10, అక్టోబర్ 2011, సోమవారం

ఓంకారం

ఓం గం గణపతియే నమః                     ఓం శ్రీరామ శ్రీహనుమతే నమః                    శ్రీ గురుభ్యోనమః 

                                                         
ఓ మిత్యేతదక్షర మిదం సర్వం తస్యోప వ్యాఖ్యానం భూతం 
భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్త్రి కాలాతీతం తదప్యోంకార ఏవ //
                                                              - మాండూక్యోపనిషత్తు 
భావం: ఓంకారం బ్రహ్మస్వరూపం. వాక్కుచేత చెప్పదగిన ఈ చేతనా చేతనాత్మక సమస్త ప్రపంచమును ఆ ఓంకారరూప పరమాత్మ యొక్క సమగ్ర స్వరూపమును విస్ఫష్టముగా తెలియుజేయుచున్నది. భూత భవిష్య వర్తమాన కాలత్రయ పరిచ్చేద్యమగు సమస్త ప్రపంచమును ఓంకారమే. ఈ కాలత్రయమునకతీతమై కాలపరిచ్చేద్యం కానటువంటి ఆ ఆవ్యాకృతాదికము సర్వమును ఓంకారమాత్రముగానే ఉన్నది.


ప్రణ వద్యాస్త్రమో వేదాః ప్రణవే పర్యవస్తితాః
వాజ్మయం ప్రణవం సర్వం తస్మాత్ర్ప్రణవమభ్యసేత్ //
భావం: వేదత్రయమును ప్రణవంనుండియే ఏర్పడినవి. (ఋక్ యజుస్సామములు మూడున్ను జ్ఞానంనకు సంబందించినవి. అధర్వణం ధనుర్విద్యకు, మంత్రశాస్త్రంనకున్ను సంబంధించినదగుటచే పై మూడింటిలో చేర్చబడలేదు) ఈ మూడు వేదములు ప్రణవంనందే లయించుచున్నవి. వాజ్మయమంతయు ప్రణవస్వరూపమే. అందుచే ప్రణవమును ధ్యానించవలయును.

ప్రాణాస్వర్వా పరమాత్మని ప్రణామయతీతి ప్రణవః 
చతుర్దావస్థిత ఇతి సర్వదేవవేదయోని: సర్వవాచ్యవస్తుప్రణవాత్మకం  //
భావం: సకల ప్రాణములను పరమాత్మయందు చేర్పించుటంబట్టి ప్రణవమనబడును. నాలుగుపాదములలో (నాలుగుపాదములనగ నాలుగంతస్తులు. విశ్వతైజసప్రాజ్ఞులను ముగ్గురిని పూర్వపూర్వము లోపింపజేయుటచేత తురీయమగు పరబ్రహ్మను పొందుటయగును) కూడియుండుటవలన బ్రహ్మవిష్ణురుద్రాది సకల దేవతలకును, సకలవేదములకును ఇది కారణస్థానమై ఉన్నది. సకల వాచ్యవస్తువులును, సకల దేవతల నామములను ప్రణవాత్మకమగును.

ప్రణవాదపరం జప్త్వా కదా ముక్తో భవిష్యతి 
ఓంకారస్వర్వ మన్త్రాణా ముత్తమః పరికీర్తితః 
ఓంకారేణ ప్లవేనైన సంసారాబ్దిం తరిష్యతి 
ప్రణవమునకన్యమైన మంత్రమును జపించిన ఎప్పుడు ముక్తి కలుగును? కలుగదు.
ఓంకారం సర్వమంత్రాలలో ఉత్తమమైనదని మహర్షులు కీర్తించుచున్నారు. వేదములు అలాగునే స్తోత్రం చేయుచున్నవి. సముద్రము దాటుటకు ఓడ ఎటువంటిదో అలాగున సంసారసాగరమునుండి తరింపచేయుటములో ఓంకారమనెడు నావకు సమానమైనది మరియొకటి లేదు.


యావజ్జీవం జపేన్మంత్రం ప్రణవం బ్రహ్మణోవపు:
హ్రస్వో దహతి పాపాని దీర్ఘో మోక్షప్రదాయకః 
ప్లుతస్తు సర్వ సిద్ద్యే స్యాత్ప్రణవస్త్రి విధస్సమృత:
పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవ మంత్రమును జీవితపర్యంతం జపించవలెను. 
అది హ్రస్వమనియు, దీర్ఘమనియు, ప్లుతమనియు మూడు విధములుగా ఉచ్చారణములతో కూడుకొనియున్నది. హ్రస్వముచే సమస్త పాపములు భస్మమగును. దీర్ఘము మోక్షదాయకం. ప్లుతముచే సర్వసిద్ధులు సిద్ధించును.

