ఉదయాన్నే ఓ స్నేహితురాలినుండి ఫోన్...
నీతో మాట్లాడాలి, పది గంటలకు వస్తున్నానని!
అన్నట్లుగానే తన రాక.
కుశలప్రశ్నల అనంతరం -
తనేం అడిగిందో, తన మాటలలోనే ...
భారతీ, నేను నాగురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నాకు కొన్ని సందేహాలున్నాయి. గత కొద్దిరోజులుగా నాలో ఎన్నో భావాల సంఘర్షణ. నా మనో సంఘర్షణనే నీకు చెప్తున్నాను.
శాస్త్ర సహిత పూజాదికాలు, షోడశోపచారాలు, నామస్మరణలు, జపధ్యానాదులు, ఆలయసందర్శనలు, అర్చనాదులు, క్షేత్రదర్శనాలు, తీర్ధయాత్రలు............ ఇత్యాదులన్నీ ఆధ్యాత్మిక గమనంలో భగవంతునిపై భక్తి కుదురుకోవడానికి ప్రధమసోపానాలని కొందరు అంటారు. వీటిని దాటి వెళ్ళే సాధన చేయాలని అంటారు. అందుకు రాజయోగం, హఠయోగం, క్రియాయోగం, కర్మయోగం .......లాంటివి ఉన్నాయిగా, ఏదో ఒక యోగమార్గమును అనుసరించు అని అంటారు. అన్నింటికంటే జ్ఞానయోగం ఉత్తమోత్తమైనదని, జ్ఞానం మాత్రమే ముక్తిని ప్రసాదిస్తుందని కొందరంటున్నారు. వేదశాస్త్రాలు చదివి అనితరసాధన చేసి, జ్ఞానమంటే ఏమిటో తెలుసుకొన్న జ్ఞానవంతులుకేనా ముక్తి? జ్ఞానమార్గంలో ఎంతో అవగాహన, ప్రజ్ఞ, ప్రతిభ, శ్రద్ధా, దైర్యం, దీక్షా, ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, ఆత్మభావనలతో అనుక్షణం 'ఎరుక'లో ఉండాలి. నేను నా సంసారబాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఏ క్షణం కా క్షణం జ్ఞానస్థితిలో ఉండడం నాకు అసాధ్యంగా ఉంది. అభ్యాసం కొలది అదే అలవడుతుందని చెప్పకు. అకుంఠితపట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితముంటుందని చెప్పకు. ఇవన్నీ నేనున్న స్థితిలో నాకు ఆచరణలో కష్టం. అలానే కర్మలాచారిస్తూ, ఆ కర్మఫలాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ చేయాలంటారు. చేస్తున్న ప్రతీపనిని భగవతార్పణ భావంతో అనుక్షణం ఉండలేను. అంతటి ధార్మిక పరిణితి నాకింకా అలవడలేదు. చేసే ప్రతీ పనిని భగవతార్పణ బుద్ధితో ఆచరించలేను. ముందుగా చెప్పినట్లు నేను నాగురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అలాగని భగవంతున్ని విడిచిపెట్టలేను. భగవంతుడంటే అపారనమ్మకం. బట్ అంతటి సాధన నేను చేయలేను. నాకు భగవత్ ప్రాప్తి కావాలి. వేదశాస్త్రాలు ఇప్పుడు చదవలేను, కంటిదోషం వలన. గురువులను ఆశ్రయించలేను, కుటుంబ నేపద్యంవలన. సత్సంగాలకి వెళ్ళలేను, సమయాభావం వలన. మరి నాకు భగవత్ దర్శనం కాదా? భారతీ! నన్ను, నా తత్వాన్ని, నా తపనని అర్ధం చేసుకొని ఏదైనా సులభమార్గం చెప్పు...... ఆపై దుఖంతో ఏమీ మాట్లాడలేకపోయింది.
