శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధులవారు తమ సంచారంలో భాగంగా -
బీజాపూర్ రాజ్యంలోని ఒక గ్రామానికి చేరి అక్కడ విడిది చేయగా, బీజాపూర్ నవాబు శ్రీ రాఘవేంద్రులవారి గురించి విన్న కారణాన, అనేక కానుకలను తన తరుపున గురుతీర్ధుల వారికి అర్పించి, వారి ఆశీస్సులు సదా ఆపేక్షిస్తున్నానని తెలిపి, అర్చించి రమ్మని తన వజీరులను ఆదేశించగా... ఆ వజీరులు శ్రీ రాఘవేంద్రులవారికి నవాబుగారి తరుపున కానుకలర్పించి, వారి మాటలను విన్నవించగా, శ్రీ స్వామివారు తమ ఆశీఃపూర్వకంగా మంత్రాక్షతల నిచ్చి, "మీ ప్రభువులు మాకు పంపిన కానుకలలో అమూల్య రత్నాభరణమును మా సీతమ్మతల్లికి అర్పించామ"ని చెప్పండి అంటూ, "అగ్నిదేవా! దీనిని నీవు మా తల్లి జగన్మాత సీతామాతకు మా బదులు సమర్పించమ"ని ప్రార్ధించి,
ఆ రత్నాభరణమును అగ్నిలో వేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నవాబుగారు, అవమానంగా భావించి కోపోద్రిక్తుడై, మరొక వజీరును పిలిచి, 'శ్రీ స్వామివారిని దర్శించి, తాము శ్రీ స్వామివారికి సమర్పించిన అమూల్య రత్నాభరణం లాంటిది మరొకటి చేయించదలచామని చెప్పి, హారం తయారయిన తదుపరి ఆ హారమును తిరిగి పంపెదమని తెలియబరచి హారమును తీసుకురమ్మ'ని పంపించెను. నవాబుగారు మనస్సును గ్రహించిన గురువర్యులు చిరునవ్వుతో, "అలాగే"నని మూలరాముని పూజించి, "అగ్నిదేవా! మేము మాతల్లి సీతమ్మ కందించమని చెప్పి మీకిచ్చిన కంఠాభరణం నవాబు గారికి కావాలట. వారు అటువంటిదే మరొకటి చేయించుకునేందుకు ఇది నమూనగా కావాలట. దయచేసి దానిని తిరిగి ఇవ్వండి, మరల వారు హారమును తిరిగి ఇస్తే సీతమ్మ తల్లికి సమర్పించుకుంటాం" అని అంటుండగా -
అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఆ కంఠాభరణాన్ని ఇవ్వడం...అందరూ నిశ్చేష్టులవ్వడం... స్వామివారు "ఈ హారాన్ని మీ ప్రభువులకు అందించండి" అని, ఆ హారమును వజీరు కివ్వడం...
జరిగింది తెలుసుకున్న నవాబుగారు తన తప్పిదాన్ని గ్రహించి, వెంటనే బయలుదేరి శ్రీ గురుదేవుల దగ్గరికి వచ్చి, 'మాలాంటి అజ్ఞానుల కళ్ళు తెరిపించడం కోసం ఈ భూమిపై పుట్టారని, తన దురహంకారాన్ని క్షమించి, కరుణించండి ఈ దాసుడిని' అని శ్రీ చరణాలకు దాసుడై, కరుణామూర్తుల కరుణకు పాత్రుడై, ధన్యులైరి ఆ నవాబుగారు.
శ్రీ రాఘవేంద్ర తీర్ధులవారు చాతుర్మాసదీక్షలో ఉండగా - ఒకనాడు శ్రీవారు క్షేత్రదేవత, కులదేవత, జగజ్జననియైన దుర్గామాతను స్తుతించ...
ఆ తల్లి ప్రత్యక్షమై, "చిరంజీవివయ్యా నువ్వు! నాటి నరశింహావతార ప్రాదుర్భవానికి కారణభూతుడవైన మహావిష్ణు భక్త శిఖామణి ప్రహ్లాద భక్తవరదా! ఏం కోరి ఈనాడు ఇంతలా మమ్ము స్మరిస్తున్నావు? నీ సర్వవాంచితములు అప్రయత్నంగా నెరవేరుతున్న తరుణంలో, నన్ను పిలిచిన కారణమేమిటయ్యా? చెప్పు నాయనా"...
