29, జనవరి 2012, ఆదివారం

ఆదిత్య హృదయం మరియు శ్రీ సూర్యమండలాష్టకమ్


తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః
రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ, మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ, ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ, అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని పలికి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.

అగస్త్య ఉవాచ:
     రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
     యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి
ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను. నీకు యుద్ధంలో విజయం కలుగును గాక!
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం
ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును. దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును.
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం
ఇది అత్యంత శుభకరమైనది, మంగళకరమైనది, అన్ని పాపములను నాశనం చేయునది. చింత, శోకం, ఒత్తిడిలను తొలగించి ఆయుర్వృద్ధి కలిగించును.
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం
ప్రకాశకుడైన, దేవాసురులచే పూజింపబడిన, తన ప్రకాశంతో లోకాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ భువనేశ్వరున్ని పూజింపుము.
 సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
 ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
ఈ ఆదిత్యుడు సకలదేవతలకు ఆత్మయైనవాడు. గొప్ప తేజం కలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తుంటాడు. తన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా ఎండావానలను కలిగించి దేవదానవులను, సకలజనులను కాపాడుతున్నాడు.
ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః
ఇతడు సమస్త శరీరాలు గలవాడగుటచే, ఇతడే బ్రహ్మా, విష్ణువు, కుమారస్వామి, ప్రజాపతుల రూపం, దేవేంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, చంద్రుడు, వరుణుడు. 
పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః
ఇతడే పితృదేవతలు, వసువు, పంచభూతాలు, ప్రజలు శరీరంలోని ప్రాణవాయువు. ఋతువులను కలిగించే ప్రభాకరుడు.

ఆదిత్య స్తోత్ర ప్రారంభం :

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
నీవు అదితి కుమారుడవు. నీవు సూర్యుడవు. నీవు ఆకాశంలో సంచరించేవాడివి. వర్షంతో జగాన్ని పోషించేవాడవు. పసిడి కిరణములు కలవాడవు. బంగారు తేజస్సు కలవాడవు. భానుడవు, హిరణ్యం రేతస్సుగా కలవాడవు. నీవు దివాకరుడవు.
హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్
నీవు ఆకుపచ్చ గుఱ్ఱములు కలవాడవు. సహస్ర కిరణములు కలవాడవు. చీకటిని సంహరించేవాడివి. శుభములు కలుగజేసేవాడివి. బ్రహ్మాండాన్ని మరలా జీవింపజేయువాడవు. ప్రకాశవంతమైనవాడవు.
హిరణ్యగర్భః  శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనః 
నీవు హితమనే రమణీయ మనస్సు కలవాడవు. చల్లనివాడవు. అగ్నిగర్భుడవు. అదితిపుత్రుడువు. సాయంకాలంలో శమించువాడవు. మంచును పోగొట్టేవాడవు.
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః
ఆకాశానికి నాధుడవు. చీకటిని పోగొట్టేవాడవు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంల పారంగుడవు. గొప్ప వర్షాన్ని కురిపించేవాడవు. నీటికి మిత్రుడవు. ఆకాశామార్గమున శీఘ్రంగా పోయేవాడవు.
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః
ఎండ నిచ్చేవాడవు. గుండ్రనివాడవు. మృత్యువువి. ఉదయాన్నే లేతకిరణంలు కలవాడవు. మద్యాన్నం సర్వాన్ని తపింపజేయువాడవు. కవివి. మహాతేజుడవు. సమస్త కార్యాలకు కారణభూతుడవు.
నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే
నక్షత్రాలకు గ్రహాలకు నాయకుడవు. నీవే ఈ విశ్వ ఉనికికి కారణం. అన్ని తేజస్సుల కంటే తేజస్సును ఇచ్చువాడవు. ద్వాదశాదిత్యులలో అంతర్యామివైన నీకు నమస్కారం.
నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః
తూర్పుకొండతో కూడినవాడికి నమస్కారం. పడమటకొండతో కూడినవాడికి నమస్కారం. జ్యోతిర్గణాలకు అధిపతివైన నీకు నమస్కారం. పగటిని కలిగించే నీకు నమస్కారం.
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
జయుడకి నమస్కారం. జయభద్రునికి నమస్కారం. పచ్చని గుఱ్ఱములు గల నీకు నమస్కారం. సహస్రాంసునకు నమస్కారం.
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః
ఉగ్రునకు నమస్కారం. వీరునకు, వేగంగా పయనించే నీకు నమస్కారములు. కమలములను వికసింపజేయు నీకు నమస్కారం. మార్తుండునికి నమస్కారం.
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యోదయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః
బ్రహ్మా, విష్ణు, మహేశుల అధిపతికి నమస్కారం. ఆదిత్య వర్చస్సుతో ప్రకాశించువానికి నమస్కారం. సర్వభక్షకునికి నమస్కారం.
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే 
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
చీకటిని పోగొట్టువానికి నమస్కారం. శత్రువులను వధించేవానికి నమస్కారం. గొప్ప తేజస్సు గలవానికి నమస్కారం. స్వయంప్రకాశం గలవానికి నమస్కారం. దేవునికి, జ్యోతిషపతికి నమస్కారం.
తప్త చామీకరాభాయ వహ్నయే  విశ్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే
బంగారుకాంతివంటి కాంతి కలవాడు, అగ్నిరూపునకు, జగత్తుకు కారణమైనవాడికి నమస్కారం. విశ్వకర్మకు నమస్కారం. ప్రకాశాస్వరూపునకు నమస్కారం. లోకసాక్షికి నమస్కారం.
నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
ఈ ఆదిత్యుడే మహా ప్రళయకాలంలో ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. తిరిగి తానే జగత్తును సృష్టిస్తాడు. నాశకాలం తప్ప, తక్కిన కాలంలో చక్కగా పరిపాలిస్తాడు.ఇతడు కిరణాలతో శోశింపజేస్తాడు, ఎండా, వానలను ఇస్తాడు.
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం
సకల జీవులు నిద్రిస్తుండగా, వాటిలో అంతర్యామిగా మేల్కొని ఉంటాడు. అగ్నిహోత్రం, అగ్నిహోత్రఫలమూ ఇతడే. 
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వన్యేషు రవి: ప్రభుః 
వేదాలు, యజ్ఞాలు, యజ్ఞఫలమూ ఇతడే. లోకంలోగల సర్వకార్యములకు ఈ రవియే ప్రభువు.
ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషుభయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః 
రామా! ఆపదలలో, భయంకలిగించే ప్రదేశాలలో, ఈ స్తోత్రంతో సూర్యుడిని కీర్తించేవాడు అన్ని ఆపదలనుండి రక్షింపబడతాడు.
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ 
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
నువ్వు మనస్సును ఏకాగ్రంచేసి ఆ దేవదేవుడు జగన్నాధుడైన సూర్యున్ని ఆరాదించు. ముమ్మార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తే యుద్ధంలో విజయం నీకే.
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్
'మహాపరాక్రమశాలీ! నువ్వు ఈ క్షణాన్నే రావణుని సంహరిస్తావు' అని రామునితో అగస్త్య మహర్షి చెప్పి అక్కడినుండి నిష్క్రమిస్తాడు.
ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవః ప్రయతాత్మవాన్
అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు ధైర్యంతో ఆనందమును పొంది, నిర్మల హృదయంతో ఆదిత్య హృదయంను జపించాడు.
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరంహర్ష మవాప్తయాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
రాముడు అలా ఆదిత్య హృదయమును జపించి మహదానందభరితుడయ్యాడు. తర్వాత ముమ్మార్లు ఆచమనం చేసి, మిగుల పరాక్రమముతో విల్లు ధరించాడు.
రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్
శ్రీరాముడు రావణున్ని చూసి ఉత్సాహంతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. రావణున్ని సంహరించాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు.
అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమన్యాః  పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి
అలా తనను జపించుతున్న శ్రీరామున్ని చూసి, రాక్షసరాజు వినాశనంను గ్రహించి, చాలా ఆనందంతో  'నీవింక రావణుని వధింప త్వరపడమని, నీకు విజయం తధ్యమ'ని సూర్యభగవానుడు రామునితో చెప్పెను.
                                                                             
                    ఇతి ఆదిత్య హృదయే సంపూర్ణం.


                            శ్రీ సూర్యమండలాష్టకమ్

యన్మండలం దీప్తికరం విశాలం 
రత్నప్రభం తీవ్ర మనాదిరూపమ్
దారిద్ర్య దుఃఖక్షయ కారణంచ 
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్   

యన్మండలం దేవగణై: సుపూజితం 
విప్రై:స్తుతం భావన ముక్తికోవిదమ్
తం దేవదేవం ప్రణమామి సూర్యం   
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్   

యన్మండలం జ్ఞానఘనం త్వగమ్యం 
త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్ 
సమస్త తేజోమయ దివ్యరూపం 
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్ 

యన్మండలం గూఢమతి ప్రభోధం 
ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్
యత్సర్వపాపక్షయ కారణంచ   
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్   

యన్మండలం వ్యాధివినాశ దక్షం 
యదృగ్యజుస్సామసుసంప్రగీతమ్ 
ప్రకాశితం యేనచ భూర్భువస్స్వః 
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్

యన్మండలం వేదవిదో వదంతి 
గాయంతి యచ్చారణ సిద్ధ సంఘాః
యద్యోగినో యోగజుషాంచ సంఘాః 
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్ 

యన్మండలం సర్వజనేషు పూజితం 
జ్యోతిశ్చ కుర్యాదిహ మర్త్యలోకే 
యత్కాల కల్పక్షయ కారణంచ
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్ 

యన్మండలం విశ్వసృజాం ప్రసిద్ధం 
ఉత్పత్తి రక్షా ప్రలయ ప్రగల్భమ్
యస్మిన్ జగత్సంహరతే అఖిలంచ 
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్ 

యన్మండలం సర్వగతస్య విష్ణో:
ఆత్మా పరంధామ విశుద్ధ తత్వమ్
సూక్ష్మాంతరై ర్యోగపధామ గమ్యం 
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్

యన్మండలం దేవవిదో వదంతి 
గాయంతి యచ్చారణ సిద్ధ సంఘాః
యన్మండలం వేదవిదః స్మరంతి
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్

యన్మండలం వేదవిదోపగీతం 
యద్యోగినాం యోగపదాను గమ్యమ్
తత్సర్వవేదం ప్రణమామి సూర్యం 
పునాతు మాంతత్సవితుర్వరేణ్యమ్

మండలాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః 
సర్వపాప విశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే.
  
శ్రీ సూర్యమండలాష్టకమ్ పఠనం వలన సర్వరోగహరం, ఆరోగ్యప్రాప్తి కలుగును.
   
   



27, జనవరి 2012, శుక్రవారం

చిన్ననాటి చిన్న జ్ఞాపకం(2)

ఓరోజు యాత్రలకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి -
ఆశ్వక్రాన్తే రధక్రాన్తే విష్ణుక్రాంతే వసుంధరా 
శిరసాధారి తాదేవి రక్షస్వమాం పదేపదే 
ఉద్ధ్రుతాసి వరహేణ కృష్ణేన శతబాహునా 
(చిన్నప్పుడు విన్నది కాబట్టి చిరు అక్షరదోషాలు వుండవచ్చు) ఈ మంత్రం పఠిస్తూ ఇద్దరు సాధువులు నదీస్నానం చేసి ఆ మట్టిని తలకు పూసుకొని ముడివేసుకోవడం చూశాను. నాకుకూడా ఈ సంసారాన్ని విడిచిపెట్టి వారిలా సన్యసించాలని వుందని మా తెలుగు మాష్టారుగారితో చెప్పగా ... 

