చైత్ర శుద్ధ పాడ్యమి...
శార్వరి నామ సంవత్సర యుగాది...
శార్వరి నామ సంవత్సర యుగాది...
తెలుగు సంవత్సరాది...
ఈరోజు ఆనందంగా గడిపితే సంవత్సరం అంతా ఆనందంగా గడుస్తుంది - ఓ నమ్మకం.
ఈరోజు షడ్రుచుల పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం - ఓ నిజం.
నాకు తెలిసి, పచ్చడి లేకుండా 'ఉగాది'ని మేం స్వాగతించడం ఇదే మొదటిసారి.
కారణం కరోనా.....ఇల్లు విడిచి బయటకు వెళ్ళాలనిపించక...మామిడికాయలు తెచ్చుకోక!
యావత్తు ప్రపంచావళి చర్చించుకుంటున్న ఈ కరోనా వైరస్ గురించి ప్రస్తావించదలచుకోలేదు కానీ, అందరం అవగాహనతో, అప్రమత్తతో, స్వీయ సంరక్షణ, స్వీయ నియంత్రణ, స్వీయ నిర్భందనలతో ఐక్యతగా ఉండడం తప్పనిసరి అని చెప్తాను.
అందరికీ ఓ అభ్యర్ధన 🙏
ఈ వైరస్ అంతమవ్వాలని, అందరికీ ఆయురారోగ్యలు ప్రాప్తించాలని, భగవంతున్ని ఈ వసంత నవరాత్రులు ప్రార్ధిద్దాం.
మనకోసం చేసుకునే నిత్యపూజలో " సర్వేజనాః సుఖినో భవంతు" అనే ప్రార్ధనను జోడిద్దాం.
గమనించండి మనకై కంటే, అందరికై చేసే పూజలో ఎంత తృప్తని.
అలానే ఈ ఉగాదిన మరిన్ని తృప్తినిచ్చే మంచి సంకల్పాలకు శ్రీకారం చుడదాం.
⛧ స్వార్ధం తగ్గించుకొని, ప్రక్కవారికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేయడంలో ఎంత హాయి.
⛧ అత్యాశతో ప్రాకులాడడం, మితికి మించి ఆరాటపడడం మాని, ఏదీ శాశ్వతం కాదని ఎఱిగి, బుద్ధిలో స్థిరపడితే ఎంత హాయి.
⛧ అవి కావాలి, ఇవి కావాలి, అవి తినాలని, ఇవి తినాలని పరితపించేకంటే, కాళ్ళూచేతులు శుభ్రంగా ఉన్నాయి, ఆరోగ్యం వుంది, కూటికి వుంది, గూడు ఉంది... అని ఉన్నంతలో తృప్తి పడడంలో ఎంత హాయి.
⛧ ఉపకారం చేసే శక్తి లేకున్నా అపకారం చేయకుండా ఉండడంలో ఎంత హాయి.
⛧ కాళ్ళకు ఖరీదైన బూట్లు లేవని బాధపడకుండా, నడవడానికి కాళ్ళు ఉన్నాయి కదా అని... ఇలా అన్నింటా ఆశావహదృక్పధంతో వుంటే ఎంత హాయి.
⛧ ధనం, విద్య, అధికారంల గర్వంతో, నాకేంటి అని అనుకోకుండా పదిమందికి మేలు చేసే చిన్నపనైన చేయడంలో ఎంత హాయి.
⛧ ఇతరులు ఏది చేస్తే మనకు బాధ కల్గుతుందో అది ఇతరులకు చేయకుండా ఉండడంలో ఎంత హాయి.
⛧ అసూయ, అహం లను ప్రక్కకు నెట్టేసి, ప్రేమను పంచడంలో ఎంత హాయి.
సద్బుద్ధితో మనస్సు వంగినప్పుడే సర్వేశ్వరుని అనుగ్రహ పాత్రులౌతాం.
తపనతో ఆర్తిగా ప్రార్ధిస్తే పరమేశ్వడే రక్షిస్తాడు
ఇలా సద్భావనలతో, సహృదయంతో, సరళంగా, సామరస్యంగా, సమిష్టిభావంతో జీవనయానం సాగిస్తూ, మానవత్వాన్ని పరిమళింపజేసుకుంటే అది మాధవత్వం కాదా? మానవుడు మాధవుడు కాడా?
