ఆసనము
బాహ్యర్ధం :- "స్థిర
సుఖమాసనమ్" స్థిరముగాను, సుఖముగాను అనువైన ఆసనం సాధకునికి వుండవలెను. ఏవిధమైన
మానసికప్రయాస, శారీరక అసౌకర్యం లేని స్థిరఆసనం సాధకుని ధ్యానసాధనకి ఉపకరిస్తుంది.
మేరుపర్వతం లాగా స్థిరముగా నిటారుగా ఛాతీ, మెడ, శిరస్సు ఒకే వరుసలో వుండాలి. మనస్సు
చెదిరిపోకుండా నిగ్రహించడానికి ఆసనం మీద కూర్చునే విధానం నిర్ణయించుకోవాలి.
ఆసనాల్లో రకాలున్నాయి - పద్మాసనం, అర్ధపద్మాసనం, వజ్రాసనం, సుఖాసనం.....మొదలగునవి.
భూమ్యాకర్షణ శక్తినుంచి దేహాన్ని, మనస్సుని, ఇంద్రియాలను కాపాడాలి కాబట్టి ఆసనం
కోసం మెత్తటైన వస్త్రాన్నో, పీటనో వినియోగించుకోవాలి. ధ్యానం మనస్సుకు
సంబంధించినదైనప్పటికి ధ్యానసమయంలో శరీరబాధ కలిగి, ఆ బాధచే మనస్సు చెదిరిపోకుండ
నిగ్రహించడానికి ఆసనం తప్పనిసరి.
అంతరార్ధం :- శరీరకష్టం,
మానసిక చలనాదులు లేకుండ బ్రహ్మనిష్టయందు కుదురుకోవడమే ఆసనం.
ప్రాణాయామం
బాహ్యార్ధం :- ఉచ్చ్వాస,
నిశ్వాసల క్రమబద్ధీకరణయే ప్రాణాయామం. ప్రాణాయామం అనేది మనిషి యొక్క మానసిక స్థాయిని
సాదారణ స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళే ప్రక్రియ. మనస్సును
నియంత్రించడానికి మన ఋషులు,మహర్షులు సూచించిన విధానమిది. సుఖాసన స్థిరత్వం కలిగిన
తరువాత ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే శ్వాసక్రియను మన అధినంలోకి సరళంగా
తెచ్చుకోవడం. శ్వాసక్రియను క్రమబద్ధికరించి నియమించటంలో ప్రాణాయామం
దోహదపడుతుంది. శ్వాసప్రక్రియ, మనో చర్యలకు సంబంధం ఉన్నది. క్రమబద్ధకమైన శ్వాస మనస్సుని ప్రశాంతపరుస్తుంది. మనవ జీవితం శ్వాసతో మొదలై శ్వాసతోనే
అంతమౌతుంది .శ్వాసను ప్రాణాయామం ద్వారా క్రమబద్ధీకరిస్తే మనోప్రశాంతత, దీర్గాయువు
కలుగుతాయి. ఇంద్రియములు మనస్సు శుద్దమౌతాయి. ప్రాణాయామం వల్ల చిత్తవృత్తులు క్లేశాలు
నశించి జ్ఞానము ప్రకాశిస్తుంది. మానసిక నిరోధం ద్వారా అంటే మనస్సుని అన్య
విషయాలనుంచి నిరోధించి ఏకాగ్రం చేయడం ద్వారా ప్రాణాయామం సహజంగా
సిద్ధిస్తుంది. ప్రాణాయామం లోని రేచక, పూరక, కుంభకము అనే దశలు ఉంటాయి. దీని వలన నాడులు ఉత్తేజమై శరీరమునకు, మనస్సునకు సమన్వయము ఏర్పడుతుంది.
అంతరార్ధం :-తనకంటే
అన్యముగా కానవచ్చు నామరూపలన్నింటిని ఆత్మ కాదని విడుచుట (నిశ్వాసం) 'రేచకం'. సర్వ
పదార్ధములయందు ఆత్మను చూచుట, సర్వ ప్రపంచమునందు ఆత్మనే నింపుట (ఉశ్చ్వాస) 'పూరకం'.
అంటే మనస్సునందే పరమేశ్వరుడే సర్వవ్యాపకుడు అని తలంచుచు ఏయే సంకల్పములు కలిగినను,
ఏయే వస్తువులు గోచారమైనను వాని నంతయు ఆత్మగానే చూచుట పూరకం. మనస్సు నిశ్చలం చేసి
సర్వకాలములందును పరబ్రహ్మమునందే నిలుపుట 'కుంభకం'.
ప్రత్యాహారం
బాహ్యార్ధం :-
విషయసుఖంలందు సంచరించుచుండు చక్షురాది ఇంద్రియములను నిరోదించుటయే
ప్రత్యహారం. మనస్సు, ఇంద్రియములు తమ సహజ ఆహారాలైన చిత్తక్లేశములను వదిలించుకోడానికి
చేసే యోగాభ్యాసమే ప్రత్యాహారం. అంటే ఇంద్రియ అవయవాలను మనస్సు సహాయంతో
ఇంద్రియపదార్దముల నుండి వెనుకకు లాగి మరల్చటయే "ప్రత్యాహారం". మనస్సు అసత్యమైన
వాటివైపుకే వెళ్తుందని తెలుసుకోగానే విచక్షణ జ్ఞానాన్ని ప్రయోగించి మనస్సును
స్వాదీన పరుచుకోవాలి.
అంతరార్ధం :- సృష్టిలోని
సమస్త వస్తు సముదాయములోవున్న ఆత్మయే తనలోవున్న ఆత్మన్న ఆత్మభావనతో మనస్సుని ఆ
పరమపురుషునిలో లీనం చెయ్యడమే ప్రత్యాహారం.
ధారణ
బాహ్యార్ధం :- చిత్తాన్ని
సంపూర్ణముగా ఆత్మలో లీనం చేయడాన్నే ధారణ అంటారు. పవిత్రాంతరంగం కలవారై సంపూర్ణమైన
సాక్షాత్ ఆత్మయందు ఆత్మను స్థిరంగా వుంచడమే ధారణ.
వస్తువుపై మనస్సును స్థిరముగా ఉంచటమే ధారణ. ఆ వస్తువు హృదయంలో
ఊహించినదైన కావచ్చు, బాహ్యముగా భగవంతున్ని ప్రతిమైన కావచ్చు. చంచలమైన మనస్సుని
సడలని దీక్షతో చేసే క్రమసాధనచేత, పట్టుదలచేత, దృఢభక్తి అలవర్చుకోవడంచేత నియంత్రించి
ఏకాగ్రం చేయడమే ధారణ.
ధారణ అంటే మనం దేనిగురించి యోగాభ్యాసం ఆరంభించుచున్నామో దాని
మీదే మనస్సు నిలపడం.
అంతరార్ధం :- అచంచల
భక్తితో బ్రహ్మనిష్ఠయందే స్థిరముగా నెలకొని నిరంతర ఆత్మానుసంధానం చేయగలగడమే
ధారణ.
ధ్యానం
బాహ్యార్ధం :- ఏకాగ్రం
చేసిన వస్తువుపై అవిచ్ఛన్న ధారగా చేసే చైతన్య భావనా ప్రవాహమే ధ్యానం. అంటే
ధారణాస్థితిని నిరంతర ప్రవాహరూపముగా కొనసాగించడమే ధ్యానం. ధ్యానం మానవుణ్ణి ఓ
పరిపూర్ణవ్యక్తిగా మారుస్తుంది. శారీరకంగా ఆరోగ్యం, మానసికముగా ప్రశాంతత,
భావసమతుల్యతలతో పాటు ఆధ్యాత్మిక పరిణితిని కలిగిస్తుంది. ధ్యానం అంటే చిట్టచివరి ఆలోచన.(జిడ్డు కృష్ణమూర్తి). మనలో నిక్షిప్తమైన ఆద్యాత్మిక జ్ఞానాన్ని వెలికితీసేదే ధ్యానం.
ధ్యానం గమ్యం కాదు, గమ్యాన్ని తెలిపే మార్గం.
జిల్లెలమూడి అమ్మ అన్నట్లు... ధ్యాసే ధ్యానం.
ధ్యానమంటే మనస్సుని శుద్ధిచేయడం.
మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ధ్యానం,
జ్ఞానం.(రమణ మహర్షి)
ధ్యానం వలన నిత్యానిత్య వస్తువివేచన కల్గుతుంది.
ధ్యానం వలన మనోనిగ్రహం కలిగి రాగద్వేషములను నిగ్రహించగలం.
తధా మనస్సత్వ రాజస్తమోమలం, ధ్యానేన సంత్యజ్య సమేతి తత్త్వం... (మనస్సు
ధ్యానం మూలంన సత్వ రజ తమోగుణముల రూపమున ఉన్న మాలిన్యమును బాసి ఆత్మతత్వంను
పొందును)
చేదు ఆలోచనల నిర్మూలన, మనోపవిత్రత, రజోతమోగుణాలునుండి విముక్తత, శుద్ధ
స్వభావం, మనోస్థేర్యం, ఏకాగ్రత, సమర్ధత ధ్యానం వలన కల్గును.
ధ్యానం మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది.(వివేకానంద)
గౌతముడిని బోధిచెట్టు క్రింద బుద్దున్ని చేసినదీ, వర్ధమాన మహావీరున్ని
జ్ఞానిని చేసిందీ...ధ్యానమే!
ఆలోచలు మాయమయ్యేంతవరకు, చివరకు పూర్తిగా మనస్సు హృదయంలో
లీనం అయ్యేంతవరకు, చిన్న ఆటంకమైన కలగనివ్వకుండా లోలోపలికి అంతరయానం చేయడమే ధ్యానమని
ఏకనాద్ ఈశ్వరన్ అంటారు.
అంతరార్ధం :- మనస్సు, దేహం, ఇంద్రియములు
మొదలగు దృశ్యపదార్ధములు భూతములు కావు, వీటన్నిటికి సాక్షిని అని సర్వకాలములందును
తలంచుచుండుటయే ధ్యానం.
సమాధి
బాహ్యార్ధం :- ధ్యానం తీవ్రమై
ధ్యానివస్తువు, ధ్యాని, దృష్టిపధంలోనుంచి అదృశ్యమై, దాని అంతరార్ధం మాత్రమే
గోచరించునప్పుడు యేర్పడుస్థితియే సమాధి.
పై
సాధనములవలన నిశ్చలమైన నిర్మలమైన భగవద్భావనతో మేళవించ బడిన మనస్సు బ్రహ్మమునందైక్యమై
తానే బ్రహ్మమనెడి జ్ఞానంతో స్థిరముగా నిలిచిపోవుటనే సమాధిస్థితి
అందురు.
అంతరార్ధం :- బాహ్య, అంతరస్మృతి వుండని
చైతన్య పరమానంద స్థితియే సమాధి. 'అహం బ్రహ్మస్మి'.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి