ఈ మధ్యనే వాట్సప్ లో ఈ వీడియో వచ్చింది. ఈ గేయం వింటుంటే...ఇదో తత్త్వగీతిక అని అర్ధమైంది. గేయ రచయిత అడవి బాపిరాజు గారి అంతర్యం, గేయం లోని అంతరార్ధం అందుబాటులో లేదు గానీ,
దీని అంతరార్ధం తెలుసుకోవాలనే చిరు తపన.
ఆ తపనకొలది ఆలోచించి, ఓ ఆధ్యాత్మిక సాధకునికి అన్వయిస్తూ నేనిలా విశ్లేషణ చేసుకున్నాను. తప్పులుంటే పెద్దలు సరిజేస్తారని ఆశిస్తున్నాను.
ప్రాపంచికమనేది భౌతిక వైభవం, విషయబంధితం, మనస్సు యొక్క మాయ.
ఆధ్యాత్మికమనేది అంతరంగ వైభవం, నిర్విషయానందం, హృదయశోభితం.
ఆధ్యాత్మికత అంటే -
ఉన్నవన్నీ త్యజించేసి కొండల్లో కోనల్లో తపస్సు చేయడం కాదు.
గృహం నుండి గుడికో, మఠానికో మకాం మార్చడం కాదు.
ఇది ఒక కులమునకో,మతానికో, దేవుడికో సంబంధించినది కాదు.
ఇది నిన్ను నీవు తెలుసుకోవడం.
ఇది నిన్ను నీవు సంస్కరించుకోవడం.
ఇది నీలోనికి నీ పయనం.
ఇది తత్త్వచింతన.
ఇది స్వస్వరూప జ్ఞానంకై అంతరాన్వేషణ.
ఇది ఒక జీవన స్రవంతి.
ఇది జీవన పరిణితి.
ఇది జీవన పరమార్ధం.
ఆధ్యాత్మిక సాధకుల సాధన, అంచెంచెలుగా సాగుతుంది. తమ గమనంలో ఎన్నెన్నో అవరోధాలు. అన్నింటినీ అధిగమిస్తూ గమ్యంకు చేరుతారు. బహుశా ఈ గేయంలో భావార్ధం ఇదే అయుండొచ్చు అన్న భావనతో చేసిన విశ్లేషణ ఇది. ఇది కేవలం నా భావన మాత్రమే. ఇంకా అద్భుతమైన అంతరార్ధం ఉండవచ్చు కానీ, అది తెలిసేంతవరకు ఏదో ఇలా స్వల్ప అవగాహనతో సరిపెట్టుకుంటున్నాను.
ఇక ఈ రచయిత ముగ్గురు, మూడు అంటూ 11 చరణాలలో వ్రాసారు కాబట్టి 'త్రయాలు' లతోనే సమన్వయపరుస్తూ, సాధకుని పదకొండు సోపానాలను విశ్లేషణ చేస్తున్నాను.
మొదటి సోపానం -
కొండొండోరి సెరువుల కింద
సేసిరి ముగ్గురు ఎగసాయం
యొకడికి కాడీ లేదూ రెండు దూడ లేదూ.
ముగ్గురు అంటే త్రికరణాలు (మనోవాక్కాయములు).
ఇక్కడ సాధకుడు త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక వ్యవసాయం (సాధన) మొదలెట్టాడు. మొదట్లో కోరిక, మమత, నేను అనెడి అహం... మొదలగు కర్మబంధాలతో కూడి యుంటాడు. క్రమేణా కాడీ (మనస్సు), దూడ (వాక్కాయములు) అశ్వాశతములని, ఇవేవి లేవని గ్రహించి ముందుకు వెళ్తాడు.
రెండవ సోపానం -
కాడీ దూడా లేనగసాయం
పండెను మూడు పంటలు
ఒకటి వడ్లు లేవూ రెండు గడ్డీలేదూ
మూడు పంటలు అంటే త్రిగుణాలు (సత్వ రజోతమోగుణాలు)
గుణములు త్రికరణాలను అనుసరించి ఆగంతకంగా వచ్చి చేరినవి. దేహం కలుగుటకు కారణభూతమైనవి. కాడీ దూడ (మనోవాక్కాయములు) లేని సాధన కొనసాగుతున్నప్పటికినీ, గతంలో చేసినవాటికి ఫలితంగా ఇవి రాకతప్పవు. ఈ గుణాలను కూడా అధిగమించి మూడవ మెట్టు చేరుతాడు.
