శ్రీరామనవమి అనగానే గుర్తుకువచ్చే ఒకప్పటి నా మధుర జ్ఞాపకం -
శ్రీరామనవమి నాడు ...
రామాలయం దగ్గర సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించేవారు. మధ్యాన్నం కల్యాణం చేసి, సాయంత్రం లక్ష్మణ, అంజనేయుల సమేతంగా సీతరాముల్ని పల్లకిపై ఊరేగించేవారు.
ఎప్పటికంటే కాస్తా ముందుగానే పలహారాలో, భోజనమో... అమ్మమ్మ పెట్టేసి ... చక్కగా తినేయండమ్మా, రాములోరు మన ఇళ్ళకు వస్తారు, మరి చూడాలి కదా, త్వరగా తినేయాలి మరి ... అనేవారు. త్వరగా తినేసి వీధిలోనికి పరుగులు... రాములోరికే ఎదురుచూపులు ...
రాములోరు వస్తారు కాసేపటిలో అన్న సూచనగా వీధి తొలి మలుపులో ... ముందుగా డప్పులు ... ఆ వెనుక తప్పెట గుళ్ళు... ఆ వెన్నంటే ఎడ్లబండిపై రామయ్య, సీతమ్మ, లక్ష్మణస్వామి, ఆంజనేయుడు వేషం వేసుకొన్న వారు, ఆ వెంబడే సన్నాయి మేళతాళాలతో రాములోరి పల్లకి ... ఎదురెళ్ళి స్వాగతించడం ... మా గుమ్మంలోనికి సీతారాములవారు రాగానే, సాయంత్రం నుండి అందంగా అల్లిన పూలమాలలును మేమూ, కానుకలు ప్రసాదాలు పెద్దవారు సమర్పించడం ... వీధి చివరింటివరకు పల్లకి వెంబడి వెళ్ళడం ... చిన్నా పెద్దా మదినిండా భక్తితో, ధన్యులయ్యామన్న తృప్తితో అర్ధరాత్రి వరకు రాముని గురించి పెద్దవారు చెప్తుంటే వినడం ... ఓహో ... అదో మధురానుభూతి.
ఒక కొడుకు తల్లితండ్రులను ఎలా గౌరవించాలో,
ఒక శిష్యుడు గురువుగారితో ఎలా మసలుకోవాలో,
ఒక అన్నయ్య తన తమ్ముళ్ళతో ఎలా నడుచుకోవాలో,
ఒక భర్త భార్య పట్ల ఎలా ప్రవర్తించాలో,
ఒక మిత్రుడు మిత్రులను ఎలా ఆదరించాలో,
ఒక రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ...
అలా ఆచరించి ధర్మాన్ని చాటిచెప్పిన ధర్మమూర్తి నా "రాములోరు".
మహర్షయిన వాల్మికి అయిన,
పడవ నడిపిన కిరాతజాతికి చెందిన గుహుడైన,
శబరకులానికి చెందిన శబరైనా,
పక్షయిన జటాయువైన,
వానరడైన సుగ్రీవుడైన,
రాక్షసుడైన విభీషణుడు అయినా,
చిరుజంతువయిన ఉడుత అయినా ...
అందర్నీ ఒకేలా ఆదరించి గౌరవించిన మర్యాదరాముడు నా "రాములోరు".
ధర్మం, సత్యం, కారుణ్యం, క్షమ, వినయం, విదేయత, ప్రేమ, సాత్వికం, సహనం, సమత్వం, త్యాగం, ధైర్యం, స్థితప్రజ్ఞ .
ఆదర్శపురుషుడుగా అగుపించి అందరి ఆరాధ్య దైవమయి, అంతరాల్లో అంతర్యామై ఆత్మారాముడుగా భాసిల్లుతున్నాడు నా "రాములోరు".
ధర్మావలంబంవలన మానవుడు మాధవుడు ఎలా కాగలడో విషదపర్చేదే రామాయణం.
మానవుడు మాధవుడు ఎలా కాగలాడో ... నిరూపించిన మార్గదర్శకుడు నా "రాములోరు".
ఈ విషయమై వివరణ ఇచ్చేముందు ఒకప్పుడు నాలో కదిలాడే కొన్ని సందేహాలను ఇక్కడ ప్రస్తావించడం సముచితం.
