మహత్యమట'... అనగానే, "సరే, నీ పై పంచను పట్టు" అని మూడుగుప్పిళ్ళతో తమ పాదాల వద్ద నున్న మృత్తికను పై పంచలో పోశారు. మహాప్రాసదం అని కళ్ళకద్దుకొని జాగ్రత్తగా మూట కట్టుకొని వివాహం చేసుకొని మళ్ళీ వస్తానని చెప్పి, అక్కడ నుండి బయల్దేరెను ఆ వ్యక్తి. చీకట్లు బాగా ముసురుకునే సమయానికి ఓ గ్రామం చేరుకొని, ఆ ఊళ్ళోని ఒక ఇంటి అరుగుమీద కూర్చొని, కాస్త విశ్రాంతి తీసుకుందామని నడ్డి వాల్చాడో లేదో... ఇంట్లోంచి అరుపులు...ఈ బాధ భరించలేను, ప్రతీ మాటు ప్రాణాంతకమే, పుట్టినవాళ్ళు పుట్టినట్లు చస్తుంటే మోడులా బ్రతకాల్సి వస్తుందని అని లోపల ఏడుస్తున్నారెవరో. కాస్త ఓపిక పట్టు, సుఖ ప్రసవం అవుతుందని ఓదారుస్తున్నారు మరెవరో...ఇవన్నీ అరుగుమీద కూర్చొని వింటుండగా - 
అదే క్షణమున దూరంగా ఎవరో నిల్చొని, 'చూడు నాయనా, ఇక్కడ నుండి వెళ్ళిపో లేదా నీ దగ్గరున్న ఆ మూటనైన దూరంగా విసిరేయ్' అని చెప్తుంటే...నేను పారేయను నీవెవరవు అని ఈ వ్యక్తి అడగగా, నేను బ్రహ్మరాక్షసుడును...ఆ మూట పారేయకపోతే నిన్ను మ్రింగుతా అని అరిచాడు. అన్నింటికీ భయపడే వాడైనా, గురువుగారిచ్చిన మృత్తిక మహిమ వలన ధైర్యంగా...  'ఓహో! అలాగా, నా దగ్గర ఉన్న మట్టి మూటనే పారేయ్ అని చెప్పే నీవు, నన్ను ఏం మ్రింగుతావులే అని తాపీగా అంటూ, నన్నెందుకు ఈ ఇంటి దగ్గర నుండి వెళ్ళిపొమ్మంటున్నావు? ఈ ఇంటి వారితో నీకేం పని' అని అడగగా, ఈ ఇంటి వారికి నాకు విరోధం. ఈ ఇంట్లో పుట్టిన ప్రతీ శిశువు నాకాహారం కావాలి, ఇప్పుడు శిశోదయం కాబోతుంది, నేను భక్షించడానికి లోపలికి వెళ్ళాలి. తప్పుకో అని రాక్షసుడు చెప్తుంటే.....
'అయితే నేనేం అడ్డు వెళ్ళు లోపలకి' అన్నాడు వెంకన్న. నీ దగ్గర వున్న మూట అగ్నిగోళమై నన్ను లోపలికి రానీయటం లేదు, అందుకే నీవేనా వెళ్ళిపో, లేదా ఆ మూటను దూరంగా పారేయ్ అని రాక్షసుడు అనడంతో, 'ఇది నా గురుదేవుల మహాప్రాసదం. నేను ఈ మూటను పారేయను, ఆకలి వేస్తుంది, నీరసంగా ఉన్నాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, నాకు డబ్బు కావాలి, పెళ్ళి కావాలి అనడంతో... వెంటనే మాయమైన రాక్షసుడు కాసేపటికి తిరిగి బుట్టనిండా ఆహారం లంకెబిందెలతో ప్రత్యక్షమై, ఇవి తిని, ఈ సంపద తీసుకొని ఇక్కడనుండి త్వరగా వెళ్ళిపో అని బ్రతిమలాడగా, సుష్టుగా తిని నీ మేలు మరచిపోలేను అంటూ మూటలో కొంత మృత్తికను తీసుకొని -
                        
'గురు రాఘవేంద్రా, ఈ రాక్షసుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే సావకాశన్నివ్వండి' అని ప్రార్ధించి, భయంతో పారిపోతున్న బ్రహ్మ రాక్షసుడుపై మట్టిని విసిరాడు. అంతట ఆ రాక్షసుడు పూర్వ స్వరూపమును పొంది, శాపవిముక్తిని కల్గించినందుకు ధన్యవాదములు తెలుపుకుంటూ అంతర్ధాన మవ్వగా, ఇంటి లోపల ప్రసవం జరగడం, బయట జరిగింది తలుపు చాటుగా ఆ ఇంటి యజమాని వినడం, ఆ యజమాని వెలుపలకు వచ్చి వెంకన్నను అన్ని వివరాలు అడగడం, రాక్షసుని బారి నుండి రక్షించి తన వంశమును నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ తన అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడం, అంతా కలసి శ్రీ గురుతీర్ధుల వారిని దర్శించుకుని, ఆశీస్సులు పొందడం జరిగింది. ఎన్నెన్ని మహిమలో శ్రీ రాఘవేంద్ర తీర్ధులవారివి.

తమ ప్రయాణ గమనంలో భాగంగా హుబ్బిళి (హుబ్లి) వచ్చినప్పుడు -
                        
నవనూరు నవాబు ప్రియపుత్రుడు పాముకాటుతో మరణించాడన్న వార్త విన్న తక్షణమే గరుడమంత్ర జపంతో విషహరణం గావించి ప్రాణం పోసి దీవించారు.

శ్రీ రాఘవేంద్రుల వారి చివరిబోధ తదుపరి టపాలో - 

18, ఏప్రిల్ 2021, ఆదివారం

సదా స్మరణీయులు | సద్గురువులు (తృతీయభాగం)

 



శ్రీ వేంకటేశ్వరుని వరప్రసాది, సంస్కృత, వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడు, పరిమళాచార్య, మహా భాష్యాచార్య, భట్టాచార్య బిరుదములను పొందిన విజ్ఞానఖని, చక్కటి వ్యాఖ్యానల గ్రంధకర్త అయిన శ్రీ వేంకటనాధుడు... "శ్రీ రాఘవేంద్ర తీర్ధులు"గా, శ్రీ మహా మధ్వ పీఠాధిపతులు అయిరి.


వీరి పూర్వాశ్రమ ధర్మచారిణి సరస్వతి, జరిగిన పరిణామాలని పూర్తిగా ఆమోదించలేక, అవగాహనాలేమితో దుఃఖావేశానికి లోనై, ఒకనాటి రాత్రి తమ ఇంటి పెరటిలోని బావిలోనికి దూకి ఆత్మపరిత్యాగం చేసింది. వివేక విజ్ఞానముల నిధిగా భాసిల్లవలసిన ఆతల్లి, తాత్కాలిక బాధలో చేసిన ఈ పనికి ప్రేతరూపం దాల్చి, ఆశ్రమచెంతకువచ్చి, బోరున రోధిస్తుంటే...ఆ తరుణంలో తమ ఆరాధ్యదైవమైన శ్రీమూలరాముని పూజలో ఉన్న రాఘవేంద్ర తీర్ధులవారు ఉలిక్కిపడి, పూర్వాశ్రమ సహ ధర్మచారిణి తొందరపాటు చర్య ఆమెకు ఏ స్థితిని కల్గించిందో చూసి, "తండ్రీ! ఈ అసహయురాలైన అమాయక జీవికి, ప్రేత రూపం తొలగించి ఉత్తమగతులను ప్రసాదించు" అని మూలరామున్ని ప్రార్ధించి, తమ పవిత్ర కమండల జలాన్ని ఆమెపై ప్రోక్షించి, ఉత్తమ ఊర్ధ్వలోకాలను ప్రసాదించెను.

