28, డిసెంబర్ 2012, శుక్రవారం

ధ్యాని - దర్శనం



సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని /
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః //

ధ్యానయోగపరుడు సర్వభూతములయందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను సమానముగా దర్శించును. 



ధ్యానయోగపరులు అందరూ, అంతా ఆత్మస్వరూపమే అన్నభావన కల్గివుందురు. ఈ భావనే ఏకాత్మభావన. ఇదే ఏకీభావస్థితి. చరాచర ప్రాణులయందు అఖండాత్మ చైతన్యమును ధ్యాని మాత్రమే దర్శించగలడు.

ధ్యాని తను సంకల్పించిన ప్రతీపనిని దైవభావనతో చేయడం వలన అది భగవత్సేవే అవుతుంది.
ధ్యాని తను సంభాషించిన ప్రతీమాట మృదుభావనతో మాట్లాడడం వలన అది భగవత్ సంకీర్తనమే అవుతుంది.ధ్యాని తను చూసినదంతా స్వాత్మభావనతో దర్శించడం వలన అది భగవత్ దర్శనమే అవుతుంది.

సృష్టికర్త తన సృజనలో - ప్రతీది పరమాత్మభావనతో మనం చూడాలనే, ప్రతీ జడచేతనాలలో తానై యుండి దైవత్వాన్ని దర్శించుకోమన్నాడు. ధ్యానిలా జీవించమన్నాడు. 

మొక్క, చెట్టు, వనం, అడవి, తోట మొదలగు వాటిపేర్లు వేరైనను వీటి బీజమూలం ఒక్కటే. అది అర్ధం చేసుకోమనే వీటి యందు కూడా పరమ'ఆత్మ'గా తానే ఉన్నానని భగవంతుడు తెలియజేస్తున్నాడు. అందుకు కొన్ని ఉదాహరణలు - తులసిమొక్క నిత్యపూజలందుకునే దేవతామూర్తి కాగా, రావిచెట్టు విష్ణుమూర్తి స్వరూపముగా భాసిల్లగా, వేపచెట్టు మహాలక్ష్మి స్వరూపమైంది.

ఇక బావి, చెరువు, కాలువ, నది, సముద్రం అని వేర్వేరు పేర్లతో పిలవబడినను వీటన్నింటిలో ఏకమై ఉన్నది నీరు ఒక్కటే. వీటన్నంటి యందు ఉన్నది ఒకే చైతన్యం. అది అర్ధంచేసుకునే గంగా యమున మొదలగు నదులను దేవతాస్త్రీలుగా కొలవడం.

అలానే పాము సుబ్రహ్మణ్యస్వామిగా, కుక్క కాలభైరవుడుగా, గోమాత సకలదేవతలకు నిలయమైన దేవతామూర్తిగా, సూర్యాది గ్రహాలూ దైవస్వరూపాలుగా గుర్తించి ఆరాదిస్తున్నాం.
ఇక హిమాలయాది పర్వతశ్రేణులు, భద్రాది కొండలు, గుట్టలు మిట్టలు భగవంతుని నివాసాలుకాగా, పంచభూతాలూ పరమాత్మస్వరూపాలై అంతటా ఉన్నది పరమాత్మే అన్న భావనను దృఢపరుస్తున్నాయి. 
ఇలా సృష్టిలో అణువణువున భగవంతున్ని దర్శించడం, సమస్తమునూ పరమాత్మ స్వరూపముగా భావించడమూ, పవిత్రభావంతో పూజించడం - ఇదే భారతీయ దార్శినికత్వం - ఇదే మానవుడుని మాధవుడుగా మార్చగలిగే దార్మికత్వం -ఇదే సర్వత్రా, సర్వదా సర్వమూ అఖండాత్మ చైతన్యరూపమునకు దర్పణం. 
సమస్త సృష్టికి ఆధారభూతుడు పరమాత్మయే! ఆణువణువూ వ్యాపించి వున్నది ఆ భగవంతుని తత్త్వమే. ప్రతీ జడచేతనలు యందు ఉన్నది పరమాత్మ అంశయే! 

దీనినే ధ్యానయోగమందు ధ్యాని దర్శిస్తాడు. ఏకాత్మభావనతో సర్వాత్మను దర్శిస్తాడు.

                                చిల్లగింజ నీటిని, మంచిమాట మనసుని తేటపరుస్తాయి  

27, డిసెంబర్ 2012, గురువారం

ధ్యానం ద్వారా దివ్యత్వం

ధ్యానం - అహంభావాన్ని చేదించి అతీతమానసమై అంతర్లయగా సాగేది.
ధ్యానం - దివ్యజీవనమునకు దోహదకారి.
ధ్యానం - ఆత్మాన్వేషణకై చేసే అంతర్యానం.
ధ్యానం - అంతరాన్న ఆత్మాపరమాత్మల అనుసంధానం.
ధ్యానం - ఆత్మ స్మృహ.
ధ్యానం - ఆత్మ దర్శనం.

ధ్యానంలో - అహంభావం అంతరిస్తుంది.
ధ్యానంలో - అహంకారం అడ్డుతొలగిపోతుంది.
ధ్యానంలో - ఆభిజాత్యం ఆవిరైపోతుంది.
ధ్యానంలో - అనుమానాలు అదృశ్యమౌతాయి.
ధ్యానంలో - అజ్ఞానం అంతర్దానమౌతుంది.
ధ్యానంలో - అంతర్యామియందు అపరిమితమైన అపేక్ష అంకురిస్తుంది.
ధ్యానంలో - అంతర్భూతంగా ఆధ్యాత్మికత అవతరిస్తుంది.
ధ్యానంలో - ఆరాధన అంతర్వాహినవుతుంది.
ధ్యానంలో - అభ్యాసంచే అన్నివేళలా అన్నింటా అంతటా ఆత్మభావం అలవడుతుంది.
ధ్యానంలో - మనసు అచలమై ఆత్మా ఆవిష్కృతమవుతుంది. 

                                                అన్నింటా విశ్వాసంతో వుండు 
                               విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు.

22, డిసెంబర్ 2012, శనివారం

వైరాగ్యం

                 నీ మనస్సు భగవద్విలీనం కాలేదంటే నీలో దృఢమైన వైరాగ్యం లేనట్లే - బాబా.

వైరాగ్యం అంటే -
                 విరాగం. రాగం లేకుండుట. దృశ్యమాన ప్రపంచమందు రాగం లేకుండుట.
                 శరీరము, ప్రపంచమందు విషయములు అనిత్యమైనవని గ్రహించి, ఇహ పరలోకములయందు ఏ విధమైన కోరికలు లేకుండా ఉండటం. 

అలాగని తాముచేసే పనిని, తమకుగల బాధ్యతలను, స్వధర్మాన్ని వదిలివేయడం వైరాగ్యంకాదు, తాము సాధించదలిచిన లక్ష్యానికి అడ్డుగా వచ్చే వాటినన్నిటినీ వదలడమే వైరాగ్యం.

[గృహస్థుడగు పురుషుడు సహధర్మిణితో నుండి తల్లితండ్రులను, బిడ్డలను చక్కగా పోషించి అతిధి సత్కారపరుడై గృహకృత్యములలో లోటు గలుగక చూచుకుంటూ జ్ఞాననిష్ఠుడై ఉండవలెను. అలానే స్త్రీ గృహధర్మం నిర్వర్తిస్తూ, పెద్దలకు పతికి శుశ్రూషలు చేస్తూ, పిల్లలను చక్కగా పెంచుతూ, అతిధి అభాగ్యులను ఆదరిస్తూ, బ్రహ్మనిష్ఠను అభ్యసించవలెను. ఇదియే గృహస్థులు చేయవలిసిన పంచమహాయజ్ఞములలో గల గొప్ప బ్రహ్మయజ్ఞమని మహర్షులు చెప్తారు] 

వివేకం వలన, విచారణ వలన వైరాగ్యం కలుగును. ఏది నిత్యమో, ఏది అనిత్యమో; ఏది సుఖమో, ఏది దుఃఖమో; ఏది మంచో, ఏది చెడో....... ఇత్యాదులను గ్రహించడమే వివేకం. దృక్కును, దృశ్యమును పరీక్షించుచుండుట విచారణ. విచారణ అనేది అంతరంగిక అన్వేషణ. ఈ విచారణయే వైరాగ్యంనకు దగ్గరదారి. సద్విచారణ వలెనే అనిత్యపదార్ధములయందు అనాసక్తి ఏర్పడుతుంది. ఇట్టి సద్విచారణ జనితమైన అనాసక్తి పేరే వైరాగ్యం.

అలాగే ప్రతికూల పరిస్థితిలో విషయాసక్తి విడిచిపెట్టడం వైరాగ్యం కాదు, అనుకూల పరిస్థితిలో కూడా విషయాసక్తి లేకపోవడం వైరాగ్యం. 

వైరాగ్యంనందు మూడవస్థలు గలవి. అవి 1. వైరాగ్యం యొక్క హేతువు, 2. వైరాగ్యం యొక్క స్వరూపం, 3. వైరాగ్యం యొక్క కార్యం.

దోషదృష్టిర్జిహాసా చ పునర్భోగేష్వదీనతా /
అసాధారణ హేత్వాద్యా వైరాగ్యస్యత్రయోప్యమీ //
విషయములయందుగల అనిత్యత్వ సాతిశయత్వాది దోషదర్శనమే వైరాగ్యమునకు హేతువు. విషయభోగములను విడుచుటయే వైరాగ్యస్వరూపం. మరల భోగేచ్చ కలుగకపోవుటయే వైరాగ్యము యొక్క కార్యమగును.

అలానే మనుజులలో కదిలాడే భావాలబట్టి వైరాగ్యమందు వైవిద్యాలున్నాయి. కొన్ని వైరాగ్యాలు తాత్కాలికమైనవి. అందులో కొన్ని -
1. మందవైరాగ్యం:- 
                         సంసార బాధలు వచ్చినప్పుడో, మహాత్ముల మాటలు విన్నప్పుడో, దైవిక గ్రంధములు చదువునప్పుడో, సత్సాంగత్యం కలిగినప్పుడో దైవకార్యంలో ప్రవేశించాలన్న భావన కలిగి, ఏదైనా నొక తరుణోపాయమగు ధ్యానమునో ధ్యాసనో ఏర్పరచుకునే తలంపు చేయడం మందవైరాగ్యం. (కొద్దిరోజులే ఈ సాధన. మరల ప్రాపంచికజీవనంలో పడిపోతారు)
2. శ్మశానవైరాగ్యం:-
                         ఆత్మీయులో, తెలిసినవారో మరణించినప్పుడు 'ఎవ్వరికెవ్వరొ, ఎన్నాళ్ళు ఉంటారో, ఎప్పుడు రాలిపోతారో తెలియదు. మరణం తప్పదని తెలిసినా బంధాలను పెంచుకోవడం, భార్యాపుత్రాదులకై, బందుమిత్రులకై పరితపించడం, కష్టపడి సంపాదించడం, చివరికి ఏదీ తోడురాక ఒంటరిగా కాటికి చేరుకోవడం....... ఏమిటిదంతా? ఇంతటిదానికి ఎందుకింత ప్రాకులాడడం........ ఇత్యాది ఆలోచనలతో వైరాగ్యభావంకు లోనుకావడం శ్మశానవైరాగ్యం. (కొలదిరోజుల్లోనే సంసారమునందు మునిగిపోతారు)
3. ప్రసూతివైరాగ్యం:-
                         ప్రసవవేదన పడుతున్నప్పుడు ఈ బిడ్డ ఒక్కరు చాలు, చాలు. ఈ నొప్పులు మరల మరల పడలేను..... అని ఆ బాధను తాళలేక అనుకోవడం ప్రసూతివైరాగ్యం. (మరల సంతోషంగా మరోసంతానికి సిద్ధం కావడం జరుగుతుంది)

4. పురాణవైరాగ్యం:- 
                         పురాణాలు వింటున్నప్పుడూ, పఠిస్తున్నప్పుడు దైవంనందు భక్తిభావం కుదిరి మోక్షం పొందేయాలి అని ఆక్షణమునే భావించి త్వరపడడం పురాణవైరాగ్యం. 
[ఈ పురాణవైరాగ్యం గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన ఓ కధ జ్ఞాపకం వస్తుంది. 
ఒకరాజు తన ఆస్థాన గురువుద్వారా ప్రతీరోజు భాగవత శ్రవణం చేయుచుండెను. ఏడురోజుల్లో పరీక్షిత్తు మహారాజునకు శుకమహర్షి భాగవతమును తెలిపి మోక్షమును కలుగజేసినట్లు గ్రహించి, తనకును భాగవతసారమంతా ఏడురోజుల్లో తెలిపి మోక్షమును కలుగజేయమని, అలా కలుగజేయనిచో వంద కొరడా దెబ్బలు మరియు రాజ్య బహిష్కరణ తప్పవని శాసించెను. గురువుగారు ఆరురోజులవరకు ఎంతో శ్రద్ధతో చెప్పినను మహావ్యాకులతతో ఉండడం చూసిన పరమభక్తుడైన గురువుగారి సేవకుడు 'దీనికేల వ్యాకులత చెందుతారు? ఏం భయపడకండి, రేపటిదినమున నేను మీ బదులుగా రాజుగారి దగ్గరకు వెళ్లి భగవత్కృప వలన అన్నిటిని చక్కబరిచి వచ్చెద'నని చెప్పెను. 
ఆ సేవకుడు మరుసటిరోజు ప్రాతఃకాలమున రాజుగారిని దర్శించి, మా గురువుగారు ఈ దినం తమను ఉపవాసముగా ఉండమనియు, ఈ దినం ఏడవరోజు అగుటచే పూజలు జరిపించమని తెలపమనిరి, అని చెప్పెను. అంతట ఆ రాజుగారు దినమంతయు ఉపవాసముండి నాలుగవయామమున పురాణ శ్రవణంనకు నిరీక్షించుచుండెను. ఆ సేవకుడు రాజమందిరం ప్రవేశించుసరికి జరగబోవు రాజుయొక్క ముక్తిని చూడవచ్చిన జనులతో క్రిక్కిరిసివుంది. తమ ఆచార్యులు ఈ దినం రాజాలరనియు, మోక్షధర్మము యొక్క రహస్యమును తమకు తెలుపుటకు తనాజ్ఞాపించి పంపిరనియు, ఈ చిన్నవిషయమునకు తానెలా రావలసియున్నదనియు గురువు చెప్పి పంపినట్లు సేవకుడు తెలిపెను. అంతట అచ్చట ఉన్న పండితులందరూ రాజుగారితో ఎవరైనను మనకేమి? ప్రయోజనము కలిగిన చాలునని చెప్పగా రాజు దానికి అంగీకరించెను. అప్పుడు ఆ భక్తుడగు సేవకుడు 'ఉపదేష్ట ఎవడైనను వారి వాక్యములను గురువాక్యముగా నమ్మవలయును. వినువాడెవడైనను శిష్యభావము గలిగియుండవలెను నని చెప్పగా రాజు సరే అనగా, ముహూర్తం దగ్గరకు వచ్చినది, రాజుగారి ముందట ఒకబల్లపై పంచభక్ష్యపరమాన్నములుంచి భాగవత పూజలు జరపవలసిందని చెప్పి, రాజుగారి రెండు చేతులు, కాళ్ళను సింహాసనమునకు కట్టివేసి, 'ఓ ప్రభువా! లగ్నం వచ్చినది, అయిదు నిముషముల లోపల పుష్కర ముహూర్తం కలదు, దీనిలోపల ఉపవాస విరమణ జరగవలెను. కావున ఈ పదార్ధములన్నియు వెంటనే భుజించినచో ముక్తి కలుగును' అని చెప్పగా; చేతులు, కాళ్ళు కట్టుబడినందుచే రాజు తినలేకపోయెను. ఈ కారణంచే ముక్తి అనుభవం కలుగలేదని ఆ సేవకుడు అని ఇలా వివరించెను - కాళ్ళు చేతులు బందింపబడి యున్నందున కంటికి కన్పిస్తున్న పదార్ధములను తినలేకపోయారు. అలానే మా గురువరుడగు పౌరాణికుడు, దివ్యోపదేశముల నన్నిటిని, భాగవత సారమంతయు మీకుపదేశించినను మీరు మీ మనస్సును భగవద్విలీనము చేసుకోలేక ఆశాపాశంలచే కట్టుబడియుండుటచే ముక్తానుభవం కలుగలేదు. సమస్త బంధనములనుండి విముక్తి పొందినవారికే బ్రహ్మానుభవం కలుగును తక్కినవారికి వేదాంతశ్రవణం ఈ మోస్తారుగానే ఉండునని చెప్పెను. ఈ విషయం తెలిసుకున్న గురువుగారే ఆ భక్తసేవకునికి సేవకుడు అయ్యారన్నది వేరే విషయం. స్థిరమైన వైరాగ్య అభ్యాసలున్డాలి. కేవలం శాస్త్ర శ్రవణ పఠన వైరాగ్యాలు ఫలితాన్నివ్వవు] 
అంధకారమును పోగొట్టుటకు దీపం వెలిగించాలంటే ప్రమిద, తైలం, వత్తి ఎలా అవసరమో, అలానే అజ్ఞానాంధకారమును పోగొట్టుటకు సంపూర్ణవైరాగ్యమను తైలం, అనన్యభక్తియను వత్తి, పూర్ణమైన ప్రబోధం అనెడి పాత్ర (ప్రమిద) ఉన్నప్పుడే జ్ఞప్తి జ్ఞానమనెడు జ్యోతి వెలుగును. 

వైరాగ్య తైలసంపూర్ణే భక్తివర్తిసమన్వితే /
ప్రబోధపూర్ణపాత్రే తు జ్ఞప్తిదీపం విలోకయేత్ //
                                                - దక్షిణామూర్త్యుపనిషత్ 


కొన్ని స్థిరముగా నిలిచే దృఢమైనవైరాగ్యాలు. అందులో కొన్ని -            
1. మృదువైరాగ్యం:-
                         ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని, అందుకై గురువును ఆశ్రయించాలని, పరమార్దసిద్ధిని పొందాలని, పరితాపంతో ప్రయత్నించడం మృదువైరాగ్యం.
2. తీవ్రవైరాగ్యం:-
                         ఇదంతా మిధ్యాప్రపంచమని గ్రహించి, ప్రాపంచిక విషయలాలసను విడిచి, దేనియందు ప్రీతి లేకుండా పరమాత్మకై ప్రయత్నించడం తీవ్రవైరాగ్యం.
3. తీవ్రతరవైరాగ్యం:-
                         అనన్యదైవభక్తితో బ్రహ్మజ్ఞానామృతం గ్రోలడానికి ఒకే ధ్యాసలో మోక్షమనెడు సర్వేశ్వరప్రాప్తికై అవిశ్రాంతకంగా ప్రయత్నించడం తీవ్రతరవైరాగ్యం.
4. అతి తీవ్రతమవైరాగ్యం:-
                         జ్ఞానతాపంచే తపిస్తూ ఆత్మోపలబ్ధికొరకు ఆజన్మాంతం ప్రయత్నించడం అతి తీవ్రతమవైరాగ్యం. 