౧. తస్య వాచకః ప్రణవః 
౨. తజ్జప స్తదర్ధ భావనం
౩.తతః ప్రత్యేక్చేత నాధిగమో స్యంతరాయా భావశ్చః 
                                                                         - పతంజలి మహర్షి
ప్రణవమే భగవంతుడి నామధేయం. 
మనలో అంతర్భాగముగా వున్న శబ్దకారణమైన వాయువు నాభి వద్దనుండి అకార రూపముగా బయలుదేరి స్వరపేటికను స్పర్శించి, ఉకారముగా చైతన్యముతో స్వరపేటికనుండి వెలువడి, చివరికి మూయబడిన పెదవుల ద్వారా మకారరూపమున వెలువడుతుంది. అ+ఉ+మ అనగా అకార ఉకార మకార పూర్తిస్వరూపమే 'ఓం'. అదే ఓంకారం.
ఓం అనే శబ్దంతో అంటే నాదంతో స్వరూపముగా వెలువడింది కనుక అది ఓంకార నాదమైంది. ఆ నాదం వినువారలకు ప్రమోదాన్ని కల్గిస్తుంది కనుక అది ప్రణవనాదముగా భాసిల్లింది.
ఈ ఓం స్మరణం ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో కలిగే ఆటంకాలన్నిటినీ తొలగించి ఆత్మచైతన్యానికి తోడ్పడుతుంది. 
ఓంకార ధ్యానంవలన మనస్సు ఏకాగ్రత పొంది అంతర్ దృష్టి కలిగి ఆత్మావలోకానశక్తి క్రమక్రమముగా వృద్ధి పొందనారంభిస్తుంది. 



ఓంకార ప్రభవం సర్వం త్రైలోక్యం సచారాచరం
ఓమిత్యేవ పరం రూపం హృత్పద్మేచ వ్యవస్థితం //
                                                                     -ఉత్తరగీత

చరాచరాత్మకమగు ఈ లోకత్రయం ఓంకారంవలననే పుట్టింది.హృదయ కమలమునందు 'ఓం' అను అక్షరస్వరూపం కలదు.

  • ఇక భగవద్గీత యందు -
"గిరామస్మ్యేక మక్షరమ్"
శబ్దములలో ఏకాక్షరమగు ఓంకారమును నేనే. 
"ప్రణవః సర్వవేదేషు" సర్వ వేదములలో ప్రణవమును నేనే.
"అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మ ముచ్యతే" 
అంత్యకాలంలో ఓంకారమును స్మరించి     దేహమును విడుచువారు బ్రహ్మమును నొందగలడు.

ఏకాక్షరం బ్రహ్మమేకాక్షరం విష్ణు 
వేకాక్షరం శివుడు నెంచిచూడ 
ఏకాక్షరికి మించి యెక్కడేమియులేదు
విశ్వదాభిరామ వినురవేమ!
                                            -వేమన 
"ఓం" అనే అక్షరమే బ్రహ్మ,విష్ణువు, శివుడు. ఈ శబ్దానికి మించి ఎక్కడ ఏమీలేదు. అందువలన ఓంకారశబ్ద ఉపాసన చాలు.

  •  మనస్సు శుద్ధమై ఏకాగ్రమైనప్పుడు విశ్వచైతన్యతరంగశబ్దమైన ఓంకారంవలన ప్రధాననాడి అయిన సుషుమ్న తెరవబడుతుంది.

  • బ్రహ్మతత్వాన్ని సూటిగా అద్భుతముగా వ్యక్తపరచగల ఒకేఒక పదం "ఓం". ఈ విశ్వాంతరాళములోవ్యక్తమయ్యే అన్నిటిలోనికి సూక్ష్మాతిసూక్ష్మమైన బ్రహ్మపదార్ధం, భగవంతునిని తెలియబరిచే ప్రపధమ వ్యక్తీకరణకాబట్టి ఈ "ఓం" భగవంతున్ని సూచించే ప్రతీకయే.

                                                               - స్వామి వివేకానంద 





4 కామెంట్‌లు:

  1. బ్లాగు లోకం లోనికి స్వాగతం భారతి గారు.... ఓం ప్రధమంగా ఓంకారం తో మీ ఆధ్యాత్మిక రచనా ప్రయోగం.... చాలా బాగుందండి .... ముందు ముందు మీ రచనలను సర్వాంగ సుందరంగా మాకు అందిస్తారని ఆశిస్తూ............ I WISH YOU ALL THE BEST.....
    --

    రిప్లయితొలగించండి
  2. శ్రీ భారతిగారికి, నమస్కారములు.