1623 రుధిరోద్గారి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ విధియనాడు సుధీంద్ర గురుతీర్ధులవారు, నారాయణ ధ్యానపరులై దేహ విసర్జనం గావించగా, వారికి హంపీలోనే బృందావనాన్ని ఏర్పాటు చేసి, మహా సంతర్పణాదులను మొనరించి, కుంభకోణ శ్రీ మహాపీఠానికి తిరిగొచ్చారు శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌములు. 

శ్రీ రాఘవేంద్ర తీర్ధుల పీఠాధిపత్యం, శ్రీ సుధీంద్ర గురుతీర్ధులవారు మహాభి నిష్క్రమణం వార్తలను, తమ క్షేత్ర సంచారములో తెలుసుకున్న శ్రీ యాదవేంద్ర తీర్ధులు తిరిగి మఠానికి విచ్చేయగా...ఆశ్రమ జ్యేష్ఠులుగా యాదవేంద్ర తీర్ధులువారిని పీఠాధిపత్యం స్వీకరించమని శ్రీ రాఘవేంద్ర తీర్ధులవారు కోరగా -
శ్రీ రాఘవేంద్రుల నియమ నిష్ఠలకు, పరమ భక్తితత్వానికి, పరమోత్కృష్ట ధర్మనిరతికి ఎంతో ఆనందించి, "మన గురువర్యుల ఆలోచన ఎంతో మహత్తరమైనది. గురువర్యుల ఆంతర్యం, శ్రీ మూలరాముని ఆదేశం ప్రకారం జరిగిన మీ నియమాకం మాకు అత్యంత  ఆనందదాయకం. ఈ మహా సంస్థానము, ఈ మహా మధ్వపీఠము మీ దక్షతతోనే యశశ్చంద్రికల నొందగలదు. మాకీ ఆశ్రమ నిర్వహణ, ఆచార వ్యవహారాలు వలదు. తమరు ఈ మహాపీఠాన్ని సర్వజ్ఞ పీఠంగా భాసిల్లజేసి, ఈ దివ్యపీఠాన్ని సర్వజన, భక్తజన మనోరంజకంగా నడపగలరన్నదే మా విశ్వాసమ'ని ప్రశంసాపూర్వక మనఃపూర్వక ఆశీస్సులు నొసగి, కొద్దిరోజులు ఉండి, తిరిగి తీర్ధాటనమునకు బయలుదేరారు. 

శ్రీ రాఘవేంద్రుల హయంలో మరింతగా మధ్వ పీఠ ప్రాశస్త్యం పెరిగింది. ఆనాటి పాలకులు విద్యాభిమానులు ద్వైత మతాభిమానులై, దానినాదరించారు. వేదాంత బోధలనే కాదు సాహిత్యసేవలో కూడా అద్వితీయమనిపించుకున్నారు. వీరి రచనలు సాహితీ వాగ్దేవి మెడలో నవరత్న  మణిమయ హారాలయినవి. 

ఆశ్రమ సాంప్రదాయానుసారం నిత్య నైమిత్తిక కార్యక్రమములు ధర్మబద్ధంగా నడిపిస్తున్న శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌములు, మధ్వ పీఠ ఆచారాన్ననుసరించి శ్రీ పీఠ చిహ్నముతో తమ సంస్థానముతో సంచారానికి బయలుదేరారు. ధర్మసంరక్షణం, పండిత పరిషత్తులను నడపటం, భక్తశిష్యానుగ్రహణం, జగత్కళ్యాణ కాంక్షతో సర్వులను సమాదరించడం, మతాతీతులై సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించడం... శ్రీ గురుతీర్ధుల వారి సంచారంలో ముఖ్యాంశాలు. వేదశాస్త్ర మత గ్రంధాల ధర్మ పరిరక్షణం, పండితులను సన్మానించడం, అవసరాన్ని బట్టి వాద ప్రతివాదనములు ధర్మ సమ్మతంగా భక్తజన మనోహరంగా జరిపించడం... ఈ దిగ్విజయ యాత్రలోని మరో ముఖ్యోద్దేశం.

పరమత సహనంతో తోటి మానవులను సాటివారిగా గుర్తించి గౌరవించి ఆదరించటం, సమతా మానవతలు కలిసిన మమతను పదిమందికి పంచిపెట్టడం శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధుల పరమాశయం. ఈ ఆశయ సిద్ధిలో సఫలీకృతులై భక్త జనుల, శిష్యవర్గాల, ఆర్తుల సర్వ కామ్యములను తీరుస్తూ, సద్గురు పధగాముల్ని చేస్తూ, దిగ్విజయంగా ముందుకు సాగేవారనటానికి ఎన్నెన్నో ఉదాహరణలు...
                                     

తన సంచారంలో... చిత్రదుర్గం చేరుకున్న శ్రీ రాఘవేంద్రుల వారు, తనకు అనుంగు భక్తుడైన వెంకన్న మోక్షమిప్పించమని చాలకాలం నుండి ప్రార్ధించే ప్రార్ధనను చేకొని, అతనికి తగు సమయం వచ్చిందని గుర్తించినవారై, మంత్రపూరితమైన అగ్గిని ప్రేల్చి, అందు ప్రవేశించమని వెంకన్నకు ఆనతివ్వగా, శుచిర్భూతుడై గురువర్యుల చరణారవిందములకు నమస్కరించి, అగ్ని గుండమున దూకగా, ఈ దృశ్యమును గాంచిన కొందరు అమాయక వెంకన్నను మూర్ఖంగా అగ్నికి ఆహుతి చేసారే... అని దూషిస్తుండగా, అదే సమయంలో దివ్యదేహంతో ఊర్ధ్వలోకాలకు వెడలే వెంకన్నను గాంచి, ఆశ్చర్యపోతూ తమ తొందరపాటు నిందారోపణకు నొచ్చుకుంటూ, గురువర్యుల పాదాలపై పడి క్షమించమని వేడుకుంటూ శరణాగతులైరి.
                                       

శ్రీ రాఘవేంద్రుల వారు ఉడిపి మఠంలో బస చేసినప్పుడు శ్రీకృష్ణ దర్శనం గావించి, అర్చించి ఆనందపరవశలైవారు. ఎంతైన వారు కారణజన్ములు. శ్రీ విష్ణు స్వరూప ఆరాధికులు. ఓరోజు బాలకృష్ణునిని గాంచి పరవశులైనారు. 
                                       

కృష్ణుని బంగారు ప్రతిమను ఇక్కడ మఠంలో ప్రతిష్ట చేసారు. ఇక్కడ ఉన్నప్పుడే చంద్రిక గ్రంధమునకు ప్రకాశమను పేరిట ఉత్కృష్ట వ్యాఖ్యానం గావించారు. తంత్ర దీపిక, న్యాయ ముక్తావళి లను రచించిరి.
                                    


బీజాపూర్, చిక్కోడ త్రోవలోని అడవి మధ్యమున ఎండకు సొమ్మసిల్లి వడదెబ్బ కొట్టి మంచినీళ్ళకై చూసే ఓ వ్యక్తిని గాంచి తక్షణమే అక్కడ ఒక జలధారను సృష్టించి ఆ వ్యక్తిని ప్రాణాపాయం నుండి కాపాడారు శ్రీ రాఘవేంద్ర స్వామివారు.
                                         

