శ్రీ వేంకటేశ్వరుని వరప్రసాది, సంస్కృత, వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడు, పరిమళాచార్య, మహా భాష్యాచార్య, భట్టాచార్య బిరుదములను పొందిన విజ్ఞానఖని, చక్కటి వ్యాఖ్యానల గ్రంధకర్త అయిన శ్రీ వేంకటనాధుడు... "శ్రీ రాఘవేంద్ర తీర్ధులు"గా, శ్రీ మహా మధ్వ పీఠాధిపతులు అయిరి.
వీరి పూర్వాశ్రమ ధర్మచారిణి సరస్వతి, జరిగిన పరిణామాలని పూర్తిగా ఆమోదించలేక, అవగాహనాలేమితో దుఃఖావేశానికి లోనై, ఒకనాటి రాత్రి తమ ఇంటి పెరటిలోని బావిలోనికి దూకి ఆత్మపరిత్యాగం చేసింది. వివేక విజ్ఞానముల నిధిగా భాసిల్లవలసిన ఆతల్లి, తాత్కాలిక బాధలో చేసిన ఈ పనికి ప్రేతరూపం దాల్చి, ఆశ్రమచెంతకువచ్చి, బోరున రోధిస్తుంటే...ఆ తరుణంలో తమ ఆరాధ్యదైవమైన శ్రీమూలరాముని పూజలో ఉన్న రాఘవేంద్ర తీర్ధులవారు ఉలిక్కిపడి, పూర్వాశ్రమ సహ ధర్మచారిణి తొందరపాటు చర్య ఆమెకు ఏ స్థితిని కల్గించిందో చూసి, "తండ్రీ! ఈ అసహయురాలైన అమాయక జీవికి, ప్రేత రూపం తొలగించి ఉత్తమగతులను ప్రసాదించు" అని మూలరామున్ని ప్రార్ధించి, తమ పవిత్ర కమండల జలాన్ని ఆమెపై ప్రోక్షించి, ఉత్తమ ఊర్ధ్వలోకాలను ప్రసాదించెను.
1623 రుధిరోద్గారి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ విధియనాడు సుధీంద్ర గురుతీర్ధులవారు, నారాయణ ధ్యానపరులై దేహ విసర్జనం గావించగా, వారికి హంపీలోనే బృందావనాన్ని ఏర్పాటు చేసి, మహా సంతర్పణాదులను మొనరించి, కుంభకోణ శ్రీ మహాపీఠానికి తిరిగొచ్చారు శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌములు.
శ్రీ రాఘవేంద్ర తీర్ధుల పీఠాధిపత్యం, శ్రీ సుధీంద్ర గురుతీర్ధులవారు మహాభి నిష్క్రమణం వార్తలను, తమ క్షేత్ర సంచారములో తెలుసుకున్న శ్రీ యాదవేంద్ర తీర్ధులు తిరిగి మఠానికి విచ్చేయగా...ఆశ్రమ జ్యేష్ఠులుగా యాదవేంద్ర తీర్ధులువారిని పీఠాధిపత్యం స్వీకరించమని శ్రీ రాఘవేంద్ర తీర్ధులవారు కోరగా -
శ్రీ రాఘవేంద్రుల నియమ నిష్ఠలకు, పరమ భక్తితత్వానికి, పరమోత్కృష్ట ధర్మనిరతికి ఎంతో ఆనందించి, "మన గురువర్యుల ఆలోచన ఎంతో మహత్తరమైనది. గురువర్యుల ఆంతర్యం, శ్రీ మూలరాముని ఆదేశం ప్రకారం జరిగిన మీ నియమాకం మాకు అత్యంత ఆనందదాయకం. ఈ మహా సంస్థానము, ఈ మహా మధ్వపీఠము మీ దక్షతతోనే యశశ్చంద్రికల నొందగలదు. మాకీ ఆశ్రమ నిర్వహణ, ఆచార వ్యవహారాలు వలదు. తమరు ఈ మహాపీఠాన్ని సర్వజ్ఞ పీఠంగా భాసిల్లజేసి, ఈ దివ్యపీఠాన్ని సర్వజన, భక్తజన మనోరంజకంగా నడపగలరన్నదే మా విశ్వాసమ'ని ప్రశంసాపూర్వక మనఃపూర్వక ఆశీస్సులు నొసగి, కొద్దిరోజులు ఉండి, తిరిగి తీర్ధాటనమునకు బయలుదేరారు.
