భారతీ! పాండురంగ శతకంలో పద్యాలు చదువుతూ ఆశ్చర్యానందములతో పులకించిపొయాను. ఓ భక్తుని భావపరంపరలు ఏమని చెప్పను? నేను చదివిన ఆ కొన్ని పద్యాలు నీకోసమని వ్రాసుకొచ్చానని నా నెచ్చలి ఇచ్చిన అమూల్యపద్యాలు చదివి పరవశమయ్యాను. ఆ పద్యాలను 'స్మరణ'లో పదిలపరచుకుంటున్నాన్నిలా -
భగవంతుడు నిరాకారుడు అయినా సాకారుడుగా, నిర్గుణుడు అయినా సగుణుడుగా భక్తులకై అవతరించు ఆత్మీయుడు. అటువంటి సర్వాంతర్యామిని త్రికరణశుద్ధిగా ఆరాదించే భక్తుని మనోభావనలు అనంతం, అద్భుతం.
అట్టి సర్వేశ్వరునిని ముందు ఓ భక్తుడు జోలె సాచి అర్ధిస్తున్నాడిలా -
తినలేదే? దృపదుని తనయ కొరకు,
ఆర్తితో కుసుమమ్ము నర్పించి మొరలిడ
రాలేదే? వే కరిరాజు కొరకు,
పండుదినుటె గాదు పై పొట్టు సైతం
మ్రింగలేదే? విదురాంగనకయి,
నోరూర బుడిశెడు నీరమున్ గైకొని
త్రావలేదే? రంతిదేవు కొరకు,
ఏమిగని యారగించితో శ్యామలాంగ
అట్టి ప్రేమను భిక్షగా బెట్టుమయ్య
జోలెసాచితి నీ ముందు జాలితోడ
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!!
భగవంతునిపై భక్తునికున్న ఆరాధనే కాదు, భక్తునిపై భగవంతునికున్న అనుగ్రహం కూడా అనంతమే, అద్భుతమే. భక్తులు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు. భక్తునికై పరుగులు తీస్తాడు. భక్తుని మనోభావసుధను గ్రోలి భక్తునికై సేవకుడుగా మారతాడు. తనని సేవించే భక్తులకై పరుగులు తీసే పరమాత్మను సేద తీరమంటాడిలా -
ఏకనాధుని యింట పాకాది కార్యముల్
జేసి కావడి నీళ్ళు మోసి మోసి,
ప్రేమన్ జనాబాయి పిలిచిన నటకేగి
వేడుకతో పిండి విసిరి విసిరి,
శ్వేతవాహను పైన ప్రీతితో రణమున
లీలగా రధమును తోలి తోలి,
ఆర్త జిజ్ఞాసువు లర్ధార్ధులెందరో
మొరలిడ వారికై తిరిగి తిరిగి,
ఎంత శ్రమనొంది యుంటివో యే మొరమ్ము
దాచు కొందును హృదయాన తాల్మితోడ
విశ్రమింపుము క్షణమైన విమల చరిత
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!!
భగవంతుడు నిష్క్రియుడు, నిర్విశేషుడు, నిర్లిప్తుడు అయినను సృష్టి స్థితి లయ కారకుడు. సర్వవ్యాపకుడు, పరిపూర్ణుడు, మహిమాన్వితుడు. అటువంటి పరమాత్మను తనకు తానుగా తెలుసుకోలేనని, తనపై కరుణతో తనకు తానుగా(భగవంతుడు) తానే తెలియబడాలన్న సత్యాన్ని గ్రహించి, ప్రార్ధిస్తాడిలా -
నిన్నెరుంగగ మాకు కొన్ని గుర్తులు జెప్పి
మూగదై శ్రుతి మౌనమును వహించె,
వేనోళ్ళ బొగిడిన విభవాదియే గాక
శేషింప తానాదిశేషుడయ్యె,
నిన్నెరింగిన వారలన్న తెల్పుచు తత్త్వ
మిదమిద్ధమని నిరూపించరైరి,
అంతరంగములోన నెంత యోచించిన
తెలిసినట్లౌ నేమి తెలియకుండు,
నలవి గాదయ్య బహు జన్మములకునైన
వేగ కృపతోడ బ్రోవుమో వేదవేద్య
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!!
ఆకమనీయమూర్తి వికచాద్భుత సృష్టికి మొల్చి మొక్క పూ
రిప్లయితొలగించండిరేకులు విచ్చి కాంతులు పరీమళముల్ వెదజల్లు తీరుగా
ఆ కరుణాంతరంగుడు తనంతట నంతట గానుపించు న
స్తోక నిరంతర స్మరణతో కను విందగు ‘ వాడు ‘ భారతీ !
మాస్టారు గారు,
రిప్లయితొలగించండినమస్తే!
సరళంగా సత్యాన్ని తెలియజేయడంలో మీకు మీరే సాటి.
మీ ప్రతీ స్పందనా నాకు అపురూపమూ, అమూల్యము.
Dhanyavadamulu BHAARATHI gAru !
రిప్లయితొలగించండి