లోకమాత, వేదరూపిణి, సకలలోకపావని, సర్వసృష్టి స్థితి లయకారిణి పలుకులకు పరవశించి భక్త్యాతిశయముతో, "ఓం నమో లోకపానీ విశ్వజననీ..." అంటూ అశువుగా స్తుతించి, అమ్మా! నువ్వు లోకమాతవు, భయనివారిణి దుర్గవు... నీ దర్శనం వలన ధన్యుడనైనాను. తల్లీ! నీ కృపాదృష్టి నర్ధించనివారు ఎవరూ వుండరమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వాన్ని సవ్యంగా నడిపిస్తున్నారంటే, అది నీ చలువే కదా. అనుక్షణం అందరూ మాతృదేవోభవ అని చెప్పే శృతివాక్యం నీవే కదమ్మా. సర్వ జగత్తుకు శక్తిప్రదాతమైన నీ కరుణా కటాక్షముల నర్ధించడానికేనమ్మా పిలిచాను. "తల్లీ! నేనిక్కడ బృందావన మొందాలని తలంచాను. నన్నూ, నా భక్తులను, సర్వులను, నీ బిడ్డలుగా తలచి వరదాయినివై, మమ్ము అనుగ్రహించాలి. బృందావన మందుండి నేను సల్పు భగవల్లీలా కార్యక్రమములకు నేను భాగమైనా, నా భాగ్యమై నువ్వు నన్నీ జగత్కళ్యాణ కార్యక్రమము నిర్వహించే సర్వశక్తిగా నిలవాలి. బిడ్డగా నేను కోరింది ఇదేనమ్మా".....అని ప్రార్ధించగా, ఆ తల్లి, నాయనా! నిస్వార్ధముగా లోకసంరక్షణా దీక్షమూర్తివై, శ్రీహరి ఆదేశంతో సాగించే నీ భక్తజన పరిరక్షణా కార్యక్రమమునకు నా ఆశీస్సులు తప్పక లభిస్తాయి. నా అభయముద్రకు చిహ్నంగా, నీ బృందావన మహాద్వారమున మేషమస్తకమును ప్రతిష్టింప చేయుము. నీ అభీష్టన్ననుగ్రహించినట్లు నేనక్కడ నిలచి సర్వభక్తులను కాపాడతాను. ఇకమీదట ఈ మంచాల సకల మంత్రసిద్ధ క్షేత్రమై మంత్రాలయమై ప్రసిద్ధి గాంచుతుంది"... అని ఆనందంగా ఆ తల్లి ఆశీర్వదించెను.
పావన తుంగభద్రానదికి అవతల ఒడ్డున శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశారు. ప్రతీరోజూ గురువర్యులవారు తుంగభద్రపై నడిచి శ్రీ ఆంజనేయస్వామి దర్శించి, అర్చించి వచ్చేవారు. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా శ్రీ రాఘవేంద్రుల వారు తమ దివ్యశక్తితో నేలపై నడిచినట్లే నీటిపై నడిచేవారు.
తపస్సంపన్నులైన గురుతీర్ధులవారికి ఒకనాడు ఆంజనేయుడు పంచముఖుడై దర్శనమిచ్చి వరం కోరుకోమంటే, "భవిష్యత్తులో తాము బృందావన ప్రవేశం గావిస్తున్నాం గనుక, మాయందు ప్రసన్నులైన మీరు, మా బృందావనాన్ని సందర్శించే సర్వభక్తజనులకు రక్షణగా వుంటూ, కృపాసిద్ధి ప్రసాదించమ"ని ప్రార్ధించగా, శ్రీ ఆంజనేయులు... "మీ బృందావనానికి ఎదురుగా స్వయంభుడనై అవతరించి, మీ అభీష్టం ప్రకారం మీ సర్వభక్తజనులను కాచి రక్షిస్తాన"ని అభయమిచ్చారు.
ఒకసారి ఆశ్రమంలో రాఘవేంద్రయతీంద్రులు తత్వబోధ గావిస్తున్నారు. ఉన్నట్టుండి స్వామివారు తమ ఉపనిషద్వాణిని ఆపారు. అకస్మాతుగా ఎందుకాపారో తెలియని భక్తులు కారణం తెలియక ఆతృతగా చూస్తున్నారు. స్వామివారు తలపైకెత్తి ఆకాశాన్ని చూస్తూ, లేచి నిల్చున్నారు. ఏమీ అర్ధంకాక అయోమయంగా భక్తులూ నిల్చున్నారు. కొంతసేపు పిమ్మట శిష్యుల మనోభావములు గమనించి, "నాయనలారా! ఇవన్నీ దేవరహస్యాలు. కుశుమవర్తి శ్రీకృష్ణద్వైపాయన స్వామి మహాభక్తులు, సిద్ధపురుషులు. సర్వకర్మలను నిర్వర్తించుకొని మహత్తర జీవనం గడిపిన పుణ్యపురుషులు వారు. ఆ మహాపురుషులు నేడు తమ పాంచభౌతిక దేహాన్ని విసర్జించి, దివ్యదేహంతో విమానరూఢులై, ఆ శ్రీహరి సదనానికి పయన మవుతున్నాడు. ఇది గమనించిన మేము, ఆ మహాభక్త శిఖామణులకు అభివాదం చేసి నిల్చున్నాం. అపుడే మహాత్మా! మీరు శ్రీహరిపధాన్ని చేరుకుంటున్నారు, మరి మా మాటేమిటని అడిగాం. అందుకా ఆ భక్తశిఖామణులు తమ చేతి రెండు వ్రేళ్ళను ముమ్మారు చూపారు. విషయం అర్ధం చేసుకున్న మేము కాలానికి, ఆ మహాభక్త శిఖామణులకు తలవంచి మా సజీవ బృందావన సమాధికోసం ఎదురు చూస్తున్నామన్నారు.
ఇది విన్న శిష్యవర్గం, భక్తజనం కళవళ పడ్డారు. అమ్మో, శ్రీ గురుతీర్ధుల వారు మనల్ని విడిచిపెట్టే మాట... ప్రళయ ఝుంఝూ మారుతమై ప్రతిధ్వనించిందక్కడ. శ్రీ గురుసార్వభౌములు అతిత్వరలో బృందావనాంతర్గతులవుతున్నారన్న వార్త చూస్తుండగా, దావానంలా వ్యాపించింది. ఈ వార్త విన్న దివాన్జీ వెంకన్న పంతులు క్షణాల్లో బయలుదేరి వచ్చి, స్వామి అని బావురుమన్నాడు. "దీనికెందుకింత ఆందోళన? మీ కోసమే కదా, ఈ జీవసమాధి తీసుకునేదీ, ఇలా దేహదారినై ఉంటే ఏ కొంతమందినో రక్షించే మేము బృందావన స్థితులమైతే, ఎక్కడెక్కడ వారిని... తలచిన క్షణాన తక్షణం ఆదుకోగలము అని చెప్తున్న, గురువర్యుల మాటలను అడ్డం వస్తూ... 'మీరేం చేసినా, అది మాకోసమేనంటారు. ఇది భరించదగ్గ విషయమేనా మాకోసమైనా మీరీ పని చేయడానికి వీల్లేదు'...ఆపుకోలేని దుఃఖంతో, ప్రార్ధిస్తున్న వెంకన్నను వారిస్తూ... "చూడు నాయనా! ఇహలోక దృష్టిని కనుక విడిచిపెట్టగల్గితే, ఆ ఈశ్వరశక్తి...లోకసృష్టి సర్వము అర్ధం చేసుకోగలుగుతావు. ఇది దైవ నిర్ణయం. దైవ శాసనం. డబ్బై సంవత్సరాలు మా శరీరంతో భూలోకంలో వుండాలని, ఆ తదుపరి ఏడువందల సంవత్సరాలు బృందావన స్థితులమై వుండాలని నిర్దేశించిన పరమేశ్వరాజ్ఞను మనం ధిక్కరించగలమంటావా? కనుక దైవ ఆదేశం సర్వదా శిరోధార్యం. అందుకని, ఇతర చింతనలను విడిచి, మాకు అతిత్వరలో బృందావనం ఏర్పాటు చెయ్యమని శ్రీ గురుదేవులు ఆదేశించారు.
శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధులు వెంకన్నకు ఓ శిల చూపించి, ఈ శిల శ్రీరామ లక్ష్మణులు ఏడు ఘడియలకాలం విశ్రమించిన పవిత్ర శిల కాబట్టి, ఈశిలతో మాకు బృందావనాన్ని రూపొందించమని చెప్పిరి. మనస్సును చిక్కబెట్టుకుని శ్రీ గురుతీర్ధుల ఆజ్ఞకు బద్దుడై, శ్రీ గురు అఖండనామ స్మరణం చేస్తూ, అనుకున్న విధంగా బృందావన నిర్మాణం పూర్తిచేసాడు దివాన్ వెంకన్న. శ్రీ గురుతీర్ధులు బృందావన స్థితులయ్యే సమయం దగ్గర పడుతుంది. కాలమెంత కఠినమైనది, దైవమెంత నిర్దయుడని బృందావన ప్రవేశ వార్త విన్న ప్రతి ఒకరు గుండెలవిసేలా రోదిస్తూ, కుమిలిపోతున్నారు. శ్రీరాఘవేంద్ర తీర్ధులవారు తమ ఇహలోక బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని బృందావన స్థితులు కావాలి కనుక, తమ ఉత్తర పీఠాధిపతి నియమాకానికి నిశ్చయించి, తమ పూర్వాశ్రమ సోదరులైన శ్రీగురురాజాచార్యుల వారి పౌత్రులు శ్రీ వెంకన్నాచార్యుల వార్ని ఉత్తరపీఠాధిపతిగా నిర్ణయించి, సర్వభక్తజన, వైదిక, పండిత సమక్షంలో శాస్త్రవిధిన మంత్ర, ముద్రాధారణ మూర్తులను గావించి, పీఠాధిపతిగా ప్రకటించి, 'యోగీంద్రతీర్ధులు' గా నామమొసగి, మహాపీఠ సింహాసనాన్ని అలకరింపచేసారు.
1671వ సంవత్సరం -
మంత్రాలయ మహిమాన్వితులు, మహాసిద్ధులు, గురుసార్వభౌములు, సకల భక్తజన హృదయాంతర్వర్తులు, జగత్కళ్యాణ కారకులు, సద్ధర్మ మూర్తులు, ధర్మ రక్షాపరులు... శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధుల బృందావన ప్రవేశం -
"ప్రియభక్తులారా! శ్రీహరి ఆదేశాన్ని శిరసావహించడం మన ధర్మం. సర్వభక్తజన ప్రియంకరుడైన శ్రీహరి మాకు సజీవ బృందావన ప్రవేశాన్ని ప్రసాదించారు. ఈ బృందావనంలో మేము ఏడువందల సంవత్సరాలు నిలిచే వుంటాం. క్షీణ శరీరంతో సర్వభక్తజనులను సేవింపలేమనే ఉద్దేశంతో శ్రీహరి మాకీ దివ్యావకాశాన్ని అనుగ్రహించారు. ధర్మబద్ధంగా దీక్షాయుతంగా మీరు సలిపే సర్వ కార్యక్రమములకు మా తోడ్పాటు ఆశీస్సులు ఉంటాయి. మన జ్ఞానచక్షువులను సక్రమమార్గంలో పయనింపచేసి మనం, మనతోపాటు మన తోటివారు పావనమయ్యేటట్లు చేసుకుందాం. గురు పరంపరగా సద్గురువులు ప్రవచించిన వాటిని, ఆచరించి తరించమన్న నా అభ్యర్ధనను ప్రతిఒక్కరూ స్వీకరించి, ధన్యచరిత్రులయి తరించండి, తరింపజెయ్యండి. ఓం తత్ సత్ !!!
ఇలా సద్బోధ నొసగి శ్రీ గురు సార్వభౌములు, సర్వులను కృపాదృష్టితో చూస్తూ, బృందవన ప్రవేశం గావించారు.