మండుటెండలు.....ఎడారివలె నున్న ప్రాంతంలో ప్రయాణిస్తున్న తరుణంలో, త్రాగునీటికి సైతం కటకటలాడుతూ మిడతలవలె మలమల అందరూ మాడిపోతున్న దృశ్యాన్ని గాంచిన గురువర్యులు కలతపడుతున్న సమయంలో - తన ముఖ్య సేవకుని భార్య ప్రసవవేదన పడుతుంటే చుట్టూ మండుటెండ తప్ప గుక్కెడు నీళ్ళు గానీ, విశ్రమించ జానెడు చోటు గానీ లేక, ఎటు చూసినా... ఏ ఆశ్రయం, అచ్ఛాదన కానరాక, గురువర్యులను చేరి, ఈ విషయం చెప్పగా, కరుణాంతరంగలై తన శాటిని గగనతలంలోనికి విసరగా, ఆ శాటి సేవకుని భార్యకు అచ్ఛాదన ఆశ్రయమును ప్రసాదించింది. మరుక్షణం తమ కమండల పవిత్రోదకంతో సర్వుల ప్రాణరక్షణకు కావలసిన పవిత్ర గంగామతల్లిని రావించి, అందర్నీ రక్షించిన కరుణామూర్తి శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధుల వారు. 

మరికొన్ని లీలావిభూతులు తదుపరి టపాలో -

15, ఏప్రిల్ 2021, గురువారం

సదా స్మరణీయులు | సద్గురువులు (ద్వితీయ భాగం)

 శ్రీ వేంకటేశ్వర అపారకృపాకరుణా పాత్రులైన ఆ దంపతులకు వరప్రసాదిగా జన్మించిన ఆ పుత్రునికి 'వేంకటనాధుడ'ని నామకరణం చేసిరి. దినదిన ప్రవర్ధమానుడయ్యే వేంకటనాధుని బాల్య చేష్టాలకు, ముద్దుమాటలకు ఆ తల్లితండ్రులు మురిసిపోతూ, ఆ బిడ్డకు చిన్నప్రాయంలోనే సాంప్రదాయబద్ధంగా చౌల, అక్షరాభ్యాసములు నిర్వర్తించారు. అక్షరభ్యాసం రోజున - తండ్రి తిమ్మన్నభట్టు బిడ్డ వేంకటనాధున్ని ఒడిలో కూర్చుండబెట్టుకుని,  ఓంకారం వ్రాసి, 'ఓం' అని చదువమని బిడ్డను కోరగా - 

                 

'ఓం' అనే ఆ ఒక్క అక్షరాన్ని గమనించిన బాల వేంకటనాధుడు 'తండ్రీ! ఈ ఒక్క గీత నిగమాగమ వేద్యుడయిన ఆ పరధామున్ని లేదా వారి తత్వాన్ని సూచిస్తుందా లేకా తెలియబరుస్తుందా'? అని అనడంతో, అందరూ ఆశ్చర్యపోయి, ఈ బాలుడు సామాన్యుడు కాదని, పరమజ్ఞాని అని గ్రహించి ఆనందంగా ఆశీర్వదించి, తిమ్మన్నభట్టు దంపతుల అదృష్టానికి అంజలి ఘటించారు. 

ఆ తర్వాత కొద్ది కాలానికే - వేంకటనాధుని తల్లితండ్రులు పరమపదించడం... అన్నావదినల చెంత వుంటూ, అన్న దగ్గరే బాల్యశిక్షణ పొందడం జరిగింది. అన్నగారు గురురాజాచార్యులవారు గ్రామస్థుల సౌజన్య సహకారములతో, వేంకటనాధుని ఎనిమిదవ యేట ఉపనయనము గావించి, బ్రహ్మోపదేశం చేసి, తన కుటుంబ పరిస్థితి, పోషణశక్తి అంతంత మాత్రం అవడంతో, విధిలేక తన నిస్సహాయతను, అశక్తతను తెలియబరుస్తూ, తమ్మున్ని సేరదీయమని, మధుర లోని తన బావగారు లక్ష్మీనసింహాచార్యులవారి వద్దకు వేంకటనాధున్ని పంపడం జరిగింది. కుశాగ్ర బుద్ధి, ఏకసంధాగ్రాహి, చదువుల సరస్వతిగా భాసిల్లే ఆ బాబును, అక్కా బావగార్లు ఎంతో లాలించి, ఆదరించి ప్రేమించారు. అనతికాలంలోనే శ్రీ వేంకటనాధులు, అష్టాదశ పురాణాలను, షట్ శాస్త్రములను మహర్షి అగస్త్యులవారివలె పుక్కిటబట్టి, వేదవ్యాసుల వారివలె మనోజ్ఞానియై విరాజిల్లారు. శ్రీ వేంకటనాధుడు వంశపారంపర్య  వీణా విద్వాంసుడు, తర్కవ్యాకరణాలను తరచి చూసిన పండితుడు. 

