14, ఏప్రిల్ 2016, గురువారం

రాములోరు ...



శ్రీరామనవమి అనగానే గుర్తుకువచ్చే ఒకప్పటి నా మధుర జ్ఞాపకం - 

శ్రీరామనవమి నాడు ... 
రామాలయం దగ్గర సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించేవారు. మధ్యాన్నం కల్యాణం చేసి, సాయంత్రం లక్ష్మణ, అంజనేయుల సమేతంగా సీతరాముల్ని పల్లకిపై ఊరేగించేవారు. 
ఎప్పటికంటే కాస్తా ముందుగానే పలహారాలో, భోజనమో... అమ్మమ్మ పెట్టేసి ... చక్కగా తినేయండమ్మా, రాములోరు మన ఇళ్ళకు వస్తారు, మరి చూడాలి కదా, త్వరగా తినేయాలి మరి ... అనేవారు. త్వరగా తినేసి వీధిలోనికి పరుగులు... రాములోరికే ఎదురుచూపులు ... 
రాములోరు వస్తారు కాసేపటిలో అన్న సూచనగా వీధి తొలి మలుపులో ... ముందుగా డప్పులు ... ఆ వెనుక తప్పెట గుళ్ళు... ఆ వెన్నంటే ఎడ్లబండిపై రామయ్య, సీతమ్మ, లక్ష్మణస్వామి, ఆంజనేయుడు వేషం వేసుకొన్న వారు, ఆ వెంబడే సన్నాయి మేళతాళాలతో రాములోరి పల్లకి ... ఎదురెళ్ళి స్వాగతించడం ... మా గుమ్మంలోనికి సీతారాములవారు రాగానే, సాయంత్రం నుండి అందంగా అల్లిన పూలమాలలును మేమూ, కానుకలు ప్రసాదాలు పెద్దవారు సమర్పించడం ... వీధి చివరింటివరకు పల్లకి వెంబడి వెళ్ళడం ... చిన్నా పెద్దా మదినిండా భక్తితో, ధన్యులయ్యామన్న తృప్తితో అర్ధరాత్రి వరకు రాముని గురించి పెద్దవారు చెప్తుంటే వినడం ... ఓహో ... అదో మధురానుభూతి. 
                                              

                                       
ఒక కొడుకు తల్లితండ్రులను ఎలా గౌరవించాలో, 

ఒక శిష్యుడు గురువుగారితో ఎలా మసలుకోవాలో, 
ఒక అన్నయ్య తన తమ్ముళ్ళతో ఎలా నడుచుకోవాలో, 
ఒక భర్త భార్య పట్ల ఎలా ప్రవర్తించాలో, 
ఒక మిత్రుడు మిత్రులను ఎలా ఆదరించాలో, 
ఒక రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ... 
అలా ఆచరించి ధర్మాన్ని చాటిచెప్పిన ధర్మమూర్తి నా "రాములోరు". 

మహర్షయిన వాల్మికి అయిన, 
పడవ నడిపిన కిరాతజాతికి చెందిన గుహుడైన, 
శబరకులానికి చెందిన శబరైనా, 
పక్షయిన జటాయువైన, 
వానరడైన సుగ్రీవుడైన, 
రాక్షసుడైన విభీషణుడు అయినా, 
చిరుజంతువయిన ఉడుత అయినా ... 
అందర్నీ ఒకేలా ఆదరించి గౌరవించిన మర్యాదరాముడు నా "రాములోరు".  

ధర్మం, సత్యం, కారుణ్యం, క్షమ, వినయం, విదేయత, ప్రేమ, సాత్వికం, సహనం, సమత్వం, త్యాగం, ధైర్యం, స్థితప్రజ్ఞ  ... ఇత్యాది సౌశీల్యాలు మూర్తిభవించిన సుగుణాభిరాముడు నా "రాములోరు". 

