1, సెప్టెంబర్ 2012, శనివారం

దేహమే దేవాలయం; జీవుడే దేవుడు!

దేహస్తాః సర్వవిద్యా శ్చ దేహస్తా స్స ర్వదేవాతః
దేహస్తాః సర్వతీర్ధాని, గురువాక్యేన లభ్యతే 
బ్రహ్మాండలక్షణం సర్వం దేహమధ్యే వ్యవస్థితమ్ (జ్ఞానసంకలినీతంత్రం) 
                                * * *
దేహమే దేవాలయం; ఆత్మయే దైవం. (వేదాంతుల వాక్కు)
                                * * *
దేహమే దేవాలయం; జీవుడే దేవుడు. (మహర్షుల మాట)
                                 * * *
ఈ దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం; దీని లోపల ఆత్మయే దైవం. (శాస్త్ర వచనం)
                                 * * *
మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది. (శ్రీ రమణమహర్షి)
                                  * * *
భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు, చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు కదా...
దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే -
భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ, మనకి కానరావడం లేదు... ఎందుకనీ?
మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన!
మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు! మొదటిది 'నేను' అనే తలంపు, ఇక రెండవది 'నాది' అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.
మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి... ఎలా?
ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని - ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి, పుజాసామగ్రిని, పూజగదిని శుభ్రపరిచి, అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో, అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలును తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి). మనలో ఉన్న అజ్ఞాననిర్మాల్యలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనెడి  ఆరు అడ్డంకులు ఉన్నాయి. వాటిని తొలగించాలి. సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది. అందుకే చెడు ఎవరైనా చెబితే చెవిటివాడులా ఉండు, చెడు మాట్లాడే సంభాషణ సంభవిస్తే మూగవాడిలా వుండు, చెడు చూసే పరిస్థితి తారసపడితే గుడ్డివానిలా వుండు అని 'బాబా' అంటారు. మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలుంటాయి, అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి. (ఆలోచనలతో నిండి ఉన్న భాగాన్ని మనస్సు అనియు, విచక్షణతో నిర్ణయం తీసుకునే భాగాన్ని బుద్ధి అని అంటారు). రామకృష్ణ పరమహంస చెప్పేది ఇదే - 'ఆకర్షణల మధ్య ఆకర్షణ లేకుండా ఉండగలగడమే వివేకం' అని! ఏది మంచో, ఏది చెడో బుద్ధిద్వారా గ్రహించాలి. మనబుద్ధి చేతిలో మనస్సు ఉంటే మనకు పురోగతి, మన మనస్సు చేతిలో బుద్ధి ఉంటే మనకు తిరోగతి. శ్రీ రమణులు అన్నట్లు, మనస్సు బయటికి వెళితే బంధం, లోపలి వెళితే మోక్షం!  
ప్రాపంచిక మార్గమైన, పారమార్ధిక మార్గమైన సరే, మన జీవన గమనంలో బయట లోపల ప్రతిబంధకాలు ఉంటాయి. ఇవి సహజం. ఇవన్నీ ఓర్పు, దైర్యం, నమ్మకం, ఏకాగ్రత లాంటి సద్గుణములతో ఎదుర్కొని పయనించినప్పుడే గమ్యమును చేరుకోగలం. జీవితంలో కష్టాలు, దుఃఖం, ఆవేదన..... ఇత్యాదులు అనుభవిస్తేనే ఆనందములోని పరిపూర్ణత, అమృతత్వం అర్ధమౌతాయి. ఇవన్నీ అనుభవిస్తేనే మనిషి మనస్సును అదిగమించే ధైర్యవంతుడు కాగలడు. ఇవన్నీ అనుభవించి అనుభవించి చివరికి ఆత్మజ్ఞానియై ప్రాజ్ఞుడౌతాడు. 
హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసిన దాని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ, ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం!  ప్రేమ, జ్ఞానం ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది. 
మానవుని నడత నవగ్రహాల మీద ఆధారపడి లేదు. రాగద్వేషాలనే రెండింటిమీదే ఆధారపడి ఉంది. మన ఆలోచనల్లోగానీ, మాటల్లోగానీ, పనిలోగానీ రాగద్వేషాలు ఉండకూడదు. అప్పుడే మనస్సులో మాలిన్యాలు తగ్గి మనస్సు పవిత్రంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. 
ఒకోసారి అన్పిస్తుంది - భగవంతున్నే నమ్ముకున్నాను, ఎన్నెన్నో పూజలు చేస్తున్నాను, ఎంతగానో ప్రార్ధిస్తున్నాను, మంచిగా జీవనగమనం సాగిస్తున్నాను, ఎంతో సాధన చేస్తున్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు? అనుకోని సంఘటనలు ఎందుకు నాకెదురౌతున్నాయి? ఏమిటీ బాధలు....అని! 
అసలు పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి? 
దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ. 
దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.
అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.
అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన.
సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.
సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.
భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది. ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతులను చేస్తాడు. చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు. దానిని యంత్రంలో (మిషన్లో) పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది. అలాగే మీ దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదని బాబా అంటారు. 
'నీకు కష్టాలు వస్తే కంగారు పడకు. నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు పంపుతాడు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి నీవు పాడైపోయే ప్రమాదం ఉంది. నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు, అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి, నిన్ను మహోన్నతుడుని చేయటానికి, నీకు శిక్షణ ఇవ్వడానికీ, నీ జ్ఞానం పూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే నీలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ, భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు' అని జిన్నూరు నాన్నగారు చెప్తుంటారు.
చాకలి బట్టలను బండ పై బాదటం వాటిపై కసితోకాదు, మురికి వదిలించి శుభ్రం చేయటానికే కదా.
దైర్యం, ధర్మం, దయ, మనో నిగ్రహం, శుచిత్వం, సహనం, సత్యభాషణం, శాంతం.......ఇత్యాది సద్గుణాలతో, నిరాడంబరంగా, కోరికలు లేకుండా, క్రోధం కల్గిన కటువుగా మాట్లాడకుండా, లోభత్వం లేకుండా, విషయవాసనలయందు ఆకర్షణలు లేకుండా, గర్వం లేకుండా, అసూయభావనలు లేకుండా సర్వస్థితులయందు సమానబుద్ధి కలిగియుండి, మనో మాలిన్యా మేఘాలను తొలగించుకుంటామో అప్పుడే సహజవైభవ సంపన్నుడగు భగవంతుడుని చూడగలం. శవబుద్ధి (దేహాత్మబుద్ధి) వలన ఈశ్వరుడు జీవుడిలా కన్పిస్తున్నాడు. శివబుద్ధి కల్గితే జీవుడే ఉండడు, ఉన్నది ఈశ్వరుడే అన్న అనుభూతి కల్గుతుంది. 


అప్పుడే దేహం దేవాలయం అవుతుంది, హృదయం గర్భగుడి అవుతుంది, జీవుడు దేవుడౌతాడు.

8 కామెంట్‌లు:

  1. భారతి గారూ!
    చాలా చాలా బాగుంది మీ వివరణ...
    అభినందనలు మీకు...
    దేహాన్ని దేవాలయం చేస్తేనే...
    ఆత్మ..పరమాత్మ నివసించేది..
    చాలా చక్కని పోస్ట్...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ గారు!
      ఈ పోస్ట్ మీకు నచ్చినదుకు సంతోషం. మీ ఈ స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. ఎంత అద్భుతం గా వుందండి మీ వ్యాసం.ఎంత గొప్ప వ్యక్తిత్వ వికాసం .మీరు ఇటువంటి వ్యాసాలూ మరిన్ని వ్రాయండి.మనసు పై, జీవితంపై నా బ్లాగులో వున్న మిగతా వ్యాసాలను కూడా గమనించగలరు.ఆధ్యాత్మికతను చాలా మంది సరిగా అర్థం చేసుకోవటం లేదు.మీ వ్యాసం వాటన్నింటికి మంచి సమాధాన మిచ్చింది.మనసును మాలిన్యాలు లేకుండా చేసుకోవటమే ఆధ్యాత్మికత లోని రహస్యం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవిశేఖర్ గారు!
      నిజమేనండి, ఆధ్యాత్మికత లోని రహస్యం మనస్సును మాలిన్యాలు లేకుండా చేసుకోవడమే.
      తప్పకుండా మీ బ్లాగ్లో మీ పోస్ట్స్ అన్నీ చదువుతాను.
      మీ ఈ స్పందనకు ధన్యవాదాలండి.

      తొలగించండి
  3. రూపు వహించు దేహమున- రూఢిగ 'జీవుడు దేవుడే ' యటం
    చా పరమాత్మ తత్త్వమును నద్భుత రీతి వచించి నారు - దా
    దాపుగ వేదశాస్త్రములు, తద్దయు గుర్వులు మున్ను బోధలన్
    జూపిన ఙ్ఞాన మంతయు విశుధ్ధిగ ' భారతి గారు ' పోష్టులో .
    ----- సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  4. మాస్టారు గారు!
    మీ పద్యరూప ప్రశంస నాకెంతో ఆనందాన్ని కల్గించింది.
    మీ ఈ స్పందనకు ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  5. tyaja durjana samsargam, bhaja sadhu samagamam, kuru punya mahoratram. ghata kudyadikam sarvam mrittika matramevacha, tadwad brahma jagath sarvam ithi vedantha dindimaha. brahma satyam jagan midhya jeevo brahmaiva naa paraha, anena vedyam sachastram ithi vedantha dindima ha. annaru adi sankarulu. mee concept bagundi, sthitha prajnuda vai jeevinchatanike mana va jeevanam. appude dhanyatha. sadhana kramam kuda jodisthe marintha poornam ga vuntundi. siddhantha samanvayam avagahana nu penchutundi. sadhana anubhava nirnayanni istundi, adhigaminchi sahajatwam tho undateme lakshyam kada manavuniki. sairam.

    రిప్లయితొలగించండి
  6. సిద్ధాంత సమన్వయము అవగాహనను పెంచుతుంది. సాధన అనుభవ నిర్ణయాన్ని ఇస్తుంది..........
    చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాములండి.
    సాయిరాం.

    రిప్లయితొలగించండి