ఒకరోజు - 
పద్దెనిమిది సంవత్సారాలు వచ్చిన
వేంకటనాధున్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని, 'ఇంకా చదువుతావా...లేదా ఏదైన వ్యాపకం చూసుకొని అన్నయ్యకు తోడుగా ఉంటావా? ఉంటే బాగుంటుందేమో...కాస్తా ఆలోచించు' అని అక్కాబావగార్లు అనడంతో - 
"మీ మాటలు శిరోధార్యలే కానీ, ఏదో వ్యాపకం దొరికేవరకు అన్నగారికి బరువు కాకుండా కుంభకోణానికి వెళ్ళి, మరింత విద్య సంపాదించుకుంటా"నని, అంతవరకు విద్యా, అన్నప్రదాతలు, ప్రేమమూర్తులు, పూజ్యులైన అక్కాబావగార్లకు పాదాభివందనం చేసి, విద్యాసక్తుడై కుంభకోణానికి చేరి, శ్రీ సురేంద్ర గురుతీర్ధులను దర్శించి, ఆచారానుసారం గోత్ర ప్రవరులు చెప్పుకొని, సాష్టాంగ దండ ప్రణామం ఆచరించగా... ఆ గురువర్యుల వారికి, తిమ్మన్నభట్టు వారు స్మృతిపధంలో కదలాడుతుండగా, ఆదరాభిమానాలతో ఆశీర్వదించి, తమ శ్రీపీఠంలో విద్యాభ్యాసం చేయమని చెప్పిరి. సహవిద్యార్ధుల అసూయ ద్వేషాల నడుమ ఇబ్బంది పడుతున్నను, గురువుగారి వాత్సల్యతతో విద్యను కొనసాగిస్తుండెను. ఆ సమయంలో వేంకటనాధుడు శ్రీసుధాపాఠానికి ఎంతో చక్కగా పూవుకు తావి అబ్బినట్లు పరిమళ సొగసులు కూర్చుతూ వ్రాసిన వ్యాఖ్యానం గురించి అందరికీ తెలిపి, వేంకటనాధుని ప్రతిభను మెచ్చి, నీలాంటి మంచి బిడ్డను కన్న నీ తల్లితండ్రులు, శిష్యునిగా పొందిన నేనూ, నీ సహ విద్యార్ధులు ధన్యులమయ్యా అని, శ్రీ సురేంద్రతీర్ధులవారు ఆ ప్రియ శిష్యునికి 'పరిమళాచార్యులు' అనే బిరుదుతో సత్కరించిరి. వేంకటనాధుడు పరిమళాచార్య బిరుదం పొందిన కొద్దిరోజులకు, శ్రీ గురుతీర్ధుల దిగ్విజయ యాత్రలో భాగంగా, తమ శిష్యబృందంతో కలసి సంచారము చేస్తుండగా, గురువర్యుల ఆదేశానుసారం దక్షిణ మధురలో, ఓ ద్రవిడ సన్యాసితో మహాబాష్యంపై వాద చర్చ చేసి, ఓడించి, శ్రీ గురుదేవులచే 'మహాభాష్యాచార్య' అను బిరుదు పొందెను. అటులనే, తంజావూరులో గురువర్యుల ఆజ్ఞానుసారం అద్వైత, వేదంత పాండిత్యమునందు అసాధరణ ప్రజ్ఞ గల యజ్ఞనారాయణ దీక్షితులుగారితో, ద్వైత అద్వైత విషయంలపై పద్దెనిమిది దినముల సుదీర్ఘ చర్చ గావించి, పందొమ్మిదవ దినమున తన లోకోత్తర శాస్త్రార్ధ వాద పటిమకు ఎదురు లేదని నిరూపించుకొని, 'భట్టాచర్య' బిరుదమును పొందెను. ఇలా వేంకటనాధుడు అసాధరణ ప్రజ్ఞావంతులయ్యాక, శ్రీ గురు సుధీంద్ర తీర్ధులవారు గురుకులం విడిచి గృహస్థాశ్రమము స్వీకరించమని ఆశీర్వదించి, అనుమతిచ్చి ఇంటికి పంపించగా - 
గురుతీర్ధుల వారి అనుమతితో అన్నగారింటికి చేరెను. యుక్తవయస్సు వచ్చిన వేంకటనాధునికి సరస్వతి అను కన్యనిచ్చి వివాహం చేయగా, వారికి పుత్రుడు జన్మించడం, ఆ పుత్రునికి లక్ష్మీ నారయణుడు అని నామకరణం చేయడం జరిగింది. ఈ మహానీయునికి సరస్వతీ కటాక్షం మాత్రమే లభించింది గానీ, లక్ష్మీదేవి కరుణించలేదు. వీరి పాండిత్యం విన్న ఎందరెందరో తమ పిల్లలను విద్యాభ్యాసమునకు పంపుతుంటే, ఆనాటి గురుకులాచారం ప్రకారం ఇంత తిండిపెట్టి చదువు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఈ పండితుడు కొట్టుమిట్టాడుతుంటే, తమ తాహతును బట్టి కొందరు ఆర్ధిక సహాయమందించ తలచితే, సరస్వతిని అమ్ముకొనరాదనే భావంతో ఆ సహాయాన్ని తిరస్కరిస్తూ, భార్య పుత్రునికి సరైన తిండి సమకూర్చలేక దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న తరుణంలో, 

ఓ నాడు - 
ఓ వ్యక్తి వచ్చి,  ఈరోజు న్యాయాధికారి ఇంట్లో బ్రాహ్మణ సంతర్పణ, పండిత పరిషత్తు, సన్మానాలు జరుగుతున్నాయి. కావున సకుటుంబముగా విచ్చేయండి అని చెప్పి వెళ్ళగా, 'పోన్లెండి, రెండురోజుల నుండి మంచితీర్ధంతో కాలం గడుపుతున్న మనకీనాడు మృష్టాన్న బోజనాన్ని ప్రసాదిస్తున్నాడా శ్రీహరి' అని ఆ ఇంటి ఇల్లాలు పలుకగా, ఈనాడు ఎవరో పెడుతున్నారు, మరి రేపో? నెలకు రెండు ఏకాదశులు అందరికి తెలుసు. మనకెన్నో  ఆ దేవునికే తెలియాలి. (ఏకాదశి నాడు ఉపవశించటం మధ్వ సాంప్రదాయం) ఈనాడు జిహ్వచాపల్యానికి గురయ్యేకన్నా ఏకాదశి అనుకుంటే బాగుంటుందని వేంకటనాధులు అన్ననూ, అప్పటికే పిల్లవాడిని తీసుకొని వెళ్ళడానికి సిద్ధమైన బార్యను చూసి, ఇల్లాలును సంతృప్తిపరచటం తన విధిగా తలచి, బయలుదేరారు వేంకటనాధులు. అప్పటికే ఎందరో పండితులు విద్వాంసులు... ఎవరిస్థాయికి తగ్గట్లు వారు వారలతో చర్చలు జరుపుతుంటే, వేంకటనాధులు మాత్రం అందరికీ కాస్త దూరంగా తన అనుష్టానాన్ని చేసుకుంటూ, ఒక పక్కగా కూర్చొని ఉండగా - 
                       

