21, డిసెంబర్ 2019, శనివారం

సాధకులారా ఒక్క క్షణం ...{విగ్రహారధన}

ఇక విగ్రహారధన గురించి -
                    

సాధరణంగా మనం ఒక గురి, ఒక లక్ష్యం, ఒక ఆకారం, ఒక ధ్యేయం లేనిదే సాధన చేయలేము. అందుకే సాధకులకు ఉపయుక్తంగాను, సులభసాధ్యంగాను ఉండటానికి సహస్రనామాలు, స్తోత్రాలు, మంత్రాలు, విగ్రహారాధనలు అంటూ ఆధ్యాత్మికమార్గాన్ని సుగమం చేశారు మనఋషులు.
                      
పరబ్రహ్మం సర్వవ్యాపియై యుండినను, అది అవ్యక్తమైయుండిన కారణమున, ఒక  వ్యక్తవస్తువు నాశ్రయించక పోతే గోచారం కానేరదు.  అటులనే మనసు చంచలమైనది. ప్రతిక్షణం చింతుస్తూ ఉంటుంది. దానిని నియంత్రించి ఏకాగ్రత సాధించటానికి కూడా ఓ మార్గం  విగ్రహారాధన.

సగుణ జ్ఞాన హీనస్య న హి నిర్గుణవేదనమ్'
సగుణజ్ఞానం లేనివారికి నిర్గుణజ్ఞానం సిద్ధింపదు.

మనోధృతిర్ధారణా స్యాత్ మాధిర్బ్రహ్మాణి |
అమూర్తో చేత్ స్థిరా న స్వాత్ తో మూర్తి || 
మనస్సు యొక్క ధృతి (స్థిరత్వం) ధారణ అనబడుతుంది. బ్రహ్మస్థితి పొందటం సమాధి అవుతుంది.కానీ, మనసు స్థిరంగా ఉండదు కాబట్టి ఆలంబనగా విగ్రహాన్ని గ్రహించటం అవసరమౌతుంది.
అంటే జ్ఞానస్థితిని పొందటానికి సాధకుడు మొదట స్థిరత్వం సాధించాలి. అది విగ్రహారాధన వలన సాధ్యమౌతుంది.
     
కావున, నిర్గుణ నిరాకార పరబ్రహ్మను ధ్యానించగలిగే స్థితిని చేరేవరకు సగుణమూర్తిని ఉపాసించటం సముచిత విధానమే.

భగవంతుని విగ్రహాన్ని చూడగానే ఇంద్రియాలు శాంతిస్తాయి. మనస్సు ప్రశాంతతను పొందుతుంది. పరమేశ్వరుని నామాలను కీర్తించగానే బుద్ధికి ప్రశాంతత చేకూరుతుంది. ఇది పారమార్థిక పురోగతికి దోహదపడుతుంది.
                 

గురువైన వషిష్టులవారు ద్వారా జ్ఞానాన్ని పొందినా, శ్రీరాముడు ఎందుకు లింగప్రతిష్టలు చేసి పూజించాడు? 
ఏ శక్తి లేకుంటే శ్రీరామచంద్రుడు, హనుమా మరియు కపిల, నారద, వశిష్ట, భరద్వాజ, అగస్త్య, భృగుమహర్షులు, శ్రీశంకరులు విగ్రహప్రతిష్టలు, శ్రీచక్రస్థాపనలు ఎందుకు చేస్తారు? 

మానవనిర్మిత వ్యవస్థలోఒకకాగితముపై ప్రభుత్వ కరెన్సీ ముద్రవుంటే దానికి విలువ ఏర్పడినప్పుడు సర్వేశ్వరసృష్టిలో వేదాల ప్రాతిపదికన ఆగమశాస్త్రం ప్రకారం మంత్రశక్తులతో ఆవాహనంచేస్తూ ప్రతిష్టించిన విగ్రహాలలో దైవత్వం ఉండదా?

రాతిలో దైవమును చూడలేనివారు, వాదనలు ఎన్నో చేయవచ్చు. కాని రాతిలో కొలువై ఉండగల శక్తి దైవానికి ఉంది. దానిని దైవమహత్యంగా మనం తీర్మానిస్తే అది భక్తి అవుతుంది. ప్రహ్లాదుడు భక్తిగా అలా ప్రార్ధించాడు కాబట్టే, రాతిస్థంబం నుండి నృసింహస్వామి ప్రత్యక్షం అయ్యాడు. 
                
ఇక విగ్రహమును ఆరాధించడం అంటే విగ్రహంలోవున్న విశ్వవ్యాప్తచైతన్యమును ఆరాధించడం.  భక్తులు విగ్రహంలో దైవమును చూస్తారు. అది విశ్వాసం.

మార్కేండేయుడు శివలింగమందు పరమేశ్వరుడు ఉన్నాడని నిశ్చయభక్తితో పూజించినప్పుడు వానియొక్క యమబాధ నివృత్తికొరకు ఈశ్వరుడు ఆవిర్భవించి కాలున్ని నిలువరించలేదా? తరిగొండ వెంగమాంబకు, హత్తిరాంబావాజీ గారికిని శ్రీ  
వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షం కాలేదా? 

సాకారమా, నిరాకారమా, ద్వైతమా, అద్వైతమా అనే వాదనలు ఎందుకు? పరమసత్యం తెలుసుకోవడానికి ఇన్ని వివరణలు విశ్లేషణలు ఎందుకు? ఈ వివరణలు, విశ్లేషణలు అన్నీ మనస్సుతో ఇచ్చినవే. ఇవన్నీ అహంలోనివే. అసలు తత్త్వానికీ, ఆత్మకు వీటికి సంబంధంలేదు. మనస్సు నశించడానికి అవన్నీ తెలియాల్సిన పనిలేదంటారు శ్రీరమణులు.

వేదాంతపుస్తకాలు చదవడం, మననంచేసుకోవడం, కంఠస్థంచేయడం, తర్కించడంవలన జ్ఞానంరాదు. ఇవన్నీ సాధనాక్రమంలో సోపానాలు. ఆధ్యాత్మిక పరిణితికి దోహదంచేస్తాయి. మనం తెలుసుకుంటుంది విషయజ్ఞానం. విషయజ్ఞానం చాలావరకు అవగాహనకి తప్ప ఆత్మానుభవానికి ఉపయోగపడదు. శాస్త్రప్రమాణంతో శోధనవలన కలిగే ప్రయోజనం కంటే హృదయనివేదనవలన కలిగే ప్రయోజనం శక్తివంతమైనది.   
                   
సాధక మిత్రులారా! 
ఒక్కసారి ఆలోచించండి. వ్యక్తిగతభావననే పరమావధిగా బ్రతకడం సరికాదు. ఆత్మానుభవం కోసమే, ఈ సాధన చేస్తున్నామన్న విషయం గ్రహించండి. మాది ఈ మార్గం, మాది ఈ సిద్ధాంతం, మాది ఈ తత్త్వం అనే బదులు మన అందరిది భగవంతుని మార్గం అని అనుకోవడంలో ఎంతటి సామరస్యత. ఆధ్యాత్మికమార్గాలన్నీ ఆత్మానుభవానికే అనుకోవడంలో ఎంతటి సానుకూలత.
భగవంతుడు మన మన యోగ్యతలబట్టి ఓ మార్గాన్ని చూపిస్తాడని నమ్మి, మనం నిమిత్తమాత్రులమని భావించి, అన్నింటినీ అనంతునికి నివేదిస్తూ, వినయంగా మసులుకోవడంలో  ఎంతటి సౌహార్ధత.
వ్యక్తిగతభావనను అనుభవిస్తున్నంతవరకు మనలో అనంతత్వ పూర్ణత్వం అవగతం కానట్లే. 
ఎవరు ఏ మార్గముననుసరించినా, తమలోని అహంభావనను పొగొట్టుకొనుటకే. ఎవరు ఏ మార్గముననుసరించినను చివరకు వారు తెలుసుకున్నది తాను ఆత్మయేనని. 
భిన్నత్వాన్ని చూడటం జీవత్వం. ఏకత్వాన్ని చూడటం దివ్యత్వం. ఏకత్వం వచ్చినప్పుడు మనకంటే భిన్నంగా ఏదీ ఉండదు. స్వీకరించడం, విడిచిపెట్టడం, దోషాలను గుర్తించడం...అంటూఏదీఉండదు.