ఆదర్శపురుషుడుగా అగుపించి అందరి ఆరాధ్య దైవమయి, అంతరాల్లో అంతర్యామై ఆత్మారాముడుగా భాసిల్లుతున్నాడు నా "రాములోరు". 
ధర్మావలంబంవలన మానవుడు మాధవుడు ఎలా కాగలడో విషదపర్చేదే రామాయణం. 
మానవుడు మాధవుడు ఎలా కాగలాడో ... నిరూపించిన మార్గదర్శకుడు నా "రాములోరు".  
ఈ విషయమై వివరణ ఇచ్చేముందు ఒకప్పుడు నాలో కదిలాడే కొన్ని సందేహాలను ఇక్కడ  ప్రస్తావించడం సముచితం. 

కామి గానివాడు మోక్షకామి కాడు ... ఇది లోగడ విన్న మాటైనను, కొందరు దీనిని వక్రీకరించి అన్న మాటలు విన్నప్పుడు మన పెద్దలు ఇలా చెప్పారేమిటి అని బాధపడ్డాను.
స శాంతి మాప్నోతి న కామ కామి ... అన్నది గీతాచార్యుని వాక్కు. (సర్వేంద్రియ సంయమియైన సాధనపరుడైన సత్పుర్షునికే మోక్షస్థితి సాధ్యమవును గాని, కామం గలవానికి సాధ్యం కానే కాదు).
త్యజించవల్సిన కామాన్ని మోక్షంతో ఇలా కలిపి చెప్పడం ఏమిటని ఒకింత అయోమయంగా అనుకున్నా.
అలానే సాధకుడు వర్జించాల్సిన అరిషడ్వర్గములో ఒకటైన కామంతో మోక్షానికి ముడిపెట్టడమేమిటీ అని అనుకున్నాను. కాకపొతే పెద్దల మాటల్లో మర్మం అర్ధంకాకున్నా, అందులో పరమార్ధం ఏదో దాగి వుంటుందనే నమ్ముతానుకాబట్టి,  సరే, అర్ధమైనప్పుడే తెలుస్తుందనుకొని వదిలేశాను.

కాలగమనంలో మన వివాహ విశిష్టతలు, పద్ధతులు  తెలుసుకుంటున్నప్పుడు  తెలిసాయి కొన్ని విషయాలు -
ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్వమైషా నాతిచరితవ్యాః అని కన్యాదానం చేస్తూ   (ఈరోజు వరకు నా కూతురిగా వున్న ఈమె నేటినుండి నీ అర్ధాంగి అగుచున్నది. ఈరోజు నుండి ధర్మకార్యాలు ఆచరించటం లోను, ధన సంబంధిత విషయాలలోనూ, కోరికలు తీర్చుకొనుటలోను నా కూతుర్ని అతిక్రమించక మీరిరువురు అన్యోన్యంగా వుండాలని) కన్యాదాత అనగా,
ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతిచరామి (ధర్మమునందు గాని, సంపదల విషయంలందు గాని, శారీరక సుఖవిషయంలందు గాని నిను అతిక్రమించి చరించను) అని వరుడు ప్రమాణం చేసే ఓ అద్భుత ఘట్టముందని. అలాగే ధర్మార్థ కామమోక్షాలను నాలుగింటిని  చతుర్విధ పురుషార్ధములని పేర్కొంటారని అర్ధమైంది. ఈ నాలుగింటిని చక్కగా ఆచరిస్తే జీవన సాపల్యమౌతుందని అర్ధం చేసుకున్నాను.
జీవిత పరమార్ధమంతా ఇందులోనే యిమిడివుంది కాబట్టి, ఈ నాలుగింటిని ఓసారి పరిశీలిస్తే ...
ధర్మార్ధ కామమోక్షాలు - ఇవి పురుషార్ధాలు.

మనిషి ధర్మంగా జీవించాలి. ఆ ధర్మంతో అర్ధం సంపాదించాలి. ఆ ధర్మం ద్వారానే సముచితమైన కామనలు (కోరికలు) తీర్చుకోవాలి. ఇక కోరికలలో పడి కొట్టుకుపోకుండా సత్కర్మలు ఆచరించాలి. మోక్షం కోసం ప్రయత్నించాలి. ఇదే మానవ జీవిత పరమార్ధమని భారతీయ సంస్కృతి ప్రబోధం.

