28, ఫిబ్రవరి 2015, శనివారం

ఒకప్పటి మధురజ్ఞాపకం 'త్రివేణీ సంగమం'

గతపోస్ట్ చదివిన శైలజగారు అడిగిన ప్రశ్నతో నా మనసులో మరుగునపడిన విషయం మరుపుకురాకుండా మరల జ్ఞాపకం వచ్చేటట్లు చేసిన తనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ -
కాశీయాత్ర ( ఈ టపా వివరములకై  ఇక్కడ  క్లిక్ చేయండి) గురించి మాస్టారుగారు చెప్పిన మరుసటిదినమే ఈ త్రివేణీసంగమం గురించి కూడా ఆయన వివరించారు. 
మా అత్తయ్యగారు (మాస్టారుగారి భార్య) త్రివేణీ సంగమంలో మూడుసార్లు మునకలేస్తే చాలట కదండీ, ముక్తిపొందడానికి అని మాస్తారుగార్ని అడిగినప్పుడు - 
మూడుసార్లు ఎందుకు ఒక్కసారి మునక వేస్తే చాలు ముక్తి పొందవచ్చు అని నవ్వుతూ ఇలా వివరించారు. 
నాకు గుర్తున్నంతవరకు ఆ పద్యాలు, వివరణ చెప్తాను కానీ, పద్యాలలో ఒకటిరెండు అక్షరదోషాలు, వివరణలో చిరులోపం వుండవచ్చు. మన్నించాలి మరి.

మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేష్కోస్తి పర్ణాశనః 
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః 
భస్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూడో బకః 
ఏతేషాం ఫలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్ 

గంగాది తీర్దములలో మత్స్యకచ్చపాదులు సదా నివచించుచుండును. నాగసర్పం వాయుభక్షణం గలిగియుండును. మేకలు ఆకులనే తినుచుండును. చాతకపక్షికి జలమే ఆహరం. ఎలుకలు కొండగుహలలో నివచించియుండును. శునకం దిగంబరియై బూడిదలో పడియుండును. కొంగ మౌనంతో ధ్యానాధిష్టానముతో నుండును. వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును లేదు. కావున బాహ్యచేష్టలతో భ్రమనొందక పై జెప్పిన వాటియొక్క గుణములతో కూడియుండు అంతరంగనిష్ఠ సంపూర్ణముగా కలిగియున్డవలయును. ఎట్లున్డినను జ్ఞానమొకటి చేతనే జీవుడు తరిస్తాడు. 

మనం ఈ విషయాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. గతంలో చెప్పినట్లుగా పుణ్యక్షేత్ర దర్శనాలతో భక్తి పెరిగి , భగవంతున్ని స్మరిస్తూ చేసే తీర్ధస్నానాలతో పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యఫలం ప్రారబ్ధంలోనికి వచ్చిన తర్వత జననమరణాలు తప్పవు. అంతే తప్ప ముక్తి రాదు అని అంటూ ఇంకా ఇలా వివరించారు -

మన దేహంలో మూడు ప్రధాన నాడులున్నాయి. అవి ఇడా పింగళ సుషుమ్నాలు. ఈ మూడింటి సంయోగస్థలం భ్రూమధ్యం. అందుకే ఈ స్థానమును త్రివేణీ సంగమనియు, మేరు స్థానమనియు యోగులు చెప్పుదురు. కాబట్టే భ్రూమధ్యమున మనస్సును స్థిరంగా నిలిపి చేయు ధ్యానం శ్రేష్ఠం. ధ్యానంచే ఈ త్రివేణీ సంగమందు ఒక్క మునకవేసిన చాలును, ముక్తిపొందడానికి. 

ఇడా భాగీరధీగంగా పింగళా యమునానదీ 
తయోర్మధ్య గతా నాడీ సుషుమ్నాఖ్యా సరస్వతీ  
త్రివేణీ సంగమో యాత్ర తీర్ధ రాజ స ఉచ్యతే 
తత్ర స్నానం ప్రకుర్వీత సర్వ పాపై ప్రముచ్యతే 

ఇడానాడే గంగానది. పింగళనాడి యమునానది. ఈ రెండింటి మధ్యలో ఉన్న సుషుమ్నానాడి సరస్వతీనది. ఈ మూడు నాడులు భ్రూమధ్య స్థానంలో ఆజ్ఞాచక్రంలో సంగమిస్తాయి. దీనినే త్రివేణిసంగమం అని అంటారు. దీంట్లో స్నానం చేస్తే జీవుడు అనేక జన్మలలో తాను చేసిన పాపములనుండి, ప్రారబ్ధములనుండి ఒక్కమాటలో చెప్పాలంటే క్రియలనుండి విముక్తి పొంది ముక్తుడౌతాడు. 
బాగుందండీ, మీరు చెప్తున్న దానిబట్టి నాకు అర్ధమౌతుంది .... బాహ్యముగా ఏమైతే ఉన్నాయో, ఏం చేస్తే తరిస్తామో, అవి అన్నీ మనలోనే ఉన్నాయని, మనలోనే చూసుకొంటే తరిస్తామని. కానీ, కోడికూయక ముందే లేస్తాను, గొడ్లచావిడికి వెళ్లి లక్ష్మిని (ఆత్తయ్యగారు ప్రేమగా పెంచుకుంటున్న ఆవుని) పలకరించి, కాస్త పేడను తీసుకొని వాకిట్లో కల్లాపి జల్లి, పొయ్యి అలికి ముగ్గులెట్టి, కసుపు తుడిచి, స్నానపూజాదికాలు పూర్తయ్యాక పొయ్యి రాజేస్తానా ... అప్పుడు అంటించిన పొయ్యి నడినెత్తిన సూర్యుడొచ్చేంతవరకు వెలుగుతునేవుంటుంది. కాసేపైన స్థిమితంగా కూర్చొనే సమయముండదు. మధ్యాన్నం మీరందరి భోజనాలు అయ్యాక, కాస్త తిని, వత్తులు చేసుకుంటునో, పప్పు విసురుకుంటునో, బియ్యం ఏరుకుంటునో, ఈనో పేనో చూసుకుంటునో ...  ఆ సమయంలో కష్టసుఖాలు చెప్పుకోవడానికో, కాలక్షేప కబుర్లు చెప్పుకోవడానికో వచ్చే ఇరుగుపొరుగువారితో మాట్లాడుతూ చిన్న చితక పనులు చక్కబెట్టుకునేసరికి సాయంత్రమైపోతుంది. ఇక మరల మొదలు ఇల్లు ఊడ్చడం, వంటావార్పులు, వడ్డనలు. మీరందరూ పడుకున్న తర్వాతే నా నిద్ర. అంతవరకు పట్టుమని పదినిముషములైన నడుం చేరేయడానికి లేదు. మరి నాలాంటిదానికి కుదురుగా కూర్చోవడం, జపమో తపమో ధ్యానమో ఎలా అవుతుంది చెప్పండి... 
మరి నాలాంటి వారు తరించే మార్గమే లేదా? అని అత్తయ్యగారు అనగా -
ఓహో ... ఎందుకు లేదూ,  నన్ను చక్కగా అర్ధం చేసుకొని నాకు అనుగుణంగా మసులుకుంటున్నావు. అలుపు తెలవనివ్వని చిరునవ్వుతో ఓర్మితో అందరితో ఆత్మీయంగా, అందరికీ ఆసరాగా వుంటున్నావు. నీకు సాధ్యమయ్యేంతలో బీదవార్ని ఆదరిస్తున్నావు. ఓ ఇల్లాలిగా గృహస్థుధర్మమును చక్కగా నిర్వర్తిస్తున్నావు. నీ ఈ ధర్మవర్తనంకు మరింత భక్తివిశ్వాసములు జతైతే ఈ జన్మలోనో, మరుజన్మలోనో తప్పక తరిస్తావు... అని మాస్టారుగారు చెప్తుండగా -
అది కాదండీ, మరి త్రివేణీసంగమంలో మునకలేస్తే ముక్తివస్తుందన్న పెద్దలమాట అసత్యమా అన్న ఆమె ప్రశ్నకు... 
లేదు లేదు, పెద్దలమాటలు, శాస్త్రవచనాలు ఎప్పటికీ అసత్యం కాదు. కాకపోతే వాటి అంతరార్ధమును గ్రహించి పాటించాలి. లేదా వాటిపై అణుమాత్రమైన అనుమానం లేకుండా అపారమైన భక్తివిశ్వాసములుంటే, దానికి పూర్వజన్మసుకృతం తోడైతే తప్పకుండా ఈజన్మలోనే తరిస్తాం. అది ఎలాగంటే ... 
అంటూ ఓ చక్కటి కధను, అంతరార్ధమును వివరించారు. ఆ వివరాలు తదుపరి టపాలో ... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి