18, జూన్ 2019, మంగళవారం

సరళ సాధన

సాధన ఎలా సాగించను? సంఘర్షణలను ఎలా అధిగమించవచ్చు? సరళంగా సహజంగా సాగే సాధన తెలపరా? అహంకారం, అహం గురించి కూడా తెలియజేయండి... అంటూ, గతంలో నేను పెట్టిన ఓ సాధారణ సాధకురాలి స్వగతం....... టపాను చదివిన వసుంధరగారు అడిగిన ప్రశ్నలకు, పలువురు నుండి నేను గ్రహించిన, అనుసరిస్తున్న ఈ సాధనా విధానము, తనకీ సహకరిస్తుందన్న నమ్మకంతో 'సరళ సాధన' పేరిట ఇలా ఓ టపాగా పెడుతున్నాను. 

ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని, ఆధ్యాత్మిక జీవనం సాగించాలనే జిజ్ఞాస ప్రారంభమయ్యాక సాధన ఎలా మొదలెట్టాలి, ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఎలా సాధించాలి, ఎవర్ని ఆశ్రయించాలి, దేనిని అనుకరించాలి, ఎవర్నిఅనుసరించాలి ... ఎన్నో సందేహాలు, ఎంతో సంఘర్షణ. 
ఆధ్యాత్మికమనేది అంతరంగ జీవితానికి సంబంధించినది గానీ, బాహ్య జీవితానికి సంబంధించినది కాదు. 
ఆధ్యాత్మిక పయనం అంటే ఏమిటి? 
తొలుత అపార శ్రద్ధాభక్తులతో కూడిన ఓ దైవ చింతన, మనోశుద్ధతకై యత్నించడం, మానసిక పరివర్తన, పరిపక్వత, మనలోకి మనం చూసుకోవడం, అదే ద్యాస, ఒకే ధ్యానం, శోధించడం... ఆత్మసాక్షత్కారం పొందడం.

ఈ ఆధ్యాత్మిక పయనంలో కొందరు దైవాన్ని ఆలంబనగా తీసుకుంటారు. వీరు ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, పైన భగవంతుడు అనే వాడు ఒకడు గమనిస్తుంటాడనే భావంతో జాగ్రత్తగా సద్భుద్ధితో, సరళస్వభావంతో నడుచుకుంటారు. సేవాతత్పరతతో సత్కార్యాలు చేస్తూ, మనోశుద్ధత పొంది భక్తిమార్గంలో దైవమునకు చేరువవుతుంటారు. మరి కొందరు తమ ఆత్మనే తమ దైవంగా భావించి, తమతో పాటు అందరూ దైవ సమానులేనని, సకల జీవుల్లోనూ భగవదంశ ఉన్నదని భావించి, ఆచరించి ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు. ఇలా ఎన్నెన్నో సాధనామార్గాలు. ఎవరి సాధన వారిది. చివరికి అన్ని సాధనల గమ్యం ఒక్కటే.      
                                                   
                    

ఏ మార్గంలో పయనించిన ఆ పయనం ఆత్మసాక్షాత్కారం కోసమే. ఆ ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే ప్రయత్నమే "ఆధ్యాత్మిక సాధన". అయితే ముందుగా సాధనకు కావాల్సింది మనో నియంత్రణ, అంతఃకరణశుద్ధి.
                                                                                                  
మన మనస్సే మనకు ప్రతిబంధకం. మన వ్యక్తిత్వ విషయవాసనలే ఆటంకములు. మన ప్రవర్తనా సహవాసముల అలవాట్లే  అవరోధములు. అవగాహన లేమే అలజడులు. స్వభావిక దోషాలే రోదనలు. అలాగని సాధన పేరుతో మనస్సును నియంత్రించనవసరం లేదు. మనస్సు ఎప్పుడూ బాహ్యంగా పరుగులు పెడుతుంది. దానికి నిరంతరం ప్రేమతో సద్గుణాలను అలవాటు చేయాలి, భక్తిమాధుర్యంను రుచి చూపిస్తుండాలి, సద్బోధనలను వినిపిస్తుండాలి, వివేకం గురించిన వివరణలు మననం చేస్తుండాలి, విరాగంను అలవర్చాలి.  
కదలనిరాయిని దేవుణ్ణి చేసింది కదిలే భక్తులే, కదలనిది గొప్పదా? కదిలేది గొప్పదా? అది గ్రహించుకొని, సున్నితంగా ప్రేమగా మనో కదలికలను తగ్గించడమే సాధన. అవసరమైనవారికి చేయూతనివ్వడం,  అందర్నీ ప్రేమతో చూడడం, సర్వాత్మభావనతో మసలుకోవడం,  బాహ్యమును భగవంతునిగా అంగీకరించడం, నిరాడంబర జీవితంలో ఉన్నతమైన భావాలు అలవర్చుకోవడం, దేహగతమైన అంతటినీ భగవంతునికి నివేదించి శరణాగతి భావంతో ఉండడం... ఇలా సరళంగా, సంతృప్తిగా జీవించడమే సమర్ధత కూడిన సాధన. 
       
అంతరశుద్ధి -
అంతరశుద్ధి లేకుండా అంతర్యామిని పట్టుకున్నది ఎవరు?  
మన జీవితంలో అనేక మార్పుల్ని ఆహ్వానిస్తాం. కానీ, మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించం. అంతరశుద్ధికై మనల్ని మనం సరిచేసుకోవాలి, మనలో సంస్కార దోషాల్ని వదులుకోవాలి. నిబద్ధత, నైతికత, నిజాయితీలను అలవర్చుకోవాలి. 

ఇక అహం - అహంకారం 
మొదటిది పారమార్ధికం, రెండవది ప్రాపంచికం. అహం అంటే 'నేను' అని అర్ధం. ఆ అహం ఆకారంతో చేరితే అది అహంకారం. యదార్ధ అస్తిత్వం 'నేను'. 
అపరిమితమైన 'నేను'ని పరిమితమైన మాయ ఉపాధికి చేర్చి చెప్పడం అహంకారం.  
                                         


అహంకారమంటే అదొక స్థితి కాదు, దేహస్మృతి. ఈ శరీరమనోబుద్ధులే నేను అనుకోవటం అహంకారం. అహంకు ఇహం పరం మనేది తెలియదు. తెలుస్తుందల్లా అహంకారంకు మాత్రమే. రాయిని చెక్కి దైవమును చూసే మనం, మనిషిలో దైవమును చూడలేకపోతున్నది ఈ అహంకారం వలననే. అహంకారమనేది సకలవాసనల సమూహము. అహంకారమున్నంతవరకు చావుపుట్టుకులు తప్పవు. శరీరం ఖననమైన స్వభావం ఖననమవ్వదు. అహంకారమనేది అనేక జన్మలనుండి జీవుడిని పెనవేసుకుని వున్నది. అనేకజన్మల అహంకారాన్ని నిశ్శేషంగా నాశము చేయడం శీఘ్రంగా సాధ్యం కాదు. స్వార్ధ రహిత, ఫలాపేక్ష రహిత, వాంఛ రహిత కార్యములు నిర్వహించుటవలన అహంకారం తొలగుతుంది. భగవంతుని పాదాలను భక్తితో ఆశ్రయిస్తే వాసనలు తగ్గుతాయి. మాటకి మాట, చేతకి చేత అనే భావన మనలో లేకుంటే ఎవరి మాటల్ని చేతల్ని పట్టించుకోము. ఈ ఉదాసీనత స్థిరచిత్తంకు దర్పణం. ఆలోచనలు, అలవాట్లు మారితే మనస్సు నెమ్మదిస్తుంది. అహంకారం నశిస్తుంది. మానవ సంబంధాల్లో ఏర్పడే అంతరాలకు, అపార్ధాలకు అహంకారం కారణంగా నిలుస్తుంది. అహంకారంపోతే మానవ సంబంధాలూ... ప్రపంచంతో మన సంబంధ బాంధవ్యాలూ... బాగుండటమే కాదు దైవానుబంధంగా శోభిల్లుతాయి.    
అలానే మనలో అహంకారం తగ్గించే మరో శక్తివంతమైన సాధన ఏంటంటే ఇతరుల అహంకారమునకు ప్రతిస్పందించకపోవడం. 
భగవంతునికి మనకి రెండు అడుగుల దూరమే. నేను, నాది - అహంకారం, మమకారం. ఆ రెండు అడుగులు దాటామో .... జీవన్ముక్తులమే అంటారు పెద్దలు.    
                                                        

మనం తూర్పుదిక్కుకు వెళ్లేకొద్దీ పడమరకు మరింత దూరం అవుతాం కదా. అలాగే మన మనస్సును బుద్ధిని ఎంత మంచిగా మలచుకుంటామో, అంతగా అహంకారం అణుగుతుంది, అరిషడ్వార్గాలు తగ్గుతాయి, అంతరశుద్ధి అవుతుంది, అంతర్యామికి చేరువవుతాం.      
                                                   
సాధకులకు అంతరంగిక స్వీయ నియమం, విచక్షణ  అతిముఖ్యం. సర్వులకు శ్రేయస్సు చేకూర్చాలన్న ఆలోచన మనస్సులోను, సత్యాన్నే పలుకాలనే ఆలోచన వాక్కులోను, ధర్మాన్నే ఆచరించాలనే ఆలోచన కర్మలోను అలవర్చుకుంటూ, సర్వాత్మ భావన అంతరంలో నిలుపుకుంటే చాలు. ఈ భావం బలపడితే మనస్సు స్థిరమౌతుంది. మనస్సు స్థిరమైతే వాక్కు సత్యమౌతుంది. వాక్కు సత్యమైతే చేతలు శుద్ధమవుతాయి. తద్వారా పవిత్రత ప్రవహిస్తుంది. 

సాధకులు చలించని మనస్సును, భ్రమించని దృష్టిని కల్గియుంటూ, వ్యవహారికంలో పూర్తి భావజాగృతిలో శ్రద్ధగా ఉంటూ, ప్రతీక్షణం ప్రతీ చిన్నపనిలో కూడా నాచే, ఇది భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో ఎరుకలో ఉండగలిగినప్పుడే చిత్తశుద్ధి కల్గుతుంది. ఇది  అలవడాలంటే అందుకు కావాల్సింది వివేకం (నిత్యానిత్యవస్తు వివేకం), విరాగం. శ్రద్ధ వివేకము, విరాగంలు అలవడితే గాని విషయాసక్తి నుండి విడుదల పొందలేము. అవగాహనను పెంపొందించుకోలేం. అంతవరకు అర్ధంకాని బోధనలతో విబేధం తప్పదు. అవగాహన అవ్వనంతవరకు ఆవేదన తప్పదు 
                                                   


ఆధ్యాత్మిక జీవితం, ప్ర్రాపంచిక జీవితం అని రెండు వేరు వేరు జీవితాలు ఉండవు. మన జీవన విధానంలోనే రెండూ ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవనం సాగించాలని తలపే జీవితంలో ఓ మలువు. మన సంసార ధర్మాలను, ప్రాపంచిక బాధ్యతలను నిర్వర్తిస్తూ మన దైనందిక కార్యక్రమాలలో ఆధ్యాత్మిక సాధన ఓ అంతర్భాగమైనట్లు అనుసంధానం చేసుకోవాలి. ఏ బంధమూ, ఏ బాంధవ్యమూ ఆత్మవిచారణకు ప్రతిబంధకం కాదు. వాటిని కొనసాగిస్తూ మానసికంగా అన్నింటికీ అతీతమౌతూ ఆత్మకు చేరువ కావాలి. మనోశుద్ధత, నిరాహంకార సాధనలతో ముందుకు సాగాలి. అంతరంగ వివేచనతో సాధన చేస్తే క్రమక్రమంగా ప్రాపంచిక లాలస తగ్గుతుంది. ఏదీ కొద్ది రోజుల్లోసాధ్యం కాదు.  సద్గురువులు, సత్సంగాలు ఊతం ఇస్తాయి. క్రమేణా కాస్త కాస్త ఆధ్యాత్మిక జీవనం గురించి అవగాహన ఏర్పడుతుంది. 
                                                                                                     