వైరాగ్యం ఎప్పుడూ మనస్సులోనే కలుగుతుంది. కాని, అరణ్యానికో, నిర్జనప్రదేశానికో, స్వధర్మాన్ని విడిచిపెట్టి ఏకాంత వాసానికో వెళ్ళడం వైరాగ్యం కాదు. 

                            దేవాలయంలో దేవునిమూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ది చాలు 
                               దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతరశుద్ధి కావాలి

16, డిసెంబర్ 2012, ఆదివారం

గుప్పెడంత గుండెలో ...

ఈ రోజు శ్రీమద్భగవద్గీత చదవాలనిపించింది. పనులన్నీ అయ్యాక గీత తీసాను. పద్దెనిమిది అధ్యాయములలో ఏది చదవాలి? కళ్ళు మూసుకొని కృష్ణుడును తలచుకుంటూ ఓ పేజీ తెరిచాను. తెరిచిన పుటలో కళ్ళకు ఎదురుగా ఉన్న శ్లోకమును చదివాను. 

అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్ /
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః //

అంత్యకాలమందు ఎవడు నన్నే స్మరించుచూ దేహమును విడిచిపెట్టునో, వాడు నా స్వరూపమును పొందుచున్నాడు. ఇందులో సందేహం లేదు.

హమ్మయ్య....... మరణించేముందు కృష్ణున్ని తలుచుకుంటే చాలు. కష్టపడకుండా, ఇతరత్రా సాధనలు చేయకున్న ముక్తిని పొందేయవచ్చు.... అని మనస్సు మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంతలోనే కన్నయ్య నా బుద్ధిని మేల్కొపి, మదిని మాయను తెలిపి, 'ముకుందమాల'లో ఓ శ్లోకాన్ని గుర్తుచేశాడు.

కృష్ణ త్వదీయపదపంకజపంజరాన్తమ్ 
      అద్యైవ మే విశతు మానసరాజహంసః 
ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తై:
       కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే 

ఓ కృష్ణా! ఈ క్షణమే నా మానసరాజహంస నీ పాదపద్మతూళ్ళ వల యందు ప్రవేశించుగాక. మరణసమయమున గొంతు కఫవాతపిత్తములతో పూడుకుపోయినప్పుడు నిన్ను స్మరించుట నా కెట్లు సాధ్యపాడగలదు?

నిజమే కదా - 
అసలు మరణం ఎప్పుడొస్తుందో తెలియదు. తెలిసిన మరణసమయమున ఏ అనారోగ్యం చేతనయినను కృష్ణుడిని తలచుకోలేకపోవచ్చు, తలుచుకోవాలన్న జ్ఞాపకం కూడా రాకపోవచ్చు. అంతవరకు జీవించినకాలంలో స్మరణలో లేనిది ఆ క్షణంలో స్పురణకు ఎలా వస్తుంది? ఊహు.... రాదుగాక రాదు. అందుకే అంతా సవ్యంగా ఉన్నప్పుడే భగవంతుని పాదారవిందాలను పట్టుకోవాలి.

అరవిందం అంటే ఒకానొకప్పుడు గురువల్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలు లీలగా గుర్తుకొస్తున్నాయి -
ఓసారి గురువుగారు తన ప్రవచనంలో...
ముఖారవిందం, హస్తారవిందం, పాదారవిందం అని ఎందుకంటారో తెలిపారు. 
అరవిందం అంటే పద్మం. ఈశ్వరుని పాదాలను, చేతులను ముఖమును ఈ అరవిందాలతో (పద్మాలతో) ఎందుకు పోల్చుతారంటే -
షట్పది అంటే తుమ్మెదని అర్ధం. ఆరుపాదములు గల తుమ్మెద పద్మం కనిపించగానే మకరందంకై వెళ్లి పట్టుకుంటుంది. అలానే పంచేద్రియములు + మనస్సు అనే ఆరింటితో పద్మాల్లాంటి ఈశ్వరుని పాదాలను ఆశ్రయించాలని కవులు వర్ణిస్తారని చెప్పారు.


అయ్యబాబోయ్......... నా గుప్పెడంత గుండెలో కరుణారసామృతుడైన నా చిట్టి కిట్టయ్య లేకపోతే ఇవేవీ నాకు జ్ఞాపకం రాక, నేనీ మనోమాయలో పడిపోదును కదా.

ఓ కృష్ణా! ఈ మనోమాయలో పడకుండా నీవే సదా మము రక్షించుగాక!


                                         శరీరం దైవదత్తం - మనస్సు మానవ కల్పితం 
                                           బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్షసిద్ధి తధ్యం 

10, డిసెంబర్ 2012, సోమవారం

ఆచరణే ఆరాధన

ఉదయం శివాలయానికి వెళ్లి వస్తుండగా -
ఒక పెద్దావిడ ఏమీ అనుకోకురా అంటూ నా భుజం ఆసరాగా మెట్లు దిగుతూ...
అక్కడ కూర్చొన్నవారు ధర్మం చేయండమ్మా అని అడగగా 
చేతిసంచిలో నుండి తీసిన బన్ లను, చిల్లర నాణేలను కలిపి ఒకొకరికీ ఇస్తూ, చివరిలో ఓ ఇద్దరికీ బన్లు ఇవ్వడానికి లేకపోతే చెరో పదిరూపాయలు ఇస్తూ -
"ధర్మమంటే దానం కాదు, ధర్మమంటే ఒక జీవన విధానం. ఏ రకంగా జీవిస్తే దేవుని అనుగ్రహం లభిస్తుందో అలా జీవించడం ధర్మం. ఏ రకంగా జీవిస్తే మనకి ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆ రకంగా జీవించుటయే ధర్మం. రాగద్వేషాలు లేకుండా మనపని మనం సక్రమంగా చేయుటయే ధర్మం" అని చెప్తూ ఆలయప్రాంగణంలో ఓ రాతిచప్టా పై కూర్చున్నారు.
ప్రసన్నమైన నవ్వు, ప్రశాంతమైన ముఖరావిందం, ఆత్మీయతను కురిపించే కళ్ళు...... ఆమెతో కాసేపు మాట్లాడాలనిపించి ఆమె చెంతనే కూర్చుంటూ 'బాగా చెప్పారమ్మా' అని అన్నాను. 
అందుకామె నవ్వుతూ "ఓ నా మాటలు నీకునచ్చాయన్నమాట. వీటిని వినడమే కాదు, ఆచరణలో పెట్టు. ఎందుకంటే భగవంతుని పటాలను పూజించడం భక్తి కాదు, భగవంతుడు పయనించే సత్యపధమార్గమును అనుసరించడమే భక్తి. వారు వారి అవతారముల ద్వారా ఎలా జీవించాలని తెలిపారో అది ఆచరించడమే పూజ. ఆచరణే ఆరాధన. అదే అత్యుత్తమ అర్చన"... అని అన్నారు.
మాతోపాటు ఆ చప్టా పై కూర్చున్న మరొకామె అడిగారు - 'అమ్మా, అందరికీ సాగదమ్మ అలా ఉండడం. మంచిగా ఉన్నా ఎన్నో కష్టనష్టాలు, ఏ పని చేసినా నిందారోపణలు. పరిస్థితులు అనుకూలించాలి కదమ్మా దేనికైనా. అయినా ఒక్కొక్కరినీ ఒకోలా సృష్టిస్తుంటాడెందుకమ్మా ఆ భగవంతుడు' అని అడగగా 
"భగవంతుడు కాదు మన ప్రారబ్దాలే మన జన్మలకు కారణం. చేసే పనుల బట్టే పుడతారు. ఏ కష్టదుఃఖాలు లేకపోతే ఈ శరీరం ఈ భూమి మీదకు ఎందుకు వస్తుంది? మంచిగా ఉన్నా కష్టాలు వస్తున్నాయంటే అవి గత జన్మ పాపఫలితాలు. అనుభవించి వాటిని అధిగమించడమే. మనకి శిక్షణ ఇవ్వడానికే జయాపజయాలు, లాభనష్టాలు, కష్టసుఖాలు, నిందాస్తుతులు మొదలగునవి అనేకం  వివిధ సంఘంటనల రూపంలో వస్తాయి. అయినను పరిస్థితులు ఎలా ఉన్నా అవి ముఖ్యం కాదు, మన మానసికవైఖరే ముఖ్యం" దేహ ప్రారబ్ధం బట్టే ఇవన్నీ వస్తుంటాయి. వీటిని పట్టించుకోకూడదు. అని ఆమె చెప్పగా 'అమ్మా ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ఎలాగమ్మా, ఈ అహంకారమును, మమకారములను ఎలా జయించడం అమ్మా......కష్టంగా ఉందమ్మా సాధన' అని నేను అనగా -
"సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, పొగిడినా, నిందించినా సమానంగా ఉండు అని గీత చెప్తుంది. సంతోషకరమైన సంవేదనలను సమభావనతో చూస్తే రాగం నుంచి బయటపడగలం. బాధాకరమైన సంవేదనలను సమభావనతో చూస్తే అహంకారం నుంచి బయటపడగలం. నీవు చేస్తున్న ప్రతీ పనిని ఇష్టంగా దైవదృష్టితో చేస్తే అదే ఆధ్యాత్మికం అవుతుంది. అదే సత్యపధం వైపు నిను తీసుకువెళ్తుంది" అని చెప్తుండగా ఆమెని తీసుకువెళ్ళడానికి వారి అబ్బాయి రావడం, ప్రాప్తముంటే మరల కలుద్దామని చెప్తూ వెళ్ళారు.
ఇంటికి వచ్చాక కూడా ఆమె మాటలనే  
'స్మరణ'లో స్మరించుకుంటూ 'సులోచన'మ్మగారికి నమస్కరిస్తున్నాను.