జీవ సమాధిగతులైరి.
ఓం శ్రీ గురురాఘవేంద్రాయ నమః
పూజ్యాయ రాఘవేంద్రాయ, సత్యధర్మరతాయచ |
భజతాం కల్పవృక్షాయ, నమతాం కామదేనవే ||
శ్రీ రాఘవేంద్రాయ నమః
రిప్లయితొలగించండిఅప్పుడే అయిపోయిందా? ఇంక ఇంకా చదవాలనిపిస్తుందండి.
సమాధి నుండే పిలిస్తే పలుకుతానని అన్నారు కదా. సమాధి అయ్యాక పలికిన నిదర్శనాలు ఉన్నాయా? తెలియజేయగలరు ప్లీజ్
వసుంధర గారు,
తొలగించండినిదర్శనాలు నేటికీ పొందినవారు ఉన్నారమ్మా.
నిజానికి నా సత్సంగ్ మిత్రులిద్దరు...
'శరణన్న క్షణాన, "శ్రీ గురు రాఘవేంద్ర" అని తపనగా తలచి పిలిచిన తరుణాన, పలికే అభయప్రదాతులు శ్రీ రాఘవేంద్రస్వామి వారం'టూ... వారి వారి అనుభవాలను చెప్పడంతో... ఆ ప్రేరణతో స్మరణలో శ్రీ రాఘవేంద్రుల గురువర్యులను స్మరించుకున్నాను. వారి అనుభవాలు వ్యక్తిగతం కాబట్టి వాటిని ప్రస్తావించలేను గానీ, గ్రంధస్తం చేయబడిన ప్రముఖ నిదర్శనాలనే ఓ రెండింటిని క్లుప్తంగా తెలుసుకుందాం.
తీర్ధయాత్రలలో ఉన్న పరమభక్తుడు అప్పనాచార్యులుకు, శ్రీ రాఘవేంద్ర తీర్ధులవారు బృందావనస్థితులయిన విషయం తెలిసి వేదనాభరితుడై మంత్రాలయానికి తిరిగి బయలుదేరాడు. దారిలో తుంగభద్రానది పరవళ్ళు తొక్కుతుంటే, భవసముద్రాన్ని దాటించగల శ్రీ గురు సార్వభౌములు ఈ నదిని దాటించలేరా అనుకొని,
"శ్రీ పూర్ణబోధ గురుతీర్ధపయోబ్ధిపారా"... అంటూ అశువుగా శ్రీ గురుమహిమాసోత్రాన్ని చెప్పుకుంటూ 'యో... భక్త్యా...'అను కడపటి శ్లోకంలోని నాల్గవపాదమగు 'కీర్తిద్దిగ్విదితా విభూతిరతులా' ...అని అంటున్న సమయానికి గట్టుచేరాడు.
గురుతీర్ధుల బృందావనం త్వరగా దర్శించాలనే తహతహ లాడుతూ దుఃఖోద్విగ్నుడై, మిగిలిన శ్లోకభాగం పూరించకుండా బృందావనాన్ని చేరుకొని, 'గురురాజచంద్రా! ఎంత దారుణమయ్యా, ఈ దీనుడిని మరిచావా? తీర్ధయాత్రలు చేస్తూ ఏదో పుణ్యం సంపాదించుకోవచ్చుననుకున్నానే గానీ, శ్రీ గురుచరణకమలాలలో సర్వతీర్ధములు కలవని, వాటికోసం ఎక్కడికో వెళ్ళనవసరంలేదని, గురుసేవలోనే తీర్ధాటన క్షేత్రాటన నదీనదస్నాన ఫలములు సర్వము లభిస్తాయని తెలుసుకోలేని అజ్ఞానిని. ఈ అజ్ఞాని ఏదో కోర్కెలు కోరితే మందాలించాల్సింది పోయి, అనుమతిచ్చి వెళ్ళేక ఇంత ఘోరమైన శిక్ష వేస్తావా? నాకు మరణమే శరణ్యం మీ చరణాలు విడిచి వుండలేను... అని గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటే,
"అప్పనాచార్యా! శ్రీగురుమహిమా సోత్రములోని ఆఖరి శ్లోకం శేషభాగాన్ని సాక్షి హయస్యోత్రహి అని ముగించవయ్యా" అని బృందావనం నుండి ముగింపు శ్రీ రాఘవేంద్రుల వారు చెప్పడంతో అక్కడున్న భక్తజనమంతా ఆశ్చర్యానందాలతో ప్రణతులర్పించిరి. అప్పనాచార్యులు శ్రీగురువులు తనతోనే ఉన్నారని, శ్రీ గురుమహిమాసోత్రాన్ని స్వీకరించి అనుగ్రహించారని, తనను ధన్యజీవుడిని చేసారని భావించి స్థిమితపడిరి.
అది 1820 సంవత్సరం -
శ్రీ మధ్వ పీఠాధిపతిగా శ్రీ సుఖోదేంద్ర తీర్ధులవారు ఉన్న కాలంలో ఈస్టిండియా కంపెనీవారు సామ్రాజ్య కాంక్షతో, ఆలయములు సత్రములు మఠములు ఈనాముదారులకే ఇవ్వవలెనా? అందుకు తగు పత్రంలు ఉన్నాయా? అన్న విషయ సేకరణకై 'సర్వే సెటిల్మెంటు' అనే విభాగమును ఏర్పాటు చేసి, వివరసేకరణకు థామస్ మన్రో ను అధికారిగా నియమించడం... మన్రో విచారణ నిమిత్తం మంత్రాలయం రావడం అదోని నవాబు వ్రాయించి ఇచ్చిన పత్రములు ఇక్కడ లేకపొవడం...మఠ సిబ్బంది ఏం చేయాలో తెలియక ఆందోళన పడుతూ దానపత్రాలు ఇక్కడలేని కారణంగా నిజ నిర్ధారణ చేయలేమని చెప్పడం...మీ మాటలే నిజమని నమ్మి, తప్పుడు నివేదకను ప్రభుత్వానికి పంపలేనని మన్రోదొర అనడం...ఈ క్షణమున మేం ఏమీ చేయలేమని, మీ శక్తితో ఈ గ్రామాన్ని రక్షించాలని, అందరూ మనస్సులలో శ్రీగురువులను ప్రార్ధించడం...అకస్మాత్తుగా శ్రీ గురువుల మఠం సందర్శిస్తామని మన్రోదొర అనడం...సమాధిని సందర్శించడం...తనను తనను మరచి తెలియని భక్త్యావేశమునకు లోనయి ఎవరితోనో వినివినబడనట్లు మాట్లాడుతున్నట్లు చూపరులకు కనిపించడం..... కాసేపటి తర్వాత మీరు పుణ్యమూర్తులు భరతమాత కన్నబిడ్డలు, ఇది పావన దరిత్రి... శ్రీ గురువులు మహామహిమాన్వితులు, ఏనాడో సజీవ సమాధి పొందినా నేటికీ సజీవులే...అది సరే, శ్రీ గురువులు ఆశీర్వదించి ఇచ్చిన వీటినేం చెయ్యాలని చేతిలోని మంత్రాక్షతలను చూపించేసరికి అంతా అవాక్కయ్యారు. ఆ మంత్రాక్షతలను కొన్ని తనవద్ద భద్రంగా దాచుకొని, మిగిలినవి ఆనాటి వంటలో ఉపయోగించమని చెప్పడం... 'ఈ మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్రుల సన్నిధి పరమ పుణ్యధామం, ఇది శ్రీమఠానికే చెందినద'ని నివేదకను ప్రభుత్వానికి పంపడం జరిగింది. కొంతకాలానికి సర్ బిరుదు నొసగి మద్రాసు గవర్నరుగా పదోన్నతి పొందిన మన్రోదొర తన ఈ అనుభవాన్ని బళ్ళారి ప్రభుత్వ గజిట్ లో ప్రకటించారు.
ఇలా వీరి లీలావిభూతులు అనేకం.....
రాఘవేంద్ర స్వామి జయంతి ఎప్పుడు
రిప్లయితొలగించండిపాల్గుణ మాసం శుక్లపక్ష సప్తమి
తొలగించండి