    నా బ్లాగ్ 'మీతో చెప్పాలనుకున్నా' ను మీరు దర్శించుటద్వారా మీ పరిచయం కలిగింది. సంతోషం.
    ఓంకారం పై చక్కని వివరాలను తెలియచేసారు. ధన్యవాదములు.

    'ఓంకారం బ్రహ్మస్వరూపం. వాక్కుచేత చెప్పదగిన ఈ చేతనా చేతనాత్మక సమస్త ప్రపంచమును ఆ ఓంకారరూప పరమాత్మ యొక్క సమగ్ర స్వరూపమును విస్ఫష్టముగా తెలియుజేయుచున్నది' ..... - ఈ వివరణ చాలా క్లుప్తంగా వున్నది. మరికొంత వివరణ ఇవ్వగలరా?

    అలాగే, 'ఓంకారం' చేసేటప్పుడు, 'ఆకారం' ముందుగా వినిపిస్తుందని పైన (శబ్దకారణమైన వాయువు నాభి వద్దనుండి అకార రూపముగా బయలుదేరి స్వరపేటికను స్పర్శించి,....) వ్రాసారు. నిజంగా అలా వినిపిస్తుందా? మీరు స్వయంగా పరీక్షించరా? ఇలా ప్రశ్నించటం కేవలం నిజాన్ని తెలుసుకోవటం కోసం మాత్రమే. అన్యధా భావించవద్దు.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    రిప్లయితొలగించండి
  3. నమస్కారమండి.
    నిర్గుణ పరమాత్మ స్వరూపమును తెలుపునట్టి సమర్ధమైన శబ్దం ఒక్క 'ఓంకారం' మాత్రమే. ఓంకారం యొక్క సర్వవ్యాపకత్వమును, బ్రహ్మస్వరూపత్వమును మాండూక్యోపనిషత్తు నందు చక్కగా నిరూపించబడినది.
    "ఓం" అని చెప్పబడు అక్షరమే ఇది (జడచేతనాత్మకమగు) అంతయూ. జరిగిపోయిన భూతకాలమును, జరుగుతూ వుండే వర్తమానకాలమును, జరగబోయే భవిష్యత్తు కాలమంతయును ఓంకారమే. ఇదియేకాక యింకను త్రికాలాతీతమై యేదైతే కలదో, అదికూడా ఓంకారమే. అంటే సర్వమున్ను ఓంకారమే.
    ఓంకారం పరమాత్మకు శబ్దరూప ప్రతీక. అకార ఉకార మకారములుతో కూడిన ఓంకారం లో అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. అంటే ఈ మూడు అవస్థలూ ఓంకారమే. అలానే ఈ మూడింటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక కూడా ఈ ఓంకారమే.


    ఈ ప్రపంచంలో ఎన్ని భాషలున్ననూ, ఆ భాషకి మూలకారణమైన మాటకి శబ్దమే ప్రధానం. మాటకి కారణమైన శబ్దం స్వరపేటికలోనుంచి బయటపడితే, ఆ స్వరపేటికకి స్పందన కలుగజేసే వాయువు నాభిస్థానం వద్ద నుండి బయలుదేరుతుంది.
    అంటే మనలో అంతర్భాగముగా వున్న వాయువు క్రమపద్ధతిలో స్వరపేటికను స్పర్శించడం వలన, ఆ స్పర్శ తాకిడికి స్వరపేటికలో ప్రకంపన పుట్టి అది శబ్దరూపంలో వెలువడుతుంది.
    శబ్దానికి కారణమైన వాయువు నాభి వద్ద నుండి అకార రూపంగా బయలుదేరి, స్వరపేటిక వద్దకు చేరినప్పుడు తీవ్రరూపం దాల్చి ఉకారముగా చైతన్యముతో స్వరపేటిక నుండి వెలువడి చివరికి మూయబడివున్న పెదాల ద్వారా మ్ అన్నట్లు మకార రూపమున బయటకు వెలువడుతుంది.
    ఓం అని సాధారణంగా పలకడం కాకుండా, ఓ నాదంలా క్రమపద్ధతిలో ఉచ్చారణ చేయాలి. ఓంకారం ఓ నాదం... ఇది ప్రణవనాదం.
    మరిన్ని వివరములకై 'పతంజలి యోగసూత్రములు' అను గ్రంధమును చూడండి.

    రిప్లయితొలగించండి