టన్నుల కొలది శాస్త్రపరిజ్ఞానం కంటే ఔన్సుడు ఆచరణ మేలు.


7, డిసెంబర్ 2012, శుక్రవారం

ఆత్మ వైభవం





విత్తు నాటినవాడు ఫలము తినవలె 
కర్మఫలమాగదు, శుభమునకు శుభము 
అశుభమున కశుభము, ఈ నియతి అలంఘ్యము 
తనువు పొందు ప్రతి జీవికి 
తగులు బంధములు, నియమమిది;
నిత్యముక్తమై నామ రూపములకవ్వల నుండు ఆత్మ
నీవేయని తెలిసి ఓ సన్యాసి, పాడవే 
ఓం తత్సత్ ఓమని ముక్తగీతి!
                          - స్వామి వివేకానంద (విరజగీతి) 








                                      "నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలాగే ఉంటుంది
                                             సమ్మతితో ఉండు - సద్గతిని పొందు"

4, డిసెంబర్ 2012, మంగళవారం

తేరే ఘూంఘట్ ఫట్ ఖోలో.....


వర్షంలో కాగితపు పడవలు వదలడం, నేల,బండ; వీరి వీరి గుమ్మడుపండులాంటి ఆటలు, పుస్తకాలలో నెమలికన్ను,కొంచెం బియ్యం (బియ్యం పెడితే నెమలికన్ను పిల్లలను పెడుతుందని, బోల్డన్ని నెమలికన్నులవుతాయని) పెట్టుకోవడం ............ నవ్వు వస్తుందిప్పుడు...... బట్ అప్పుడు ఎంతటి అమాయకత్వం....... ఆ అమాయకత్వం వెనుక ఆనందం, నేడు చేసే పనులలో వుండవెందుకనీ? ఆనాడు ఏ చింతనలు, చింత లేని మనస్సుకీ నేడెందుకు ఇంతటి తాపం? ఆనాడు లేని సందేహాలు, సంకోచాలు, సంఘర్షణలు  నేడెందుకు మనతో ఆడుకుంటున్నాయి? అప్పుడు ఏ పని చేయాలన్పించినను ఏ ఆలోచనలేకుండా హాయిగా చేసేయడమే...... మరి ఆనాడు లేని వెరపు, ఆలోచనలు ఈనాడు ఎందుకనీ?
బాల్యం వరం, యవ్వనం వివిధ కామనలు(కోరికలు), మధ్యస్తం తపనలు, వృద్ధాప్యం అనుభవాల జ్ఞాపకాలు ......... ఇదా జీవితం........ కాదు కాదు .........
జీవనమజిలీ_________ ఆనందంగా వుండాలి....... అందంగా వుండాలి........ ప్రాపంచికంగా పారమార్ధికంగా తృప్తికరంగా వుండాలి..........
అలా జీవించాలంటే ఏం చేయాలి........
ఇది నా స్నేహితురాలి సందేహమే కాదు, నాది, నాలాంటి మరికొందరిది కూడా -

బాల్యమందు మనది కల్మషం లేని, కోపతాపాలాంటి ఏ భావాన్ని మోయక నిర్మలంగా ఉండే మనస్సు. స్వార్ధంకు తావులేని స్వచ్ఛత. మనం మనలాగే స్పష్టంగా ఉండేవారం. మన బలపమో, పెన్సిల్ లో ప్రక్కవారు లాక్కుంటే కాసేపు కోపంతో తిట్టుకున్నా, మన పలక విరిచేసారని ఒకర్ని కొట్టినా అది ఆ కాసేపే! ఏదీ మోసేవారం కాం. మన సహజత్వముకు (ఆనందంనకు) దగ్గరగా ఉండేవారం. అందుకే ఆనందం మన దగ్గరే ఉండేది. 

మరి ఇప్పుడో?
మనతో పాటు పెంచుకున్న అభిప్రాయాలు, కల్పించుకున్న ఆలోచనలు, అలవర్చుకున్న అలవాట్లు, ఏర్పరుచుకున్న స్వభావాలు. మనం మనలాగా కాకుండా ఎన్నో ముసుగులు మద్య మనల్ని మనం కట్టేసుకుంటున్నాం. సహజత్వంనకు దూరంగా ఉంటున్నాం. మనస్సునిండా మోయలేని బరువులను వేసేస్తున్నాం. సహజసిద్ధమైన ఆనందమును అనవసర ఆలోచనలతో మనకు మనం దుఃఖంగా మలచుకుంటున్నాం. 
ఉదాహరణకి మనల్నీ, మనచుట్టూ ఉన్నవారిని గమనిద్దాం -

కొందరు తోటివారిని నమ్మరు. అపనమ్మకాలా నడుమ అన్నింటినీ సందేహిస్తూనే సతమతమౌతారు. తాము మాత్రమే నమ్మకస్తులైనట్లు, నిజాయితీపరులమన్న భావన. ఇటువంటి తత్త్వం వలన ఏదీ సాధించలేం. ఏదో ఒకటి రెండుసార్లు చెడు అనుభవాలు ఎదుర్కున్నంతమాత్రానా తోటివారిని నమ్మకపోవడం సముచితం కాదు కదా? వీరిది అపనమ్మకపు ముసుగు. ఇలానే వుంటే తమని ఎవరూ నమ్మరని గ్రహించి ఈ తత్త్వమును మార్చుకోగల్గినప్పుడే ఆనందంను ఆస్వాదించగలం.

కొందరు అంతా తమకే తెలుసన్న అహంభావనతో ఉంటారు. తాము చేసిందే సరైనదన్న భావన వీరిది. ఈ అహంభావం అసంతృప్తినే మిగుల్చుతుంది. తామే తెలివైనవారమన్న అహంభావన ఇక్కట్లునే కల్గిస్తుంది. ఇటువంటివారు ఇతరుల అభిప్రాయాలను అర్ధం చేసుకోరు. తప్పు ఉన్నా తమది తప్పుకాదనే అంటారు. తమది తప్పూ అని మనస్సాక్షిగా తెలిసినా బయటికి అంగీకరించక తమని తాము సమర్ధించుకునే ప్రయత్నంలో తమ ఆనందమును కోల్పోవడంతో పాటు ఇతరులను బాధపెడతారే తప్ప తమ మూర్ఖత్వమును వీడరు. కాన్ఫిడెన్సు అవసరమే కానీ, ఓవర్ కాన్ఫిడెన్సు అనర్ధదాయకమని గ్రహించని మొండితనం వలనే ఆనందమును దూరం చేసుకుంటారు. వీరిది అహంకారపు ముసుగు. అందుకే అంతా తమకే తెలుసన్న అహంకారమును వీడాలి. పట్టువిడుపులు, సర్దుబాటులు, పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవడాలు అలవర్చుకుంటేనే జీవితం ఆనందమయం.

కొందరు తమ అభిప్రాయాలకు, ఆలోచనలకే పరిమితమౌతారే తప్ప క్రొత్తభావాలకు చోటివ్వరు. తోటిమిత్రులు చెప్పినా మారడానికి ఇష్టపడరు. ఎప్పుడూ నేను నేనుగానే ఇలానే ఉంటాను. మారను, అని తమ భావాలతో తమకి తామే సంకెళ్ళు వేసుకొని బంధీలౌతారు. కానీ, మానవ జీవనగమనమే అనేక మార్పులమయం. పుట్టినప్పుడు ఉన్నట్లే జీవితాంతం ఉండలేం కదా. 'మనిషిలో వుండే అద్భుతమైన విషయాలన్నింటిలోనూ, తనని తాను మార్చుకోగలడమన్నదే  అమోఘమైన గొప్పశక్తి' అని ఓ మహర్షి అంటారు. సృష్టిలో మార్పు అనివార్యం. మానవుడు ధ్యానిగా, ధ్యాని యోగిగా, యోగి జ్ఞానిగా పరిణామం చెందుతూ చివరికి ఏ మార్పులేని స్థితికి వచ్చి పరమాత్మను చేరుకోవాలి. గొంగళిపురుగు మారితేనే కదా సీతాకోకచిలుక అవుతుంది. అలానే మార్పు అనేది మానవునికి అనివార్యమని గ్రహించక ప్రవర్తించడం తగదు.  మంచికై మారినప్పుడే ఆనందం పొందగలం.

కొందరు చాలా తెలివిగా అంటుంటారు, ఈ దేహం ఏ కారణంగా వచ్చిందో, ఏ బాధ్యతలు నిర్వర్తించడానికి వచ్చిందో??? ఈ శరీరంతో ఏర్పడిన బంధాలను, నా భాద్యతలను సక్రమముగా నిర్వర్తించడమే తప్ప 'నేను' అంటూ లేను, 'నేను' అన్నది భగవంతునికే అర్పించేశాను, నా భాద్యతలను నిర్వర్తిస్తూ నాపై ఆధారపడినవారికి అభివృద్ధి తేవడమే తప్ప నాకంటూ ఏ కోరికలు లేవు, నా చిరునవ్వుని  సైతం మరిచిపోయాను ఏనాడో అని అంటారు. అలాగని భగవతార్పణ భావనతో ఆనందంగా వుంటారా అంటే ఊహు.... మానసికంగా అలసిపోతారు, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటారు. మెట్టవేదాంతం విన్పిస్తారే తప్ప పరిణితి వీరిలో ఉండదు. పరిణితితో కూడిన ప్రాపంచిక పారమార్ధిక జీవనగమనమే కదా ఆనందమును ఇచ్చేది. వ్యక్తిత్వవికాసమే ఆనందమయ జీవితానికి పునాది. మన వ్యక్తిత్వమును అందంగా ఆనందంగా మలచుకోవాలంటే స్వచ్ఛత, సదవగాహన, సచ్చీలం, సంస్కారం, సంయమనం, సహకారం, సత్యం, స్పష్టత, సద్గోష్టి, సన్మార్గం, సదాశయం, సత్సంకల్పం, సహనం, సంతోషం, సరళత్వం, సమానదృష్టి, సేవాదృక్ఫదం లాంటి సద్గుణాలను స్వాగతించాలి. ఇవన్నీ మన సహజగుణాలే. ఇవన్నీ మన అంతరంగంలోనే వున్నాయి. కాకపోతే మనమేసుకున్న ముసుగులను తొలగించుకుంటే చాలు; ఆనందమే ఆనందం.

బాధపెట్టాలన్న ఉద్దేశ్యం లేకున్నా, ఒకోసారి మన మాటలు, చేతలు ఇతరులకు బాధను కల్గించవచ్చు. కొందరు మన చిన్నతప్పును కూడా భూతద్దంలో చూస్తారు. ఓ గిరి గీసి వెలివేస్తారు. తప్పు చేయని మానవుడు ఉంటాడా? మానవుడిలా మాధవుడు వెలివేస్తే? తోటిమానవుడినే మనం క్షమించలేనప్పుడు, భగవంతున్ని క్షమించమని ప్రార్ధించడం తగునా? మన తప్పుని గ్రహించిన మరుక్షణం మరల ఆ తప్పుచేయకుండా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. అలానే మనం చేసినా తప్పు వలన ఎవరైనా బాధపడితే వారిని క్షమాపణ అడగాలి. ఇది చిన్నతనమో, ఓటమో అని అనుకోకూడదు. ఇది పరిణితి కల్గిన మనస్సుకు నిదర్శనం. అప్పటికీ మనల్ని క్షమించక ఇంకా వారు తప్పుపడితే ఆ తప్పుపట్టినవారే ఆ తప్పుల భారాన్ని మోస్తారు. తప్పుని ఒప్పుకున్నవారు శత్రువుల్ని మిత్రులుగా మార్చుకోగల సమర్ధులు. తప్పుని ఒప్పుకున్నా క్షమించలేనివారు మిత్రుల్ని శత్రువులుగా మార్చుకునే దుర్భలులు. సమర్దులే ఆనందంగా జీవిస్తారు.

కొందరు తమకి వ్యతిరేకంగా చిన్న సంఘటన జరిగినా చాలు - అంతవరకు కనబరచిన ప్రేమా, నమ్మకాలను ఒదిలేసుకొని అశాంతిని వారు పొందడమే కాకుండా చుట్టూ వున్నవారికీ పంచేస్తారు. వీరిలో పరిణితి ఎక్కడ ఉంది? ఆనందం దుఃఖమూ మన చేతల్లోనే వున్నాయి. ఆనందం మనకు దూరంగా లేదు, ఆనందంనకు మనమే దూరంగా ఉంటున్నాం అని గ్రహించి మన గుణాల్ని సరిదిద్దుకుంటే ఆనందం మన చెంతనే ఉంటుంది.

జీవితంలో జరిగిపోయిన సంఘటనలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఆలోచనలని గతముయందే నిలిపితే మన అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. జ్ఞాపకాలు గుదిబండలుగా మారి మనస్సులో మోయనిబరువై నిలుస్తాయి. అలానే భవిష్యత్తు గురించి ఎంతగానో ఊహిస్తూ గాలిలో మేడలు కట్టేస్తుంటారు. ఇదీ నిరాశనే నింపేస్తుంది. అలా కాకుండా ఒక్కొక్క క్షణాన్ని గుర్తిస్తూ, ఆ క్షణంలో మనం ఏం చేస్తున్నామో ఆ పనియందు సంపూర్ణంగా ఉండగలిగితే ఆనందమే కదా. జీవితంలో ఆనందం ఏం చేస్తున్నారన్న దానిబట్టి ఉండదు. చేస్తున్న పనిని ఇష్టంగా చేస్తున్నారన్న దాంట్లో వుంటుంది. ఏ పనినైనా ఇష్టంగా, పరిపూర్ణమైన శ్రద్ధతో చేస్తే ఆనందం మన సొంతమౌతుంది. ఇక్కడ చిన్నప్పుడు మా మాస్టారుగారు చెప్పిన ఓ కధ జ్ఞాపకం వస్తుంది. మానసికంగా అలసిపోయిన ఓ వ్యక్తి ఓ సాధువు చెంతకు వెళ్లి ప్రశాంతతగా జీవించాలనుకుంటున్నాను, అందుకు ఏం చేయాలి అని అడగగా, చెప్తాను గానీ, కాస్తా నిల్చొని, ఈ నీళ్ళపాత్రను తొణకనీయకుండా నేను వచ్చేంతవరకు చేతిని మార్చకుండా పట్టుకో, క్రిందకు దించకు అని చెప్పి లోపలికి వెళ్లి ఎంతసేపటికీ రారు. ఈ వ్యక్తి చెయ్యి తిమిరిఎక్కినను ఓ పావుగంట పట్టుకొంటాడు. మరో పదినిముషములు చేయ్యిలాగేస్తున్న పట్టుకొని, ఆపై పట్టుకోలేక వదిలేసి హమ్మయ్య అని అనుకుంటుండగా, సరిగ్గా ఆ సమయానికే సాధువు వచ్చి, నీ మనస్సు కూడా ఇలాంటిదే, దానిని పట్టుకొని నీవున్నంతకాలం ప్రశాంతత ఉండదు, దానిని వదిలేయ్...సుఖపడతావ్ అని!

కొందరు అతిగా కోరుకుంటారు. పరిమితిగా కోరుకోడంలో తప్పులేదు కానీ, అతిగా ఆశపడడం తప్పు. కోరికలు అవసరాలు వరకు పర్వాలేదు. అంతకు మించి మనస్సు వెళితే అహంకార మమకారాలు ఎక్కువౌతాయి. అందుకే అవసరానికి మించి కోరుకోవడం కూడా దుఃఖమే. స్వార్ధంకై కాకుండా పరోపకార్ధమై కోరుకోవడంలోనే ఆనందం ఎక్కువ. అలానే శాశ్వతమైనవాటికీ, క్షణికమైన వాటికీ మద్య తేడాను వివేచనతో తెలుసుకొని ప్రవర్తించడమే ఆనందంనకు నాంది.

మనిషి సంఘజీవి. ఇతరులతో అవసరరాలుంటాయి. కొందరు చిన్న చిన్న విషయాల్లో కూడా ఇతరుల భావాలతో విభేదించి అశాంతిని పెంచుకుంటారు. తమ మనస్సులో ఏముందో చెప్పరు. బయటికి మౌనంగా ఉంటారు కానీ, మనస్సులో ఎన్నో భావసంఘర్షనలను అనుభవిస్తారు. మనస్సుని నొక్కిపెడుతూ ఎన్నో సందేహాలను పెంచుకుంటారు. వారి చేతల్లో వారి అశాంతిని కనబర్చుతారు. అలాకాకుండా మనసారా మాట్లాడుకుంటే ఆనందం తాండవించదా? 

మన జీవితమంతా మన ఆలోచనల ఫలితమే. మన ఆలోచనలే మన రూపకర్తలు. ఇతరులపట్ల మనకుండే భావాలు మన ఆలోచనల పైనే ఆధారపడి వుంటుంది. ఇది మన స్వభావాన్ని ప్రతిఫలింపజేస్తుంది. ఒకొకరు అర్ధం చేసుకునే తీరు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి ఇతరుల భావాలను అర్ధంచేసుకొని పరస్పరం గౌరవించుకుంటూ నడుచుకోవాలి. అలాగే మంచి మంచి ఆలోచనలతో చెడు ఆలోచనలను అధిగమించాలి. ఇతరుల కర్మలను మనం నియంత్రిచలేము గానీ, మనల్ని మనం నియంత్రిచుకోగల్గితే మనతోపాటు ఇతరులకు కూడా మంచే జరుగుతుంది. భగవంతుడు మనకు ఎలాంటి లోటును కలిగించలేదు. లోటు మన మనస్సులోనిది మాత్రమే. సుఖదుఃఖాలు మన మనస్సులోనివే కాని బయటివికావు. ఇష్టాయిష్టాల ఎన్నికలో సర్దుబాటు తత్వమును కలిగి వుండడం, అవగాహనతో అందంగా మన జీవితాల్ని మలుచుకోగల్గడం మన చేతుల్లో పనే. ఇది సక్రంగా చేస్తే ఆనందం మన దగ్గరే వుంటుంది. 

"ఓ మనిషీ! నువ్వేది నీవెంట తీసుకెళ్ళలేవు. నీవెంట తీసుకెళ్లగలిగేదాన్ని కొంతైనా సమకూర్చుకో" అన్నది బుద్ధుని బోధ. మన వెంట తీసుకెళ్లగలిగినవి దయార్ధమైన ఆలోచనలు,మాటలు, చేతలు మాత్రమేనని ఆయనంటారు. మన మహర్షుల ఉపదేశంకూడా ఇదే. సద్గుణాలే మన వెంట వస్తాయి. అందుకే సద్గుణాలను ఆచరణలో పెడితే చాలు - ఆనందం మనతోనే! మనలోనే!!

"తేరే ఘూంఘట్ ఫట్ ఖోలో, రామ్ మిలేగా" 
                                                   - కబీర్
నీ ముసుగు తొలగించుకో, రాముడు లభిస్తాడు.



28, నవంబర్ 2012, బుధవారం

ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు

ప్రకృతిలో పరమాత్మతత్త్వం ప్రతిబింబిస్తుంది. ప్రకృతిలో ప్రతీది సృష్టికర్త నియమానుసారం నడుస్తూ, సృష్టికర్త సందేశాన్ని సకల మానవాళికి అందిస్తుంది. ప్రకృతితో సహజీవనం చేసే పశుపక్షాదులు కూడా భగవంతుడు తమని సృష్టించినప్పుడు ప్రాసదించిన సహజగుణంలోనే ఉంటూ, సృష్టికర్త సందేశాన్ని తెల్పుతాయి. అవన్నియూ ఎలా జీవించాలో, ఏం నేర్చుకోవాలో మానవునికి తెలియజేస్తునే వుంటాయి. 
భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, నీరు, అగ్ని, గాలి, నది, సముద్రం, పక్షులు, చెట్టు,పువ్వు............... అన్నీ మానవావళి శ్రేయస్సుకీ, మానవజన్మ సార్ధతతకు కావాల్సిన సందేశాలను తమ మనుగడ ద్వారా ఇస్తూనే వుంటాయి. అది ఎలాగో ఓసారి పరిశీలిద్దాం. 
                                                               భూమి
          
             గుండెలో గుచ్చినను భరించి ప్రతిఫలంగా పంటలను, పుష్ప ఫలవృక్షాలను, ప్రాసాదిస్తూ, అలానే, మలమూత్రాలను విసర్జించినను, త్రొక్కివేస్తున్నను, ఎంతో నష్టం కష్టం కల్గిస్తున్నను క్షమత్వంతో సహనంగా ఉండడం ద్వారా - క్షమత్వమును, ఓర్పునూ, భూతదయను కల్గివుండాలన్న సందేశం "భూమి"ది.

                                                             ఆకాశం

            వచ్చి పోయే మేఘాల వలన మలినపడకుండా, సూర్యచంద్రులు, నక్షత్రాలు, వాయువు తనతో ఉన్నా, వాటితో ఎలాంటి సంగత్వం ఏర్పరుచుకోకుండా, నిర్మలంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా వచ్చే పోయే ఆలోచనలతో అంతఃకరణమును మలినపరుచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని, ఎన్ని బంధాల మద్య ఉన్నా  వాటితో సంగత్వం కల్గియుండక నిర్మలంగా వుండాలన్న సందేశం "ఆకాశము"ది. 

                                                             సూర్యుడు

             ఒక చిన్న మడుగైనా, పిల్లకాలువైనా, నదైనా, మహాసముద్రమైనా అన్నింటిలో ఒకేలా ప్రతిబింబిస్తూ, అలానే, నీళ్ళ కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కన్పించడం ద్వారా - మానవుడు సమత్వదృష్టి కల్గియుండాలని, అలానే పరమాత్మ ఒక్కడే అయినా అనేక శరీరములయందు ఆత్మగా గోచరిస్తాడన్న జ్ఞాన సందేశము "సూర్యుడు"ది.

                                                             చంద్రుడు

             వెలుగూచీకటలతో వృద్ధిక్షయాలను పొందడం ద్వారా - జీవితంలో సుఖదుఃఖాలు సహజమనే సందేశం "చంద్రుని"ది.
                                                               నీరు

           ఎటువంటి మలినాలైనను వాటిని శుద్ధిచేసి తాజాదనమును, నిగారింపును తీసుకురావడం ద్వారా - మానవుడు కూడా మనోమాలిన్యాలను తొలగించుకొని శుద్ధత్వము కల్గియుండాలన్న సందేశం "నీటి"ది. 
                                                                అగ్ని

            స్థూల మాలిన్యాలని హరింపజేసి, ప్రకాశిస్తూ, కారణ రూపాన్ని విడిచిపెట్టడం ద్వారా - మానవుడు కూడా కర్మపాశాలను హరింపజేసుకొని భక్తిజ్ఞానంలతో ప్రకాశించాలన్న సందేశం "అగ్ని"ది. 

                                                              గాలి

         అన్నిచోట్ల తిరిగినను, అన్నింటిని స్పృశించినను అన్నింటిని ఎక్కడికక్కడే విడిచిపెట్టేస్తూ, అంతటా ఉన్ననూ ఏదీ అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటూ, అలానే తను ఉన్నచోట వాతావరణమును చల్లగా, ఉల్లాసంగా ఆహ్లాదంగా మార్చుతూ, అందరిలో జీవాన్ని నింపడం ద్వారా - మానవుడు కూడా అహంకారరహితంగా ఏదీ అంటించుకోకుండా తామరాకుపై నీటిబొట్టులా నిస్సంగుడై జీవించాలని, అలానే ఉన్నచోట అందరిని ఆనందంగా వుంచుతూ, ఉల్లాసంగా జీవించాలనే సందేశం "గాలి"ది.
                                                              నది

       తాను ఎక్కడ యున్నదో పట్టించుకోక పర్వతమైన, లోయైనా, వంకలైనా, డొంకలైనా, రాళ్ళరప్పల సందులైనా ఏమాత్రం తేడా లేకుండా ప్రవహిస్తూ, తనకి మూలమైన సముద్రాన్ని చేరేంతవరకు ప్రయాణిస్తూనే వుంటూ, పత్రపుష్పాదులు, చెక్కముక్కలు, చెత్తా చెదారములు, చిరు చిరు ప్రాణులు ప్రవాహంలో తనతోపాటు తీసుకువెళ్తూ, తనలో పాలుపోసినా, చెత్తను పడేసిన సముద్రంలో కలిసేంతవరకు ప్రవహించడమనే తన సహజలక్షణమును వదలకపోవడం ద్వారా - మానవ జీవితం కూడా పరవళ్ళుతో ప్రవహించే తనలాంటిదేనని, ఎన్ని అడ్డులు ఉన్నా వాటిని పట్టించుకోక గమ్యం చేరేంతవరకు గమనమును సాగించాలన్న సందేశం "నది"ది.

                                                            సముద్రం

            అలుపు లేకుండా తీరాన్ని తాకాలని ప్రయత్నించే అలలు ద్వారా, మరియు ఎన్ని నదులు తనలో ప్రవేశించుచున్ననూ పొంగిపోర్లిపోకుండా, అలానే నదులు తనలో చేరక ఎండిపోయినను తాను వట్టిపోకుండ ఉండడం ద్వారా - ఎన్ని సంపదలు తనని చేరుతున్న పొంగిపోక, అలానే ఏ సంపదలు చేరకపోయినా కృంగిపోకుండా హెచ్చుతగ్గుల స్థితి యందు స్థితప్రజ్ఞతో గంభీరుడై, అనుకున్నది సాదించాలనే పట్టుదలతో మానవుడు ఉండాలన్నది "సముద్ర" సందేశం.
                                                          పక్షులు

          కిలకిలారావాలతో ప్రతిక్షణం ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా పరిపూర్ణంగా జీవించడం ద్వారా మానవుడు కూడా ప్రకృతి లోనే ఉంటూ, ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలన్న సందేశం "పక్షుల"ది.

                                                          చెట్టు

         తన చెంతకు ఎవరొచ్చినా తరతమ భేదం లేకుండా, హెచ్చుతగ్గుల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదులా, మానవులా అన్న తారతమ్యం లేకుండా నీడను, పండ్లను ఇవ్వడం ద్వారా మానవుడు నిస్వార్ధ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం "చెట్టు"ది.

                                                           పువ్వు

          మొక్కపై అలరారుతూ అందంగా వికసించి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కల్గిస్తూ, వాడిపోయక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలన్న సందేశాన్నిస్తుంది "పువ్వు".

కానీ, మానవుడు వీటిని ఎంతవరకు గుర్తిస్తున్నాడు?
అన్నీ కాకపోయినా ఇందులో ఒకటైనా జీవితాంతం ఆచరిస్తే చాలని పెద్దల వాక్కు.

25, నవంబర్ 2012, ఆదివారం

నాకు తెలిసినంతలో "భక్తి"

ఉదయాన్నే ఓ స్నేహితురాలినుండి ఫోన్...
నీతో మాట్లాడాలి, పది గంటలకు వస్తున్నానని!
అన్నట్లుగానే తన రాక.
కుశలప్రశ్నల అనంతరం -
తనేం అడిగిందో, తన మాటలలోనే ...
భారతీ, నేను నాగురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నాకు కొన్ని సందేహాలున్నాయి. గత కొద్దిరోజులుగా నాలో ఎన్నో భావాల సంఘర్షణ. నా మనో సంఘర్షణనే నీకు చెప్తున్నాను.
శాస్త్ర సహిత పూజాదికాలు, షోడశోపచారాలు, నామస్మరణలు, జపధ్యానాదులు, ఆలయసందర్శనలు, అర్చనాదులు, క్షేత్రదర్శనాలు, తీర్ధయాత్రలు............ ఇత్యాదులన్నీ ఆధ్యాత్మిక గమనంలో భగవంతునిపై భక్తి కుదురుకోవడానికి ప్రధమసోపానాలని కొందరు అంటారు. వీటిని దాటి వెళ్ళే సాధన చేయాలని అంటారు. అందుకు రాజయోగం, హఠయోగం, క్రియాయోగం, కర్మయోగం .......లాంటివి ఉన్నాయిగా, ఏదో ఒక యోగమార్గమును అనుసరించు అని అంటారు. అన్నింటికంటే జ్ఞానయోగం ఉత్తమోత్తమైనదని, జ్ఞానం మాత్రమే ముక్తిని ప్రసాదిస్తుందని కొందరంటున్నారు. వేదశాస్త్రాలు చదివి అనితరసాధన చేసి, జ్ఞానమంటే ఏమిటో తెలుసుకొన్న జ్ఞానవంతులుకేనా ముక్తి? జ్ఞానమార్గంలో ఎంతో అవగాహన, ప్రజ్ఞ, ప్రతిభ, శ్రద్ధా, దైర్యం, దీక్షా, ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, ఆత్మభావనలతో అనుక్షణం 'ఎరుక'లో ఉండాలి. నేను నా సంసారబాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఏ క్షణం కా క్షణం జ్ఞానస్థితిలో ఉండడం నాకు అసాధ్యంగా ఉంది. అభ్యాసం కొలది అదే అలవడుతుందని చెప్పకు. అకుంఠితపట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితముంటుందని చెప్పకు. ఇవన్నీ నేనున్న స్థితిలో నాకు ఆచరణలో కష్టం. అలానే కర్మలాచారిస్తూ, ఆ కర్మఫలాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ చేయాలంటారు. చేస్తున్న ప్రతీపనిని భగవతార్పణ భావంతో అనుక్షణం ఉండలేను. అంతటి ధార్మిక పరిణితి నాకింకా అలవడలేదు. చేసే ప్రతీ పనిని భగవతార్పణ బుద్ధితో ఆచరించలేను. ముందుగా చెప్పినట్లు నేను నాగురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అలాగని భగవంతున్ని విడిచిపెట్టలేను. భగవంతుడంటే అపారనమ్మకం. బట్ అంతటి సాధన నేను చేయలేను. నాకు భగవత్ ప్రాప్తి కావాలి. వేదశాస్త్రాలు ఇప్పుడు చదవలేను, కంటిదోషం వలన. గురువులను ఆశ్రయించలేను, కుటుంబ నేపద్యంవలన. సత్సంగాలకి వెళ్ళలేను, సమయాభావం వలన. మరి నాకు భగవత్ దర్శనం కాదా? భారతీ! నన్ను, నా తత్వాన్ని, నా తపనని అర్ధం చేసుకొని ఏదైనా సులభమార్గం చెప్పు...... ఆపై దుఖంతో ఏమీ మాట్లాడలేకపోయింది. 

అప్పడు నాకు తెల్సింది ఇలా చెప్పాను - 
ఉంది, మనలాంటి వారికి ఓ సులభమార్గముంది. అదే భక్తిమార్గం. పరమావధిని పొందడానికి సులభమైన సరళమైన సహజమైన మార్గం, భక్తిమార్గమే. పండిత పామర భేదరహితంగా సర్వులకు సాధ్యమైనది భక్తియే. వేదాలు చదవనవసరం లేదు. కుటుంబం అడ్డుకాదు, సత్సంగాలకు వెళ్ళనవసరం లేదు. విద్య, అవిద్య, శాస్త్ర పరిజ్ఞానం, వేదజ్ఞానం ఇవేవి అవసరం లేదు. నీలో భగవంతునిపై అపారప్రేమ అర్పణాభావం ఉంటే చాలు. చైతన్యమును అనుభవంలోనికి తీసుకువచ్చేవి సద్గుణాలే. భగవంతుడిని గొప్పవాడని నోటితో స్తుతించేకంటే ఆ దైవగుణాలలో (సమత్వం, శాంతి, దయ, ప్రేమ, క్షమ, వాత్సల్యం, ఔదార్యం......) కొన్నయినా అలవరచుకుంటూ చేతల్లో ఆచరించడం చేస్తే చాలు. 
గాఢభక్తితో 'శ్రీ' 'కాళ' 'హస్తి' (సాలీడు, పాము, ఏనుగు) తరించలేదా? కన్నప్ప జ్ఞాని కాదుగా, అయినా తరించాడు, తన ప్రగాఢ భక్తిచేతలవలన. భక్తియోగంతో పాటు కర్మ, క్రియా, హఠ, రాజ, జ్ఞాన యోగాలాంటి మార్గాలను కూడా మహర్షులే సూచించారు. ఏ మార్గమును ఎవరు అనుసరించిన, ఈ మార్గల లక్ష్యం ఒక్కటే. అదే జీవ బ్రహ్మైక్యం. 
ఇక భక్తి అంటే -
భగవంతునిపై ఉండే అన్యచింతన లేని అనన్య ప్రేమ. అదో నిరంతర స్మృతి. బ్రహ్మభావన చేత దేహగతమైన 'నేను' అన్న భావనను తొలగించుకుంటే మిగిలింది ఆత్మే. ఆత్మభావనలో ఉండడమే ఉత్తమభక్తి. ఆత్మానుభవం పొందడానికి ఏ విషయాలైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని వదిలించుకోవడమే భక్తి. అంటే ఆత్మానుభవం పొందడానికి ఆటంకపరిచే దుర్గుణాలను తొలగించుకోవడమే భక్తి. 
సర్వప్రాణులను స్వాత్మయందు, సర్వప్రాణులయందు ఆత్మను చూడడమూ భక్తే. ఇక్కడ ఓసారి నీవు చెప్పిన ఓ విషయం జ్ఞాపకం వస్తుంది. సత్యసాయిబాబా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బాబా అన్న కొన్ని మాటలు నీవే చెప్పావ్. "మట్టిలో ఎన్ని మలిన పదార్ధాలు చేరిఉన్నా, దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు, అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టదైవాన్నే చూస్తారు. అట్లే ప్రతీమనిషిలోని మంచిని మాత్రమే చూడండి, చెడుని చూడకండి" అని. ఇటువంటివి చదివి ఆచరించడం భక్తి, అనుక్షణం ఎరుకలో ఉంచుకోవడం జ్ఞానం.

నీలో తపన ఉంది, కావున.... అన్య చింతన మాని అనన్య భక్తితో పరమాత్మను తెలుసుకో. భక్తి రసామృతమును గ్రోలి ముక్తినే వద్దనుకునే భక్తులున్న (రామదాసు లాంటివారు) పుణ్యభూమి మనది. జ్ఞానమార్గం ద్వారానే కాదు భక్తిత్వం ద్వారా ముక్తిత్వం పొందవచ్చు. ఇది నేనంటున్నది కాదు. భక్తి వైశిష్ట్యం గురించి ఎందఱో చెప్పారు. 
భగవాన్ రమణమహర్షి వద్దకు ఒకరు వచ్చి రామ, కృష్ణ విగ్రహాలు తెచ్చి ఇవ్వగా - "జ్ఞానం గురించి ఎంతైనా చెప్పగలం, భక్తి గురించి ఏం చెప్పగలం?" అని కన్నీరు పెట్టుకున్నారు. 'జగత్తు - జీవుడు - ఈశ్వరుడు' మనఃకల్పితం అని చెప్పిన శ్రీ రమణుల నోటినుంచి వచ్చిన పలుకులివి. చూశావా......ఇది భక్తి పారవశ్యం.
వివేకానందుడు కూడా ఓసారి ఇలా చెప్పారు - "కర్మకంటే, జ్ఞానంకంటే యోగం కంటే భక్తి అత్యున్నతం. కారణం, ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించినవి. భక్తి అంటే దానికదే ప్రతిఫలం, అదే సాధన, సాధ్యమూ" అని.
అలానే  కాకభుశుండి భక్తిమార్గ వైశిష్ట్యం గురించి ఇలా చెప్తారు - 
భక్తి మహిమను ఎరింగియు, దానిని విస్మరించి, కేవలం జ్ఞానమునకై శ్రమలతో సాధన చేయువారు తమ ఇంటిలోని కామధేనువుని కాదని, పాలకై జిల్లేడుచెట్టును వెదుకుచు తిరుగువారగుదురు, అని! వివరంగా ఆ కధనం చెప్పనా?


కాకభుశుండిని ఓసారి గరుత్మంతుడు, 'జ్ఞానంతో సమానముగా ఏదియును లేదనియు, సజ్జనులు, మునులు, వేదపురాణాలు తెల్పుట సువిదితం. ఓ కృపానిధీ! భక్తిజ్ఞానమార్గముల భేదమేమి? అది నాకు వివరింపుడు అని కోరగా -
అంతట కాకభుశుండి ఇలా చెప్తారు -
"ఓ ఖగశ్రేష్టా! ఈ రెండునూ సంసారిక దుఃఖములను బాపును. కాకపొతే ఈ రెండింటి మద్య కొంత భేదమున్నది. అది సావధానంగా వినుము. 
జీవుడు ఈశ్వరుని అంశయే. కావున జీవుడు శాశ్వతుడు, చేతనుడు, నిర్మలుడు, స్వభావతః సుఖనిధానం. అట్టి జీవుడు మాయావశుడై, చిలుకవలె, కోతివలె తనకు తానే బంధంలలో చిక్కుపడుచుండును. ఈవిధంగా జడచేతనములు ముడివడియున్నవి. ఈ ముడినుండి బయటపడి ముక్తిని పొందుట మిక్కిలి కష్టము. ఆ కారణమున జీవుడు జననమరణచక్రములో చిక్కుపడును. జీవుని హృదయంలో మోహమనెడి అజ్ఞానాంధకారం దట్టముగా అలుముకొనియుండును. అందువలన ఆ ముడి కనబడదు, విడవడదు. 
భగవత్కృపచే సాత్వికశ్రద్ధ అనెడి అందమైన ఆవు హృదయమనెడి ఇంటిలో నివసించినచో, అది వేదోక్తమైన జపతపోవ్రతయమనియమాది కల్యాణప్రదమైన ధర్మాచరణమను పచ్చగడ్డిని మేసినప్పుడు ఆస్తికభావమనెడి దూడలను పొంది, దాని పొదుగునుండి పాలు రాసాగెను. నివృతి మార్గం (విషయవాసనా ప్రపంచంనుండి విముక్తి) ఆవు వెనుక కాళ్ళకు కట్టుత్రాడు. విశ్వాసమే దోహనపాత్ర. నిర్మలమైన మనస్సుయే పాలను పితికెడిదాసుడు. ఖగరాజా! ఈ విధంగా పరమధర్మమయపాలను పిదికి, వాటిని నిష్కామభావమనెడి 'మంట'పై బాగుగా కాగబెట్టవలెను. క్షమసంతోషములనెడి వాయువులు ఆ పాలను చల్లార్చును. ధైర్యం శమం వాటిని పెరుగుగా చేయును. తత్త్వవిచారమనెడి కవ్వమునకు దమమనెడి స్థంభమును ఆలంబనముగా జేసి, ప్రసన్నత్వమనెడి కుండలో ఆ కవ్వమును చేర్చి, సత్యం, మధురవచనములనెడి త్రాడును ఆ కవ్వమునకు చుట్టవలెను. పిదప ఆ త్రాడు సహాయమున కవ్వంతో ఆ పెరుగును మధింపవలెను. అప్పుడు దానినుండి వైరాగ్యమనెడి శుద్ధమనోహర పవిత్రమైన వెన్న వచ్చును. అప్పుడు యోగాగ్ని యందు సత్కర్మలనెడి ఇంధనములతో ఆ వెన్నను కాచవలెను. మమతయనెడి మురికి మాడిపోయి, జ్ఞానమనెడి నెయ్యి మిగులును. అప్పుడు నిశ్చలబుద్ధితో దానిని చల్లార్చవలెను. విజ్ఞానరూపమైన బుద్ధి స్వచ్చమైన ఆ నెయ్యిను పొంది, చిత్తమను ప్రమిదలో నింపవలెను. సమతయను సెమ్మను సిద్ధపరచి, దానిపై ఆ ప్రమిదను భద్రముగా నుంచవలెను. జాగ్రత్స్వప్నసుషుప్త వ్యవస్థలును, సత్త్వరజోస్తమోగుణములును అనెడి ప్రత్తినుండి తురీయావస్థ యనెడి శుభ్రమైన దూదిని తీసి, దానితో చక్కనివత్తిని సిద్ధపరచవలెను. ఆ వత్తిని జ్ఞానమనెడి నేతితో తడపవలెను. ఈ విధంగా తత్త్వజ్ఞానమనెడి తేజోమయమైన దీపమును వెలిగించవలెను. దానిని సమీపింపగానే అరిషడ్వర్గములనెడి శలభములు (దీపపు పురుగులు) మసియై పోవును. 'సోహమస్మి' (పరబ్రహ్మమే నేను) ఇది అఖండమైన జ్యోతి. అదియే జ్ఞానదీపముయొక్క ప్రచండదీపశిఖ. ఆత్మజ్ఞానమనెడి సుఖప్రదమైన సముజ్జ్వలప్రకాశం వ్యాపించినప్పుడు సంసారబంధములకు మూలకారణమైన భేదరూపభ్రమలు తొలగిపోవును. అవిద్య యొక్క ప్రబల పరివారమైన మోహం మొదలగు తమస్సులు పటాపంచలగును. అప్పుడు ఆ విజ్ఞాన రూపమగు బుద్ధి ఆత్మానుభవ ప్రకాశమును పొంది, హృదయమనెడి ఇంటిలో కూర్చొని, జడచేతనముడిని విప్పివేయును. అంతట జీవుడు కృతార్ధుడు అగును. కానీ, ఖగరాజా! ఆ ముడి విడిపోవుచున్నట్లు తెలియగనే మాయ మరల అనేక విఘ్నములను కల్పించును. అది సిద్ధులనెడి పెక్కు అంతరాయములను పంపును. అవి వచ్చి బుద్ధిని ప్రలోభపరుచును. ఆ ప్రలోభములు తమ కొంగుగాలితో జ్ఞానరూపశిఖను ఆర్పివేయును. ఒకవేళ జీవుని బుద్ధి వికసించి ఈ ప్రలోభాలకు లొంగనిచో, దేవతలు విఘ్నములను సృష్టించెదరు. హృదయమనెడి గృహమునకు ఇంద్రియములనెడి కిటికీలు కలవు. అట్టి ప్రతీ కిటికీపై దేవతలు కూర్చుందురు. విషయములనెడి వాయువులు వచ్చుటను గమనింపగానే వారు ఈ కిటికీలను పట్టుబట్టి బలంగా తెరచెదరు. ఈ గాలులువలన విజ్ఞానదీపం ఆరిపోవును. ముడి విడిపోదు సరికదా, ఆత్మానుభవప్రకాశం కూడా ఆరిపోవును. విషయపవనములచే బుద్ధి వికలమైపోవును. చేసిన సాధన అంతయూ వమ్మైపోవును. ఏలననగా ఇంద్రియములకును, వాటి అధిష్ఠానదేవతలకును జ్ఞానం రుచింపదు. వారికి విషయభోగముల యందే సర్వదా ఆసక్తి మెండు. బుద్ధియు విషయభోగములచే కొట్టబడినచో జ్ఞానదీపం ఆరిపోవును. ఈ దీపం ఆరిపోవుటవలన జననమరణపరంపర క్లేశాలు తప్పవు. ఈవిధంగా ఘణాక్షరన్యాయమున జ్ఞానం ప్రాప్తించినను దానిని రక్షించుకొనుటలో అనేక కష్టములు ఉన్నవి. ఓ ఖగేశా! ఈ మార్గమునందలి సాధకుల దీక్ష ఏ క్షణమైనను సడలవచ్చును. ఈ మార్గమును నిర్విఘ్నముగా అనుసరించువారే అతిదుర్లభమైన పరమపదమును చేరుదురు. జ్ఞానమార్గమున కైవల్యమును పొందుట అత్యంత క్లిష్టకార్యం. కానీ, ఓ ఖగరాజా! దుర్లభమైన ఆ ముక్తియే సరళమైన భక్తిమార్గమున పొందవచ్చును. ఎట్టి యత్నమూ, శ్రమయూ లేకుండగనే జననమరణ పరంపరకు కారణమైన అవిద్య భక్తితత్పరులనుండి దూరమగును. భక్తి మహిమాన్వితమైన సుందరచింతామణి. దీనిని హృదయమున ధరించువారు స్వయంగా అహర్నిశలు ప్రకాశమానులగుదురు. వీరికి నెయ్యి, వత్తి, దీపమూ అవసరం లేదు. మోహమనెడి దారిద్యం వీరిని సమీపించలేదు. ఏలననగా ఈ చింతామణి స్వయంప్రకాశం. లోభమనెడి వాయువు దానిని ఆర్పజాలదు. దానికాంతితో అవిద్య అనెడి గాఢ అంధకారం పటాపంచలగును. మదాది దీపపుపురుగుల సమూహము పరాజితమగును. భక్తి పరిపూర్ణహృదయుని చెంతకు కామక్రోధాదిదుష్టులు రానేరారు. లోకమును పీడించునట్టి మానసజాడ్యములు ఈ మణిని ధరించువారిని పీడించవు. ప్రేమతో అన్వేషించువారే ఆనందనిధియైన ఈ భక్తి మణిని పొందగలరు" అని.
ఇలా నా అవగాహన మేరకు, నాకు తెలిసినంతలో భక్తి గురించి తనకి చెప్పాను. తను వెళ్ళాక దీనినే మరోసారి స్మరిస్తున్నాను, ఇలా స్మరణ లో -

నిజమే కదా .....  
లోపల ఉన్న సద్ వస్తువుతో అనుసంధానం చేసేది భక్తే. సద్ వస్తువును సదా స్మరించడమే సద్భక్తి. ప్రగాఢమైన భక్తే పరిణామక్రమంలో జ్ఞానంగా ఫరిడిల్లుతుంది.


భక్తిరసామృతం గ్రోలిన భక్తులు భగవత్ప్రేమానందంలో తేలియాడుతూ ఇలా కోరుకుంటారు -
న ధనం న జనం న సున్దరీం 
కవితాం వా జగదీశ కామయే 
మమ జన్మని జన్మ నీశ్వరో 
భవతా ద్భక్తి రహైతుకీ త్వయ 
                               (శ్రీకృష్ణచైతన్య విరచితం, శిక్షాష్టకం) 
(నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరులు వద్దు, కవిత్వం వద్దు, జన్మజన్మాంతరాలలో నీపట్ల అహేతుక భక్తే నాకు కావాలి)