అప్పడు నాకు తెల్సింది ఇలా చెప్పాను -
ఉంది, మనలాంటి వారికి ఓ సులభమార్గముంది. అదే భక్తిమార్గం. పరమావధిని పొందడానికి సులభమైన సరళమైన సహజమైన మార్గం, భక్తిమార్గమే. పండిత పామర భేదరహితంగా సర్వులకు సాధ్యమైనది భక్తియే. వేదాలు చదవనవసరం లేదు. కుటుంబం అడ్డుకాదు, సత్సంగాలకు వెళ్ళనవసరం లేదు. విద్య, అవిద్య, శాస్త్ర పరిజ్ఞానం, వేదజ్ఞానం ఇవేవి అవసరం లేదు. నీలో భగవంతునిపై అపారప్రేమ అర్పణాభావం ఉంటే చాలు. చైతన్యమును అనుభవంలోనికి తీసుకువచ్చేవి సద్గుణాలే. భగవంతుడిని గొప్పవాడని నోటితో స్తుతించేకంటే ఆ దైవగుణాలలో (సమత్వం, శాంతి, దయ, ప్రేమ, క్షమ, వాత్సల్యం, ఔదార్యం......) కొన్నయినా అలవరచుకుంటూ చేతల్లో ఆచరించడం చేస్తే చాలు.
గాఢభక్తితో 'శ్రీ' 'కాళ' 'హస్తి' (సాలీడు, పాము, ఏనుగు) తరించలేదా? కన్నప్ప జ్ఞాని కాదుగా, అయినా తరించాడు, తన ప్రగాఢ భక్తిచేతలవలన. భక్తియోగంతో పాటు కర్మ, క్రియా, హఠ, రాజ, జ్ఞాన యోగాలాంటి మార్గాలను కూడా మహర్షులే సూచించారు. ఏ మార్గమును ఎవరు అనుసరించిన, ఈ మార్గల లక్ష్యం ఒక్కటే. అదే జీవ బ్రహ్మైక్యం.
ఇక భక్తి అంటే -
భగవంతునిపై ఉండే అన్యచింతన లేని అనన్య ప్రేమ. అదో నిరంతర స్మృతి. బ్రహ్మభావన చేత దేహగతమైన 'నేను' అన్న భావనను తొలగించుకుంటే మిగిలింది ఆత్మే. ఆత్మభావనలో ఉండడమే ఉత్తమభక్తి. ఆత్మానుభవం పొందడానికి ఏ విషయాలైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని వదిలించుకోవడమే భక్తి. అంటే ఆత్మానుభవం పొందడానికి ఆటంకపరిచే దుర్గుణాలను తొలగించుకోవడమే భక్తి.
సర్వప్రాణులను స్వాత్మయందు, సర్వప్రాణులయందు ఆత్మను చూడడమూ భక్తే. ఇక్కడ ఓసారి నీవు చెప్పిన ఓ విషయం జ్ఞాపకం వస్తుంది. సత్యసాయిబాబా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బాబా అన్న కొన్ని మాటలు నీవే చెప్పావ్. "మట్టిలో ఎన్ని మలిన పదార్ధాలు చేరిఉన్నా, దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు, అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టదైవాన్నే చూస్తారు. అట్లే ప్రతీమనిషిలోని మంచిని మాత్రమే చూడండి, చెడుని చూడకండి" అని. ఇటువంటివి చదివి ఆచరించడం భక్తి, అనుక్షణం ఎరుకలో ఉంచుకోవడం జ్ఞానం.
నీలో తపన ఉంది, కావున.... అన్య చింతన మాని అనన్య భక్తితో పరమాత్మను తెలుసుకో. భక్తి రసామృతమును గ్రోలి ముక్తినే వద్దనుకునే భక్తులున్న (రామదాసు లాంటివారు) పుణ్యభూమి మనది. జ్ఞానమార్గం ద్వారానే కాదు భక్తిత్వం ద్వారా ముక్తిత్వం పొందవచ్చు. ఇది నేనంటున్నది కాదు. భక్తి వైశిష్ట్యం గురించి ఎందఱో చెప్పారు.
భగవాన్ రమణమహర్షి వద్దకు ఒకరు వచ్చి రామ, కృష్ణ విగ్రహాలు తెచ్చి ఇవ్వగా - "జ్ఞానం గురించి ఎంతైనా చెప్పగలం, భక్తి గురించి ఏం చెప్పగలం?" అని కన్నీరు పెట్టుకున్నారు. 'జగత్తు - జీవుడు - ఈశ్వరుడు' మనఃకల్పితం అని చెప్పిన శ్రీ రమణుల నోటినుంచి వచ్చిన పలుకులివి. చూశావా......ఇది భక్తి పారవశ్యం.
వివేకానందుడు కూడా ఓసారి ఇలా చెప్పారు - "కర్మకంటే, జ్ఞానంకంటే యోగం కంటే భక్తి అత్యున్నతం. కారణం, ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించినవి. భక్తి అంటే దానికదే ప్రతిఫలం, అదే సాధన, సాధ్యమూ" అని.
అలానే కాకభుశుండి భక్తిమార్గ వైశిష్ట్యం గురించి ఇలా చెప్తారు -
భక్తి మహిమను ఎరింగియు, దానిని విస్మరించి, కేవలం జ్ఞానమునకై శ్రమలతో సాధన చేయువారు తమ ఇంటిలోని కామధేనువుని కాదని, పాలకై జిల్లేడుచెట్టును వెదుకుచు తిరుగువారగుదురు, అని! వివరంగా ఆ కధనం చెప్పనా?
కాకభుశుండిని ఓసారి గరుత్మంతుడు, 'జ్ఞానంతో సమానముగా ఏదియును లేదనియు, సజ్జనులు, మునులు, వేదపురాణాలు తెల్పుట సువిదితం. ఓ కృపానిధీ! భక్తిజ్ఞానమార్గముల భేదమేమి? అది నాకు వివరింపుడు అని కోరగా -
అంతట కాకభుశుండి ఇలా చెప్తారు -
"ఓ ఖగశ్రేష్టా! ఈ రెండునూ సంసారిక దుఃఖములను బాపును. కాకపొతే ఈ రెండింటి మద్య కొంత భేదమున్నది. అది సావధానంగా వినుము.
జీవుడు ఈశ్వరుని అంశయే. కావున జీవుడు శాశ్వతుడు, చేతనుడు, నిర్మలుడు, స్వభావతః సుఖనిధానం. అట్టి జీవుడు మాయావశుడై, చిలుకవలె, కోతివలె తనకు తానే బంధంలలో చిక్కుపడుచుండును. ఈవిధంగా జడచేతనములు ముడివడియున్నవి. ఈ ముడినుండి బయటపడి ముక్తిని పొందుట మిక్కిలి కష్టము. ఆ కారణమున జీవుడు జననమరణచక్రములో చిక్కుపడును. జీవుని హృదయంలో మోహమనెడి అజ్ఞానాంధకారం దట్టముగా అలుముకొనియుండును. అందువలన ఆ ముడి కనబడదు, విడవడదు.
