తనువు తనది కాదని తెల్సుకున్నవాడికి జపమేలా, తపమేలా....."
కానీ-
ఉదయం బిక్షాటనకు వచ్చిన ఓ కొమ్మదాసరి ఈ పాట పాడాడు.... బహుశా త్యాగరాజు కృతి అనుకుంటా. ఈ పాట విన్నప్పుడు మదిలో ఏదో భావన..... ఇంతలోనే ప్రక్కింటినుండి జేసుదాసు గారి పాట......
"గాలివానలో వాననీటిలో పడవప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం......."
ఈ పాట వింటుంటే మనసంతా వికలం...... ఈ రెండు పాటలు ఒకేరోజు వినడం యాదృచ్చికమైన, ఎందుకో నాలో ఏదో అలజడి. ఈ పాటల్లో సత్యముందని తెలుసు, కానీ.......... ఊహు...చెప్పలేని అంతర్యుద్ధం.
నాలో ఆధ్యాత్మిక తపన వుంది. కానీ, పూర్తిగా వైరాగ్యం ఇంకా రాలేదు. అటు అడుగులు వేస్తున్నా విరాగినిని కాలేదింకా. పారమార్ధిక విషయాలకు ఎంత ప్రాముఖ్యతనిస్తానో, ప్రాపంచికతకు, మానసిక ఆనందంకు అంతే ప్రాముఖ్యతనిస్తూ పయనిస్తున్నాను. ఇదిగో ఇక్కడే సంఘర్షణ మొదలైంది...... ఇలా ఐతే ముందుకు సాగడం అసాధ్యమని అర్ధమైనదగ్గరనుండి అంతర్యుద్ధం.......
ప్రాపంచిక ప్రపంచంలో అనేక ఆకర్షణలుంటాయి. మనస్సు కోరుతుందని, ఇందులో మానసిక ఆనందం వుందని పరుగులు పెడ్తే ఎలా? మనస్సువైపు కాదు, మాధవునివైపు సాగిపొమ్మని అంతరంగంలో హోరు....
అటా.......ఇటా.......... రెండింటిని సమన్వయపరుస్తూ ఎలా సాగను? ఎంతో గుంజాటన........
ఈ మద్య రోజుకు రెండు,మూడు గంటలు నెట్ కు అటుక్కుపోతున్నా...... ఈ ఆధునిక అభిరుచుల అల్లికలో కాలాన్ని వృధాగా చేజార్చుకుంటున్నానేమోనన్న ఆవే దన.
ప్రాపంచికత, ఆధ్యాత్మికత సమతూకం అంటే సరిగ్గా సమన్వయపరుచుకుంటూ జీవన పయనం సాగించడం దుర్లభం కాకపోవచ్చు గానీ కొంత కష్టతరమే.
భార్య మాటలతో కనువిప్పై భార్యను వదిలి పరమాత్మునికై పరితపించిన తర్వాతే తులసీదాసు యోగి అయ్యాడు. సిద్ధార్ధుడు భార్యాపుత్రులను, తల్లితండ్రులను, రాజ్యాన్ని పరిత్యజించి పరిశ్రమించి పరిశుద్దుడైనాడు. ప్రాపంచిక బంధాలకు బద్ధుడవ్వక బుద్దుడైనాడు. వెంకటరమణ తల్లిని, తోబుట్టువులను, బంధువులను వదిలి అరుణాచలం వెళ్లి యోగాపరుడై రమణమహర్షిలా భాసిల్లడు.
అలాగని బంధాల్ని వదిలి వెళ్ళితే పరమాత్ముడు తెలియబడతాడా????? ఊహు..........
విషయ వస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే. సత్కార్యాచరణుడై పంచేంద్రియ నిగ్రహంగల వ్యక్తికి గృహజీవనమే తపస్సుగా వుంటుంది. సంసారములో వుంటూనే దేనిని అంటుకోకుండా, పరిత్యాగబుద్ధి (పరిత్యాగమంటే నాది అనే భావాన్ని,దానిపట్ల అనురక్తిని త్యజించడం)ని అలవర్చుకున్న వ్యక్తి తపస్వే. తపమెరిగినవాడు పతన మెరుగడు. ఆంతర్యములో చోటుచేసుకున్న బలహీనతలను పారద్రోలునదియే తపస్సు. బాహ్యప్రేరణలకు లొంగక ఆంతర్య సౌందర్యమును వీక్షించించుటకు చేయు ప్రయత్నమే తపస్సు. నియమబద్దక సాధనాలు అనుష్టించి మనస్సు నియంత్రిచుకున్న వ్యక్తికి గృహమైనా, అరణ్యమైనా ఒక్కటే. ఎక్కడున్నా ఏంచేస్తున్నా అతడు నిత్యముక్తుడే, ఆనంద పరిపూర్ణుడే . అటువంటి ముక్తసంగునికి గృహమే తపోవనమని హితోపదేశం వుంది. అటువంటివారే సమన్వయ జీవితాన్ని గడపగలరు.
