24, మార్చి 2015, మంగళవారం

ఒకప్పటి మధురజ్ఞాపకం "శ్రీశైల శిఖరదర్శనం"లో అంతరార్ధం

క్రిందటి టపాకు కొనసాగింపు ... 

అపారమైన భక్తివిశ్వాసాలుంటే తప్పకుండా తరిస్తాం ... అని అంటూ, అందుకు ఉదాహరణగా మాస్టారుగారు  చెప్పిన కధ ఇది -

మహాశివరాత్రి రోజున పార్వతిదేవి పరమశివుణ్ణి ఇట్లడిగెను - సర్వేశ్వరా! 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే' అను శాస్త్రవాక్యమొకటి కలదు కదా. శ్రీశైలశిఖరమును దర్శించినవానికి పునర్జన్మ లేదని చెప్పినది నిజమైనచో, ఈ  దినం ఎన్నియో  వేలమంది జనులు శ్రీశైలపర్వతంనకు వచ్చియున్నారు. వీరందరికీ శిఖరదర్శనం అయినది. మరి వీరందరూ ముక్తులయ్యెదరా? అని ప్రశ్నించగా -
సంపూర్ణ విశ్వాసం వుండిన అట్లగును. ఈ విషయమై రేపటిదినం నీకు చూపెదను. నేను మిక్కిలి ముదుసలి బ్రాహ్మణ రూపమును ధరించెదను. నీవు అతి వృద్ధురాలగు బ్రాహ్మణి వేషమును పూనవలసినది. ఈ రాత్రి శిఖరదర్శనం చేసి ఈ జనులు వెళ్ళుచుండెడు దారిలో బురదమయమగు నొక కోనేటిలో నేను పడియుండి ప్రాణం పోయేలాగున నటించెదను. వచ్చిన వారందరినీ పతిభిక్ష పెట్టవలసినది, వేదములు కడవరకు చదివి, వేదార్ధమును చక్కగా నెరిగిన ఈ వృద్ధబ్రాహ్మణుడు నా పతిదేవుడు. ఈయన లోతైన ఈ గుంటలో స్నానార్ధమై వెళ్ళి పడిపోయెను. ఈయనను రక్షించండి అని ప్రార్ధించు. ఎవరైనా నన్ను బయటకు తీయుటకై దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యలారా! ఆయన పాపం నశించినవారు. పాపం గలవారెవరైనా ఆయనను తాకినచో వారపుడే మరణించెదరని చెప్పవలసిందిగా పరమశివుడు తెలిపెను. 
మరునాడు ఉదయం గుంపులు గుంపులుగా వచ్చుచుండు జనసమూహమును జూచి, భవానిదేవి రోదిస్తూ, తన భర్తను రక్షించి, పతిభిక్ష పెట్టమని  వేడుకుంటుండగా, కొందరు ఆ వృద్ధబ్రాహ్మణుని రక్షించుటకై దగ్గరకు వెళ్ళునప్పుడు, ఈయన పాపం నశించిన పుణ్యాత్ముడు, పాపం గలవారు తాకినచో అప్పుడే చనిపోవుదురని చెప్పగా, దగ్గరకు వెళ్ళినవారు మనకి ఎందుకులే అనుకుంటూ, తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆ సమయంలో కళావంతులలో చేరిన పరిశుద్ధాత్మరాలగు నొక నారీమణి వృద్ధురాలగు ఆ బ్రాహ్మణస్త్రీతో 'నీవు దుఃఖపడవలదు, నాకు ఈత వచ్చును, నేను మీ పతిని దరిచేర్చేదను' అని చెప్పి రక్షించుటకు వెళ్ళబోవునప్పుడు, ఈ బ్రాహ్మణి పై చెప్పిన మాటలను చెప్పగా, ఛ ఛ, నీకు శాస్త్రవచనాలు యందు విశ్వాసం లేదు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అను శాస్త్రవాక్యం పట్ల నీకున్న నమ్మకం ఇదేనా? నాకు ఇక పాపమెచట? నేను నిన్నటిరోజున శివరాత్రి ఉపవాసముండి, జాగరం చేసి, శివపూజ చేసి, శ్రీశైల శిఖరదర్శనం చేసి, పాపరహితురాలినై వచ్చుచున్నానని చెప్పి, ఆ గుంటలో దుమికెను. దూకి వృద్ధబ్రాహ్మణుని రక్షించాలని పరమశివుణ్ణి తాకగానే, ఆయన సాక్షాత్తు శంకరరూపమున దర్శనమిచ్చి, ఆ యువతిని విమానం నెక్కించుకొని కైలాసమునకు తీసుకుపోవునట్లు కధ చెప్పిరి. 
ఏమిటీ, కళావంతుల స్త్రీకి అంతటి యోగమా? అని అత్తయ్యగారు ప్రశ్నించగా -
వృత్తిని కాదు చూడవలసినది, ఆమె భక్తిని, శాస్త్రవచనాలు పట్ల అణుమాత్రమైన అపనమ్మకం లేని అపారమైన నమ్మకాన్ని. అందుకే అంటారు, భగవంతుడు విత్తం కాదు చిత్తంను చూస్తాడని. మనిషిని కాదు మనస్సుని గమనించు. బహుశా ఆమె పూర్వజన్మ సుకృతం వలన ఆమెలో అపారమైన భక్తివిశ్వాసములు ఏర్పడ్డాయి. అందుకే ఇంతటి యోగం ప్రాప్తించింది అని మాస్టారుగారు చెప్పగా ... 
బాగుందండీ, మరి ఆన్నిటికీ అంతరార్ధం ఉందంటారే, మరి ఈ శిఖర దర్శనంకు అంతరార్ధం కూడా చెప్పండి అని మరల అత్తయ్యగారు ప్రశ్నించగా -
ఆ... వుంది, ఉందనే పెద్దలు చెప్తుంటారు. శ్రీశైలశిఖరం దర్శన మాత్రంచే జన్మరాహిత్యం కల్గితే ఇన్ని సాధనలు ఎందుకు? వెళ్లి చూసిస్తే సరిపోతుంది కదా, అది కాదు అసలు నిజం. యదార్ధం ఏమిటంటే, శిఖరమంటే గుడిగోపురం కాదు. శిరశ్శిఖర ముచ్యతే అన్న మాటను ప్రామాణికంగా పరిశీలిస్తే, శిరస్సే శిఖరం. ఎవరైతే తన శిరస్సునందు శ్రీశైలున్ని దర్శిస్తారో వారికి పునర్జన్మ వుండదని ఆ వాక్యానికి అర్ధం. ఇది నిజమైన సాధన. ఇది నిజమైన యోగం. మనస్సునూ, మనో ప్రక్రియలను కట్టి వేస్తే యోగసాధన సాధ్యమై పరమేశ్వరుణ్ణి దర్శనమై జన్మరాహిత్యం కల్గుతుంది అని చెప్పారు. చక్కటి విషయాలు తెలిపిన మాస్టారుగారికి నమస్సులు. 




5 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. పెద్దల మాటలలో, శాస్త్ర వచనాలలో సత్యం అవగాహన అయితే ఆ అలౌకిక ఆనందం అపారం.
      మీ స్పందనకు ధన్యవాదములండి.

      తొలగించండి
  2. ఇలాంటి అసలైన వివరాలు జనానికి తెలియక పోవడం వల్ల దైవమూ _ భక్తీ ఈ రెంటినీ మోసగాళ్ళు వ్యపారమయం చేస్తున్నారు .
    దరిమిలా అపనమ్మకం పెరిగి పోతూ ఉంది దైవంమీద .
    భారతి గారూ ,
    మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు .
    అభినందనలు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టారు గారు!
      నమస్తే! బాగున్నారా?
      చాలాకాలానికి మీ వ్యాఖ్యను చూడగానే పుట్టింటివారిని చూసినంత ఆనందం కల్గింది.
      మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి

      తొలగించండి
  3. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    సంభాషణ అంతరాయానికి మన్నించగలరు, మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

    రిప్లయితొలగించండి