భౌతికం-ఆధ్యాత్మికం, జగం-బ్రహ్మం, నేను-నీవు, అజ్ఞానం-జ్ఞానం ... ఈ ప్రతిపాదనలన్నీ ఆత్మానుభవం కల్గినంతవరకే. అది గ్రహించి ఈ ప్రతిపాదనలు ఏవీ లేకుండా సాధన చేస్తే - అన్యంగా ఏదీ ఉండదు. అంతా బ్రహ్మత్వమే. అంతా సత్యమే. సదా సత్యాన్ని సమ్మతిస్తే సరిపోతుంది.

సాధన అనగా అహమునకు జన్మస్థానమైన నేను ఎవరో తెలుసుకొనుటకు చేయు నిరంతరాన్వేషణ. ఆత్మలో  సుస్థితులై ఉండుటయే సరైన సాధన. 'నేను' అన్నప్పుడు హృదయంలో వున్న సత్యం గనుక స్ఫురిస్తే అది జ్ఞానస్వరూపం.

సాధకులారా! ఒక్కక్షణం...

సాధకులు అనేకమార్గాల్లో తమ గమనమును సాగిస్తారు. ఎవరి అభిరుచికి తగినట్లుగా వారు ఓ మార్గాన్ని అవలంభిస్తారు. ఏ మార్గంలో గమనమున్న అందరి గమ్యామూ, లక్ష్యమూ ఒక్కటే. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలు వేరువేరు కానీ; అన్నిమార్గాలు భగవంతున్ని చేరుకోవడం కోసం నిర్ధేశింపబడినవే. అన్ని మార్గాలు పరమాత్మ బోధించినవే.
ఇన్ని మార్గాలు ఎందుకు చెప్పారంటే, మన ప్రవృత్తిని బట్టి తగినదానిని అనుసరించటానికి. ఏదీ ఎక్కువ కాదు, తక్కువా కాదు. ఎవరి యోగ్యత బట్టి, అర్హతకు అణుగుణంగా ఆ మార్గంలో నడిపిస్తాడు. మనమో మార్గంలో వెళ్తున్నామంటే, అది ఆ భగవంతుని ప్రేరణే. ఎవరు ఏ మార్గంలో సమర్ధవంతంగా నడవగలరో, వారిని ఆ మార్గంలో నడిపించేది ఆ భగవంతుడే. 
అయితే ఏ మార్గంలో పయనించిన సడలని విశ్వాసంతో, దృఢసంకల్పంతో, శ్రద్దగా వెళ్ళగలిగితే- భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు, నాతో ఉన్నాడు అన్న భావన క్రమేపి మాయమై, భగవంతుడే ఆత్మస్వరూపుడై మనలో ఉన్నాడు, మనలా నడుస్తున్నాడన్న భావనామయప్రజ్ఞ కలుగుతుంది. ఉన్నది ఉన్నట్లు ఎరుకై సర్వమూ శివమౌతుంది. 

అయితే కొందరు భగవంతుని యందు ప్రేమ(భక్తి)తో సాధన ప్రారంభం చేసి, ఆ సాధన గొప్పది, ఈ సాధన గొప్పది, మా సాధనామార్గం గొప్పదన్న తారతమ్యభావన కనబర్చడం సమంజసమా? చేసేది, చేయించేది ఆ భగవంతుడే అన్న భావనను విస్మరించి వ్యక్తిగత అభిప్రాయాలతో మాట్లాడడం సముచితమా? 

1. ఈమధ్య వాట్సాప్ లో ఓ వీడియో వచ్చింది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు.  
                 
తాను, తన చుట్టూ ఉన్న ఈ జగత్తు, అంతా పరమాత్మ స్వరూపమే అని తెలుసుకున్న జ్ఞాని, ఇలా మంత్రజపాలు, నామస్మరణలు, విగ్రహారధనలు చేయడు. కేవలం భక్తునికి మాత్రమే ఇలాంటి పరితపన. ఈస్వామిజీ అంతిమక్షణాల్లో కూడ శివారాధన చేస్తున్నారంటే ఈయన పరమభక్తుడే గానీ జ్ఞానికాదు...అని కొందరి వ్యాఖ్యానం.

2. ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. అందుకు వనరులు సమకూర్చుకుంటాం. పునాదులు వేస్తాం. చక్కటి ఇల్లు కట్టుకుంటాం. సౌఖ్యంగా అందులో ఉంటాం. ఇల్లు నిలబడేంతవరకే పునాదిని గుర్తిస్తాం. ఇల్లు కట్టాక, రోజూ పునాదిని చూస్తామా, తలుస్తామా? అలానే నామం, జపం, విగ్రహం అనే వనరులుతో భక్తనే పునాదులు వేసి, ఆపై జ్ఞానమనే గృహంలో ప్రవేశించాక, పూజాదికాలు అనవసరం. ప్రారంభంలోనే అవన్నీ. భక్తిమార్గం విడిచి జ్ఞానమార్గం పట్టాలి గానీ, ఇంకా భక్తి, పూజలు, నామజపాలు అనుకుంటే ఏం ఎదుగుతారు? 

3. భగవంతున్ని సామాన్యులు విగ్రహాల్లో పటాల్లో చూస్తూ నామ, మంత్రజపాలు చేస్తుంటారు. ఇది భక్తిస్థాయి. కానీ, జ్ఞాన
సాధకులు ప్రపంచమంతా పరమేశ్వరున్ని చూస్తారు కాబట్టి, పూజాదికాలు అవసరం లేదు. శ్రీ రమణమహర్షి ఏనాడైన మంత్రోపదేశాలు విగ్రహారాధనలు చేసారా? సత్యం నిరాకారం. అది గ్రహించినచో నామజపాలు, పూజలు వుండవు.

4. ఏ రోజుకారోజు స్వీయపరిశీలనలు, స్వభావదోషనిర్మూలనలు అనుకుంటే ఎన్ని జన్మలు ఎత్తాలో లక్ష్యసాధనకై. 
ఒహ్హో...ఎనెన్ని వాదనలో తమమార్గమే అనుసరణీయమని. 

నేనొక అతి సామాన్య సాధకురాలిని. ఇటువంటి ప్రశ్నలకు బదులిచ్చేశక్తి నాకు లేదుగానీ, ఇటువంటి వాదనలు విన్నప్పుడు నాలో కొన్నిభావాలు కదలాడుతుంటాయి. ఆ భావాల సమాహారమే ఈ టపా.
ముందుగా వీడియో గురించి - 
నావరకు ఆ వీడియో చూడగానే అణువణువు అవ్యక్తభావంతో స్పందించగా, గీతలో ఈ శ్లోకం స్ఫురించింది. 

యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః |  
స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే|| 

ఉత్తములు ఏయే కర్మను ఆచరించెదరో, దేనిని ప్రామాణికంగా గ్రహించిదరో, దానిని ప్రాపంచిక జనులు ప్రమాణంగా విశ్వసించి ఆచరించుదురు.
శ్రేష్ఠులకు(జ్ఞానులకు) అనుష్టానం అవసరం లేనప్పటికిని, ఇతరులకై పూజాదికాలు అనుష్టిస్తారు. లోకోద్ధారణకై దేహమును వీడువరకు మనం తరించుటకై, ఇట్టి సందేశాత్మక క్రియలను ఆచరించుదురు. జ్ఞానులు తాము తరించినవారైనను ఇతరులను తరింపజేయువారై జనోద్ధరణే జీవితాదర్శమై వుందురు.
ఇటువంటి స్వామీజీలు మన ఉద్ధరణకై వైయుక్తిక ధర్మాచరణను దేహము  వీడువరకు ఆచరిస్తూ మార్గదర్శకం చేస్తారు. 

నిజమే, ప్రాపంచిక ప్రపంచంలో -
సౌఖ్యవంతమైన ఇల్లు నిర్మించుకున్నాక పునాదులును తలవనవసరం లేదు. కానీ, ఏ భవంతి నిర్మాణానికైన బలమైన పునాదులు అవసరమన్న విషయం ఎరుకై, అయినవారికో, అడిగినవారికో తదుపరి నిర్మాణధారులకు, అనుభవంతో అవగాహనతో చెప్తాం. అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ అన్వయింపు సరికాదు. ఆధ్యాత్మిక సాధన అంతరంగానికి సంబంధించినది. సత్యాన్ని బాహ్యవస్తువులతో ముడిపెట్టి చూచుట తగదు. అందరి శ్రేయస్సు కోరే పెద్దలు ఓ మాట చెప్తుంటారు. ఏరు దాటాక తెప్ప తగలేయవద్దని. ఎందుకంటే ఆ తెప్ప మరికొందరు ఏరు దాటడానికి ఉపయోగపడుతుందని. అలానే జ్ఞానులు వారికి అవసరం లేకున్నా, మనందరి శ్రేయస్సుకై పునాదుల్లాంటి మూలాల్ని విస్మరించక, కడవరకు ఆచరించి చూపిస్తూ ఎలా తరించవచ్చో అడగకపోయిన ఆ జ్ఞానాన్ని అందిస్తారు.  ఆచరించమని సూచిస్తారు.  

భక్తిమార్గం అనుసరించువారు ప్రపత్తిద్వారా అనగా శరణాగతం కావడంద్వారా, కర్మమార్గం అనుసరించువారు కర్మఫలత్యాగంద్వారా, ధ్యానమార్గం అనుసరించువారు తమ చిత్తవృత్తులను నిరోధించడంద్వారా, జ్ఞానమార్గం అనుసరించువారు ఆత్మవిచారణద్వారా అహంను పొగొట్టుకుందురు. 
                 
  

భక్తి - పూజాదికాలు -నామజపం 
విశ్వాసంతో అంతర్యామికి అనుసంధానం (కనెక్ట్) అవడం భక్తి. నాలో నాతో నేను అనుసంధానం అవడం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతకు ఆలంబన- భక్తిపూర్వక పూజాదికాలు నామజపాలు విగ్రహారధన.
దైవం వైపు విశ్వాసంతో మనసుపెట్టి ప్రయాణం చేయడమే భక్తిమార్గం. విశ్వచైతన్యమును ఏ రూపనామాలు లేకుంటే మనం దేనినీ తెలుసుకోలేం కాబట్టి, మన ఋషులు ఏర్పరిచినదే ఈ ఆరాధన విధానం.
'మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరియసీ'... 
మోక్షమునకుండు అనేకసాధనలలో భక్తి ముఖ్యమైనదని శ్రీ శంకరభగవద్పాదులవారు అంటారు.
                  

తైలం లేక దీపమెట్లు ఉండదో, పుష్పం లేక ఫలమెట్లు కలుగదో, అలాగుననే పవిత్ర హృదయమను ప్రమిద యందు, భక్తియను తైలం నిండుగా లేనివారికి అజ్ఞానాంధకార నాశకమైన పరంజ్యోతియను జ్ఞానదీపం ప్రకాశించదు. అలాగుననే భక్తియను సుగంధపుష్పం లేనియెడల, శాశ్వతానంద జ్ఞానఫలం కలుగదు. కనుక అనన్యమైన భక్తిని, అనన్య చింతనను కలిగి యుండమని శ్రీ మళయాళస్వామి తదితరులు చెప్తుంటారు.  

నిజమే సత్యం నిరాకారమైనది. రూపనామాలు లేనిదాని మీద మనస్సును నిలపడం కష్టం.  సాకారాన్ని పట్టుకుంటూ తద్వారా నిరాకారాన్ని చేరుకోగలం. దైవస్మరణ నుండే అహంస్ఫురణ వరకు వెళ్ళగలం. భగవంతుడు నుండే భగవత్ తత్త్వంలోనికి ప్రవేశించగలం. దైవం నుండే దైవత్వం
వైపు పయనం చేయగలం. సాకారంతో సంబంధం లేకుండా నిరాకారం లోనికి వెళ్ళిపోవడం శ్రీరమణులు వంటి వారికే సాధ్యం. అంతటివారితో మనకు పోలికేమిటి? 
           
ఆ మహర్షిలా 'విచారణా మార్గం' మనకు త్వరగా అంతుపట్టదు. అందుకే ఏకవస్తువును చింతించడం...అది నామమో, రూపమో...ఏదో ఒకటి...మనో నిశ్చలతకై!

అన్ని మార్గాలలో జ్ఞానమార్గమే శ్రేష్ఠమైనదని  చెప్తున్నా, మిగతా మార్గాలు తక్కువ అని అనుకోవడానికి లేదు. 




               
కబీర్ దాసు, తులసీదాసు, తుకారామ్, రామదాసు, ఘోరాకుంబార్ తదితరులు భక్తిచే నామోచ్చరణ, పూజాదికాలు చేస్తూ తరించారన్నది మరువరాదు. 
               


             
పంచేంద్రియాలతో పంచోపచారాలు,  పుష్పాదుల అలంకరణ, మంత్రమూ, నామోచ్చరణ... వీటన్నిటితో తాదప్యతే పూజ. 
భక్తులకు నామామృతం పానం చేయుటయే సులభ సరళమార్గం. మానసికశక్తి, ఏకాగ్రత, మనోనిగ్రహతలను పెంచేశక్తి శబ్ధంలో ఉంది. వేదాలలో ఉన్నది తమ స్వీయప్రజ్ఞతో గ్రహించి మన ఉద్ధరణకై ఋషులు అందించినవే- ఈ నామాలు మంత్రాలూ. నామ మంత్ర జపోచ్ఛరణ చేస్తున్నప్పుడు, ఆ శబ్ధ తరంగాలలో శక్తి అపారంగా ఉంటుంది. ఆ నామ మంత్రాలలో అక్షరాలు జపిస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ షట్చక్రాలను జాగృతి చేయడం ద్వారా కుండలినీశక్తి జాగృతమౌతుందని అనుభవజ్ఞులు చెప్తుంటారు. ఇనుమును కొలిమియందుంచి కమ్మరివాడు ఊదునప్పుడు అగ్నివలె ప్రకాశం, దహనశక్తి యెట్లు కలుగుచున్నదో, అలాగుననే నామ, మంత్ర, ధ్యానాదుల శక్తిచే ధర్మనిష్ట పెరుగుతుంది. క్రమేణా వైరాగ్యం అలవడుతుంది. నామ మంత్రాలు ముక్తిప్రదాయకమైనవే. ఒక కరకు బోయవాడిని మహర్షిగా మార్చింది నామమే. ధృవుడును ధృవతారగా నిలిపింది నారాయణ నామతపస్సే.
                   
    విషయవాంఛలతో, మమకారబంధాలతో, 
ఇతరత్రా బంధనాలతో సతమతమౌతు, కలుషితంగా వున్న మనస్సులోనికి భగవన్నామం ప్రవేశిస్తే, కుండలోని కలుషితమైన నీరు చిల్లగింజతో శుద్ధి అయినట్లుగా, పరిశుద్ధమౌతుంది. భక్తివిశ్వాసాలే కాలక్రమేణ విచారణలోనికి మారి, జ్ఞానమార్గంలోనికి పయనింపజేస్తాయి. జ్ఞానమార్గంలో ఉన్నా, వైయుక్తిక ధర్మాచరణను విడిచిపెట్టక ఆచరిస్తునే, లక్ష్యం వైపు పయనం సాగించాలి. అప్పుడే లోకం చూపు పోయి లోచూపు వస్తుంది. మహాజ్ఞానులైన నారదుడు నారాయణమంత్రాన్ని, హనుమా రామమంత్రాన్ని విడిచిపెట్టేరా? శ్రీరమణులు అరుణాచలేశ్వరున్ని తలవడం మానేసారా?

శ్రీరమణులు మంత్రోపదేశంగానీ, దీక్షనివ్వటంగాని  చేయకున్నా, నామజపం యొక్క ప్రాశస్త్యాన్ని కొనియాడేవారు. శరణాగతి నొందగోరేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనేవారు. భగవంతుని నామమూ ఆత్మా ఒకటేననేవారు. అంతేకాక ఆత్మసాక్షత్కారమైన పిదప భగవన్నామస్మరణ హృదయంలో అప్రయత్నంగా సాగిపోతుందనేవారు. అసలు చేయవలసింది ఆత్మవిచారమే అని తెలిసినా, నామజపం చేయుట మంచిదేనా అని ఒకరు ప్రశ్నించగా- "అన్ని పద్ధతులు విచారణకే దారితీస్తాయి. అందువల్ల అన్నీ మంచివే. మన నిజతత్త్వం జపమే. ఆత్మసాక్షత్కారమైతే జపం తనంతట తానే సాగిపోతుంది. ఒక దశలో సాధనమే మరొకదశలో సాధ్యమౌతుంది. అప్రయత్నంగా నిరంతరంగా సాగే జపమే - సాక్షత్కారమంటే" అని బదులిచ్చింది గమనించండి. అలాగే మూర్తిధ్యానం జ్ఞానం పొందడానికి ఉపయోగపడదా అన్న ప్రశ్నకు, "తప్పకుండ ఉపయోగపడుతుంది. ఈ ఉపాసనవలన మనస్సుకి ఏకాగ్రత ఏర్పడుతుంది. ఇతర భావాలేవీ లేకుండా, ధ్యానించిన మూర్తితోనే మనస్సు నిండిపోతుంది. తరువాత మనస్సు ఆ ధ్యానింపబడే మూర్తితో ఏకమై నిర్మలమౌతుందని" బదులిచ్చారు. మరిన్ని వివరణలకై 'నీ సహజస్థితిలో ఉండు 'అన్న పుస్తకమును చూడండి. 

భిక్షాటనం జపో ధ్యానం స్నానం శౌచం శివార్చనమ్|కర్తవ్యాని షడేతాని యతీనాం నృపదండవత్ ||
భిక్షాన్నం, జపం, ధ్యానం, స్నానం, బహిరంతరశౌచం, దేవతార్చనం... ఈ ఆరును యతీశ్వరులకు కూడ రాజదండనం వలె కర్తవ్యమని శ్రుతి తెలుపుతుంది. యతీశ్వరులకే ఇవన్నీ ఉండాలని అంటున్నప్పుడు మనం దేవతార్చనలు, నామజపాలు వద్దనుకోవడం సమంజసమా?
                 
    శాంతి జీవనానికైన ఆత్మానుభూతికైన సద్గుణాలే అవసరం. అందుకే ఉదయం లేచేటప్పుడే, మనం సద్బుద్ధితో, సత్ ప్రవర్తనతో నడుచుకోవాలనే దృఢసంకల్పం చేసుకోవాలని, రాత్రి పడుకునేముందు ఆనాటి మన దినచర్యలను సమీక్షించుకొని తప్పులుంటే సవరించుకోవాలనే సంకల్పం చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. మన ప్రవర్తనలో దోషాలు లేకుండా చూచుకోవాలి. మన గుణాల్లో మార్పు రావాలి. అప్పుడే ధర్మనిష్ట పెరుగుతుంది. మనో శుద్ధత ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కల్గుతుందో అప్పుడే లోపలున్న సత్యంతో సంధానమవగలం. అందుకై స్వీయపరిశీలన తప్పనిసరి. 
                    
అన్ని మార్గాలు ఆత్మసాధనతోనే ముగుస్తాయని శ్రీరమణమహర్షి 
అనేవారు. అలానే మన సాధనలో ప్రతి అంకం, కేవలం సోపానాలు మాత్రమే. నామజపం, ధ్యానసాధన, దేవతార్చన ఇవన్నీ మనలోని నిరాకార దైవాన్ని తెలుసుకునే వరకు సాగాల్సిందే! ఏ సాధనా మార్గమైనా సత్ప్రవర్తనతోనే ముడిపడి ఉంది. మనం చేసే అర్చన వల్ల మనం కోరుకున్నది వస్తుంది. మనం సత్ప్రవర్తనతో ఉంటే దైవమే మన వద్దకు వస్తుంది. 
అందుకే మనల్ని మనం సత్శీలకులమై ఉన్నమో, లేమో అని శోధన చేసుకోవాలనేవారు.

మనస్సు అణిగేందుకే స్వీయవిచారణ, నామజపం, పూజాదికాలు. భక్తిమార్గంలో వెళ్ళేవారికి ఇంతకన్నా సమర్ధవంతమైన పద్ధతి  ఏముంది?

ఇక విగ్రహారధన గురించి తదుపరి టపాలో...











18, నవంబర్ 2019, సోమవారం

అబ్బో ఈరోజు ఎన్ని దీపకాంతులో...

ఈరోజు ఉదయం నుండి వాట్సప్ లో కొందరు సత్సంగ మిత్రులు పంపిన దీప సందేశాలు...










                         



6, నవంబర్ 2019, బుధవారం

🕉 కిరాతార్జునీయం - అంతరార్ధం 🕉

మన పురాణ ఇతిహాసాల్లో ప్రతీ సంఘటనకీ అంతరార్ధం, బాహ్యార్ధం తప్పక వుంటాయి. బాహ్యార్ధాన్ని మాత్రమే తెలుసుకుంటే కేవలం విషయజ్ఞానంతో పాటు భక్తిత్వం పెరుగుతుంది. అదే అంతరార్ధాన్ని గ్రహిస్తే ఆత్మజ్ఞానం కలిగి ముక్తిని చేరే మార్గం బోధపడుతుందని ప్రముఖ బ్లాగర్ రసజ్ఞగారు తన ఓ పోస్ట్ లో అంటారు. నాది కూడ అదే భావన. ఆ కోణంలోనే ఈ కధకు చక్కటి అంతరార్ధమును మా తాతయ్యగారు చెప్పారు కానీ, పూర్తిగా జ్ఞాపకంలేదు. లీలగా జ్ఞాపకమున్నది ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. 
                                                         
కృష్ణపరమాత్మ(భగవత్ స్వరూపులు)మరియు
వ్యాసమునీంద్రులవారు(గురు స్వరూపులు) శివునికై తపస్సు చేయమని అర్జునుడికి సూచించారు.  
భగవంతుడు మరియు గురువు...వీరిరువురి సూచన అంటే - నిస్సందేహంగా ఇందులో పరమార్ధమున్నట్లే.
మానవుడిని మాధవుడిగా చేయడానికీ, మనల్ని తరింపచేయడానికి ఏదో అర్ధముందని గ్రహించగలగాలి. జీవాత్మకు ప్రతీక అయిన అర్జునుడిని మిషగా మానవుడు తరించడానికి ఓ గొప్ప సందేశాన్నే ఈ సంఘటన ద్వారా సకల మానవళికి అందించారు. 

శివుడినే ఎందుకు ఆరాధించమని చెప్పారంటే - "శామ్యతి పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి ఇతిశివః" అని అర్ధం చెప్తుంది అమరకోశం. పరమానంద స్వరూపుడు, ఏ వికారాలు లేనివాడు శివుడు. 
జీవులన్నింటికీ షడ్వికారాలు (జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశాంగ) ఉంటాయి. శివుడు మాత్రమే ఏ వికారాలు లేని పరమానందమయుడు. మనలో వికారాలు పోవాలంటే -  ఏ వికారాలు లేనివాడిని ఆశ్రయించాలి. అలానే శివుడు పశుపతి. పశువులు అనగా ఇంద్రియములు అని అర్ధం. దిక్కులని మరియొక అర్ధం. వీనికి అధిపతి అయిన పశుపతిని/శివుడిని అందుకే ఆరాధించమని 
సూచించారు.

                           


ఇక కధలోని పరమార్ధం పరిశీలిద్దాం -

మనుషుల్లో  పశుభావమును [నేను జీవుడనే భావమును] పొగొట్టునది పాశుపతాస్త్రం. అంటే అజ్ఞానం పొగొట్టు అస్త్రం. అజ్ఞానం పొగొట్టుకొని ఆత్మజ్ఞానం పొందాలని సాధకుని ప్రయత్నమే ఈ కిరాతార్జునీయం. 
ఇక్కడ అర్జునుడు ఓ ఆధ్యాత్మిక సాధకునిగా పరిగణిస్తూ పరిశీలిద్దాం. ప్రాపంచిక జీవనంలో అలసిసొలసి...ఏమిటీ జీవితం...ఇది కాదు జీవితం...మొన్న ఆనందం...నేడు అజ్ఞాతం...దుఃఖం...ఏది శాశ్వతం...ఏది అశాశ్వతం...ఇత్యాది భావనలతో వైరాగ్యం...అజ్ఞానమును వీడి యధార్ధజ్ఞానమును తెలుసుకోవాలన్న వైరాగ్యసహిత ఆకాంక్ష కల్గింది. ఇదే శుభకరమైన ఇచ్ఛ... 'శుభేచ్ఛ'. ఇది సాధకుని మొదటిస్థాయి.
వైరాగ్యం చేత మనకున్నది మనమున్నది సత్యమూ నిత్యమూ కాదని తెలుసుకొని, ఇంద్రియాల ద్వారా వచ్చే భౌతిక విషయపరిజ్ఞానం, ఆనందాల పట్ల అనురక్తి తగ్గి, సజ్జనసాంగత్యం, స్వాధ్యాయం ద్వారా జ్ఞానప్రాప్తికై... ఏం చేయాలి...ఎలా సాధించాలి అన్న 'విచారణ' మొదలౌతుంది. ఇది సాధకుని రెండో స్థాయి. 

జగద్గురువు కృష్ణపరమాత్మ, వ్యాసమునీంద్రులవారు సూచన మేరకు, అర్జునుడు పాశుపతాస్త్రం సాధించుట కోసం, శివుడికై తపస్సు చేయడానికి ఈశాన్యదిక్కుగా బయలుదేరి ఇంద్రకీలాద్రికి వెళ్ళెను. {ఈశాన్యం - పరమాత్మను ఉపాసించే దిక్కుయని అందరికీ విధితమే} వెళ్ళి పశుపతి అయిన శివుడిని ఆరాధించడం ప్రారంభించెను.
విచారణ ద్వారా ధ్యానసాధనలో నిమగ్నమై ఇంద్రియార్ధముల యందు ప్రీతి  శుష్కించిపోవు స్థితి 'తనుమానసి'. ఇది సాధకుని మూడవ స్థాయి.
అర్జునుడు తపస్సు చేస్తున్నాడు ఎంతోకాలంగా. అయిన శివదర్శనం కానరాలేదు. ( మన హృదయంలో ఓ సత్యముంది. ఆ సత్యం ఎంత లోతులో ఉందో, అంత లోతులోనికి మనం వెళ్ళితే గానీ, ఆ జ్ఞానం దొరకదు. మనం ఆ జ్ఞానాన్ని పొందడానికి స్వప్రయత్నంగా కొంతదూరం వెళ్ళగలం. ఆపై ఎంత సాధన చేసిన వెళ్ళలేం. యిన ఆగక సంకల్పబలంతో ముందుకు సాగితే, తప్పక గుర్వనుగ్రహం లభిస్తుంది).
                            
సడలని సంకల్పంతో సాధన చేస్తుంటే ఇంద్రుడు (గురువు) {దృవుడికి నారదమహర్షి గురువైనట్లు, ఇక్కడ ఇంద్రుడు అర్జునుడికి గురువై మంత్రోపదేశం చేసిరి} వచ్చి, ఎందుకు తపస్సు చేస్తున్నావని ప్రశ్నించి, అర్జునుడనే సాధకుని హృదయక్షేత్రధర్మ పటిమను పరిశీలించి, పట్టుదలను పరీక్షించి, అంతర్గత శత్రువులు...అరిషడ్వర్గాలను జయించాలనే సంకల్పంతో పాశుపతాస్త్రముకై తపస్సు చేస్తున్నాడని మెచ్చి,  పార్ధివలింగమును పంచాక్షరి మంత్రంతో ఆరాధించమని అనుగ్రహించెను. అర్జునుడు గుర్వనుగ్రహంతో కఠోర తపానికై పూనుకున్నాడు. తపోదీక్షలో చాలాకాలం గడిచింది. అప్పుడు పరమేశ్వరుడు పరీక్షించదలచి 
రాక్షసుడిని రొద చేస్తూ తపోభగ్నం చేయమని చెప్తాడు. అంటే అంతరమునున్న ఆంతర్యామి మనస్సనే రాక్షసుడిని ప్రేరేపిస్తాడు. మనస్సు రొదను తన అస్త్రంతో (సాధనాశక్తితో) సంహరిస్తాడు అర్జునుడు. కానీ యధార్దానికి అదే క్షణమున శివాస్త్రం (శివానుగ్రహం) సంహరిస్తుంది మనస్సనే రాక్షసుడిని. 
కానీ, 'నేనే' చంపాననే భావం అర్జునునిది. జీవుని యందు 'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. ఇట్టి అహంకారం వలన జీవుడు తనని తాను పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది జీవియందు నేను అను సంకల్పంగా పనిచేయుచున్నది. ఈ అహంకారమే ఇంకా అర్జునుడిలో వుండడం వలన, వాదిస్తూ ఘర్షకు దిగాడు. కొంత ఘర్షణ తర్వాత శివుడు అపారకృప కనబర్చగా; తనవలననే జరిగిందనిపించినను, నిజమునకు పరమేశ్వరుని సంకల్పం వలనే జరిగెనను పరమసత్యం అవగతమై, అహంకార నిర్మూలనం కాగా పరమాత్మ పాదములను పట్టుకొనెను. పాశుపతాస్త్రమును పొందెను.
పరిపూర్ణభక్తిలో అహం కాలిపోతేనే గానీ తత్త్వజ్ఞానం అనుభవమవ్వదు
ఈ అహంకారమన్నది నీటిలో తేలు మంచుగడ్డ వంటిది. మంచుగడ్డ నీరు ఒకటే అయినను మంచుగడ్డకున్న భౌతికరూపం వలన నీటినుండి తాత్కాలికంగా వేరగుచున్నది. అహంకారం వలన మనకొక స్వభావమేర్పడును. స్వభావం వలన కోపతాపాదులు మమకార బంధాలు ఏర్పడుచున్నవి. తత్ఫలితంగా సమస్త కర్మలు...బంధనాలు. ఎవరికైనను పనులు తాము చేయుచున్నామను అహంకారమే అజ్ఞానం. దే మాయ. దే బంధనం. పరమేశ్వరుని అనుగ్రహం వలననే సమస్తం జరుగుచున్నదని తెలియుటే అహంకార నిర్మూలనం. 
పై మూడు స్థాయిలు తపోసాధనలో అధిగమించి నాల్గవ స్థాయికి చేరడానికి చేసే సాధనలో జరిగే సంఘర్షణ, మనస్సు చేసే కల్లోలములు మాటల్లో కుదించలేం. అంత తీవ్రంగా సంఘర్షణ ఉంటుంది. ఈ 
మనస్సు చేసే రొద సాధనకు అడ్డంకమని అర్ధమై మనస్సుని నిర్వీర్యపరచాలని , సంకల్పం ధనస్సుతో సాధనశక్తి అస్త్రమును సంధిస్తాడు. ఇక్కడ ఈశ్వరానుగ్రహంతో మనస్సును జయిస్తాడు. కానీ ఇంకా వీడని అహంకారం...'నేనే', నా సాధనతో జయించాననే అహంకారదర్పం. కరుణాంతరంగని కృపచే,
ఆ దర్పమూ దమించి, శుద్ధ సాత్త్వికంతో చిత్తశుద్ధి పొంది తద్వారా నాడీమండలం శుద్ధమై కుండలిని జాగృతి అయిన స్థితి యిది. హృదయగ్రంధి విచ్ఛేదమే జ్ఞానం. మనస్సు నశించే సాధనే యోగం.
'అహం బ్రహ్మాస్మి' అని చక్కగా తెలుసుకున్న స్థితి. ఇలా స్వాత్మ యందు నిలకడ పొందడమే 'సత్త్వాపత్తి'. ఇది సాధకుని నాల్గవ స్థితి.
అటు పిమ్మట అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. ఈ స్థితిలో కూడా సాధకునికి పరీక్షలు తప్పవు.
ఇంద్రాది దేవతలు జీవునికింకను సుఖములయందు వ్యామోహం వుందా అని పరీక్షిస్తారు. ఇక్కడ కూడా సాధనాశక్తితో స్థిరుడై సాగిపోవాలి. అప్పుడే సాధకుని జీవప్రజ్ఞకున్న పరిమితి తొలగిపోతుంది. తాను వేరన్న భావం నశించి సమస్తముతోను ఒకటియై ఉండును.
పై నాలుగుస్థాయిల అభ్యాసంచే సత్యరూఢస్థితిని పొంది,అనాసక్తితో, తటస్థ దృష్టితో, సత్యద్రష్టుడై విషయవాసనా రహితమగు అసంగస్థితియందు యుండుటయే 'అసంసక్తి'. ఇది సాధకుని  ఐదవ స్థితి.
ఈ స్థాయికి చేరిన సాధకుడు, కర్మ సంస్కారములు పూర్తిగా భస్మమైపోయేంతవరకు శరీరంతో ఉండాలి కాబట్టి తిరిగి జనవాసంలోనికి వచ్చి సాటివారికై శ్రమిస్తూ అందరి పరిపూర్ణతకు ప్రయత్నిస్తాడు. 
సత్యదర్శనం పొంది, సమాధిస్థితికి చేరిన సాధకుడు, సంకల్పమాత్రంచేత ఆ స్థాయినుండి క్రిందకు వచ్చి ఇతరులకు మేలు చేయునట్టి స్థితి 'పదార్ధభావన'. 
(ఈ స్థాయికి చేరినా సాధకునికి, ఎన్నో సమాధానాలు దొరికినా, ఎంతో ఆధ్యాత్మిక పురోగతి సాధించిన కొన్ని సందేహాలు మిగిలి వుంటాయని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తుంటారు) ఇది సాధకుని ఆరవస్థాయి.

సప్తజ్ఞానభూమికలలో అర్జునుడు అనే సాధకుడు సాధించిన ఆరుస్థాయిల యోగసాధన కధనమే ఈ "కిరాతార్జునీయం". 


ఇప్పుడు మనకో సందేహం రావచ్చు. మరి జ్ఞానభూమికలో సప్తమస్థాయికి అర్జునుడు సాధించలేదా అని.
సాధించాడు..... ఎప్పుడు?
                                


కురుక్షేత్రమున యుద్ధారంభమునకు కాస్త ముందు. కృష్ణభగవానుడు అర్జునునకు గీతను ఉపదేశించి అతని సంశయములను తీర్చి జ్ఞానమును సంపూర్ణంగా అందించి శోకమోహములనుండి ఉద్ధరించాక ఏడవస్థాయిని సాధించెను.

కేవలం ఆత్మనిష్ఠలో అంటే జీవన్ముక్తస్థితిలో వుంటూ శేషజీవితాన్ని గడపడం. వీరికి సుఖదుఃఖాలుండవు. ప్రాప్తించిన కార్యములను అసంగత్వభావంతో చేస్తూ ముక్తులై యుందురు. ఇది 'తుర్యగ'స్థితి.ఇది సాధకుని సప్తమస్థితి.


                          🔱 ఓం నమః శివాయ 🔱

కిరాతార్జునీయం - అంతరార్ధం

ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే కిరాతార్జునీయం ఓ యోగసాధన. అది పరిశీలన చేసేముందు ఓసారి ఆ కధను తెలుసుకుందాం -
అరణ్యవాసం చేస్తున్న పాండవులను చూడడానికి వచ్చిన కృష్ణభగవానున్ని, ఈ కష్టకాలమునుండి ఎలా బయటపడతామని ధర్మరాజు ప్రశ్నించగా -
                                 
                           
కృష్ణభగవానుడు,
"ఎవరు మంగళం లన్నింటికీ కూడ అలవాలమో, ఎవరి అనుగ్రహం శుభాల్ని యిస్తుందో, ఎవరు ఆశీర్వాదిస్తే శ్రేయస్సు కల్గుతుందో, ఆ దయాళువయిన శివుడు గురించి తపస్సు చేయ"మని చెప్పెను.   

అటుపిమ్మట ఓసారి, 'వైరిబలం కంటే అధికబలం సంపాదించాలంటే శివకటాక్షం వుండాలనీ, అర్జునుడిని తపస్సు చేసి శివానుగ్రహంతో పాటు పాశుపతాస్త్రం పొందమనే వేదవ్యాసమునీంద్రులవారి సూచనతో, అర్జునుడు న అన్న అనుజ్ఞతో ఇంద్రకీలాద్రికేగి, తపస్సు ప్రారంభించెను.
                              

కొన్ని సంవత్సరాల తపస్సు పిమ్మట వృద్దబ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు వచ్చి, 'దేనికి తపస్సు చేస్తున్నావయ్యా' అని అడుగగా, శివునికై చేస్తున్నాను, నాకు పాశుపతాస్త్రం కావాలి అని అర్జునుడు చెప్పగా, మహాజ్ఞాని కృపాళువు అయిన శంకరుని అనుగ్రహం కల్గితే మోక్షమడగాలి గానీ, యుద్ధాలు, గెలుపోటములు,  గొడవలు లేని పరమపదం కోరకుండా, యుద్ధంలో వాడుకోవడానికి అస్త్రం అడుగుతావా ... అమాయకుడా అని ఇంద్రుడు అనగా, మా అన్నగారు శివానుగ్రహం పొంది పాశుపతాస్త్రం తెమ్మని చెప్పిరి. వారి మాట నాకు ఆచరణీయం. మధ్యలో వచ్చి సలహాలు ఇవ్వక, ఇక్కడనుండి వెళ్ళండి అని అర్జునుడు అనగా, అంతట నిజరూపంలో ఇంద్రుడు సాక్షాత్కరించి అర్జునుని క్షాత్రధర్మమును మెచ్చి, 
ఇకనుంచి పంచాక్షరి మంత్రంతో పార్ధివలింగమును పూజిస్తూ తపస్సు చేయమని చెప్పగా, ఆ ప్రకారంగా అర్జునుడు కఠోర తపానికై పూనుకున్నాడు. 
                     
                         
తపోదీక్ష పూనడంలో పాండవమధ్యముడి పట్టుదల అసామాన్యం, అప్రతిమానం. 
దినములు మాసములై, మాసములు సంవత్సరములై, తపోనిష్ఠలో సవ్యసాచి సడలక సాగిపోతుండగా, మెచ్చిన శివుడు కాస్త అర్జునుని శక్తిని పరీక్షించదలచి,  ముకాసురుడు అనే రాక్షసుడిని పిలిచి "నీవు అడవిపందిగా మారి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న చోటుకి వెళ్ళి పెద్దగా రొద చేయమ"ని చెప్పగా, 
                         
                         
ఆ రాక్షసుడు పంది రూపమున వెళ్ళి పెద్దగా రొద చేస్తుంటే, ఆ చప్పుడుకి కళ్ళు తెరిచిన అర్జునుడు, వీడెవడో రాక్షసుడు అయి వుంటాడని తలచి, రాక్షసుడుని సంహరించ దలచి, ధనస్సు అందుకొని బాణం సంధించగా, 
తత్ క్షణమునే కిరాతక రూపధారి అయిన శివుడు సంధించిన బాణం పంది పృష్టభాగం నుండి శరీరం లోనికి వెళ్ళి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలపడగా, మరుక్షణంలో అర్జునుని బాణం పంది నోట్లోంచి శరీరంలోనికి వెళ్ళి పృష్టభాగం నుంచి వెలుపలికి వచ్చి నేలపై పడింది. అప్పుడు కిరాతకులుగా వచ్చిన ప్రమధగణములు మా నాయకుడు వేసిన బాణమిది, మా నాయకుడే పందిని చంపెను అని అనగా, 
లేదు లేదు, నేనే చంపానని అర్జునుడు... కాసేపు వాగ్వివాదం జరిగాక,  అంతటి మొనగాడు మీ నాయకుడు అయితే నాతో యుద్ధానికి రమ్మనిమని కిరీటి సవాలు చేయగా, 
                                 
                          
కిరాతకరూపంలో శివుడు, ఎరుకతగా శక్తిస్వరూపిణి పార్వతీమాత రాగా, ఏదీ యుద్ధం చేయు, చూద్దామని పలికిన అర్జునునితో యుద్ధానికి దిగెను. టంకార హుంకారలతో బాణాలు సంధించుకుంటూ పరస్పర ద్వంద్వయుద్ధం చేసుకుంటూ శివుడు అర్జునుని త్రోసి అవతల పడేయగా, కోపావేశంతో అర్జునుడు తిరిగిలేచి తన ధనస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేసాడు. అప్పుడు శంకరుడు ఇక యుద్ధం చాలించదలచి నిజరూప దర్శనమివ్వగా,  స్థానువైన అర్జునుడు తెప్పరిల్లి, 
ఈశ్వరా! పరమేశ్వరా! నేనే చంపానన్న అహంతో నిను గుర్తించక అజ్ఞానంతో నీతో యుద్ధానికి దిగాను. ఎంతటి కృప నాపై...నాచేత దెబ్బలు తింటూ మల్లయుద్ధం చేసావా...అని విలపిస్తూ పలువిధాల స్తోత్రం చేస్తూ పాదములమీద పడగా, ఇదీ నీ పూజగానే స్వీకరించాను. నీకు ఏం కావాలో కోరుకోమని శివుడు అనగా, పరత్పరా, అజ్ఞానినై అహంతో నీపై బాణములు వేస్తే అది నీకు పూజంటవా...నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయిందని మరల పరమేశ్వరుని పాదములమీద పడిన అర్జునుడుని హత్తుకొని,
                                 

నీకు పాశుపతాస్త్రమును ఇస్తున్నాను,విజయీభవ అని శివుడు ఆశీర్వదించిను.

{అష్టదిక్పాలక దేవతలు (ఈశాన్యం-ఇసాన/ఈశ్వరుడు, తూర్పు-ఇంద్రుడు, ఆగ్నేయం-అగ్నిదేవుడు, దక్షిణం-యముడు, నైఋతి-నిరుతి, పశ్చిమం-వరుణుడు, వాయువ్యం-వాయుదేవుడు, ఉత్తరం-కుబేరుడు)}.
అర్జునుడు, దిక్పాధిపతి అయిన ఈశ్వరుని అనుగ్రహంతో పాశుపతాస్త్రం పొందడం వలన మిగిలిన దిక్కుల దేవతలు ప్రసన్నులై వరుసగా ఐందాగ్ని, ఆగ్నేయము, యామ్యాగ్ని రాక్షసము, వారుణము, వాయువ్యము, కుబేరము అను శక్తాస్త్రములను ప్రసాదించిరి.  
అటుపై ఇంద్రాది దేవతలు తమ లోకమునకు అర్జునుని తీసుకెళ్ళి సకల సౌఖ్యములు కలిగింతురు. జీవునికింకను సుఖములయందు ఇంకా వ్యామోహమున్నదా అను పరీక్ష జరుగును. ఊర్వశి వరించి వచ్చిన చలించక శాపం కూడా పొందిన తొణకక అది అజ్ఞాతవాసమున వర్తించునట్లు వరముగా మార్చుకొనెను. సకల సౌఖ్యములను త్యజించి తిరిగి తన సోదరులతో కలిసి అరణ్యవాసం చేయుటకు వచ్చెను.

                    🔱ఓం నమః శివాయ🔱 


ఇక ఈకధలో అంతరార్ధం తదుపరి టపాలో -




4, అక్టోబర్ 2019, శుక్రవారం

దీని భావమేమి భారతీమాత ...

                                                           

నిన్న ఉదయం ఝాన్సీ అనే మిత్రురాలు నుండి వాట్సప్ మెసేజ్ ... 
ఈ క్రింద పద్యం పంపుతూ  దీని భావమేమి భారతీమాత ... అంటూ ... 


కరణంబు లఖిలోపకరణంబులును గాగ, బ్రాణంబు లుపచారభటులు గాగ,
గంగాప్రముఖనాడికలు జలంబులు గాగ,షట్కమలములు పుష్పములు గాగ,
జఠరాగ్నిహోత్ర ముజ్జ్వలధూపము గాగ, బటుజీవకళలు దీపంబు గాగ,
నందితానందంబు నైవేద్యముం గాగ, రవిశశిజ్యోతు లారతులు గాగ,
నంగదేవాలయమున సహస్రకమలపీఠమున శాంతిజనకజోపేతు డగుచు 
జెలగుపరమాత్ము రాము నర్చించుచుండ దత్త్వవిదు లీశ్వరప్రణిధాన మండ్రు
(ఈ పద్యాలు ఎందులోనివో సరిగ్గా చెప్పలేనుగానీ, బహుశా సీతారామాంజనేయ సంవాదము లోనివని అనుకుంటున్నాను).  


అష్టాంగయోగ సాధనలో 'శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః'  అని చెప్తుంటారు. 
ఈశ్వరప్రణిధానం అంటే స్థూల సూక్ష్మ శరీరాలచే లభించే కర్మఫలాలను ఈశ్వరునికి అర్పించుట. సర్వదా సర్వత్రా సర్వమూ భగవదనుసంధానం చేయడమే ఈశ్వర ప్రణిధానం. మరింత వివరణ కై .... ఇక్కడ  చూడండి. 
ఇక పై పద్యమునకు అర్ధం ఏమిటంటే -
                                                           
త్రికరణంగా (మనస్సు, వాక్కు, కర్మేనా) జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, అంతరింద్రియాలను పూజ పాత్రలుగా చేసుకొని, దశవిధప్రాణాలను* పనివాళ్ళుగా చేసుకొని, గంగాది నదులను అంటే ఇడా పింగళ సుషుమ్న నాడులను అభిషేకాది జలాలుగా చేసుకొని, షట్చక్రాలను పుష్పాలుగా చేసుకొని, జఠరాగ్నిని ధూపంగా చేసి, జీవకళలు* దీపాలుగా చేసుకొని, బ్రహ్మానందాన్ని నైవేద్యముగాపెట్టి,  సూర్య చంద్ర* జ్యోతులను ఆరతులుగా చేసుకొని, శరీరమనే దేవాలయంలో సహస్రకమలమనే సింహాసనం పైన శాంతి అనే 'సీత'తో కూడి దర్శనమిచ్చే పరబ్రహ్మమైన 'శ్రీరాముని' పూజించడమే ఈశ్వరప్రణిధానం అని తత్త్వవిదులు చెప్తుంటారు. 
                                                              
ఒకవిధంగా ఒక్కమాటలో చెప్పాలంటే - ఇది కర్మ, ధ్యాన యోగంలతో కూడిన అద్భుతమైన మానసపూజ. 

గమనిక - * ప్రాణమంటే జీవులు బ్రతకడానికి కావాల్సిన చైతన్యశక్తి. అంటే శ్వాసతో కలిసిన చైతన్యం ప్రాణం. పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు కలిపి దశవిధ ప్రాణాలు లేదా వాయువులని చెప్తుంటారు. ప్రాణాయామంలో కుంభకం వల్ల శరీరంలో నాడులన్నీ వాయువుచే పూరించబడి, ఈ దశవిధ వాయువుల యొక్క చలనం వేగవంతమై, తద్వారా హృదయ కమలం వికసిస్తుంది. 
* జీవకళలు అంటే షోడశి కళలని కొందరు, సూక్ష్మ ప్రణవం అయిన చిత్కళ అని కొందరు అర్ధం చెప్తుంటారు.  
* సూర్య చంద్రలు అనగా కుడినాసిక ద్వారా జరుగు శ్వాసను సూర్యనాడి అనియు, ఎడమనాసిక ద్వారా జరుగు శ్వాసను చంద్రనాడి అని అందురు.  

26, సెప్టెంబర్ 2019, గురువారం

అష్టదళ పుష్పముల పాట

                                                               

🌺🌺🌺🌺🌺🌺🌺🌺
అష్టదళ పుష్పముల పాట 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

అందమైనపూలు కోయుదమా
ఓ రమణులార ।ఆత్మారాముని
పూజ చేయుదమా।
అందమైన పూలు కోసి ఆత్మారాముని పూజచేసి।
అందము మీరంగ బ్రహ్మానంద
పదవి పొందరమ్మా। 
చెట్టులేని పూలు చూడరే
అవి చేతులతో ముట్టుకొన కుండా కోయరే । 
గట్టిపూర్వ సుకృతమనే చెట్టు మీలో కలిగిఉంటే ।
పట్టుబట్టి మనసుతోనే ముట్టి
పూలు కోయరమ్మా ।।అం।।



🌷అహింసా పుష్పము మొదటిది 🌷
ఇది ఆత్మారాముని 
మూలాధారమున ఉంచేది.
ఇదిమొదలు పరులకెపుడు హింసచేయవలదు సుమ్మా।
ఇదిమదిని మరిచితేను మన పూజలు విఫలమమ్మా ।।అం।।

🌷ఇంద్రియనిగ్రహము రెండవది 🌷
ఇది ఆత్మారాముని స్వాధిష్టామున ఉంచేది
ఇంద్రియాది విషయసుఖములెల్ల తుచ్ఛమనుచు రోసి
ఇంద్రియాతీతునిపై డెందము
పొందించరమ్మా ।।అం।।

🌷సర్వభూతదయా పుష్పము మూడవది🌷
ఇది ఆత్మారాముని మణిపూరమున ఉంచేది.
సర్వజీవ కరుణతోడ ।
సర్వేశ్వరుని కరుణకలిగి 
సకలసౌఖ్యమందరమ్మా।।అం।

🌷క్షమాపుష్పము నాల్గవది🌷
ఇది ఆత్మారాముని అనాహతమున ఉంచేది.
అలిగిమనలెవ్వరేని అనగరాని
మాటలనిన ।
అంటుకొనని మదిని భూమివంటి ఓర్పు పొందరమ్మా।

🌷శాంతిపుష్పము ఐదవది🌷
ఇది ఆత్మారాముని విశుద్ధమున ఉంచేది.
వాదములను బేధములను
క్రోధములను పెరుగనీయక
పాదుకొని పరమశాంతి బడసి
సుఖముపొందరమ్మా।।అం।।

🌷తపోపుష్పము ఆరవది🌷
ఇది ఆత్మారాముని ఆజ్ఞేయమున ఉంచేది।
కోరితగిన స్థలమునందు 
చేరిగురుని గురుతునందు।
ధారణగా మనసు నిలిపి 
తపము చేయవలెను సుమ్మా ।
।।అం।।

🌷 ఏడవది ధ్యానపుష్పము🌷
ఇదిఆత్మారాముని  సహస్రారమున ఉంచేది.
వేడుకతో జగతి ఆటలాడ 
మీరు మిమ్మెరింగి ।
వీడరాని ధ్యానమును కూడుకుని ఉండరమ్మా।।అం।।

🌷సత్యము ఎనిమిదవ పుష్పము🌷
ఇది ఆత్మారాముని నిత్యనిర్గుణమున ఉంచేది।
సత్యమార్గమనుసరించి 
సత్యస్వరూపుడిని ఆశ్రయించి।
నిత్యనుర్గుణమున మునిగి 
నిర్వికల్పమొందరమ్మా।।అం।।
                                                 
నిరతమిది మరువకుందామా
సద్గురునిబోధ మురుయుచునే
చెవులవిందామా।
ధరణ మళయాళ సద్గురు కరుణ మనము పొందుదామా।
వరదరాజ మనవి విని పరమ
పదము పొందరమ్మా ।।అం।।
🌺🌻🌼🌸🌷🌹🌺

ఎంతో అర్ధవంతమైన ఈ పాట వాట్సప్ సేకరణ. 
ఎవరు రాసారో తెలియదు గానీ, వారికి 