శార్వరి నామ సంవత్సరం - శ్రీకారం చుడదాం ఓ చక్కటి ప్రార్ధనకు 🛐🛐 🛐
స్వాగతిద్దాం సత్ కాంక్షలను... సంకల్పించుకుందాం సత్ కార్యలకై!
శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు భారతిగారు.
రిప్లయితొలగించండిచాలా సందేశాత్మక టపా.
సర్వే జనఃసుఖినో భవంతు.
ధన్యవాదములు పద్మగారు.
తొలగించండిమీకు కూడ ఉగాది శుభాకాంక్షలు.
సర్వేజనాః సుఖినోభవంతు
రిప్లయితొలగించండిసర్వేజనాః సుఖినోభవంతు 🙏
తొలగించండిప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని
రిప్లయితొలగించండిరచియించు నప్పుడు రమణ మీర
అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని
కాచి రక్షించు ప్రకరణ మందు
సంకర్షణు డితడు సకల సృష్టి హరించు
పట్టున ప్రళయ తాపములయందు
వాసుదేవు డితడు వర పరమాత్మయై
సర్వము తానయి పర్వునపుడు
విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు
వేద వేద్యు లరసి వేడు నపుడు
చిన్ని కృష్ణు డితడు చేరి యశోదను
ముప్పు తిప్పల నిడి మొరయు నపుడు .
హృదయపూర్వక నమస్సులు మాస్టారుగారు.
తొలగించండిబాగున్నారా?
అన్నార్తులకై మీరు చేస్తున్న మహత్కార్యం అవిఘ్నంగా కొనసాగుతుందని భావిస్తున్నాను.
ఏమని ప్రార్థించాలి?
రిప్లయితొలగించండి🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷
ప్రార్థన (ప్ర+ఆర్థన) అంటే చక్కగా వేడుకోవడం. ఈ వేడుకోలుకు అర్థం, పరమార్థం అనేవి రెండూ బొమ్మ బొరుసు లాంటివి. మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం సహజం. ధర్మంగా ధనం సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవచ్చు.
ధనం ఇంధనంలా దహించుకుపోతుంది. కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ఈ విషయం ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. అప్పుడు ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న ఎరుక కలుగుతుంది. వీటికి మించిన శాశ్వతానందం ఎక్కడుందన్న జిజ్ఞాస మొదలవుతుంది. గుండెలోతుల్లో నుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష, ఒక ఆర్తనాదమై ఒక ఆవేదనారూపమై చెలరేగుతుంది. అదే ప్రార్థన!
దూడను ప్రసవించగానే గోమాత తన బిడ్డను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు, భగవంతుడు భక్తులను లాలించి, పాలిస్తాడు. పరమ ప్రేమస్వరూపుడైన భగవంతుడికి తన సంతానంపై ఉన్న అనంతమైన ప్రేమానురాగాలను వరాల రూపంలో అందిస్తాడు.
సాత్వికులైన ధ్రువుడు, ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి భగవంతుడి పాదసేవనం అనే పరమానందం కావాలని అడిగారు. తపస్సు చేసిన హిరణ్యకశిపుడు, రావణుడు అధికారం, ఆధిపత్యం కోరారు! కోరి తమ వినాశాన్ని వారే కొని తెచ్చుకున్నారు. పరుల సుఖాల్నే మన సుఖమని, విశ్వశ్రేయమే మనకూ శ్రేయోదాయకమని, బుద్ధిగా జీవించాలని త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే ప్రార్థన! అదే మన ఆధ్యాత్మిక ప్రగతికి తొలి సోపానం.
భగవంతుణ్ని సేవించే భక్తులను నాలుగు తెగలుగా చెబుతారు- ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురిలో ఆయనకు చాలా దగ్గరివాడు జ్ఞాని అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.
భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉన్నది. కారణం ఏదో ఒకమూల స్వార్థపిశాచం పీడించడం వల్లే అలా మనసు అల్లాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు... తక్కినదంతా ఆయనే చూసుకుంటాడు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. అయినా అజ్ఞానం, అహంకారం, మమకారం... ఈ మూడూ ఏకమై మనల్ని పెడదారికి ఈడుస్తూ ఉంటాయి.
అలా జరగకుండా మనసును నిర్మలంగా ఉంచమని, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమని, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన సన్నని వెలుగై మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారిదీపమై వెలుగు చూపాలని అర్థించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన!
సేకరణ - వాట్సప్