26, సెప్టెంబర్ 2019, గురువారం

అష్టదళ పుష్పముల పాట

                                                               

🌺🌺🌺🌺🌺🌺🌺🌺
అష్టదళ పుష్పముల పాట 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

అందమైనపూలు కోయుదమా
ఓ రమణులార ।ఆత్మారాముని
పూజ చేయుదమా।
అందమైన పూలు కోసి ఆత్మారాముని పూజచేసి।
అందము మీరంగ బ్రహ్మానంద
పదవి పొందరమ్మా। 
చెట్టులేని పూలు చూడరే
అవి చేతులతో ముట్టుకొన కుండా కోయరే । 
గట్టిపూర్వ సుకృతమనే చెట్టు మీలో కలిగిఉంటే ।
పట్టుబట్టి మనసుతోనే ముట్టి
పూలు కోయరమ్మా ।।అం।।



🌷అహింసా పుష్పము మొదటిది 🌷
ఇది ఆత్మారాముని 
మూలాధారమున ఉంచేది.
ఇదిమొదలు పరులకెపుడు హింసచేయవలదు సుమ్మా।
ఇదిమదిని మరిచితేను మన పూజలు విఫలమమ్మా ।।అం।।

🌷ఇంద్రియనిగ్రహము రెండవది 🌷
ఇది ఆత్మారాముని స్వాధిష్టామున ఉంచేది
ఇంద్రియాది విషయసుఖములెల్ల తుచ్ఛమనుచు రోసి
ఇంద్రియాతీతునిపై డెందము
పొందించరమ్మా ।।అం।।

🌷సర్వభూతదయా పుష్పము మూడవది🌷
ఇది ఆత్మారాముని మణిపూరమున ఉంచేది.
సర్వజీవ కరుణతోడ ।
సర్వేశ్వరుని కరుణకలిగి 
సకలసౌఖ్యమందరమ్మా।।అం।

🌷క్షమాపుష్పము నాల్గవది🌷
ఇది ఆత్మారాముని అనాహతమున ఉంచేది.
అలిగిమనలెవ్వరేని అనగరాని
మాటలనిన ।
అంటుకొనని మదిని భూమివంటి ఓర్పు పొందరమ్మా।

🌷శాంతిపుష్పము ఐదవది🌷
ఇది ఆత్మారాముని విశుద్ధమున ఉంచేది.
వాదములను బేధములను
క్రోధములను పెరుగనీయక
పాదుకొని పరమశాంతి బడసి
సుఖముపొందరమ్మా।।అం।।

🌷తపోపుష్పము ఆరవది🌷
ఇది ఆత్మారాముని ఆజ్ఞేయమున ఉంచేది।
కోరితగిన స్థలమునందు 
చేరిగురుని గురుతునందు।
ధారణగా మనసు నిలిపి 
తపము చేయవలెను సుమ్మా ।
।।అం।।

🌷 ఏడవది ధ్యానపుష్పము🌷
ఇదిఆత్మారాముని  సహస్రారమున ఉంచేది.
వేడుకతో జగతి ఆటలాడ 
మీరు మిమ్మెరింగి ।
వీడరాని ధ్యానమును కూడుకుని ఉండరమ్మా।।అం।।

🌷సత్యము ఎనిమిదవ పుష్పము🌷
ఇది ఆత్మారాముని నిత్యనిర్గుణమున ఉంచేది।
సత్యమార్గమనుసరించి 
సత్యస్వరూపుడిని ఆశ్రయించి।
నిత్యనుర్గుణమున మునిగి 
నిర్వికల్పమొందరమ్మా।।అం।।
                                                 
నిరతమిది మరువకుందామా
సద్గురునిబోధ మురుయుచునే
చెవులవిందామా।
ధరణ మళయాళ సద్గురు కరుణ మనము పొందుదామా।
వరదరాజ మనవి విని పరమ
పదము పొందరమ్మా ।।అం।।
🌺🌻🌼🌸🌷🌹🌺

ఎంతో అర్ధవంతమైన ఈ పాట వాట్సప్ సేకరణ. 
ఎవరు రాసారో తెలియదు గానీ, వారికి 

25, సెప్టెంబర్ 2019, బుధవారం

కొండొండోరి సెరువుల కిందా ...



కొండొండోరి సెరువుల కిందా ...
                               

ఈ మధ్యనే వాట్సప్ లో ఈ వీడియో వచ్చింది. ఈ గేయం వింటుంటే...ఇదో తత్త్వగీతిక అని అర్ధమైంది. గేయ రచయిత అడవి బాపిరాజు గారి అంతర్యం, గేయం లోని అంతరార్ధం అందుబాటులో లేదు గానీ, దీని అంతరార్ధం తెలుసుకోవాలనే చిరు తపన. 
ఆ తపనకొలది ఆలోచించి, ఓ ఆధ్యాత్మిక సాధకునికి అన్వయిస్తూ నేనిలా విశ్లేషణ చేసుకున్నాను. తప్పులుంటే పెద్దలు సరిజేస్తారని ఆశిస్తున్నాను.
                                                           
ప్రాపంచికమనేది భౌతిక వైభవం, విషయబంధితం, మనస్సు యొక్క మాయ. 
ఆధ్యాత్మికమనేది అంతరంగ వైభవం, నిర్విషయానందం, హృదయశోభితం.
                                                            
ఆధ్యాత్మికత అంటే -
ఉన్నవన్నీ త్యజించేసి కొండల్లో కోనల్లో తపస్సు చేయడం కాదు.
గృహం నుండి గుడికో, మఠానికో మకాం మార్చడం కాదు.
ఇది ఒక కులమునకో,మతానికో, దేవుడికో సంబంధించినది కాదు.
ఇది నిన్ను నీవు తెలుసుకోవడం.
ఇది నిన్ను నీవు సంస్కరించుకోవడం.  
ఇది నీలోనికి నీ పయనం.
ఇది తత్త్వచింతన.
ఇది స్వస్వరూప జ్ఞానంకై అంతరాన్వేషణ.  
ఇది ఒక జీవన స్రవంతి.
ఇది జీవన పరిణితి.
ఇది జీవన పరమార్ధం.
                                                         
                                                                                                       
ప్రతిఒక్కరిలో ఎప్పుడో ఒకప్పుడైన ఈ జీవితం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. దానిని పట్టించుకోక ప్రాపంచికంలో పడిపోతారు చాలామంది. కొందరిలో మాత్రమే ఇది తెలుసుకోవాలనే తహ జనిస్తుంది. 
ఈ తపన కల్గినవారే సాధనకు ఉపక్రమిస్తారు. 
                                                         
ఆధ్యాత్మిక సాధకుల సాధన, అంచెంచెలుగా సాగుతుంది. తమ గమనంలో ఎన్నెన్నో అవరోధాలు. అన్నింటినీ అధిగమిస్తూ గమ్యంకు చేరుతారు. బహుశా ఈ గేయంలో భావార్ధం ఇదే అయుండొచ్చు అన్న భావనతో చేసిన విశ్లేషణ ఇది. ఇది కేవలం నా భావన మాత్రమే. ఇంకా అద్భుతమైన అంతరార్ధం ఉండవచ్చు కానీ, అది తెలిసేంతవరకు ఏదో ఇలా స్వల్ప అవగాహనతో సరిపెట్టుకుంటున్నాను. 
ఇక ఈ రచయిత ముగ్గురు, మూడు అంటూ 11 చరణాలలో వ్రాసారు కాబట్టి 'త్రయాలు' లతోనే సమన్వయపరుస్తూ, సాధకుని పదకొండు సోపానాలను విశ్లేషణ చేస్తున్నాను. 

మొదటి సోపానం -
కొండొండోరి సెరువుల కింద
సేసిరి ముగ్గురు ఎగసాయం
యొకడికి కాడీ లేదూ రెండు దూడ లేదూ.

ముగ్గురు అంటే త్రికరణాలు (మనోవాక్కాయములు). 
ఇక్కడ సాధకుడు త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక వ్యవసాయం (సాధన) మొదలెట్టాడు. మొదట్లో కోరిక, మమత, నేను అనెడి అహం... మొదలగు కర్మబంధాలతో కూడి యుంటాడు. క్రమేణా కాడీ (మనస్సు), దూడ (వాక్కాయములు) అశ్వాశతములని, ఇవేవి లేవని గ్రహించి ముందుకు వెళ్తాడు. 

రెండవ సోపానం -
కాడీ దూడా లేనగసాయం
పండెను మూడు పంటలు
ఒకటి వడ్లు లేవూ రెండు గడ్డీలేదూ 

మూడు పంటలు అంటే త్రిగుణాలు (సత్వ రజోతమోగుణాలు)
గుణములు త్రికరణాలను అనుసరించి ఆగంతకంగా వచ్చి చేరినవి. దేహం కలుగుటకు కారణభూతమైనవి. కాడీ దూడ (మనోవాక్కాయములు) లేని సాధన కొనసాగుతున్నప్పటికినీ, గతంలో చేసినవాటికి ఫలితంగా ఇవి రాకతప్పవు. ఈ గుణాలను కూడా అధిగమించి మూడవ మెట్టు చేరుతాడు. 

మూడవ సోపానం - 
వడ్లు గడ్డీ లేని పంట 
విశాఖపట్నం సంతలో పెడితే
ఒట్టి సంతే గానీ,సంతలో జనమే లేరు

వడ్లు (సత్వ) గడ్డి (తమోరజో గుణములు) లేని సాధనతో అంతరయానం చేయగా, లోపలంతా సంత సంతా. గత జన్మల నుండి వెన్నంటి వస్తున్న సమస్త స్వ, పర విషయ వాసనలు, రాగద్వేషాలు, కోరికలు, మానసిక శారీరక అనుభూతుల అనుభవాల ముద్రలన్నీ అంతరంగ సంతలోనే. అక్కడ ఆసరా అయ్యే జనులు ఉండరు. ఇది అర్ధం చేసుకొని, విశ్లేషణ చేసుకుంటూ గుణదోషాల్ని అధిగమిస్తాడు.   

నాల్గవ సోపానం -
జనం లేని సంతలోకి 
వచ్చిరి ముగ్గురు షరాబులు 
ఒకరికి కాళ్ళూ లేవూ రెండు చేతుల్లేవు

ముగ్గురు షరాబులు అంటే త్రిగణాలు (ధర్మార్ధ కామములు). 
త్రికరణాలు, త్రిగుణాలు అధిగమించినప్పటికీ, తన తనవారి జీవనంకై సకామంతో ధర్మం తప్పక అర్థమును ఆర్జించక తప్పదు. అయినను వివేకంతో కర్తృత్వభావన లేకుండా నిష్కామంతో, నిస్వార్ధంతో అంతా ఈశ్వరానుగ్రహం అను భావనతో, సత్య దృష్టితో అలవడిన వైరాగ్యంతో  నడుచుకుంటాడు. కర్తగా భోక్తగా అంతా దైవంగా దైవీభావంతో త్యాగభావనతో ప్రశాంతంగా జీవనగమనం సాగిస్తాడు. ఇక త్రిగణాలకి కాళ్ళూ చేతులు లేనట్లే. అంతా ఈశ్వరేచ్ఛ అన్న విశ్వాసం. 
                                                                   
ఐదవ సోపానం -
కాళ్ళుచేతులు లేని షరాబులు 
తెచ్చిరి మూడు కాసులు 
ఒకటి వొల్లావొల్లదు రెండు సెల్లాసెల్లాదు

మూడుకాసులు అంటే కర్మత్రయం (సంచిత, అగామి, ప్రారబ్ధములు). 
కాళ్ళు చేతులు (ధర్మార్ధ కామములు) లేవు అంటే త్రిగణాలు అంటని స్థితికి సాధనలో ఎదగడం. ఆపై  గత జన్మల ప్రారబ్ధం, ఈ జన్మలో చేస్తున్న సంచితం, మరుజన్మకై ప్రోది చేసుకున్న అగామి కర్మల ఫలితం అనుభవించక తప్పదని గ్రహించి, ఇప్పుడు చేస్తున్న కర్మలు విషయంలో కర్తృత్వాభిమానమును ఆసక్తిని వదిలి, పావనమొనర్చు యజ్ఞదాన తపః కర్మలు చిత్తశుద్ధికై చేస్తూ, అగామి లోనికి కర్మఫలాలు చేరకుండా నిలకడగా ప్రారబ్దాన్ని అనుభవిస్తూ స్థితప్రజ్ఞకు చేరుకుంటాడు. 

ఆరవ సోపానం -  
చెల్లాసెల్లని కాసులు తీసుకుని
విజయనగరం ఊరికిబోతే
ఒట్టి ఊరేగానీ ఊర్లో జనం లేరు

చెల్లాచెల్లని కాసులు (కర్మత్రయం) తీసుకొని  ఊరికి పొతే అనగా -  
బాహ్య జగత్తు అనే ఊరిలోనికి వఛ్చిన - 
ఒట్టి ఊరే గానీ, ఊర్లో జనం లేరంటే నిస్సంగత్వం స్థితిలో ఉన్నట్లు. 
అహంకారాన్ని వివేకంతో దాటి, గుణదోషాల్ని విశ్లేషణతో మార్చుకొని, సత్య దృష్టితో అలవడిన వైరాగ్యంతో, స్థితప్రజ్ఞతో ఈ మెట్టు పైకి వచ్చిన సాధకుడు ఎంతమందిలో యున్నను నిస్సంగుడే.  
                                                        
ఏడవ సోపానం -
జనం లేని ఊర్లో
ఉండిరి ముగ్గురు కుమ్మర్లు
ఒకడికి తలాలేదు, రెండు మొలాలేదు

ముగ్గురు కుమ్మర్లు అంటే త్రిషట్కాలు (కర్మ, భక్తి, జ్ఞానములు). 
సాధకుడు నిస్సంగత్వంతో ఉన్నా, తనలో పై మూడు యోగములు ఉంటాయి. 
నిస్కామకర్మ ఫలితం  అంతఃకరణ శుద్ధి. 
భక్తి... మొదట ఈశ్వరోపాసన... ఫలితం చిత్తైగ్రత, తర్వాత ధ్యానం... ఫలితం ఆత్మ యొక్క ఆవరణ నివృత్తి. 
జ్ఞానం... సర్వాత్మభావన. 
ఈ యోగములకు తలా, మొల ఉండవు.  

ఎనిమిదవ సోపానం -
తలా మొలా లేని కుమ్మర్లు
చేసిరి మూడు భాండాలు
ఒకటికి అంచు లేదు, రెంటికి అడుగూ లేదు

మూడు బాండాలు అంటే త్రి దండాలు (వాగ్దండం, మనోదండం, కాయదండం). 
వాగ్దండం - మౌనం. స్వదీనమునకు , పరాదీనమునకు అతీతమైనది " మౌనం " 
మనోదండం - మనో నిగ్రహం. మనస్సు  స్వవశీయం.  
కాయదండం - స్వధర్మాచరణ. 
ఈ భాండాలకు అంచు (ఆది) లేదు, అడుగు (అంతము)లేదు.   
                                                        

తొమ్మిదవ సోపానం - 
అంచు అడుగులేని భాండాల్లో
ఉంచిరి మూడు గింజలు 
ఒకటి ఉడక ఉడకదు రెండు మిడక మిడకదు

మూడు గింజలు అంటే త్రిపుటి (జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం). 
తెలుసుకున్నవాడు, తెలియబడేది, తెలివి. జ్ఞాతకి స్వానుభవమౌతుంది జ్ఞానం. (జ్ఞానం అంటే 'జీవోబ్రహ్మైవనాపరాః' జీవుడు బ్రహ్మమే కాని,యితరం కాదు) 
ఇందు ఒకటి పోయిన మిగతా రెండు మిగలవు. జ్ఞేయబ్రహ్మం కు జ్ఞానమే స్వరూప లక్షణం. జ్ఞానం పొతే జ్ఞానావరణమైన జ్ఞేయం నిలవదు. ఇవేవి ఉడకా ఉడకవు, మిడకా మిడకవు. 

పదో సోపానం - 
ఉడకని మిడకని మెతుకులు తినుటకు 
వచ్చిరి ముగ్గురు చుట్టాలు 
ఒకరికి అంగుళ్లేదు రెండు మింగుల్లేదు

ముగ్గురు చుట్టాలు అంటే త్రిపుండ్రములు (ఆత్మ యొక్క త్రిపుండ్రములంటే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మాత్మ). 
ఆత్మ - అష్టతనువుల్లో స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అన్న నాలుగు జీవ సంబంధ తనువులు కల  జీవాత్మ. 
పరమాత్మ - విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, మూలప్రకృతి/పరమాత్మ అన్న నాలుగు ఈశ్వర సంబంధిత తనువులు కలది. 
బ్రహ్మాత్మ - పరబ్రహ్మం. 
ఆత్మ యొక్క ఈ త్రిపుండ్రములకు అంగుడు మింగుడు ఉండదు. సాధన ద్వారా జీవాత్మ, పరమాత్మ నెఱిగి, స్వానుభవంతో ఐక్యమై పరబ్రహ్మత్వంను పొందడం జరుగుతుంది.   

పదకొండవ సోపానం - పరమపద సోపానం -
అంగుడు మింగుడు లేని సుట్టాలు 
తెచ్చిరి మూడు సెల్లాలు 
ఒకటి సుట్టూ లేదు రెండు మద్దెలేదు

మూడు సెల్లాలు అంటే సత్ చిత్ ఆనందం. 
శివమ్, ఆనందం, అమృతం. 
దివ్యత్వం, అమరత్వం, అమృతత్వం.
ఇక సాధకునికి ఏ యత్నమూ ఉండదు, ఏమీ ఉండదు. ఉన్నది చుట్టూ లేని, సడి లేని  -  శుద్ధమైన మహాచైతన్యం. 
ఆ మహా చైతన్యంలో  దేహత్యాగం చేసేంతవరకు నీటి భారంతో నిండిన మేఘం ఎంత నెమ్మదిగా కదులుతుందో, సాధక మహాత్ముని నడవడిక లోకంలో అంత విధేయతతో సాగుతుంది. ఈ స్థితి కలిగిన తరువాత ద్వంద్వాలు లేవు. గుణగణాలు లేవు. త్రయాలు లేవు. అనేకమైనవి ఏవి లేవు. ఉన్నదంతా పరబ్రహ్మమే అన్న భావన స్థిరమౌతుంది. నిత్యానందం స్వభావమౌతుంది. చైతన్యంలో నిత్యుడై సిద్ధుడై నిలుస్తాడు.

శ్రీ అడవి బాపిరాజుగారు ఒకటి నుండి పదకొండు చరణాల్లో సాధకుడు ఎలా ముక్తుడు కాగలడో సూచించారని నేను ఊహిస్తున్నాను. ఇది నా ఊహ మాత్రమే. తప్పులుంటే మన్నించాలి సర్వులూ.  


7, సెప్టెంబర్ 2019, శనివారం

అమ్మమ్మా, రాముడొచ్చాడు చూడు...

మొన్నరాత్రినుండి, నా బంగారుతండ్రి అభినవ్ రామ్ కు జ్వరం వాంతులు. రాత్రంతా నిద్రలో ఉలికులికి పడుతున్నాడు. డాక్టరు ఇచ్చిన మందులు పడుతూ తనపై చేయివేసి రామస్మరణతో కలతనిద్రే అయింది.
ఉదయం టిఫిన్ తినిపించి మందులు ఇచ్చాక, నీరసంగా సోపాలో అలా నా ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఓ క్షణమైన కుదురుగా వుండక అటుఇటు పరుగులు తీసే చిట్టితండ్రి ఇలా నీరసంగా ఉండడం...చాలా బాధగా ఉంది.ఏం చేయగలను? భారమైన మనస్సుతో "రామయ్య, కరుణించవయ్యా, ఎక్కడున్నావ్, రావయ్యా" అని అనుకుంటూ ... ఓ నిముషం నాన్న, కాస్త కూర్చో...ORSL తాగడానికి తెస్తానంటూ ఫోన్ లో ఓ విడియో పెట్టి చూస్తుండమని డైనింగ్ హాల్ లోనికి వెళ్ళాను. ఇంతలో కిచెన్ నుండి చిరు మాడువాసన. స్టవ్ పై పాలు పెట్టి మర్చిపోయాను. స్టవ్ కట్టేసి ప్రిడ్జ్ దగ్గరకు వెళ్తుండగా "అమ్మమ్మా, రాముడొచ్చాడు చూడు" అంటూ అభినవ్ వచ్చాడు. ఆర్ధం కాక ఏమిటమ్మా అని అడుగుతుండగా రాముడొచ్చాడు చూడు అని ఫోన్ చూపించాడు. అప్పుడే వాట్సప్ లో వచ్చిన విడియో చూపిస్తూ, చూడు రాముడొచ్చాడు అని చెప్పగా చూసాను ఆ విడియోను. 3:24 నిముషాల్లో మొత్తం  రామాయణాన్నే దర్శించాను. అంతరమున అనిర్వచ ఆనందానుభూతి.
ఆనందంతో ఆ విడియోను స్మరణలో పదిలపర్చుకుంటున్నాను ఇలా -





5, సెప్టెంబర్ 2019, గురువారం

భారతీయ సంస్కృతి సంప్రదాయంలో "దీపం"

                                                       

                                                         

                                                  దీపం జ్యోతి పరబ్రహ్మ 
                                                  దీపం సర్వతమోపహం
                                                  దీపేన సాధ్యతే సర్వం 
                                                    దీపదేవ నమోస్తుతే.   

"దీపం" పరమాత్మకు ప్రతిరూపం.   
"దీపం" మన సంస్కృతిలో విడదీయరాని భాగం.  
"దీపం" పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక. 
మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి కదలాడే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు.

విశ్వం కాంతిమయం. కాంతి శక్తిమయం. దైవాన్ని ప్రకాశంగా, ప్రకాశాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయంను ఋషులు అనుష్టించి అందించారు.  
'అగ్నిముఖావై దేవా' అని వేదం తెలుపుతుంది. దేవతలు అగ్నిముఖులు. వారికి మనకి అనుసంధానం చేసే మాధ్యమం అగ్ని. 'అగ్నిం దూతం వృణీమహే' అన్నది శ్రుతి. అందుకే అగ్నిహోత్రాన్ని ఆరాధించే యజ్ఞవిజ్ఞానాన్ని ఋషులు ఆవిష్కరించారు. దేవతల శరీరాలు తేజోమయాలు. కనుకనే తేజస్వరూపాలతోనే వారిని భావించి ఉపాసిస్తారు. నిత్యాగ్నిహోత్రం ద్వారా అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి,    యజ్ఞయాగాదులు ద్వారా అగ్నిని ఆరాధిస్తూ ఏ దేవతలకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. మనం ఇవ్వదలచుకున్న ద్రవ్యాన్ని ఏ దేవత లేదా దేవుని పేరు చెప్పి స్వాహా అనగానే, అగ్ని దానిని నేరుగా వారికే చేర్చేస్తాడు. దేవతలకు మనకి అనుసంధానకర్తగా అగ్ని వ్యవహరిస్తాడు. ముక్కోటి దేవతలకు వాహకంగా నిలిచే అగ్నికి సూక్ష్మరూపమే దీపం. ఆ దీప ప్రకాశమే పరబ్రహ్మ.    
పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. నేటి పరిస్థితుల రీత్యా నిత్య అగ్నిహోత్రం సాధ్యం కాకపోవడంతో ఉభయసంధ్యల్లో దీపారాధన శుభప్రదం అని శ్రేయస్సుకరమని ఓ నియమమును ఏర్పరిచారు.  


దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో పార్వతిదేవి, సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. 

భక్తిని క్రియారూపంగా ప్రకటించే విధానమే పూజ. మనస్సులో భగవంతుడిని నింపుకుని, నామాలను వాగ్రూపంగా ఉచ్చరిస్తూ, కర్మణా పూజను ఆచరించడం జరుగుతుంది. ఇలా త్రికరణశుద్ధిగా జరిగేది పూజ. ఇలా పూజను ప్రారంభించేముందు ఆ పరమాత్మునికి ప్రతిరూపమైన దీపాన్ని వెలిగిస్తూ...
దీపం జ్యోతి పరబ్రహ్మం
దీపం సర్వతమోపహం
దీపేన హరతే పాపం
దీపలక్ష్మీ నమోస్తుతే
అని అంటూ దీపాన్ని ఆరాధిస్తాం. 

అలాగే దీపారాధన సమయంలో ఈ క్రింద మంత్రం పఠిస్తూ నమస్కరిస్తాము. 
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా 
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ 
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే 
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే
మూడువత్తులను తీసుకొని, తైలంలో తడిపి అగ్నిని జతచేసి, శుభప్రదమైన మూడులోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి, పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుండి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను. అని రోజూ దీపానికి నమస్కరిస్తాము. వెలిగించేది చిన్న దీపం, ఆశించేది ముల్లోకాల్లోనూ వెలుగులీనాలని. ఎంత ఉదాత్త భావన, ఎంత గొప్ప ఆలోచన. చిన్ని చిన్ని చర్యలతో, చిన్న ప్రార్ధనతో సర్వుల శ్రేయస్సును కోరుతూ మన బ్రతుకులను ఎలా పండించుకోవాలో, ధన్యతనొందాలో తెలియజెప్పిన మన సంస్కృతీ సంప్రదాయాలకు జోహార్లు. అలానే సర్వేజనాః సుఖినోభవంతు అనుకుంటాం. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉంటాం కానీ, అందరికై నిస్వార్ధ ప్రార్ధన. ఇటువంటి ప్రార్థనలలో ఎంత హాయని. 

                                                 దీపం జ్యోతి పరబ్రహ్మ 
                                                 దీపం సర్వతమోపహం
                                                 దీపేన సాధ్యతే సర్వం
                                                 సంధ్యాదీపం నమోస్తుతే  
లోకానికి వెలుగును తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులమీద దయతో వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. అందుకే సూర్యుని అస్తమయంకు కాస్త ముందుగానే ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచారు.    

                           
సర్వదేవతలూ దీపంలోనే నిక్షిప్తమై ఉంటారన్నది శాస్త్రవచనం. కాంతిని ఐశ్వర్యంగా భావిస్తాం. కనుకనే దీపమును లక్ష్మీస్వరూపంగా కొలుస్తారు.  
ఉభయసంధ్యలలో దీపారాధన లక్ష్మీప్రదం అని సామాన్యులకు తెలుసు. అందుకనే పెద్దగా పూజలు వ్రతాలు చేయనివారైనా, ఏమీ తెలియని పామరుడయినా ధూప దీప నైవైద్యాలను తప్పక పూజలో సమర్పిస్తాడు.   

జ్యోతిని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తాం. అజ్ఞానాన్ని అంధకారంతోను, జ్ఞానాన్ని వెలుగుతోను సంకేతించడం మన భారతీయ సంస్కృతి.  
దీపం అంధకారాన్ని పటాపంచలు చేస్తూ, సదా ఊర్ధ్వదృష్టినే కలిగియుండడం ద్వారా, అంధకారమనే అజ్ఞానాన్ని పారద్రోలి, మనస్సును అల్పవిషయాల పైకి కాక ఊర్ధ్వముఖంగా పరబ్రహ్మం వైపు మళ్లించమనే సంకేతాన్నిస్తుంది. 

ఆలయ ప్రాంగణములో దీపం, వృక్షమూలం చెంత దీపం, ధ్వజస్తంభం దగ్గర దీపం, గృహంలో దేవునిమూర్తుల ముందు దీపం, ఇంటిగుమ్మం దగ్గర దీపం, తులసి చెంత దీపం, ముగ్గుల నడుమ దీపం, పుష్పాల మధ్య దీపం ... ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించిన ఆ ప్రకాశం అసురశక్తుల్ని, అసురగుణాల్ని, గణాల్ని నిలువరించి సత్వాన్ని, సత్యాన్ని ప్రభోదిస్తుంది. దీపకాంతుల ప్రకాశంతో అశాంతిచీకటుల అస్తమయం, నిరాశ నిస్పృహల తిరోగమనం కాగా,  దైవంపట్ల భక్తి పురోగమనం, ఉల్లమున ఉల్లాస ఉత్సాహాల ఉత్తేజం, సత్వగుణ ఆగమనం,అంతరమున ఆంతర్యామిపై అనురక్తి అధికమౌతాయి.   

లక్ష్మీదీపం, అర్చనాదీపం, బృందావనదీపం, నందాదీపం, అఖండదీపం, ఆకాశదీపం,  అని దీపారాధనల్లో అనేక రకాలు. 

అలానే దీపపు సెమ్మెలను బట్టి నాగ దీపం, రథ దీపం, మేరు దీపం, కుంభదీపం అని కూడా వ్యవహరిస్తారు. వేదకాలంలో మత్స్య, కూర్మ, మయూర, హంస, గజ, అశ్వ, సర్ప, శంఖ, పద్మ, చక్రాకారాలతో ప్రమిదలను మట్టితో మలచి యజ్ఞయాగాదుల మంటపాలలో వినియోగించేవారట. ఇతిహాస పురాణయుగాల్లో దారు శిలా సువర్ణ రజిత తామ్ర కంచు ఇత్తడి ఇత్యాది వాటితో దీపపు కుందులను తయారుచేసి వినియోగించేవారు. 

సాధారణంగా నిత్యా దీపారాధనలో కుందిలో నాలుగువత్తులను జీవాత్మ, పరమాత్మలకు ప్రతిరూపంగా రెండువత్తులుగా చేసి  రెండు జ్యోతులుగా వెలిగిస్తారు. మూడు వత్తులు ముల్లోకాలకు, త్రిగుణాలకు, త్రిసంధ్యలకు సంకేతంగా భావిస్తూ  కొందరు మూడువత్తులను వెలిగిస్తారు. వారి వారి కుటుంబ ఆనవాయితి, అలవాటు బట్టి దీపారాధన చేస్తుంటారు. 

సద్గతిని కలిగించడానికి దీపం ఒక సేతువు. పరమాత్మకు ప్రతీకైనా దీపజ్యోతి మన ఆధ్యాత్మిక ప్రగతికి ఆలంబనంగా నిలుస్తుంది. 
చీకటి నుండి వెలుగువైపు, అమంగళం నుండి మంగళంవైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, మృత్యువు నుండి అమరత్వం వైపు సాగాలని ప్రబోధించడమే దీపం అంతరార్ధం. 

అలానే దీపజ్యోతి శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతుంది. చీకటి తమోగుణానికి తార్కాణం. చీకటి సోమరితనం,నిద్ర, అలసత్వం,నిరాశలను పెంచి శారీరక కుంగుబాటుకు గురిచేస్తుంది. వెలుగు ఉత్సాహానికి ఆహ్లాదానికి క్రియాశీలత్వానికి దోహదపడుతుంది. దీపజ్యోతిని తదేకంగా చూడడం వలన మానసిక ఏకాగ్రత వృద్ధిచెందడంతో పాటు తాత్త్విక పరిణితికి దోహదపడుతుంది. 

హృదయకుహరంలో ఆత్మజ్యోతిని దర్శించాలన్న ధార్మిక విజ్ఞానం దీపారాధనలో ఉంది. దీపం యొక్క విశిష్టత తెలుసుకొని ధ్యానిస్తే తత్వదృష్టి మరింత విస్తరిల్లి అంతర్ముఖమై ఆత్మజ్యోతిని దర్శించుకోవచ్చని అనుభవజ్ఞులమాట. 'దీపజ్యోతి ధ్యానాభ్యాసం పరమాత్మ దర్శనానికి ఒక మార్గం' అని శ్రీరామకృష్ణులు వారు చెప్పేవారు. కాబట్టి దీపారాధన ఓ ఆధ్యాత్మిక సాధనాభ్యాసమే.


శరీరమనే ప్రమిదలో నిష్ఠ అనే నూనె వేసి, వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి, హృదయంలో ఉన్న ఆత్మను దర్శింప జేసుకోవడానికి చేసే ప్రయత్నమే దీపారాధనలోని ఆంతర్యం అని అంటుంది ఆర్యధర్మ. 

దీపారాధన వలన దుష్టశక్తులు రావని,  ఐశ్వర్యం కలుగుతుందని ఓ నమ్మకం. దీపమున్న ఇంట్లో దుష్టశక్తులు చొరబడనట్లు దేహమనే ఇంట్లో ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతిని ధ్యానించినప్పుడు మనస్సులోని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే దుష్టశక్తులు ప్రవేశించలేవు. అలాగే దీపజ్యోతిలోని మూడురంగులు సత్వ రజో తమోగుణాలను సూచిస్తుంది. ఈ గుణాలను అధిగమించినప్పుడు ఆ ఆత్మజ్యోతిలో ప్రతిష్ఠితమై ఉన్న పరమాత్మ దర్శనము అవుతుందన్నది మహర్షుల మాట.   

ఘృతం లేదా తైలం, ప్రమిద, వత్తి వీటితో ఒక చిన్న వెలుగు మొలక దీపం. ప్రమిదలలోని గోఘృతం లేదా తైలం అజ్ఞానమైతే అహం వత్తి. అజ్ఞానాంధకారాన్ని జ్ఞానజ్యోతితో తొలగించుకొని మానవత్వపు దీపకాంతులని పంచిపెట్టడమే దీపకళిక తత్త్వం .చిన్ని దీపంలో ఎంత అద్భుతమైన ఆవిష్కరణ. నిత్యం దీపం వెలిగించడం అలవాటైపోవడం వలన గుర్తించలేకపోతున్నాం కానీ, దానికున్న విశిష్టత ఎనలేనిది. ఈ అద్భుతమైన అంతరార్ధాన్ని, మన సంప్రదాయ ఔచిత్యాన్ని గ్రహించి, దీపారాధనను వివిధరీతుల్లో, సుమాల సోయగాలతో, అందంగా అలంకరించి, ఆనందంగా అంతర్యామితో అనుసంధానం అవుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నచక్కటి సాధకులు 'వనజతాతినేని'గారు. ఆమె అభిరుచి అభినందనీయం. ఆమె అభిమతం ఆచరణీయం. ఆమెకిదే నా అభివందనం 🙏
ఇంతటి మహత్తరశక్తి  ఉన్న  దీపానికి మ్రొక్కకుండా ఉండగలమా?  
                                                                
                                                            దీపం నమోస్తుతే