ఓ పెద్దాయన అటుప్రక్కగా వచ్చి, 'అయ్యా! అలా ఏదో గొణుగుకుంటూ కూర్చునే బదులు ఈ సాన, చెక్క తీసుకొని కాస్త గంధం తీసి యజమాని పనుల్లో సాయం చేయరాదు' అని అనగా... "గంధం తీయటానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ, ప్రస్తుతం నేను అగ్నిసూక్తం పఠనం చేస్తున్నాను. ఈ సమయంలో గంధం తీయవచ్చునా" అని బదులివ్వగా, నోటికి చేతికి సంబంధం లేదు, తీయు తీయు అని గదమాయించి హడావిడిగా ఆ పెద్దాయన చెప్పి వెడలెను. అంతట వేంకటనాధులు సాన, చక్క అందుకొని అగ్నిసూక్త పఠనం గావిస్తూ గంధం తీయడం, ఓ కుర్రవాడు ఎప్పటికప్పుడు వచ్చి ఆ గంధాన్ని పండితులకి అందించగా,  గంధం పూసుకున్న ఆ పండితులు కాసేపటికి
మంట మంట అని గగ్గొలు పెడుతుంటే... 
'ఎక్కడా ఎక్కడా' అని పరిగెత్తుకొచ్చెను బ్రహ్మాణ సమారాధాన సన్మాన కార్యక్రమాల నేర్పాటు చేసిన న్యాయాధికారి. పండిత బృందం గంధం రాసుకుంటే మంటలు పెడుతున్నాయని చెప్పగా, ఎక్కడిదా గంధం అని ఆరా తీస్తూ, వేంకటనాధుని దగ్గరకు వచ్చి, రెండు చేతులు జోడించి 'మహాత్మా! మన్నించండి. మీరు మహాపండితులుగా ఉన్నారు. మీకీ పని అప్పగించిన వారెవరూ? ఇందులో పొరపాటున ఏదో కలిసినట్లుంది, ఈ సద్బ్రాహ్మణులు మంటలు మంటలు అని గగ్గోలెత్తుతున్నారు అని వినయవిధేయతలతో న్యాధికారి చెప్పగా -
"ఆర్యా! ఇందులో ఏమీ కలువలేదు, ఎవరో గంధం తీసిపెట్టమని అడిగారు, అగ్నిసూక్తం పఠిస్తున్నాను ఇప్పుడు గంధం తీయవచ్చునా అని అడిగితే, 'నోటికి, చేతికి సంబంధం లేదు, తీయు తీయు' అని చెప్పేసరికి మధ్యలో ఆపకూడదని, అగ్నిసూక్త పఠనం చేస్తూ గంధం తీసాను, అందుకే ఆ మంటలు" అని చెప్పగా -
ఆ పని అప్పగించిన బ్రాహ్మణుడు, 'ముప్ఫై ముప్ఫై ఏళ్ళ పౌరహిత్యం నాది. ఎన్నో వ్రతాలు, సూక్తాలు, పారాయణాలు చేయించాను, చేశాను. ఇలా మంత్రాలకు చింతకాయలు రాలటం చూడలేదు, ఈ గంధంలో ఏమి కలిపావేమిటి' అని గుర్రుగా చూస్తూ, గదమాయిస్తుంటే... "అయ్యా! తాము పెద్దలు, ఎన్నోయేళ్ళుగా వైదికవృత్తిలో వున్నవారు, తమను కించపరచటం, తమ మాటలను ఖండించటం నా అభిమతం కాదు. కాకపోతే -
"దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం
తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణోమమ దేవతా"
అని, సత్యాన్ని నేలపాలు చేయరాదు. ఇప్పుడు చూడండి, వరుణసూక్త పారాయణంతో గంధం అరగదీస్తాను. ఇది పూసుకుంటే మంటలు తగ్గుతాయి. మంత్రశక్తిని అర్ధం చేసుకుని పదిమందికి ఆ దివ్యశక్తిని పంచండి. మంత్రాలను, మహాపురుషులను, దైవాన్ని హేళన చేయకండి" అనగా...
ఇదంతా ప్రత్యక్ష దర్శనం గావించిన అక్కడ వారంతా అవాక్కయి, అంజలి ఘటించారు. ఆ యజమాని పరిపరివిధాల క్షమాపణ చెప్పి సమారాధనలో తగు మర్యాదలు అందించి, ప్రతి మాసం తమ గృహవసరాల నిమిత్తం కొంత దక్షిణ సమర్పించుకోదలిచాను, అందుకు అనుగ్రహించవలసిందిగా కోరెను. కానీ, దూషణభూషణలు, చీత్కార సత్కార్యాలు సర్వమూ సమమనుకునే సమర్ధరూపికి, ఎందుకో ఆ తరుణమున గురుదేవులు జ్ఞప్తికి రావటంతో, భార్య సరస్వతితో, "ఇక్కడెవరికో భారమౌతు బ్రతికేకన్న, శ్రీ గురుతీర్ధుల సందర్శనం గావిస్తే, ఇహపరాలు లభిస్తాయి. ఈ ఇహలోక సంసార గుంజాటనకు సుగమమార్గం లభిస్తుంద"నగానే, "అవశ్యం, శుభస్యశీఘ్రం" అందా ఇల్లాలు. తమ చిరంజీవితో ఆ దంపతులు వెంటనే కుంభకోణానికి బయలుదేరారు.
శ్రీ గురువులను దర్శించి ప్రణమిల్లి, శ్రీ గురువుల చరణ సన్నిధిలో కూర్చుందా కుటుంబత్రయం. వారిని చూసిన శ్రీ సుధీంద్ర తీర్ధులవారి ఆనందానికి అవధులు లేవు. 
ఎన్నాల్టికి చూశాం, ఇన్నాల్టికి నువ్వు మమ్మల్ని గుర్తుకు తెచ్చుకుని వచ్చావు, సంతోషం నాయనా. ఇక్కడ నువ్వు కుటుంబ సమేతంగా ఉండి, నీ విద్యను పదిమందికి పంచు. నిన్ను నీవభివృద్ధిని చేసుకోమని ఆశీఃపూర్వకంగా సమయోచిత  సూచననొసంగారు శ్రీ గురుతీర్ధులవారు.  వారి కరుణను స్మరించుకుంటూ కృతజ్ఞతా పూరితులై సంతోషంగా కాలం గడుపుతున్న తరుణంలో... 
మరల దిగ్విజయ యాత్రను చేయడం, అక్కడ కొందరితో వ్యాకరణ మహా భాష్యములతో, వాక్యార్ధ శాస్త్ర చర్చలు సలిపిన శిష్యుని అమోఘ ప్రతిభా సంపత్తికి, మహా పాండిత్యానికి శ్రీ గురుదేవులు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. తమ దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకుని శ్రీ పీఠానికి తిరిగివచ్చాక, శ్రీ గురుతీర్ధుల ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నది. ఇకపై కొత్త పీఠాధిపతిని నియమించాలని అనుకున్న గురుదేవులవారికి శ్రీమూలరాముని ఆశయం ఆదేశం వినిపించి, వేంకటనాధున్ని పిలిపించి "వేంకటనాధా! కాస్త ఓపిక ఉండగానే కొత్త పీఠాధిపతిని నియమించాలని మా మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. ఇందుకు శ్రీవారి అనుమతి లభించినట్లు మా ఆరాధ్యదైవం శ్రీ మూలరాములవారు స్వప్న దర్శనం ప్రసాదించి, మాకు వారసుడవు నీవని సెలవిచ్చారు. నీకు దీక్ష యిమ్మన్నారు అని చెప్పగా -
గురుదేవా! మీరు మాట్లాడుతున్నదేమిటో, దాని పర్యావసాన మేమిటో నాకు అర్ధం కావటంలేదు. నేనిమిటి? మీకు వారసునిగా పీఠాధిపత్యం స్వీకరించటమేమిటి? చిన్నప్పుడే తల్లితండ్రులు పోయారు. ప్రేమగా చూస్తున్న అన్నావదినలు వారికి తెలిసిన కొంత విద్యను గరపి, వారి ఆర్ధిక పరిస్థితి అనుసరించి నన్ను అక్కాబావల దగ్గరకు పంపారు. వారు నన్ను కన్న తల్లితండ్రులు కన్నా మిన్నగా, ప్రేమతో పెంచి పెద్దచేశారు. విద్యాబుద్ధులు గరిపారు. ప్రపంచజ్ఞానంలేని నేను, ఇంకా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడకు ఈ ఆశ్రమానికి వచ్చాను. ఈ ఆశ్రమంలో మొదట ఎన్ని అగచాట్లు పడ్డానో, సర్వం మీకు తెలుసు. సమయానికి మీరు ఆదుకొని కరుణించబట్టి, ఆ మనోమధనం నుండి భయటపడి ఈ మాత్రం విజ్ఞానాన్ని పొందాను. మీ కరుణ, ఆశీర్వాదబలాలతో పండిత పరిషత్తులలో గణుతికెక్కి, అనేక బిరుదులు పొందాను. ధన్యుడును. ఆపై మీ అనుమతితో అన్నగారింటికి వెళ్ళగా, వివాహం చేసారు. నా ఇల్లాలు అయిన సరస్వతి ఏనాడు సుఖపడలేదు. మా కడుపున పుట్టినందువలన ఆ చిరంజీవి దుర్భర దారిద్ర్యమనుభవించాడు. గుక్కెడు పాలు కూడా ఇవ్వలేని దీనాతిదీన హీనస్థితిలో ఇలా అందరం శ్రీగురుచరణాలను చేరి సుఖిస్తున్నాం. మీ కరుణ కటాక్షాల వలన ఇంత తిని తృప్తిగా బ్రతుకుతుంది నేడు మా కుటుంబం. ఇప్పుడు ఈ తరుణంలో నేను తురీయాశ్రమాన్ని స్వీకరిస్తే, వారికి అన్యాయం చేసినట్లే. ముక్కుపచ్చలారని బిడ్డడు, ఎండకన్నెరగని భార్య, జీవితమంటే ఏమిటో తెలియని, వారు ఎంతటి పరితాపానికి లోనవుతారో ఆలోచించండి. సంసారాన్ని ఈదలేక సన్యాసినయ్యానని లోకం కోడై కూస్తుంది, ఇది నావల్ల కాదు. వీలుకాదంటే చెప్పండి, ఇక్కడనుండి ఎక్కడికైనా వెళ్ళి ఏదో విధంగా బ్రతుకుతాం. నన్నేవిధంగా నిర్భందించనని వాగ్దాన మొనరిస్తేనే,  ఇక్కడ ఉంటామని అన్న వేంకటనాధుని తేరిపారచూసిన సుధీంద్ర తీర్ధులవారు ... 
నాయనా! శ్రీ మూలరాముని ఆశయం చెప్పానే తప్ప, నిన్ను నిర్భందించి తురీయాశ్రమంలో ప్రవేశపెడతాననలేదు. విషయం వివరించటం మా వంతు. అంతా మూలరాముని దయ. నిన్ను బలవంతం చేయం. భయపడక నిర్భయముగా ఉండమని అభయమిచ్చారు. ఆ పిమ్మట పూర్వాశ్రమ దూరపుబంధువు నొకరిని శ్రీ గురువర్యులు పిలిపించి, వారికి ఆశ్రమవాసమొసగి 'యాదవేంద్రతీర్ధులు 'అని నామకరణమొసగారు. ఆశ్రమ స్వీకారం గావించిన శ్రీ యాదవేంద్ర తీర్ధులు గురువర్యుల అనుమతి పొంది క్షేత్రసంచారానికి బయలుదేరారు. 