భగవత్కృపచే సాత్వికశ్రద్ధ అనెడి అందమైన ఆవు హృదయమనెడి ఇంటిలో నివసించినచో, అది వేదోక్తమైన జపతపోవ్రతయమనియమాది కల్యాణప్రదమైన ధర్మాచరణమను పచ్చగడ్డిని మేసినప్పుడు ఆస్తికభావమనెడి దూడలను పొంది, దాని పొదుగునుండి పాలు రాసాగెను. నివృతి మార్గం (విషయవాసనా ప్రపంచంనుండి విముక్తి) ఆవు వెనుక కాళ్ళకు కట్టుత్రాడు. విశ్వాసమే దోహనపాత్ర. నిర్మలమైన మనస్సుయే పాలను పితికెడిదాసుడు. ఖగరాజా! ఈ విధంగా పరమధర్మమయపాలను పిదికి, వాటిని నిష్కామభావమనెడి 'మంట'పై బాగుగా కాగబెట్టవలెను. క్షమసంతోషములనెడి వాయువులు ఆ పాలను చల్లార్చును. ధైర్యం శమం వాటిని పెరుగుగా చేయును. తత్త్వవిచారమనెడి కవ్వమునకు దమమనెడి స్థంభమును ఆలంబనముగా జేసి, ప్రసన్నత్వమనెడి కుండలో ఆ కవ్వమును చేర్చి, సత్యం, మధురవచనములనెడి త్రాడును ఆ కవ్వమునకు చుట్టవలెను. పిదప ఆ త్రాడు సహాయమున కవ్వంతో ఆ పెరుగును మధింపవలెను. అప్పుడు దానినుండి వైరాగ్యమనెడి శుద్ధమనోహర పవిత్రమైన వెన్న వచ్చును. అప్పుడు యోగాగ్ని యందు సత్కర్మలనెడి ఇంధనములతో ఆ వెన్నను కాచవలెను. మమతయనెడి మురికి మాడిపోయి, జ్ఞానమనెడి నెయ్యి మిగులును. అప్పుడు నిశ్చలబుద్ధితో దానిని చల్లార్చవలెను. విజ్ఞానరూపమైన బుద్ధి స్వచ్చమైన ఆ నెయ్యిను పొంది, చిత్తమను ప్రమిదలో నింపవలెను. సమతయను సెమ్మను సిద్ధపరచి, దానిపై ఆ ప్రమిదను భద్రముగా నుంచవలెను. జాగ్రత్స్వప్నసుషుప్త వ్యవస్థలును, సత్త్వరజోస్తమోగుణములును అనెడి ప్రత్తినుండి తురీయావస్థ యనెడి శుభ్రమైన దూదిని తీసి, దానితో చక్కనివత్తిని సిద్ధపరచవలెను. ఆ వత్తిని జ్ఞానమనెడి నేతితో తడపవలెను. ఈ విధంగా తత్త్వజ్ఞానమనెడి తేజోమయమైన దీపమును వెలిగించవలెను. దానిని సమీపింపగానే అరిషడ్వర్గములనెడి శలభములు (దీపపు పురుగులు) మసియై పోవును. 'సోహమస్మి' (పరబ్రహ్మమే నేను) ఇది అఖండమైన జ్యోతి. అదియే జ్ఞానదీపముయొక్క ప్రచండదీపశిఖ. ఆత్మజ్ఞానమనెడి సుఖప్రదమైన సముజ్జ్వలప్రకాశం వ్యాపించినప్పుడు సంసారబంధములకు మూలకారణమైన భేదరూపభ్రమలు తొలగిపోవును. అవిద్య యొక్క ప్రబల పరివారమైన మోహం మొదలగు తమస్సులు పటాపంచలగును. అప్పుడు ఆ విజ్ఞాన రూపమగు బుద్ధి ఆత్మానుభవ ప్రకాశమును పొంది, హృదయమనెడి ఇంటిలో కూర్చొని, జడచేతనముడిని విప్పివేయును. అంతట జీవుడు కృతార్ధుడు అగును. కానీ, ఖగరాజా! ఆ ముడి విడిపోవుచున్నట్లు తెలియగనే మాయ మరల అనేక విఘ్నములను కల్పించును. అది సిద్ధులనెడి పెక్కు అంతరాయములను పంపును. అవి వచ్చి బుద్ధిని ప్రలోభపరుచును. ఆ ప్రలోభములు తమ కొంగుగాలితో జ్ఞానరూపశిఖను ఆర్పివేయును. ఒకవేళ జీవుని బుద్ధి వికసించి ఈ ప్రలోభాలకు లొంగనిచో, దేవతలు విఘ్నములను