19, ఆగస్టు 2012, ఆదివారం

ధ్యానం - నీ లోనికి నీ పయనం


ధ్యానం - 
నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించివున్న పరమాత్మను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం. 
ధ్యానం -
మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.
ధ్యానం -
ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.
ధ్యానం -
వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, బాహ్యవిషయములనెరిగే మనస్సుని, ఎగిసిపడే అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.
ధ్యానం -
మనస్సు యొక్క నిశ్చలత్వం.
ధ్యానం -
మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.
ధ్యానం -
ఇతరభావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం.
ధ్యానం -
అంతరంగ చైతన్యముకు చేరువకావడం.
ధ్యానం -
హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.

ఎందఱో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించినను ఇది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సత్యం. ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖప్రయాణం. ఎవరికివారే పొందాల్సిన స్థితి. ఎవరికి వారే పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి.
                                       
ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడిది పరిపూర్ణజీవితమౌతుంది. ప్రాపంచిక, పారమార్ధిక జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.
పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ, పతంజలి, బుద్ధుడు, గురునానక్, మహావీరుడు మొదలు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నేటి సద్గురువులు వరకు; అలానే ఎందఱో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం మైండ్ ని శుద్ధిచేసే ఓ ప్రక్రియ. ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులూచేర్పులతో, సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం. వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి  ధ్యానంవలన అలవడుతుంది. ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావసమతుల్యత అలవడుతుంది. గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం  జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది. అంతే కాదు, సంస్కారశుద్ధి, విషయవాసనలనుండి విముక్తి ధ్యానసాధన ద్వారానే సాధ్యమౌతుంది. పరమాత్మ ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి. హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయవాసనలుండకూడదు. ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటే ఉపాధి.
ధ్యానం చేస్తున్నప్పుడు  ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని అదిలించి నెట్టివేయలేము. అవి మరల మరల వస్తూనే వుంటాయి. అందుకే పుట్టుకొస్తున్న ప్రతీ ఒక్క ఆలోచనను సాక్షిభావంతో చూడడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా, కొనసాగించకుండా అలా గమనిస్తూ వుంటే కొంతకాలంకు ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఇదేరీతిలో ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు - కృష్ణుడు, బుద్ధుడు, సూర్యుడు, దేవతలు, ప్రకృతి దృశ్యాలు దర్శిస్తూ తాము ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, మంచి మంచి అనుభవాలు కల్గుతున్నాయని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు. కానీ అది సరికాదు. నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది. అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి. ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. ఇది పరిపూర్ణ ధ్యానం కాదని గ్రహించాలి.  ధ్యానమంటే కొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళుమూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తున్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. అంటే చేస్తున్న ప్రతీపనియందు సాక్షిభావంతో ఉండి పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యానయుక్తమైన పరిపూర్ణజీవితం అవుతుంది.
ధ్యాన సాధన చేస్తున్నమొదట్లో ధ్యానస్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యానవస్తువు (నామం, రూపం, దీపం, శ్వాస మొదలగునవి) ఉంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానవస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు. సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట.

ఆత్మనిష్ట కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయము నందు తెలియజేసెను. 

మహర్షులనుండి ఇంద్రాది దేవతలవరకు; మహాయోగులనుండి ముముక్షువులవరకు; సద్గురువులనుండి సత్ సాధకులవరకు.........
ప్రతివొక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది తరించినవారే. 

ఆత్మధ్యానం యొక్క మహిమత్వమును శుక మహర్షి ఇలా తెలియజేసెను -
ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః 
ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణస్సదా
సమస్తమైన వేదశాస్త్రములును మరల మరల పరిశోధింప ఒకటే గోచరిస్తుంది. అది, సర్వదా నారాయణ స్వరూపమైన ఆత్మను ధ్యానించుటయే గొప్పది.
ధ్యానయోగం యొక్క మహిమత్వాన్ని ఎన్నో శాస్త్రాలు ద్రువీకరిస్తున్నాయి -
బ్రహ్మహత్యసహస్రాణి భ్రూణహత్య శతాని చ
ఏతాని ధ్యానయోగశ్చ దహత్యగ్ని రివేంధనమ్ 
బ్రహ్మహత్యలును, నూరు గర్భిణీ హననములైన పాపాలన్నియున్ను ఒక ధ్యానయోగంచే, కట్టెలన్ని అగ్నిచే భస్మమగునట్లు భస్మమగుచున్నవి.
ముహుర్తమపి యో గచ్చే న్నాసాగ్రే మనసా సహ 
సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్జితమ్ 
భ్రూమధ్యమందు ప్రణవమంత్రములతో మనస్సును ఐక్య పరచి ఒక ముహుర్తమాత్రం ఎవరు ధ్యానింతురో, వారియొక్క శత జన్మార్జితమైన పాపాలన్నియు నశించి నిర్మలు లగుదురు.
నిమిషం నిమిషార్ధం వా ప్రాణినో ధ్యాత్మచింతకాః
క్రతుకోటిసహస్రాణాం ధ్యానమేకం విశిష్యతే (ఉత్తరగీత)
నిముషముగానీ, అర్ధనిముషముగానీ ఆత్మధ్యానం చేసిన యెడల మానవులకు కోటి ఆశ్వమేధాది యాగములకంటే ఎక్కువ ఫలితముంటుంది.

                                     నాస్తి ధ్యానసమం తీర్ధం నాస్తి ధ్యానసమం తపః
                                     నాస్తి ధ్యానసమో యజ్ఞస్తస్మాద్ధ్యానం సమాచరేత్ 

                                                                




20 కామెంట్‌లు:

  1. ధ్యానం గురించి చాలా బాగా వివరించారు.

    రిప్లయితొలగించండి
  2. రవిశేఖర్ గారు!
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  3. ధ్యానం గొప్పతనం బాగా చెప్పారు...
    అభినందనలు భారతి గారూ!
    అది లోపల ఇచ్చే శక్తి అనుభవపూర్వకంగా తెలుసు...
    శ్రీ శ్రీ రవిశంకర్ గారి సీడీలు ఇంకా వేరే సీడీల మ్యూజిక్ తో ధ్యానం చేసే అనుభూతి
    మాటలలో చెప్పలేను...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గారు,
    'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గారి ప్రేరణతో ధ్యానానందం చవిచూసిన మీరు ఈ పోస్ట్ చదివి స్పందించినందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  5. ఫాతిమా గారు,
    ధన్యవాదములండి

    రిప్లయితొలగించండి
  6. బ్లాగులోకం ఈ టపాని ఉత్తమ టపాగా ఎంపికచేసినందకు, మీకు అభినందనలు భారతీ గారు.

    రిప్లయితొలగించండి
  7. బ్లాగ్ లోకం లో ఉత్తమటపాగా ఎంపిక చేసిన లాస్యగారికి,
    అభినందనలు తెలిపిన మీకూ ...
    ధన్యవాదాలు భాస్కర్ గారు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ భారతిగారికి, నమస్కారములు.

    ధ్యానం గురించి చాలా చక్కగా, వివరణాత్మకంగా వ్రాసారు. అయితే, ఒక్క సందేహం పై వివరణ ఇవ్వగలరు:'' ధ్యానం - ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.'' - అని చెప్పారు. ఆత్మ, పరమాత్మ వేరువేరా ? ఒకవేళ వేరువేరైతే, ఎట్లా నిర్ధారించవచ్చును?

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ మాధవరావుగారికి,
    నమస్కారమండి.
    నా అవగాహన మేరకు మీ ప్రశ్నలకు సమాధానం వివరిస్తాను. నా వివరణలో లోపముంటే సరిజేయమని ప్రార్ధన.
    అనంత చైతన్యమే పరమాత్మ. శరీర చైతన్యమే ఆత్మ. సమస్త శరీరములయందు చైతన్యస్వరూపమైనఆత్మ పరమాత్మ అంశమే అగుటవలన ఆత్మ, పరమాత్మ వేరు వేరు కాదండీ, ఒక్కటే అండీ.
    ఆత్మ పరమాత్మలు అల, సముద్రం లాంటివి. అహమే వాటిని వేరుగా చూస్తుంది. సాధారణముగా భావనమయప్రజ్ఞ (స్వీయానుభవం) కలుగనంతవరకు, దేహాత్మభావనలో ఉన్నంతవరకు రెండూ వేరువేరుగానే పరిగణిస్తూ, పరమాత్మను తెలుసుకోవాలనే తపనతో అనేకనేక మార్గాలను (కర్మ, ధ్యాన, జ్ఞాన ... ఇత్యాదివి) సాధకులు అనుసరిస్తారు. తనలో జీవాత్మ పరమాత్మలో కలిసిపోవాలని, లేదా తనలో ఆత్మ మరల మరో శరీరమును ఆశ్రయించక పరమాత్మ యందే లయం చేయాలని ... తపనతో ప్రయత్నించే వారికి ఈ ధ్యానయోగం ఓ మార్గమని అలా తెలపడం జరిగింది. ధ్యానసిద్ధి పొందినవారు చెప్పినదే కాకుండా, ఆత్మ పరమాత్మ ఒక్కటేనన్న శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికిని స్వీయజ్ఞానం లేని నాలాంటి సామాన్య సాధకులు నిర్వచించినది కూడా ఈ టపా లో పొందుపరిచాను.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ భారతిగారికి, నమస్కారములు.

    మీ వివరణ చక్కగా వున్నది. అయితే,ఈ ఆత్మ, పరమాత్మల పై చాలా మందితో విచారణ చేసినప్పటికీ ఇంకా సంపూర్ణమైన సమాధానాలు లభించలేదు, లేదా నాకు పూర్తిగా అర్ధం అయివుండకపోవచ్చును కూడా. అందుకనే, ఇంకా అనేకమందిని అడుగుతున్నాను. మీరిచ్చిన వివరాలపై మరికొన్ని ప్రశ్నలు:
    1. ఆత్మ, పరమాత్మ వేరు వేరు కాదండీ, ఒక్కటే అండీ. - ఆత్మ పరమాత్మలు అల, సముద్రం లాంటివి. అహమే వాటిని వేరుగా చూస్తుంది. - దేహాత్మభావనలో ఉన్నంతవరకు.....'' :- ఆత్మ, పరమాత్మ ఒక్కటే అయినప్పుడు, దేహాత్మభావనలో ఉన్నది ఎవరు? ఆత్మా? లేక పరమాత్మా? ఒకవేళ, ఈ రెండూ కాకపోతే, మూడోది ఎవరు? ఒకవేళ, అహం అయినట్లైతే, అహం ఆత్మ లేక పరమాత్మలో భాగమా? అహం అంతఃకరణం లోని భాగం; అంతఃకరణం పంచభూతములచే ఏర్పడినదే; పంచభూతములు పరమాత్మకంటే భిన్నమైనవి కావుకాదా? మరి దేహాత్మభావనలో వున్నది ఎవరు? భగవద్గీతలో, విభూతియోగంలో ఇట్లా చెప్పబడివున్నది:- '' ఈ విశ్వంలో చేతనాచేతనములు అన్నియూ నాచే, నన్ను మూలంగా సృష్టింపబడియున్నవి; అవి నాకంటే భిన్నం కానేరవు''. ఇంకా, ఉదాహరణలు చెబుతూ, మనిషిలోని బుద్ధిని నేను అయివున్నాను అని చెప్పటం జరిగింది. ఈ వాక్యాల్ని ఆధారంగా చూసినట్లైతే, శరీరం, అందులోని చైతన్యం లేదా అంతఃకరణం పరమాత్మనే కదా!! మరి అటువంటప్పుడు మనలో ఎవరు దేహాత్మభావనలో వున్నట్లు? వివరించగలరు. ఈ ప్రశ్నలు, చర్చలద్వారా మరింత వివరణలు పొందగలననే విశ్వాసంతో మాత్రమే మిమ్మల్ని మరిన్ని ప్రశ్నలు అడుగుతున్నాను.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ మాధవరావు గారికి, నమస్కారమండి.
      తిరుపతి కంచి వెళ్ళడం వలన మీ వ్యాఖ్యలను ఇప్పుడు చూశాను. కొంచెం శరీర అలసట తీరాక, ఓ రెండు మూడు రోజుల్లో నా అవగాహన మేరకు మీ ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తానండి.

      తొలగించండి
  11. శ్రీ మాధవరావు గారికి, నమస్కారమండి.
    మీ ప్రశ్నలకు సవిస్తరంగా సమాధానమిస్తే అది ఓ గ్రంధమే అవుతుంది. అందుకే సంక్షిప్తంగా నా అవగాహన మేరకు తెలియజేస్తున్నాను.
    దేహాత్మ భావనలో ఉన్నది 'అనాత్మ'. ఈ అనాత్మకే మాయ, అవిద్య, అజ్ఞానం, అసత్తు, మిధ్య, క్షేత్రం, శరీరం ... మొదలగునవి పర్యాయ పదములు.
    అనాత్మ అంటే - ఆత్మ కానిది అనాత్మ. బాహ్యరూపమైన భౌతికశరీరం అనాత్మ. శరీరము నందలి అంతరరూపం ఆత్మ. శరీర అంతరమున ఉన్న చైతన్యము ఆత్మ. ప్రపంచ వ్యాపార, వ్యవహార, విషయ, వస్తు, శబ్దములపై ఆసక్తి కల్గించునది అనాత్మ. దేహమే అనాత్మ. దేహియే ఆత్మ. క్షేత్రమే అనాత్మ. క్షేత్రజ్ఞుడే ఆత్మ. మాయాజనితమైన సృష్టియే అనాత్మ. ఈ సృష్టిలో అంతర్యామిగా వ్యాపించి ఉన్న బ్రహ్మచైతన్యమే ఆత్మ. బ్రహ్మచైతన్యమును మినహాయిస్తే మాయనుండి ఉద్భవించిన సకల చరాచరజగత్తు అంతయూ అనాత్మయే.
    ఈ అనాత్మే నేను, అన్న భావనకు లోనగునట్లు చేసి, దేహాత్మ భావనను కలుగజేస్తుంది. ఫలితంగా 'నేను' ఆత్మస్వరూపుడను అన్న సత్యం మరుగునపడినట్లు చేస్తుంది. ఆత్మ నిత్యం, అనాత్మ అనిత్యం. ఆత్మకన్నా భిన్నమైన అనాత్మ పదార్ధములన్నియు కాల పరిచ్చేదములే.
    అవిద్యా వశగస్త్వన్యస్తద్వైచిత్ర్యాదనేకధా /
    సా కారణ శరీరం స్యాత్ప్రాజ్ఞస్తత్రాభిమానవాన్ // (వేదాంత పంచదశి)
    అవిద్య(అనాత్మ) యందు ప్రతిఫలించిన బ్రహ్మము జీవుడగుచున్నాడు. జీవుడు అవిద్యకు వశుడు. అవిద్యయందలి గుణముల యొక్క పాళ్ళననుసరించి జీవులు వేరు వేరు స్థాయిలలో నుందురు. అవిద్యను కారణ శరీరమందురు. దీనియందు అభిమానంగల జీవుడు ప్రాజ్ఞుడనబడును.
    సమస్త జీవరాసుల యొక్క శరీరముల యందు బ్రహ్మచైతన్యమే యున్నను, ఆ బ్రహ్మచైతన్యము(ఆత్మ) మూడు శరీరములచే కప్పబడియున్నది. ఇరువదినాలుగు తత్త్వములతో కూడిన స్థూలదేహము, దానిలోపల సూక్ష్మదేహము, దానిలోపల అవిద్యా రూపమైన కారణశరీరము ఉన్నాయి. ఆత్మకు అతి దగ్గరగా ఉన్న పొర కారణశరీరము. ఇది సత్వరజస్థమో గుణములతో కూడిన అవిద్య(అనాత్మ) అని చెప్పబడే మాయా స్వరూపము. ఇది అజ్ఞాన రూపమైనది. ఈ కారణశరీరము వలననే 'నేను ఆ బ్రహ్మచైతన్యము అయి ఉన్నాను' అన్న విషయము మరుగునపడి, 'స్థూలశరీరము నేను' అనే భ్రమ కలుగుతున్నది.
    ఈ కారణశరీరములోని మాయ జీవున్ని (ఆత్మను) కప్పి ఉంచి, శరీరమే తానను శరీరధ్యాస కలిగించి, దేహవాసన మరియు కర్తృత్వభోక్తృత్వాది వాసనలు కలిగించి, కర్మఫలములచే అనంతమైన జన్మల బంధమును కలిగించి, జీవున్ని నిరంతరం సృష్టిచక్రములో త్రిప్పుచున్నది.
    ఇక గీతలో ఈ క్రింద శ్లోకములను పరిశీలిస్తే, శరీరం కాదు, శరీరమందలి ఆత్మ (చైతన్యం)తానని చెప్పినట్లు అర్ధమౌతుంది.
    ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే|
    ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః|| (13 అ. 2 శ్లో)
    ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది. ఈ క్షేత్రధర్మమును తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు.
    క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత|
    క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్జ్ఞానం మతం మమ|| (13 అ. 3శ్లో)
    సమస్త క్షేత్రములందును (శరీరములందును) నన్ను క్షేత్రజ్ఞునిగా నెరుంగుము. క్షేత్ర క్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానమేది కలదో, అదియే నిజమైన జ్ఞానము.
    మాయతో తయారైన ఈ శరీరములో అంతఃకరణం గలదు. ఇందు ఓ భాగమే 'అహం'. నేను, నాది అన్నభావమే అహం. నేను బ్రహ్మచైతన్యమై యున్నానను భావమును మరిచి, నేను భారతిని, ఈ శరీరము నేను, ఈ మనుష్యులు, ఈ వస్తువులు, సంపదలు నావి అన్న భావమే అహం. "నేను అంటే ఆత్మ. శరీరము అనాత్మ" అన్న యదార్ధజ్ఞానం కలిగేంతవరకు అజ్ఞానముచే కర్తృత్వంతో జీవించే ఈ శరీరం, ప్రారబ్దకర్మ వలన వచ్చి కర్మఫలములను అనుభవిస్తుంది.

    తన నుండి ఉద్భవించిన సృష్టిలో, తానే అంతర్యామిగానుండి, తననుండి జనించిన మాయతో తానే కప్పబడి, 'జీవుడ'ని, ఈశ్వరుడ'ని లేదా 'ఆత్మ'యని, 'పరమాత్మ'యని ద్వైతము కల్పించి, తనచేత తానే ఆరాధింపబడుచు, చివరకు తనలో తానే లీనమగుచున్నాడు. ఇదే పరమాత్ముని లీలా విలాసము.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ భారతిగారికి,నమస్కారములు.

    మీ సమాధానానికి ధన్యవాదములు. అయితే, వీటిపై నాయొక్క మరికొన్ని ప్రశ్నలు, ఆక్షేపణలు మీముందు పెడుతున్నాను. వివరించగలరు.

    పైన మీరు వ్రాసిన పేరాలన్నింటికీ కలిపి సూక్ష్మంగా ఆఖరు పేరాలో తత్త్వాన్ని తెలియచేసారు. అయితే, నా ప్రశ్న ఏమిటంటే: అజ్నాని అయినవాడు, విద్యను లేదా జ్నానాన్ని పొంది, జ్నానిగా ఎప్పటికీ వుండటానికి ప్రయత్నిస్తాడు; అయితే, మీరు ఆఖరు పేరాలో చెప్పినదానినిబట్టి, జ్నాని అయిన పరమాత్ముడు, తనచే అజ్నానమనే మాయను సృష్టించుకొని, తనకుతానుగా దానికి లోబడి, అనిత్యమైన శరీరమును పొంది, కష్టసుఖాలను పొందుతూ, చివరకు తనకుతానుగా తాను ఆత్మ స్వరూపుడను అని తెలుసుకొని, విముక్తిని పొందటం, ఇదే పరమాత్మ విలాసం అని చెప్పుకోవటం ఎంతవరకూ సరి అయినది? ఇదే మన అధ్యాత్మికమా?

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ మాధవరావు గారికి, నమస్కారమండి.
      కష్టసుఖాలను పొందుతున్నది ఆత్మ కాదండి. ఆ ఆత్మను కప్పియుంచిన అనాత్మే, ఈ కష్టసుఖాలను, కర్మవాసనలను, జనన మరణాలను పొందుతున్నది. ఈ యాతనలన్నీ అనాత్మవే అని గ్రహించి, తన స్వస్వరూప స్థితిని అంటే ఆత్మస్థితిని పొందడానికి చేసే సాధనాప్రక్రియే ఆధ్యాత్మికం.
      పరమాత్మ సృష్టిలో ఆత్మ, అనాత్మ వేర్వేరుగా లేవు, కలిసే సృజింపబడినవి.
      వరిగింజచుట్టూ ఆవరించియున్న పొట్టుని తొలగిస్తే, బియ్యపుగింజగా పరిణమిస్తుంది. అదే విధముగా జీవుని(ఆత్మ) చుట్టూఉన్న అజ్ఞానపుపొరను తొలగిస్తే, ఆత్మసాక్షాత్కారమవుతుంది.
      వరిగింజ, బియ్యపుగింజ వేర్వేరుగా పుట్టడం లేదు. రెండూ ఒకేసారి ఏర్పడుతున్నాయి. పైనున్న పొట్టును తొలగిస్తే వరిగింజ బియ్యపుగింజ అయినట్లుగా, అజ్ఞానమును (అనాత్మను) వ్యక్తిలో తొలగిస్తే ఆత్మసాక్షాత్కారమవుతుంది. పొట్టు ఊడని గింజ తిరిగి వరిగింజగా ఆవిర్భవిస్తుంది. పొట్టు తొలగిన గింజ తిరిగి మొలకెత్తదు. ఇదే సూత్రం జీవుని విషయంలో కూడా వర్తిస్తుంది. దీనిని అవగాహన చేసుకొని ఆత్మప్రజ్ఞను పొందడమే ఆధ్యాత్మికత.

      తొలగించండి
  13. అహం దేహోస్మి గా ఉన్న మనం,
    అహం బ్రహ్మాస్మి గా తెలుసుకోవాలంటే,
    అహం శ్వాసోస్మి (ధ్యానం) ఒక్కటే మార్గం.

    రిప్లయితొలగించండి