"దాచుకో - నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి
పూచి నీ కీరితి రూపు పుష్పము లివియయ్యా !
ఒక్క సంకీర్తనే చాలు - ఒద్దికై మము రక్షింపగ
తక్కినవి భండారాన దాచి ఉంచనీ...."
రక్షింపబడడానికి ఒక్క సంకీర్తన చాలు అని అన్నమయ్య అన్నట్లుగా ఈశ్వరీయగుణములలో ఒక్కటి అలవర్చుకున్నా చాలు - తరించడానికి !
ఈశ్వరీయగుణములలో ప్రధానమైంది - "ప్రేమ".
ప్రేమ ఓ అద్భుత భావన.
అది హృదయాంతరములో అనిర్వచనీయమైన స్పందన.
వాస్తవానికి ప్రేమనేది ఒక ఆధ్యాత్మిక భావన.
సాధారణముగా ఈ ప్రపంచమున పరస్పర అవసరములకై ఏర్పడిన బంధములు, తనవారు అనుకున్న మమకారభావములు, వ్యామోహములు, ఇష్టాలు..... వీటినే ప్రేమగా పరిగణించరాదు. స్వ, పర భేదము లేకుండా; ప్రతికూల సంఘటనలయందు, ప్రతికూల మనుష్యులయందు, ఏది ఎలా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, సమస్త సృష్టిని సమదృష్టితో చూడగలిగే తత్వమే ప్రేమతత్వం. సమదృష్టి అను పదమునకు పర్యాయపదమే ప్రేమ. నిజమైన ప్రేమ అపరిమితం, అనంతం. అంతర్యపు లోతుల్లో ప్రేమ ఉదయించి నిరంతరం అంతరమున అంతర్వాహినిలా ప్రవహిస్తుంటుంది.
"ప్రేమ అనేది ఓ స్థితి. ప్రేమ ఒక స్వాతంత్ర్యం. ప్రేమ రెక్కలను ఇస్తుంది. ప్రేమ వినీలకాశాన్ని తెరిచి వుంచుతుంది. ప్రేమ ఆవరణలో బిడాయించేది కాదు. ప్రేమ బందీఖానా అవ్వలేదు. కానీ, అలాంటి ప్రేమస్వభావం జాగృతి (ఎరుక) కలిగివున్నప్పుడు మాత్రమే వస్తుంది. నిరంతరం ఎరుకలో వున్నవారికే ఆనందం అనుభవమౌతుంది. ప్రేమలో, ధ్యానములో, ప్రపంచ అందాలలో, ప్రకృతి పారవశ్యములో జీవితాన్ని ఆనందించండి. ప్రతీ విషయములోను ప్రేమతో మసలండి. లౌకికమైన మామూలు విషయాన్ని ప్రేమతో పవిత్రముగా మార్చండి" అని అంటారు 'ఓషో'.
భగవంతుడు పరిపూర్ణ ప్రేమస్పదుడు. భగవంతుని సృజనలో అద్భుతమైనది ఈ ప్రేమే. నిజమైన ప్రేమయందు ధర్మం, సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం ఇమిడివుంటాయి. ప్రేమ ఆత్మతత్వమునకు సంబంధించినది. ఆత్మను ఎరిగినవాడే నిజమైన ప్రేమికుడు.
ప్రాపంచికముగా ప్రేమగా వ్యవహరింపబడుతున్న ఈ ప్రేమనే పారమార్ధికముగా భక్తీ అని వ్యవహరింతురు. పరమ ప్రేమకే పరమాత్ముడు పలుకుతాడన్నది నిజం. అందుకు ఎన్నో ఉదాహరణలు........
చతుర్దశ భువనభాండాల్ని భరిస్తున్న భగవంతుడు, చిటికెన వ్రేలిపై గోవర్ధనగిరిని ఎత్తిన బలవంతుడు, కాళియమర్ధనం చేయగలిగే శక్తిమంతుడు, రుక్మిణీదేవి ప్రేమకై పరవశించి తులసిదళమంత ఎత్తు తూగాడు. ఆహా - పరమాత్మున్నే పరవశింపజేసిన ఈ ప్రేమ ఎంతటి అద్భుతమైనది !
యశోదమ్మ ప్రేమకి తలవంచి తాళ్లకే వశమయ్యాడు వంశీకృష్ణుడు. ఆ అనంతుడుని ఓ త్రాడుతో బంధించడమా...... ఎవ్వరికైనా ఇది సాధ్యమా? యశోదతల్లి ప్రేమకే అది చెల్లు. ఆహా - అచ్యుతుడునే మురిపంతో బందీ చేసిన ఈ ప్రేమ అనిర్వచనీయం.