కానీ-
చొక్కా గుండీలు ఊడిపోయాయి, బట్టలు సర్దుతున్నప్పుడే చూసుకోవచ్చు కదా,బయటికి వెళ్ళడానికి సిద్ధమౌతూశ్రీవారి చిందులు. ఏంటమ్మా, ఎప్పుడూ ఇడ్లీ, దోశలు, ఉప్మా తప్ప నూడిల్స్ లాంటివి చేయవచ్చుకదా, టిఫిన్ ముందు అమ్మాయి అలక. నేను రాత్రి చెప్పాను కదమ్మా, నా టి షర్టు ఇస్త్రి చేసి వుంచమని... ఎన్ని బట్టలున్న వాడి చెప్పింది రెడీ చేయలేదని అబ్బాయి అరుపులు. ఇది ఇలా చేశావేమిటి, అది అలా చేశావేమిటీ......అత్తగారి పెద్దరికపు అదిలింపులు. ఏం చేస్తునారు వదినగారు...... ఇరుగు పొరుగు పలకరింపులు............ స్నేహితులకి సమయం కేటాయించలేనంత బిజీయా...... మిత్రుల మాటలతూటాలు..... ఈ ప్రాపంచిక అనుబంధాల్లో ఏ ఒక్కరికి సమయానికి ఏం చేయకున్నా అడుగుతారు, అరుస్తారు, అలుగుతారు...... సో..... వీరందర్నీ ఆనందపరచడానికి ఉరుకులు,పరుగులు తప్పవు. పారమార్ధికము కంటే ప్రాపంచికము వైపే ఎక్కువ తూగుతున్న. తూగాలి, తప్పదు. ఈ నేపద్యములో పరమాత్మున్ని పలకరించేది, పలవరించేది ఎలా కుదురుతుంది? భగవంతుని విషయంలో ఓ వెసలబాటు...... పలకరించకపోయిన ఏమీ అనడు. పైగా నారాయణుడు నారదుని గర్వభంగం చేసే కధ... (నిండు నూనెగిన్నెనిచ్చి తొణకకుండా గుడి చుట్టూ తిరిగి రమ్మంటే, దాని మీద ధ్యాసతో నారాయణుని తలవడు. అదే ఓ కర్షకుడు లేస్తూనే ఓసారి, పొలములో పనికి దిగుతూ ఓసారీ, భోజనముకు ముందోసారి, రాత్రి పడుకునే ముందోసారి తలవడం చూపించి నీకంటే ఉత్తమ భక్తుడని చెప్పే కధ)... గుర్తు చేసుకొని ఆ కర్షకుని కరుణించిన నారాయణుడు ఇన్ని పనుల మద్య పరుగులు తీస్తున్న నన్ను కూడా కనికరించి కరుణించడా........ మనస్సు ఇలా సర్దిచెప్పేస్తుంది, సమర్ధించేస్తుంది...... ఇదో మనో మాయ.
ఇక బంధంలో వుంటూ బంధాలు అంటుకోకుండా వుండగల్గితే...........