ఈ గమనంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, ఆవేదనలు, సమస్యలు, సంఘర్షణలు, అనుభవాలు, అయోమయాలు..... అన్నీ ప్రాపంచిక జీవితానికి అన్వయింపబడి అగమ్యగోచరంగా, అలజడిగా అన్పించిన, ఎంతో అంతర్మధనం జరుగుతున్నా, ఇవన్నీ పారమార్ధిక జీవనంలో వైరాగ్యాన్ని, వివేకాన్ని, భక్తిని, పరమాత్మునిపై పరమప్రేమను పరిక్షించడానికి ఈశ్వరుడు పెట్టే పరిక్షలుగా భావించి సంకల్పమును చెదరనీయక, క్రుంగక, ప్రయత్నం వీడక ఫలితం ఆశించక, పయనం ఆపక, మరింత శ్రద్ధతో, పట్టుదలతో, సంయమనంతో, సమర్ధవంతంగా, ధీశాలిగా ముందుకు పోవడమే సరైన సాధనని ఆధ్యాత్మిక అనుభవజ్ఞుల సూచన. అనేక పరీక్షలు నెగ్గి సాధన చేస్తేగానీ అంతఃకరణ శుద్ధి కాదు. ఎవరికి వారే వారివారి సంస్కారముల ఆధారంగా సాధనామార్గంలను అనుష్టించి ఆత్మసాక్షాత్కారం కలిగేంతవరకు నిర్విరామ సాధన చేయాలి. అప్పుడే భవం నుండి భవ్యం వైపు వెళ్ళగలరు.  




4 కామెంట్‌లు:


  1. నమస్కారమండి భారతిగారు. నాలో అనాసక్తి చోటు చేసుకుంటున్న సమయంలో ఆసక్తిని పెంపొందించేలా రాశారు. నా నమ్మకం వమ్ము కాలేదు. చక్కటి అవగాహన కల్గేటట్లు చేశారు. మీరు రాసింది చదివాక ఆనందంతో నా కళ్ళు వర్షించాయి. ధాంక్సండి.
    ఒక సందేహమండి, అన్నీ వదులుకోవాలని పెద్దలంటారు, మీరేమో ఏ బంధమూ ప్రతిబంధకం కాదని అన్నారు. రెండింటికి పొంతన ఎలా? సాధకులు ఏకాంతవాసులై ఉండాలంటారు. ఇది నిజమేనా?



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే వసుంధర గారు, పెద్దలు చెప్పింది నిశితంగా పరిశీలించి అర్ధం చేసుకోవాలమ్మా. అన్నీ వదులుకోవాలని పెద్దలు చెప్పింది - సాధనకు అడ్డంకమైన మనోమాలిన్యాల్ని. అంతేకానీ, బంధాలూ, బాధ్యతలు గురించి కాదు. మాలిన్యాలు తొలగితే మనోపవిత్రత చేకూరుతుంది, అప్పుడే మనస్సు అణిగిపోతుంది. మనస్సు అణిగిన తర్వాత ఏముంటుంది? అంతా నిస్సంగం.
      మనుజుల మధ్య మసలినా, మనోపవిత్రతను నిలుపుకున్నవారు నిస్సంగులే, ఏకాంతవాసులే. మనోతలంపు ఉన్నవారు ఒంటరిగా ఎక్కడున్నా పరివారంతో ఉన్నట్లే. ఏకాంతమన్నది అంతరస్థితి.

      తొలగించండి
  2. నా పేరు విద్యాసాగర్ . నివాసము విజయవాడ . పైన తెలిపిన ఆధ్యాత్మిక అంశములను చర్చించుటకు ... విచారణకు నా ఫోన్ నెం 7032916995

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదములు భారతిగారు. నిజంగా చక్కటి అవగాహన కల్పించారు. మీకు హ్రుదయపూర్వక నమస్సులు. 🙏

    రిప్లయితొలగించండి