సృష్టించెదరు. హృదయమనెడి గృహమునకు ఇంద్రియములనెడి కిటికీలు కలవు. అట్టి ప్రతీ కిటికీపై దేవతలు కూర్చుందురు. విషయములనెడి వాయువులు వచ్చుటను గమనింపగానే వారు ఈ కిటికీలను పట్టుబట్టి బలంగా తెరచెదరు. ఈ గాలులువలన విజ్ఞానదీపం ఆరిపోవును. ముడి విడిపోదు సరికదా, ఆత్మానుభవప్రకాశం కూడా ఆరిపోవును. విషయపవనములచే బుద్ధి వికలమైపోవును. చేసిన సాధన అంతయూ వమ్మైపోవును. ఏలననగా ఇంద్రియములకును, వాటి అధిష్ఠానదేవతలకును జ్ఞానం రుచింపదు. వారికి విషయభోగముల యందే సర్వదా ఆసక్తి మెండు. బుద్ధియు విషయభోగములచే కొట్టబడినచో జ్ఞానదీపం ఆరిపోవును. ఈ దీపం ఆరిపోవుటవలన జననమరణపరంపర క్లేశాలు తప్పవు. ఈవిధంగా ఘణాక్షరన్యాయమున జ్ఞానం ప్రాప్తించినను దానిని రక్షించుకొనుటలో అనేక కష్టములు ఉన్నవి. ఓ ఖగేశా! ఈ మార్గమునందలి సాధకుల దీక్ష ఏ క్షణమైనను సడలవచ్చును. ఈ మార్గమును నిర్విఘ్నముగా అనుసరించువారే అతిదుర్లభమైన పరమపదమును చేరుదురు. జ్ఞానమార్గమున కైవల్యమును పొందుట అత్యంత క్లిష్టకార్యం. కానీ, ఓ ఖగరాజా! దుర్లభమైన ఆ ముక్తియే సరళమైన భక్తిమార్గమున పొందవచ్చును. ఎట్టి యత్నమూ, శ్రమయూ లేకుండగనే జననమరణ పరంపరకు కారణమైన అవిద్య భక్తితత్పరులనుండి దూరమగును. భక్తి మహిమాన్వితమైన సుందరచింతామణి. దీనిని హృదయమున ధరించువారు స్వయంగా అహర్నిశలు ప్రకాశమానులగుదురు. వీరికి నెయ్యి, వత్తి, దీపమూ అవసరం లేదు. మోహమనెడి దారిద్యం వీరిని సమీపించలేదు. ఏలననగా ఈ చింతామణి స్వయంప్రకాశం. లోభమనెడి వాయువు దానిని ఆర్పజాలదు. దానికాంతితో అవిద్య అనెడి గాఢ అంధకారం పటాపంచలగును. మదాది దీపపుపురుగుల సమూహము పరాజితమగును. భక్తి పరిపూర్ణహృదయుని చెంతకు కామక్రోధాదిదుష్టులు రానేరారు. లోకమును పీడించునట్టి మానసజాడ్యములు ఈ మణిని ధరించువారిని పీడించవు. ప్రేమతో అన్వేషించువారే ఆనందనిధియైన ఈ భక్తి మణిని పొందగలరు" అని.
ఇలా నా అవగాహన మేరకు, నాకు తెలిసినంతలో భక్తి గురించి తనకి చెప్పాను. తను వెళ్ళాక దీనినే మరోసారి స్మరిస్తున్నాను, ఇలా స్మరణ లో -
నిజమే కదా .....
లోపల ఉన్న సద్ వస్తువుతో అనుసంధానం చేసేది భక్తే. సద్ వస్తువును సదా స్మరించడమే సద్భక్తి. ప్రగాఢమైన భక్తే పరిణామక్రమంలో జ్ఞానంగా ఫరిడిల్లుతుంది.
భక్తిరసామృతం గ్రోలిన భక్తులు భగవత్ప్రేమానందంలో తేలియాడుతూ ఇలా కోరుకుంటారు -
న ధనం న జనం న సున్దరీం
కవితాం వా జగదీశ కామయే
మమ జన్మని జన్మ నీశ్వరో
భవతా ద్భక్తి రహైతుకీ త్వయ
(శ్రీకృష్ణచైతన్య విరచితం, శిక్షాష్టకం)
(నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరులు వద్దు, కవిత్వం వద్దు, జన్మజన్మాంతరాలలో నీపట్ల అహేతుక భక్తే నాకు కావాలి)