నిజమే, జీవితం ధన్యమౌతుంది. కానీ ఎప్పుడో త్రేతాయుగం నాడు జనకునికి ఇది సాధ్యమైంది. సంసారములోనే ఉండి తరించిన కర్మ యోగి ఆయన. ఇక రామదాసు లాంటి వారికి తగును. సేవ, స్వాధ్యాయం(శాస్త్ర పఠనం) సాధన, సత్యం, సంయనం (నిగ్రహం) ఈ ఇదు "స"కారాలు సంసిద్ధిని అత్యుత్క్రుష్ట సాధనాలు. వాటిని సదా పూనికతో శక్తిసామర్ధ్యాలమేరకు అలవర్చుకొని చాలామంది ఆచరించి తరించారు. కానీ,
అంతటి శక్తి నాకెలా సాధ్యమౌతుంది? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గంకు ఎగిరినట్లు వుంటుంది. ప్రాపంచికమును, పారమార్దికమును సమన్వయపరుచుకోలేని నేను ఏదీ అంటకుండా ఎలా వుండగలను? భర్తాపిల్లలకు చిరు అనారోగ్యం కల్గిన ఆందోళన పడతాను. ఆత్మీయులకు ఏ బాధ కల్గిన తల్లడిల్లుతాను. భర్త ఉన్నతిని, పిల్లల, స్నేహితుల అభివృద్ధిని చూసి ఆనందముతో మరింత ఆకాంక్షిస్తాను. వారి వారి కష్ట సుఖాల్లో తాదాప్యం చెందుతాను. అటువంటి నేను బంధాలను అంటుకోకుండా వుండగలనా? వస్తు, వ్యక్తుల బ్రాంతిలో తగులుకొనిన నేను వాటిని వదలకనే వస్తురహిత చైతన్యస్థితి కలుగవలెనని అభిలషించడం అత్యాశే. ఆశుద్ధమైన మనసు ఆత్మసాక్షాత్కారం చేసుకోగలదా? మనస్సులో ఎటాచ్మెంట్స్ పెట్టుకోకుండా, దేనితో తాదాప్యం చెందకుండా, ప్రతీది ఈశ్వర పనే, అనే భావముతో వుండి, ఆచరించు కర్మలన్నీ భగవానుడు వొసగిన పవిత్ర ధర్మములుగా భావించి ఆచరిస్తే ఆ కర్మలు నైష్కర్మములు అయి అంటుకోవు. కానీ అది నాకింకా అలవడలేదు.
గమ్యం తెలియకపోయినా పారమార్ధిక పయనంలో సాధనాగమనం సరిగ్గా వుంటే చాలు, స్మరణం వీడని మననం తోడుంటే చాలు.... జ్ఞాన జననం జరిగినట్లే, అంధకారం అదృశ్యమైనట్లే, విజ్ఞాన తీరాలు సమీపించినట్లే అని అన్నారు శ్రీ సుందర చైతన్యనందులు.
ఒకటి మాత్రం నిజం -
గమ్యంచేరేటంతటి సాధన చేయలేకపోయినను ఈ ఆధ్యాత్మిక చింతన అలవడిన దగ్గరనుండి మంచిచెడుల వివేకంతో నా గమనం ప్రశాంతముగా సాఫీగా సాగిపోతుంది. కానీ ఇది చాలదు. ప్చ్.....
ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవసాగర మీదను నళినదళేక్షణ రామా.......
తపిస్తున్నారు కదమ్మా తరుణోపాయం కూడా ఆయనేచూపుతాడు
రిప్లయితొలగించండిజైశ్రీరాం
చాలా బాగా చెప్పారు. నేను అనుభవిస్తున్న స్థితిని ప్రతిబింబిస్తున్నట్లుగా ఉంది మీ టపా.
రిప్లయితొలగించండిఈ టపా రాయడం ద్వారా మీకు కూడా కొంత స్పష్టత వచ్చి ఉంటుంది. పెద్దల(ఆధ్యాత్మికపరంగా)తోగానీ, మీలాగా ఫీలవుతున్నవారితోగానీ చర్చించడంవల్ల ఇంకా స్పష్టత వస్తుంది. వస్తుందని ఆశించండి.
రిప్లయితొలగించండిశుభాభినందనలు.
@తేజస్విగారు, మీరు చెప్పింది నిజం. మీకు నా ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చిలమకూరు విజయమోహన్ గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలండి.
@ దుర్గేశ్వర గారు,
నా నమ్మకం కూడా అదేనండి. ధన్యవాదాలండి.
డియర్ భారతి గారు ,, ఏమీ తెలియని వారికి ఎ గోలా వుండదు . అన్నీ తెలిసిన వారికీ ఎ పరుగులూ వుండవు . అటు, ఇటు కాని వారికి అన్నీ ఆదుర్ధాలే అని అంటారు .మొన్న ఒకసారి శ్రీ బిక్షుమయ్య గారు ఒక మాట పడే పడే వాడారు తన ప్రసంగంలో .."మానవులందరూ మేధావులు"... అని .. ఆ మాట ఆయన ఎ అర్ధంతో అన్నారో కొంచెం ఆలోచిస్తే అర్ధమవుతుంది ....ఎన్నో జన్మల పుణ్య ఫలం మానవ జన్మ .. ఐతే ఈ జన్మకి ఏదో పరమార్ధం లేకుండా వుండదు కదా ..మనం పునర్జన్మలను నమ్మితే , పూర్వ జన్మల కర్మాకర్మలను ఒకసారి మననం చేసుకోవాలి .. ఎ బంధమూ లేకుండా నలుగురు ఒక చోట చేరారు .. బహుశా అది పూర్వ జన్మ బంధం కావచ్చు ...బాబా చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి ...రుణాను బంధం లేనిది ఎ జీవి దరికి చేరారు అని.. ఈ నలుగురు ఒకచోట చేరినదే కుటుంబం అనుకోండి .. మరి మన ఋణం తీర్చుకోవాలి కదా .. దానినుండి ఎలా తప్పించుకోగాలము ? అందువల్ల కుటుంబంలోనే వుంటూ , కుటుంబం తోనే వుంటూ భగవన్నామ స్మరణ చేయడం ఉత్తమం .. పలితం భగవంతునికి వదిలెయ్యడమే ..ఇక సంగర్షణ విషయం ..ఇది సహజం . ఎందుకంటే ... మనకు అప్పగించ బడిన భాద్యతల నుండి మనం మన మనస్సుని ప్రక్కకు మరల్చాలని , మన మనస్సుని కేవలం భగవంతుని మీద కేంద్రీకరించాలని మనం కష్టపడుతూ చేసే ప్రయత్నం వల్ల ఆ రెండింటి మధ్య ఘర్షణ తప్పదు .. ఇక ఆధ్యాత్మిక రంగంలో అడుగు పెట్టడం అన్నది ఒక యోగం ..ఆ యోగాన్ని ఒక క్రమ పద్దతిలో నిచ్చెన మెట్లు ఎక్కినట్లు ఎక్కడానికి ప్రయత్నించాలి గాని, ఒక్కసారే పై అంచు మీదకు చేరాలని గెంతితే క్రింద పడతాము ..సో , ఒక లక్ష్యం ఏర్పరుచుకుని ఆ దిశగా నిదానంగా అడుగులు వేస్తె, ఈ జన్మ కాకపోవచ్చు , మరో జన్మ పట్టవచ్చు ..అదే మోక్ష సాధన .. దానికి మించిన సాధన ఏమిటి చెప్పండి .. ... మనకు ఆనందం దొరకాలన్నా , ప్రాపంచిక విషయ అనుభవ సారంతో ఆనందించాలన్నా అన్నీ మన చేతుల్లోనే వుంటాయి ..ఒక గులాబి పువ్వు మనకు కావాలంటే , ముందు దాని కాడకు వుండే ముళ్ళు మనకు తగలకుండా వుండవు .. జీవితం కూడా ఆంటే .. మౌన ముని , ఆది శంకరులు, సాయి బాబా, వీళ్ళందరూ కారణ జన్ములు...అది వారి కర్మ ఫలం ..తపించండి ..తప్పక దొరుకుతుంది మీ లక్ష్యం ఏమిటో ముందు నిర్ధారించుకోండి ..
రిప్లయితొలగించండిచివరగా ... మీ బ్లాగులో నేను ఇంతగా వ్రాసినందుకు అన్యదా భావించవద్దు అని, mannimpamani కోరుతూ ....
విజయమోహన్ గారు , భగవంతుడు మీకు అద్భుతమైన కళా జీవితాన్ని ఇచ్చాడు .. మెకెం కావాలో నిర్ణయించుకోండి ముందు దద్వారా మీ లక్ష్యాన్ని చేరుకో గలరు ...చూడండి .. మన పిల్లలు యుక్త వయస్సుకు చేరిన దగ్గర నుండి ఒకటే తపన వుంటుంది .. వారికి పెళ్లి చేసి , వారి జీవితాన్ని సెటిల్ చెయ్యాలని .. ఆధ్యాత్మిక రంగం కూడా ఆంటే ..లక్ష్య సాధన లేనిది ఆ ప్రయాణం నిరుపయోగం ..అయినా మీరు ఆ కృష్ణ పరమాత్ముని పట్టుకున్నారు..తప్పక విజయం సాధిస్తారు ... ..యోగులు , విజ్ఞులు కోరుకునేది ఒక్కటే .. మోక్ష సాధన ..
రిప్లయితొలగించండిరుక్మిణిజీ,
రిప్లయితొలగించండిమీరు చెప్పింది యదార్ధం.
జీవితప్రదమాంకంలో ఆటలు,పాటలు,కాస్త చదువు...అంతే! భయంవేసినప్పుడు దేవుడిని తలుచుకోమని అమ్మ చెప్పడం, అలా చేయడం... పరీక్షలప్పుడు నేను చదివినవే రావాలని, బాగావ్రాసేటట్లు చేయమని, హుండిలో 3రూపాయలు వేస్తానని మ్రొక్కుకోవడం... అంతకుమించి ఏమీతెలియదు.ద్వితియాంకంలో వైవాహికజీవితంలో ఒడిదుడుకులప్పుడు కష్టాలు గట్టెక్కించమని పూజలూ,వ్రతాలు... ఇంతే నా భక్తి! తృతియఅంకంలో షోడాపచారపూజలు, వ్రతాలు,ఉపవాసాలూ భక్తి కాదని,సాధన చేయాలని అన్పించింది. ఎలా నాటుకుందో తెలియదుకానీ, నిరంతర రామనామస్మరణ,ఆధ్యాత్మిక పయనం చేయాలన్న అభిలాష, ఏదోతెలుసుకోవాలన్న తపన. ఆధ్యాత్మికపుస్తక పఠనం ప్రారంభించాను.
సంసారాన్ని త్యజించే బుద్దున్ని కాలేను, సంసార బద్ధురాల్నే. ఈ బంధాలను భగవంతుడు ఇచ్చేవేనన్న భావన. ఆ బంధాలను గౌరవిస్తూ బుద్ధిగా సంసారంలోనే ఉంటూ ఆధ్యాత్మికతవైపు వెళ్లాలన్నదే నా అభిమతం. కానీ ఈప్రాపంచిక, పారమార్ధిక పయనంను సమన్వయపరచలేని నాలో తీవ్రఅలసట. "ఒక చేతితో నీ విధి నిర్వర్తించు, రెండవ చేతితో భగవంతున్ని సేవించు" అన్న రామకృష్ణపరమహంస అన్నట్లు నా పయనంకు నాంది పలికినను అందులోనూ అసంపూర్ణతే కన్పించింది.
సన్యసిస్తేనే సాధన చేయగలమని ఏ శాస్త్రం చెప్పలేదు, విరక్తితో భాద్యతలనుండి తప్పుకోమని ఎవ్వరూ ప్రభోదించలేదు, మమకారం పెంచుకోవడం తప్పుకాదు, సౌకర్యవంతంగా జీవించాలనుకోవడం తప్పుకాదు. కానీ ఏదో ఒకనాటికి ఇవన్ని దూరం అవుతాయి. ఇవేవి శాశ్వతం కావని గ్రహించి అన్నింటా సాక్షిభావంతో ఉంటూ, మంచిచెడుకర్మల పలితం ఈ జన్మని అర్ధంచేసుకొని ఈ శరీరధారణ చేసినందులకు ఏంచేయాలో అవి నిర్వర్తిస్తూ, ప్రారబ్ధంవలన వచ్చిన ఈ ఇహలోక బంధాలను గౌరవిస్తూ నీ భాధ్యతలను నిర్వర్తిస్తూ,అంతరంగమున సన్యాసవ్రతం స్వీకరించమని ఓ పుస్తకంలో చదివి అది ఆచరణలోనికి కొంతవరకే తేగలిగాను.
ప్రాపంచికతలో వున్నా, సాధన తీవ్రతరం చేయమని అంతరంగపు పిలుపు. దృశ్యగోచారం కానీ బుద్ధికీ, మనస్సుకీ పెద్ద పోరాటం...రెండూ రెండు వ్యతిరేకదిశాలుగా మార్గాలు చూపించాయి. విరుద్ధభావాల నడుమ సంఘర్షణ. అప్పుడు స్వపరిశీలన ప్రారంభించాను... ఏముందీ...లోలోపల అంతా చెత్తాచెదారం...వాటినుండి విడివడే ప్రయత్నం...
ఆధ్యాత్మికవైపే మనస్సుని త్రిప్పాను. ముక్తి,మోక్షంలాంటివి నా మేధస్సుకు అందేవికావు, వాటిపై నాకు అవగాహన లేదు. కానీ అందరూ(తత్వవేత్తలు) చెప్పే ఆత్మను చూడాలని ఓ కోరిక... అందుకు నేను ఏం సాధన చేయాలీ... ఎవర్ని అడగాలీ... ఎన్నో ప్రశ్నలు... జవాబు దొరికేది ఎప్పుడో...
మీ భావాలను ఇలా పంచుకున్నందుకు ఆనందంగా వుంది. మీకు నా ధన్యవాదాలు.
మన్నింపులనే పదాలు వద్దండి.
భగవాన్ రమణ మహర్షుల సాహిత్యం చదవండి. ఒక సారితప్పకుండా (ఇంతవరకూ వెళ్ళకపోతే మొదటిసారీ, ఒకసారి వెళ్ళి ఉంటే మరోసారీ) తిరువణ్ణామలై వెళ్ళి భగవాన్ శ్రీ రమణాశ్రమంలో గడిపి రండి. ధ్యానాలూ జపాలూ ఏవీ అక్కరలేదు. ఆయన ముందు కూచుంటే చాలు. ఆయనే అంతా చూసుకుంటారు, మీకు తెలియకుండానే చేయవలసిందనతా చేస్తారు.
తొలగించండిఅరుణాచలం వెళ్ళే వీలు లేకపోతే చిన్నదో పెద్దదో భగవాన్ చిత్రం తెచ్చుకోండి. మీరు ఆయనను (చిత్రంలో) చూడక్కరలేదు. ఆయన మిమ్మల్ని చూసే స్థలంలో ఉంచుకోండి. ఇదో మహా యోగం. ఇదే మహా యోగం. చేసి చూడండి :)
ముందుగా మీకు ధన్యవాదాలు.
తొలగించండిమీరు చెప్పింది యదార్ధమని నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. భగవాన్ రమణ మహర్షే నా అంతర గురువై ఆధ్యాత్మిక మార్గంలో నను నడిపిస్తున్నారు.
అదేమిటో నండీ,
రిప్లయితొలగించండిఇక్కడే వున్న వాణ్ణి వేరే ఎక్కడో వేడుకుతాము! వున్నవాడు అసలు వుంటే మనలో నే వున్నాడు. వాణ్ణి మనలో గాంచ లేక పోతే వేరే ఎక్కడా మనకు కానరాడనుకుంటాను.
ఇక ప్రాపంచిక పారమార్థ విషయాలంటారా, నాశిక కి రెండు ద్వారాలు. రెండూ అవసరమే ! లేకుంటే హతోస్మి! సో, ఆలోచించి చూడండి, మనం తీసే శ్వాశ మనం ఆలోచించి తీస్తామా! ఆ ప్రాణస్య ప్రాణుని మీరు ఈ జన్మలో నే గాంచు గాక! మరో జన్మ వుందో లేదో ఎవరికెరుక !
చీర్స్
జిలేబి.
భారతి గారు , బాగా చెప్పారు. తప్పకుండా మీ గమ్యం చేరతారు.
రిప్లయితొలగించండి@ జిలేబి గారు,
రిప్లయితొలగించండినిజమేనండి... ఉన్నదో, లేదో తెలియని మరుజన్మకై యోచించేకంటే ఈ జన్మలోనే ఆ యోగ్యత పొందడం శ్రేయోదాయకం. ధన్యవాదాలండి.
మందాకిని గారు,
రిప్లయితొలగించండిమీ ఈ వ్యాఖ్య (దీవెన) నాలో నమ్మకాన్ని, ప్రేరణాశక్తిని పెంచింది. ధన్యవాదాలండి.
అయ్యబాబోయ్ !!
రిప్లయితొలగించండిఏవండీ !
నన్ను నేను అద్దం లో చుసుకున్నట్లు ఉండండి!
ఉప్చ్ భగవాన్ !