ఈ పురుషార్ధాలను ఇదే క్రమంలో చెప్పడంలో కూడా విజ్ఞత, విశేషత వుంది. అత్యంత ప్రాధాన్యతమైన అముష్మికంలను మొదట చివర పెట్టి, ఐహికమైన రెండింటిని మధ్యలో పెట్టారు. ఈ నాలుగింటిలో అర్ధ, కామములు ఐహికం - ఈ రెండూ స్థూలదేహంతో నశిస్తాయి. ధర్మం, మోక్షం అముష్మికం - ఈ రెండింటిలో మరణాంతరం అనుభవం లోనికి వచ్చేది మొదటిదైతే, మరణమే లేదని అనుభవస్థితికి చేర్చేది రెండవది. 
అంతేకాక, ఈ నాలుగింటిని చెప్పేవిధంలో కూడా ఓ ప్రత్యేకత వుంది. ధర్మార్ధంను ఓ జంటగా, కామమోక్షాలను ఓ జంటగా చెప్పడంలో అంతరార్ధం ఏమిటంటే -
ధర్మంతో అర్ధాన్ని సంపాదించాలని ... ఈ సంపాదన యోగిస్తుంది. అంతేకాని, కామార్ధం అంటే కామంతో అర్ధాన్ని సంపాదిస్తే అది పతనమే అవుతుంది. 

అటుపిమ్మట కొద్ది రోజుల తర్వాత రామాయణం మరోసారి చదివాను. గతంలో కొన్నిసార్లు చదివిన అవగాహనకాని కొన్ని విషయాలు అవగతమయ్యాయి. అప్పుడప్పుడు చదివిన, విన్న రామకధ, ఈ చతుర్విధ పురుషార్ధాలు గురించి తెలుసుకున్నాక చదివినప్పుడు మార్మికత, దార్మికత, దార్శినికత అర్ధమయ్యాయి. ధర్మాచరణతో కూడిన ఆదర్శ జీవనం సాగించిన రాముడు దేముడు ఎందుకయ్యాడో అర్ధమైంది. 
'కామార్ధగుణ సంయుక్తం ధర్మార్ధగుణ విస్తారం ...' అని బాలకాండ యందు వాల్మికిమహర్షి అంటారు. కామం, అర్ధం గురించి మితంగాను, ధర్మార్ధగుణం గురించి విస్తారంగా తెలుపుతుంది రామాయణం.
ధర్మగుణంకు ప్రతీక అయిన రాముడు దేముడైతే, భక్తిపరాయణుడు అయినను కామార్ధ ప్రలోభుడయిన రావణుడు ధర్మంచే సంహరింపబడ్డాడు.

శ్రీరాముడు అవతార పురుషుడు అన్న మాటను ప్రక్కన పెట్టి, తన జీవన విధానం గమనిస్తే ఓ సామాన్య మానవునిగా ఎన్నెన్నో కష్టనష్టాలు, అపవాదులు, సుఖసంతోషాలను అనుభవించాడు. సత్కర్మాచరణలతో ధర్మం ఆచరిస్తూ, తద్వారా సక్రమార్జనతో (అర్ధంతో) సత్ కామనలతో (కోరికలతో) మనుగడ సాగిస్తూ ... నిత్య సత్య శాశ్వత ఆనంద మోక్షసిద్ధితో జీవన సాపల్యం ఎలా చేసుకోవాలో తెలియజెప్పేదే రామకధ. మానవుడు మాధవుడు ఎలా కాగలడో తెలిపేదే రామాయణం. అందుకే కదా ... ఊరు ఊరున, వాడవాడలో ... ఒక చోటని ఏముందీ? గూడు గూడులో ప్రతీ గుండెలో కొలువై, అందరి ఆరాధ్యదైవమయ్యారు నా "రాములోరు".

దశరధరాముడుగా జనించి, తొలుత అయోద్యరాముడై, పిదప సీతారాముడై, అపై కొదందరాముడై, ఆటుపై పట్టాభిరాముడై, ఆ తర్వాత ఆదర్శరాముడై, అనంతరం అందరిరాముడై, ఆఖరికి ఆత్మారాముడై విరాజిల్లుతున్నారు "నా రాములోరు".

సర్వేషు రమంతే ఇతి రామః ... అందరిలో రమించే దివ్య చైతన్యమే రాముడు.
రామ అంటే రమణీయుడు. రామనామం రమణీయం, రాముని రూపం రమణీయం, రాముని గుణం రమణీయం, రాముని తత్త్వం రమణీయం, రామచరితం రమణీయం, రామ మహిమ రమణీయం... ఇన్ని రమణీయాల సమాహార స్వరూపుడయిన నా రాములోరిని నిత్యం తలచేవారి మనస్సు రమణీయం, కొలిచేవారి హృదయం అత్యంత రమణీయం... ధన్యణీయం.

మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళు
ర్నాన్యం జానే నైవ జానే న జానే//

                                     
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
                                  పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్//


రామనామ మహిమను తెలిపే పరమపావనం - రామనామం

రామాయణ అంతరార్ధం తెలిపే మోక్షపధం - రామ దర్శనం



24 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మీ చక్కటి వ్యాఖ్యకు ధన్యవాదములు సర్.

      మీకు, మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

      తొలగించండి
  2. nice bharati gaaru..... ramanavami ante e edaadiki aa edaadi kottadaname.. ade kadha,ade kalyaanam,ave talambraalu, eppatikappudu kotte...ramanavami pandillu tenali city lo famous.. ramulavaari kadha manaku aadharsham ... manchi vishayaalu share chesaaru.. sreerama jayam... .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రుక్మిణి జీ! మీ స్పందన సంతోషాన్నిచ్చింది. ధన్యవాదములు మీ వ్యాఖ్యకు.
      మీకు, మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

      తొలగించండి
  3. మనసుకు హత్తుకునేలా వ్రాశారు.
    ఎంతో బాగా వ్రాశారు. ధన్యవాదాలు. ధర్మార్ధ కామ మోక్షాల గూర్చి బాగుంది. చాలా కాలానికి మంచి పోస్టు చదివినట్లైనది.

    చిన్ని సందేశమిత్తు సావధాన చిత్తులై హాయినొంద
    భగవానుడు తండ్రియై అవతరించె కోరు స్వర్గమ్ము భువినిసేయ
    నేటి కలహయుగము కాలవ్రాయ, కనుగొన సాధారణుడు
    తెలిసిన వారికి పుణ్యాలు తెలియని వారికి సున్నాలు అనగ

    రిప్లయితొలగించండి
  4. చక్కటి వ్యాఖ్యతో,
    చక్కటి పద్యంతో,
    చక్కటి మీ స్పందనకు
    మనసార ధన్యవాదములు రమణగారు.

    రిప్లయితొలగించండి
  5. భారతి గారు,
    రాములోరు గురించి బాగా చెప్పారు.

    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  6. రామాయణం:
    ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
    ఒక కొడుకుకి తండ్రి మీద ఉన్న గౌరవం
    ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత
    ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం
    ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
    ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం
    ఒక మనిషిలోని బలం, మరో మనిషి లోని స్వార్ధం, ఇంకో మనిషి లోని కామం...
    ఒకరి ఎదురు చూపులు, మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు,
    అన్ని కలిపి మనిషి మనిషి గా బ్రతకడానికి అవసరమైన ఒక నిఘంటువు.

    శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి


  7. అంతా రామమయం !.. మన బతుకంతా రామమయం !!

    ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే - రామాయణం.

    ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ - రాముడు మనవెంట నడిచిన దేవుడు !

    మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు.

    మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం - రాముడు.

    ధర్మం పోత పోస్తే - రాముడు !

    ఆదర్శాలు రూపుకడితే - రాముడు !

    అందం పోగుపోస్తే - రాముడు !

    ఆనందం నడిస్తే - రాముడు !

    వేదోపనిషత్తులకు అర్థం - రాముడు !

    మంత్రమూర్తి - రాముడు !

    పరబ్రహ్మం - రాముడు !

    లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు - రాముడు !

    ఎప్పటి త్రేతాయుగ రాముడు ?
    ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ??
    అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా - రాముడే.

    చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !

    బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - రామాలాలి - మేఘశ్యామా లాలి.

    మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష.

    మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా.

    వినకూడని మాట వింటే అనాల్సిన మాట - రామ రామ.

    భరించలేని కష్టానికి పర్యాయపదం - రాముడి కష్టం.

    తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు.

    కష్టం గట్టెక్కే తారక మంత్రం - శ్రీరామ.

    విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ.

    అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా !

    వయసుడిగిన వేళ అనాల్సిన మాట - కృష్ణా రామా !

    తిరుగులేని మాటకు - రామబాణం.

    సకల సుఖశాంతులకు - రామరాజ్యం.

    ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన.

    ఆజానుబాహుడి పోలికకు - రాముడు.

    అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - రాముడు.

    రాముడు - ఎప్పుడూ మంచి బాలుడే.

    చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - రామా కిల్డ్ రావణ ; రావణ వాజ్ కిల్డ్ బై రామా.

    ఆదర్శ దాంపత్యానికి - సీతారాములు.

    గొప్ప కొడుకు - రాముడు.

    అన్నదమ్ముల అనుబంధానికి - రామలక్ష్మణులు.

    గొప్ప విద్యార్ధి - రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).

    మంచి మిత్రుడు - రాముడు (గుహుడు చెప్పాడు).

    మంచి స్వామి - రాముడు (హనుమ చెప్పారు).

    సంగీత సారం - రాముడు (రామదాసు, త్యాగయ్య చెప్పారు).

    నాలుకమీదుగా తాగాల్సిన నామం - రాముడు ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).

    కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు.

    నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు.

    చెవులున్నందుకు వినాల్సిన కథ - రామాయణం.

    చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు.

    జన్మ తరించడానికి - రాముడు, రాముడు, రాముడు.

    రామాయణం పలుకుబళ్లు

    మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.

    ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.

    చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక రామాయణం.

    జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.

    ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం.

    కబళించే చేతులు, చేష్ఠలు - కబంధ హస్తాలు.

    వికారంగా ఉంటే - శూర్పణఖ.

    చూసిరమ్మంటే కాల్చి రావడం - హనుమ.

    పెద్ద పెద్ద అడుగులు వేస్తే - అంగదుడి అంగలు.

    మెలకువలేని నిద్ర - కుంభకర్ణ నిద్ర.

    పెద్ద ఇల్లు - లంకంత ఇల్లు.

    ఎంగిలిచేసి పెడితే - శబరి.

    ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు.

    అల్లరి మూకలకు నిలయం - కిష్కింధ కాండ.

    విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే.

    పితూరీలు చెప్పేవారందరూ - మంథరలే.

    యుద్ధమంటే - రామరావణ యుద్ధమే.

    ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - రావణ కాష్ఠాలే !

    కొడితే బుర్ర - రామకీర్తన - పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).

    సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.

    బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.

    ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.

    ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.

    ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.

    ఒంటిమిట్టది ఒక కథ..

    భద్రాద్రిది ఒక కథ...

    అసలు రామాయణమే మన కథ.

    అది రాస్తే రామాయణం - చెబితే మహా భారతం

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    సేకరణ : వాట్సప్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతా రామమయం...మన బతుకంతా రామమయం.

      ఏదో ఒక రూపేణ ప్రతివొక్కరు తలచే నామం రామనామం.

      మంచి సేకరణ.

      ధన్యవాదములండి.

      తొలగించండి
  8. శ్రీరామ పట్టాభిషేక చిత్తర్వుతో
    యిళ్ళలో జేరెద రిచటి జనులు
    తొలుదొల్త 'శ్రీరామ'తో మొదుల్ బెట్టక
    యెట్టి వ్రాతలు గనుపట్టవిచట
    పలుమార్లు రాముని ప్రణుతించి ప్రణుతించి
    నిద్రకు జారుట నియతి యిచట
    రామనామమ్ములు రంజిల్ల భజియించి
    మంచాలు దిగుదురు మనుజులిచట

    మరణ శయ్యను గూడ “ రామా “ యనుటను
    మాట గోల్పోవు చున్నను మరువ రిచట
    యిచటి జనజీవనమున మమేకమయ్యె
    రామనామమ్ము , శ్రీరామ రామ రామ .

    రిప్లయితొలగించండి
  9. యిచటి జనజీవనమున మమేకమయ్యే
    రామనామమ్ము, శ్రీరామ రామ రామ

    సత్యమిది మాస్టారుగారు 🙏

    రిప్లయితొలగించండి
  10. రామ భక్తుడు12 మే, 2022 7:07 AMకి

    రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగిపోక తప్పదు.

    శ్రీరాముడు ల౦క కు వెళ్ళటానికి రామసేతువు నిర్మాణ౦ జరుగుతో౦ది.

    వానరులు సముద్ర౦లో రాళ్లు వేస్తున్నారు. అవి తేలుతున్నాయి. ఇద౦తా చూస్తూ...,
    శ్రీరాముడు కూడా కొన్ని రాళ్లు వేద్దామని సముద్ర౦లో రాయిని వదిలాడు.

    విచిత్ర౦గా ఆ రాయి మునిగి పోయి౦ది. సరే అని మరొకటి వేశాడు. అది కూడా మునిగి పోయి౦ది.
    ఇదే౦టి! వానరులు వేస్తే తేలుతున్నాయి. నేను వేస్తే మునిగి పోతున్నాయి. అయినా చూద్దా౦ అని మరో రాయి విడిచాడు. అది కూడా మునిగి పోయి౦దట.

    ఇదే౦టని శ్రీరాముడు హనుమను మరి కొ౦దరిని అడిగాడు.
    *స్వామి!*

    *మేము వేసే రాళ్ళ మీద మీ నామ౦ రాస్తున్నా౦. మీరు రాయలేదు కదా* అన్నారు.

    అదే౦టి.

    నేను స్వయ౦గా వేస్తున్నాను కదా...నా నామ౦ రాస్తేనే తేలితే నేను వేస్తే మునిగి పోవట౦ ఏమిటీ? ఎ౦దుకలా?* అన్నారు స్వామి.

    అందుకు హనుమ ఇలా సమాధానం చెప్పారు.
    *స్వామి!*

    *మీరు ఆ రాయిని విడిచి పెట్టేశారు. రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగి పోక తప్పదు. అదే జరుగుతో౦ది స్వామి* అని.

    అందుకే.......

    రామ నామాన్ని జపి౦చ౦డి. ధర్మ౦గా జీవించ౦డి.

    *జై శ్రీరామ్...*.
    సేకరణ వాట్సప్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందంగా ఉన్నా రామాయణం ప్రకారం అసమంజసం. ఒక్క నీలుడు వేసిన రాళ్ళే సముద్రంలో తేలుతాయి. వానరులు ఎవరు విసరినా తేలవు. రామనామం వ్రాసి వేస్తే తేలుతున్నాయని రామాయణం చెప్పలేదు. మూలానికి పొరపాటు వ్యాఖ్యానం చేయకూడదు మన కల్పన ఎప్పుడూ.

      తొలగించండి
    2. మనమింకా వాల్మీకీ, వ్యాసుడూ అంటూ తెలుసుకోవట్లేదుగానీ.. వాళ్ళకంటేమించినోల్లు మనమధ్యలో వున్నారు. రామభక్తుడుగారిలాంటి టాలెంటున్నోల్లు సొంతగా రాయడం మొదలుబెడితే.. అద్భుతమైన రచనలు మనం చూడోచ్చు.

      తొలగించండి
    3. రామభక్తుడు12 మే, 2022 6:05 PMకి

      అజ్ఞాత గారు
      మూలాలు నాకు తెలియవు. నాకు తెలిసిందంతా సర్వమూ రామమయం. మూలాల్లో లేకపోయినా ఋషిపోక్తాలని, తాత్త్వికుల కధలని, పెద్దల బోధలని కొన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి. పామరుల మనస్సులో నాటుకోవాలని కొందరు కొన్ని కధలు కల్పన చేయవచ్చు. వారిది ప్రజలలో భక్తిభావం పెంపొందించాలనే సదదుద్దేశ్యం. మనల్ని పెడదారిని పట్టనివ్వకుండా, సవ్యదరిలో భక్తిమార్గంలో నడిపించే ప్రయత్నం వారిది.
      దానిని గుర్తిస్తే మంచిది. గతంలో నా అసలు పేరుతోనే ఆధ్యాత్మిక జిజ్ఞాసను పెంపొందించే కామెంట్స్ ఇంచుమించుగా అప్పటి అందరి బ్లాగ్స్ లో పెట్టేవాడ్ని. బట్...మేధావి వర్గంవారు శల్య పరిక్షలు, శంకలు...అందుకే గత కొంతకాలంగా అజ్ఞాతగా కొందరి బ్లాగ్లో, రామభక్తుడిగా మీ బ్లాగ్లో పెడుతున్నాను. కొందరయితే తాము నమ్మిన దైవమే దైవమని, మిగతా దేవుళ్ళు దేవతలను పూజించడం శుద్ధ దండగ అని వ్రాయడం తప్పు కాదుగానీ, నేను చేస్తున్న సత్ ప్రయత్నం తప్పా? పండితవర్గం వారికి ఓ నమస్కారం. పామరులకు పిట్టకధలుగా చెప్పి, వారిలో భక్తిభావాన్ని పెంచాలనే నా ప్రయత్నమును గుర్తించి నా వ్యాఖ్యలను ప్రచురిస్తారో లేదో మీ ఇష్టం.
      బహుశా నా ఈ వ్యాఖ్య ప్రచురణ కాదేమో.

      తొలగించండి
    4. రామభక్తుడు12 మే, 2022 6:09 PMకి

      చిరు డ్రీమ్స్ గారు,
      అవహేళనో అభినందనో నాకు అర్ధం కాలేదు కానీ, థాంక్స్ మీ కామెంట్ కు

      తొలగించండి
    5. అవహేళన కాదూ, అభినందనా కాదు. ఆలోచన. మీరూ ఒకసారి ఆలోచించండి.

      తొలగించండి
    6. రామాయణం ప్రకారం అసమంజసం అన్న వ్యాఖ్య నాదే నండీ. అజ్ఞాతగా ఎందుకు వచ్చిందో తెలియదు.
      ..శ్యామలీయం.

      తొలగించండి
  11. భారతి గారు, మోక్షేచ నాతిచరామి అని ప్రమాణం చేయించరండీ. చతుర్ధపురుషార్ధం ఎవరికి వారే స్వయంగా సాధించుకోవలసినదే. మొదటి మూడుపురుషార్ధాల విషయంలోనే తప్నక ప్రమాణం. చేయిస్తారు. ఇక్కడ పురుషార్ధము అంటే మగవారికి సంబంధించిన అని కాదండీ. పురము అంటే ఇక్కడ ఉపాధి. పురే తిష్ఠతి ఇతి పురుషః అని జీవుని సూచించే మాట. చతుర్విధపురుషార్ధాలనూ ఆడా మగా అందరూ సాధించవలసినదే. మొదటి మూడింటిని భర్త భార్యతో కలిసి సాధించాలి. మోక్షం ఎవరికి వారే సాధించుకోవాలి కాబట్టి ఆవిషయంలో ప్రమాణం చేయించరు భర్తచేత.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పును గుర్తించి సరిచేసానండి.
      అజ్ఞాతగా కాకుండా మీ పేరును తెలియజేస్తే బాగుండేది.

      తొలగించండి
    2. ఎందుకు అజ్ఞాతగా వఛ్చిందో తెలియదండీ.
      -- శ్యామలీయం

      తొలగించండి
    3. బహుశా వ్యాఖ్య పెడుతున్నప్పుడు ఎక్కడో పొరపాటు జరిగి ఉండవచ్చండి.

      అప్పుడప్పుడు నాకు తెలియని విషయాలను తెలియజెప్తూ, సరైన మార్గదర్శకం చేస్తున్నందుకు మనసార ధన్యవాదాలండి 🙏

      తొలగించండి
    4. మీరు కూడా అనేక సంగతులు ప్రస్తావిస్తూ ఉంటారు. వాటిలో నాకు తెలియనివీ ఎన్నో ఉంటున్నాయి.

      బోధయంత పరస్పరం అన్నమాట.

      తొలగించండి