కామి గానివాడు మోక్షకామి కాడు ... ఇది లోగడ విన్న మాటైనను, కొందరు దీనిని వక్రీకరించి అన్న మాటలు విన్నప్పుడు మన పెద్దలు ఇలా చెప్పారేమిటి అని బాధపడ్డాను.
స శాంతి మాప్నోతి న కామ కామి ... అన్నది గీతాచార్యుని వాక్కు. (సర్వేంద్రియ సంయమియైన సాధనపరుడైన సత్పుర్షునికే మోక్షస్థితి సాధ్యమవును గాని, కామం గలవానికి సాధ్యం కానే కాదు).
త్యజించవల్సిన కామాన్ని మోక్షంతో ఇలా కలిపి చెప్పడం ఏమిటని ఒకింత అయోమయంగా అనుకున్నా.
అలానే సాధకుడు వర్జించాల్సిన అరిషడ్వర్గములో ఒకటైన కామంతో మోక్షానికి ముడిపెట్టడమేమిటీ అని అనుకున్నాను. కాకపొతే పెద్దల మాటల్లో మర్మం అర్ధంకాకున్నా, అందులో పరమార్ధం ఏదో దాగి వుంటుందనే నమ్ముతానుకాబట్టి, సరే, అర్ధమైనప్పుడే తెలుస్తుందనుకొని వదిలేశాను.
కాలగమనంలో మన వివాహ విశిష్టతలు, పద్ధతులు తెలుసుకుంటున్నప్పుడు తెలిసాయి కొన్ని విషయాలు -
ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్వమైషా నాతిచరితవ్యాః అని కన్యాదానం చేస్తూ (ఈరోజు వరకు నా కూతురిగా వున్న ఈమె నేటినుండి నీ అర్ధాంగి అగుచున్నది. ఈరోజు నుండి ధర్మకార్యాలు ఆచరించటం లోను, ధన సంబంధిత విషయాలలోనూ, కోరికలు తీర్చుకొనుటలోను నా కూతుర్ని అతిక్రమించక మీరిరువురు అన్యోన్యంగా వుండాలని) కన్యాదాత అనగా,
ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతిచరామి (ధర్మమునందు గాని, సంపదల విషయంలందు గాని, శారీరక సుఖవిషయంలందు గాని నిను అతిక్రమించి చరించను) అని వరుడు ప్రమాణం చేసే ఓ అద్భుత ఘట్టముందని. అలాగే ధర్మార్థ కామమోక్షాలను నాలుగింటిని చతుర్విధ పురుషార్ధములని పేర్కొంటారని అర్ధమైంది. ఈ నాలుగింటిని చక్కగా ఆచరిస్తే జీవన సాపల్యమౌతుందని అర్ధం చేసుకున్నాను.
జీవిత పరమార్ధమంతా ఇందులోనే యిమిడివుంది కాబట్టి, ఈ నాలుగింటిని ఓసారి పరిశీలిస్తే ...
ధర్మార్ధ కామమోక్షాలు - ఇవి పురుషార్ధాలు.
మనిషి ధర్మంగా జీవించాలి. ఆ ధర్మంతో అర్ధం సంపాదించాలి. ఆ ధర్మం ద్వారానే సముచితమైన కామనలు (కోరికలు) తీర్చుకోవాలి. ఇక కోరికలలో పడి కొట్టుకుపోకుండా సత్కర్మలు ఆచరించాలి. మోక్షం కోసం ప్రయత్నించాలి. ఇదే మానవ జీవిత పరమార్ధమని భారతీయ సంస్కృతి ప్రబోధం.
ఈ పురుషార్ధాలను ఇదే క్రమంలో చెప్పడంలో కూడా విజ్ఞత, విశేషత వుంది. అత్యంత ప్రాధాన్యతమైన అముష్మికంలను మొదట చివర పెట్టి, ఐహికమైన రెండింటిని మధ్యలో పెట్టారు. ఈ నాలుగింటిలో అర్ధ, కామములు ఐహికం - ఈ రెండూ స్థూలదేహంతో నశిస్తాయి. ధర్మం, మోక్షం అముష్మికం - ఈ రెండింటిలో మరణాంతరం అనుభవం లోనికి వచ్చేది మొదటిదైతే, మరణమే లేదని అనుభవస్థితికి చేర్చేది రెండవది.
అంతేకాక, ఈ నాలుగింటిని చెప్పేవిధంలో కూడా ఓ ప్రత్యేకత వుంది. ధర్మార్ధంను ఓ జంటగా, కామమోక్షాలను ఓ జంటగా చెప్పడంలో అంతరార్ధం ఏమిటంటే -
ధర్మంతో అర్ధాన్ని సంపాదించాలని ... ఈ సంపాదన యోగిస్తుంది. అంతేకాని, కామార్ధం అంటే కామంతో అర్ధాన్ని సంపాదిస్తే అది పతనమే అవుతుంది.
అటుపిమ్మట కొద్ది రోజుల తర్వాత రామాయణం మరోసారి చదివాను. గతంలో కొన్నిసార్లు చదివిన అవగాహనకాని కొన్ని విషయాలు అవగతమయ్యాయి. అప్పుడప్పుడు చదివిన, విన్న రామకధ, ఈ చతుర్విధ పురుషార్ధాలు గురించి తెలుసుకున్నాక చదివినప్పుడు మార్మికత, దార్మికత, దార్శినికత అర్ధమయ్యాయి. ధర్మాచరణతో కూడిన ఆదర్శ జీవనం సాగించిన రాముడు దేముడు ఎందుకయ్యాడో అర్ధమైంది.
'కామార్ధగుణ సంయుక్తం ధర్మార్ధగుణ విస్తారం ...' అని బాలకాండ యందు వాల్మికిమహర్షి అంటారు. కామం, అర్ధం గురించి మితంగాను, ధర్మార్ధగుణం గురించి విస్తారంగా తెలుపుతుంది రామాయణం.
ధర్మగుణంకు ప్రతీక అయిన రాముడు దేముడైతే, భక్తిపరాయణుడు అయినను కామార్ధ ప్రలోభుడయిన రావణుడు ధర్మంచే సంహరింపబడ్డాడు.
శ్రీరాముడు అవతార పురుషుడు అన్న మాటను ప్రక్కన పెట్టి, తన జీవన విధానం గమనిస్తే ఓ సామాన్య మానవునిగా ఎన్నెన్నో కష్టనష్టాలు, అపవాదులు, సుఖసంతోషాలను అనుభవించాడు. సత్కర్మాచరణలతో ధర్మం ఆచరిస్తూ, తద్వారా సక్రమార్జనతో (అర్ధంతో) సత్ కామనలతో (కోరికలతో) మనుగడ సాగిస్తూ ... నిత్య సత్య శాశ్వత ఆనంద మోక్షసిద్ధితో జీవన సాపల్యం ఎలా చేసుకోవాలో తెలియజెప్పేదే రామకధ. మానవుడు మాధవుడు ఎలా కాగలడో తెలిపేదే రామాయణం. అందుకే కదా ... ఊరు ఊరున, వాడవాడలో ... ఒక చోటని ఏముందీ? గూడు గూడులో ప్రతీ గుండెలో కొలువై, అందరి ఆరాధ్యదైవమయ్యారు నా "రాములోరు".
దశరధరాముడుగా జనించి, తొలుత అయోద్యరాముడై, పిదప సీతారాముడై, అపై కొదందరాముడై, ఆటుపై పట్టాభిరాముడై, ఆ తర్వాత ఆదర్శరాముడై, అనంతరం అందరిరాముడై, ఆఖరికి ఆత్మారాముడై విరాజిల్లుతున్నారు "నా రాములోరు".
సర్వేషు రమంతే ఇతి రామః ... అందరిలో రమించే దివ్య చైతన్యమే రాముడు.
రామ అంటే రమణీయుడు. రామనామం రమణీయం, రాముని రూపం రమణీయం, రాముని గుణం రమణీయం, రాముని తత్త్వం రమణీయం, రామచరితం రమణీయం, రామ మహిమ రమణీయం... ఇన్ని రమణీయాల సమాహార స్వరూపుడయిన నా రాములోరిని నిత్యం తలచేవారి మనస్సు రమణీయం, కొలిచేవారి హృదయం అత్యంత రమణీయం... ధన్యణీయం.
మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళు
ర్నాన్యం జానే నైవ జానే న జానే//
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్//
రామనామ మహిమను తెలిపే పరమపావనం - రామనామం