మూడవ సోపానం -
వడ్లు గడ్డీ లేని పంట
విశాఖపట్నం సంతలో పెడితే
ఒట్టి సంతే గానీ,సంతలో జనమే లేరు
వడ్లు (సత్వ) గడ్డి (తమోరజో గుణములు) లేని సాధనతో అంతరయానం చేయగా, లోపలంతా సంత సంతా. గత జన్మల నుండి వెన్నంటి వస్తున్న సమస్త స్వ, పర విషయ వాసనలు, రాగద్వేషాలు, కోరికలు, మానసిక శారీరక అనుభూతుల అనుభవాల ముద్రలన్నీ అంతరంగ సంతలోనే. అక్కడ ఆసరా అయ్యే జనులు ఉండరు. ఇది అర్ధం చేసుకొని, విశ్లేషణ చేసుకుంటూ గుణదోషాల్ని అధిగమిస్తాడు.
నాల్గవ సోపానం -
జనం లేని సంతలోకి
వచ్చిరి ముగ్గురు షరాబులు
ఒకరికి కాళ్ళూ లేవూ రెండు చేతుల్లేవు
ముగ్గురు షరాబులు అంటే త్రిగణాలు (ధర్మార్ధ కామములు).
త్రికరణాలు, త్రిగుణాలు అధిగమించినప్పటికీ, తన తనవారి జీవనంకై సకామంతో ధర్మం తప్పక అర్థమును ఆర్జించక తప్పదు. అయినను వివేకంతో కర్తృత్వభావన లేకుండా నిష్కామంతో, నిస్వార్ధంతో అంతా ఈశ్వరానుగ్రహం అను భావనతో, సత్య దృష్టితో అలవడిన వైరాగ్యంతో నడుచుకుంటాడు.
కర్తగా భోక్తగా అంతా దైవంగా దైవీభావంతో త్యాగభావనతో ప్రశాంతంగా జీవనగమనం సాగిస్తాడు. ఇక త్రిగణాలకి కాళ్ళూ చేతులు లేనట్లే. అంతా ఈశ్వరేచ్ఛ అన్న విశ్వాసం.
ఐదవ సోపానం -
కాళ్ళుచేతులు లేని షరాబులు
తెచ్చిరి మూడు కాసులు
ఒకటి వొల్లావొల్లదు రెండు సెల్లాసెల్లాదు
మూడుకాసులు అంటే కర్మత్రయం (సంచిత, అగామి, ప్రారబ్ధములు).
కాళ్ళు చేతులు (ధర్మార్ధ కామములు) లేవు అంటే త్రిగణాలు అంటని స్థితికి సాధనలో ఎదగడం. ఆపై గత జన్మల ప్రారబ్ధం, ఈ జన్మలో చేస్తున్న సంచితం, మరుజన్మకై ప్రోది చేసుకున్న అగామి కర్మల ఫలితం అనుభవించక తప్పదని గ్రహించి, ఇప్పుడు చేస్తున్న కర్మలు విషయంలో కర్తృత్వాభిమానమును ఆసక్తిని వదిలి, పావనమొనర్చు యజ్ఞదాన తపః కర్మలు చిత్తశుద్ధికై చేస్తూ, అగామి లోనికి కర్మఫలాలు చేరకుండా నిలకడగా ప్రారబ్దాన్ని అనుభవిస్తూ స్థితప్రజ్ఞకు చేరుకుంటాడు.
ఆరవ సోపానం -
చెల్లాసెల్లని కాసులు తీసుకుని
విజయనగరం ఊరికిబోతే
ఒట్టి ఊరేగానీ ఊర్లో జనం లేరు
చెల్లాచెల్లని కాసులు (కర్మత్రయం) తీసుకొని ఊరికి పొతే అనగా -
బాహ్య జగత్తు అనే ఊరిలోనికి వఛ్చిన -
ఒట్టి ఊరే గానీ, ఊర్లో జనం లేరంటే నిస్సంగత్వం స్థితిలో ఉన్నట్లు.
అహంకారాన్ని వివేకంతో దాటి, గుణదోషాల్ని విశ్లేషణతో మార్చుకొని, సత్య దృష్టితో అలవడిన వైరాగ్యంతో, స్థితప్రజ్ఞతో ఈ మెట్టు పైకి వచ్చిన సాధకుడు ఎంతమందిలో యున్నను నిస్సంగుడే.
ఏడవ సోపానం -
జనం లేని ఊర్లో
ఉండిరి ముగ్గురు కుమ్మర్లు
ఒకడికి తలాలేదు, రెండు మొలాలేదు
ముగ్గురు కుమ్మర్లు అంటే త్రిషట్కాలు (కర్మ, భక్తి, జ్ఞానములు).
సాధకుడు నిస్సంగత్వంతో ఉన్నా, తనలో పై మూడు యోగములు ఉంటాయి.
నిస్కామకర్మ ఫలితం అంతఃకరణ శుద్ధి.
భక్తి... మొదట ఈశ్వరోపాసన... ఫలితం చిత్తైగ్రత, తర్వాత ధ్యానం... ఫలితం ఆత్మ యొక్క ఆవరణ నివృత్తి.
జ్ఞానం... సర్వాత్మభావన.
ఈ యోగములకు తలా, మొల ఉండవు.
ఎనిమిదవ సోపానం -
తలా మొలా లేని కుమ్మర్లు
చేసిరి మూడు భాండాలు
ఒకటికి అంచు లేదు, రెంటికి అడుగూ లేదు
మూడు బాండాలు అంటే త్రి దండాలు (వాగ్దండం, మనోదండం, కాయదండం).
వాగ్దండం - మౌనం.
స్వదీనమునకు , పరాదీనమునకు అతీతమైనది " మౌనం "
మనోదండం - మనో నిగ్రహం. మనస్సు
స్వవశీయం.
కాయదండం - స్వధర్మాచరణ.
అంచు అడుగులేని భాండాల్లో
ఉంచిరి మూడు గింజలు
ఒకటి ఉడక ఉడకదు రెండు మిడక మిడకదు
మూడు గింజలు అంటే త్రిపుటి (జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం).
తెలుసుకున్నవాడు, తెలియబడేది, తెలివి. జ్ఞాతకి స్వానుభవమౌతుంది జ్ఞానం. (జ్ఞానం అంటే 'జీవోబ్రహ్మైవనాపరాః' జీవుడు బ్రహ్మమే కాని,యితరం కాదు)
ఇందు ఒకటి పోయిన మిగతా రెండు మిగలవు. జ్ఞేయబ్రహ్మం కు జ్ఞానమే స్వరూప లక్షణం. జ్ఞానం పొతే జ్ఞానావరణమైన జ్ఞేయం నిలవదు. ఇవేవి ఉడకా ఉడకవు, మిడకా మిడకవు.
పదో సోపానం -
ఉడకని మిడకని మెతుకులు తినుటకు
వచ్చిరి ముగ్గురు చుట్టాలు
ఒకరికి అంగుళ్లేదు రెండు మింగుల్లేదు
ముగ్గురు చుట్టాలు అంటే త్రిపుండ్రములు (ఆత్మ యొక్క త్రిపుండ్రములంటే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మాత్మ).
ఆత్మ - అష్టతనువుల్లో స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అన్న నాలుగు జీవ సంబంధ తనువులు కల జీవాత్మ.
పరమాత్మ - విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, మూలప్రకృతి/పరమాత్మ అన్న నాలుగు ఈశ్వర సంబంధిత తనువులు కలది.
బ్రహ్మాత్మ - పరబ్రహ్మం.
ఆత్మ యొక్క ఈ త్రిపుండ్రములకు అంగుడు మింగుడు ఉండదు. సాధన ద్వారా జీవాత్మ, పరమాత్మ నెఱిగి, స్వానుభవంతో ఐక్యమై పరబ్రహ్మత్వంను పొందడం జరుగుతుంది.
పదకొండవ సోపానం - పరమపద సోపానం -
అంగుడు మింగుడు లేని సుట్టాలు
తెచ్చిరి మూడు సెల్లాలు
ఒకటి సుట్టూ లేదు రెండు మద్దెలేదు
మూడు సెల్లాలు అంటే సత్ చిత్ ఆనందం.
శివమ్, ఆనందం, అమృతం.
దివ్యత్వం, అమరత్వం, అమృతత్వం.
ఇక సాధకునికి ఏ యత్నమూ ఉండదు, ఏమీ ఉండదు. ఉన్నది చుట్టూ లేని, సడి లేని - శుద్ధమైన మహాచైతన్యం.
ఆ మహా చైతన్యంలో
దేహత్యాగం చేసేంతవరకు నీటి భారంతో నిండిన మేఘం ఎంత నెమ్మదిగా కదులుతుందో, సాధక మహాత్ముని నడవడిక లోకంలో అంత విధేయతతో సాగుతుంది. ఈ స్థితి కలిగిన తరువాత ద్వంద్వాలు లేవు. గుణగణాలు లేవు. త్రయాలు లేవు. అనేకమైనవి ఏవి లేవు. ఉన్నదంతా పరబ్రహ్మమే అన్న భావన స్థిరమౌతుంది. నిత్యానందం స్వభావమౌతుంది. చైతన్యంలో నిత్యుడై సిద్ధుడై నిలుస్తాడు.
శ్రీ అడవి బాపిరాజుగారు ఒకటి నుండి పదకొండు చరణాల్లో సాధకుడు ఎలా ముక్తుడు కాగలడో సూచించారని నేను ఊహిస్తున్నాను. ఇది నా ఊహ మాత్రమే. తప్పులుంటే మన్నించాలి సర్వులూ.
రిప్లయితొలగించండిబావుందండీ
ఈ మధ్య ఎవరో ఓ పెద్దాయన కష్టే ఫకీరు గారంటా ఆయన కూడా ఈ కొండొండూరి పై టపా రాసేరు
వీలైతే చదవండి :)
జిలేబి
బావుందండీ...
తొలగించండిమీ స్పందన సంతోషదాయకం.
"కష్టేఫలి" బ్లాగ్ లో చూసానండి.
ధన్యవాదములు జిలేబిగారు
ఎప్పుడో వింజమూరి సిస్టర్స్ పాడిన ఈ పాటకు ఇంత లోతైన అర్థం ఉందని తెలియదు. కాని మీరు మరింత లోతుగా ఆలోచించి, విశ్లేషణ చేసి మాకు అందించినందుకు ధన్యవాదాలు. మన తెలుగు భాషలో వచ్చిన ఈ తత్త్వాలకు, ఇలాగే మరిన్ని వ్యాఖ్యలు వ్రాస్తారని ఆశిస్తున్నాను.
తొలగించండిఅంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం అలవడితేనే ఆత్మసాక్షత్కారం అవుతుంది. ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే సాధన గురించి 11 సొపానాలుగా సూక్ష్మంగా సరళంగా వివరించారు. ఈ పాట నేనూ విన్నానుగానీ,దీనికి పరమార్ధం ఇంత వుందని ఇప్పుడే అర్ధమైంది. అద్భుతరీతిన వివరించారు. ������
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు వసుంధరగారు.
తొలగించండిఒక గుడికో, మఠానికో వెళ్ళడం ద్వారా మనం ఆధ్యాత్మికులు అయిపోం.కేవలం అంతర్ముఖం ద్వారానే ఆధ్యాత్మికులవుతాం. స్టెప్ బై స్టెప్ బాగా వివరించారు. అద్భుతంగా ఉంది మీ వివరణ.
రిప్లయితొలగించండిమీ స్పందనకు మనసార ధన్యవాదములు పద్మగారు
తొలగించండిధన్యోస్మి. ఇంత లోతైన భావన వివరణ ఊహించలేను నేను. సాధకులకు అన్నీ కరతలామలకం.
రిప్లయితొలగించండిఈ గేయం విన్నదగ్గరనుండి అంతరార్ధం తెలుసుకోవతెలుసుకోవాలనే తపన. ఆ తపన ఫలితమే నాకు తోచినంతలో ఈ విశ్లేషణ. మీకు హృదయపూర్వక ధన్యవాదములు వనజగారు.
తొలగించండిAadyaatmika pariniti pondalante enni daarulu dati raavalo chakkaga vivarinchavu bharati dhnyosmi ramu.
రిప్లయితొలగించండినీ చక్కటి వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు రామూ'జీ
రిప్లయితొలగించండిఅద్భుతమైన విశ్లేషణ భారతిగారు శతకోటి వందనాలు ధన్యవాదాలు
రిప్లయితొలగించండిఅమీర్ గారు,
రిప్లయితొలగించండిఇదో చక్కటి తత్త్వగేయం.
ఏదో నాకు సాధ్యమైనంతవరకు విశ్లేషణ చేసాను.
మీకు మనసార ధన్యవాదములు.
Adbhutam
తొలగించండి
రిప్లయితొలగించండిఈ పాట గతంలో విన్నానండి. కానీ అర్ధం తెలియలేదు.అర్ధం తెలుసుకోవడానికి ప్రయత్నించి విసిగి ఆగిపోయాను. మీ విశ్లేషణ అద్భుతః. చరణానికి చరణానికి లింక్ తెగకుండా ఒకొక చరణం చక్కగా విడమర్చి చెప్పారు.
ఎంత మధించారో గాని, ఇంత లోతైన భావాన్ని ఎవరూ వెలికితీయలేరు.
ఇలాంటి పారమార్ధికపు పాట మరొకటి ఇక్కడ ఇస్తున్నాను. గమనించండి ఎంత జ్ఞానర్ధముందో...
మాతాత నా కొసగె ఐదు గుర్రముల తేరు;
ఎంత జేసిన గాని మరలకున్నవి నా దారి.
కనిపించు త్రోవనే నడచు నొక అశ్వంబు,
వినిపించు దెస వెడలు వేరు వేరుగాను.
చనును వాసనల వెంట మరి ఇంకొకటి,
అన్వేషించు నాహారము కొరకు నొకటి,
అనవరతము దేహ స్పర్శ గోరు నొకటి,
కానరాకుండె రధము నడిపించు తీరు.
జ్ఞాని నడుగ తెలిపె అంతరమున మరల్చు
మనె అశ్వములను చిత్రంబుగ చిత్తంబేగె,
అనంత లోకంబుల ఊర్ధ్వ గమనమున
ఉన్నతముగ నెదిగే ఊహకందని లోకాల;
వాయుచలనము మది మధించి మలచే,
మాయాజాలము నెమ్మది జారి పడిపోయే,
కాయము తేలిపోయే, మహదానంద ధృతి
ధ్యేయము పరమాత్మ సాన్నిధ్య సుఖము.
ఇహము నందే పరలోక ఆభాస మవగతము
మహత్తత్వ మహిత జ్వాలా సహిత దృశ్యము
అహము అణగి మహదేవుని సన్నధి జేరె,
అహా ఏమని వర్ణింతును విశ్వమోహన రూపము.
ఒదిగి పోయితి జ్ఞాన ఆవరణమున జ్యోతి రీతి,
వదిలి పోయె దేహ మోహ భ్రాంతి అనంత శాంతి.
కదలికలు నిలిచే మది అమృత సుధల తడిసె,
ఇదియే కాబోలు పరమపద అమర సౌధమనెడి ముక్తి.
- కప్పగంతుల మల్లికార్జునరావు
జ్ఞానార్ధమున్న ఇంత చక్కటి పాటను తెలియజేసినందుకు ధన్యవాదములు సర్.
రిప్లయితొలగించండిసధ్గురుపరబ్రహ్మణేనమః🙏🙏🙏
రిప్లయితొలగించండిఆధ్యాత్మిక వ్వవసాయం🌹
కొండొండోరి చెరువుల కింద చేసిరి ముగ్గురు (జ్ఞానం - జ్ఞేయం - జ్ఞాత) ఆధ్యాత్మిక వ్వసాయం.
ఒకటి (స్థూలశరీరము) కాడి లేదు. రెండు (సూక్ష్మశరీరము, కారణశరీరము)దూడ లేదు. కాడీ దూడ (శరీరత్రయం) లేనెగసాయం పండెను మూడు (జాగ్రత - స్వప్న -సుషుప్తి) పంటలు.
ఒకటి (జాగ్రత్) వడ్లూ లేవు. రెండూ (స్వప్న సుషుప్తి) గడ్డీ లేదు. వడ్లూ గడ్డీ లేని (జాగ్రత - స్వప్న - సుషుప్తి) పంట, విశాఖపట్టణం సంతలో పెడితే, వట్టి సంతే కాని , సంతలో జనం (విషయేంద్రియములు) లేరు. జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు (తమో - రజో - సత్వం) షరాబులు. ఒకరికి (తమోగుణము)కాళ్ళు లేవు. రెండు (రజోగుణము, సత్వగుణము) చేతుల్లేవు.
కాళ్ళు చేతులు (మూడుగుణములు) లేని షరాబులు మూడుకాసులు (సంచిత,అగామి, ప్రారబ్థం) తెచ్చిరి. ఒకటి ( ప్రారబ్థం) వొల్లా వొల్లదు. రెండు ( సంచిత, అగామి) చెల్లా చెల్లవు.
వొల్లా చెల్లని (సంచిత - అగామి - ప్రారబ్థం) కాసులు తీసుకుని విజయనగరం ఊరికి బోతే, ఒట్టి ఊరే కాని, ఊళ్ళో(వొల్లా చెల్లని త్రివిధ కర్మలు) జనం లేరు. జనం లేని ఊళ్ళో ఉండిరి ముగ్గురు (త్రిమూర్తులు) కుమ్మర్లు.
ఒకడికి తలా (బ్రహ్మ) లేదు. రెండుకి (విష్ణు రుద్రులు)మొలా లేదు. తలా మొలా లేని ( త్రిమూర్తులు) కుమ్మర్లు చేసిరి మూడు (పిండాండ, బ్రహ్మాండ, విశ్వాండ) భాండాలు.
ఒకటికి అంచూ (ఆది) లేదు. రెంటికి అడుగూ(అంతమూ) లేదు. అంచూ, అడుగూ లేని (పిండాండ, బ్రహ్మాండ, విశ్వాండం) భాండాల్లో ఉంచిరి మూడూ (సృష్టి, స్థితి, లయలు)గింజలు.
ఒకటి (సృష్టి) ఉడకా ఉడకదు, రెండూ (స్థితి, లయలు)మిడకా మిడకవు. ఉడకా మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు(ఆత్మ - పరమాత్మ - బ్రహ్మ) చుట్టాలు.
ఒకడికి అంగుళ్ళేదు (ఆత్మ) రెండు (పరమాత్మ - బ్రహ్మ) మింగుళ్ళేదు. అంగుడు మింగుడు లేని చుట్టాలు (ఆత - పరమాత్మ - బ్రహ్మ) తెచ్చిరి మూడు సెల్లాలు (భూలోక - భువర్లోక - సువర్లోకాలు).
ఒకటి సుట్టూ లేదు (భూలోకం) రెండు మద్దె (భువర్లోక, సువర్లోక) లేదు. ముల్లోకాలు లేవు.
(జగత్ జీవ ఈశ్వరులు లేరు).
సధ్గురుభ్యోంనమః🙏🙏🙏
చక్కని భావ వివరణ. అద్భుతమైన విశ్లేషణ. 🙏
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు భాగ్యలక్ష్మిగారు.
తొలగించండిచిన్నతనంలో రేడియోలో వస్తుంటే వింటూ పాడుకుంటూ ఉండేవాళ్ళం.. చాలాఏళ్ళ తర్వాత మరలా విన్నానం, ఇంత గొప్ప తత్వం అని తెలుసుకున్నాను.. మహానుభావులు, అడవి బాపిరాజు గారి రచనలు చదివాను., చిత్రకారులు అని తెలుసు. కానీ, ఇంత గొప్ప తాత్విక చింతన ఉందని అర్థం చేసుకోలేదు.. మంచి అభిప్రాయాలు పంచుకున్న అందరికీ ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిచక్కగా వివరించారు.
రిప్లయితొలగించండిఈ బండి అనేది కూడా చదివి చూడండి. లింకు https://syamaliyam.blogspot.com/2011/09/blog-post_8337.html?m=1
ఎప్పుడో అడవి బాపిరాజు గారు రచించిన ఈ గీతానికి తమ గానంతో ప్రాణం పోసిన వింజమూరి సిస్టర్స్ కు ముందుగా ధన్యవాదాలు. అటుపైన ఈ పాటలో ఇంతటి లోతైన తాత్త్విక చింతన ఉందని మాకు తెలియజేసినందుకు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు. మన తెలుగు భాషను సుసంపన్నం చేసిన ఇటువంటి తత్త్వాలను వెలికితీసి మీ విశ్లేషణ ద్వారా సరళమైన బాషలో అందరికీ అందించగలరని ఆశిస్తున్నాను. జై తెలుగు తల్లి.
రిప్లయితొలగించండి