శ్రీ రాఘవేంద్రుల హయంలో మరింతగా మధ్వ పీఠ ప్రాశస్త్యం పెరిగింది. ఆనాటి పాలకులు విద్యాభిమానులు ద్వైత మతాభిమానులై, దానినాదరించారు. వేదాంత బోధలనే కాదు సాహిత్యసేవలో కూడా అద్వితీయమనిపించుకున్నారు. వీరి రచనలు సాహితీ వాగ్దేవి మెడలో నవరత్న మణిమయ హారాలయినవి.
ఆశ్రమ సాంప్రదాయానుసారం నిత్య నైమిత్తిక కార్యక్రమములు ధర్మబద్ధంగా నడిపిస్తున్న శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌములు, మధ్వ పీఠ ఆచారాన్ననుసరించి శ్రీ పీఠ చిహ్నముతో తమ సంస్థానముతో సంచారానికి బయలుదేరారు. ధర్మసంరక్షణం, పండిత పరిషత్తులను నడపటం, భక్తశిష్యానుగ్రహణం, జగత్కళ్యాణ కాంక్షతో సర్వులను సమాదరించడం, మతాతీతులై సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించడం... శ్రీ గురుతీర్ధుల వారి సంచారంలో ముఖ్యాంశాలు. వేదశాస్త్ర మత గ్రంధాల ధర్మ పరిరక్షణం, పండితులను సన్మానించడం, అవసరాన్ని బట్టి వాద ప్రతివాదనములు ధర్మ సమ్మతంగా భక్తజన మనోహరంగా జరిపించడం... ఈ దిగ్విజయ యాత్రలోని మరో ముఖ్యోద్దేశం.
పరమత సహనంతో తోటి మానవులను సాటివారిగా గుర్తించి గౌరవించి ఆదరించటం, సమతా మానవతలు కలిసిన మమతను పదిమందికి పంచిపెట్టడం శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధుల పరమాశయం. ఈ ఆశయ సిద్ధిలో సఫలీకృతులై భక్త జనుల, శిష్యవర్గాల, ఆర్తుల సర్వ కామ్యములను తీరుస్తూ, సద్గురు పధగాముల్ని చేస్తూ, దిగ్విజయంగా ముందుకు సాగేవారనటానికి ఎన్నెన్నో ఉదాహరణలు...
తన సంచారంలో... చిత్రదుర్గం చేరుకున్న శ్రీ రాఘవేంద్రుల వారు, తనకు అనుంగు భక్తుడైన వెంకన్న మోక్షమిప్పించమని చాలకాలం నుండి ప్రార్ధించే ప్రార్ధనను చేకొని, అతనికి తగు సమయం వచ్చిందని గుర్తించినవారై, మంత్రపూరితమైన అగ్గిని ప్రేల్చి, అందు ప్రవేశించమని వెంకన్నకు ఆనతివ్వగా, శుచిర్భూతుడై గురువర్యుల చరణారవిందములకు నమస్కరించి, అగ్ని గుండమున దూకగా, ఈ దృశ్యమును గాంచిన కొందరు అమాయక వెంకన్నను మూర్ఖంగా అగ్నికి ఆహుతి చేసారే... అని దూషిస్తుండగా, అదే సమయంలో దివ్యదేహంతో ఊర్ధ్వలోకాలకు వెడలే వెంకన్నను గాంచి, ఆశ్చర్యపోతూ తమ తొందరపాటు నిందారోపణకు నొచ్చుకుంటూ, గురువర్యుల పాదాలపై పడి క్షమించమని వేడుకుంటూ శరణాగతులైరి.
శ్రీ రాఘవేంద్రుల వారు ఉడిపి మఠంలో బస చేసినప్పుడు శ్రీకృష్ణ దర్శనం గావించి, అర్చించి ఆనందపరవశలైవారు. ఎంతైన వారు కారణజన్ములు. శ్రీ విష్ణు స్వరూప ఆరాధికులు. ఓరోజు బాలకృష్ణునిని గాంచి పరవశులైనారు.
కృష్ణుని బంగారు ప్రతిమను ఇక్కడ మఠంలో ప్రతిష్ట చేసారు. ఇక్కడ ఉన్నప్పుడే చంద్రిక గ్రంధమునకు ప్రకాశమను పేరిట ఉత్కృష్ట వ్యాఖ్యానం గావించారు. తంత్ర దీపిక, న్యాయ ముక్తావళి లను రచించిరి.