నిజంగా
తెలుసా...
office పని లోభాగంగా కొన్ని Network schedules ని excel sheet లో చెయ్యాలి,
నాలుగు రోజులనుండి సెలవు
ఇప్పటి దాకా excel ముట్టుకుంటే వట్టు,
" శతాబ్దాల సూఫీ కవిత్వం " ముందు పెట్టుకుని కూర్చున్న
ఎందుకు పుట్టం ? ఏమి చేస్తున్నాం అనిపిస్తుంది మనసుకి
ఏమి చేస్తున్నాం అనేది కాదు ఎలా చేస్తున్నాం అంటుంది హృది,
సంగత్వం (ఆసక్తి) తో చేస్తున్నవ? ఆత్మ భావం తో త్యాగ బుద్ధి తో చేస్తున్నవ అని ప్రశ్నిస్తుంది వివేకం,
ఇంకో విషయం చెప్పన ! mail పెడతాను లెండి అంతా ఇక్కడ space చాలదు.
మీ blog ఒక 50 సార్లు పైన నేను చూసి ఉంటాను,
చుసిన వెంటనే copy చేసి మా వాళ్ళందరికీ pass చేసేస్తాను,
(వాళ్ళ office లో కొందరికి blogs open అవ్వవు కానీ mail check చేసుకోవచ్చు)
ఈ post ఇంతవరకు చూడలేదు,
భగవత్ సంకల్పమో ఏమో తెలియదు కాని,
సరిగ్గా నా మనసులో ఎలాంటి భావాలున్నాయో
అలాంటి సమయం లోనే మీ post చూసాను,
నా మనసు కోతులకే కోతి లాంటిది అని నా blog చూస్తేనే అర్థం అవుతుంది,
ఒక్కటి మాత్రం sure గా చెప్పగలను అండీ...
నాకు 6 or 7 ఏండ్ల అప్పుడే ఇలా అనిపించేది,
దేవుడా నేనేమో మంచిగా నీకోసం వున్నానా, ఎవరేమి చేసినా ఎలా ఉన్నా end of the day నువ్వేమో అందరిని ఒకేలా treat చేస్తావ?
అని దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడిని... (నాకు బాగా గుర్తు..)
"స్మరణ " సుందర చైతన్యానంద ఆయనతో సంవత్సరం సావాసం చేసాను సంస్కృతి భక్తి TV పుణ్యమా అని ఒక రెండేళ్ళ క్రితం
మీరు నిశ్చింతగా ఉండండి సద్గురు దృష్టి మీ మీద పడింది.
ఇప్పటికి ఇవే మిగితావి mail లో
సాయిరాం
తల్లీ నీకు వందనం
తల్లీ నీకు వందనం
నాకు ఈనాడు లో అంతర్యామి చదవటం రాయటం xerox లు తీయించటం పంచటం mails పంపటం వెతకటం విశ్లేషించటం విచారణ చేయటం అలవాటు
అందుకే నాకు రోజుకో అంతర్యామి రోడ్డు పై చిత్తు కాగితాల్లో, ఇడ్లీ papers లో హోట్టేల్లలో, సరుకుల్లో, ఇంకా మరో రూపం లో ఎన్ని అనుకున్నారు కొన్ని
వందలు అలా వాటంతట అవే వచ్చేవి ....
((గతం లో ఎప్పుడో ఉనికి - ఎరుక అని, అంతర్యామి అని బ్లాగ్ లు కూడా స్టార్ట్ చేసినట్లు గుర్తు ))
ఇప్పడు నాకు స్మరణ blog కుడా అలాంటిదే అనిపిస్తుంది,
?!
?!
నమస్కారమండి భారతిగారు. నా పేరు వసుంధర. చిన్నప్పటినుండి నాలో భక్తిభావం ఉన్నా, నిత్యపూజ,అప్పుడప్పుడు నోములు,వ్రతాలు తప్పా మరేమీ తెలియదు. గత కొన్నేళ్ళుగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనే అంతరంగిక తపన. సంసారబాధ్యతల నిర్వహణలో ఏ సాధన చేయలేకపోయాను. ఈమధ్యనే కాస్త తెరిపిన పడి, 8సం" సర్వీస్ ఉన్నా స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసి,మిత్రుల సలహాతో సత్సంగంకు వెళ్ళడం మొదలెట్టాను. ఆరుమాసాలుగా వెళ్తున్నాను. అబ్బొబ్బో...ఎన్నెన్ని సిద్ధాంతాలు...స్థూల సూక్ష్మ కారణశరీరములు, జాగ్రత్స్వప్న సుషుప్తులు, కుండలిని, కూటస్థదీపం, అంతర్యానం, మయాశబలితం, బట్టబయలు స్థితి, ముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి ...ఒహో... ఎన్నెన్నో అర్ధంకాని పదబంధనాలు... అవే నా సాధనలో ప్రతిబంధకాలు. అవి తెలుసుకుంటేనే జ్ఞానం. జ్ఞానం ద్వారానే ముక్తి సాధ్యమౌతుందని అంటున్నారు. ..ఏది అర్ధంకాని అయోమయం...ఏమిటో గందరగోళం...దీనితో ముక్తి మాట దేవుడెరుగు, భక్తియే బెదిరిపోతుంది, చెదిరిపోతుంది. రవ్వంత స్థిరమైన స్థిమితమివ్వని సిద్ధాంతాలతో సుఖమేమిటీ? అంతరయానం చేయు, లోపలదృష్టి అలవర్చుకో, మనస్సును కట్టడి చేయు, 'అహాన్నీవదులుకో, అహం అంటే తెలుసుకో, నేనెవరో విచారణ చేయు...ఇవి వినడం వరకు బాగుంది. కానీ; ఆచరణలో కుదరని వ్యవహారంగా కష్టతరంగా తోస్తుంది.
రిప్లయితొలగించండిఈ నేపద్యంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇలాగయితే ఎలా???నా సాధన ఎలా సాగించను...లోలోపల ఇదే వేదన. ఇదే తరుణంలో ఓ మిత్రురాలుమిత్రురాలు చెప్పగా మీ బ్లాగ్ చూసాను.
నా మనోసంఘర్షనకు దర్పణం మీరు రాసిన స్వీయ సంఘర్షణ & ఈ పోస్ట్. మరి మీరీ సంఘర్షణను ఎలా అధిగమించారు? నా తపనను అర్ధం చెసుకొని సరైన సలహా ఇవ్వరా? సరళంగా సహజంగా సాగే సాధన తెలపరా? అహంకారం, అహం గురించి కూడా తెలియజేయండి. దయజేసి నా మనఃపరిస్థితి అర్ధం చేసుకొని బదులిస్తారని ఆశిస్తున్నాను.
- వసుంధర
వసుంధరగారు,
తొలగించండిమీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం సరళ సాధన టపాలో తెలిపాను. చూడండి.
పుస్తకాలు చదివి బోలెడు ఙ్ఞానాన్ని
రిప్లయితొలగించండిపొందినా పర బ్రహ్మ మంది రాదు
ప్రవచనాల్ విన్నను దవిలి యధ్యాత్మికం
బలవడదు తలకు బరువు గాని
సత్సంగముల కేసి సారించినాగాని
మాటలకు పడ దేమాత్ర మెఱుక
నేటి సాధుల కడ పాటించి మ్రొక్కినా
ముక్తి గనము , డబ్బు పోవు గాని
దైవ సన్నిధి చేరి యేదైన క్రతువు
నొనర చేయుచు పదిమంది జనుల నడుమ
తృప్తిగా ధార్మిక గతుల తిరుగ దీరు ,
వట్టి మాటల తీరునే గట్టి విధులు ?
గుడికి చేరి , పరిసరాలు తుడిచి శుభ్ర
రిప్లయితొలగించండిపరుచవచ్చును , ధూప దీపాదికములు
పెట్టి యర్చించవచ్చు , దీపించి గుడి
ప్రాంగణములోన మొక్కలు బాగ నాటి ,
యనవరతము కాపాడిన , నవి పెరిగి , పె
నుపడి , వందలేళ్ళు బ్రతికి , విపుల గతుల
పండ్లు నీడల నిడును , పరగ మనము
వాటిలో బ్రతికుందుము , మేటి రీతి .
మన తాహతుకు తగిన మ
న్నన గల తగుపనులు జేసిన , సమాజ హితం
బొనరు , పరమాత్మ రూపును
తనరగ దర్శించవచ్చు , దారిది తెలియన్ .
మాస్టారు గారు,
తొలగించండినమస్సులు.
చాల చక్కగా చెప్పారు. మీ వ్యాఖ్యలకు మనసారా ధన్యవాదములు.