మునులు, సాధువులు, గురువులు, పెద్దలు ఏది చేసిన దానికి బాహ్యర్ధమూ, అంతరార్ధమూ వుంటుంది.  అర్ధం గ్రహించక వారు చేశారని మనం వారు చేసినట్లు చేయడం సరికాదు. ఆ మంత్రమునకు అర్ధమేమిటంటే - 
గుఱ్ఱము యొక్క, రధం యొక్క, విష్ణువు యొక్క సంచారములను ఓర్పుచేత సహించునట్టి ఓ భూమీ, నీవు వరాహావతారమున అవతరించిన భగవంతుని చేత పాతాళంనుంచి తేబడినదానవు. నీవు శిరస్సునందు ధరింపబడినదానవై నన్ను రక్షింపుము అని.
ఈ మంత్రంను ఉచ్చారణ చేయుచు స్నానకాలమందు మృత్తుకను శిరస్సునందు ధరించవలయునని చెప్పెదరు. శిరస్సునందు మృత్తుకను ధరించి 'నను రక్షించు భూదేవి' అని ప్రార్దించినంతమాత్రమున ముక్తి కలగదు. ఈ బాహ్యార్ధంను వదిలి అంతరార్ధం ఆలోచించండి. పృథ్వి వలె మనస్సు కఠినమై విషయములకు పోవుచు అదోముఖమై వుండును. అట్టి మనస్సును ఊర్ధ్వముఖవ్యాపనం చేసి శిరస్సునందు ధరించవలయుననియు, అదియే పరబ్రహ్మప్రాప్తికి మార్గమనియు అనుభవజ్ఞులు చెప్పెదరు. అనగా మంత్రం లేదా నామం లేదా ధ్యానంలతో అంతర్ముఖమై పృధ్వీతత్వంతో సంబంధమున్న మూలదారచక్రంను జాగృతపరచి తలపై వున్న సహస్రారం వరకు పయనించి పరమాత్మను దర్శించమని అర్ధం. 
ఎటువంటి విషయవాసనలు కదలాడుతున్న, ఓపికతో దేనికీ చలించక ఓ మనసా! అదోముఖమైన నీవు, భగవన్నామముతో ఊర్ధ్వముఖమై నన్ను రక్షింపుము. 
ఇంకా ఒకటి గుర్తుంచుకోండి -
ఆధ్యాత్మిక సాధకులకు గృహస్థజీవన పరిత్యాగం తప్పనిసరియైనదిగా ఏ శాస్త్రం శాసించలేదు. గృహస్థాశ్రమం అత్యంత విశిష్టమైనది. గృహస్థునిగా తన విధులను చక్కగా, సమర్ధవంతంగా నిర్వర్తించడం, ధర్మబద్ధమైన కర్మాచరణం చేయడం శాస్త్రసమ్మతం. ఆధ్యాత్మికసాధన అంతరంగానికి సంబంధించింది. అది మనస్సులోనే జరగాలి. సాధనకు గృహమో అడవో అడ్డు కాదు. నీ మనస్సే అడ్డు. సంసారమును విడిస్తే సన్యాసివికావు, మనస్సును వదిలేస్తే సన్యాసివవుతావు. అప్పుడు నీవు సంసారంలో వున్నా సాధువ్వే. తలకు మట్టిపూసుకొని కాషాయదుస్తులు ధరించి తిరగడం కాదు సన్యాసమంటే. వ్యక్తిభావనను, విషయవాసనలను పరిత్యజించడమే నిజమైన సన్యాసం. ఆధ్యాత్మిక సాధనకు మన వృత్తిగాని, కర్తవ్యాలు గాని అడ్డుకాదు. మన మనస్సే అవరోధం. వివేకి అయిన గృహస్థుడు ఈ బంధాలు, బాధ్యతలు జన్మ ప్రారబ్ధసారంగా వచ్చినవే అన్న భావనతో తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ, ఇవన్నీ భగవంతుడు తనకప్పజెప్పిన పనులని భావిస్తూ, తన కర్తవ్య నిర్వహణను ఫలాసక్తి లేకుండా నిర్వహిస్తూ పారమార్ధిక సాధనను అవలంబించి తరిస్తాడు....
అంటూ మాష్టారుగారు చాలా వివరించారు.

17, జనవరి 2012, మంగళవారం

శరణాగతి

పరమాత్ముడిని పొందాలంటే ప్రాపంచిక ఉనికికి అతీతంగా వెళ్ళగలగాలి. ఉన్నది ఒక్క పరమాత్మే అన్న గ్రహింపుతో ఈశ్వరార్పితం కావాలి. అంటే శరణాగతి కావాలి. శరణాగతి కలిగివుండడం అంత సులువైనది కాదు. అలాగని అసాధ్యం కాదు. శరణాగతితత్వం భక్తితో, కృతజ్ఞతతో, ప్రార్ధనతో ముడిపడి వుంది.
భక్తి : భగవంతుని పట్ల ప్రేమే భక్తి. స్వస్వరూప అనుసంధానమే భక్తి. అనన్య దైవచింతనయే భక్తి. సమస్త ఆచార వ్యవహారాలను భగవంతుడికి అర్పించడం భక్తి. ఆత్మానుభవం పొందడానికి ఏ విషయాలైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని వదిలించుకోవడమే భక్తి. ఇటువంటి భక్తిని దాటి పొందాల్సినది శరణాగతి. భక్తిలో మనస్సు కరిగిపోయి తీవ్రస్థాయికి రావడమే శరణాగతి. అంటే భక్తి యొక్క పరాకాష్ఠస్థితియే శరణాగతి. 
కృతజ్ఞత : ఉత్కృష్టమైన మానవజన్మనిచ్చి మనమీద అపారదయతో  అన్నీ సమకూర్చుతున్న సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు యందు ప్రేమతో వుండి, తనచే సృజింపబడిన సమస్త సృష్టి యందు ఆ భగవంతుడినే దర్శిస్తూ అన్నివేళల్లో అన్నింటా దయతో ప్రేమతో వుండడమే కృతజ్ఞత.
ప్రార్ధన : అంతరంగపు నైర్మల్యాలను తొలగించేదే ప్రార్ధన. ప్రార్ధన అంటే అంతర్యామి ముందు అంతరంగ ఆవిష్కరణ, అంతరశుద్ధికై పవిత్ర ప్రయత్నం, అనంతునికై అంతరంగనివేదన. విషయజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్లగలిగేదే ప్రార్ధన. జీవాత్మను విశ్వాత్మలో విలీనం చేసేదే ప్రార్ధన. అంతేగాని ప్రార్ధన యాచనల వుండకూడదు. భగవంతుడు దగ్గర భక్తుడిగా వుండాలి, భిక్షగాడుగా కాదు. 
క్రమేపి భక్తి, కృతజ్ఞత, ప్రార్ధన తదితర అభ్యాసాలని దాటి భక్తుడు, భగవంతుడు అన్న ద్వైతభావమును అధిగమించి ఉన్నది పరమాత్మ యొక్కటే అన్న ఆత్మభావన స్థితికి రావడమే శరణాగతి పొందడం. అయితే నోటితో చెప్పడమంత తేలిక కాదు శరణాగతి. అసలు శరణాగతి అంటే -
వ్యక్తి భావనను విడిచిపెట్టి పరిపూర్ణంగా ఈశ్వర ఇచ్ఛకు కట్టుబడి వుండుట. అంటే ఈశ్వర సంకల్పమే నా సంకల్పం, ఆయన ఇష్టమే నా ఇష్టం అనే దృఢవిశ్వాసం కలిగియుండుట. ఏ పరిస్థితులలోనైనను, ఏ సంఘటనలయందైనను చలించక చరించక స్థితప్రజ్ఞతో వుండగలగడం. దేహాత్మ బుద్ధిని వదుల్చుకొని ఇతర చింతనలు లేకుండా నిరంతరం ఆత్మచింతనలో ఉండుటయే శరణాగతి. అహంకారాన్ని(నేను అన్న భావాన్ని) దాని పుట్టుకస్థానమైన హృదయంలో నశింపజేయుటయే నిజమైన శరణాగతి. ఈశ్వరుడు లేక ఆత్మ తప్ప వేరేమీ లేదన్న జ్ఞానం, ఆత్మ తప్ప నేను, నాది అంటూ ఏమిలేదన్న అనుభవజ్ఞానం కల్గినప్పుడే శరణాగతి అలవడుతుంది. తన ఉనికికి మూలకారణమైన దానికి తనని తాను అర్పించుకోవడమే శరణాగతి. శరణాగతి చెందిన సాధకునికి సంకల్పాలు, ఇష్టాయిష్టాలు అంటూ వుండవు. ఏది ఎలా వున్నా అంతా పరమాత్మ అనుగ్రహమే, పరమాత్మ మయమే అనే ఆత్మభావనలోనే వుంటాడు. సర్వమూ నీవే, నీ ఇచ్ఛ ప్రకారమే కానియ్యు అనే స్థితిలో ఉంటూ  భగవంతుడు ఏది అనుగ్రహిస్తే దానితోనే పరిపూర్ణ సంతుష్టుడై వుంటాడు. సర్వత్రా సర్వేశ్వరుడునే చూస్తాడు. త్రికరణలతో చేసే ప్రతీ పనికి భగవంతుడే ధ్యేయమై వుంటాడు.

"శరణాగతి, ఆత్మవిచారణ (నేనెవర్ని) రెండూ వేరు వేరు పేర్లున్న అభ్యాసలే అయినా రెండు ఒకటేననీ, ఆత్మ సాక్షాత్కారంకు ఈ రెండే ఉత్తమమైన పద్ధతు"లని  శ్రీ రమణులు అనగా,
రామానుజాచార్యులవారు శరీరం విడిచిపెట్టటానికి సిద్ధంగా వున్న తరుణంలో వారి శిష్యులు అందరూ వారిచుట్టూ చేరి చివరిమాట ఏదైనా చెప్పండి అని అడుగగా - 
"నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత శరణాగతి ద్వారా తప్పించి ఇతరత్రా మార్గాలు ద్వారా కూడా మోక్షం వస్తుందని ఎవరైనా చెబితే మీరు వారి మాటలు నమ్మవద్దు" అని రామానుజాచార్యులవారు అన్నారు. 

పరిస్థితులు అనుకూలంగా వున్నా, ప్రతికూలంగా వున్నా దీర్ఘశరణాగతిలో నిలబడి వుండాలి. ఆచరణ పూర్వకమైన శరణాగతి చెందినప్పుడే ఈశ్వరానుగ్రహం కల్గుతుంది. శరణాగతి పరిపూర్ణంగా వుంటే పరమాత్మునిపరంపదం పొందడం తధ్యం.    
భక్తిమార్గంలో ముక్తి పొందాలంటే శరణాగతే అందరికి నిజమైన గతి. సాధకుని సాధన భక్తీ కృతజ్ఞతాప్రార్ధనలతో ప్రారంభమై శరణాగతితో ముక్తినిస్తూ ముగుస్తుంది.

14, జనవరి 2012, శనివారం

చిన్ననాటి చిన్నిజ్ఞాపకం


మా తాతయ్యగారి ఇంటికి  ఆరిల్లు అవతల ఓ బ్రాహ్మణకుటుంబం వుండేది. అతను రిటైర్డ్ తెలుగుమాస్టర్. అతనికి ఎనమండుగురు సంతానం. వారి అయిదవ అమ్మాయి 'లావణ్య' నేనూ మంచిస్నేహితులం, కల్సి చదువుకున్నాం. నేను  నా పెళ్లైనంతవరకు వాళ్ళ ఇంటిలోనే ఎక్కువ వుండేదానిని. చింతపిక్కలాట, తొక్కుడుబిళ్ల, అష్టాచెమ్మా, దాడాట.... ఓహో.....అన్నీ అక్కడే. పుస్తకాభిరుచి ఆయన చలవే. ఆ అత్తయ్యగార్కి(మాస్టర్ గారి భార్య) కాశీకి వెళ్ళాలన్నది పెద్ద కోరిక. మాస్టర్ గారు ఆమె కోరికను ఏదో ఒకటి చెప్పి వాయిదా వేసేసేవారు... అందుకు వారి ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రముగా వుండడమే. కాకపొతే ఆయనమాటల్లో యదార్ధముండేది. ఆయన మహాపండితులు. రావిచెట్టుబండ దగ్గర ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలను చెప్పడం ఆయన దినచర్య. 
అసలు విషయంకు వస్తాను......  
ఆమె కాశీ వెళ్ళాలీ, గంగా స్నానం చేసి మోక్షం పొందాలని అన్నప్పుడు అత్తయ్యగారితో ఆయనేమనేవారంటే....
ఓసీ, అమాయకురాలా! నీవూ మరీ సత్తెకాలపు మనిషిలా వున్నావే...... అంటూ ఓ  శ్లోకం చదివి వివరణ ఇచ్చారు. నాకు గుర్తున్నంతవరకు చెప్తాను కానీ, ఆ శ్లోకంలో ఒకటిరెండు అక్షరదోషాలుండొచ్చు. ఎప్పుడో  నా పదహారోయేటా విన్నవి. మన్నించాలి మరి.

"అకార్య కార్యవకీర్ణీస్తేనే భ్రూణ హా గురు తల్పగః 
మరుణో పా మాఘ మర్షణస్తస్మాత్పాపాత్ర్ప ముచ్యతే" 

భావం: జలంనందు స్నానం చేసినచో కూడనిపని చేసినవాడను, వ్రతభ్రష్టుడును, దొంగవాడును, గర్భంలోని శిశువును చంపినవాడును, ఎట్టి మహాపాపం చేసినవాడును,ఆయా పాపములనుండి విడువబడుచున్నాడు. అనగా ఎట్టి మహాపాపము చేసినవారైనను గంగాది మహా తీర్ధములయందు స్నానం చేసినచో పాపరహితుడగును. 
ఇలా అయితే కొంత డబ్బు పట్టుకొని కాశీకి వెళ్తే మోక్షం వచ్చేస్తుందని అందరూ అక్కడకే వెళ్ళండి అని చెప్పేయవచ్చు. అప్పుడు సాధనలు, తపస్సులు, వేద అధ్యయానాలు అవసరం లేదుకదా. అందుకే కేవలం బాహ్యార్ధం చూడకూడదు. అంతరార్ధం గ్రహించాలి. సద్గురు ప్రసాద తీర్ధమనెడు బ్రహ్మానంద సముద్రమునందు స్నానం చేసిన ముక్తి కలుగునుగాని కాశీరామేశ్వరములు తిరిగిన ముక్తి లేదు. అంటే కాశీరామేశ్వరములు వెళ్ళకూడదని కాదు,  వెళ్ళినచో ఆ తీర్ధవిశేషాలుతో పాటు పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యఫలం అనుభవమైనతర్వత జననమరణాలు తప్పవు. అంతే తప్ప ముక్తి రాదు అని ఆయన వివరించారు. 
ఇలా ఎన్నో చెప్పేవారు...... కానీ నేర్చుకోవాలన్న జిజ్ఞాస లేకపోవడం, వాటివిలువ అప్పటిలో తెలుసుకునే తెలివిలేకపోవడం చాలా మర్చిపోయాను. 
ఒకసారి లావణ్య అడిగింది కాశీకి వెళ్దాము నాన్నఅని. అప్పుడు ఆయనేమన్నారంటే - 

"భూప్రదిక్షణ షట్క్ న కాశీయాత్రా యుతేనచ, సేతుశ్నాన శోతైర్యశ్చ తత్పలం మాతృవందనే "

భావం: ఆరుమార్లు భూప్రదక్షణ చేసిన, పదివేలసార్లు కాశీయాత్ర చేసినా, అనేక వందమార్లు సముద్రస్నానం చేసిన వచ్చే పలితం కంటే తల్లిని ఓ మారు నమస్కరిస్తే ఎక్కువ పలమొస్తుందని అనేవారు. 
వెంటనే అత్తగారు 'మా ఆయన బంగారం, బుర్రనిండా తెలివే, తడుముకోకుండా, తడబడకుండ టకీమని దేనికైనా జావాబు చెప్పేస్తారు', అని  మురిపంగా దూరమునుండే చేతులు ఆయన చుట్టూ తిప్పేసి తలకి నొక్కుకునేవారు. మెటికలు విరిగాయనుకోండి...... ఇంటి దిష్టి, ఇరుగుపొరుగు దిష్టి, వూరూవాడా దిష్టి పోవాలని అనేవారు. ఉప్పు,మిరపకాయలతో దిష్టి తీయడం , కట్టెలపొయ్యిలో వేయడం, మేమందరం దగ్గుతో ఉక్కిరిబిక్కిరి ...... ఆపై నవ్వుకోవడం బాగా నాకు జ్ఞాపకం.

11, జనవరి 2012, బుధవారం

ఓ సాధారణ సాధకురాలి స్వగతం.......

తనువు తనది కాదని తెల్సుకున్నవాడికి జపమేలా, తపమేలా....."
ఉదయం బిక్షాటనకు వచ్చిన ఓ కొమ్మదాసరి ఈ పాట పాడాడు.... బహుశా త్యాగరాజు కృతి అనుకుంటా. ఈ పాట విన్నప్పుడు మదిలో ఏదో భావన..... ఇంతలోనే ప్రక్కింటినుండి జేసుదాసు గారి పాట......
"గాలివానలో వాననీటిలో పడవప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం......."
 ఈ పాట వింటుంటే మనసంతా వికలం...... ఈ రెండు పాటలు ఒకేరోజు  వినడం యాదృచ్చికమైన, ఎందుకో నాలో ఏదో అలజడి. ఈ పాటల్లో సత్యముందని తెలుసు, కానీ.......... ఊహు...చెప్పలేని అంతర్యుద్ధం.
నాలో ఆధ్యాత్మిక తపన వుంది. కానీ, పూర్తిగా వైరాగ్యం ఇంకా రాలేదు. అటు అడుగులు వేస్తున్నా విరాగినిని కాలేదింకా. పారమార్ధిక విషయాలకు ఎంత ప్రాముఖ్యతనిస్తానో, ప్రాపంచికతకు, మానసిక ఆనందంకు అంతే  ప్రాముఖ్యతనిస్తూ పయనిస్తున్నాను. ఇదిగో ఇక్కడే సంఘర్షణ మొదలైంది...... ఇలా ఐతే ముందుకు సాగడం అసాధ్యమని అర్ధమైనదగ్గరనుండి అంతర్యుద్ధం.......
ప్రాపంచిక ప్రపంచంలో అనేక ఆకర్షణలుంటాయి. మనస్సు కోరుతుందని, ఇందులో మానసిక ఆనందం వుందని పరుగులు పెడ్తే ఎలా? మనస్సువైపు కాదు, మాధవునివైపు సాగిపొమ్మని అంతరంగంలో హోరు....
అటా.......ఇటా..........  రెండింటిని సమన్వయపరుస్తూ ఎలా సాగను? ఎంతో గుంజాటన........
ఈ మద్య రోజుకు రెండు,మూడు గంటలు నెట్ కు అటుక్కుపోతున్నా...... ఈ ఆధునిక అభిరుచుల అల్లికలో కాలాన్ని వృధాగా చేజార్చుకుంటున్నానేమోనన్న ఆవేదన.

ప్రాపంచికత, ఆధ్యాత్మికత సమతూకం అంటే సరిగ్గా సమన్వయపరుచుకుంటూ జీవన పయనం సాగించడం దుర్లభం కాకపోవచ్చు గానీ కొంత కష్టతరమే.

భార్య మాటలతో కనువిప్పై భార్యను వదిలి పరమాత్మునికై పరితపించిన తర్వాతే తులసీదాసు యోగి అయ్యాడు. సిద్ధార్ధుడు భార్యాపుత్రులను, తల్లితండ్రులను, రాజ్యాన్ని పరిత్యజించి పరిశ్రమించి పరిశుద్దుడైనాడు. ప్రాపంచిక బంధాలకు బద్ధుడవ్వక బుద్దుడైనాడు. వెంకటరమణ తల్లిని, తోబుట్టువులను, బంధువులను వదిలి అరుణాచలం వెళ్లి యోగాపరుడై రమణమహర్షిలా భాసిల్లడు.
అలాగని బంధాల్ని వదిలి వెళ్ళితే పరమాత్ముడు తెలియబడతాడా????? ఊహు..........
విషయ వస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే. సత్కార్యాచరణుడై పంచేంద్రియ నిగ్రహంగల వ్యక్తికి గృహజీవనమే తపస్సుగా వుంటుంది. సంసారములో వుంటూనే దేనిని అంటుకోకుండా, పరిత్యాగబుద్ధి (పరిత్యాగమంటే నాది అనే భావాన్ని,దానిపట్ల అనురక్తిని త్యజించడం)ని అలవర్చుకున్న వ్యక్తి తపస్వే. తపమెరిగినవాడు పతన మెరుగడు. ఆంతర్యములో చోటుచేసుకున్న బలహీనతలను పారద్రోలునదియే తపస్సు. బాహ్యప్రేరణలకు లొంగక ఆంతర్య సౌందర్యమును వీక్షించించుటకు చేయు ప్రయత్నమే తపస్సు. నియమబద్దక సాధనాలు అనుష్టించి మనస్సు నియంత్రిచుకున్న వ్యక్తికి గృహమైనా, అరణ్యమైనా ఒక్కటే. ఎక్కడున్నా ఏంచేస్తున్నా అతడు నిత్యముక్తుడే, ఆనంద పరిపూర్ణుడే . అటువంటి ముక్తసంగునికి గృహమే తపోవనమని హితోపదేశం వుంది. అటువంటివారే సమన్వయ జీవితాన్ని గడపగలరు. 


కానీ-
చొక్కా గుండీలు ఊడిపోయాయి, బట్టలు సర్దుతున్నప్పుడే చూసుకోవచ్చు కదా,బయటికి వెళ్ళడానికి సిద్ధమౌతూశ్రీవారి చిందులు. ఏంటమ్మా, ఎప్పుడూ ఇడ్లీ, దోశలు, ఉప్మా తప్ప నూడిల్స్ లాంటివి చేయవచ్చుకదా, టిఫిన్ ముందు అమ్మాయి అలక. నేను రాత్రి చెప్పాను కదమ్మా, నా టి షర్టు ఇస్త్రి చేసి వుంచమని... ఎన్ని బట్టలున్న వాడి చెప్పింది రెడీ చేయలేదని అబ్బాయి అరుపులు. ఇది ఇలా చేశావేమిటి, అది అలా చేశావేమిటీ......అత్తగారి పెద్దరికపు అదిలింపులు. ఏం చేస్తునారు వదినగారు...... ఇరుగు పొరుగు పలకరింపులు............ స్నేహితులకి సమయం కేటాయించలేనంత బిజీయా...... మిత్రుల మాటలతూటాలు..... ఈ ప్రాపంచిక అనుబంధాల్లో ఏ ఒక్కరికి సమయానికి ఏం చేయకున్నా అడుగుతారు, అరుస్తారు, అలుగుతారు...... సో..... వీరందర్నీ ఆనందపరచడానికి ఉరుకులు,పరుగులు తప్పవు. పారమార్ధికము కంటే ప్రాపంచికము వైపే ఎక్కువ తూగుతున్న. తూగాలి, తప్పదు. ఈ నేపద్యములో పరమాత్మున్ని పలకరించేది, పలవరించేది ఎలా కుదురుతుంది? భగవంతుని విషయంలో ఓ వెసలబాటు...... పలకరించకపోయిన ఏమీ అనడు. పైగా నారాయణుడు నారదుని గర్వభంగం చేసే కధ... (నిండు నూనెగిన్నెనిచ్చి తొణకకుండా గుడి చుట్టూ తిరిగి రమ్మంటే, దాని మీద ధ్యాసతో నారాయణుని తలవడు. అదే ఓ కర్షకుడు లేస్తూనే ఓసారి, పొలములో పనికి దిగుతూ ఓసారీ, భోజనముకు ముందోసారి, రాత్రి పడుకునే ముందోసారి తలవడం చూపించి నీకంటే ఉత్తమ భక్తుడని చెప్పే కధ)... గుర్తు చేసుకొని ఆ కర్షకుని కరుణించిన నారాయణుడు ఇన్ని పనుల మద్య పరుగులు తీస్తున్న నన్ను కూడా కనికరించి కరుణించడా........ మనస్సు ఇలా సర్దిచెప్పేస్తుంది, సమర్ధించేస్తుంది...... ఇదో మనో మాయ.
ఇక బంధంలో వుంటూ బంధాలు అంటుకోకుండా వుండగల్గితే...........
నిజమే, జీవితం ధన్యమౌతుంది. కానీ ఎప్పుడో త్రేతాయుగం నాడు జనకునికి ఇది సాధ్యమైంది. సంసారములోనే ఉండి తరించిన కర్మ యోగి ఆయన. ఇక రామదాసు లాంటి వారికి తగును. సేవ, స్వాధ్యాయం(శాస్త్ర పఠనం) సాధన, సత్యం, సంయనం (నిగ్రహం) ఈ ఇదు "స"కారాలు సంసిద్ధిని అత్యుత్క్రుష్ట సాధనాలు. వాటిని సదా పూనికతో శక్తిసామర్ధ్యాలమేరకు అలవర్చుకొని చాలామంది ఆచరించి తరించారు. కానీ,
అంతటి శక్తి నాకెలా సాధ్యమౌతుంది? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గంకు ఎగిరినట్లు వుంటుంది. ప్రాపంచికమును, పారమార్దికమును సమన్వయపరుచుకోలేని నేను ఏదీ అంటకుండా ఎలా వుండగలను? భర్తాపిల్లలకు చిరు అనారోగ్యం కల్గిన ఆందోళన పడతాను. ఆత్మీయులకు ఏ బాధ కల్గిన తల్లడిల్లుతాను. భర్త ఉన్నతిని, పిల్లల, స్నేహితుల అభివృద్ధిని చూసి ఆనందముతో మరింత ఆకాంక్షిస్తాను. వారి వారి కష్ట సుఖాల్లో తాదాప్యం చెందుతాను. అటువంటి నేను బంధాలను అంటుకోకుండా వుండగలనా? వస్తు, వ్యక్తుల బ్రాంతిలో తగులుకొనిన నేను వాటిని వదలకనే వస్తురహిత చైతన్యస్థితి కలుగవలెనని అభిలషించడం అత్యాశే. ఆశుద్ధమైన మనసు ఆత్మసాక్షాత్కారం చేసుకోగలదా? మనస్సులో ఎటాచ్మెంట్స్ పెట్టుకోకుండా, దేనితో తాదాప్యం చెందకుండా, ప్రతీది ఈశ్వర పనే, అనే భావముతో వుండి, ఆచరించు కర్మలన్నీ భగవానుడు వొసగిన పవిత్ర ధర్మములుగా భావించి ఆచరిస్తే ఆ కర్మలు నైష్కర్మములు అయి అంటుకోవు. కానీ అది నాకింకా అలవడలేదు.
గమ్యం తెలియకపోయినా పారమార్ధిక పయనంలో సాధనాగమనం సరిగ్గా వుంటే చాలు, స్మరణం వీడని మననం తోడుంటే చాలు.... జ్ఞాన జననం జరిగినట్లే, అంధకారం అదృశ్యమైనట్లే, విజ్ఞాన తీరాలు సమీపించినట్లే అని అన్నారు శ్రీ సుందర చైతన్యనందులు.
ఒకటి మాత్రం నిజం -
గమ్యంచేరేటంతటి సాధన చేయలేకపోయినను ఈ ఆధ్యాత్మిక చింతన అలవడిన దగ్గరనుండి మంచిచెడుల వివేకంతో నా గమనం ప్రశాంతముగా సాఫీగా సాగిపోతుంది. కానీ ఇది చాలదు. ప్చ్.....
ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవసాగర మీదను నళినదళేక్షణ రామా....... 

10, జనవరి 2012, మంగళవారం

విగ్రహారాధన

సనాతన హిందూధర్మంలో విగ్రహారాధనకి ఓ విశిష్టత ఉంది. పరబ్రహ్మము సర్వవ్యాపియై ఉండినను అది అవ్యక్తమై యుండిన కారణంగా భగవత్ స్వరూప నిర్ణయం కొరకు ఒక రూపం అత్యావశ్యకం. జన్మతః మానవఇంద్రియాలు స్థూలవిషయాలనే గ్రహించగలవు తప్ప సూక్ష్మవిషయాలను గ్రహించలేవన్నది యదార్ధం. ఇంద్రియాలన్నీ బయటకు తెరుచుకొని వుంటాయి. వాటిద్వారా పనిచేసేమనస్సు బహిర్ముఖంగానే వుంటుంది. అతి సూక్ష్మముగా హృదయాంతరమున వుండే ఆత్మతత్వం అర్ధంకావాలంటే మనస్సు అంతర్ముఖం కావాలి. మనస్సు అంతర్ముఖం కావాలంటే అందుకు చాలా సాధనామార్గాలను మహర్షులు సూచించారు. అందులో సామాన్యులనుకూడా భక్తిత్వం అలవర్చే ముఖ్యమైన సరళమైన మార్గం విగ్రహారాధన. భగవంతుడ్ని మనిషి గుర్తించే మొదటిస్థితి ఇదే. "పాషాణలోహ మణి మృణ్మయ విగ్రహేషు పూజా పునర్భోగకరీ ముముక్షో:" ముముక్షులకు కూడా విగ్రహారాధన ప్రయోజనకరమేనన్నది శాస్త్రవాక్యం.
ప్రధమంగా కన్నులద్వారా ఓ రూపాన్ని గ్రహించి చిత్తమందు ఆ చిత్రాన్ని ప్రతిష్టించుకొని సాధనచేయడం సాధకునికి సులభం. ఈ కారణంచే ఋషిపుంగవులు జనోపకారార్ధమై విగ్రహారాధనను తెలిపిరి. (ఉపాసకానాం కార్యార్ధం బ్రాహ్మణో రూపకల్పనా; సాధకానాం హితార్ధాయ బ్రాహ్మణో రూపకల్పనా). మన ఋషులు నిర్వికల్పసమాధిలో ఏ బ్రహ్మరూపాన్ని దర్శించారో దానిని లోకహితార్ధమై అందరూ ఆ రూపాన్ని దర్శించాలన్న తలపుతో రూపకల్పనచేశారు. ఈ విధంగా రూపకల్పన చేయబడిన విగ్రహారాధనలో వివిధ నామార్చన, మంత్ర, యంత్ర పూజాదులచే విశేషమైన దైవశక్తి ఉన్నట్లు మన శాస్త్రాలు తెలుపుతున్నాయి.
మనోధ్యాన శక్తి గల ఋషీశ్వరులు తమ హృదయములందు మానసపూజ చేయు శక్తిమంతులైనప్పటికిని మనకై పరమప్రేమతో ఈ విగ్రహారాధన తెలియజేశారు. 
చంచలమైన మనస్సుని నియంత్రించి ఒకే వస్తువుపై కేంద్రీకరించడం ఆధ్యాత్మికసాధకుని మొదటలక్షణం. మనో నిగ్రహంకై సహాయపడేది దైవవిగ్రహారాధన. దైవప్రతిరూపంగా విగ్రహంను భావనాపూర్వకంగా ఆరాదిస్తాడు భక్తుడు. దీనివలన పరమాత్మయందు గురి ఏర్పడి క్రమేపి పరమాత్మజ్ఞానం అలవడుతుంది.
"సురూపాం ప్రతిమాం విష్ణో: ప్రసన్నవదనేక్షణాం / 
తామర్చయేత్ తాం యజే త్తాం విచింతయేత్ //
ప్రశస్తమైన రూప, ముఖ, ప్రసన్న నేత్రములుగల విష్ణు రూపంగల ప్రతిమను ఆరాధించి, ధ్యానించాలి.

సగుణరూపారాధన లేనిదే నిర్గుణరూపారాధన సాద్యంకాదు. మనస్సు శుద్ధమై, స్థిరమై, ఏకాగ్రమై అంతర్ముఖమై ఆత్మయందు నిలబడే నిర్గుణోపాసన సగుణోపాసన వలనే సిద్ధిస్తుంది. 

అర్చాదౌ అర్చయేత్ తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ /
యావత్ న వేద స్వహృది సర్వ భూతేష్వవస్థితమ్ //
                                                                 - శ్రీమద్భాగవతం 
ప్రతీ ఒక్కరి  హృదయంలో ప్రకాశిస్తున్న నన్ను సాక్షాత్కారించుకునే వరకూ అంతా తమ తమ విధులను నిర్వర్తిస్తూ, సర్వభూతాలలో లయుడై ఉన్న నన్ను విగ్రహరూపంలో పూజింతురు గాక! 

విగ్రహాదిపూజలు అష్టవిధములుగా భాగవత ఏకాదశ స్కంధమందు ఉద్ధవులవారికి శ్రీకృష్ణ పరమాత్ములవారు ఇలా వివరించారు -
శైలీ దారుమయీ లౌహీ లేప్యా లేఖ్యా చ సైకతీ /
మనోమయీ మణిమయీ ప్రతిమాష్టవిధా స్మృతా //
శిలావిగ్రహం, దారువు, లోహం, చిత్రం, దర్పణ లిఖితం, మృత్తిక, మనః కల్పితం, రత్న నిర్మితం లని ప్రతిమలు ఎనిమిది విధములుగా ఉన్నవి. 
అలానే 'యో యో యాంయాం తనుం భక్త్యా శ్రద్ధయార్భితు మిచ్ఛతి' (యే రూపమున భక్తిశ్రద్ధలతో అర్చింపచూస్తారో అట్టి రూపములయందు తానుండి వారిభక్తిని స్థిరం చేస్తాను) అని ఉద్దవునుతో కృష్ణపరమాత్మ అంటారు.

లోకశ్రేయస్సు కాంక్షించిన శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవునితో ఇలా అన్నట్లు బ్రహ్మాండపురాణం నందు ఉన్నది -
"బ్రహ్మా! నేను లోకంలో విహరింపగోరుచున్న. నీవు చేసిన సృష్టిలో సామాన్యజనులు పరవ్యూహవిభవావతార తత్వాన్ని గ్రహించలేని జడులు కావున ధర్మ సంరక్షణార్ధం, లోక సంరక్షణార్ధం నేను అర్చావతార స్వరూపుడనై విగ్రహరూపందాల్చి విహరింపగోరుచున్నాను".

విగ్రహారాధన విశిష్టమైనది కాకపొతే శ్రీరాముడు రామలింగేశ్వర ప్రతిష్ట, సీతమ్మవారు సైకత లింగ ప్రతిష్ట ఎందుకు చేసి పూజిస్తారు? వ్యాసులవారు కాశీ యందు సహస్రలింగములను ప్రతిష్టించి ఎందుకు పూజించారు? కపిల, నారద, వసిష్ట, భరద్వాజ, అగస్త్య, భ్రుగు పరుశురాములు మొదలగు మహర్షులు శివకేశవుల ఆలయములను స్థాపించి ఎందుకు పూజించినట్లు? 
ఆధ్యాత్మికం అన్నది భక్తి, నమ్మకంలమీదే ఆధారపడివుంటుంది. మార్కండేయుడు శివలింగం నందు పరమేశ్వరుడు ఉన్నాడని నిశ్చలభక్తితో పూజించి మృత్యుంజయుడు కాలేదా? ప్రహ్లాదుడు ఎందెందు చూసిన భగవంతుడు వుంటాడని తన అచంచల నమ్మకంతో నిరూపించలేదా? భద్రాచలమందు విగ్రహారాధనతో రామదాసు తరించలేదా? తిరుపతియందు శ్రీవేంకటేశ్వరుని విగ్రహాన్నికాంచి అన్నమయ్య ముక్తిని పొందలేదా? అలానే శ్రీవేంకటేశ్వరుని పాదారవిందసన్నిధి యందు శ్రీ తరికొండ వెంగమాంబ, హత్తిరాంభావాజీ వారు స్వామిని సేవించగా, స్వామి ప్రత్యక్షమై అభయమొసగలేదా? 

7, జనవరి 2012, శనివారం

సంపద

విపదో నైవ విపదః సంపదో నైవ సంపదః / 
విపద్విస్మరణం విష్ణో: సంపత్తస్యైవ సంస్మృతి: //

లోకములో ఏర్పడు ఆపదలు ఆపదలు కావు, సంపదలు సంపదలుగావు. భగవంతున్ని విడుచుటయే విపత్తు. విడవకుండుటయే సంపత్తు.