కృష్ణుని రూపం తలచుకోగానే చేతిలో వేణువు, తలపై పించం గుర్తుకొస్తాయి. పిల్లనగ్రోవి లేని కృష్ణుడుని ఊహించలేము. కానీ రాధ మధురప్రేమకి పరవశం అయిన కృష్ణుడు, రాధ భౌతికముగా లేదన్న వార్త తెలియగానే మురళినే శాశ్వతముగా విడిచిపెట్టేశాడు. రాధ పరమప్రేమ పరమాత్మున్నే కదిలించింది, కలచివేసింది. ఆహా - ఎంతటి దివ్యమైనది ఈ ప్రేమ !
పండరీనాధుని యాత్ర చూడాలని తపిస్తున్న సక్కుభాయి, తన భర్తా, అత్తల మద్య బంధీకాగా - తన ప్రేమైక తపనకు పొంగిపోయి తనని విడిపించి, సక్కుభాయి రూపధారై పిండివిసిరాడు పండరీనాధుడు. ఆహా - పరాత్పరుడు పలికేది ప్రేమకే.
'వ్యాపక బ్రహ్మ నిరంజన నిర్గుణ బిగత బినోద
సో అజ ప్రేమ భగతి బస కౌసల్యా కేం గోదా'.
(సర్వవ్యాపకుడు, నిరంజనుడు, నిర్గుణుడు, వినోదరహితుడు, అజన్ముడునగు పరబ్రహ్మయే ప్రేమకు వశుడై కౌసల్యాదేవి ఒడిలో ఆడుకొనెను) ఆహా - ఎంతటి మధురమైనది ఈ ప్రేమ !
శబరీ పరమప్రేమకి ముగ్ధుడై మురిపంగా శబరీ ఎంగిలిచేసి ఇచ్చిన పళ్ళనే ప్రీతిగా ఆరగించాడు సర్వేశ్వరుడు శ్రీరామచంద్రుడు. ఆహా - పావనరామున్నే మెప్పించగలిగిన ఈ ప్రేమ ఎంతటి అమోఘమైనది.
నా జీవనోపాది ఈ పడవ మాత్రమే. రాయినే స్త్రీగా మార్చిన నీ పాదం నా పడవని ఎలా మారుస్తుందో .... అందుకే ముందుగా నీ పాదాలను తాకి, కడిగి పరిక్షించాకే, నా పడవనెక్కు అని గుహుడు చమత్కారముతో తన ప్రేమైక కోరికను తీర్చుకోగా, ఆ గుహున్ని ఆలింగనం చేసుకున్నాడు లోకాభిరాముడు - శ్రీరాముడు. ఆహా - సర్వేశ్వరుని ఆలింగనమా..... ఎంతటి ఉన్నతమైనది ఈ ప్రేమ !
అలానే, అన్నమయ్య ప్రేమకి పల్లవించి పల్లకినే మోశాడు, తిరుమలేశుడు - వేంకటేశ్వరుడు.
నిష్కల్మషమైన నిస్వార్ధమైన ప్రేమకై పోతనై వచ్చి పద్యం పూర్తిచేసి పరమానుగ్రహించాడు పావనరాముడు.
ప్రేమలో గొప్పతనం ఇదే - అంతర్యామిని, అంతరంగాన్ని అనంతమైన ఆనందస్థితిలో ఐక్యం చేస్తుంది. అందుకే -
ప్రేమ ఒక యాగం,
ప్రేమ ఒక యోగం,
ప్రేమ ఓ అంతరంగ ప్రవాహం,
ప్రేమ ఓ జీవధార,
ప్రేమ ఓ ఆనంద వాహిని,
ప్రేమ ఓ అమృత వాహిని,
ప్రేమ విశ్వజనీయమైంది,
ప్రేమ ఈశ్వరతత్వం !
మనస్సుకు, బుద్ధికి కూడా అందని పరమపవిత్రమైన అనుభూతే ప్రేమ. ప్రేమ బందించదు, బాధించదు. అది స్వేచ్చాయుతభావం. స్పష్టత, సరళత, సౌమ్యత, స్వచ్ఛత, స్వేఛ్చ దాని స్వభావం. ప్రేమనేది ఓ స్థితి. ఆ స్థితిని అనుభవించాలి. మనస్సు నిర్మలమై, నిశ్చలముగా వుండి దేనినీ ఆశించకుండా, దేనినైన అంగీకరించగలిగే స్థితిలో వున్నప్పుడే ప్రేమస్థితి సంపూర్ణముగా అనుభూతికి వస్తుంది. ఆ స్థితిలో వుండగలిగితే ఏది చూసిన, ఏది ఎలా వున్నా, ఎవరితో వున్నా ప్రేమగానే స్పందిస్తాం, అనుక్షణం ప్రేమను ఆస్వాదిస్తాం, ఆనందముగా జీవిస్తాం.
ఎన్నో భిన్నత్వాలుతో కూడుకున్నది భగవంతుని సృష్టి. అయినా అన్నిటిని ఏకత్వముతో చూడగలిగే ప్రేమత్వమును పొందుపరిచాడు. ఆహా - ఎంతటి చమత్కారుడు.... ఈ సృష్టికర్త !
మనుష్య పశుపక్షాదుల్లో, ప్రకృతిలో, ఒకటని ఏముందీ....... భగవంతుని సృజనలో అంతా ప్రేమమయమే. అవలోకిస్తే ప్రతీదీ ప్రేమమయమే, ప్రేమనిచ్చేవే, అంతా అయినవారే, ఆత్మస్వరూపులే, అన్నీ అర్హనీయమే ప్రేమకు అని అర్ధమైన క్షణములో అన్నింటిని ప్రేమతో సృజించడం అలవడుతుంది. స్థితప్రజ్ఞత సాధకుని స్వభావమౌతుంది.
ప్రేమ ముప్పిరిగొన్నవేళ నామం తలచువారు..... ఎందఱో మహానుభావులు, అందరికి వందనములు........
excellent.......
రిప్లయితొలగించండిప్రేమ అనే అనుభూతిలో మర్యాద -సాధుత్వం - సౌమ్యం - మృదుత్వం - నెమ్మది - ఇతరులను గురించి ఆత్రుత పడక జాగ్రత్తగా ఆలోచించే లక్షణాలు ఉంటాయి. ఎంతో అందముంటుంది. ఈ ప్రేమానుభూతిలో తాను గొప్పదాన్నని అనిపించుకోవాలనే ఆకాంక్ష ఉండదు. ఈర్ష్య, అసూయ ఉండదు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ప్రేమతో, వాత్సల్యంతో కొత్త కొత్త విషయాలను తెలుసుకొంటూ నిత్య నూతనత్వంతో ఉత్సాహంతో మనసును సావధాన పరుస్తాము. మనుషుల్నీ పశుపక్ష్యాదులనీ పైన కనిపించే వినీలాకాశాన్నీ, దూరాన కనిపించే ఆ పర్వతాలనీ, ఆ నదులనీ అన్నిటిని ప్రేమించాలి. ఆ ప్రేమానుభూతిని అనుభవించాలి. ప్రశాంతమైన నెమ్మదించిన మనసు కలిగి ఉండి ...ధ్యానించే మనసే నిజమైన ధార్మికమైన మనసును తెలుసుకోగలుగుతుంది ఆ అనుభవం లేకపోతే జీవితం తావి లేని పుష్పము వంటిది."ప్రేమను ప్రేమించు ప్రేమకై" మక్కువ గల వారి మీద ఆనందంతో ఆ ప్రగాఢతను శ్రద్ధగా వ్యక్త పరుస్తాము. . జీవితంలో మనం చేసే ప్రతిపనీ ప్రేమగానే చేస్తాము.నా గురించి మాత్రమే ఆలోచిస్తే అది స్వార్ధం అవుతుంది. కానీ ప్రతి విషయంలో.. సమిష్టిగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు వారికోసం ప్రేమతో చేస్తాము. ప్రేమ అనే అనుభూతి జీవితంలో ప్రతినిత్యం అనుభవించేది. బంధాలతో, వాత్సల్యాలతో, పలకరింపులలో సున్నితంగా మాటలద్వారా తెలిపేదే ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. అని చెప్పే మాటకన్నా ప్రేమను వ్యక్తపరచడంలో మనసులోంచి వచ్చే ఆర్ధ్రమైన భావాలు మాటలకందని అక్షరాలలో చెప్పలేని మౌన ఆరాధన నేత్రాలలో ,హృదయములో గోచరమవుతూ ఉంటుంది. ఆ అనుభూతి అద్వితీయమైనది. అందుకే భారతీ ప్రేమ మీద నీవు అంత అద్భుతంగా వివరించినా నా ద్వారా ఇంత చిన్న విషయం రాసాను. వ్యాక్యగా పెడతాను అని నీతో హాస్యంగా అన్నా ఇలా రాయాలనిపించిందిరా!
రిప్లయితొలగించండి