బీజాపూర్, చిక్కోడ త్రోవలోని అడవి మధ్యమున ఎండకు సొమ్మసిల్లి వడదెబ్బ కొట్టి మంచినీళ్ళకై చూసే ఓ వ్యక్తిని గాంచి తక్షణమే అక్కడ ఒక జలధారను సృష్టించి ఆ వ్యక్తిని ప్రాణాపాయం నుండి కాపాడారు శ్రీ రాఘవేంద్ర స్వామివారు.
మండుటెండలు.....ఎడారివలె నున్న ప్రాంతంలో ప్రయాణిస్తున్న తరుణంలో, త్రాగునీటికి సైతం కటకటలాడుతూ మిడతలవలె మలమల అందరూ మాడిపోతున్న దృశ్యాన్ని గాంచిన గురువర్యులు కలతపడుతున్న సమయంలో - తన ముఖ్య సేవకుని భార్య ప్రసవవేదన పడుతుంటే చుట్టూ మండుటెండ తప్ప గుక్కెడు నీళ్ళు గానీ, విశ్రమించ జానెడు చోటు గానీ లేక, ఎటు చూసినా... ఏ ఆశ్రయం, అచ్ఛాదన కానరాక, గురువర్యులను చేరి, ఈ విషయం చెప్పగా, కరుణాంతరంగలై తన శాటిని గగనతలంలోనికి విసరగా, ఆ శాటి సేవకుని భార్యకు అచ్ఛాదన ఆశ్రయమును ప్రసాదించింది. మరుక్షణం తమ కమండల పవిత్రోదకంతో సర్వుల ప్రాణరక్షణకు కావలసిన పవిత్ర గంగామతల్లిని రావించి, అందర్నీ రక్షించిన కరుణామూర్తి శ్రీ రాఘవేంద్ర గురుతీర్ధుల వారు.
మరికొన్ని లీలావిభూతులు తదుపరి టపాలో -
ఆ సద్గురువు సప్తాహం, ఈ సద్గురువు సప్తాహం అని సప్తాహదీక్షలు చేస్తుంటారు చాలామంది. నేను కూడా సాయి సప్తాహం పలుమార్లు చేసాను. ఏ సద్గురువు సప్తాహం అయినా, మొదట వారి జననం మధ్యలో వారి మహిమలు, చివరినా వారి సమాధిగతి. ఇదే ప్రతీ గురువు చరిత్రలో వుండేది. ఏ చరిత్ర చూసిన ఇదే కధ పునరావృతం. ఈ పారాయణాలు ఫలితమిస్తాయా? వారి మహిమలు అన్నీ వారి గొప్ప మెప్పు ప్రదర్శించుకోవడానికి తప్ప కూడు పెడతాయా? వీరి మహిమలు చదివితే మనకేమైన ఒరిగేది, మంచి జరిగేది ఏమన్నా ఉందా? ఈ
రిప్లయితొలగించండిచరిత్రలు మన రాతలును మారుస్తాయా?
అలాగని నేను నాస్తికురాల్ని కాను. ఈ సద్గురువుల చరిత్రల పట్ల నిరాసక్తత.
ఈ పారాయణలు ఫలితమిస్తాయి.వారి మహిమలు అన్నీ వారు చెప్పలేదు. శిష్యులో, భక్తులో, మరొకరో గ్రంధస్తం చేసారు. సద్గురువు లెన్నడూ చాటింపు వేసుకోరు. వారు ప్రదర్శనకారులు కారు. ఇవన్నీ చదవమనీ, కూడు పెడతాయానీ వారేమైనా మిమ్ములను బలవంతం చేసారా, మీ కిష్టమైతేనే , నచ్చితేనే చదువుకోండి, అందులో విషయాలు పాటించండి. మీ సమస్యలకు అందులో ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో విశ్వాసం ఉంటె ప్రయత్నించండి. ఈ చరిత్రలు మన రాతలను మార్చే మార్గదర్శులేమొ మనకు తెలుసునా. పరీక్షించుకోనే నమ్మండి. మీరే పరీక్ష పెట్టండి. ఇదుగో ఫలానా పారాయణ చేస్తున్నాను, నాకు నిదర్శనం కావాలని అడగండి.
తొలగించండినా విషయంలో మటుకు బోల్డన్ని నిదర్శనాలున్నై ,
నా కుటుంబ సభ్యులే సుందరాకాండ పారాయణం చేసి ఎన్నొ మార్లు సత్ఫలితాలు పొందారు. మా అనుభవమే సాక్ష్యం, ఒక్క సారి కాదు బోల్డన్ని సార్లు.
అజ్ఞాత గారు,
తొలగించండిపారాయణం అంటే -
పుస్తకాన్ని తీసుకొని వల్లె వేయడం కాదు.
సప్తాహం అంటే -
ఏవో ప్రాపంచిక కోరికలతో మొదలెట్టి వారం రోజులు చదివేసి వదిలేయడం కాదు.
పారాయణం అంటే -
ఇది శ్రేష్టమైనది, ఉత్తమపధం వైపు మళ్ళిస్తుంది అన్న భావంతో పఠించి, సదా తదర్ధ మననం చేయడం.
సప్తాహం అంటే -
భక్తివిశ్వాసాలతో మనస్సును సంపూర్ణంగా గురునాధులపై లగ్నం చేసి చదవడం, చదివేదానిని మననం చేయడం, త్రికరణశుద్ధిగా దినచర్యను ఒకే ద్యాసలో సాగించడం.
సప్తాహ దీక్షలో ఉన్నప్పుడు ఇతర భావాలన్నిటినీ విడిచి, ఒకే భావాన్ని పఠన మనన శ్రవణాదుల ద్వారా విడవకుండా పట్టుకొని ఉండటం. ఇదే ఉన్నతపధంకు దారి చూపిస్తుంది. దీని ప్రయోజనం కూడా ఇదే.
ఫలితాలతో సంబంధంలేకుండా విశ్వాసంతో సాధన చేయడమే అసలైన పారాయణం.
ఇక మహిమలంటారా?
ఏదైన అద్భుత ఘటన జరిగితేనే గానీ, ఏదీ నమ్మని అజ్ఞానం మనది. మనల్ని సముద్ధరించడానికి, శాశ్వత ఉత్తమ పధం వైపు మళ్ళిచడానికి, ఆర్తులను ఆదుకోవడానికి... కొన్ని లీలావిభూతులు తప్పనిసరి.
తమ సచ్చిదానందతత్వంతో, జగత్కళ్యాణలక్ష్యంతో, భక్తజన సంరక్షణంకొరకే ఈ మహిమలు. ఈ మహిమలన్నీ మనలో విశ్వాసాన్ని, వివేకాన్ని, భక్తిని మేల్కొలపడానికే. అంతేకానీ, గొప్పను ప్రదర్శించడానికీ, మెప్పును పొందడానికీ కాదు.
మీరూ ఈ రెండుకధలు వినే వుంటారు -
ఒక ఊర్లో వున్న గుడి లో జరగబోయే సద్గ్రంధ పారాయణానికి, పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు, ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే - అందుకు ఆ ధనవంతుడు,"వచ్చి సాధించేది ఏముంది? గత ముప్పై ఏళ్ళుగా ఈ పారాయణలు, పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా గుర్తుందా? ఏమైన లాభం ఒరిగిందా? సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు" అని అన్నాడట. అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి, "నాకు పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం ముప్పై రెండు వేల సార్లు ఆహారం వండి వడ్డించివుంటుంది. నేను తిన్న ఆ ఆహార పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా ? కాని నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తి ని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే నాకు ఆ శక్తి ఎక్కడిది ? ఈ పాటికి చనిపోయివుండేవాడినని బదులిచ్చాడు.
శరీరానికి ఆహారం ఎలాగో... పారాయణం, పురాణశ్రవణం, దైవధ్యానం, దైవ నామస్మరణ అలాగే తెలియకుండా మనస్సుకు శక్తినిస్తాయి.
ఒక పెద్దాయన నిత్యమూ భగవద్గీతాది పుస్తకాలు చదువుతుంటారు. ఇది చూస్తున్న ఓ వ్యక్తి అయ్యా! రోజూ చదువుతుంటారు కదా, ఆ చదివేవన్నీ అర్ధమౌతున్నాయా? ఇలా చదవడం వలన ఏమైన ప్రయోజనముంటుందా? అని ప్రశ్నించగా, 'బాబూ! మీ ప్రశ్నలకు బదులిస్తాను గానీ, ముందు నాకో సహాయం చేయు నాయనా. అదిగో ఆ ప్రక్కన ఉన్న బొగ్గులు వేసిన వెదురు గంప ఉంది కదా. దానితో కాస్త ఆ ఎదురుగా ఉన్న చెరువు నుండి నీరు తీసుకురమ్మని చెప్పగా, సరేనని, నీరు తీసుకువద్దామని చెరువులో గంపని ముంచి తీయడం, నీరు కారిపోవడం... ముంచడం తీయడం ... ముంచడం తీయడం...నీరు మాత్రం గంపలో నిలవడం లేదు. కొంతసేపు ప్రయత్నించి, పెద్దాయన దగ్గరకు వచ్చి, అయ్యా! ఎంత ప్రయత్నించినా ఈ గంపతో నీరు తేలేకపోయాను... దీనితో నీరు తేవడం కష్టమని చెప్పగా, ఒక్కసారి చూడు నాయనా, ఈ గంపతో నీరు తేవడానికి చాలాసార్లు ప్రయత్నించావు. నీప్రయత్నం వలన బొగ్గు మసితో నల్లగా మురికిగా ఉన్న ఆ గంప, ఇప్పుడు తెల్లగా ఎంత శుభ్రతగా ఉందో... అలానే పలుమార్లు పఠనం వలన అనేక మాలిన్యాలతో వున్న మన మనస్సు శుద్ధత పొందుతుంది.
మనకి అర్ధం అయినా, అవ్వకపోయినా పుస్తక పఠనం వలన మనోశుద్ధి అవుతుంది. తెలియకుండనే అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఇంతకంటే ప్రయోజనం ఏముంటుంది అని చిరునవ్వుతో బదులిచ్చారు ఆ పెద్దాయన.
సద్గురువుల చరిత్ర చదవడం వలన మన ఆలోచనల్లో, నడవడికలో మార్పు వస్తుంది. తత్ఫలితంగా మన తలరాతలు మారతాయి. అర్ధమైందనుకుంటాను...గురుచరిత్రల ప్రయోజనం.
ఎందరో అసంఖ్యాక గురుభక్తులు పారాయణాదులు చేస్తున్నారంటే, ఏ ప్రయోజనం లేకనే అంటారా? మనం గ్రహించినా, గ్రహించకపోయినా ప్రాపంచిక భుక్తినే కాదండీ, పారమార్ధిక ముక్తిని కూడా ప్రసాదిస్తారు సద్గురువులు.
దర్పణంలో చూస్తూ మన రూపాన్ని సరిదిద్దుకోవచ్చు. దర్పణంలా గోచరించే మహాత్ముల చరితలతో మన నడతను సరిదిద్దుకోవచ్చు.
బాహ్యముఖం చేసే ఆలోచనలు కంటే అంతర్ముఖంచేసే ఆచరణ ఎంతో ముఖ్యం కదా. ఇది అందరం అర్ధం చేసుకుంటే బాగుంటుంది కదండి.
మన మతి బట్టే , మన గతి ఉంటుంది.
సమ్మతితో ఉందాం, సద్గతిని పొందుదాం.
శ్రీ గారు,
రిప్లయితొలగించండిచక్కటి వ్యాఖ్య.
మీ భక్తివిశ్వాసాలు ప్రస్ఫుటమౌతున్నాయి.
ధన్యవాదములండి.
థేంక్స్ మేడం .
తొలగించండిఔరా సద్గురువులు కారణజన్ములు. మనల్ని సంస్కరించే వారిని కూడా తప్పు పట్టడం...అవివేకం, ఇదే కలి. మా అమ్మాయి విషయంలో శ్రీరాఘవేంద్రుని గుడికి వెళ్ళి 9 లక్ష్మివారములు వారిని దర్శించుకొని, కాసేపు ఆ గుడిలో ఆ మూర్తి ఎదుట కూర్చొని వారిని స్మరించుకొండని ఓ సిద్ధాంతిగారు చెప్పగా, అలా 5 వారములు చేసేసరికే మా సమస్య తీరి ఆనందంగా ఉన్నాం. ఏమిటో మనలో శుద్ధత లోపించిందని గ్రహించక ఏదేదో మాట్లాడేస్తుంటారు.
రిప్లయితొలగించండిఆ సిద్దంతిగారు మంచివారులాగున్నారు. అదే ఇంకోకడైతే.. "పూజలు, యజ్ఞాలు చేసి మీ సమశ్యలు పోగొడతాం" అని చెప్పి డబ్బు దండుకునేవారు.
రిప్లయితొలగించండి