ఇలా రోజులు గడుస్తున్నను, గురుతీర్ధుల వారి మనస్సులో మాత్రం వేంకటనాధునికి మహా మధ్వపీఠ సామ్రాజ్యాన్నప్పగించాలని ఉండేది. ఆ కోరిక తీరే సమయం కోసం ఎదురు చూస్తున్నారు.  ఇక్కడ వేంకటనాధునికి కూడా ఇది శ్రీమూలరాముని ఆశయం, ఆదేశమయ్యా... అన్న మాటలు చెవుల్లో గింగురుమంటుండగా, ఎంతో అంతర్మధనముకు  లోనౌతూ అన్యమనస్కుడై తిరుగాడుతుండెను. ఇలా కొన్ని రోజులుగా చింతావ్యాకులుడైన వేంకటనాధుని అంతర్మధనానికి స్వస్తి పలికినట్లైనది ఓ నాటి నిద్రలేని రాత్రి. 
                      

వీణాధారి సర్వాలంకార భూషితమైన స్త్రీ మూర్తి  వాగ్దేవి కనుల ముందు సాక్షాత్కారమవ్వగా, ఆశ్చర్యానందాలతో లేచి చేతులు జోడించి నిలబడగా, ఆ తల్లి మదస్మిత చిరుదరహాసంతో - "వత్సా! వేంకటనాధా! నేను నీ ఆశ్రయము, నీడకోరి భాగ్య భవిష్యత్తును పొందవచ్చిన విద్యాలక్ష్మినయ్యా. ఈ మధ్వ మహపీఠ అనంత విద్యాలక్ష్మినై, వ్యాసరాజుల హయాములో తరించాను. సుధీంద్రుల పలుకబడిలో పరవశించాను. నీ సన్నిధిలో శాశ్వతకీర్తిని పొందాలని ఉవ్విళ్ళూరుతున్నాను. బిడ్డా! నీవు ధన్యచరిత్రుడివి, కారణజన్ముడవు, ఉభయులమూ తరించే ఈ మహాద్భాగ్యాన్ని చేజేతుల విడిచిపెట్టి నన్ననాధను చెయ్యకు. ఒక్కసారి నీ జ్ఞాననేత్రాన్ని తెరు... నువ్వేవరివో, నీ జన్మ రహస్యం ఏమిటో, నీవు సాధించవసిన దేమిటో, ఈ మహామాయ ఏమిటో, ఈ మాయాప్రకృతికి నీవెలా తగులుకున్నావో...సర్వం బోధపడుతుంది. అప్పుడు తప్పక ఈ తల్లి కోర్కెను మన్నిస్తావు. 

విద్యాయత్తంతేయతిత్వమ్నశక్యం:, త్యుక్తుం ప్రాప్తుం తద్వశత్వంకుమాపి |
ఇత్యుక్తాసామంత్రమస్యోపదిశ్వ, స్వీయందేవి వశ్యతోం తర్ధదేద్దా ||

నువ్వు యతివి కావాలని, నీకువశవర్తినినై, నీ నీడలో నేను ప్రభవిల్లి ప్రకాశించాలని, పరమాత్మ వ్రాసిన లలాటలిఖితం. ఈ విధి వ్రాతను తప్పించ నెవరికీ సాధ్యంకాదు. ఇది పరమాత్మ మొసగిన ఆదేశం. ఇది ఎవరు కాదన్నను జరిగి తీరవలసినదే.
ఈ మాటలు వింటున్నతనికి గతంలో తన జన్మలు, చేయవలసిన కర్మలు, సర్వం కనుల ముందర కదలాడుతున్నాయి. గతంలోంచి వర్తమానంలోకి, వర్తమానంలోంచి భవిష్యత్తులోకి...తిరుగాడుతూ సర్వమూ దర్శిస్తున్నాడు. శ్రీ గురుతీర్ధుల మాటలు, శ్రీమూలరాముని ఆదేశం, విద్యాలక్ష్మి అభ్యర్ధన... అన్నీ వినబడి మనస్సును వేగిరపరుస్తున్నాయి. వాగ్దేవి ఆశీస్సులతో భవిష్యద్దర్శనం గావించిన ఆ పరమపురుషుడు అందరి ఆశల,  ఆశయ కర్తవ్య నిర్వహణకోసం ఆశ్రమ స్వీకారం చేయాలని నిర్ణయంచుకోగా, సరిగ్గా అదే క్షణంలో... వేంకటనాధుడు ఆశ్రమ స్వీకారం గావించడం కోసం రాబోతున్నాడని శుభవర్తమానం శ్రీమూలరాముని ద్వారా శ్రీ గురుతీర్ధులవారు విని పరమానందంతో పరవశత్వాన్ని పొందారు. 
తెల్లవారింది -
త్వరత్వరగా కాలకృత్యములు తీర్చుకుని శ్రీ గురుతీర్ధులవారిని దర్శించి, "ఓం శ్రీ గురుభ్యోం నమః" అని సాష్టాంగ దండ ప్రణామము లాచరించి, గురుదేవా! మీ మాట శిరసావహిస్తాను, సన్యాసాశ్రమం స్వీకరిస్తాను, శ్రీమూలరాముని సేవలో తరిస్తాను, అనంత విద్యాలక్ష్మి ఆజ్ఞను శిరమున దాల్చి అందరి అభీష్టం మేరకు నడుచుకుంటాను..." ఎంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, చెప్తున్న వేంకటనాధుని గాంచి, "చాలా సంతోషం. అందరి అభీష్టం నెరవేరే శుభ సమయం ఆసన్నమైంది. ఆ శ్రీహరి కరుణతో, సర్వ శుభంకరుడవై వెలుగొందుతావ"ని దీవించారు శ్రీ గురుతీర్ధులవారు. శ్రీ గురుతీర్ధుల ఆశీస్సులను పొందిన వేంకటానాధుడు తమ చిరంజీవి లక్ష్మీనారాయణుకి ఉపనయనము గావించి, భార్యతో తన నిర్ణయం చెప్పి, ఆమె పరిపరి విధాల వాపోతున్న, కేవలం నీ నుండి అనుమతిని అభ్యర్ధిస్తున్నానే తప్ప, దైవ ఆదేశాన్ని ధిక్కరించలేను అని తన దృఢ నిర్ణయాన్ని తెలిపెను. నూతన పీఠాధిపతి పట్టాభిషేక సందర్భాలు తగు విధాన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

దైవం నిర్ణయించిన సుముహుర్తం వచ్చింది -
                       

1621 శ్రీ దుర్మతినామ సంవత్సరం ఫాల్గుణ శుక్ల విదియ నాడు - 
తంజావూరు రాజ ప్రసాదమున, పురాధిపతి శ్రీ రఘునాధనాయకులవారు ఆధ్వర్యంలో విద్వాన్మణుల సమక్షంలో, ప్రస్తుత మహా మధ్వ పీఠాధిపతులు సుధీంద్ర గురుతీర్ధులవారు పర్యవేక్షణలో, శ్రీ వేంకటనాధుడు తను దేహిగా చేసుకోవలసిన సర్వకర్మలను ప్రాయశ్చిత్తాదులతో జరుపుకొనడం, పూర్వనామ దేహాన్ని తృణం వలె విసర్జించి, నూతన నామధేయ దేహంతో "శ్రీ రాఘవేంద్ర తీర్ధులు"గా ప్రకటితమై, మధ్వ పీఠాధిపతిగా పట్టాభిషిక్తులైరి.

 శ్రీరాఘవేంద్రుల చరిత్రకు కావల్సిన చిత్రాలు ఇచ్చిన గూగులమ్మకు ధన్యవాదములు. 

ఆనాటి సంఘటనలకు దర్పణం పట్టినట్లు, చిత్రాలు గీసిన చిత్రాకారునికి నమస్సులు. 

లీలావిభూతులు తదుపరి టపాలో -

సదా స్మరణీయులు | సద్గురువులు

                      

సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మ సంస్థాపనకోసం, జగత్కల్యాణ కారక కార్యనిర్వహణ కొరకు, ప్రతీ యుగంలోనూ భగవంతుడే కాదు, సద్గురువులు అవతరిస్తునే ఉంటారు. 

                         

"శ్రీగురు నామస్మరణం -సర్వపాపహరం". 

సర్వబాధల నుండి రక్షించి, సంసార సముద్రాన్ని తరింపచేసి, తన శాశ్వత సద్గురు ధామాన్ని ప్రసాదింప చేయగల పరమపుణ్యులు, త్రిమూర్త్యాత్మక స్వరూపులు "సద్గురువులు". అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవారు సద్గురువులు. 
                          

 శ్రీ దక్షిణమూర్తి, శ్రీ వేదవ్యాసులు, శ్రీ దత్తాత్రేయులు, శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ విద్యారణ్యులు, శ్రీరామకృష్ణులు, కబీరుదాసు, త్రైలింగస్వామి, లాహిరి బాబా, యోగానంద, శ్రీ రమణులు...ఇలా ఎందరో సద్గురునాధులు. అందరికి వందనములు.

మన సద్గురువులు గురించి స్మరణలో స్మరించుకోవాలనిపించి...  ఈరోజు ఇలా ఓ సద్గురువును స్మరించుకుంటున్నాను -

ఇది ఒకప్పటి కధనం. 
యుగ యుగాలనాటి కధనం. 
తెలుసుకోదగ్గ కధనం... 
ప్రజాపతియైన బ్రహ్మ అనునిత్యం తన జన్మకారకుడైన శ్రీమహావిష్ణువును అనంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూ, పరబ్రహ్మ ప్రసాదించిన శక్తితో, ఈ సర్వసృష్టిని కొనసాగిస్తున్నాడు. ఆ పరబ్రహ్మే శంఖుకర్ణుడనే తన భక్తున్ని, సృష్టికర్తకు సపర్యలు చేయటానికి బాసటగా ఉంచాడు.
                          

బ్రహ్మ చేసే శ్రీమహావిష్ణువు దశావతార పూజలకు, కావలసిన తులసి, పూలదండలు మొదలగునవి సమయానికి సమకూర్చడం శంఖుకర్ణుని దినచర్య. ఇది నియమం తప్పక సాగే నిరంతర చర్య. ఇలా కాలం గడుస్తున్న తరుణంలో... ఒకానొక రోజు శంఖుకర్ణుడు "శ్రీరామ"రూప శ్రీహరి పూజకు తులసి, పూల మాలలు సమయానికి సమకూర్చక, శ్రీరాముని దివ్యస్వరూపాన్ని స్మృతి పథంలోకి తెచ్చుకొని తదేకధ్యానముతో తన్నుతాను మరచి తన్మయుడై తను చేయాల్సిన పనిని మరిచాడు.

బ్రహ్మదేవుడు పూజవేళ అతిక్రమిస్తుందని ఆందోళనగా శంఖుకర్ణునికై చూస్తుంటే - శంఖుకర్ణుని జాడలేదు, పూజకు పత్రీ పూలు లేవు. కాలహరణం ఏ మాత్రం ఉపేక్షించని బ్రహ్మ కన్నులు జేవురించగా, శంఖుకర్ణుని నిర్లక్ష్యానికిగాను దానవుడవై జన్మించమని శాపమిచ్చాడు. సృష్టికర్త గంభీర స్వరంతో ఇచ్చిన శాపముకు ఉలిక్కిపడి, తన్మయత్వం నుండి బయటపడి, 'బ్రహ్మదేవా! పరమాత్మ మీ పూజకు సాయపడమని నన్ను నిర్దేశించగా, ఆనాటినుండి సవ్యంగా పనిచేస్తున్న నేను, నేడు మీరు దశావతారములో భాగమైన శ్రీరామచంద్రునికి పూజ చేస్తారనే మహోత్సాహముతో పువ్వులు సేకరిస్తుండగా, ఆ దివ్యమూర్తి రమణీయ రూపం మనోఫలకంపై నిలవగా, నన్ను నేను మర్చిపోయానే తప్ప, మరే ద్యాస నాకు లేదు. హృదయఫలకంపై నిలిచిన శ్రీరామచంద్రుని రూపాన్ని దర్శిస్తూ, నన్ను నేను మర్చిపోయేస్థితిలో ఉన్న నన్ను, ఈ విధంగా శపించడం న్యాయమా' అని ప్రాధేయపూర్వకంగా అభ్యర్ధించగా, తృటిలో సర్వం గ్రహించిన బ్రహ్మదేవుడు, శంఖుకర్ణుని ఉద్దేశించి, "నాయనా! ఇదంతా భగవద్విలాసంలోని భాగమే. పరమ భాగవతోత్తముడైన నీ విష్ణుభక్తి శాశ్వతం. విష్ణులోకం నీకు శాశ్వతం. పరమాత్ముని చిద్విలాసంలో భాగంగా, నీవు భూలోకంలో దానవుడవై జన్మించినా, నీ అచంచలమైన విష్ణుభక్తి, దృఢదీక్ష సర్వలోకాలవారికి ఆదర్శమౌతాయి. నీ జన్మ చరితార్ధమౌతుంది. అంతేకాదు, ఏ శ్రీరామచంద్రుని రూపాన్ని దర్శిస్తూ, నిన్ను నీవు మరచి తాదాత్మ్యం చెందావో, ఆ మూలరాముని పూజించుకుంటూ, నిన్ను నీవు ఉద్దరించుకోవడమే కాకుండా, త్రికరణశుద్ధిగా నిన్ను నమ్మి సేవించుకొనే సర్వభక్తజనులను సముద్ధరిస్తావు. లోకశుభంకరుడవై, పతితదీనజనోద్దరణ గావిస్తావు" అని అశీర్వదించగా -
భగవద్విలాసానికి తలవొగ్గి, శాపఫలితంగా విష్ణు ద్వేషియైన హిరణ్యకశిపునికి పుత్రుడిగా, ప్రతిక్షణం హరినామస్మరణ గావించే భక్తప్రహ్లాదునిగా జన్మిస్తాడు. శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం...ఆ దివ్యలీలావతార కధనం అందరికీ విధితమే.  ఇది కృతయుగము నాటి మాట. 

ఇలా రాక్షసకులంలో జన్మించి, పరమభాగవతోత్తమునిగా ప్రకాశించిన ప్రహ్లాదుడు, జన్మకర్మ విశేషాన తదుపరి జన్మలో బాహ్లీకరాజుగా జన్మించి, పరమభక్తాగ్రణియై శ్రీకృష్ణున్ని తన ఆరాద్యదైవంగా స్వీకరించి, సేవించి ధన్యుడైనాడు. 
ఇది ద్వాపరయుగం నాటి మాట.

పిదప ఈ పరమ వైష్ణువుడే, ఈ కలియుగమున 15వ శతాబ్దిలో శ్రీ వ్యాసరాయతీర్ధులుగా ప్రభవించి, తన అశేష ప్రజ్ఞా పాటవములతో, వైదికతత్వ ప్రచారము, విశేష గ్రంధరచనలు చేసి, సకలవిధ సత్సంగములు గావిస్తూ, ఎన్నో లీలలతో, తమ శక్తియుక్తులతో లోక కళ్యాణం, భక్తజన సంరక్షణం, దీనజనపాలనం చేస్తూ, శ్రీ మధ్వ పీఠాధిపతులుగా, మహామాన్వితులై వెలుగొందారు.

అది -
ధైర్య, శౌర్య, ధర్మ కృత్యములతో చరిత్ర ప్రసిద్ధి పొందిన చక్రవర్తి, కలాన్ని కత్తిని ఏక చేతిన పట్టిన సాహితీ సమరాంగణ ధీరుడు, సకల కళాకోవిదుడు అయిన శ్రీకృష్ణ దేవరాయ సౌర్వభౌమలవారి కాలం -

సధర్మ నిరతులు, భగవద్భక్తి పరాయణులు, నీతి కోవిదులు, దేశ, ప్రభుభక్తి పరాయణులైన శ్రీకృష్ణ భట్టులవారు ఆనాటి విజయనగరాధీశుల ఆస్థాన పండితుల్లో ఒకరు. వీరే శ్రీకృష్ణ దేవరాయలవారికి వీణానాద పాండిత్యాన్ని నేర్పినవారు. ఈ శ్రీకృష్ణ భట్టారకుల కుమారుడు కనకాచలభట్టు. ఈయన కూడా తండ్రికి వలె వీణా విశారదులు, శాస్త్ర పండితులు, నిష్ఠాగరిష్టులు. ఇతనికి చాలా కాలం సంతానం కలగకపోవడంతో, హంపీ విజయనగరంలో శ్రీ వ్యాసరాయల వారు ప్రతిష్ఠించిన శ్రీ ఆంజనేయున్ని సేవించగా, ఆంజనేయున్ని అనుగ్రహ ఫలంగా పుట్టిన బిడ్డ తిమ్మన్నభట్టు. (తిమ్మణ్ణాచార్యులవారిగా ప్రసిద్ధి). ఈయన కూడా తాత, తండ్రి లాగే వీణా విద్వాంసులు, వేదాధ్యయనమే జీవన పరమావధి అని త్రికరణశుద్ధిగా నమ్మినవారు, గొప్ప వ్యాకరణ వేత్త మరియు శ్రీ వేంకటేశ్వరారాధుకులు. వీరి సతీమణి గోపికాంబ. వీరికి ఓ అమ్మాయి (వెంకమాంబ) అబ్బాయి  (గురురాజ) సంతానం. వీరు కూడా విజయనగర సామ్రాజ్య ఆస్థాన విద్వాంసులుగా కాలం గడుపుచుండగా ... మహ్మదీయులు రాజ్యకాంక్షతో సమైక్యముగా సల్పే దాడుల ఫలితంగా విజయనగర రాజ్యపతనం కాగా, రాయల శకం అంతరించడం వలన కవులు, గాయకులు, కళాకారులు, పండితులు అనాధులైపోయారు. తిమ్మన్నభట్టువారు కూడా తన కుటుంబంతో వలసపోతు తంజావూరు మండలంలోని కంచినగర సమీప భువనగిరి చేరారు. అప్పటి మండలాదిపతి అయిన శ్రీ చెన్నప్ప నాయకుల ఆశ్రయాన్ని పొందిన తిమ్మన్నభట్టు, కాలగమనంలో శ్రీ మహామధ్వాపీఠాచార్యులైన శ్రీ సురేంద్రతీర్ధ, విజయేంద్రతీర్ధుల ఆదేశానుసారం కుంభకోణానికి తమ మకాం మార్చి, శ్రీ మహాపీఠంలో జీవనం సాగిస్తున్న తరుణంలో... కుమార్తె వెంకమాంబను మధురలోని మహాపండితుడైన శ్రీలక్ష్మీ నరసింహాచార్యులవారికి ఇచ్చి వివాహం జరిపించడం, కుమారుడైన గురురాజుకు ఉపనయనము చేసి గురుకులానికి పంపడం జరిగింది. అటుపిమ్మట వారికి మరోపుత్రుడు ఉంటే బాగుండుననిపించి, వెంటనే తిరుపతికి బయల్దేరి, పుత్రున్ని ప్రసాదించమని భక్తివిశ్వాసాలతో శ్రీ వేంకటేశ్వరున్ని సేవించగా, కొంతకాలమునకు ఆ వేంకటాధీశుడు 
ఈ దంపతులకు స్వప్నసాక్షాత్కారమిచ్చి - 'భక్తజనదీనబాంధవుడు, పరమ కళ్యాణమూర్తి, అచంద్రార్క కీర్తివంతుడై నిలిచే కుమారరత్నాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను' అని ఆశీర్వదించగా, ఆ దంపతులు అవధులు లేని ఆనందంతో తిరిగి ఇంటికి వచ్చారు. 
                             

శ్రీ వేంకటేశ్వరుని ఆశీర్వచన ఫలంగా, వరప్రసాదిగా 1595 వ సంవత్సరం పాల్గుణశుద్ధ సప్తమి గురువారం నాడు, మృగశిరా నక్షత్రంలో సర్వశుభంకరుడు, లోకక్షేమంకరుడు, భవిష్యద్భక్త జనసంరక్షకుడు, ధర్మమూర్తి, మహాజ్ఞాని, విశ్వవిఖ్యాతుడైన  కుమారుడు వారికి జన్మించెను.   
 
శ్రీ వేంకటేశ్వర అపార కృపాకరుణాపాత్రులైన ఆ దంపతులకు వరప్రసాదిగా జన్మించిన ఆపుత్రుడే -

ఎవరన్నది తదుపరి టపాలో.....